cover

పద్మప్రాభృతకమ్ (8)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

ఆ స ఏష ధర్మారణ్యనివాసీ సంఘిలకో నామ దుష్టశాక్యభిక్షుః | అహో సారిష్టతా బుద్ధశాసనస్య యదేవం విధైరపి వృథాముణ్డైరసద్భిక్షుభిరుపహన్యమానం ప్రత్యహమభిపూజ్యత ఏవ | అథవా నా వాయసోచ్ఛిష్టం తీర్థజలముపహతం భవతి | ఏష తిరస్కృత్యైవాత్మానం దృష్ట్వైవాస్మానభిప్రస్థితః | భవతు | మమ వాక్శరగోచరోక్షతో న యాస్యతి | అభిభాషిష్యే తావత్ | (నిర్దిశ్య) విహారవేతాళ క్వేదానీములూక ఇవ దివాశంకితశ్చరసి | కిం బ్రవీషి – “సామ్ప్రతం విహారాదవగచ్ఛామి” ఇతి | భూతార్థం జానే విహారశీలతాం భదన్తస్య | ధాన్త్ర క్వేదానీం వేశవీథీదీర్ఘికాగతో బక ఇవ శంకితశ్చరసి | నను సురతపిణ్డపాతమనుష్టీయతే ? కిం బ్రవీషి – “మాతృవ్యాపత్తి దుఃఖితాం సంఘదాసికాం బుద్ధవచనైః పర్యవస్థాపయితుమాగతోऽస్మి” ఇతి | వినష్టం త్వన్ముఖాద్ బుద్ధవచనం మదభ్రమదివోపస్పర్శే పశ్యామః | భోః కష్టమ్ -

వేశ్యాంగణం ప్రవిష్టో మోహాద్ భిక్షుర్యదృచ్ఛయా వాऽపి |

న భ్రాజతే ప్రయుక్తో దత్తకసూత్రేష్వివోవాంకారః || 

అరే, తత్తరపాటుతో తొలగిన కాషాయవస్త్రధారిలా కనిపిస్తున్నాడు. (చీవరం - అంగీ జారిపోయిందని ఒక అర్థం. పవిత్రత భ్రష్టమైందని శ్లేష) హా, ఇతడే కదా ధర్మారణ్య(విహార)నివాసి అయిన సంఘిలకుడనే దుష్టబౌద్ధభిక్షువు. అహో, ఈ విధమైన వ్యర్థంగా ముండనం చేసుకున్న తప్పుడు భిక్షువుల పూజల కారణంగా బుద్ధబోధకు ఎంత అరిష్టం పట్టింది? కానీ, కాకుల ఎంగిలి వలన పుణ్యతీర్థానికి ఎంగిలి అంటదు. అతడు నన్ను చూచాడు. అందుకనే తనను తాను దాచిపెట్టుకుని పరిగెడుతున్నాడు. కానిమ్ము. నా వాగ్బాణాలతో గాయపడకుండా తప్పించుకోలేడు. అతడితో మాట్లాడతానిప్పుడు.(సైగ చేసి) ఓ విహారభేతాళ,ఎందుకిలా పగటి గుడ్లగూబలా వెళుతున్నావు? ఏమంటున్నావు – “ ఇప్పుడే విహారం నుండీ వచ్చాను” అనియా. భదంతుని ’విహారశీలత’ తాలూకు స్వచ్ఛత గురించి నాకు తెలుసు. మహాభాగా, ఎందుకిప్పుడు వేశ్యావీధి తాలూకు దిగుడుబావిలో దిగిన కొంగలా అనుమానంగా వెళుతున్నావు. ఓ, శృంగారభిక్షను అనుష్టించుచున్నావా? ఏమిటి – “మాతృమరణంతో దుఃఖిత అయిన సంఘదాసికను బుద్ధవచనాలతో సముదాయించడానికి వచ్చాను” అంటున్నావా? నీ ముఖం నుండీ వచ్చిన బుద్ధవచనం సారాయితో ఆచమనం చేసినట్టు లా అనిపిస్తుంది. హా, కష్టము.

మోహాత్ = వివశత్వముతో, వా = లేక, అపి అదృచ్ఛయా = కామముతోనైనా, వేశ్యాంగణం = వేశ్య ముంగిలిని, ప్రవిష్టః = ప్రవేశించినవాడు, దత్తకసూత్రేషు = కామసూత్రతంత్రములందు, ప్రయుక్తః = ఉపయోగించబడిన, ఓంకారః ఇవ = ఓంకారము వలె న భ్రాజతే = శోభింపడు.

తాత్పర్యము: మోహకారణాన లేదా కామకారణాన వేశ్య ఇంటిని చేరినవాడు, కామతంత్రవిషయాలలో ఉపయోగించిన ఓంకారంలా ప్రకాశించడు.

విశేషాలు: మూడు నాలుగవ పాదాలలో ఉపమాలంకారం. మొత్తమంతటా కలిపి దృష్టాంతాలంకారం. దత్తకసూత్రము - దత్తకుడనే మథురకు చెందిన ఆచార్యుడు పాటలీపుత్రములోని వేశ్యలకోసం సూత్రగ్రంథము వ్రాసెను. ఇది కామశాస్త్రమున ఆరవ తంత్రము అని చెప్పబడుచున్నది.

కిం బ్రవీషి – “మర్షయతు భవాన్ నను సర్వసత్త్వేషు ప్రసన్నచిత్తేన భవితవ్యమ్” ఇతి | స్థానే నిత్యప్రసన్నో భదన్తః తృష్ణాచ్ఛేదేన పరినిర్వాణమవాప్స్యసి | ఏషోంజలిప్రగ్రహం కరోతి | కిం బ్రవీషి – “సాధు ముచ్యేహమ్” ఇతి | భవతు | అలం వృథా శ్రమేణ | సర్వథా దుర్లభః ఖలు తే మోక్షః | కిం బ్రవీషి – “గచ్ఛామ్యహమకాలభోజనమపి పరిహార్యమ్” ఇతి | హీ హీ సర్వ కృతమ్ | ఏతదవశిష్టమస్ఖలితపంచశిక్షాపదస్య భిక్షోః కాలభోజనమతిక్రామతి | ధ్వంసస్వ | వృథాముండనశ్చిత్రిదద్రుణాపత్రపతే | గచ్ఛ, బుద్ధో హ్యసి | హన్త ! ధ్వస్త ఏష దురాత్మా | తత్ క్వ ను ఖల్విదానీం దుష్టశాక్యభిక్షదర్శనోపహతం చక్షుః ప్రక్షాళయేయమ్ | (పరిక్రమ్య)

సాధు భో ఇదం విటజననయనపావనముపస్థితమ్ | ఏషా హి వసన్తవత్యా దుహితా వనరాజికా నామ వనరాజికేవ రూపవతీ కుసుమసమాజమివ శరీరే సన్నివేశ్య యథోచితం పూజాపురస్కారముపనీయ కామదేవాయతనాదవతరతి | యదా సర్వాదరగృహీతపుష్పమండనాటోపా శంకే ప్రియజనసకాశం ప్రస్థితయాऽనయా భవితవ్యమ్ | యావదేనాం ప్రియవచనోపన్యాసేనోపసర్పామి | (నిర్దిశ్య) వాసు వనరాజికే, కిమిదం వసన్తకుసుమాగ్రయణం కుర్వన్త్యా భవత్యా న ఖల్వతిథిలోపః కృతః | కిమాహ భవతీ – “స్వాగతమార్యాయ, అయమంజలిః” ఇతి | ప్రతిగృహీత ఏష దాక్షిణ్యపల్లవః | అపి చ, అచిరాదాగతస్తావద్ వసన్తస్తవ శరీరే సన్నివిష్టో నను | కిమాహ భవతీ – “కథమివ” ఇతి | శ్రూయతాం తావత్ -

“మన్నించు. అన్ని ప్రాణులయందు ప్రసన్నచిత్తమున ప్రవర్తింపవలెను” అంటున్నావా? ఇక్కడ భదంతుడు నిత్యప్రసన్నుడై తృష్ణను ఛేదించి పరినిర్వాణమును పొందును. చేతులు జోడించుచున్నారు.

(తృష్ణాఛ్ఛేదము = ఇది బౌద్ధపారిభాషికంలో కోరికలను జయించడమని అర్థం. వ్యావహారికార్థంలో సారాయి త్రాగి దప్పి తీర్చుకొనుట. తృష్ణాచ్చేదము అన్న పాఠం సరికాకపోవచ్చు. అది తృష్ణాఛేదము కావాలి. పరినిర్వాణమవాప్స్యసి = బౌద్ధపరిభాషలో జ్ఞానలబ్ధి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీపము ఆరిపోవుట. ఇక్కడ అర్థం ఊహించదగినది).

“సరి, నన్ను వదలండి” అంటున్నావా? కానిమ్ము. అనవసరశ్రమ ఎందుకు? నీకు ఎల్లెడలా మోక్షము దుర్లభము కదా. “ అకాలభోజనం నివారించాలి. వెళతాను” అంటావా? హీ హీ అన్ని నియమాలు పూర్తి అయినాయి. పంచశీలను వదిలిన ఈ భిక్షువుకు మిగిలినదిదే. సమయానికి భోజనము అన్న నియమము అవశ్యం తప్పకూడదు. ధ్వంసము చెయ్యిక. వెళ్ళు. బుద్ధుడివయితివి. హా, ఈ దురాత్ముడు భ్రష్టుడు. ఈ దుష్టబౌద్ధబిక్షువును చూచిన కన్నులను ప్రక్షాళన చేసుకోవాలి. (ముందుకు నడచి) ఆహా, ఇదో విటజన నయన పావనమైనది. ఈవిడ వసంతవతి కుమార్తె, వనరాజికా, నిజంగా వనరాజిక వంటి రూపవతి పూలతో శరీరాన్ని అలంకరించుకుని యథోచితమైన పూజాద్రవ్యాలను తీసుకుని కామదేవుని పూజకై వెలసినట్టున్నది. చాలా శ్రద్ధగా పూలసింగారాలతో తనువును భవ్యంగా అలంకరించుకున్నది. తన ప్రియుని వద్దకు వెళుతున్నట్టు తెలుస్తూంది. (సైగ చేసి)

అమ్మాయీ వనరాజికా, వసంతకాలానికి మొదటి పూజలా పూలనలంకరించుకున్న నీవు అతిథిని మరిచావేమి?

ఏమన్నావూ? “ఆర్యునికి స్వాగతం, అంజలి” అనియా. నీ దాక్షిణ్యపల్లవము స్వీకరింపబడినది. ఇంకా, ఈ మధ్యనే వచ్చిన వసంతము నీ శరీరంలో తిష్టవేసింది సుమా. “ఎలాగ” అంటివా? విను.

వాసన్తీకున్దమిశ్రైః కురవకకుసుమైః పూరితః కేశహస్తో

లగ్నాశోకః శిఖాన్తః స్తనతటరచితః సిన్దువారోపహారః |

ప్రత్యగ్రైశ్చూతపుష్పైః ప్రచలకిసలయైః కల్పితం కర్ణపూరః

పుష్పవ్యగ్రాగ్రహస్తే వహసి సువదనే మూర్తిమన్తం వసన్తమ్ ||

కిం బ్రవీషి – “ఏష తే ప్రదేయకః” ఇతి | భవతు | త్వయ్యేవతావత్తిష్టతు న్యాసః | కాలేనోపపాదయిష్యామః | సుఖం భవత్యై | ప్రస్థితోऽస్మి | (పరిక్రమ్య)

అయే ఇదమిరిమకామిన్యాస్తాంబూలసేనాయా గృహమ్ | నిత్యసన్నిహితశ్చాత్ర ధాన్త్రః | కిం ను ప్రవిశామి | (విచార్య) న శక్యమనభిభాష్యాతిక్రమితుమ్ | యావత్ ప్రవిశామి | (ప్రవిశ్య)

కేశహస్తః = జుట్టుముడి, వాసంతీకుందమిశ్రైః = మల్లెల, మొల్లలచేరికతో, కురవకకుసుమైః = కురవక పుష్పములతో, పూరితః = నింపబడినది. శిఖాన్తః = జడచివరిభాగం లగ్నాశోకః = అశోకముతో చేర్చినదైనది. సిందువార ఉపహారః = నిర్గుండీలతలతో కూర్చిన చిన్న మాల, స్తనతటరచితః = స్తనతటము రచింపబడినది. ప్రత్యగ్రైః = బాగా వికసించిన, చూతపుష్పైః = మామిడి పూలతోనూ, ప్రచలకిసలయైః = మిక్కిలి కదలుచున్న చివురుటాకులతోనూ, కర్ణపూరః = చెవిపోగు, కల్పితః = కల్పింపబడింది. సువదనే = సుందరవదనా, పుష్పవ్యగ్రాగ్రహస్తే= పూలచేత కనుమరుగైన చేతిని కలిగి (అంజలి నిండుగ పూలను నింపుకుని), మూర్తిమంతం వసంతం = మూర్తీభవించిన వసంతాన్ని, వహసి = ధరించినావు.

తాత్పర్యము: మల్లెల, మొల్లల జడముడిని, అశోకముతో జడచివర్లను, నిర్గుండీలతల మాలికతో స్తనతటాన్ని, వికసించిన మామిడిపూలతోనూ, చివురుటాకులతోనూ చెవిపోగులను, అంజలిలో పూలను నింపుకుని సుందరముఖీ, నీవు మూర్తీభవించిన వసంతాన్ని ధరించావు.

విశేషములు: స్రగ్ధరావృత్తము. అంగనలేయే కుసుమములనేయే యంగముల నలంకరింతురో వివరించు మనోహరమైన పద్యము. మూర్తిమన్తం వసన్తం వహసి - అనగా మూర్తీభవించిన మదనుని నీ తనువున నిలిపితివని యర్థశ్లేష.

ఏమంటావు – “ఇవి మీకు ఇవ్వదగినవి” అనియా. కానిమ్ము. తగిన సమయము వచ్చినప్పుడు స్వీకరింతును. నీకు సుఖమగుగాక.నేనిక ఏతెంతును. (ముందుకు నడచి)

అరే, ఇది ఇరిమ్ (Hermes అనే యవనుడు) అనువాని ఉంపుడుగత్తె తాంబూలసేన ఇల్లు. ఈ మనిషి ఎప్పుడూ ఇక్కడే పడి ఉంటాడు. వెళ్ళుదునా? ఆలోచించి) పలుకరించకుండ ముందుకెళ్ళడం కుదరదు. సరే, లోపలికెళతాను. (ప్రవేశించి)

అస్తి కోऽపి భోః సహృదగృహే శశం ప్రతిపాలయతి? అయే ఇదం తాంబూలసేనా అస్మద్ బహుమానాదవిలంబిత త్వరితపదవిన్యాసా సంభ్రమాద్ భ్రష్టముత్తరీయమాకర్షన్తీ ప్రద్వార ఏవ ప్రద్యుద్గతా | అత్యుపచారః ఖల్వేషః | శంకే న మాం ప్రవిశన్తమిచ్ఛతీతి | తదేషా బహిరేవ ప్రయోజయితుం నిర్గతా | యథాऽస్యః ప్రత్యగ్రసురతచిహ్నాన్యుపలక్షయే సద్యః సురతభుక్తముక్తయాऽనయా భవితవ్యమ్ | నూనం దివాసురతసంమర్దమనుభూతవానిరిమః | అహో సురతలోలుపః ఖలు ధాన్త్రః | భవతు | పరిహాసిష్యామ్యేనామ్ |

తాంబూలసేనే | కిమిదం దాక్షిణ్యాతివ్యయః క్రియతే | కథం సురతపరిశ్రమశ్వాసవిచ్ఛినాక్షరం ’స్వాగతం ప్రియవయస్యాయ’ ఇత్యాహ | అవిరక్తికే తాలవృన్తం తావదానయ | కృతవ్యాయామా ఖలు తాంబూలసేనా | చోరి, అపి బలం వర్ధతే? కిం బ్రవీషి – “న ఖల్వవగచ్ఛామి” ఇతి |ఏతత్ప్రియజనపరిష్వంగసంక్రాన్తకాలేయకం స్తనతటద్వయమ్ | పృచ్ఛామి తావత్ | అసన్తుష్టే అనవరతనిశావిహారస్యేరిమస్య దివాऽపి నామ త్వయా న దేవో విశ్రమః | నను సాయంప్రాతర్హోమో వర్తతే | కిం బ్రవీషి – “సదాపి నామ పరపక్షపరిహాసప్రియో భావ ఇతి|” నైతదస్తి | అపి దుర్విదగ్ధే న త్వయా శ్రుతపూర్వ ’ఆకారసంవరణమప్యాకార ఏవ’ ఇతి | కిం బ్రవీషి – “కథం జానీషే” ఇతి | చోరి, కథమిదం న జ్ఞాస్యామి | యథా –

మిత్రుని ఇంట్లో శశుని ఆదరించేవారెవరైనా ఉన్నారా? అరే, తాంబూలసేన గాభరాగా అడుగులు తడబడుతుండగా, ఉత్తరీయాన్ని సర్దుకుంటూ ప్రధాన ద్వారం దగ్గరకే వచ్చింది. అవసరానికి మించిన ఆదరణ ఇది. నా రాక ఈమెకు నచ్చినట్టు లేదు. అందుకే బయటకే వచ్చి నిలబడింది. ఈమె శృంగారచిహ్నాలు చూస్తూ ఉంటే ప్రణయం మధ్యలో వచ్చినట్టు ఉన్నది. నిశ్చయంగా ఇరిముడు పగటిసమయంలో శృంగారానుభూతి చవి చూసి ఉంటాడు. వీడొక మదపిచ్చి గాడు కాబోలు. కానిమ్ము. ఈమెతో కాస్త వేళాకోళమాడతాను.

తాంబూలసేనా! ఇంత ఆతిథ్యం ఎందుకు? శృంగారశ్రమతో పదాలు తడబడుతూ “ప్రియమిత్రుని స్వాగతం” అనుట ఎట్లు? తాంబూలసేన మంచి వ్యాయామం చేసింది కదూ. ఓ చోరీ, బలం కూడా పెరుగుతోందా లేదా? ఏమంటున్నావు – “అర్థమవటం లేదు” అనియా? ప్రియుని పరిష్వంగం వలన ఈమె స్తనతటద్వయం తాలూకు చందనం చెరిగిపోయింది. అదే అడుగుతాను. ఓ కామవాంఛాపిపాసినీ, నిరంతరయామినీవిహారమత్తుడైన ఇరిమునికి పగటిపూటైనా విశ్రాంతినివ్వవూ? పొద్దునా, సాయంకాలమూ, రెండు పూటలా హోమము నడుస్తుంది కదూ? ఏమంటావు – “పండితులకు ఎప్పుడూ ఇతరులను ఆటపట్టించటం అలవాటు” అనియా? అదేమీ కాదు. తెలివిలేనిదానా, ’ఆకారాన్ని దాచటంతో ఆకారం ప్రకటితమవుతుంది’ అని వినలేదా?”ఎలా తెలుస్తుంది” అంటావూ? దొంగా, ఎలాగా –

విఖణ్డితవిశేషకం మృదితరోచనాబిందుకం

కపోలతలలగ్నకేశమపవిద్ధకర్ణోత్పలమ్ |

ముఖం వ్రణితపాటలోష్ఠమలసాయమానేక్షణం

ప్రకాశయతి తే వివాసురతలోలుపం కామినమ్ ||

కిం బ్రవీషి – “సద్యః సుప్తోత్థితాऽహం, కిమప్యాశంకశే” ఇతి | భవతు| సంజ్ఞాప్తాః స్మః | న హి తే సూక్ష్మమపి కించిదగ్రాహ్యం పశ్యామి | కిన్తు –

విఖండితవిశేషకం = చెరిగిన పత్రలేఖ, మృదితరోచనాబిందుకం = ముద్ద అయిన తిలకము, కపోల తల లగ్నకేశం = చెక్కిళ్ళపై పడిన కురులు, అపవిద్ధ కర్ణోత్పలం = అపభ్రంశమయిన చెవి తాలూకు పువ్వు, వ్రణితపాటలోష్టం = గాయమైన పగడాల పెదవి, అలసాయమానేక్షణం = అలసించిన కనులు గల, కామినం ముఖం = కామి ముఖము, తే = నీయొక్క, దివాసురతలోలుపం = పగటి శృంగారపిపాసను, ప్రకాశయతి = తెలియబరచుచున్నది.

తాత్పర్యము: చెరిగిన పత్రరేఖ, ముద్దగా మారిన తిలకము, చెక్కిళ్ళపై పడిన కురులు, పక్కకు జరిగిన చెవి తాలూకు పువ్వు, గాయమైన పగడాల పెదవి, అలసిన కనులు గల కామిని ముఖము నీ పగటిశృంగారకాంక్షను తెలియజేస్తోంది.

విశేషము : పృథ్వీవృత్తము (జసౌ జసయలా వసుగ్రహ యతిశ్చ పృథ్వీ గురుః

వసు = 8 వసువులు, గ్రహ = 9 గ్రహాలు. పాదమునకు పదిహేడక్షరములు. జ స జ స య లఘువు, గురువు)

విశేషకం/పత్రలేఖ యనగా చెక్కిలిపై ముద్రించుకొను ఒక అలంకారము.

హిమవ్యపాయా ద్విశదాధరాణామాపాణ్డరీభూత ముఖచ్ఛవీనాం |

స్వేదోద్గమః కింపురుషాంగనానాం చక్రేపదం పత్రవిశేషకేషు || (కుమారసంభవం ౩ -౩౩)

(వసంతకాలము చెమట వలన స్త్రీలచెక్కిళ్ళపై గల పత్రరేఖలను తుడిపివేసినది)

“ఇప్పుడే నిద్రలేచాను. కానీ మీరు ఏదో శంకిస్తున్నారు” అంటావా. కానిమ్ము. నాకు తెలిసినది. నీయొక్క అగ్రాహ్యమైన విషయాన్ని ఒకదాన్ని కొంచముగా చూస్తున్నాను. కానీ -

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.