cover

ఏం చేయగలం

.
అనంతటి ఆకాశాన
ఇంతటి భూమ్మీద
ఆలోచించడమే ఒక భ్రమ అని తెలిసీ
మానలేని నిశ్శబ్దపు ముక్కలం మనం,
ఏం చేయగలం
నీడల్ని అతికించుకోడం తప్ప,
.
ఇంకేమైనా పనుందా మనకిక్కడ
ఏమంటావ్, ఎప్పటికప్పుడు
వీపు మోయలేని కలల్ని కాల్చేసుకోవాలి
అనుభవాలెప్పటికీ అక్షరాలకి లొంగవు
మనం రాసేవన్నీ ఉత్తి ఙ్నాపకాలే
రోజు మారితే మర్చిపోయే సోమరి మాయతత్వాలే
.
రాత్రుళ్ళు దయ్యాలకు మనుషులు పట్టడం అతిసహజం
నువ్వు నిజంగా చదవబడేనాటికి నువ్వుండవ్
భూమిని పాములేవో మింగేసాయ్
ఎక్కడ తవ్వినా విషపు దగ్గుల పొరలే..
.
అత్యాశ పడకు
కరిగిన మంచు అంచుల్లోకి చేరితేనే
మొక్కలు మొలకెత్తుతాయ్ మట్టిమెదడులో ..
.
స్థలాలూ కాలాలూ మారుతుంటాయ్ గానీ
మనందరి వెతుకులాట ఒక్కటే
అసలు ఆ ఒక్కటైనా ఎందుకనే..
.
ఇవన్నీ వృధామాటలేలే
ఖర్మమేమిటో నీకూ తెలుసు
మొహమాటంగా కడుపు నిండిందంటాంగానీ
ఆకలొక్కటే నిజం
ఇంకేం చేయగలం..

*

Download PDF EPUB MOBI

Posted in 2014, కవిత, డిసెంబర్ and tagged , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.