cover

కినిగెలో కొన్ని కొత్తపుస్తకాలు

భూమధ్యరేఖ

రచన: కాశిరాజు

Bhoomadhyarekha

 

మెట్టు దిగేడప్పుడు తూలే నా అడుక్కి తోడైన చేతుల్ని
ఇంకా పట్టుకునే ఉన్నా!
అందని సైకిల్ ఎక్కుతున్నప్పుడూ, ఫెడల్ జారి
పడిపోయినప్పుడూ
కొట్టుకుపోయిన చేతుల్నీ, ఆ చేతికంటిన మట్టినీ ఇంకా
గుర్తు పెట్టుకునే ఉన్నా

బోడి మొలమీద బొందులాగూని ఎక్కించికట్టిన చేతిని
పదో తరగతి పాసైనపుడు తాయిత్తు చేతికి
వాచీ పెట్టిన చేతీనీ మొన్నీమధ్యే ముద్దెట్టుకున్నా!
పాతికేళ్ళకు ఇంకా పాత మొలతాడే ఎందుకుందో
తెలుస్తున్నాకా
ఒకడి చేతులెపుడూ అద్భుతాల్ని చేస్తాయని అనిపిస్తున్నాక

ఆకాశానికి ఎత్తుకుని అరికాలు ముద్దెట్టుకునే మా నాన్న
గుర్తొస్తాడు….

– కాశిరాజు

ఈబుక్ & ప్రింటు బుక్ లభ్యం

*

ఇస్కూలు పిలకాయల కత

రచన: నామిని

Ischoolupilakaayalakatha

రిజర్వేషన్లనేటివి చాలా మంచివి. నాకు భలే ఇష్టం.

ఇంటర్మీడియట్ లో నా చదువు గురించీ, మా ప్రిన్సిపాల్ కొడుకు చదువు గురించీ, ఇంకొక పల్లెరెడ్డి చదువు గురించీ చెప్తా వినండి.

నన్ను ఇంజనీర్ ను చేసేద్దాని మాయమ్మా నాయినా నన్ను ఎంపీసీలో చేర్పించినారు. దినామూ పది నుంచి నాలుగున్నర దాకా కాలేజీ. మా మిట్టూరు – తిరప్తికి ఆరు మైళ్ళ దూరం. చార్జీ వొచ్చి పోను అరవై పైసాలూ, రాను అరవై పైసాలూ. తిరప్తి – యెంగటేస్పర సామి దర్మాన మా వూరికింత దగ్గిరగా వుండబట్టే, చార్జీలు సలీసు గాబట్టే నేను కాలోజీ మెట్టెక్కగలిగినా.

ముందు మా బస్సుల గురించి కొంచిం. మా బందుగులంతా చంద్రగిరి రూట్ లో అంటే పడమర రాజ్యాన వుండేటోళ్ళు. మా వూళ్ళల్లో ఏదన్నా కార్యం జరిగితే – మా పరంటు సైడు బందుగులకు బిత్తరెత్తుకునేది – నెత్తిన గుండేసినట్టు.

‘రాయల్ చెరువు రోడ్డులో ఆ బస్సులెక్కి ఆ కార్యానికి పొయ్ రావాలంటే ఇప్పుడెట్టరా బగమంతుడా!’ అని లబలబా నోరుగొట్టుకునే వోళ్ళు. అంత పేరెత్తుకున్నాయి మా రాయల్ చెరువు రూట్ బస్సులు. అప్పుడు – ఇప్పుడున్నంత మిడిమేలంగా ఆర్టీసీ బస్సులు గూడా లేవు. ప్రైవేటు బస్సులే. కిందా మిందా యేసి జనాల్ని బస్సుల్లో తొక్కేవోళ్ళు. నాకు మా మండలంలో వుండే ప్రజలు ముక్కెంగా ఆడోళ్ళు అంత ‘క్లోజు’ అవడానికి కారణం ఈ బస్సు ప్రయాణాలే.

~ ప్రింటు పుస్తకం లభ్యం

*

పావురం 

రచన: పి. చంద్రశేఖర అజాద్

Pavuram

అదే సమయంలో నెత్తిమీద మొట్టికాయ పడింది. ‘అబ్బా’ అంటూ చూసాడు.

ఎదురుగా పంతులుగారు ఉన్నారు.

“దేహం మాత్రం ఇక్కడ ఉంది. దేని గురించి ఆలోచిస్తున్నావు” అన్నాడు.

మాట్లాడకుండా తల తడువుకుంటున్నాడు.

“నిజం చెప్పకపోతే ఇంకో మొట్టికాయ పడుతుంది” అన్నాడాయన.

“పావురం గురించి మాస్టారూ.”

“ఏ పావురం గురించి?” ఆశ్చర్యంగా అడిగారాయన.

“నిన్న ఎగరేసిన పావురం గురించి.”

“దాని గురించి ఆలోచించడానికేముంది. ఎగరేశారు. ఎగిరిపోయింది. ఎగిరిపోయిన వాటి గురించి తలుచుకుంటే పాఠాలు ఎప్పుడు చదువుతావు? మన బుర్ర చాలా చిన్నది. అందులో పావురాలూ, పిట్టలూ ఉంటే పాఠాలకి చోటు వుండదు. ఇంకెప్పుడు బడిలో ఇతర విషయాల గురించి ఆలోచించవద్దు” అన్నాడు.

~ ఈబుక్ గా లభ్యం

*

ఒక హిజ్రా ఆత్మకథ

రచన: రేవతి

OkaHijraAtmakatha

మనం హక్కుల గురించి తరచు గట్టిగా మాట్లాడుతూ వుంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో వున్నాయా? కులమూ, మతమూ, లింగమూ, లైంగికతల పేరుతో వ్యక్తులకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. వాళ్లు తమ హక్కుల విషయంలో రాజీ అయినా పడాలి లేదా పోరాడాలి. అట్లా హక్కులు నిరాకరించబడి సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ ఒక వ్యక్తిని నేను. ఎందుకంటే పురుషుడిగా పుట్టి స్త్రీగా జీవించాలనుకున్నందుకు! నా జీవితంలో నిత్యమూ నేనెదుర్కున్న వివక్ష, హేళన, వేదనే కాక, నా సహనమూ నా సంతోషమూ కూడా మీ ముందు పరిచేదే ఈ పుస్తకం.

ఒక హిజ్రాగా నేను సమాజపు చివరి అంచులలోకి నెట్టబడ్డాను. అయినా నా జీవితాన్ని మీముందు పెట్టే సాహసం చేస్తున్నాను. ఒక హిజ్రాగా వుండమే కాదు, సెక్స్‌వర్క్‌ చెయ్యడం గురించి కూడా చెబుతున్నాను. ఎవరి మనోభావాలనూ నొప్పించడానికి గానీ ఎవరినీ నిందించడానికి కానీ నేనీ పుస్తకం రాయలేదు. హిజ్రాల జీవన విధానం గురించీ వారి ప్రత్యేక సంస్కృతి గురించీ, వారి కలలూ కోరికల గురించీ పాఠకులకు తెలియజెప్పడానికే రాస్తున్నాను.

నేను రాసిన ‘ఉనర్వుమ్‌ ఉరువమమ్‌’ తమిళనాడులో తెచ్చిన ఫలితాలను చూసి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు నా జీవిత చరిత్ర సమాజంలో మరిన్ని మంచి మార్పులు తేగలదని ఆశిస్తున్నాను. అడుక్కోడనికీ సెక్స్‌వర్క్‌ చెయ్యడానికే కాదు అనేక మంచిపనులు చేసే సామర్థ్యం హిజ్రాలకుందని ఈ పుస్తకం చదివి తెలుసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. నేను ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి సానుభూతి ఆశించడం లేదు. హిజ్రాలమైన మాకు సమాజంలో అందరిలాగా జీవించే హక్కు వుందని చెప్పాలనుకుంటున్నాను.

– రేవతి

~ ఈబుక్ లభ్యం

*

నాయక కథలు

రచన: బివిడి ప్రసాదరావు

NayakaKathalu

నాయక … కథా నాయకుడు … ధీమ, ఆసరా, భరోసా … ఇలా ఎన్నెన్నో లక్షణములు లక్షణముగా అందిస్తూ, అగుపరుస్తూ … ఈడు, జోడుల ప్రసక్తి పట్టింపులు పెద్దగా లేక … కండతో కాని అండను నిండుగా అందిస్తూ, సరైన రీతిని నీతిగా ఎఱిక పరుస్తున్న వారితో సాగించిన నా రచనలు కొన్నింటిని, ఇలా, నా నాయక కథలు … గా అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని నాయకులు:
1. కిట్టూ
2. రావ్
3. శంకరం
4. అప్పారావు
5. శేఖర్
6. ముష్టివాడు
చదవండి … చదివించండి.

– బివిడి ప్రసాదరావు

~ ఈబుక్ ‍లభ్యం

*

కథల వాచకం 14  దేశాలు – 20 కథలు

రచన: ముక్తవరం పార్థసారథి

kathalavachakam14Desalu20kathalu

“చూడండి పిల్లలూ, మీకు ఇంకా తిండి తెచ్చిపెట్టే ఓపిక నాకులేదు. రెక్కలొచ్చాయిగా, ఎగరండి. మీకు నచ్చిన పసందైన ఆహారాన్ని మీరే తినిరండి. మన బలమైన కాళ్ళతో జంతువుల్ని ఎలా అనాయాసంగా ఎగరేసుకు రావాలో మీకు నేర్పించాను గదా! వెళ్ళండి. కోడిపిల్లల్ని ఎత్తుకు రావటం అన్నింటికన్నా సులభం. కుందేళ్ళనూ పట్టుకు రావచ్చు. ఏ పొదల్లో ఎక్కడ దాగినా సరే ఇట్టే పొడిచి తీసుకురావచ్చు. చెట్లమీద కొమ్మల్లో, గూళ్ళలో దాగిన అన్ని రకాల పక్షులూ మన పంజాల్లో చక్కగా అమరుతాయి.

కానీ, పిల్లలూ, అన్నింటికన్నా రుచికరమైన భోజనం ఆహా! తలచుకుంటేనే నోరూరుతోంది. ఏమిటో తెలుసా? మనిషిమాంసం.
ఎన్నిసార్లు మీకోసం తెచ్చి, గోరుముద్దలు చేసి తినిపించలేదూ” అంటూ కళ్లు మూసుకుని, జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, లొట్టలేసింది తల్లి రాబందు.

అన్నేళ్లు బతికిన తల్లికే తిండియావ చావకపోతే, యింక పిల్లల సంగతి చెప్పేదే ముంది?

”తెచ్చిపెట్టావు సరేగాని, ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదు. త్వరగా చెప్పమ్మా ఆకలితో చస్తున్నాం. చెప్పు. ఈ క్షణాన వెళ్ళి కడుపునిండా భోంచేసి వస్తాం” అంటూ అరిచాయి పిల్లరాబందులు. వాటి అరుపులతో ఆ కొండ శిఖరం మారు మోగిపోయింది.

“మనిషి మాంసం నచ్చందెవరికి? రాబందుల కోసం ప్రకృతి ప్రత్యేకంగా సృష్టించిన ఆహారం మనిషి” అంది తల్లి రాబందు.

~ ప్రింటు బుక్ లభ్యం

*

అప్రజ్ఞాత యజ్ఞం

రచన: కాళీపట్నం రామారావు

ApragnaataYagnam

కాళీపట్నపు రామారావు మాస్టారి 91వ జన్మదినం సందర్భంగా వారి రెండు సుప్రసిద్ధ కథలు – “అప్రజ్ఞాతం”, “యజ్ఞం” లను కావ్య పబ్లిషింగ్ హౌజ్ వారు పుస్తకంగా అందిస్తున్నారు.
* * *
అలనాటి యజ్ఞం గురించి ఇటీవల మళ్లా చర్చ ప్రారంభమయ్యిందని విన్నాను.
దాని ప్రభావమో, లేక ఇంకేదో కారణమో – తెలియదు. చరితా గ్రాఫిక్స్ సుబ్బయ్యగారు ఆ ఒక్క కథనే పుస్తకంగా తేదలచారని శాయి గారు ఫోన్ చేశారు.
కాదనడానికి వల్ల కాదు – కథానిలయమూ నేనూ కూడా వారికీ వారి సంస్థలకూ రుణపడి ఉన్నాము. సరే నన్నాను.
ఒక రాత్రల్లా క్రిందా మీదా పడి – దానితో పాటు అప్రజ్ఞాతం కూడా వేయగలరా – అన్నాను. వారు సరే నన్నారు.
అలా అడగాలని నాకెందు కనిపించిందంటే – నేను బాగా గౌరవించే ఓ పెద్దాయనికి యజ్ఞం కంటే అప్రజ్ఞాతమే బాగా నచ్చింది. నాకు చాలా ఆశ్చర్యమయ్యింది.
అప్రజ్ఞాతం 1951లో రాసింది – కథకుడిగా స్థిరపడుతున్న తొలి దశలో.
వస్తుశిల్పాల అవగాహన పెరిగాక (లేదా పెరిగిందని నేననుకున్నాక) 1964లో రాసింది ‘యజ్ఞం’.
ఆ పెద్దాయనను అర్థం చేసుకోవడం కోసం – ఆ రెండింటినీ – ఒక పాఠకుని దృష్టితో చదివాను.
రెండూ కథలు కావు కథానికలే – వస్తు సమగ్రతలో కొంత తేడాలున్నా రెండింటా వస్తువు ఒక్కటే. శిల్పంలోనే తేడా అనిపించింది.
నా జ్ఞాపకాల మేరకు –
యజ్ఞం కథానికకు ‘బీజం’ ముందు పుట్టి, దాని వ్యక్తీకరణకు అవసరమైన నేపథ్యం సన్నివేశాలూ సంఘటనలూ పాత్రలూ వాటి వాటి చిత్రీకరణలూ తర్వాత పుట్టాయి.
అప్రజ్ఞాతం తొలి దశ కథానిక కావడం వల్ల – అందులోని కథాంగాలన్నీ చిన్న చిన్న మార్పులతో యథాతథంగా చిత్రితమయ్యాయి. అందులోని ముగింపు మాత్రమే కల్పితం.
అయితే అప్రజ్ఞాతంలో అసలు వృద్ధుల గణితముంది. బాగా ఎదిగిపోయిన పాఠకులని అలా ఉంచితే – ఇంకా ఎదగని పాఠకులకు కూడా ‘యజ్ఞం’లో అప్పల్రాముడి సంకటస్థితిని ఆ గణితం అర్థం చేయించగలుగుతుంది.

– కాళిపట్నం రామారావు

~ ప్రింట్ బుక్ & ఈబుక్ ‍లభ్యం

*

సాహిత్యమహిళావరణం

రచన: చేకూరి రామారావు 

Sahityamahilavaranam

గత పాతిక సంవత్సరాలలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎన్నో ఉత్తేజకరమైన సందర్భాలున్నాయి. నిన్న మొన్న మన కళ్ళముందు మెరిసిన చేరాతల సందర్భం వాటిలో ఒకటి. 80వ దశాబ్దపు చివరి సంవత్సరాలూ, 90వ దశాబ్దపు మొదటి సంవత్సరాలూ స్త్రీవాద సాహిత్యోద్యమంలో ఆంధ్రప్రదేశాన్ని ఒక కుదుపు కుదిపాయి. స్త్రీవాద కవిత్వం గురించిన చర్చలు వాదోపవాదాలూ రకరకాలుగా కమ్ముకొచ్చాయి. వాటిని తట్టుకొని తమ గొంతుకో స్థిరత్వాన్నీ, ధృడత్వాన్నీ పొందాలని స్త్రీలు ప్రయత్నం చేశారు. మొత్తం మీద సాహిత్యలోకంలో అలజడి సందడి – ఆ అలజడినీ, సందడినీ పట్టుకునేందుకు చేరా చేసిన ప్రయత్నంలో కొంతభాగమే ఈ సాహిత్య మహిళావరణం.

మహిళా సమస్యలను స్పృశిస్తూ, మహిళల రచనలను విమర్శిస్తూ పత్రికలను పరామర్శిస్తూ వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలు ఈ సాహిత్య మహిళావరణంలో సంకలితం అయ్యాయి.

ఇందులో కనిపించే అభిప్రాయాలు అన్నివేళలా అందరికీ సానుకూలమైనవి కావు. ముఖ్యంగా ఆయా రచయిత్రుల రచనలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కవిత్వంపై వేసిన అంచనాలు కొంత వివాద కారకాలు కావచ్చు. కొన్నింటిపై నేను వెలువరించిన అభిప్రాయాలు సవరణా పేక్షకాలు కూడా. సమకాలీన సాహిత్య వాతావరణంలో ఒక ముఖ్య భాగాన్ని పట్టి ఇయ్యగలవన్న ఉద్దేశంతో వీటిని ఈవిధంగా సంకలితం చేస్తున్నాను.

~ ప్రింటు బుక్ లభ్యం

 *

రెండేళ్ళ పద్నాలుగు

రచన: మధురాంతకం నరేంద్ర

RendellaPadnalugu600

కథా రచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పం మీద అతనికున్న నియంత్రణ. రెండవది రచయితగా తనని తాను నిగ్రహించుకోవడం.. కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా – ఆబ్జెక్టివ్‍గా – పోషిస్తాడు.
– వల్లంపాటి వెంకటసుబ్బయ్య
* * *
నరేంద్ర కథా ప్రపంచం జీవితంలోకి బహుళత్వాన్ని పరిచయం చేస్తుంది. వైరుధ్యాల్ని ఆకళింపు చేసుకోడానికి తోడ్పడుతుంది. ఆయన కథల్లో సామాజిక జీవితంలోని బహుళ పార్శ్వాలు విరాట్‌రూపంలో ఆవిష్కృతమవుతాయి… ఆయన కథల్లో వస్తుశిల్పాలను విడదీసి చూడడానికి వీల్లేనంతగా ఐక్యతవుంది… మరోవిధంగా చెప్పడానికి వీల్లేని రీతిలో కథను నిర్మించడంలో ఒక శిల్పకారునిగా దర్శనమిస్తాడు నరేంద్ర… ఆయన కథల్ని చదవడం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం.
– గుడిపాటి

~ ప్రింట్ బుక్ లభ్యం

 

Posted in 2014, కొత్త పుస్తకాలు, డిసెంబర్ and tagged , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.