cover

‘అజేయ’

Download PDF EPUB MOBI

ఆల్‌ ద రజనీ ఫ్యాన్స్‌

డోంట్‌ మిస్‌ ద ఛాన్స్‌

లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌… పాట హై స్పీడ్‌లో వినిపించగానే ల్యాండ్‌మార్క్‌ బుక్‌షాప్‌లోకి వెళ్లబోతు ‘యేమిటాని’ ఆగి రైలింగ్‌ దగ్గరకి వచ్చి కిందకి తొంగి చూసాను. నాలానే చాల మంది దాదాపు అన్ని ఫ్లోర్స్‌ నుంచి కిందికి తొంగి చూస్తున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వందమందికి పైగా అమ్మాయిలు అబ్బాయిలు దాదాపు నా వయసువారే కాకుండా అంత కంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆ పాట వేగానికి తగినట్టుగా రిథమిక్‌గా స్టెప్స్‌ వేస్తున్నారు. ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్స్‌… కింద ఫ్లోర్‌లో మాల్‌కి వచ్చిన వాళ్ళు అప్పటికే వాళ్ళ చుట్టూ గుండ్రంగా పోగైయ్యారు.

అటుయిటూ తిరుగున్నవాళ్ళే కాకుండా రకరకాల షాప్స్లో వున్నవాళ్ళు ఆయా ఫ్లోర్స్‌ నుంచి కింద డ్యాన్స్‌ చూడటానికి రైయిలింగ్‌ దగ్గర స్థలం లేని వాళ్ళు యెస్కలేటర్‌ మీద కిందకి వెళ్ళుతున్నారు. కాఫీ షాప్స్‌, రెస్టారెంట్స్లోని వాళ్ళు మాత్రం తింటున్నవి, తాగుతోన్నవి వదిలి రాలేక రాలేదు. అనేక రకాల పాటలు. పాట వెనుక పాట. చప్పట్లతో, విజిల్స్తో, చిటికెలతో ప్రేక్షకులు వుత్సాహంగా రియాక్ట్‌ అవుతుంటే హై యెనర్జీ పాటలతో వాళ్ళ డ్యాన్స్తో దాదాపు అన్ని ఫ్లోర్స్‌ ఛార్జ్‌ అవుతున్నాయి. చాలామంది ఆ డ్యాన్స్ని తమతమ సెల్‌ఫోన్స్లో రికార్డ్‌ చేసుకొంటున్నారు. మీడియా కెమెరాలు లెక్కలేనన్ని వున్నాయి.

నగరంలోనే అత్యంత పెద్దదైన షాపింగ్‌ మాల్లో చాలా బిజిగా వుండే యీ సమయంలో యే కాజ్‌ కోసం యిప్పుడీ ఫ్లాష్‌మాబ్‌ డ్యాన్స్‌… అనుకొంటుండగా, చుట్టూ వున్న వాళ్ళందరి దృష్టి వాళ్ళ మీదకి పూర్తిగా వచ్చిందని గమనించారో యేమో డ్యాన్స్ని ఆపీఆపగానే వాళ్ళల్లోని వొక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు చుట్టుముట్టారు. మిగిలిన వాళ్ళంతా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని వుండగా అత్యాచార ఘటనని యనాక్ట్‌ చేసారు. ఆ తరువాత మళ్ళీ వొక ప్రబోధగీతపు పల్లవిని పాడారు. తిరిగి వాళ్ళంతా కలిసి వలయాలు వలయాలుగా నిలబడ్డారు.

వాళ్ళల్లోని వొక అబ్బాయి వొక అమ్మాయి వాళ్ళందరి మధ్య నుంచి తిరుగుతూ ‘‘డియర్‌ సిటిజన్స్‌, మనందరికి తెలుసు ఆ రోజు ‘నిర్భయా’ సంఘటన జరిగినప్పుడు దేశంలోని యువతరమంతా వొక్కటై ఆ సంఘటనని ఖండించాం. న్యాయం కోసం పోరాడాం. అలానే మన నగరంలో జరిగిన ‘అభయ’కి న్యాయం జరగాలని కోరుకున్నాం. యిప్పటికీ యీ దేశంలోను, మన నగరంలోనూ మహిళలపై అత్యాచారాలు జరుగుతునే వున్నాయి. మనందరికి మన నగరంలో ‘అజేయ’ పై జరిగిన అత్యాచారం తెలుసు. రేపు కోర్టులో ఆ నిందితులకి శిక్షని ఖరారు చేయబోతున్నారు. ‘అజేయ’కి న్యాయం జరగాలని కోరుకొందాం. యీ నగరంలో తిరిగి యిలాంటి సంఘటన మరొకటి జరగకూడదని ఆకాంక్షిద్దాం. రెస్పెక్ట్‌ వుమెన్‌… స్త్రీ జాతిని గౌరవిద్దాం’’ అని వాళ్ళిద్దరు వొక్కొక్క లైన్ని వొకరి తరువాత మరొకరు యిమోషనల్‌గా స్లోగన్స్‌ చెపుతుంటే నిశ్శబ్దంగా వింటున్న ఆ బృందంలోని వొకరు ‘‘ ‘అజేయా’ మేం నీతో వున్నాం… వి వాంట్‌ జస్టిస్‌’’ స్లోగన్స్‌ యిస్తూ తిరిగి ‘‘వి వ్వాంట్‌…” అని వాళ్ళు ఆగగానే ‘‘జస్టిస్‌’’ అని పబ్లిక్‌ అందుకొన్నారు.

స్లోగన్స్తో చప్పట్లలతో ఆ మాలంతా మారుమోగిపోతోంది.

చప్పట్లు కొడుతూ ‘‘జస్టిస్‌ ఫర్‌ ‘అజేయ’ ’’ అని అందరితో కలిసి స్లోగన్స్‌ యిస్తున్న నేను వొక్కసారిగా నా చేతుల వైపు చూసుకొంటుంటే ‘‘జస్టిస్‌ ఫర్‌ అ..’ నోటిలో మాట నోటిలోనే ఆగిపోయి దగ్గరకి కాబోతున్న నా రెండు చేతులు ఆగిపోయాయి.

‘‘అజేయా… అజేయా.. అజేయా… యెవరీ ‘అజేయా’ యెక్కడో విన్నట్టే వుంది. అవునవును తనే… తను చాల కాంష్యస్‌గా గుర్తు పెట్టుకొంటున్నా తను యీ పేరుని మర్చిపోతునే వుంది. తన సబ్‌కాన్షస్‌ లెవల్‌కి యీ పేరు యింకా యింక లేదు యిన్ని నెలలైనా. తనే కదా… తనే… యిదేంటి నేనెందుకు చప్పట్లు కొడుతున్నాను. నేనెందుకు స్లోగన్స్‌ యిస్తున్నాను.

స్కార్ఫ్తో ముఖానికి కట్టుకొన్న మాస్క్ని మరింత పైకి లాక్కుంటూ అక్కడ నుంచి యెస్కలేటర్‌ పై కిందకి వస్తుంటే ‘నా జీవితం యింతే వేగంగా కిందకి జారిపోయింది కదా. అసలు…’ యీ నా ఆలోచనలతో కలగాపులగంగా కలిసిపోతూ ‘‘సాయంకాలం క్యాండిల్‌ లైట్‌ ర్యాలీ వుంది ‘అజేయ’కి సంఘీభావంగా. రేపు వేయబోయే శిక్షలు మహిళలపై అత్యాచారాలు చేసే మృగాళ్ళకి గుణపాఠాలు కావాలని ఆశిద్దాం… జస్టి…’’ వాళ్ళ మాటలు వినిపిస్తూనే వున్నాయి.

యెగ్జిబిషన్‌లో సందర్శకులని చూసి పారిపోవటానికి యేదైనా కలుగుని వెతుక్కొనే తెల్లయెలుక పిల్లలా అక్కడ నుంచి రోడ్డు మీదకి పారిపోయాను.

ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయిన ఆ రోడ్డుకి వో పక్కగా నడుస్తునే వున్నాను. అచ్చు అలానే ‘నిర్భయ’ సంఘటన జరిగినప్పుడు యిలాంటి ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్స్లో తను పాల్గొంది. మిడ్‌నైట్‌ ర్యాలీలో అందిరితో పాటు ట్యాంక్‌బండ్‌ మీద తను, తన స్నేహితులతో కలిసి పాల్గొంది. స్లోగన్స్‌ యిచ్చింది. క్యాండిల్‌ లైట్స్‌ వెలిగించింది. యెక్కడ యెవరు యెలాంటి కార్యక్రమాలు చేసినా తనూ, తన స్నేహితులూ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేశారు. వొకప్పుడు మరొకరికి న్యాయం జరగాలని, స్త్రీలపై దాడులు జరగకూడదని కోరుకునే సమూహంలో వుండే తను, యిలాంటి హింస యిక ముందు కొనసాగకూడదని యెలుగెత్తి సాగిన ‘నిర్భయ’ పోరాటంలో పాల్గొన్న తను యీరోజు అనామక బాధితురాలిగా వొక ప్రేక్షకురాలిగా నిలబడి తనకి న్యాయం కావాలని జరుగుతున్న డ్యాన్స్ని తానే చూసింది.

యెంతో దూరం నడవక ముందే ఆ ట్రాఫిక్‌ పొల్యూషన్‌కి యెలర్జిక్‌ దగ్గు మొదలయింది. యెక్కడైనా కాసేపు కూర్చోవాలి. అనాలోచితంగానే రోడ్డు పక్కన కనిపించిన కాఫీ షాప్‌లోకి వెళ్ళాను.

కూర్చున్నాక కాస్త తేరుకొన్నాక చుట్టూ కోలాహలం వినబడుతోంది. నా వయస్సు వారే అనేక మంది దీపావళి సాయంకాలపు మతాబుల్లా వెలిగిపోతోన్న ముఖాలతో యువతీయువకులు జంటగానో, గ్రూప్‌గానో కబుర్లని కలబోసుకొంటున్నారు. తీసుకొన్న సెల్ఫీలని స్మార్ట్‌ ఫోన్‌తో అప్పటికప్పుడే ఫేస్‌బుక్‌లో స్టాటస్‌ అప్‌డేట్‌ చేసుకొంటున్నారు. నేనేమో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని డీ యాక్టివేట్‌ చేసేసాను.

యిప్పుడు నా ప్రొఫైల్‌ పిక్‌ని యీ మాస్క్తో నా పేరుతో కాకుండా వేరే పేరుతో వోపెన్‌ చేస్తే. యేంటా పేరు ‘అజేయ’. యేం చేస్తూంటుంది… సామూహిక అత్యాచారపు కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తూంటుంది. రోజూ యేం స్టేటస్‌ పెడుతుంది. చాలా పెట్టొచ్చు. టివి డిబేట్స్‌… అనేక రకాల సెలబ్రేటీస్‌ బైట్స్‌. కేండిల్‌లైట్‌ ర్యాలీలు. ఫ్లాష్‌మాబ్‌ డ్యాన్స్లు… తన మూడ్స్‌… రోజుకో చోట జరుగుతోన్న అత్యాచారాలు… పెద్ద కెరటాల్లా యెగిసిపడుతోన్న నవ్వులసవ్వడుల్లో నా ఆలోచనలు విరిగిపోయాయి.

యిలాంటి యెన్నో నవ్వులు నా చెవుల్లోకి గలగలా పాక్కుంటూ వచ్చేసాయి. యెన్నెన్ని సరదాల సంతోషపు గిలిగింత. అసలు జ్ఞాపకాలే లేని వాస్తవ క్షణాలే ప్రవహించే రియల్‌ కాలం. మరి యిప్పుడు ఆ వొక్క సంఘటన నా జీవితాన్ని పదేపదే జ్ఞాపకాల తుఫాన్‌లో చిక్కుకొన్న వొంటరి చెట్టుని చేసేసింది. భవిష్యత్‌ ప్రవహించాల్సి యీ వయస్సులో జీవితం జ్ఞాపకాల యెడారయింది. అంతా మారిపోయింది ఆ రోజు తరువాత. నా వుల్లాసపు సాయంత్రాలని లాక్కున్నందుకు వాళ్ళకే శిక్ష వెయ్యాలి.

ఆర్డర్‌ తీసుకోడానికి బాయ్‌ వస్తే కావలసినవి మెనూలోనే చేత్తో చూపించాను. ముఖానికి వున్న యీ మాస్క్‌ తీసేస్తే యెవరోవొకరు గుర్తుపడితే… య్‌ కమాన్‌… అని నా పేరు అనుకోబోయి చప్పున ఆగాను. వుష్‌ష్‌… యెవరైనా పేరు వింటారేమో… రహస్యం.

వైబ్రేషన్‌లో వున్న ఫోన్‌ కదుల్తోంది. యింట్లోంచే ఖచ్చితంగా. అమ్మ చేస్తుండొచ్చు. ఫోన్‌ ఆన్సర్‌ చేస్తే నా యెర్ర చీర మీద జాకెట్‌ కనిపించలేదనో, నా దువ్వెన చూశావా అనో యిలాంటి మాటలు మాట్లాడి ఫోన్‌ పెట్టేస్తుంది. అవును, అమ్మ నన్ను ‘యెక్కడున్నావ్‌’ అని అడగలేకపోవడానికి నా ప్రవర్తన కూడా వొక కారణమేనేమో.

అమ్మ యిలా ప్రవర్తించటానికి హేతువైన ఆ రోజు నాకింకా గుర్తుంది.

నాపై దాడి జరిగిన కొన్నాళ్ళకి వొక సాయంకాలం బయటకి వెళుతుంటే ‘‘త్వరగా…’’ అమ్మ మాటలు నోట్లోనే నిలిచిపోయాయి.

యెందుకాగిందాని వెనక్కి చూస్తే టివి చూస్తున్న నాన్నగారు మాట్లాడొద్దని కళ్ళతో, చేతులతో సైగలు చేస్తున్నారు. ఆమె వైపు చూసాను. మాట్లాడకూడనిదేదో మాట్లాడిన గిల్ట్‌ ఆమె కళ్ళల్లో.

అంతకు ముందు కూడా బయటకి యెప్పుడెళ్ళినా అమ్మో, నాన్నగారో ‘యిప్పుడెందుకనో, యిప్పుడెక్కడికనో’ అనేవారు. పిల్లలని త్వరగా యింటికి రమ్మని చెప్పే చనువంతా యేమయిందో. వొక బాధ్యతతో, ఆదుర్దాతో, పెద్దరికంతో చేసే హెచ్చరికలు యేవి. సెన్సార్‌. అంతా సెన్సారే. నా జీవితపు సినిమాకి యెప్పటికైనా యూ సర్టిఫికేట్‌ వస్తుందా.

‘‘యేం లేదమ్మా… అమ్మ కాస్త కంగారు పడుతోందిలే’’ అన్నారు నాన్నగారు.

“నాన్నగారూ, మీరంతా నాతో నార్మల్‌గా వుండలేరా. నన్నెందుకిలా స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తున్నారు. నేను మీ…’’ అనబోతు నాన్నగారిని పట్టుకొని వెక్కివెక్కి యేడ్చాను.

‘‘అయ్యో… యిదేంటిలా. అంత పెద్ద క్రైసిస్‌లో కూడా యిలా యేడవలేదే. అంతా అంత ధైర్యంగా యెదుర్కొని యిప్పుడెందుకురా నాన్న’’ అంటూ అమ్మ నాకు ధైర్యం చెప్పసాగింది.

‘‘సారీ. మేం యెప్పట్లానే వుంటాం. బిలీవ్‌ మి ప్లీజ్‌ ’’ అంటుంటే నాన్నగారి కళ్ళ నిండుగా కన్నీరు. కానీ యెంత ప్రయత్నించినా వాళ్ళు యెప్పటిలా నాతో వుండలేకపోయారు.

ఆ తరువాత మళ్ళీ వొకరోజు సాయంత్రం యేడు గంటలప్పుడు బయటకి బయలుదేరాను. నాన్నగారు టివి చూస్తున్నారు. ఆ వేళప్పుడు కాలనీలోని నీమ్‌ పార్క్‌ వరకు వెళ్ళటం అక్కడ ఛాట్‌బండిపై ఛాటో, ఐస్‌ క్రీమో తిని, వచ్చేడప్పుడు యింట్లో వాళ్ళకి ఛాటో, ఐస్‌క్రీమో పార్సిల్‌ చేయించుకొని, పూజకి పువ్వులు కొనుక్కు రావటం యిదంతా మామూలే. కానీ ఆ సంఘటన తరువాత నుంచి నేను కాలు బయటపెడితే చాలు యింట్లో వాళ్ళకి కంగారెత్తిపోతోందనుకొంటాను.

‘‘యిప్పుడెక్కడికి? యెక్కడికి వొక్కదానివి? అసలు వెళ్ళొద్దు. బుజ్జమ్మ మ్యూజిక్‌ క్లాస్‌ నుంచి వచ్చాక తనని తోడు తీసుకొని వెళ్ళు’’ అంది అమ్మ.

చెల్లెలి రక్షణలో వెళ్ళమనే అమ్మ అమాయకత్వానికి నిట్టూరుస్తూ ‘‘యిక్కడేగా… పార్క్‌ వరకే కదమ్మా’’ అన్నాను.

‘‘నీకేం కావాలో చెప్పు. తీసుకొస్తాను’’ అన్నారు నాన్నగారు.

‘‘వద్దొద్దు. మనం అసలు యీ కాలనీలో తిరగకపోవటమే మంచిది. పేరెంత గోప్యంగా దాచినా, ఫోటో చూపించకపోయినా, హాస్పటల్‌కి వెళ్ళటం రావటం, యీ టీవిల్లో న్యూస్‌తో మన అపార్ట్మెంట్‌ లోనే కాదు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోయింది. స్ప్రెడ్‌ అవుతునే వుంది. సొంత యిల్లని యిక్కడ వుండటం కానీ నాకసలు యిల్లు మారిపోవాలనుంది’’ అమ్మ స్వగతంలా మాట్లాడేస్తోంది.

‘‘తెలీనీ. యిందులో మన పొరపాటేముంది. యెంతో మందికి యాక్సిడెంట్స్‌ అవుతుంటాయిగా. వాళ్ళంతా యింక బయటకి వెళ్ళరా యేంటి. అంతకంటే నాకేం జరిగింది. యాక్సిడెంటే కదమ్మా. యిల్లెందుకు మార్చుకోవటం… యేం మీ అందరికి యిదంతా అవమానకరంగా వుందామ్మా’’ గొంతులో దాగని బిట్టర్‌నెస్‌.

‘‘అయ్యో అదేం లేదు. నువ్వు బాధపడతావేమోనని’’ అమ్మ కంగారుగా సర్ది చెప్పబోయింది.

విసురుగా బయటకి వెళ్ళిపోయాను. నాకే తెలియని విసుగు, చికాకు, కోపం, బాధ, అవమానంతో చాలాసేపటి వరకూ తిరిగి యింటికి రాలేదు. ఫోన్‌ చేస్తుంటే కూడా తియ్యలేదు. అప్పట్నుంచి అమ్మ నాతో డైరెక్ట్గా ‘యెక్కడున్నావ్‌, యేం చేస్తున్నావ్‌’ అని అడగటం మానేసింది. అంతా యిన్‌డైరెక్టే. ముఖ్యవిషయమేదో చెప్పడానికన్నట్టు యిలా కాల్స్‌ చేస్తుంటుంది. అంతే కాదు యెవరైనా నా పేరు వింటారేమోనని చాలా కాన్షస్‌గా నన్ను నా పేరుతోనే పిలవరు యింట్లో.

ఫోన్‌ యింకా వైబ్రేటవుతునే వుంది. మాట్లాడకపోతే అమ్మ కంగారు పడుతుందని ఫోన్‌ తీసి ‘‘చెప్పమ్మా’’ అన్నాను.

‘‘నెయిల్‌‌ కట్టర్‌ చూసావా’’ అని అడిగింది.

‘‘యిప్పుడెందుకమ్మా’’

‘‘గోళ్లు బాగా పెరిగాయి. తీసేద్దామని’’

‘‘మర్చిపోయావా, యీ రోజు మంగళవారం. అదీకాక దీపాలు పెట్టి చాల సేపయింది. రేపు తీసుకోవచ్చులే. స్టార్‌ బక్స్లో వున్నాను. వచ్చేస్తాను’’ అన్నాను.

నేల మీద పల్లేరు కాయలు వొలికినట్టు అటుపక్క నిశ్శబ్దపు చప్పుడు. గత ఆరునెలల్లో నిశ్శబ్దం యిలా గతుక్కుమనటం అలావాటైపోయింది.

ఆ నెయిల్‌ కట్టర్‌ యెక్కడుందో చెప్పి వూరుకోవచ్చు. కానీ యింట్లో వాళ్ళు నాతో మామూలుగా మాట్లాడాలని, మీరెందుకు ఫోన్‌ చేసారో అర్ధమవుతోందని, మీరు నాతో యెప్పటిలా లేరని చెప్పడానికే అలా మాటాడుతుంటాను.

వో మూల టేబుల్‌కి అటూయిటూ కూర్చుని ముందుకు వంగిన ఆ అమ్మాయి అబ్బాయిల యిద్దరి తలలు వొకటికొకటి దగ్గరగా తాకుతోండగా చుట్టూ కోలాహలంతో యేం సంబంధంలేనట్టు వాళ్ళ మధ్య కార్తీకపు జలపాతంలా నవ్వులు, మాటలు దూకుతున్నాయి. యింత కంటే యెక్కువగా వొకప్పుడు నేను చైతన్య వానాకాలపు జలపాతంలా హోరెత్తేవాళ్లం.

యెన్నెన్ని మాట్లాడుకొనేవాళ్ళం. వొక రోజు పండక్కి వూరెళ్ళే ముందు చైతన్య తన చిన్నతనం, యవ్వన కాలపు దినాల విశేషాలు పంచుకొన్నాడు. వాటిల్లో కొన్ని యీ మధ్య తరచూ గుర్తొస్తున్నాయి.

‘‘ప్రతి యేడాది పండక్కి మావూర్లో ఆంబోతుల పందెం జరుగుతుంది. రెచ్చిపోయి పరిగెత్తే ఆంబోతులకి యెదురెళ్ళే సాహసగాడు మా వూర్లో నేనొక్కడినే’’ అన్నాడు చైతన్య.

‘‘ఆంబోతులా… భయం వెయ్యలేదా?’’ అడిగాను.

‘‘భయమా? నన్ను.. చూస్తే వాటికే భయం’’

‘‘వోఁ సల్మాన్‌ ఖాన్‌ షారుఖాన్‌ తరువాత నువ్వే ధీరుడివి’’ అని నవ్వు ఆపుకొంటూ ‘‘అంత పల్లెటూరి నుంచి వచ్చావు కదా… యింత సొఫిస్టికేటెడ్‌గా యెలా తయారయ్యావ్‌’’ అడిగాను.

‘‘యింటర్మీడియట్‌ వరకు మా వూర్లోనే చదువుకున్నాను. మా అమ్మగారికి నన్నావూరిలోని గవర్నమెంట్‌ కాలేజ్‌కి పంపటం యిష్టం లేక, బెంగుళూరులో కార్పొరేట్‌ కాలేజ్‌లో జాయిన్‌ చేసారు. ఆ కాలేజ్‌ యిప్పుడీ సిటీ, యీ వుద్యోగం కూడా చాలా నేర్పిస్తున్నాయి’’ అని నవ్వాడు.

‘‘యిప్పుడు అలా ఆంబోతుల ఫైట్‌ కి వెళతావా’’

‘‘యిక్కడ ఆంబోతులెక్కడున్నాయి. వూర్లో పందేలున్నాయి. కానీ యిప్పుడు పందాలకి వెళ్లటం లేదు’’

‘‘యెందుకని’’

కాసేపు మౌనంగా వుండి ‘‘ఆ వూరికీ, ఆ ప్రజలకీ, ఆ ఆటలకీ చాల దూరంగా నడిచొచ్చేసాను. యిప్పుడు వెనక్కి చూసుకొంటే ఆ ఆంబోతులతో ఫైట్‌ చాలా యిన్‌హ్యూమన్‌గా, అనాగరికంగా అనిపిస్తుంది. అసలు అలాంటి వాటి అవసరం యేముంది చెప్పు’’ అన్నాడు.

‘‘ధైర్యం పోయిందా’’ టీజింగ్‌గా అడిగాను.

‘‘భలేదానివే… యిప్పటికీ ఫీల్డ్లో దిగితే వొక్కటేంటి నాలుగైదు ఆంబోతులని కట్టడి చేస్తాను. అసలు ఆంబోతు నన్ను చూస్తే రంకె వేయటానిక్కూడా భయపడుతుంది. యీ చేతుల్లోని పవర్‌ నువ్వు వూహించలేవ్‌’’ కాస్త గర్వం ధ్వనించే ఆ స్వరం ముద్దొచ్చి అతని చేతుల్ని చేతుల్లోకి తీసుకొంటూ ముద్దు పెట్టుకొన్నాను.

అటువంటి చైతన్య పక్కనుండగానే ఆరోజు యేమయింది.

యిద్దరం పనిమీద వెళ్ళాం. కొత్త దారి. చౌరస్తా నుంచి యెటు వెళ్ళాలో తెలీయలేదు. కనిపించిన వాళ్లని అడిగాం. అప్పుడా ముఖాలు కుందేలు పిల్లలానే తోచాయి. కానీ కుందేలు పిల్లని వేటాడే పులిముఖాల్లా కనిపించలేదు. వాళ్ళు పులులేనా… తిమింగలాలు… కాదేమో. అసలు కుందేలుపిల్లని పులులు వేటాడవేమో…

వేటాడే ముఖాలు వేటాడని ముఖాలూ వొక్కలాగే వుంటాయా… యేమో!

రంకెలేసే ఆంబోతులని యెదుర్కొనగలనని, బుల్‌ ఫైటర్‌నని ఛాతి విరిచి చెప్పే చైతన్య నెత్తి మీద రెండేసి, స్ధంబానికి కట్టేసారు. అరుస్తున్న నా గొంతుక్కి వందల ముళ్ళు అడ్డం పడినట్టు మాటలు పెగలటం లేదు. ఆ యెర్రని మధ్యాహ్నం వొక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్టు నా కళ్లంతా చీకట్లు. తెరుచుకోలేదు. వొకడు, యిద్దరు, ముగ్గురు, నలుగురు… తరువాత అసలు వొకొక్కళ్లు యెన్నిసార్లు అనేది లెక్క పెట్టటానికి కూడా వీలులేని పైశాచికత్వం. కింద ఫ్లోరింగ్‌ చేయని గరకు గచ్చు వీపుకి వేలవేల దబ్బనాలల్లా గుచ్చుకోంటుంది. కాసేపటికి వేలవేల ఫోర్క్లు ఆ మెత్తని శరీరభాగంలోకి దింపి బయటకి లాగి తిరిగి దింపుతున్నట్లు వొకటే భయంకరమైన నొప్పి. చిత్తడి చిత్తడి… అసహ్యమో వెగటో… వేలవేల నోర్లు వొక్కసారిగా వాంతు చేసుకొన్న వాసన. పరిశుభ్రమైన నేలంతా అశుభ్రమైనట్లు, పచ్చని చేల్లో మందు లేని మందమైన తెగులు సోకినట్లు మనసంతా చీడేచీడ.

రంకె వేస్తూ వేగంగా దూసుకొంటూ వచ్చే ఆంబోతుని కట్టడి చేయగల సిక్స్ప్యాక్‌ సల్మాన్‌ఖానో, అమీర్‌ఖానో నా చైతన్య యెందుకూ పనికి రాలేదు ఆ క్రూరుల ముందు. నా స్నేహితుడు ధీరుడేననుకున్నాను. ధీరుడే. కానీ మగధీరుడు కాదనుకుంటా. అయినా అనేకానేక ఆంబోతులు పాములూ కలగలిసిన ముఖాలున్న యీ జీవుల్ని యెదుర్కోడానికి యీ వొక్క మగధీరుడేం సరిపోతాడు.

అసలు చైతన్య విషయం వదిలేస్తే చిన్నప్పటి నుంచి నన్నేమనేవారు… ‘బాప్‌ రే… తన జోలికి యెవడు వెళతాడు. కళ్లల్లో కత్తులు పెట్టుకొని తిరుగుతుంది. మనిషనేవాడు కాదు కదా క్రూరమృగం కూడా దగ్గరికి రాలేదు’ అని అనేవారు. యేమయ్యాయి ఆ కత్తులు…? ఆ చురకత్తులు?

ప్రాణాలతో విడిచిపెట్టినందుకు అమ్మ సంతోషిస్తే, యెక్కడా పేరు బయటకి పొక్కనందుకు ఆ రోజుకి నాన్నగారు సంతోషించారు. కానీ నాన్నగారి ఆఫీసులో, తన ఆఫీస్‌లో, వుంటున్న అపార్ట్మెంట్లో, బంధువులకి విషయం వానాకాలపు ఫ్లూలా సరసరా పాకిపోయింది. తనింకా ఆ వుద్యోగంలో చేరి పట్టుమని రెండు నెలలు కాలేదు. యింట్లో వాళ్ల ఫోన్స్‌ మోగుతునే వున్నాయి. అందరిలో బాధ. సానుభూతి. భయం. మేమనుకుంటామోనని మాకు డైరెక్ట్గా ఫోన్‌ చెయ్యని వాళ్ళూ వున్నారు.

ఆ రోజు హాస్పిటల్‌కి రాజకీయ పార్టీ లీడర్సు, నాయకులు, పురప్రముఖులు, రకరకాలా యన్‌జివోలు, మహిళాసంఘాల వాళ్ళు వచ్చారు. మీడియాలో తాము వచ్చి బాధితురాలిని చూసామనే విషయం ప్రముఖంగా రావాలని పక్కనున్న రిపోర్టర్స్కి వాళ్ళల్లో కొంత మంది డైరెక్ట్గా చెప్పటం మా యింట్లో వాళ్ళ చెవుల్లో పడుతునే వున్నాయంట.

అదంతా వో ప్రహసనం. అయితే కొంత మంది ముఖ్యంగా స్టూడెంట్స్‌, మహిళాసంఘాలల్లోని వాళ్ళు, యన్‌జివోస్‌లోని కొంత మంది, రాజకీయనాయకుల్లో కొందరు, మానవహక్కులవాళ్ళు ‘అజేయ’కి యెలాగైనా న్యాయం జరగాలని భావించటమే కాదు చాల రకాల ప్రొటెస్ట్లు చేసారు. చేస్తునే వున్నారు.

ముఖ్యంగా ఆ రోజు యీ కేస్‌ని దగ్గరుండి పర్యవేక్షించడానికి వచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ ముఖం యెంతో గంభీరంగా వుంది. యెంతో సౌమ్యంగా మాట్లాడారు. అతను వాళ్ళని పట్టుకొంటారనిపించింది. ఆ పోలీస్‌ ఆఫీసర్‌ వాళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుదలగా పని చేసారు కూడా. అంతే కాకుండా చాలా సపోర్టివ్‌గా వున్నారు. కాస్త ధైర్యంగా అనిపించింది యింట్లో అందరికి.

యిలాంటి సంఘటనలు జరిగినప్పుడు టివిల్లో కొంతమంది ప్రముఖులు స్త్రీల వస్త్రధారణ, అమ్మాయిలు వొంటరిగా బయట తిరగటం, రాత్రి పూట బయటకి వెళ్ళటం లాంటి వాటి మీద చర్చించిన్నట్టే అప్పుడూ చర్చలు జరిగాయి. అమ్మాయిలు వేసుకొనే బట్టలు సరిగ్గా లేకపోవటం వల్లే యిలాంటివి జరుగుతున్నాయి అని కొంతమంది అతితెలివితక్కువగా చాలా ఛీప్‌గా మాట్లాడేస్తున్నారు. నగ్నంగా వాళ్ళ ముందు నిలబడాలనిపించింది. నగ్నదేహం నేరస్తులని తయ్యారు చేస్తుందా… విక్టిమ్స్నే నేరస్తులుగా చూపించే యీ మనస్తత్వాలు యెప్పటికి మారవా…

నా మీదకి యెందుకొచ్చారా మూర్ఖులు. అసలు వాళ్ళ మనసుల్లో యేముందో యెందుకిలా ప్రవర్తిస్తున్నారో.

ఆ సంఘటన జరిగిన రోజు నన్ను చూడ్డానికి వచ్చిన మానవహక్కుల లాయర్‌ జివి ఆ తరువాత కూడా కలుస్తుండేవారు. అతనిలోని స్నేహ స్వభావం చాలా కంఫర్టబుల్‌గా వుండటంతో చాలా విషయాలు షేర్‌ చేసుకొనేదాన్ని.

ఆ సంఘటన జరిగాక పెదవులపై గాట్లు, యెక్కడ చూసిన పళ్ళవో గోళ్ళవో గాట్లు. సర్జరీలు. బాడీలో యిన్‌ఫెక్షన్‌ తగ్గిస్తాయంటూ యాంటిబయోటిక్స్‌. శరీరం మీద మానిన గాయల మచ్చలు. యింకా మానని పచ్చి గాయాలెన్నో వీపు మీద వున్నాయి. గర్భాశయాన్ని శాశ్వతంగా కోల్పోయిన సర్జరీ నొప్పి సలుపుతునే వుంటుంది మధ్యమధ్యలో. మనసంతా మంటగాడ్పులు.

వాళ్ళకి యెటువంటి శిక్ష వేస్తారు. యే శిక్ష దీనికి సరియైనది. చాలామంది వురిశిక్ష అంటున్నారు. అవును వురిశిక్షే కరెక్ట్‌.

ముద్దుగా పెంచుకున్న కూతురు, కొత్తగా వుద్యోగంలో చేరాక మొదటి జీతం తీసుకొన్నాక ఫైవ్‌స్టార్‌ హోటల్‌కి డిన్నర్‌కి తీసుకెళ్లిన కూతురు, బుద్దిమంతుడు, ప్రయోజకుడైన చైతన్య ప్రేమిస్తే అతన్నే తన జీవిత భాగస్వామిగా యెంచుకొన్న కూతురు, అసలు యెప్పుడైనా యింత చిన్నపాటి హింసను కూడా యెదుర్కొంటుదని వూహించనైనా వూహించని అమ్మానాన్న నిశ్చేష్టులై దుఃఖం ఘనీభవించిన రాతికొండలైనారు. చెల్లెలు డిసెంబర్‌ నాటి చామంతిపువ్వులా గజగజా వణికిపోయిందట.

నా కుటుంబాన్ని అత్యంత బాధకి గురిచేసిన వాళ్ళకి యెలాంటి శిక్ష వేయాలి.

యీ సంఘటన జరిగిన ఐదు నెలల తర్వాత ఆ రోజు నేను, చైతన్య కబుర్లు చెప్పుకొంటూ మెల్లగా నడుస్తున్నాం. అతను చెపుతోన్న జోక్స్కి నవ్వుతోంటే ‘యెంత చక్కని నవ్వు’ అంటూ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోయాడు. నిలువెల్లా వణికిపోతూ అతన్ని వొక్కతోపు తోసేసాను. నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక షాకయ్యాను. నిజంగా నాకిప్పటివరకూ తెలియనే లేదు మగస్పర్శకి నా శరీరం యింత వైల్డ్గా రియాక్ట్‌ అవుతుందని. కంపించిపోయాను.

నాకు తెలియకుండానే నాలో యింత భయాన్ని నింపిన వాళ్ళకి యే శిక్ష వేస్తే నా భయం పోతుంది.

వాళ్ళని చూడాలనిపించిందోసారి. యెలా వుంటారు వాళ్ళు. పోలీసుల మధ్యనా కోర్టులో శిక్ష పడబోయే ముందు వాళ్ళ ముందుకెళ్ళి నిలబడిన నన్ను చూస్తే వాళ్ళకి అప్పుడూ అలాంటి పైశాచికత్వమైన ఆలోచనలే వస్తాయా.

అలాంటి దుర్మార్గమైన కోరికలే పుడతాయా. అప్పుడు వాళ్ళ కళ్ళు యెలా వుంటాయి. ఆ వికటాట్టహాసాలుంటాయా. అలానే బూతులు మాట్లాడతారా. యిద్దరు కాళ్ళు చేతులు పట్టుకొంటే మరొకరు శరీర విధ్వంసానికి పాలుపంచుకొన్నట్లు వాళ్ళు యిప్పుడు అలానే వొకరినొకరు వుసిగొల్పుకొంటూ వెకిలినవ్వులు నవ్వుకొంటారా.

వాళ్ళని చూడాలని వుందని పోలీసు ఆఫీసర్ని అడిగితే ‘‘యెప్పుడు చూస్తారు. కావల్సిన అరేంజ్‌మెంట్స్‌ చేస్తాను. కానీ వాళ్ళు వొప్పుకోవాలి మిమ్మల్ని కలుసుకోటానికి’’ అన్నారు.

విచ్చుకత్తుల్లా నాపై విరుచుకుపడిన వాళ్ళ కళ్లల్లో రవ్వంతైనా భయాన్ని చూడగలనా? ఆ రోజు నేను చేసిన ప్రాణ పోరాటం వాళ్ళకి గుర్తొస్తుందా?

వాళ్ళని కలవాలని నేననుకొన్నాను కానీ వాళ్ళు వొప్పుకోలేదు. సో వాళ్ళని కలుసుకోలేకపోయాను.

వో రోజు జివితో మాట్లాడుతూ ‘‘మా నాన్నమ్మగారు యిప్పుడు నా జాతకంలో శని కూడా లేదే యిందుకిలా జరిగిందో, జాతకం రాసిన వాళ్ళు మహా జాతకురాలన్నారే… మరి యిదంతా యేంటి వాస్తు దోషమా… అసలు యే గ్రహం యింత ఆపదని తెచ్చిందాని మళ్ళీ జాతకాల వాళ్ళ చుట్టూ తిరుగుతోన్నారు. అమాయకురాలు’’ అన్నాను.

‘‘జాతకాలు వాస్తు అని తిరగటం అర్థరహితం. మీ మీద దాడి చేసిన వాళ్లు మొత్తం యెనిమిది మంది అని లెక్క తేల్చారు. వాళ్ళల్లో ఐదుగురు మైనర్స్‌. ముగ్గురు యిరవై యేళ్ళ లోపువారు. మీ మీద దాడి చేసినవాళ్ళందరికి దాదాపు యేదోవొక క్రిమినల్‌ హిస్టరీ వున్నా పోలీసు స్టేషన్‌లో వాళ్ళ మీద వొక్క కంప్లైంట్‌ కూడా లేదు. యెప్పట్లానే వాళ్ళకి అలవాటైన పద్దతిలో మీ మీద దాడి చేసారు. యింతకు ముందు చేసిన నేరాలన్నీ యిద్దరు ముగ్గురుగానో, వొక్కక్కళ్ళుగానో చేసారు. యిలా మొత్తం అందరూ కలిసి చేయడం మొదటిసారంట. వాళ్ళల్లోనే వొక కుర్రాడు తమ యింటికి దగ్గర్లోనే వుంటున్న వొక అమ్మాయితో పారిపోయి, ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి అతనొక్కడే వచ్చాడట. ఆమె యేమయిందో తెలియదు. ఆమె తరపు వాళ్ళు కేసు పెట్టటానికి భయపడ్డారంట. మరొకడు వొక అమ్మాయిని రెడ్‌లైట్‌యేరియాలో అమ్మేసాడట. ఆమె యింట్లో వాళ్ళు గొడవచేయబోతే, తెలిసిన వాళ్ళెవ్వరో ఆ విషయం మీద పోలీసు స్టేషనుకు వెళితే యేమోస్తుందని ఆ గొడవను సెటిల్‌ చేసేసారట’’ అని ఆగాడు జివి.

‘యీ కుర్రాళ్ళు విష సర్పాల్లా వున్నారే. ఆడపిల్లల జీవితాలని విషమయం చేసినప్పుడు యే కంప్లైంట్‌ లేకపోవటంతో వాళ్ళకి యే శిక్ష యిప్పటి వరకు పడలేదు. వాళ్ళకి యే మాత్రం పరిచయం లేని జీవితం మీద పడుతున్నప్పుడు దాని పర్యవసానం యేమిటో ఆ క్షణంలో వాళ్ళు వూహించుండరు. అసలు ఆలోచించే వుండరు. జీవితం అన్ని వేళలా సేఫ్‌పాసేజ్‌ని యివ్వదు కదా’ అనుకొంటూ ‘‘వాళ్ళుండే ప్లేస్‌ చూడాలని వుంది’’ అని అడిగాను.

కొంత తర్జనభర్జన తరువాత చైతన్యని మాతో రావొద్దని యెవ్వరికి అనుమానం రాకుండా వీలైనన్ని జాగ్రత్తలతో ముసుగు వీరురాలిలా వాళ్ళ యిళ్ళని బయట నుండి జివితో కలిసి చూసొచ్చాను.

‘‘ఆ గజిబిజి యిరుకేంటి. అన్ని విధాలా అందరి జీవన ప్రమాణాలు పెంచటానికి యెందుకు ప్రయత్నించవో యీ ప్రభుత్వాలు. పెరుగుతోన్న యీ విధమైన క్రూరత్వాన్ని తగ్గించే పరిస్థితులపై, విషయాలపై చూపెందుకు లేదో. యీ మొత్తంలో కొందరిని కొన్ని ప్రశ్నలు అడగాలేమో’’ అన్నాను జివితో.

‘‘అదే కదా సమస్యంతా. సమస్యలని గుర్తిస్తాయి కానీ పరిష్కరించటానికి వొక్క అడుగు ముందుకెయ్యవు ప్రభుత్వాలు. అంతేకాకుండా వొక ప్రాంతంలో వుంటున్న యువకులు అదే ప్రాంతంలో వుంటున్న స్త్రీలని యెన్ని రకాలుగా హింసించినా అది వార్త కాదు. దాని మీద చట్టం కన్నూపడదు. అలాగే అపార్ట్మెంట్లలోనో, గేటెడ్‌ కమ్యూనిటీల్లోనో లేదా యిండిపెండెంట్‌ యిళ్ళల్లోనో వుంటున్న పురుషులు వాళ్ళ యిళ్ళల్లో వుంటున్న స్త్రీల మీద కానీ లేదా అక్కడ వాళ్ళ యిళ్ళల్లో పని చేస్తోన్న స్త్రీల మీద కానీ యెన్ని అత్యాచారాలు చేసినా అవీ బయటపడవ్‌. స్త్రీల మీద హింస అన్నిచోట్ల వున్నప్పటికి యేవో కొన్ని సందర్భాల్లో తప్ప పేద యువకులు పైవర్గాలకి చెందిన యువతుల మీద దాడి చేస్తే మాత్రమే అవి అనేక సార్లు నేరాలుగా బయటపడుతున్నాయి. అందర్నీ కదిలిస్తున్నాయి. అవి మాత్రమే చాలాసార్లు వార్తలవుతున్నాయి. యిలా యెందుకుందో మనం ఆలోచించుకోవాలి’’ అని జివి అన్నాడు.

యెవరి సమస్యో యెవరి అలసత్వమో కానీ అన్యాయంగా నా జీవితాన్ని దుఃఖమయం చేసేసారు.

వో రోజు ‘కేసు మొత్తం ఫర్‌ఫెక్ట్గా ఫైల్‌ చేసాం. మీకు న్యాయం జరుగుతుందమ్మా’ అని పోలీసులు, లాయరూ ఫోన్‌లో చెప్పారు.

న్యాయం అంటే యేంటో… యేమవుతుంది… మైనర్లకి యేం శిక్ష పడుతుంది.

వాళ్ళెవ్వరు వొక్క క్షణం కూడా నాతో మనుష్యుల్లా ప్రవర్తించలేదు. మైనర్స్‌ అంటూ వాళ్ళకేదో చిన్న శిక్ష వేస్తారు కానీ వాళ్ళు యెంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ముఖ్యంగా అందరి కంటే చిన్నవాడు వాడేగా ముందు తనపై కలబడిరది. ‘జీరో సైజ్‌ కాదురా…’ అంటూ వాడు తన తొడల మధ్య కూర్చుని రెండు చేతుల్తో గట్టిగా తన బ్రెస్ట్‌ కర్కశంగా నొక్కుతూ మిగిలిన వాళ్ళని వొకసారి నొక్కమని, వాడు యెన్నెన్ని బూతులు పేలాడు. వాడా బాలుడు! మిగిలిన మైనర్స్‌ యెంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు. వాళ్ళకి యేం శిక్షలు వేస్తారు. అన్ని రకాల నీచత్వాలకి యెంతో తొందరగా యెక్స్పోజ్‌ అయిన యీ మైనర్స్‌ యింత దుర్మార్గంగా ప్రవర్తిస్తే వాళ్ళు మైనర్స్‌ యేంటి…

‘‘యీ రోజు నేనిలా నా వోవరీస్‌ని నా గర్భసంచిని కోల్పోయానంటే ఆ రోజు ఆ మైనరేగా కారణం. వాడు తన తోటివారిని ప్రేరేపిస్తూ తనలోకి వాడి చేతులతో యెంత క్రూరంగా ప్రవర్తించాడో చూస్తున్న చైతన్యకి స్పృహే తప్పిపోయింది. అవును వాళ్ళంతా యెంచక్క కొద్ది శిక్షతో తప్పించేసుకొంటారు. బాధాకర పరిస్థితుల్లో బాల్యం కోల్పోయిన పిల్లలు ఆకలితో అబద్ధం చెప్పటం, దొంగతనం చేయ్యటం, తమని తాము కాపాడుకోవటానికి దాడి చేయ్యటమో, హత్యలు చేయ్యటమో వేరు. నా మీద జరిగింది అది కాదు కదా. అందరు మాట్లాడుతున్నట్టు వాళ్ళ హక్కుల గురించి భయంకరంగా హింసించబడినదాన్ని నేమాట్లాడలేను జివి’’ అన్నాను.

అతను శ్రద్ధగా వింటున్నారు.

‘‘వాళ్ళకి యేం శిక్ష పడాలనుకొంటున్నాను… కాసేపు మరణశిక్షనుకొంటాను. మరి కాసేపట్లో వాళ్ళ ముఖాలపై వుమ్మాలనిపిస్తుంది. వాళ్ళు జీవితాంతం జైల్లో వుండాలనుకొంటాను. కాస్ట్రేరేషన్‌. మరికాసేపు వాళ్ళని నాకు న్యాయం జరగాలని కోరుకొంటున్న వాళ్ళకి అప్పచెప్పాలనిపిస్తుంది… వాళ్ళని మా పేరెంట్స్కి అప్పచెప్పితే… నా మూడ్స్‌ బట్టి వాళ్ళకి యెలాంటి శిక్ష పడాలని నేను కోరుకొంటున్నానన్నది మారిపోతోందని అర్థమవుతోంది. యేం శిక్ష పడితే బాగుంటుందని కోరుకుంటున్నానో వారి గురించి యేమనుకుంటున్నానో తెలుస్తుంది కదా స్కాన్‌లో. నా మనసుని స్కాన్‌ చేస్తే బాగుండును. వాళ్ళకి వేసే శిక్షతో నాకు జరిగే న్యాయమేమిటో…

నన్ను నిలువెత్తు సంజాయిషీగా నలుగురు మధ్య నిలబెట్టినవాళ్ళకి యే శిక్ష సరిపోతుంది. వేసిన శిక్ష నుంచి విముక్తులైన వాళ్ళు ఆ తరువాత తమ జీవితమంతా సంజాయిషితో మాట్లాడతారా? యేమో…

“యే శిక్ష వేస్తే నా యీ కలల విధ్వంసానికి న్యాయం జరుగుతుంది జివి’’ అని అడుగుతుంటే అతను నా రెండు చేతుల్ని చేతుల్లోకి తీసుకొని ‘‘ప్లీజ్‌ కూల్‌డవున్‌… ఐ కెన్‌ అండర్‌ స్టాండ్‌. రేప్‌ చట్టంలో వచ్చిన దాదాపు ప్రతి లా, లేదా చేసిన సవరణలు కానీ, అవి భన్వారీ దేవి కేస్‌, మధురా కేస్‌ యిలా వొక్కో విక్టిమ్‌ పడిన క్షోభ వల్లే వచ్చాయి. ‘నిర్భయా’ తరువాత వర్మ కమీషన్‌ చేసిన సిఫార్సులు చాల ముఖ్యమైనవే. మన చుట్టూ వున్న పరిస్థితుల్ని ముఖ్యంగా చిన్నపిల్లల మనసులని కలుషితంచేసే అనేక రకాల కాలుష్యం యీ సమాజంలోకి యెక్కడ నుంచి వస్తుందో మీరు అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. యీ న్యాయాన్ని పనిష్మెంట్ని చూసే పద్ధతి కావొచ్చు, లేదా ముఖ్యంగా మీరు మీ పరిస్థితిని మీ పెయిన్ని వొక అండర్‌స్టాండింగ్‌తో డీల్‌ చేయ్యటానికి మీకు తోడుగా నిలిచే పుస్తకాల్లో నాదగ్గరున్న కొన్నింటిని వెంటనే పంపిస్తాను. మిగిలినవి మెల్లగా పంపుతాను’’ అన్నారు జివి.

బాలగోపాల్‌ గారి కొన్ని పుస్తకాలు పంపిస్తూ ‘‘యీ పుస్తకాలు చదవండి. యీ సమాజంలోని హింసకి సంబంధించిన విషయాలని అర్థం చేసుకోడానికి యివి వొక టార్చ్లైట్‌గా మీకు వుపయోగపడతాయి’’ అని రాసి పంపారు.

యెన్నాళ్ళు యింట్లో వుంటాను. ఆఫీసుకి వెళతానన్నాను. అమ్మ వొప్పుకోలేదు. తరువాత అయిష్టంగానే అక్కడ వద్దులే మరో కొత్త చోట జాయినవ్వమంది. కొత్త చోటైనా ముందు చేస్తున్న వుద్యోగం యెందుకు మానేసానో చెప్పాల్సి వుంటుంది కదా.

యిక్కడైతే విషయం తెలిసిన మనుషులు. అమ్మని కన్విన్స్ చేసి వుద్యోగానికి వెళ్లిపోయాను. వాళ్లంతా నన్నెంతో కంఫర్టబుల్‌గా వుంచారు. కానీ ఆ యెక్స్ట్రా కంఫర్ట్లో యేదో యిరుకు. వాళ్ళు నాతో సరిగ్గా లేకపోతే వాళ్ళని మీడియా కానీ మిగిలిన వాళ్ళు కానీ యేమైనా అంటారనే ఆ యెక్కువ కన్సర్న్. నేను యెప్పటికి అక్కడ అందరిలాంటి వుద్యోగస్తురాలిని కాలేనా. కొత్త వుద్యోగం వెతుక్కోవలసిందేనా. అంతే కాకుండా యెందుకో అస్తమానం కోపం వస్తుండేది. యింతకు ముందు యిలా వుండేది కాదు. అప్పుడప్పుడు ఆఫీసుకు వెళ్లాలనిపించేది కాదు. మధ్యమధ్యలో యెవరైనా యీ కేస్‌ విషయం అడుగుతారేమోనని అలజడిగా వుండేది. డాక్టర్‌గారికి నా మూడ్‌ స్వింగ్స్‌ చెప్పాను. వొకటి జరిగిన దాడి చిన్నదేం కాదు. అంతే కాదు. హార్మోన్‌ల డెఫిషిన్సీ. వాళ్ళని చాచి కొట్టాలన్నంత కోపం వచ్చింది.

నాలో మానసిక ఘర్షణని లావాలా రగిలించిన వాళ్ళకి యే శిక్ష వేయ్యాలి.

వాళ్లకి శిక్ష ఖరారు కాబోతుందని తెలిసినప్పట్నుంచి నా మనసంతా అలజడి. సంఘర్షణ. విపరీతమైన నిర్లిప్తత. రేపే వాళ్లకి శిక్షలు పడబోతున్నాయి. జరిగే అన్యాయాలకి సరిపడే శిక్షలు వుండవేమో. అసలు శిక్ష అంటే యేమిటో!?

చిన్నప్పుడు స్కూల్లో టీచర్‌ క్లాస్‌ జరుగుతున్నప్పుడు మాటాడితేనో ప్రోజెక్ట్‌ వర్క్‌ చేయ్యకపోతేనో యిచ్చే పనిష్మెంట్‌కి భయపడి అలాంటి పొరపాట్లు తిరిగి చెయ్యని వాళ్ళుండేవారా? యేమో! అసలు తనెప్పుడైనా పనిష్మెంట్‌కి బెదిరిందా. అసలు హింసకి తావులేని పరిస్థితులుండాలేమో. అప్పుడు యెవరిని వురితీయాలా వద్దా జీవిత ఖైదా యిలాంటి చర్చలుండవేమో.

మళ్ళీ ఫోన్‌ వైబ్రేషన్‌ రమ్మంటుంది. అక్కడ్నుంచి మెల్లగా యింటి వైపు బయలుదేరాను.

లిఫ్ట్‌ దగ్గర నాల్గో ఫ్లోర్‌లో వుంటున్న రిటైర్డ్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ రామనాధంగారు కనిపించిన ‘‘రేపు వర్డిక్ట్‌ కదా. న్యూస్‌లో చెపుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌. గాడ్‌ బ్లస్‌ యూ మై ఛైల్డ్‌’’ అన్నారు.

…..

వుదయం నుంచి యింట్లో న్యూస్‌ ఛానల్స్లోని హింది, యింగ్లీషుల్లో కలగాపులగంగా న్యూస్‌ వినిసిస్తూనే వుంది. రిమోట్‌పై నాన్నగారి చెయ్యి కదుల్తూనే వుంది. తాతగారు టివి ముందు నుంచి కదలటం లేదు. అమ్మ వంట చేస్తూ, పూజ చేస్తూ, పూజ చేస్తూ వంట చేస్తూనే టివి వైపు కళ్లు పడేస్తూ అప్పుడప్పుడూ శరీరాన్ని టివి ముందుకు తీసుకొచ్చేస్తోంది. వాళ్లందరి మధ్యలో తన సెల్‌ఫోన్స్లో చాట్‌ చేస్తూ అక్కడే కూర్చుంది చెల్లాయి.

‘‘కాస్త యెక్కువ డికాషన్‌ వెయ్యమ్మ… యెవరోవొకరు వచ్చిపోతుంటారు’’ అమ్మ చెపుతోంది అమ్మమ్మకి.

‘‘అందరూ కాఫీ తాగరేమో… కాస్త మజ్జిగ కూడా కలిపుంచుతాను’’ అంది నాన్నమ్మ అమ్మతో.

యెక్కడెక్కడినుంచో ఫోన్‌కాల్స్‌ అందరికి వస్తునే వున్నాయి.

యింకా అప్పుడేనా… మధ్యాహ్నానానికి వస్తుందేమో… సిఎన్‌ఎన్‌ పెట్టు వాళ్లు బాగా కవరేజ్‌ యిస్తున్నారు. ఎన్‌డిటివి కూడా బాగా చెపుతున్నారు. సరైన న్యాయం జరగకపోతే అరుణోబ్‌ వుతికి ఆరేసేస్తాడు. యేబియన్‌, టివి9 యెక్స్క్లూజివ్‌… అంటూ యేవేవో మాటలు వినబడుతున్నాయి.

“అందేటి మరీ యిలా మిలమిలలాడే డిజైన్‌ చీర వేసుకొచ్చావ్‌. కాస్త మామూలుది కట్టుకోపోయావా”… యింటికి వచ్చిన వాళ్ళని మరెవరో అడుగుతున్నారు.

“నా దగ్గర అలాంటివి లేవ్‌…”

“మొన్న పెద్ద అమ్మమ్మగారింటికి పూజకి కట్టుకొచ్చావ్‌ కదా”… సలహాలు వినపడుతున్నాయి.

“టివి వాళ్లు వస్తారేమో… కాస్త షేవ్‌ చేసుకో” అంటున్నారెవరొ.

“ముఖం చూపించరుగా” అన్నారెవరో.

“అమ్మాయిది చూపించరు… తండ్రిగా నీ అభిప్రాయం అడుగుతారు కదా” చెపుతున్నారెవరో.

అనేకానేక మాటలు పూర్తిగానో అస్పష్టంగానో వినపడుతున్నాయి.

యీ హడావిడిలో వుండగా చైతన్య, అతని పేరెంట్స్‌ వచ్చారు.

‘‘మీతో యీ విషయం మాట్లాడమని యెప్పట్నుంచో చైతన్యకి చెపుతున్నాం. యిప్పుడుకాదు యిప్పుడు కాదని పోస్ట్పోన్‌ చేస్తున్నాడు. జరిగిన దాంట్లో అమ్మాయికే ప్రమేయం లేదని తెలుసు. కానీ చూస్తుచూస్తు యీ పెళ్ళి చెయ్యలేం. కాన్సిల్‌ చెయ్యక తప్పటం లేదు. యివాళ వుదయం నుంచి మీడియా అంతా కవరేజ్‌ యిస్తూ ‘అజేయ’ స్నేహితుడు అంటూ చెపుతున్నారు. అంతకు ముందు కూడా చెప్పారనుకోండి. యీ రోజు వాళ్ళు యేమైనా వీళ్ళ ప్రేమ పెళ్ళి గురించి అడుగుతారేమో. అందుకే సందర్భం కాకపోయినా యీ టైమ్‌లో వచ్చి చెపుతున్నాం. క్షమించండి. వాళ్ళిద్దరు స్నేహితులనే చెప్పండి. పెళ్ళి వద్దనుకున్నామని యెవ్వరికి చెప్పకండి. దయచేసి యీ విషయం మీడియా దృష్టికి తీసుకెళ్ళవద్దు. మమ్మల్ని నానామాటలంటారు’’ అని బాధపడుతూ చెప్పారు చైతన్య వాళ్ళ అమ్మగారు.

చైతన్యని నా గదిలోకి రమ్మన్నాను.

నులివెచ్చని టెక్ట్స్‌ మెసేజ్‌లు, గిలిగింతల సాయంకాలాలని, మా కలలపూబంతుల తోటల్ని, కనకాంబరప్పూల్లాంటి ముద్దులని అప్పుడేం చైతన్యకి గుర్తు చేస్తాను? చెయ్యాలనీ అనిపించటం లేదు. అసలు చైతన్య యెప్పుడొవొకప్పుడు యీ ప్రస్తావన తెస్తాడనే ఆలోచనే నాకెందుకు రాలేదో. పరిస్థితులను బట్టి ప్రేమలు మారిపోతాయ్‌ కదా. అయినా నా మనసెందుకిలా దుఃఖకెరటమవుతోంది. అతనేం అనుకొంటున్నాడో తెలుసుకోవాలనిపించింది.

‘‘యేం యెందుకొద్దనుకుంటున్నావ్‌ చేతు’’ అంతు లేని వుద్వేగం నా స్వరంలో యెంత వద్దనుకొంటున్నా.

‘‘అమ్మకి అస్సలు యిష్టం లేదు. నీ స్నేహం వదులుకోవాలని నాకేం లేదు. కాని అమ్మ పెళ్ళికి వొప్పుకోవటం లేదు’’ అన్నాడు.

కాస్త నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్శబ్దంగా వుండి ‘‘చేతూ, మనకి యిష్టంలేని వాటినో లేదా మనం హేండిల్‌ చేయ్యలేనివాటినో మనకే యిష్టం లేదని, అంత శక్తి లేదని చెప్పడానికి జంకుతాం. అప్పుడు మనం మన పేరేంట్స్‌ మీదకి ముఖ్యంగా అమ్మల మీదకి నెట్టెయ్యడం యేం కొత్తకాదు. నీ దృష్టిలో నేనిప్పుడు స్నేహితురాలిని. అంతేగా నువ్వు చెపుతోంది. కానీ యిప్పుడు యీ రోజెందుకు చెపుతున్నావ్‌… పెళ్ళిపీటల మీదకి వెళ్ళడానికి ముందు సినిమాల్లో పెళ్ళికూతురు యింట్లోంచి పారిపోయినట్టు. నువ్వు నీ పరువుకి అదీ మీడియా యేమంటుందోనని భయపడుతున్నావా… నా జీవితంలో యింత జరిగాకా నీతో మాట్లాడకుండా నేనైనా, యింట్లో వాళ్ళైనా మీడియా వాళ్లు అడిగినా పెళ్ళి ప్రేమ విషయమెందుకు చెపుతాం? ఆ రోజు సంఘటన జరిగినప్పుడు కూడా నువ్వు స్నేహితుడనే అన్నారు నాన్నగారు. కానీ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని కానీ పెళ్ళి సెటిల్‌ అయ్యిందనీ యివేం చెప్పలేదు… అసలు మనిద్దరం వొకరినొకరం బాగ అర్థం చేసుకోలేదనుకొంటాను. ముద్దుల గిలిగింత యెలా వుందో చెప్పుకోవల్సిన వయసులో మనం గాయాల జలదరింపుని పంచుకొంటున్నాం. ఐ అండర్‌ స్టాండ్‌ చేతు’’ నిదానంగా అతని కళ్ళ వైపు చూస్తు అన్నాను.

చిత్రంగా అతని కళ్ళల్లో బాధ లేదు. గొప్ప రిలీఫ్‌ని చూసాను. అంటే… అతను నేనంటే యెంత బర్డన్‌గా ఫీలవుతున్నాడో నాకాక్షణంలో సమూలంగా అర్థమయింది. ఆంబోతులతో కలబడగలను అన్న మనిషి యేం చేయలేని నిస్సహాయస్థితిలో ఆ రోజు వుండిపోవలసి రావడం అతన్ని యెంతగా గాయపర్చిందో దాన్నుంచి కోల్కోడానికి అతనికి సహాయపడగలిగిన వాళ్ళు యెవ్వరో, యిద్దరు తీవ్రంగా గాయపడిన వ్యక్తులు వొకరికొకరు ఆసరాగా నిలబడగలగాలని ఆశించడం పొరపాటేనేమోననిపించింది.

‘‘వోకే చేతు… నో బిట్టర్‌నెస్‌’’ అన్నాను.

అతను నా గదిలోంచి బయటకి వెళ్ళిపోయాడు.

అప్పుడు యేడ్చాను చాలా రోజుల తరువాత. హోరున కన్నీళ్ళు కార్తూనే వున్నాయి.

నా ప్రేమ తీగల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేసిన వీళ్ళకి యేమి శిక్ష వేస్తే నా ప్రేమ మళ్ళీ వేళ్ళూనుతుంది?

నేనేం చేసాను. ఆ శారీరక అత్యాచారం తరువాత నా జీవితంలో ప్రతీది మారిపోయింది. యిదేంటి ఆ భాగమూ శరీరమే కదా. శరీరంలో యే భాగమైనా వొక యాక్సిడెంట్‌కి లోనైతే చుట్టూ వున్న వాళ్ళు యిలా యింతగా అత్యంత స్పెషల్‌ కేటగిరి మనుష్యుల్లా చూడరు. యీ వొక్క యాక్సిడెంట్‌లో మాత్రమే యిలా చూస్తారని నాకర్థమయింది. చుట్టూవారిలో యింత తలక్రిందుల అయోమయ ప్రవర్తనా వుండదు. యిది నా అనుభవం. అంతా క్యాలిక్యులేషనే. అంతా అంతే.

గదిలోంచి బయటకి వచ్చాను.

‘‘యిలా యెలా ప్రవర్తిస్తారు. యిదే పెళ్ళయ్యాక జరిగితే యిలానే వదిలేస్తారా. యింత జరిగినా చైతన్యతో పెళ్ళి అవుతాదని కాస్త ధైర్యంగానే వున్నాను. జీవితంలో నీకు తోడుకి ఢోకాలేదనుకొన్నాను. యిప్పుడెలా’’ కోపం బాధా ఆందోళన కలాగాపులగంగా కలిసిపోయిన గొంతుతో అంది అమ్మ.

చెమ్మగిల్లిన యెరుపుతో నాన్నగారి చూపులు బెంగటిల్లుతోన్నాయి.

‘‘వీళ్ళు చేసిన యీ అన్యాయాన్ని అర్ణాబ్‌గోస్వామికి చెపితే వీళ్ళకి బాగా గడ్డి పెడతాడు’’ అరుస్తోన్నారు తాతగారు.

‘‘టీవి9 వాళ్ళకి చెప్పేద్దాం’’ అంటోంది నాన్నమ్మ.

‘‘యేం అక్కర్లేదు మా పక్కింటతను యేబియన్‌లో జర్నలిస్ట్‌. వోపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ప్రోగ్రామ్‌కి పిలవమని చెపుతాను’’ అంటోంది పిన్ని.

యిలా పెళ్ళి కాన్సిల్‌ అవ్వటం యింట్లో దాదాపు అందర్ని బాగా అధైర్యానికి లోను చేసిందని అర్థమవుతోంది. వాళ్ళకి యేం శిక్ష పడుతుందనే టాపిక్‌ మర్చిపోయి వెంటనే అందరూ అసలు యీ పిల్లకి జీవితాంతం పెళ్ళి కాదనే దిగుల్లో కూరుకుపోయారు. టివిల్లోని బ్రేకింగ్‌ న్యూస్‌లా యిప్పుడు మా లివింగ్‌ రూమ్‌లో యీ పెళ్ళి కాన్సిల్‌ న్యూస్‌ పూర్తి బేంగ్‌తో మోగుతోంది.

‘‘యెంత ప్రేమగా వుండేవాడు. నా కోడలని ఆవిడెంత ప్రేమగా అనేవారు. యిలా యెలా చేస్తారు’’ వాపోతోంది అమ్మ.

‘‘హైపోధెటికల్‌ ప్రశ్న. యింత జరిగేక కూడా చైతన్య నన్ను పెళ్ళి చేసుకోవలని ఆశించటం మనది అత్యాశేననిపిస్తోంది. అయినా నువ్వు నా అమ్మలా కాకుండా చైతన్య పేరెంట్స్లా వొకసారి అలోచించు. అప్పుడు నువ్వెలా ప్రవర్తిస్తావమ్మా’’ అని అడిగాను.

‘‘సారీ… అమ్మని కదా. పోతే పోనీ వెతికివెతికి అంత కంటే గొప్ప మనసున్నవాడితో నీ పెళ్ళి చేస్తాం’’ నేనెక్కడ పెళ్ళికాదని భయపడుతున్నానోనన్నట్టు కంగారుగా అంది అమ్మ.

‘‘సారీ యెందుకులే. నా విషయంలో నువ్వు అమ్మవి కదా’’ అన్నాను.

అసలేం జరగనట్టు అంతా మామూలుగానే వుందనే యింప్రషన్‌ యివ్వడానికి అంతా యెవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. తిరిగి టివి చూసేవాళ్ళు చూస్తున్నారు.

రిమోట్‌ తిప్పుతూ ‘యేంటో యీ వరదలూ’ అంటున్నారెవరో. ఛానల్‌ తిప్పగానే ‘అది పెట్టండి’ అన్నాను.

పెట్టారు.

మహాధృతమైన వరద. వొక నడివయస్కుడు వొక చెట్టుపై బలహీనమైన చిటారుకొమ్మన నిలబడి యెలాగైనా తన ప్రాణాలని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జిల్లా యంత్రాంగమంతా శతవిధాలా అతన్ని కాపాడటానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడికి చేరుకోవటం కష్టంగా వుందని రిపోర్టర్‌ చెపుతున్నాడు.

అతనొక్కడే వొంటరిగా ప్రాణాలని కాపాడుకోవాలని సన్నని కొమ్మని పట్టుకొని వేలాడుతోంటే ఆ రోజు నేను చేసిన నా ప్రాణపోరాటం గుర్తొచ్చింది. యెందరో తోడు నిలిచారు. కానీ హింసని నేను మాత్రమే అనుభవించాను పళ్ళబిగువున. ముందుముందంతా నాకు నేనుగా నిలబడాలి.

‘‘మైనర్లకి యెలానూ పెద్ద శిక్ష వేయలేరు. మిగిలిన వాళ్ళకైనా వు…’’ యేదో ఛానల్లో ఫోన్‌ యిన్‌ ప్రోగ్రామ్‌లో మాటాడుతోన్న నాన్నగారి చేతిలోని ఫోన్ని కట్‌ చేసేసాను.

“యేంటి యెందుకు కట్‌ చేసావ్‌” కంగారుగా అన్నారు నాన్నగారు.

‘‘వురిశిక్ష వేయ్యాలని కోరుకోకండి’’ అన్నాను.

అయోమయంగా చూస్తున్న నాన్నగారిని పట్టించుకోకుండా బయటకి వెళ్ళబోతోంటే ‘యిప్పుడెక్క…’ అమ్మ మాటలన్ని మింగేసింది.

‘‘పార్క్‌ వరకు’’ అన్నాను.

‘‘స్కార్ఫ్‌ మర్చిపోయావ్‌’’ అమ్మమ్మ గుర్తుచేసింది.

చెల్లెలు వొక్క వుదుటన వెళ్ళి తీసుకొచ్చి యిచ్చింది.

యిన్నాళ్ళు యిలాంటి స్కార్ఫ్ లని ముఖానికి చుట్టుకొని తిరుగుతున్నాను బాహ్య ప్రపంచానికి నా ముఖం చూపించకుండా. చెల్లాయి చేతుల్లోని స్కార్ఫ్‌ని అమ్మ నా భుజం మీద వేసింది. బయటకి నడిచాను.

అత్యాచారం శిక్ష ప్రేమ ద్వేషం స్నేహం శతృత్వం వొంటరితనం మోహం కోరికలు మోహరహితం యింత చిన్ని జీవనంలో యెన్నెన్ని అనుభవాలని చూసేసిందో యీ లేలేత గుండె. భుజం మీద ఫారిన్‌బాడీ సెన్సేషన్‌ లేదేమిటాని చూస్తే కట్టుకోని స్కార్ఫ్‌ నా భుజం మీద నుంచి యెప్పుడు జారిపోయిందో నే గమనించనే లేదు.

నా మనసుని గాయపర్చారు. నా స్వప్నాలని వూచకోత కోసారు. కాని నన్ను నా ప్రాణంతో వదిలేసారు. నా రెండు అర చేతుల్ని అడ్డుపెట్టి నా యీ ప్రాణదీపాన్ని కాపాడుకొన్నాను. యీ గోరంత దీపం నా భవిష్యత్‌ కాలమంతటా జాజ్వల్యమానమవుతుంది.

*

 (‘నిర్భయ’, ‘అభయ’లా యీ కథలోని అమ్మాయికి పేరు కావాలని అడగ్గానే ‘అజేయ’ పేరుని యిచ్చిన డా॥ సి.మృణాళిని గారికి కృతజ్ఞతలు.)

Download PDF EPUB MOBI

Posted in 2014, కథ, డిసెంబర్ and tagged , , , , , .

28 Comments

 1. Padma garu you showed us all a wonderful and iconic personality in the form of Ajeya as an inspirational character which is good for today’s society -the thought process,the maturity levels ,strong and sensitive aspects ,the way she is looking into the problem with out any false inhibitions so on.
  I am here wondering why you couldn’t show us all the same with Chaithanya though he was helpless at that time.
  By giving us Ajeya,I think,You wish to improve all your readers thought process,and maturity levels and so on.
  Yes ,Ajeya needs a friend rather than a husband through out her life.What is Love ? Chaithu maybe helpless at that time but he could help her now,why can’t you allow this Character to be like Ajeya and set him as a role model?
  Every thing else in the story you presented is so good but I am a little bit disappointed with Chathany’s character.

 2. ఇంకా చెప్పుకొని బయటకురాని ఇలాంటి నేరాలు ఎన్నో? టీవీ న్యూస్ చానల్స్ వచ్చాక కొంత తెలిసినా తెలియనివి ఎన్నో? .మనం ఏమి చేయాలో ఆలోచించాలి? .వాళ్లకు సహాయం చెయ్యక పోయినా పర్వాలేదు. గద్దలా పొడవకుంటే చాలు .

 3. కథ కొంత వరకూ బాగుంది. ఒక రేప్ విక్టిమ్ బతికిపోతే, ఆమె పట్ల ఒక సమాజంగా మన రెస్పాన్స్ ఎంత హిపోక్రసీతో నిండిపోయుండగలదన్న విషయాన్ని బాగా హైలైట్ అయ్యింది.

  కాకపోతే, కథ చాలా గందరగోళంగా నడిచింది. first person narrationతో బాగానే మొదలైనా, మధ్యలో third person narrationకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. (ఉదా: కానీ నాన్నగారి ఆఫీసులో, తన ఆఫీస్‌లో, వుంటున్న అపార్ట్‌మెంట్‌లో, బంధువులకి విషయం వానాకాలపు ఫ్లూలా సరసరా పాకిపోయింది. తనింకా ఆ వుద్యోగంలో చేరి పట్టుమని రెండు నెలలు కాలేదు. – ఇక్కడ “…నా ఆఫీస్‌లో…, నేనింకా ఆ వుద్యోగంలో..” అని ఉండాలేమోగా!) మొదట్లో, ఆమె chaotic mindను పదాల్లో బాగా పెట్టగలిగినా, రానురానూ న్యూ రిపోర్ట్ గా మారిపోయింది కథనం.

  అలానే, ఆ చైతు కారెక్టరైజేషన్ చాలా ప్రాక్టటికల్‌గా, ఓ రకంగా ఎస్కేపిస్ట్ గా ఉంది. అలాంటివారు నిజజీవితంలో ఉండరని కాదు. కథల్లో ఉండకూడదని కాదు. అదే అతడి నైజం అయితే, ఈ కింది లైన్లు అంతగా అతకలేదు.

  “ఆంబోతులతో కలబడగలను అన్న మనిషి యేం చేయలేని నిస్సహాయస్ధితిలో ఆ రోజు వుండిపోవలసి రావడం అతన్ని యెంతగా గాయపర్చిందో దాన్నుంచి కోల్కోడానికి అతనికి సహాయపడగలిగిన వాళ్ళు యెవ్వరో. యిద్దరు తీవ్రంగా గాయపడిన వ్యక్తులు వొకరికొకరు ఆసరాగా నిలబడగలగాలని ఆశించడం పొరపాటేనేమోననిపించింది.”

  నెత్తి మీద రెండేసేసరికి కింద పడిపోయాడని అనేకంటే, అతడు ఆమెను కాపాడ్డానికి కొంచెం ప్రయత్నించినట్టు, ఎవరో వెనకి నుండి దాడి చేయడం వల్ల పడిపోయినట్టు చెప్పినట్టైతే, ఈ పై వాక్యాలు బాగుండేవి.

  “చెల్లెలు డిసెంబర్‌ నాటి చామంతిపువ్వులా గజగజా వణికిపోయిందట.” – ఇలాంటి వాక్యాలు నన్ను తికమకపెడతాయి. ఇది ఆమె స్వగతం. ఆమె మాటల్లో కథ చెప్తున్నప్పుడు, ఇలాంటి మెటాఫర్ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటి? అనేది నాకు అర్థం కాని విషయం.

  If there is any sort of progress of our society in handling rape victims, the very first step is to get rid of the need of these pseudonyms. నిర్భయ, అభయ, అజేయ లాంటి పేర్లు కాకుండా, విక్టిమ్స్ అసలు పేర్లే వినిపించే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను.

 4. ప్రియమైన స్నేహితులారా,
  యీ ‘అజేయ’ తమదేనని తామే రాసామన్నంత శ్రద్ధగా వారివారి భావాలని రాసి తమతమ వాల్ మీద పోస్ట్ చేసారు. కొంతమంది షేర్ చేసారు. కామెంట్స్ లో మరెందరో వారి స్పందనలని తెలియచేసారు. చాలామంది లైక్ చేసారు. ‘అజేయ’ ని వీలైంతగా మనమన FB ఫ్రెండ్స్ కి పరిచయం చెయ్యడానికి నిండైన ప్రయత్నం చేసారు.
  ‘అజేయ’ మనందరి హృదయాలలో తచ్చాడుతున్నఅలజడి. వేదన. ఆవేదన. యింత హింస జీవితాల్లో వుండకూడదని మనమంతా కోరుకుంటున్నాం.
  ‘అజేయ’ని ప్రేమగా మనసులకి హత్తుకొన్న ప్రతి వొక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. యీ కథని ప్రచురించిన కినిగ్ వారికి , మెహర్ గారికి కృతజ్ఞతలు.
  కథ గ్రూప్ వారికి ,సాహిత్యం గ్రూప్ వారికి ప్రత్యక కృతజ్ఞతలు.
  ‘అజేయా’ “నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను
  నా వొంటరితనంలో నీ స్పర్శ నాతో వుంది” అని చెపుతున్నాను.
  మీ,
  కుప్పిలి పద్మ.

  ps:”-” ఆ కవితా వాక్యం… ( రవీంద్రనాధ్ టాగోర్ ‘ఉత్తరణ ‘ – చలం )

 5. అబ్బ బాధాకరమైన మరో పాత కథేనా అనుకుంటూ చదివాను మొదటి సారి. పూర్తయ్యాక ఆహా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివాను. చాలా బాగుంది. వాళ్ళని క్షమించగలిగే స్థాయికి చేరిన ఆమె అజేయే… ఇక ఆమెని ఏదీ దరి చేరదు… అంటదు… నిజంగా ఆమె అజేయ. పద్మ గారూ… అభినందనలు.

 6. ఒక కథను కథలా కాకుండా గుర్తుండిపోయేలా రాసారు కుప్పిలి పద్మ గారు,అన్యాయానికి గురైన అమ్మాయి మనసును ఆ మనసు పడే వేదనా,సంఘర్షణలను అక్షరాల మధ్య పేర్చి ఇలా రాయడం గొప్పగా ఉంది,అనుకోకుండా ఒక హింసకు లోనైనప్పుడు ఆవ్యక్తి చుట్టూ ఉండే బంధాలు,సంబంధాలు,ప్రేమలు ఎటువంటి సంఘర్షణకు లోనవుతాయో వివరంగా ఆవిష్కరించడమే కాకుండా తిరిగి జీవితాన్నిఎలా పునర్మించుకోవచ్చో చెప్పిన “అజేయ”కి మనమంతా మన స్నేహాన్ని,ప్రేమని పూర్తిగా అందిద్దాం.ఇలా ఒక”నిర్భయ”ఒక “అభయ” ఒక “అజేయ” ఎదుర్కొన్నలాంటి హింసని ఈసమాజంలో ఏ స్త్రీ ఎదురుకోకుండా ఉండడానికి అటువంటి హింసాత్మకమైన ఆలోచనలతో నిండిఉన్నమెదళ్ళని పెకలించి వేయడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన బాధ్యత అందరిది.కుప్పిలి పద్మగారి మిగిలిన కథలలానే ఈ అంశంలో కూడా సున్నితత్వాన్ని మనసు పడే బాధను చక్కగా మలిచారు,అభినందనలు కుప్పిలి పద్మ గారికి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.