cover

మీటర్ ఎంతైంది?

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 6వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.)

Download PDF EPUB MOBI

వీధి చివర ఉన్న ఆ ఇంటి ముందు కారు ఆపి, గేటు తెరిచి లోపలకు వెళ్ళాడు అతను.

ఇంటి తలుపు తెరిచుంది. లోపల ఒకావిడ “రాహుల్, ఆ టీవీ పక్కన వెతుకు,” అని కేక వేసింది.

ఇంతలో బయటున్న అతను, “మేడం,” అని పిలిచాడు.

“ఆ ఎవరు”

“ఇందాక నా టాక్సిలో మీ పర్సు మర్చిపోయారు”

“చాలా థాంక్స్ బాబు. ఇల్లంతా వెతుకుతున్నాను ఇప్పుడే,” అంటూ పర్సు తీసుకుని వంద రూపాయలు తీసి అతనికిచ్చింది.

“అబ్బే. వద్దు మేడం. ఏదో కర్టెసీ కి చేసానంతే. డబ్బు కోసం కాదు,” అన్నాడు అతను.

“పర్లేదు ఉంచుకో బాబు. ఎంత మంది చేస్తారిలాగ ఈ కాలంలో,” అంది ఆవిడ.

“వద్దండీ. కావాలంటే ఇదిగోండి నా కార్డు. టాక్సి అవసరమైనప్పుడు ఫోన్ చేయండి. చాలా వరకు ఈ చుట్టుపక్కల్లోనే తిరుగుతుంటాను. కుదిరితే వెంటనే వస్తాను. ఉంటాను మేడం,” అని తిరిగి కారు వైపు వెళ్ళిపోయాడు.

* * *

“పొద్దునుంచి ముగ్గురు ఎక్కారు. ఇలా అయితే మనం కాలేజీలో చేరినట్టే,” కారులో కూచుని టీ తాగుతూ తనలో తాను విసుక్కున్నాడు ఆ టాక్సి డ్రైవర్.

“మీరు వింటున్నారు AIR FM Rainbow. సమయం రాత్రి 11 గంటలయింది. మన తరువాయి కార్యక్రమం మధుర గీతాలు. విని ఆనందించండి”

“ఏ తీగ పువ్వునో…” అంటూ రేడియోలో పాట మొదలవగానే ఇంతలో ఎవరో కారు అద్దం మీద దబదబామని గట్టిగా కొట్టారు. ఆ మనిషి కళ్ళల్లో భయం, నుదుటి మీద చెమట చూసి, ఒక 2 సెకన్లు మనకెందుకులే అని ఆలోచించినా, వెంటనే డోరు తీసి, కారు స్టార్ట్ చేసాడు డ్రైవర్.

“త్వరగా పోనీ,” అన్నాడు అతను.

“అర్థమైంది. డోరు వెసుకోండి,” అని బయల్దేరాడు డ్రైవర్.

చాలా దూరం వెళ్ళేంత వరకు ఇద్దరు ఏమీ మాట్లడలేదు. కాని వెనుక సీటులొ కూర్చున్న అతన్ని అద్దంలో చూడసాగాడు ఆ డ్రైవర్. ఒక బ్యాగుని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు అతను. అరచేయి కోసుకుపోయి రక్తం కారుతోంది. కర్చీఫ్ తో దాన్ని చుట్టేసాడు. అతని ముఖంలో బెదురు కనిపించింది. చాలాసార్లు వెనక్కి తిరిగి చూసాడు, ఎవరన్నా వెంటపడుతున్నారేమోనని. కొంత సేపటికి ముందున్న డ్రైవర్ తో “బస్ స్టాండ్ కు పోనీ తమ్ముడు”, అన్నాడు.

“ఎందుకంత భయపడుతున్నారు?” అడిగాడు డ్రైవర్.

“నన్ను చూసి కాదు. రోడ్డు చూసి పోనీ,” అన్నాడు అతను.

“ఎవరైనా వెంటపడుతుంటే బస్ స్టాండ్ కు వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడికి మనుషులను పంపుతారేమో వెతకటానికి,” అన్నాడు డ్రైవర్.

జేబు లోంచి కత్తి తీసి “ఎక్కువ మాట్లడకు భే సాలే, చెప్పింది చెయ్,” అని డ్రైవర్ ను బెదిరించాడు అతను.

“కాస్త ఆలోచించండి. డ్రైవింగ్ చేస్తున్నాను. నా పీక కోస్తే, ఇద్దరం పోతాం. అయినా మీ మంచి కోసమే చెప్తున్నా. మిమ్మల్ని పట్టించే వాడినే అయితే అసలు ఎక్కించుకుంటానా?” అన్నాడు డ్రైవర్ ఏ బెదురు లేకుండా.

“సరే చెప్పు. మరి ఎక్కడికి తీసుకెళ్తావు?” అడిగాడు అతను.

“మీరే ఊరికి వెళ్ళాలి?”

కొంతసేపు ఆలోచించి “గుంటూరు” అన్నాడు అతను.

అతను అబద్దం చెప్తున్నాడని తెలిసినా కూడా “సరే ఐతే. ఇక్కడ నుంచి వరంగల్ రెండు గంటలు. అక్కడికైతే ఎవరూ రారు. రైల్వే స్టేషన్ దగ్గర దింపేస్తాను”, అన్నాడు డ్రైవర్.

అతను ఏమనలేదు.

006డ్రైవర్: “ఇంతకీ ఎంత కొట్టేసారు?”

అతను: “మాట్లాడకుండా డ్రైవింగ్ చేయలేవా?”

డ్రైవర్: “నిద్రొచ్చేస్తోంది సార్. ఎంత టీ తాగినా సరిపోలేదు. ఏదోకటి మాట్లాడకపోతే ఎవడికో వెళ్ళి గుద్దేస్తాను”

అతను: “3 లక్షలు”.

డ్రైవర్: “కష్టపడి సంపాదించచ్చుగా?”

అతను: “ట్రై చేసాను. పని అవ్వలేదు”.

డ్రైవర్: “మరి దొంగతనం తప్పు కాదా?”

అతను: “అస్సలు కాదు”

డ్రైవర్: “అంటే ఎవరైనా చేయొచ్చంటారా?”

అతను: “అందరూ చేస్తూనే ఉన్నారు కదా”

డ్రైవర్: “నేను చేయట్లేదే”

అతను: “మీ అయ్య నిన్ను బడికి పంపిండా?”

డ్రైవర్: “ఇంటర్ దాకా”

అతను: “ఫీజు కట్టనీకి ఏడికెల్లి ఒచ్చినయ్ పైసల్?”

డ్రైవర్: “పొలం ఉంది. పండించుకున్నాడు”

అతను: “ఎవడిచ్చిండు పొలం?”

డ్రైవర్: “మా తాత”

అతను: “మీ తాతకి ఎవడిచ్చిండు. వాళ్ళ తాత. మరి వాళ్ళ తాత? ఖాళీగా ఉంది కదా, అడిగేటోడు ఎవ్వడూ లేడని కబ్జా చేసిండు. ఇదిగో చూడు తమ్ముడు, దేవుడు ఎవ్వరికీ ‘ఇదిగో బాబు ఈ భూమి నువ్వు పండించుకో, ఇదిగో నువ్వు ఇది తీసుకో’ అని పంచిపెట్టలేదే. ఎవడికి ఏది ఖాళీగా కనిపిస్తే వాడు దాన్ని దోచుకున్నాడు. నువ్వు డబ్బు ఎలా సంపాదించావని ఎవరూ పట్టించుకోరు. ఎంత అని మాత్రమే చూస్తారు. ఉన్నోడికి సలాం కొడతారు. అందరూ దొచుకునేటోల్లే…

“మా అయ్య నన్ను బడికి పంపీలేదురా భయ్. నాకేమో కార్లలో తిరగాలనుండె. రోజుకి 14 గంటలు పని చేసినా పొట్ట కూడా నిండలే. ఇంక కారేమి కొంటాం? పోర్లతొ మస్తుగ ఎంజాయ్ చేయాలనుంటది. ఎట్ల చేస్తాం? పైసలు కావాల. మా ఓనర్ గాడు క్లబ్ నడిపి ఫుల్లుగా సంపాదించిండు. ఆడేమన్నా పున్యాత్ముడా. పోర్లతో బట్టలేకుండా డాన్సులేయిస్తాడు. ఆడు మాత్రం ఏసి రూంలొ కూచుని పైసలు లెక్కెట్టుకుంటాడు. కాని నేను వాని లెక్క కాదు. రిస్క్ చేసి కష్టపడి 3 నెలలు స్కెచ్ ఏసినా. దోచుకుంది కూడా కష్టపడి దోచుకున్నా”

డ్రైవర్: “తెలిసినోళ్ళ దగ్గర కొట్టేసారా? చాలా రిస్క్ కదా”

అతను: “దేంట్లో లేదు చెప్పు రిస్క్. నీకేదైనా కావాలనిపిస్తే దాని కోసం రిస్క్ చేయవా. రిస్క్ ఉంది. దొరికినాననుకో ఫుల్లుగా కుమ్ముతరు. సంపినా సంపుతరు. కానీ దొరికే లోపు మస్తుగా ఎంజాయ్ చెస్తా. అసలు దొరకలేదనుకో ఇంకా హ్యపీస్”

ఇంతలొ గట్టిగా హార్న్ వినిపించింది. ఒక లారి కంట్రోల్ తప్పి రాంగ్ లేన్ లోకి ప్రవేశించి, వీళ్ళ టాక్సి వైపుగా దూసుకొచ్చింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, టాక్సిని పక్కకు తిప్పి సడన్ బ్రేక్ వేసాడు. వెనుక కూర్చున్న అతను సీట్లొనుంచి ముందరకు పడ్డాడు. ప్రమాదం తప్పింది.

అతను: “దీనమ్మ, ఏం పాగల్ గాడు రా భయ్ ఆడు. కొంచెం ఉంటే సీదా పైకే. దూరంలో లైట్లు కనిపిస్తున్నై. అప్పుడే ఒచ్చెసిందా వరంగల్. మాక్కి కిర్కిరి, ఈడ ముంబై ట్రైన్ ఎక్కితే సాల్. బిందాస్”

“గుంటూరు అన్నారు. ముంబై ఐతె ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ ఉంది”

అతను: “అవునా, తొందరగా ఆపు రా భయ్. ఇది పట్టుకుంటే సేఫ్ ఉంటా. ఇగో తీసుకో, చాలా థాంక్స్ రా భయ్. ఉంటా మల్ల”, అని 2000 డ్రైవర్ కిచ్చి స్టేషన్ లోకి పరుగెత్తాడు.

డ్రైవర్: “పెట్రోల్ ఖర్చులు పోగా మిగిలింది 1200. అంటే ఇంకా 69000. ఈజీగా ఇంకో రెండు సంవత్సరాలు పట్టుద్ది. డిగ్రీ అయిపోయేసరికి ముసలోడినైపోతా” అనుకుంటూ కారు రివర్స్ తీద్దామని వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు కనిపించింది. మొదట చూసి కర్చీఫ్ అనుకున్నాడు . వంగి చూస్తే తెలిసింది. డబ్బు. 3 కట్టలు. 3 లక్షలు. “బ్రేక్ వేసినప్పుడు బ్యాగ్ లొ నుంచి పడిపోయుంటుంది, పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం”, అనుకుంటూండగా అతని మాటలు గుర్తుకొచ్చాయి. “దొచుకోటం తప్పు కాదురా భయ్. నేను వాడిని దొచుకున్నా. నన్ను ఇంకోడు దోచుకుంటాడు” “నీకేదైనా కావాలనిపిస్తే దాని కోసం రిస్క్ చేయవా చెప్పు”

స్టేషన్ వైపు చూసాడు. ఆ దొంగ అరుచుకుంటూ కారు వైపు పరిగెడుతున్నాడు. ఇంజన్ ఆన్ లో ఉంది. కాలు పెడల్ పై ఉంది. రోడ్దు ఖాళీగా ఉంది…

*

రచయిత వివరాలు

Prithvi N.

Vancouver WA 98684

USA

Download PDF EPUB MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, డిసెంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.