irlachengi kathalu

మా నాయినేసే పామ్మంత్రం

Download PDF EPUB MOBI

మా నాయిన మావూరికి సుట్టుపట్ల ఒక యాబై మైళ్ల దూరం దాకా, ఒకోసారి ఇంకా దూరం నుంచి కూడా వొచ్చినోల్లకు పామ్మంత్రమేసి బాగ జేసేటోడు. తేలుగుట్టినా, ఇంకేదైనా పురుగుముట్టినా గూడా మంత్రమేసి సచ్చేవోళ్లను గూడా లేపి కూసోబెట్టిన సందరబాలు ఎన్నో వుండాయి. అట్లా అని మా నాయన మాయలపకీరనుకొనేరు.

మా నాయన జేసే మంత్రం పనుల్లో ముక్కిమైంది. నీళ్లు మంత్రించడం, పురుక్కాటుకు మూడాది వారాలో, ఐదాది వారాలో నీల్లు మంత్రించిచ్చి బాగ జేస్తే పాము కాటుకు, తేలుకాటుకు మాత్రం అప్పిటికప్పుడే మంత్రమేసేటోడు.

మంత్రాల మింది నమ్మకం లేనోళ్లు గూడా వుంటారుగదా! అట్లాంటోళ్లు ‘మంత్రాలకు సింతకాయలూరాలవు – సీకి పూలు బంగారూ అయిపోదు. పదండ’ని సిత్తూరు డాట్టర్లదెగ్గిరికి బోయి ప్యానాలు పొగొట్టుకొనిన సందర్భాలు ఎక్కువేవుండాయి. పాము కర్సిన పిలకాయిల్ని పోగొట్టుకోని అంగలార్సినోళ్లు అట్లాంటోళ్లు ఎదురైనప్పుడు ‘మేం మిమ్మల్ని సెడిపేస్తావుండామనుకోని మామాటినండి. ఇసపురుగు కర్సినప్పుడు డాట్టరు మందులకు బాగయ్యేది అబద్దం. ఆ ఇంగ్లీసు మందులు వొంట్లోకి పొయ్యేసరికి ఇసం ఇకటించి ప్యానాలే పోతాయి. పలానా వూర్లో పలనా కోదండ రెడ్డుండాడు. రొండో ఆలోసన సెయ్యకుండా తొందరగా ఆయన దెగ్గిరికి తీసుకోనిపోండి. ప్యానాలకు డోకా వుండదు’ అని సెప్పిపంపేటోళ్లు. అట్ల మా నాయన పేరు మా జిల్లాలోనే గాకుండా అట్ల తమిళనాడు, ఇట్ల కర్ణాటక దాకా తెల్సిపోయింది. డాట్టర్లు గూడా అట్టాంటి కేసులేమైనా వస్తే ‘ముందాయన దెగ్గిరికి పోండ్రా నాయనా, మా ఇంగ్లీషు మందులు మింగి ప్యానాల మిందికి తెచ్చుకోకండి. బయలుదేరండి’ అని తరిమేటోళ్లు.

మంత్రం మగత్యమో, వాళ్ల అదురుస్టమో, ల్యాకుంటే దానికదే బాగయిపోయేదో తెలీదుగాని మానాయిని దెగ్గిరికొచ్చి బాగ్గాకుండా పొయినోళ్లేలేరు.

తేలు కాటుకొకరకం మంత్రం, పాముకాటుకొకరకం మంత్రం, జెర్రి గరిస్తే ఒకరకం మంత్రం ఇట్లా ఎన్నో మంత్రాలు తెలుసు మా నాయినికి. తేలుకాటుకు మా నాయినేసే మంత్రం తెలుసా? నోటిలో ఏం మంత్రం సెప్పుకొనేవాడో మాకెవురికీ తెలీదు. దానికి పాటించే చిట్కామాత్రం మా కందురికీ తెలుసు. మూడు పొరక పుల్లలు దీస్కోని తేలుకాటేసిన సోట్నించి మంత్రం సెప్పుకుంటా కిందికి దిగదీసేటోడు. తేలుకుడితే ఇసం పైకెక్కి బరించలేనంత నొప్పుంటాదా. ఆ నొప్పి అరగంటలో సేత్తో తీసేసి నట్లయిపొతాది. జెర్రికరిస్తే రాగెన్నుకాండ నమిలి ఆ సారం మింగమనేటోడు.

పాము కాటుతో వొచ్చిన మనిసిని ఒక నిముసంకూడా కూసోనిచ్చేటోడు కాదు. నడుస్తానే వుండాల. కూసుంటే ఇంగేమన్నా వుందా? ఇసం తలకెక్కి సచ్చిపోతారనే వాడు. నడ్సేటప్పుడు కొంత మందికి తలమింద రాయిబెట్టికోని తిరగమనేటోడు. నీళ్లు మంత్రించి నీల్లను తాగమని, ఇంటికి బొయినాక కూడా 28 గంటలు పండుకోగూడదని జాగ్రత్త సెప్పి పంపించేవోడు. ఉడుకుడుకన్నం పెడ్తే నిద్రొస్తాదని పెట్టొద్దనే వోడు.

పాముల్లో శానా వాటికి ఇసముండదంటారు. కానీ నాగుబాము కర్సిందంటే మాత్రం బతకతారనే ఆశ వుండనేవుండదు. ఒకసారి ఒక రొండేండ్ల పిలగాన్నెత్తుకోని గోయిందా, గోయిందా అని అర్సుకుంటా ముత్తరపల్లిలోని ఆండోల్లు మొగోల్లు అంతా పరిగెత్తు కోనొచ్చినారు. ఆ పిలగాడి ఒంటి నిండా కాట్లే. పిలగాడు వాకిట్లో కూసోని ఆట్లాడుకుంటా వుంటే బియ్యం గడిగి ఎసిట్లో ఏసొద్దామని వాళ్లమ్మ లోపలికి పోయిందంట. పాము ఎప్పుడొచ్చిందో ఈ పిలగాడు దాన్ని ఏం జేసినాడో ఆటబొమ్మనుకొని దాన్ని పట్టుకున్న్యాడో ఏమో ఆ యమ్మెచ్చే సరికి పాము వాన్ని సుట్టుకోని కాట్లేస్తా వుందంట. వాడు దాన్ని పెరకతా దాని తోక సేతికందగానే నోట్లో బెట్టుకుంటా – ఆ తల్లికి ఆ పాము బారినుంచి పిలగాన్ని ఇడిపించే దైర్నం ఎట్లావొచ్చిందో గెట్టిగా అరస్తా కేకలేస్తా పామును పెరికి దూరానికి ఇసిరేసిందంట. ఇంతలో జనాలు జేరినారు. పామును గూడ సంపేసినారు. కానీ పిలగాని వొంటిమింద ఒక ఇరవైదాకా కాట్లు.

ముత్తరపల్లి రాములక్క కొడుకు ‘ఏంజేస్తామ’ని ఎవుర్నీ అడక్కుడా ఒక సెనం కూడా ఆలోసించకుండా ఆ పిలగాన్నెత్కుకోని పరిగెత్తుకోనొస్తావుంటే వూరి జనం తెలిసినోల్లు తెలిసినట్లే ఎంటబడినారు.

ఆ పిలాగని దురదుష్టమనాలో ఏమో! ఆ సమయంలో మా నాయన ఇంట్లో లేడు. ఎద్దుల్ని మేపుకోనిరాను బాయికాడికి బొయ్యుండాడు. మా యమ్మ గూడా తట్టాకొడివిలి దీసుకోని సెరువుకిందికి బోయింది. గెడ్డి కోసం. నేనూ, మాయవ్వ ఇద్దురే వుండామింట్లో. ‘నాయనా బొయి మీ నాయన్ని పిల్సకరాబో’ అనింది మాయవ్వ. అప్పటికే అందురూ బాయి మొగం బట్న్యారు. నేను తెలివిగా గుండు జెంబు దీస్కోని వాళ్లెనక పరిగెత్తినాను.

గుర్రాల మిట్లోళ్ల సేనిలో బోతావుండా నేను. నాకంటే ముందు బొయినోళ్లు మర్రిమాను కాడుండే సెరువుకట్టను గూడా దాటేసినారు. ఎడంపక్క కన్నెత్తి సూస్తును గదా! కట్టేగాలవ పొడుగునా జనాలు బాయికాడికి పరిగెత్తతావుండారు.

నేను బొయ్యేసరికే పిలగాన్ని దించమని సూస్తా వుండాడు మా నాయన. వాడి నోట్లో నుంచి నురుగు బైటి కొస్తావుంది. మన తెలివి లేదు. ఆడంతా ఆలగోడు బాలగోడుగా వుంది. వాటి సుట్టూ వుండొద్దని దూరంగా పొండని ఒకరిద్దురు మొగోళ్లు అందర్నీ అదిలిస్తావుండారు. సెంబు దీసుకోని ఒగడు బొయి ఏకంగా బాయిలోకేదిగి నీళ్లు ముంచుకోనొచ్చినాడు. ఒకడు పక్కనే వుండే యాప్మానెక్కి ఒక కొమ్మ ఇంచుకోనొచ్చి మా నాయన సేతి కిచ్చినాడు. మా నాయన నీళ్లు మంత్రించి పిలగాని నోట్లో బోస్తే అది అంతా బయటికే వొస్తావుంది. పిలగాడు బతికి బట్ట కడతాడనే దైర్నం ఎవురికీ లేక పోయింది.

అట్లే 5 నిమసాల కొకసారి సెంబులో నీళ్లను నోట్లో పోస్తానే వుండాడు మా నాయన. అవి బయటికొస్తానే వుండాయి. మా నాయన కట్టుకోనుండే పంచినే చించి దాన్ని కొన్ని ముడులేసి మంత్రం సెప్పుకుంటా పిలగాని మెడలో ఏసినాడు. యాపాకు నీళ్లను వొళ్లంతా పూసినాడు. పిలగాడి సేతులొకర్ని కాల్లొకర్ని బట్టుకోని ఎత్తుకోమని ఉయ్యాల లూగించమన్న్యాడు.

సూస్తా వుండంగానే నోట్లో నురుగు రావడం పూర్తిగా తగ్గిపోయింది. పానం బొయిందేమోనని వాళ్లమ్మకు అనుమానం. మాటిమాటికి పిలగాని నాడి బట్టుకోని సూస్తాదాయమ్మ. ముక్కుకాడ ఏలుబెట్టి ఊపిరాడతావుండాదా లేదా అని గమనిస్తావుంది.

‘నువ్వు పక్కకొస్తే గదొదినా రెడ్డి వైద్దిగం సేసేది. నువ్వు అడ్డడ్డం బోతావుంటే ఎట్ల సెప్పు’ అని కసిరినాడు ఆయమ్మ మరిది.

ఈ సెల్లాటం గెంటకు పైనే సాగింది. తీర్తం బొట్టు బొట్టు నోట్లో ఏస్తానే వుండారు. పాముకాట్లపైన గాకుండా వొల్లంతా తీర్తంతో తడపతానే వుండారు. అప్పుడు దెర్సినాడు పిలగాడు మెల్లింగా కండ్లు. ఆశల్ని వొదులు కున్నోళ్లంతా అనుమానంగా సూస్తావుండారు. వాళ్లమ్మయితే ‘నా బిడ్ని కాపాడుతండ్రీ. అన్నింపున్నిం ఎరగని పసిబిడ్డిసామీ. తెలిస్తే పామును బట్టుకొనేటోడా. బిడ్ని బతికిస్తే నీ కొండకొచ్చి నిలువుదోపిస్తానయ్యా’ అని యాడస్తానే వుంది. వాళ్లమ్మ గొంతిని పిలగాడు మెల్లింగా ‘అమ్మా’ అని పిల్సినాడు. అంతే ఆ తల్లి బిడ్ని సూడ్లా. నాలుగడుగుల దూరంలో నిల్సుకోనుండిన మా నాయిన కాళ్లమిందొచ్చిపడిపోయింది.

‘సామీ, నువ్వు దేవుడయ్యా. లేకపోతే నా బిడ్డి బతికేటోడే కాదు. పాపాత్మురాలిని బిడ్ని వొంటిరిగా వొదిలిపెట్టి ఎవురైనా సట్టికుండ్లు సూసుకుంటారా. వొంటినలుసు నాయినా. వాడు లేకుంటే మేం బతికేమి లాబము….’ అని మానాయిన సేసిన మేలుకు సాస్టాంగ పడిపోయింది’.

‘లెయ్యమ్మా. మన సేతుల్లో ఏముండాది. అంతా ఆ బగమంతుని కృప. దీంట్లో నీ తప్పేముండాది. ఎట్ల జరగాల్సింది అట్ల జరిగే తీరతాది. దేనికీ ఎవురమూ కర్తలముగాము. అన్నిటికీ ఆ బగమంతుడే’ అని ఏదాంతం మాట్లాడబట్టినాడు మా నాయిన.

అందురి మొగాల్లోను సంతోసం తాండవమాడతా వుంది. ‘ఇంగ పిలగాన్ని దీస్కోని ఇంటికి పొండి కతలుగితలు సెప్పి ఆడించుకుండా వుండండి. రాత్రికి నిద్రబోరాదు అన్న్యాడు మా నాయన.

‘మేము బోము సామీ. మీ వాకిట్లోనే పడుంటాము. రాత్రికి. బిడ్డి పూర్తిగా కోలుకొనేదాకా, నీగ్గూడా అగసాట్లు తప్పదు రెడ్డీ’ అనింది. వాళ్లమ్మ పేరు అనుసూయమ్మంటలే.

మొగోళ్లు, ఆడున్ని ఆండోళ్లు గూడా అదే సరయిందన్న్యారు. రేత్రిపూట ఏమన్నా అయితే ఆన్నించి వొచ్చేదెట్ల అని వాళ్ల బయం.

‘సరే నేన్జెప్పాల్సింది సెప్పినాను. ఆ పైన మీ ఇష్టం’ అన్న్యాడు. ఒగ బిడ్డకి కష్టమొస్తే వూరు వాడంతా ఎంత అల్లాడిపోయింది. ముత్తర పల్లోళ్ల వొద్దికే వొద్దిక అనుకున్న్యారంతా. ఆ రాత్రి కూడా పది పన్నెండు మంది ఆ పిలగాడితో పాటే వుండిపోయినారు.

మూడో దినాని కంతా పిలగాడు మామూలుగా ఆట్లాడుకోవడం మొదులు బెట్న్యాక పండ్లూ ఫలహారాలు దీసుకోని మా నాయన దెగ్గిరికొచ్చినారు. వొద్దని ఎంత జెప్పినా ఇంటారా. మా నాయినికేమో తీసుకోవాలంటే శానా నామోషీగా వుంది. తీసుకోకుంటే అదే పనిగా తెచ్చినోల్ల మనసులు నొచ్చుకోవా?

మా యవ్వ మాయమ్మతో అందురికీ అన్నం వండమనింది. ‘ఎంత దూరమని, ఇంటికి పొయ్యితింటాము. మీరెందుకు శ్రమ పెట్టుకుంటారు’ అని వాళ్లూ మొగమాటపడినారు.

‘మీరు దెచ్చినవి మేము దీసుకున్న్యాము. మేం బెట్టింది మీరు తినేపోవాల’ అని మా నాయన మొగమాటానికి కూడా కళ్లెమేసేసింది మాయవ్వ.

ఆ పొద్దు నుంచి ఈ పొద్దుదాకా ముత్తరపల్లోళ్లతో సుట్టరికం కొనసాగతానే వుంది. ఊరు ఊరే ఆత్మీయులైపోయినారు. పండిరదీ ఎండిరదీ వాళ్లు మాకు దెచ్చియడం మాయింట్లో వుండే కాయో కసురో వాళ్లకియడం. ఇట్లా కలిసి మెలిసుంటే ఎంత సుఖం! ఏమి సంతోసం!!

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, డిసెంబర్, సీరియల్ and tagged , , , , , , .

One Comment

  1. madam, meeru rayalaseema mandalikam lo katha vrayatam chala bagundi.okappudu gramaalalo manashula madhya apyatha,athmeeyathalu vundevi.Ippudu idi karuvaindi.Itarula kastaalaku spandinche gunam undatam vallane vallu, anati palle chitram ippatiki sajeevanga undi.Meeru vrasina katha bagundi.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.