cover

తెల్లారద్దు….

Download PDF EPUB MOBI

ఎవడో కొట్టినట్టు దిగ్గున లేసి కూసున్నడు నడి మంచాల నందుగాడు. గింత జెల్ది తెల్లారిందా? కండ్లు నలుసుకుని జూత్తే నిజంగనే తెల్లారిందని తెలివికొచ్చింది. సుట్టూ జూత్తే ఎవ్వలూ కనిపీయలే. కిటీకి తలుపు సందు నుంచి సొచ్చుకచ్చిన ఎండ పొడకి మొఖం ఎర్రగయి నిద్ర మబ్బు మాడిపోయింది. ఎన్ను బొక్క పొంటి జెర్రి పారినట్టు ఈపులకెళ్ళి సర్రున తల్కాయకెక్కింది భయం. నన్నొక్కన్ని ఇంట్లనే ఇడిసిపెట్టి పోయిర్రా అందరూ? అన్న అనుమానం రాంగనే కడుపుల కెళ్ళి దుఃఖం పొంగింది. చెంగున మంచం మీంచి దుంకిండు, కాలు మల్సకవోయి బొక్కా బోర్లా పడ్డడు. ఏడుపు నాలిక మీద్దాకాచ్చి ఆన్నే ఆగిపోయింది మంచం కింద బాపు సూట్కేస్ కనవడంగనే. గప్పుడు మనసు కొంచెం నిమ్మళమైంది. మంచాన్ని వట్టుకొని మెల్లగా లేసి కిందనే గూసున్నడు. “టిఫిన్లకు ఏం కూరండుతన్నవే లచ్చిమి” ఇంటెన్కనుంచి నాయినమ్మ మాట సిన్నగా ఇనవడ్డది. మల్సకవోయిన కాల్ని జాడించుకుంట లేసి మళ్ళా మంచాల ముసుగుదన్ని పండుకున్నడు. రంగుల దుప్పటి పోగు రంధ్రాలకెళ్ళి సూరే కిర్ణాలు సుక్కలు సుక్కలోలె ఇరిగి ఎర్రటి పచ్చటి ఎలుతుర్లు నందుగాడి ముఖం మీద ఆగమాగమై ఆడుతున్నయి. కాళ్ళు ముడిసి, నడుము లేవట్టి నమాజ్ జేసే తీరుగా ముఖాన్ని మెత్తల దాసుకున్నడు. “ఇక ఇయ్యాల అటువోయచ్చేటాళ్ళకే పొద్దు గడుత్తది…. హాజర్ బీడీ ఏడజేసౖడెద్ది…. ఆఠ్ సౌ ఆకు తంబాకు తీస్కరా” పక్కింటి సులోచనత్తకి బీడీల అప్పజెప్పుకుంటూ ఇంటి ముంగట అమ్మ. “అటీటనేటాళ్ళకు బస్ టైం అయితనే ఉంది… నువ్వు తానం జెయి జెల్ది” బాపుకి బకిట్ల ఉడుకు నీళ్ళు వోసుకుంటా నాయినమ్మ ఇంటెన్కనుంచి. “టెమైంతైతందీ, గిప్పుడే బస్సు టైమయిందా… లెవ్వాల్నా… లేత్తే అమ్మ బడికొమ్మంటది… లెవ్వకపోతే ఈళ్ళు నన్ను ఇంట్లనే ఇడిసి పెట్టి పోతరు” మల్సకవోయిన కాలు తిమ తిమలాడుతుంటే సూరే నమస్కారం జేసే తీర్గా కాలు సక్కగా జాపిండు. ఏం మనసునవడ్తలేదు, గిట్లుంటదనే రాత్రి పండుకోంగా ఇంట్లున్న దేవుళ్ళ ఫోటలన్నీటికీ మొక్కిండు రేపసల్కే తెల్లారద్దని. “‌సూర్యుడు రోజూ ఏడు గుర్రాల రథం మీదత్తడనీ నాయినమ్మ జెప్తది, ఏ గుర్రాని కన్నా కడుపునొయ్యాలి, లేకుంటే రథం టైర్ పంచర్ గావాలే, తెల్లారినా గూడా అల్లాద్దీన్ అద్భుత దీపం లెక్క ఓం భూం ఛూం అనంగానే మళ్ళా రాత్రై పోవాలె” గిట్లా యాడ తెల్లార్తదో అనే భయం కొద్ది రాత్రి నిద్ర కూడా పోలే. “‌మిల్లులన్నీ ఓటెన్కోటి బందు వడ్తున్నయి, నేను పన్జేసే మిల్లు గూడా ఇయ్యాల్లో రేపో అన్నట్టుంది” రాత్రన్నం తినుకుంట బాపు అమ్మతోని అనడం. “‌నువ్వు తిను, ఎట్లయితే అట్లైద్ది” అమ్మ దైర్నం జెప్పడం, “ఏం తింటం మళ్లా, శాలోడికి మొగ్గం తొక్కుడు, సాంచెలు నడుపుడు తప్ప ఇంకో పనత్తాది, మగ్గాలెప్పుడో మూలకువడే, గిప్పుడీ మిల్లులు బందువడ్తే ఎట్లా?” బాపు రంధి పడటం, అన్నీ మంచాల పండుకోనే ఇన్నడు నందుగాడు. ఖర్సులు, బాకీలు… ఇంకా ఎందేందో నడి రాత్రి దాకా ఆళ్ళ ముచ్చట్లు శానా ఇన్నడు, తెల్లారొద్దని ఓ పక్క దేవుళ్ళకి మొక్కుకుంటనే.

“ఈడింకా లెవ్వలేదు గదనే… ఇన్నీ గూడ తీసుకత్తవా?” తానం జేసచ్చి దేవుడికాడి బొట్టు వెట్టుకుంటా బాపు అమ్మనడిగిండు. “ఆడచ్చి ఏం జేత్తడు… బడికోడా, ఉత్తగ బడివోద్ది అద్దు” అంటింట్ల నుంచి రొట్టె జేసుకుంట అమ్మ అనంగనే, దుప్పటి తీసి కూసోని ఏడుపు షురు జేసిండు నందుగాడు. “‌లేసుడుతోనే గంపోలే నోరేసుకోని ఏడ్తున్నవ్ ఏం కూసుందిరా మీదా” నాయినమ్మ నశ్యం సీసా ఎనుకులాడుతూ సీదరించుకుంది. “‌పొద్దుగూకి పూట ఆ సింత సెట్టు కింద ఆడకురా అంటే ఇనవు, యేడ భయపడ్డడో కొడుకు, ఎన్నలేంది రాత్రి పక్క తడిపిండు, గజ గజ ఒకటే వణుకుడు. గా జీడిగింజ ఉంటే సూడే లచ్చిమి, తిప్పి కాల్సి, గా మూడు తొవ్వల కాడా ఏసత్తా” నశ్యం పీల్సుకుంట నాయినమ్మ అంటింట్లకోయింది. నందుగాడు ఏడుపింకెక్కో జేసిండు.

“అరే ఇగరా, మొఖం కడిగి తానం జెయ్, బడికి టైం ఐతలేదనుకున్నవా ఇంకా” అంటింట్ల నుంచే అమ్మ.

“‌నేను బడికోను… మీతోనత్తా” నందుగాడు మంచం దిగలే, “బాపు నేను మీతోనత్తా… బడికోను”

“అత్తెద్దువుగాని తానం చెయ్‌పో, గిట్నే అత్తవా” సక్కటి సైడు పాపిట తీసి నెత్తి దూసుకుంట అద్దంల బాపు.

“ఏడికి లేదు, నువ్వచ్చినప్పటి నుండి ఈడికి గావురం ఎక్కో అయింది, ఈ నెల సంది పది రోజులు గూడా బడికోలే” అమ్మ అంటింట్ల నుంచొచ్చి నందుగాణ్ణి మంచంల నుంచి ఇగ్గుకవోయింది.

“నేను బడికోను… మీతోనే అత్త… బాపూ”

“ఆగు రేపచ్చి పెద్ద సారుకు జెప్తా, బడికొమ్మంటే మంకు జేత్తడు, చెప్పినట్టు ఇంటలేడని, గప్పుడు గీ గావురమంత ఎల్తది” నీళ్ళు కాగే పొయ్యి ముందర కూసుండవెట్టి పొయ్యి కింద మంటవెట్టుకుంటా పండ్లు తొముకొమ్మని బ్రష్షుకు పేస్టు రాసిచ్చింది.

“‌నేను బడికోను, మీతోన…” లేసి బాపు దగ్గరికురకవోయిండు.

“‌సక్కగ మొఖం కడుక్కొని స్నానం జేయకపోతే ఇట్లే ఇంట్లేసి తాళం పెట్టి పోతం” అమ్మ కండ్లెర్ర జేసేటాళ్ళాకు ఆన్నే కూలవడి, ఏడ్సుకుంటనే దవుడకు బ్రష్షేసి పండ్లు తోముడు వెట్టిండు అంట్లింట కోయే అమ్మను గుర్కాయించి జూసుకుంట.

“నువ్వచ్చి ఏంజేత్తవురా? రాంగా మళ్ళా నడుసుకుంట అచ్చుడయిద్దీ. బుక్కెడంత తిని ఆరంగా బడికోయి రాకనట” గప్పుడే తానం చేసచ్చి ఆరుగజాల చీర గోచి పెట్టుకుంట నానమ్మ బుదరకిచ్చింది.

“‌నేను పోను పో….” నోట్లున్న బ్రష్షును నాయినమ్మ మీదికి ఇసిరిగొట్టిండు.

“‌నేనేమన్నరో మీ అమ్మ మీది కోపం నామీద్దిత్తవు, బుద్ది మాటా సెప్పుడు కూడా తప్పేనా” పొయ్యి మీది ఉడుకు నీళ్ళు కొంటవోయి తానాల గద్దె కాడున్న సళ్ళటి నీళ్ళ బకిట్ల పోసింది “‌పో ఇగ, తానం జెయ్‌పో”

నందుగాడు అంగి లాగిప్పి నాలుగు చెంబులు బుడా బుడా పోసుకున్నడు. “పెయ్యి తుడుసుకోని పోరా, ఇల్లంత తడైద్దీ” అంటింట్ల టిఫిన్ కడుతూ ఆరిండ్లకు ఇనవడేటట్టు మొత్తుకున్నా నీళ్ళడ్తున్న పెయ్యితోనే పెద్దింట్లకు ఉరికచ్చిండు. సూట్కేసుల బట్టలు జమాయించి పెడుతున్న బాపు దగ్గరికచ్చి బరివాతనే గూసున్నడు. గా సూట్కేసల నుంచొచ్చే నాప్తలీన్ గోళీల వాసనంటే నందుగాడికి కమ్మగనిపిస్తది. “అవ్వా! ఈడిగ్గా తువ్వాలీ… పో తుడుస్కోని బట్టలేస్కోపో” సూట్కేసల నుంచి పాత ఇన్లేండు లెటర్లు తీసి బయటేసిండు బాపు. “‌తువ్వాలా ఆన్నే దణ్ణెం మీదేసత్తి గదరా గాడ్దీ, ఎత్తిపాయే పడిపాయే అన్నట్టు అట్నే ఉరికచ్చినౌ” కొడుక్కి ఎందో ముచ్చట చెప్తామనచ్చి కూసోవేన నాయినమ్మ యాష్ట పడుకుంట ఇంటెన్కకోయింది. కిందవడున్న ఇన్లేండ్ లేటర్లు ఒక్కోటి ఇప్పి చూసుకుంట నందుగాడు “‌బాపు, గీ లేటర్లన్నీ నేనే పోస్టడబ్బ లేసినా, అమ్మ జెప్తుంటే నారాయన మామ రాసిండు” పుస్తకాలల్ల పెట్టి మరిసిపోయిన నెమళీక దొరికినట్టు సంబరపడుకుంట జెప్పిండు. పెయి మీన్నుంచి అడుస్తున్న నీళ్ళు పడి రాతలన్నీ కలెగల్సిపోయి నీలం రంగు గీతౖలెతున్నయి. “ఈడి అంగీ లాగీయే లచ్చిమ్మీ” తువ్వాల తీస్కచ్చిన నాయినమ్మ నందుదుగాడి పెయి తుడిసింది. చెక్క కబాట్ల నుంచి బడ్రెస్సు తీసుకత్తున్న అమ్మను జూసి నందుగాడు “‌నేను బడికోను” మళ్ళా ఎడుపు షురూ జేసిండు. “ఏయ్.. నకరాల్ జెత్తున్నవా” బలిమీటికి అమ్మ బడ్రెస్సు తొడగవోతుంటే తప్పించుకుని “‌బాపు నేను మీతోనత్తా” అనెడుసుకుంట ఉరికి బాపు తొడ మీద కూసున్నడు. “‌పోన్తీయే ఇయాల్టీకి రెప్పణ్ణుంచి కాడ తప్పకుండ బడికి మావోతడు, ఈడు గిట్లేడుత్తుంటే మనం కడుప దాట్తమా?” నడుం సుట్టూ బిగుసుకున్న మొల్దారాన్ని ఒదల్జేసి పక్కన గూసుండ వెట్టుకున్నడు బాపు. “ఆగు నీ సంగతి రేపు జెప్తా” అవ్ము ఇంకో అంగి లాగు తెవడానికి కబాటు దగ్గరికోయింది. “‌పండగకు కుట్టించిన కొత్త డ్రెస్సు ఏసుకుంటా”. “‌నీ ఈపు బాగా ముల ములా అంటుంది, నెల్రోజులైతుంది గదా తన్నుల్లేక” పండ్లు పటా పటా కొరుక్కుంట పండగకు కుట్టించిన అంగి లాగు తొడిగింది. చెంపల మీద కారిన కంటి ధారలను తుడుసుకుంటా అమ్మను గుర్రుగా చూసి సర్రున మళ్ళా బాపు దగ్గరికురికిండు. “‌గా చెడ్డీ బనీను ఎండిందో సూడుపో” సూట్కేసు తాళఁమేసెటోడళ్ళా ఆగి అమ్మ దిక్కు జూసిండు. “‌బాపు మిల్లు బందైద్దా” నందుగాడు మెల్లగా గొణిగిండు. “ఏ మిల్లురా” ఆన్నుంచి లేపి పండ్ల పుల్లలకని ఇరిసి దిగుట్ల వెట్టుకున్న యాప్పుల్లల కట్ట తీసుకచ్చి సూట్కేసుల ఏసిండు. “ఇంకా పచ్చిగనే ఉన్నై… ఇగో వరక్కాయిదంల సుట్టిన” అమ్మ ఈయంగనే సూట్కేసుల ఓ పక్కకు వెట్టి తాళమేసండు బాపు. నాప్తలీన్ గోళీల వాసనకు గూడా తాళం పడ్డది.

Tellaaradduఓ గంట అయినంక అమ్మ, బాపు, నందుగాడు, నాయినమ్మ నలుగురు బస్టాండ్ల బస్సు కోసం ఏదిరి జూత్తుర్రు. బస్సు అద్దగంట లేటట. ఏవ్వలేం మాట్లాడుకుంటలేరు. నందుగాడికి ఏం మనుసనవడ్తలేదు. బాపు సూట్కేసల నుంచి తెల్వకుండా తీసుకున్న నాప్తలీన్ గోళిని అంగి జేబుల కెళ్ళి తీసి వాసన చూసుడు వెట్టిండు. అప్పటికిప్పటికి కొంచెం కరిగి సిన్నగయింది గోళి. మళ్లా జేబులేసుకున్నడు. అమ్మ కొంగు వట్టి ఆడుడు వెట్టిండు. సీదరించుకుని కొంగు అదిలించింది. నాయినమ్మ సేతులున్న నశ్యం సీసా తీసుకొని మూత తీయవేండు. నశ్యం పారవోత్తావురో అని నాయినమ్మ నశ్యం సీసా గుంజుకుంది. యే బస్సచ్చిన అదేనారా అని నానమ్మ అడుగుడు, బాపు కాదనుడు. అమ్మా బస్సియాలా రాదా అనడితే నోర్ముసుకోని సక్కగా గూసోమని బెదిరించింది. దగ్గరికి రమ్మని బాపు పిల్తే పోలే. బస్సు ఇయ్యాల రాకుంటే మంచిగుండనిపించింది. ఓం, భూం, ఛూం అనంగనే మళ్ళా రాత్రై పోవాలనిపించింది. జల్ది పెద్ద వాన కొట్టి పోవుడు బందు గావాలనుకున్నడు. భారత్ బంద్ అని గోడ మీదో ఎర్ర పోస్టర్ కనవడ్డది, ఆ బందు ఇయ్యాలైతే బస్సు రాదు గదా అనుకున్నడు. ఇంతల్నే అన్ని బస్సులత్తున్నయి గదా ఇది గూడ అత్తదనుకున్నడు. అటీటు దిక్కుల జూత్తుంటే బస్టాండ్ల ఉన్న దూకాణం మీద కన్ను వడ్డది. పేపర్లు, పుస్తకాలు దణ్ణెనికి బట్టలెండిసినట్టు కట్టున్నయి. కూలిడ్రింకులు, బిస్కెట్లు, చాక్లేట్లు సీసాలల్ల ఉన్నయి. ఓ పక్క తీరు తీరు బోమ్మలున్నయి. ఆ బోమ్మలల్ల బస్సు బొమ్మ మీద నందుగాడి సూపు వడ్డది. అమ్మా నాక్కాగా బస్సు బొమ్మ కావాలన్నడు. “‌తిన్నదరుగుత లేదా, గందుకే నిన్ను సక్కగ బడికొమ్మన్న” బొమ్మ దిక్కు సూడకుండనే అమ్మ కస్సుమంది. “ఆ నాగ్గొనీయది” సన్నగా రాగం దీసుడు వెట్టిండు. “ఇగో ఇప్పుడేదోటి ఏషం పెట్టి తన్నులు తినకు” నెత్తి మీదోటి మొట్టింది. ఏం గావలట్నే అని బాపడిగితే ఏం లేదు ఈడు గిట్నే ఎదో ఓ గుయ్యారం పెడ్తతడని అంటుండంగనే దుమ్ము లేపుకుంట బస్సచ్చింది…. బొంబాయి బస్సు. బొంబాయి అని తెలుగుల, బి.ఓ.ఎమ్.బి.ఏ.వై బాంబే అని ఒక్కో లెటర్‌ని ఒత్తి పలుక్కుంట ఇంగ్లీషుల, ముం.బ.ఇ ముంబై అదే ఏడు నేర్సుకునుడు షూరు జేసిన అచ్చి రాని హిందిల బస్సుకు రాసున్న బోర్డును సదివిండు నందుగాడు. నెల్రరోజుల కింద బాపచ్చిన్నాడు గిదే బస్సు కథల్లో జెప్పిన తీరుగా ఇంద్రలోకం నుంచొచ్చిన ఐరావతం లెక్క అనిపించింది. గిప్పుడేమో కోడిపిల్లను తన్నుకవోయే గద్ద లాగా అనిపిత్తంది. బాపు లేసి సూట్కేసందకుని “ఇగ పోయత్త మరి” అని అమ్మకు జెప్పిండు. నందుగాడు అమ్మ కొంగు వట్టుకొని దూకాణం దిక్కు గుంజుకుంట బస్సు బోమ్మ కొనియమంటుండు. బాపు మాటకు ఊ అనలేక, ఉండమనలేక నందుగాన్ని సెంప పొంటి ఒక్కటి సరిసి సంకన ఎక్కిచ్చుకుంది. నందుగాడు నోరు కప్ప లెక్క తెరిసి బస్సు ఇంజను సప్పుడ్ని మించిన ఆవాజ్‌తో ఏడ్సుడు వెట్టిండు. “అవ్వా, మంచిదే పోయత్త” నాయినమ్మకు జెప్పుకుంటా బస్సు డోరు కాడికి నడిసిండు. నందుగాడు ఇంకా ఆవాజ్ ఎక్కో జేసి అమ్మ సంకల గింజుకుంటా కాళ్ళు సేతులు కొట్టుకుంటా “‌నాక్కాగా బస్సు బొమ్మ గొనియే, బస్సు బొమ్మ గొనియే” అని మొత్తుకుంటా బస్టాండంతా దద్ధరిల్లివొయేట్టు ఏడ్సుడు వెట్టిండు. “పైలంగ పోరా కొడుకా… మేమిడ మంచిగనే ఉంటం, మా గురించి రంధి పెట్టుకోకు” నాయినమ్మ కొంగుతోని కళ్ళొత్తుకుంది. అమ్మ సంకల నుంచి జారుతున్న నందుగాన్ని ఎత్తుకోవోయిండు, ఆడు కిందికి జారి బాపు సేతికి దొరక్కుండా “‌నాక్కాగా బస్సు బొమ్మ గోనియేమ్మా” అని లాగాయించి ఏడ్సుకుంటా దుకాణం ముంగటికి ఉరికిండు. అమ్మ ఆడెన్కనే ఊరికింది. “ఎక్కురెక్కుండ్రి, లేటయితంది పోవాలే” డ్రైవర్ తొందరవెడ్తే బాపు బస్సెక్కి సీట్ల గూసున్నడు. ఉప్పెన్నచ్చి ఊరు కొట్టుకవోయినట్టు శోకం పెడ్తున్న నందుగాణ్ణి బలియ్యాడానికి గొర్రె పిల్లను గుంజుకచ్చినట్టు బస్సు కాడికి గుంజుకచ్చింది. “పైలం మరి, పగార్ రాంగనే పైసలు పంపిత్తా” కిటికీల నుంచి బాపు జెప్తుంటే బస్సు కదిలింది. “పోయినంకెంటనే లేటర్ రాయ్” అమ్మ జెప్తుంటే నందుగాడు ఆగలేక సంకల కెళ్ళి జారి కిందవడి బస్సు బొమ్మ గొనియే అని గుండెల్నుండి ఎగదన్నుకచ్చే ఏడుపుతో దుబ్బల పడి బొర్రుకుంటా పండగ డ్రెస్సును పాడు పాడు జేసుకున్నడు. బస్సు ఎర్ర మట్టిని ఎగజిమ్ముకుంటా దుమ్ముల కల్సిపోయింది. నందుగాన్ని లేవట్టి ఈపుల నాలుగు సరిసి భుజానకేసుకుంది అమ్మ. గుక్క వట్టి ఏడ్తుంటే “ఏం పోరడవ్వా, కొడుకు దూర దేశం పోతాంటే తుర్తిగా మాట్లాడనియ్యకుంట… ఆ దరిద్రపు బొమ్మెదో కొనిచ్చి అగ్గి తగలవెట్టరాదే” నాయినమ్మ కసురుకుంది. నందుగాడు నరాలు తెగేట్టు ఏడ్సేది బస్సు బొమ్మ కోసం గాదు, బొంబాయి బస్సుల వోయే బాపు కోసమని అమ్మకు తెలుసు, బాపుకు తెలుసు, నందుగాడికీ తెలుసు గాని నాయినమ్మకు తెల్వదాయే!

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, కథ, డిసెంబర్ and tagged , , , , , , .

7 Comments

  1. ” నెల్రరోజుల కింద బాపచ్చిన్నాడు గిదే బస్సు కథల్లో జెప్పిన తీరుగా ఇంద్రలోకం నుంచొచ్చిన ఐరావతం లెక్క అనిపించింది. గిప్పుడేమో కోడిపిల్లను తన్నుకవోయే గద్ద లాగా అనిపిత్తంది. నందుగాడు నరాలు తెగేట్టు ఏడ్సేది బస్సు బొమ్మ కోసం గాదు, బొంబాయి బస్సుల వోయే బాపు కోసమని అమ్మకు తెలుసు, బాపుకు తెలుసు, నందుగాడికీ తెలుసు గాని నాయినమ్మకు తెల్వదాయే! ”

    ఈసారి నందుగాడు ఏడిపించిండు…

    హెచ్చార్కె, శిరీష్ ఆదిత్య, అజయ్ ప్రసాద్, గొరుసన్నల వంటి ప్రముఖుల ప్రశంసలు పొంది గుర్రం ఆనంద్ గారు ధన్యులైయ్యారు.

  2. కథ మొదటి నుంచే బాగున్నా, చివరకు వచ్చేసరికి ఎంత elevate అయిపోయిందంటే ఆఖరి వాఖ్యానికి నేను షాక్ అయిపోయి నోట మాట రాలేదు. ఏదో పిల్లాడి మొండితనం అనుకున్నాను కానీ ఇంత బాధాకరమైన విషయాన్ని ఇంత సునాయాసంగా convey చేయగలుగుతారు అనుకోలేదు. చాలా బాగుంది కథ.

  3. కథ బాగుంది. కథలో సౌష్టవం బాగుంది. ‘వలసబతుకులు’ కళ్ళకు కట్టాయి. ఆ బతుకుల్లో ‘బాల్యం’ ఏం కోల్పోతోందో కళ్ళకు కట్టింది. బాల్యాన్ని బుజ్జగించేంత వెసులుబాటున్న బతుకులు కావవి. ‘నేనూ వస్తాన’ని మంకు పట్టు పట్టినా, ఆ కోరిక తీరదని తెలిసాక, ఏదో ఒక సోడ్డు పెట్టి ఏడ్వడం తప్ప ఏమీ చేయలేని ‘బాల్యం’ ఆ బతుకుల్లో. పోనీ, ఆ బస్సు బొమ్మైనా దక్కిందా అంటే…….

  4. కథ బాగుంది. కథ రాయడం బాగుంది. కథనం బాగుంది. ఉత్తర తెలంగాణ పలుకుబడి మరింత బాగుంది. గంట కాల పరిమితిలో గగనమంత జీవితం చెప్పడం ఇంకా బాగుంది. ఆగకుండ చదివించిన తీరు ఎంతెంతో బాగుంది. కలం కంటి తో కనిపించిన దృశ్యాన్ని చూపించడం కథకుడి పరిశీలనా కోణం తెలిపింది. నాయనమ్మ ఆరు గజాల చీర గోచి పెట్టడం మరాటీ సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతమని చెప్పింది. పొట్ట కూటికి వలస పోయిన సంగతి బస్సు చెప్పింది … మొత్తం మీద కథా అద్దంలో జీవితపు కొండ కనిపించింది .