cover

అభావప్రాప్తి

కెంపుజీరల చూపు
కైమోడ్పుల పిలుపవుతుంది
ఆకర్ణాంత భీతితో
కళ్ళు మిటకరిస్తాయా?
పొటమరించే మోహం
పటిక చెమటల పలుకవుతుంది
ఊపిరందని భయంతో
ముచ్చెమట్లు పోస్తాయా?
తీగసాగే స్పర్శ
అనుకంపనరాగమవుతుంది
వణికేవొంటి మీంచి
వెన్నుపూస నిచ్చెన్లు జారిపోతాయా?
***    ***    ***
పాలనురగల దేహం మీద
మీగడ తొలకై విరిగిపోవడం…
…శృంగారం!
చట్రాతి మీద చిల్లపెంకులై
చెదిరిపోవడం కాదు-
తెరిపిలేని దాహాల దోసిలి దొన్నెలతో
తీరాల వెంట నడక…
…శృంగారం!
ఏకాకి ఎండమావుల గట్టున
పిడచ గట్టుకుపోవడం కాదు-
నీ పిడికెడు నడుములు
నీ సర్జరీ సొగసులు
నీ సిలికాన్ రొమ్ములు
మొగచింతకాయలు రాల్చే వశీకరణ మంత్రాలు
…అన్నీ శృంగార సమ్మోహనాలు-
వక్షాచ్ఛాదితశ్వాసల
భారం కొలవడం కాదు…
…అసౌందర్యం!
మాతృపాశశాపాల్లో
బిగిసడలడం-
తంత్రులై తెగిపడే
నరాలనాదం కాదు…
…అసౌందర్యం!
సెలైన్ చుక్కల సూదివేళ్ళకి
పచ్చనరాల పట్టు చిక్కడం-
నీ అంక్షల తొడుగులు
నీ ఎంటీపి ఏడ్పులు
నీ ముట్లుడిగిన రొప్పులు
చీకటి వెల్గుల పెనవేతల్లో రక్తసంధ్యాస్రావాలు…
…అన్నీ అసౌందర్య అసహ్యాలు-
***    ***    ***
అరటిబోదెల నునుపు మీద
చీకటీగకు పట్టు తప్పింది
ఎనస్తీషియా శ్లేష్మమంటి
ఎగరలేకపోతుందా?
నిట్టూర్పుల నిక్వణంలో
కైపు ఆవురంటుంది
ఎడతెగని మూల్గులో
మత్తు ఆవిరవుతుందా?
ప్రాప్తించే భావ సౌఖ్యం
ఆల్చిప్పలో ముత్యమవుతుంది
చేజారిన గాజు చుట్టూ
ప్లాసంటా గుక్క పెడ్తుందా?
***    ***    ***
…… నేనెరిగిన అతిసౌందర్య, అసౌందర్యమైన స్త్రీ, నా ఉషకి-
(అక్టోబర్, 1999)

Download PDF EPUB MOBI

Posted in 2014, కవిత, డిసెంబర్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.