cover

ఇంటర్సెక్షన్

[‘ఇన్ ద మూడ్ ఫర్ లవ్’ అనే హాంగ్ కాంగ్ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బహుమతి గెలుచుకుంది. ఈ ప్రేమకథకు మూలమైన కథ “ఇంటర్సెక్షన్” ను Liu Yichang అనే హాంగ్ కాంగ్ రచయిత రాశారు. ఇది ఆ కథను స్థానికీకరించి చేసిన స్వేచ్ఛానువాదం.]

Download PDF EPUB MOBI

ఇంటర్సెక్షన్

1

47C నెంబర్ బస్ కృష్ణానగర్ దాటి యూసుఫ్ గూడ ఏరియా లోకి ప్రవేశించగానే చంద్రశేఖర్ కళ్ల ముందు తన ఇరవై సంవత్సరాల జీవితం రీలులా తిరిగింది. ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ జనాభా ముప్ఫై లక్షలు; ఇప్పుడది కోటి దాకా చేరింది. ఒకప్పుడు కొండలు, గుట్టలతో నిండిపోయిన ప్రాంతాలలో ఇప్పుడు ఎత్తైన అద్దాల మేడలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో రెండతస్థుల మేడలున్న చోట ఇప్పుడు అపార్ట్మెంట్ లు లేచి నుంచున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం మొదటి సారిగా హైదరాబాద్ కి వచ్చిన రోజు చంద్రశేఖర్ కి ఇప్పటికీ గుర్తుంది. ఆర్టీసీ బస్ లో రెతిఫైల్ బస్ స్టాండ్ లో ఆగగానే చలిగాలి జిల్లున అతన్ని తాకింది. చలికాలంలోనూ చెమటలు పట్టే తన ఊరినుంచి కప్పుకోడానికి ఒక దుప్పటైనా తెచ్చుకోకుండా కట్టుబట్టలతో దిగిపోయాడు. కానీ అంత చలిలో కూడా హైదరాబాద్ జనాలు స్వెట్టరైనా వేసుకోకుండా తిరగడం చిత్రంగా అనిపించింది అతనికి. అంత చలిలోనూ జనాలు సాయంత్రం పూట ఐస్ క్రీం తినడం మరీ విచిత్రం అనిపించింది. విజయనగరం నుంచి మొదటి సారి హైదరాబాద్ కి వచ్చిన చంద్రశేఖర్ కి ఆ రోజుల్లో అన్నీ కొత్తే.

అప్పట్లో విజయనగరంలో పరిస్థుతులేమీ బాగోలేవు. ముఖ్యంగా తన కుటుంబం పరిస్థితి. తుఫాను తమ పంటను నిలువునా ముంచేసింది. అప్పటికే మూడేళ్ళు వర్షాలు లేక, ఆ సంవత్సరం పడిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు నిలవడంతో రైతులందరూ ఉత్సాహంగా పంటపనుల్లో ఉండగా తుఫాను దొంగ దెబ్బతీసింది. సర్వం కోల్పోయిన రైతులు కూలీలగానైనా బతకడానికి సిద్ధమై హైదరాబాద్ బయల్దేరారు. చంద్రశేఖర్ కి కూడా హైదరాబాద్ మీద మనసు మళ్లింది. అందుకు ఒకటే కారణం: చంద్రశేఖర్ కి సినిమాలంటే పిచ్చి. అదీ కాక సినీ పరిశ్రమ మొత్తం మద్రాసు నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చేస్తోందని పేపర్లలో చదివాడతను.

2

ఆ బిల్డింగ్ పైకి వెళ్లే మెట్లన్నీ విరిగి పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి; వాటి మీదనుంచి ఎవరైనా నడుచుకుని వెళ్లాలంటే సర్కస్ ఫీట్స్ చెయ్యాల్సిందే. అర్జెంట్ గా ఆ మెట్లని రిపేర్ చేయించకపోతే చాలా డేంజర్. కానీ ఆ మెట్లని అలానే వదిలెయ్యడానికో కారణం ఉంది – ఆ పాత బిల్డింగ్ ని ఇది వరకే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కి అమ్మేయడం జరిగింది – అలా అని సునీత కు వాళ్ళ పెద్దమ్మ చెప్పింది. సునీత వాళ్ల పెద్దమ్మ గత ముప్ఫై ఏళ్లుగా ఆ బిల్డింగ్ లోని మూడో అంతస్థులో ఉంటోంది. అందరితో ఎలా ఉన్న తనని మాత్రం కొంచెం ప్రేమగా చూసుకునే పెద్దమ్మంటే సునీతకి ఇష్టం. అందుకే టైం దొరికినప్పుడల్లా ఆ ఇంటికి వస్తుంటుంది సునీత. పెద్దమ్మతో కాసేపు కబుర్లాడి, ఆ మెట్ల మీదనుంచి సర్కస్ ఫీట్లు చేస్తూ కిందకు దిగి బిజీగా ఉన్న యూసుఫ్‍గూడ రోడ్ మీదకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి చంద్రశేఖర్ వెళ్తోన్న 47C బస్ యూసుఫ్‍గూడ లోకి ప్రవేశించింది.

సునీత రోడ్ క్రాస్ చేసి ఎదురుగా ఉన్న చిన్న గల్లీలోకి అడుగుపెట్టిందో లేదో ముక్కు పుటాలదిరేలా దుర్వాసన దాడిచేసింది. రోడ్ మొదట్లో ఉన్న చెత్తకుండీ, దానికి తోడు ఆ పక్కనే జనాలు విసర్జించిన మూత్రపు వాసనలతో అటు పోయే జనాలెవరూ ముక్కు మూసుకోకుండా ఉండలేరు. అసలు ఈ రోడ్ లో వెళ్ళడం సునీతకి ఇష్టమే ఉండదు; కానీ తప్పదు. ఆ చెత్తకుండీ ని దాటుకుని వెళ్ళిన ప్రతిసారీ సునీత అనుకుంటుంది: “రేపు నాకు పెళ్లయ్యాక, మంచి ఏరియా లో ఇల్లు వెతుక్కుని అక్కడకు షిఫ్ట్ అవ్వాలి. ఆ ఏరియాలో చుట్టుపక్కలెక్కడా చెత్తకుండీ నే ఉండకూడదు.”

3

cinema venuka kathaluబస్ యూసుఫ్‍గూడ వీధుల గుండా వెళ్తుండగా చంద్రశేఖర్ రోడ్ మీద వెళ్తున్న ఒక స్త్రీని చూశాడు. దాదాపు నలభై సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆమెకి. కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తనకి పరిచయమైనప్పటి పోలికలేవీ ఇప్పుడామెలో లేవు. ఆనాటి అందమే ఆమెలో లేదు ఇప్పుడు. చూసింది క్షణం పాటే అయినా ఆమె మొహంలో వయసు తెలిసిపోతోంది. ఆమె యవ్వనం పూర్తిగా కరిగిపోయింది. కిటికీ లోనుంచి మరోసారి తిరిగి చూశాడు. తన ఇద్దరి పిల్లలనీ గట్టిగా తిడ్తూ ఆమె ఫుట్ పాత్ మీద నడుస్తోంది. ఇరవై సంవత్సరాల క్రితం ఆమెను చూడనట్టయితే ఆమె వయసులో ఉండగా చాలా అందంగా ఉండేదంటే ఎవరూ నమ్మరేమో! అప్పట్లో ఆమెకి చాలా పేర్లుండేవి. ఇరవై సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆమె తనకి పరిచయమైనప్పుడు ఆమెని అందరూ “స్వీటీ” అనే వాళ్లు. అందరితో ముద్దు గా మాట్లాడుతుందని ఆమెకా పేరు పెట్టారెవరో. ఇలా ముద్దు పేర్లు పెట్టుకునే అమ్మాయిలందరూ చాలా తెలివితక్కువ వాళ్లని చంద్రశేఖర్ అభిప్రాయం. కానీ స్వీటీ తో పరిచయం అయ్యాక ఆమె తెలివితక్కువది కాదనుకున్నాడు. కానీ స్వీటీ అనే పేరే అతనికి తెలివితక్కువగా అనిపించింది. షూటింగ్ గ్యాప్ లో చంద్రశేఖర్ తో మాట్లాడాలని చాలా ప్రయత్నించేది స్వీటీ. కానీ తన సినిమా ప్రయత్నాలు విజయవంతం అయ్యేవరకూ అమ్మాయిల జోలికి వెళ్లకూడదని అనుకోవడంతో ఆమె ప్రయత్నాలను దాటవేసేవాడు. చివరికి రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఒక సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం రావడంతో స్వీటీ ని వెతుక్కుంటూ హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్స్ అన్నీ తిరిగాడు. చివరికి ఎలాగో ఆమెని వెతికి పట్టుకోగలిగాడు. కానీ అప్పటికే ఆమె సినిమా షూటింగ్స్ కి క్యాటరింగ్ చేసే ఒక మెస్ ఓనర్ ని పెళ్లిచేసుకుని స్వీటీ నుంచి కవితగా మారిపోయిందని తెలిసింది. ఆ తర్వాత రెండేళ్లకి ఒక సాంగ్ షూటింగ్ సమయంలో ఊటీలో స్వీటీ ని కలిశాడు చంద్రశేఖర్. తనకుపెళ్లి కాలేదని, ఆ మెస్ ఓనర్ తనని ఉంచుకుని మోజు తీరాక వదిలేశాడని చెప్పింది. ఆ రాత్రి ఊటీ మొత్తం కలిసి తిరిగారు వాళ్లిద్దరూ. ఏ అర్థరాత్రో ఒక చెట్టుకింద కూర్చుని చలిమంట వేసుకుని ఉదయం వరకూ కబుర్లు చెప్పుకున్నారు. ఉదయాన్నే స్వీటీ తన రూంకి తిరిగి వెళ్ళిపోతుండగా, “మనిద్దరం పెళ్లిచేసుకుందాం,” అన్నాడు చంద్రశేఖర్. తనకి ఇంట్లో వాళ్లు సంబంధం చూశారని, తను పని చేసే చివరి సినిమా ఇదేనని చెప్పింది స్వీటీ. ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నాక కవిత అనబడే స్వీటీ తన సొంత ఊరైన రాజమండ్రికి వెళ్లిపోతూ చివరిసారిగా చంద్రశేఖర్ ని చూడ్డానికి వచ్చింది. అతనికి జీన్స్ ప్యాంట్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ జీన్స్ ప్యాంట్ ఇప్పటికీ చంద్రశేఖర్ దగ్గర ఉంది. అది ఇప్పుడు పూర్తిగా రంగు వెలిసిపోయింది, కానీ దాన్ని పడెయ్యడానికి మాత్రం అతనికి మనసొప్పలేదు. స్వీటీ వెళ్లిపోయినా ఆమె గురించిన ఆలోచనలు మాత్రం అతన్ని వదల్లేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు యూసుఫ్‍గూడ గుండా వెళ్తున్న 47C బస్ లోనుంచి స్వీటీ అనబడే కవిత ని మరోసారి చూశాడు చంద్రశేఖర్. 

4

సునీత రోడ్ మీద నడుస్తుండగా ఎదురుగా వస్తున్న నల్ల కుక్కని చూసింది. అది అవడానికి కుక్కే అయినా చూడ్డానికి పందిలా ఉంది. ఆ కుక్క నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఉన్న ఫ్రూట్ షాప్ దగ్గర ఆగింది. అక్కడ కింద పెట్టి ఉన్న ద్రాక్షపండ్ల బుట్టమీదకి కాలెత్తి అది చేసే పని అది చేసింది. సునీత కి ఆ కుక్క కనిపించినప్పుడల్లా ఎక్కడో చోట కాలెత్తి తన పని కానిచ్చేస్తుంది. కంపు కొట్టే వీధి, చెత్తకుండీ, కుక్క, అది కాలెత్తి చేసేపని – ఇవన్నీ తను రోజూ చూస్తూనే ఉంటుంది. నిజానికి తన జీవితంలో ప్రతి రోజూ అంతకుముందు రోజులానే పాతగా ఉంటుంది సునీతకి; వీధి మొదట్లోని చెత్తకుండీ దగ్గర కుళ్ళు వాసనతో సహా!

5

బస్ యూసుఫ్‍గూడ బస్ స్టాప్ దగ్గరకి చేరబోతుండగా కిటికీలోనుంచి బయటకు చూశాడు చంద్రశేఖర్. బస్ స్టాప్ పక్క సందులో ఉన్న టిఫిన్ సెంటర్ ఇంకా అలాగే ఉంది. యూసుఫ్‍గూడ లో ఇరవై ఏళ్ల క్రితం నాటి బిల్డింగ్ లన్నీ పోయి వాటి స్థానం కొత్తవి వచ్చాయి కానీ ఆ టిఫిన్ సెంటర్ మాత్రం ఏమీ మారలేదు. అప్పట్లానే జనాల హడావుడి ఎక్కువగానే ఉంది. ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పటి రోజుల్లో ఈ హోటల్లోనే రోజూ టిఫిన్ చేసేవాడు చంద్రశేఖర్. ఒక్కోసారి డబ్బులు లేనప్పుడు అప్పు పెట్టే అవకాశం ఉండేది ఆ హోటల్లో. “రెండు ప్లేట్లు ఇడ్లీ….ఒక ఉప్మా పెసరట్టు…సింగిల్ పూరీ….ఒక మసాలా…” టిఫిన్ సెంటర్ లో సర్వర్ అరుపులు బస్ దాకా వినిపిస్తున్నాయి. కూర్చోడానికి కుర్చీలు లేకపోయినా, ఆర్డర్ తీసుకునేవాడు ఒక్కడే అయినా అక్కడంతా ఏదో తెలియని పద్ధతి ప్రకారం నడిచిపోతుంటుంది. విజయనగరం నుంచి ఇంట్లో చెప్పాపెట్టకుండా బయల్దేరినప్పుడు రోజూ ఇంట్లో తినే దోశలు, ఇడ్లీలు తప్ప వేరే టిఫిన్ ఐటమ్స్ ఏవీ తెలియవు చంద్రశేఖర్ కి. ఒక్కసారి ఈ టిఫిన్ సెంటర్ తో పరిచయం అయ్యాక రకరకాల టిఫిన్ ఐటమ్స్ అతనికి పరిచయమయ్యాయి. కనీసం పేరైనా వినని మైసూర్ బజ్జీ ని మొదటి సారి అల్లం పచ్చడి తో రుచి చూడడం అతనికి ఇంకా గుర్తుంది. కానీ ఆ హోటల్లో అలాంటి రుచికరమైన పదార్థాలు తింటున్నప్పుడల్లా విజయనగరంలోని తల్లిదండ్రులు గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగేవి అతనికి.

తుఫాన్ లో పంట మొత్తం మునిగిపోవడంతో తండ్రి మంచాన పడ్డాడు. తల్లి కూలి పనులు చేస్తుంటే చూసి భరించలేకపోయాడు. డిగ్రీ చదువులనుంచి అందరూ ఇంజనీరింగ్ వైపు ప్రయాణిస్తున్న రోజులు. తను కూడా బాగా చదివి ఇంజనీరింగ్ లో చేరుండాల్సింది అని చంద్రశేఖర్ తండ్రి కోరిక. కానీ ప్రభుత్వ పాఠశాల లో అత్తెసరు చదువులతో ఎమ్సెట్ లో ఇంజనీరింగ్ సీట్ రావడం కష్టమని తెలుసు కాబట్టే కొడుకు ని ఏమీ అనలేకపోయాడాయన. డిగ్రీ చదివి పూర్తి చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ ఏమీలేదని తెలుసు చంద్రశేఖర్ కి. ఊర్లో అందరి పరిస్థితి అంతంత మాత్రమే. తనకి అప్పుడప్పుడూ డబ్బులిచ్చి సహాయపడే పైడితల్లి కూడా ఒక రోజు నిరాశగా ఇంటికి వచ్చాడు. చిన్నాపురం దగ్గర్లో పదెకరాల్లో ఉన్న మామిడి తోట మొత్తం తుఫాన్ కి ధ్వంసం అయిందని చెప్పాడు. ఇక ఇక్కడ ఉండి తల్లిదండ్రులకి భారం కాదల్చుకోలేదని, హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. “నీ సంగతేంటి?” అని మెల్లిగా చెవిలో అడిగాడు.

“తెలియదు. మా నాన్న ఒప్పుకోడు”

“మా నాన్న కూడా ఒప్పుకోడు. అందుకే పారిపోతున్నాను.”

“అమ్మో! మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. అయినా నీకు హైదరాబాద్ లో ఎవరన్నా తెలుసా?”

“తెలియదు.”

“మరెలా?”

“నువ్వొస్తానంటే చెప్పు. అక్కడ మన ఊరి వాళ్లు చాలామంది ఉన్నారంట. మాట్లాడొచ్చు.”

అలా రాత్రికి రాత్రి కట్టుబట్టలతో హైదరాబాద్ బయల్దేరి వచ్చేశాడు చంద్రశేఖర్. హైదరాబాద్ వచ్చిన రెండు నెలలకి కానీ ధైర్యం చేసుకుని ఇంటికి ఉత్తరం రాయలేకపోయాడు. తను పారిపోయింది పేదరికానికి దూరంగానే తప్ప ఇంట్లో వాళ్లకి దూరంగా కాదని వాళ్లకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. తన సినిమా కష్టాలేవో తను పడుతూ మిగిలిన డబ్బులన్నీ జాగ్రత్త గా ఇంటికి పంపించేవాడు చంద్రశేఖర్.

ఆ రోజుల్లో హైదరాబాద్ లో బ్యాచిలర్స్ కి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. కష్టపడి యూసుఫ్‍గూడ లోనే మూడో అంతస్థులోని ఒక సింగిల్ రూం లో పైడితల్లితో కలిసి రెండు వేలు అద్దెకట్టి ఉండేవాడు. ఆ రోజుల్లో ఎటుచూసినా తమ ఊర్లు వదిలి హైదరాబాద్ కి తరలి వచ్చిన వాళ్లే కనిపించేవాళ్ళు. అప్పటిదాకా టిఫిన్ సెంటర్లు తక్కువ, ఇరానీ కెఫేలు ఎక్కువున్న హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ టిఫిన్ సెంటర్ లు పుట్టుకొచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ యూసుఫ్‍గూడ పూర్తిగా మారిపోయినప్పటికీ ఆ టిఫిన్ సెంటర్ మాత్రం ఆలానే ఉంది. కానీ ఆ టిఫిన్ సెంటర్ ని ఆనుకుని ఉండే STD బూత్ మాత్రం లేదు. బస్ లో వెళ్తూ ఆ టిఫిన్ సెంటర్ ని చూడగానే చంద్రశేఖర్ అప్పటి జ్ఞాపకాల్లో మునిగిపోయాడు.

ఒక రోజు ఆదివారం హోటల్లో టిఫిన్ చేస్తుండగా పక్కనే STD బూత్ లోనుంచి ట్రింగ్ ట్రింగ్ మని మోగిన ఫోన్ శబ్దం; ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే, “అరే చందూ మీ నాన్న చనిపోయాడ్రా…” అని అవతల్నుంచి ఎవరో చెబుతుంటే, గుండెల్లోనుంచి ఉబికివచ్చిన ఏడుపు శబ్దం, “రెండు ప్లేట్లు ఇడ్లీ….ఒక ఉప్మా పెసరట్టు…సింగిల్ పూరీ….ఒక మసాలా…” అనే గోలలో కలిసిపోవడం అతనికి ఇంకా గుర్తుంది.

6

ఆడవాళ్లందరికీ బట్టలు కొనడం కంటే చూడడమంటేనే ఎక్కువ ఇష్టం. సునీత కూడా అంతే! షాప్ లోని అద్దాల వెనుక ఉన్న బొమ్మకి కట్టిన పెళ్లి పట్టుచీర ని చూసి సునీత కి గుండె ఆగినంత పనయింది. అచ్చమైన కంచి పట్టు, నెమలి పించాల అంచు- బంగారంలా మెరిసిపోతోందా చీర. సునీత కళ్లు పెద్దవి చేసుకుని ఆ చీరవైపే చూస్తుండిపోయింది. “ఎంత అందవిహీనంగా ఉన్నా ఈ చీరకట్టుకుంటే దేవతలా మారిపోవడం ఖాయం,” అనుకుంది సునీత. కాసేపు ఆ చీర కట్టుకున్న బొమ్మ వైపు చూస్తుండిపోయిందో లేదో, ఆ బొమ్మ తనవైపే నవ్వుతూ చూస్తుండుడంతో ఆశ్చర్యపోయింది సునీత. బొమ్మలు కూడా నవ్వుతాయా? ఆ అద్దం లో తనవైపే చూస్తున్నది బొమ్మ కాదు-తనే! ఇప్పుడక్కడ షాప్ లేదు. ఎదురుగా ఒక పెద్ద అద్దం మాత్రం ఉంది. ఆ అద్దంలో తన ప్రతిరూపం కంచి పట్టుచీరలో బంగారపు బొమ్మలా మెరిసిపోతూ దేవతలా తనని పలకరించింది.

7

బస్ ఆగింది. దిగుతున్న మిగతా ప్రయాణికులను చూసి చంద్రశేఖర్ కి కూడా హఠాత్తుగా బస్ దిగిపోవాలనిపించింది. తను వెళ్లాల్సింది సికింద్రాబాద్ అయినా అక్కడే బస్ దిగేశాడు అతను.

అది అమీర్‍పేట ఏరియా. గతంలో ఈ రోడ్డు గుండా లెక్కలేనన్ని సార్లు తిరిగిన గుర్తుంది. అప్పుడూ ఇప్పుడూ జనాల రద్దీ మాత్రం తగ్గలేదు ఈ ఏరియాలో. ఎటు చూసినా కార్లు, స్కూటర్లు, బస్సులు, జనాలు. ఇక్కడ జనాలు ఎప్పుడూ ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు హడావుడిలో ఉంటారు; ఇందులో ఎంతమందికి నిజంగా పనుందో, ఆ పనిలో వారు సఫలమవుతారో మాత్రం తెలియదు. ఒక మెన్స్ వేర్ షాప్ లో ఒక జీన్స్ ప్యాంట్ కొంటే మూడు జీన్స్ ప్యాంట్లు ఫ్రీ. ఒక చీరల షాప్ లో పది శాతం డిస్కౌంట్ ఆఫర్. రోడ్ మీదే జాకీ బ్రాండ్ అండర్‍వేర్స్ అమ్మేస్తున్నాడొకడు. స్వీట్ షాప్ లో యజమాని కస్టమర్స్ లేక ఈగలు తోలుకుంటున్నాడు. బిర్యానీ తో పాటు పెప్సీ ఫ్రీ. టీ కొట్టు దగ్గర పేపర్ చదువుకుంటూ, సిగెరెట్ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటోన్న యువకులు. సూపర్ మార్కెట్ లో ఆఫర్లే ఆఫర్లు. ఏది కొన్నా ఇంకేదో ఫ్రీ. బస్ స్టాప్ లో వరదలో కొట్టుకొస్తున్నట్టు చేరుతున్న జనాలు. వారిని కాపాడ్డానికే వచ్చినట్టు పట్టినంతమందిని ఎక్కించుకుని వెళ్తోన్న బస్సులు….

8

చీరల షాప్ పక్కనే ఒక ఫోటో స్టూడియో; ఆ స్టూడియో పక్కనే ఒక స్వీట్ షాప్; దాని పక్కనే ఒక మెన్స్ వేర్ షాప్; ఆ షాప్ పక్కనే ఒక నగల షాప్; ఆ పక్కనే ఒక కిరాణా షాప్; దాని పక్కనే మరో బట్టల షాప్. సునీత ఆ బట్టల షాప్ లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ దొరికే షాప్ లా ఉందది. ఒక టీ షర్ట్ మీద “I LOVE YOU” అని వివిధ సైజుల్లో చాలా సార్లు ప్రింట్ చేసిఉంది. ఆ టీ షర్ట్ మీద మనసు పారేసుకుంది సునీత. “అమ్మకి ఇంగ్లీష్ అర్థం కాదు. కాబట్టి సమస్య లేదు. ఈ టీ షర్ట్ వేసుకుని రోడ్ మీద నడుస్తుంటూ నలుగురూ నన్నే చూడ్డం ఖాయం. అదృష్టం బావుంటే ఎవరో ఒక అందమైన అబ్బాయికి నేను నచ్చినా నచ్చొచ్చు,” అనుకుంది.

కాసేపటికి ఆ బట్టల షాప్ లోనుంచి బయటకు నడుస్తోంటే ఏదో తెలియని ఫీలింగ్‍తో ఆమె మనసంతా నిండిపోయింది. అది సంతోషమో, దుఃఖమో తెలియలేదు ఆమెకి. బహుశా అవి రెండు కలగలిపిన ఒక ఫీలింగేమో! ఆ బట్టలషాప్ ఆనుకుని ఒక పెట్రోల్ బంక్; ఆ పెట్రోల్ బంక్ కి పక్కనే ఒక నగల షాప్; దాని పక్కనే మరొక నగల షాప్; దాని పక్కనే మరొకటి.

నగలషాప్ ముందు నిల్చుని అద్దాల వెనుక షోకేస్ లో ఉంచిన నగల వైపే కళ్లార్పకుండా చూస్తూ తన పెళ్లి గురించి ఊహించుకుంది. అది హైదరాబాద్ లో కెల్లా అతి పెద్ద ఫంక్షన్ హాల్. పది వేల మందికి పైగా కూర్చోగలిగిన విశాలమైన ప్రదేశం. అతిధులకు ఆహ్వానం పలుకుతూ బంగారు అక్షరాలతో ఉన్న పెద్ద బోర్డ్. బంగారు రంగు స్థంభాలతో, గులాబీ పుష్పాలతో అల్లిన తోరణాలతో కట్టబడిన పెళ్లి మండపం. మండపంలో కూర్చుని ఉన్న పెళ్లికొడుకు చూడముచ్చటగా ఉన్నాడు. చూడ్డానికి అతను – కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉన్నాడు.

ఇంతలో ఎవరో వచ్చి దభ్ మని ఢీకొనడంతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది సునీత. ఆరడుగులు ఉన్న ఒక యువకుడు ఫుట్‍పాత్ మీద పరిగెడ్తూ ఆమెను గుద్దుకున్నాడు; ఆ తాకిడికి ఆమె దాదాపు కిందపడిపోయినంత పనయింది. ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చి అతన్ని బూతులు తిట్టసాగింది. ఆమె తిట్లు అతనికి చేరకముందే అతను జనాల్లో కలిసిపోయాడు. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న నీళ్లల్లో రాయి పడినట్టు ఆ చుట్టుపక్కలంతా కలకలం రేగింది. అక్కడేం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు కానీ కాసేపటికి అక్కడ ప్రత్యక్షమైన పోలీసులను చూడగానే ఆమె మనసు కీడును శంకించింది. పోలీసులు టక్ టక్ మని బూట్లతో శబ్దం చేసుకుంటూ చేతిలో తుపాకీలు పట్టుకుని ఆమెను దాటుకుంటూ వెళ్తుండగా ఆమె కోపం కాస్తా భయంగా మారింది. “ఎవరో నగల షాప్ లో దొంగతనం చేశారంట!”. ఆ మాట ఎవరన్నారో ఆమెకు తెలియలేదు కానీ ఒక్కసారిగా ఆమె గుండె ఆగినంత పనయింది.

ఆ చుట్టుపక్కల జనాలు ఒక్కసారిగా చెట్టుమీదనుంచి ఎగిరిపోయే పక్షుల్లా చెల్లాచెదరయ్యారు. సునీత కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆమె మెదడు మొద్దుబారిపోయింది. అక్కడ్నుంచి పారిపోవాలనే అనుకుంది కానీ ఆమె కాళ్లు అందుకు సహకరించకలేదు. ఆమెకు దగ్గర్లోనే ఇద్దరు వ్యక్తులు గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

“ఎంతైనా వాడు ధైర్యవంతుడు బావా!” “ఒక్కడి వల్ల అయ్యేపనేనా ఇది?” “చేతిలో తుపాకీ ఉంది. తుపాకీ గురిపెట్టి రాయితో షోకేస్ పగలకొట్టి కోటి రూపాయల నగలు తీసుకుని పారిపోయాడంట!” “కోటి రూపాయలా?” “అవునంట. మొత్తం డైమండ్స్ తీసుకెళ్లాడంట.” “మొత్తానికి చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడు.” “నిజమే ధైర్యముంటే ఇలా లాటరీలు కొట్టుకోనక్కర్లేదు.” సునీత వాళ్ల వైపు చూసింది; అందులో ఒకడు మెడలో ఒక చెక్క స్టాండ్ వేసుకుని లాటరీ టికెట్లు అమ్ముతున్నాడు.

9

చంద్రశేఖర్ నడుస్తున్నాడు. రోడ్ మీదంతా విపరీతంగా జనాలు ఉన్నారు; అమీర్‍పేటలో ఎప్పుడూ ఇంతే. ఒక పోకిరీ కుర్రాడు డ్యాన్స్ చేస్తున్నట్టుగా నడుస్తూ జనాల కాళ్లు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఒకావిడ అతన్ని పచ్చి బూతులు తిడుతోంది; వాడు నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

ఒక కళ్లద్దాల షాపు ముందు నిలబడి, షో కేస్ లో పెట్టి ఉన్న ఫ్రేము లేని కళ్లజోడు వైపు చూశాడు చంద్రశేఖర్. ఆ కళ్లజోడు అతనికి చాలా బాగా నచ్చింది. “ఒకప్పుడు కళ్లజోళ్లు పెట్టుకోవాలని చాలా ఆశ. కానీ ఇప్పుడు సినిమా చూడాలన్నా, పుస్తకం చదవాలన్నా కళ్లజోళ్లు తప్పనిసరి అయిపోయింది. జీవితంలో అన్నీ ఇంతే! కావాల్సినప్పుడు ఏదీ దొరకదు,” అనుకున్నాడు చంద్రశేఖర్. ఇంతలో దగ్గర్లోనే నిల్చుని ఇద్దరు వ్యక్తులు గట్టిగా మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిన పడ్డాయి. వాళ్లిద్దరూ మధ్యవయస్కులు; ఒకరు లావుగా మరొకరు సన్నగా ఉన్నారు. ఆ లావాటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు పెద్దవి చేస్తున్నాడు; ఆ సన్నపాటి వ్యక్తి కళ్ళు చిన్నవి చేసి మాట్లాడుతున్నాడు.

“నీకు తెలియదా?”

“ఏంటి?”

“నగల దుకాణంలో దొంగలు పడ్డారు.”

“అవునా? ఇంత పట్టపగలే!”

“అవును. వజ్రాలు పట్టుకుని పారిపోయారు.”

“వజ్రాలంటే బాగా రేటుంటాయేమో కదా!”

“అవును. కోట్ల రూపాయలు విలువు చేసే వజ్రాలు.”

“ఎవరైనా పోయారా?”

“లేదనుకుంటా.”

“నేను చెప్తూనే ఉన్నా. ఈ హైదరాబాద్ లో ఇంక బతకడం కష్టమే!”

నిజమేనన్నట్టు ఆ లావాటి వ్యక్తి తలూపాడు. “సరే ఉంటాను,” అన్నాడు ఆ సన్నపాటి వ్యక్తి. “సరే. నేనూ బయల్దేరుతున్నా,” అన్నాడు ఆ లావాటి వ్యక్తి. ఆ లావతను తూర్పు వైపు నడిచాడు; సన్నటాయన పడమర వైపుకి నడిచాడు.

చంద్రశేఖర్ ముందుకు నడుస్తుండగా ఒక నల్ల కుక్క కనిపించింది. అవడానికి కుక్కే అయినా చూడ్డానికి పందిలా ఉందది. బస్ స్టాప్ దాకా మూతి నేలకు ఆనించి వాసన చూస్తూ నడుచుకుని వెళ్లి, అక్కడున్న స్తంభం దగ్గర కాలెత్తి పని కానిచ్చింది. పక్కనే ఉన్న ఒకావిడ చిరాగ్గా కుక్కని అదిలించింది. అది మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. ఆవిడే కొంచెం దూరంగా వెళ్లి నిల్చుంది. ఆ కుక్కని చూడగానే చంద్రశేఖర్ కి తన ఊర్లో పిచ్చి కుక్క గుర్తొచ్చింది. చిన్నప్పుడు బడికి వెళ్లేటప్పుడు పిచ్చి కుక్క వెంటపడితే పరిగెట్టుకుని ఇంటికి వచ్చి, అమ్మను తోడుగా తీసుకుని బడికి వెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. అలా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నడుస్తున్న అతను ఒక బట్టల షాప్ ముందు ఆగాడు.

10

కాసేపటికి భయం తగ్గపోనే సునీత అక్కడ్నుంచి బయల్దేరింది; లాటరీ టికెట్లు అమ్ముకునే వ్యక్తి చుట్టూ ఇంకా జనాలు పోగై ఉన్నారు. అక్కడున్న ఎవరూ లాటరీ టికెట్లు కొనేలా లేరు. అవి అమ్మే అతనికి కూడా వాటిని అమ్మడంకంటే అంతకుముందు అక్కడ నగల దుకాణంలో జరిగిన దొంగతనం గురించి చెప్పడం గురించే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది. గాలికి రెపరెపలాడుతున లాటరీ టికెట్లను చూసి, “నాకు లాటరీ తగిలితే మూడు ఇళ్లు కొంటాను. ఒకటి బంజారా హిల్స్ లో; రెండు అమీర్ పేట్ లో. బంజారాహిల్స్ ఇంట్లో అమ్మతో హ్యాపీగా ఉండాలి. అమీర్‍పేట్ ఇళ్లు రెండూ నాన్నకి అప్పచెప్పి ఆ వచ్చిన అద్దె డబ్బులుతో నాన్నని ఇష్టమొచ్చినట్టు బతకమని చెప్పెయ్యాలి,” అనుకుంది సునీత. – సునీత తండ్రి చాలా విచిత్రమైన వ్యక్తి. ఏ మధ్యాహ్నానికో నిద్రలేచి, భోజనం చేసి బయటకు వెళ్తాడు. మళ్లీ ఏ అర్థరాత్రో ఇంటికి తిరిగివస్తాడు. అసలాయన బయటకెళ్లి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు.

సునీత అలా నడుచుకుంటూ దొంగతనం జరిగిన నగలషాప్ ముందు ఆగింది. అక్కడ అప్పటికే చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు. ఆ నగల షాప్ షట్టర్ లు సగం వరకూ దించి ఉండడంతో లోపల ఏం జరుగుతుందో అని ఆసక్తి గా కిందకు వంగి చూసింది సునీత. హడావుడిగా తిరుగుతున్న కొంతమంది కాళ్లు తప్ప మరేమీ కనిపించలేదు. షాప్ ముందు జనాల తాకిడి ఎక్కువ అవుతుండడంతో లోపల్నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి జనాల్ని అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని గొడవ పెట్టారు. జనాలు అక్కడ జరిగిన దొంగతనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ అక్కడ్నుంచి కదలటం లేదు.

సునీత కి కొంచెం దూరంలో ఇద్దరు ప్రేమికులు నిలబడి ఉన్నారు.అబ్బాయేమో తన ఎడమచేతిని అమ్మాయి భుజం పై వేసి నిలబడి ఉన్నాడు. అమ్మాయి తన కుడి చేతిని ఆ అబ్బాయి నడుం చుట్టూ వేసింది.

“నాకూ ఒక బాయ్‍ఫ్రెండ్ దొరికినప్పుడు నేను కూడా ఇలాగే చేతులు వేసుకుని హాయిగా నడుస్తాను,” అనుకుంది సునీత. “కానీ ఇంతవరకూ ఎవరూ నాకెందుకు ఒక్కడు కూడా ప్రపోజ్ చెయ్యలేదు?” అని ప్రశ్నించుకుంది. “రోజూ కూరగాయలు కొనడానికి షాప్ కెళ్తే అక్కడ రవి గాడు నేనంటే ఇష్టమున్నట్టు చూస్తుంటాడు కానీ వాడి మొహం అస్సలు నచ్చదు. వాడు; వాడి పళ్లెత్తు మొహం. దానికి తోడు బుగ్గ మీద పెద్ద మచ్చొకటి. నా బాయ్‍ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? అచ్చం సినిమా హీరోలా ఉండాలి.”

అలా ఆలోచిస్తూ కొంచెం దూరం నడవగానే ఎదురుగా వస్తున్న ఒకతన్ని చూసింది సునీత. పొడుగాటి జుట్టు, సన్నగా ఉన్నాడతను. జీన్స్, టీషర్ట్ వేసుకుని జేబులో చేతులు పెట్టుకుని సిగెరెట్ తాగుతూ స్టైల్ గా నడుస్తున్నాడు.

సునీత అతనికి ఎదురుగా నడిచి అతని వైపు చూసింది. అతను కూడా ఆమెను చూశాడు. కానీ అతను వెంటనే తలతిప్పుకుని ముందుకు వెళ్లిపోవడంతో సునీత నిరాశ చెందింది. దిగులుగా వెనక్కి తిరిగి అతను వెళ్తున వైపే చూసింది. అతను మాత్రం అసలేం పట్టనట్టు వెళ్లిపోయాడు. ఒక్కసారిగా ఎవరో లాగి చెంపమీద చెళ్లున కొట్టినట్టనిపించింది. రోడ్ మీద వెళ్తున్న ఏ లారీ కిందో పడి చచ్చిపోదామనిపించింది ఆమెకి.

దిగులుగా అమీర్‍పేట్ రోడ్ గుండా ముందుకు నడుస్తుండగా, “ఇంక చాలు. ఇంటికి వెళ్లాలి,” అనిపించింది సునీతకి. కాకతీయ మెస్ లేన్ లోనుంచి తన ఇంటివైపుకి నడుస్తుండగా ఆమెకి మళ్లీ ఆ యువకుడే గుర్తొచ్చాడు. పొడుగాటి జుట్టు, జీన్స్ ప్యాంట్, టీషర్ట్. ఒక చెయ్యి ప్యాంట్ జేబులో పెట్టుకుని, మరొక చేతిలో సిగెరెట్ పట్టుకుని స్టైల్ గా ఉండేవాడ్నే తను పెళ్లిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ఆమె. ఇంకో కొన్ని అడుగులు వేస్తే ఇంటికి చేరుతుందనగా రోడ్ మీద పడి ఉన్న ఒక ఫోటో ఆమె దృష్టిని ఆకర్షించింది.

11

బట్టల షాప్ ముందు నిల్చుని అద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకున్నాడు చంద్రశేఖర్. మొహం మీద ముడతలు, తలమీద తెల్లవెంట్రుకలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. పెరిగిన గెడ్డాన్ని తడుముకుంటూ వయసులో ఉన్నప్పుడు తనెంత అందంగా ఉండేవాడో తలుచుకుంటూ దిగులుగా అద్దంలోకి చూశాడు అతను.

12

నేల మీద ఉన్న పడి ఉన్న ఆ ఫోటో ఎందుకో సునీతని ఆకర్షించింది. కొంచెం వంగి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది. ఆసక్తిగా ఆ ఫోటో ని చూడగానే ఒక్కసారిగా ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అలాంటి చిత్రం చూడ్డం ఆమెకిదే మొదటిసారి. “ఛీ,” అనుకుంది; చింపిపారేయాలనిపించింది. కానీ ఇంతలోనే మళ్లీ ఎందుకో దాన్ని జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్లాలనిపించింది. “అమ్మో! అమ్మ చూస్తే…” అని భయపడింది. “పర్స్ లో దాచిపెడ్తే ఎలా చూస్తుంది? అవును. చూస్తే చూడని. రేపు పెళ్లాయక ఇదే కదా చెయ్యాల్సింది,” అనుకుని ఆ ఫోటోని పర్స్ లో పెట్టుకుని ఇంటికి బయల్దేరింది.

ఇంట్లోకి అడుగుపెట్టేసరికి, ఆమె తల్లి వంటింట్లో ఉంది. సునీత సరాసరి బెడ్రూంలోకి వెళ్లి ఆ ఫోటో తీసి జాగ్రత్తగా గమనించింది. ఆ ఫోటో చూస్తున్నకొద్దీ ఆమె మొహం ఎరుపెక్కసాగింది. కాసేపటికి తన బట్టలన్నీ తీసేసి, కళ్లు పెద్దవి చేసి అద్దంలో తనని తాను చూసుకుంది.

13

అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ గతంలోకి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. హఠాత్తుగా తన తండ్రి చనిపోవడంతో విజయనగరం తిరిగివెళ్లడం, తల్లిని ఊరిలో ఒంటరిగా వదిలిరాలేక, తండ్రి కష్టపడి కొన్న రెండెకరాల పొలం అమ్మడం ఇష్టం లేక అక్కడే ఉండిపోవడం…, అన్నీ గుర్తొచ్చాయి. తన సినిమా కలలను కొన్నాళ్లు వెనక్కి నెట్టి, నాగలిపట్టి ముందుకు నడిచిన ఆ రోజులు అతని కళ్లముందు మెదిలాయి.

పెళ్లి చేసుకుంటే మరో బాధ్యతని కొని తెచ్చుకున్నట్టవుతుందని, తల్లి ఎంత గొడవచేసినా పెళ్లి చేసుకోలేదు చంద్రశేఖర్. ఏదో ఒక రోజు హైదరాబాద్ కి తిరిగివచ్చి మళ్లీ సినిమాల్లో పని చేయాలన్నది అతని కోరిక. కానీ మళ్లీ ఇన్నాళ్లకి వేరే ఏదో పని మీద హైదరాబాద్ వస్తాడని ఏ రోజూ అనుకోలేదు అతను. సినిమాల్లో ఏదో ఒక పని చేస్తే చాలని బయట అందరికీ చెప్పుకున్నా, అతనికి మాత్రం సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం లోలోపల బలంగా ఉండేది. ఇప్పుడు అద్దంలోతన రూపాన్ని చూసుకుని, కలలు చెదిరిపోయినట్టనిపించింది అతనికి.

14

అద్దంలో తన మొహం చూసుకున్నప్పుడల్లా, తను అందగత్తెననే అనుకునేది సునీత. తనంత అందమైన మొహం చాలా తక్కువమందికే ఉంటుందనుకునేది. ఛాన్స్ దొరికితే చాలు అద్దం ముందు కూర్చుని తన అందం గురించి మనసులోనే పొగుడుకునేది. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు, ఆమె దృష్టిలో మాత్రం తనో పెద్ద అందగత్తె. ఒక్కోసారి మరీ అద్దం దగ్గరకు వెళ్లిపోయి, “కాజల్ అగర్వాల్ కంటే నాకేం తక్కువ; అసలు నాకెవరైనా ఛాన్స్ ఇస్తే తెలుగులో పెద్ద హీరోయిన్ ని ఆయిపోనూ!” అని మురిసిపోయేది.

ఇంకొన్నిసార్లు ఇంకా అద్దం దగ్గరకు వెళ్లిపోయి, “అసలయినా ప్రియాంక చోప్రా నాకంటే ఏం బావుంటుది? అసలు నాకెవరైనా ఛాన్స్ ఇస్తే హిందీ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ని అయిపోతాను,” అని మురిసిపోయేది.

తనిలా కలల ప్రపంచంలోకి వెళ్లినప్పుడల్లా ఒక్కోరకంగా తనని ఊహించుకునేది సునీత; ఆ కలలు ఎంతవరకూ నిజమవుతాయో తెలియకపోయినా ఆమె ఊహలు అమాయకంగానే ఉండేవి. కానీ ఈ రోజు ఆమె కలల ప్రపంచం అలా లేదు. దారిలో దొరికిన ఆ ఫోటో చూసినదగ్గర్నుంచీ ఆమె ఊహల్లో చిత్రాలే మారిపోయాయి. గతంలో ఆమెకి ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉన్న యువకుడెవరో తనతోపాటే ఆ గదిలో ఉన్నట్టుగా ఊహించుకుంది. ఆ ఊహ తన మదిలో ప్రవేశించింది మొదలు ఆమె శరీరం మొత్తం బిగుసుకుపోతున్నట్టుగా అనిపించింది. ఆ ఒత్తిడికి ఆమె మొహం ఎరుపెక్కింది. ఆమె శరీరమంతా ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్టుగా ఒకవైపు హాయిగా మరోవైపు బాధగానూ అనిపించింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అద్దంలో తనని చూసుకుని ఒక్కసారిగా తనమీద నియంత్రణ కోల్పోయింది. భరించలేని ఉద్వేగంతో అద్దంలో తన ప్రతిబింబాన్ని గట్టిగా ముద్దాడింది. ఇదంతా అమెకి కొత్తగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆమె కొక తోడు దొరికింది. ఆ తోడు తనే!

ఇంతలోనే తను చేసిన పనికి ఆమె కి సిగ్గేసింది. తలవంచుకుని కూర్చుంది. అద్దంలో తనని చూసుకోడానికి కానీ, ఆ ఫోటో వైపు మరోసారి చూడ్డానికి కానీ ధైర్యం సరిపోలేదు. ఆమె ఆలోచనలు ఇంకేదో విషయం మీదకి మరల్చాలని ప్రయత్నించింది. కాజల్ అగర్వాల్, ప్రియాంకా చోప్రా లా తనూ హీరోయిన్ అయిపోతే తన జీవితం ఎంతబావుంటుందో ఊహించుకోవడానికి ప్రయత్నం చేసింది.

బాత్‍రూంలోకి అడుగుపెట్టి నగ్నంగా ఉన్న తన శరీరాన్ని చూసుకుంది. గతంలో ఎప్పుడూ ఆడదాని అందం మొహంలోనే ఉంటుందనుకునేది; కానీ ఆ ఫోటో చూసిన దగ్గర్నుంచీ తన మిగతా శరీరం మీద మరింత ఆసక్తి కలిగింది. చూడ్డానికి మొహంలో చిన్నపిల్లతనం మాయమవలేదు కానీ, తన మిగిలిన శరీరం మాత్రం మంచి వయసులో ఉన్న వాళ్లలానే ఉంది. ఇదంతా ఆమెకి చాలా ఆశ్చర్యం కలగచేసింది. ఇది నేనేనా అని అనుమానం కూడా కలిగింది ఆమెకి. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్స్ ఆమెకి కలగలేదు.

స్నానం చేస్తూ ఒళ్లంతా సబ్బు రాసుకోవడం ఆమెకు మరో కొత్త అనుభూతి. ఎప్పుడూ హడావుడిగా స్నానం కానిచ్చేసి వెళ్లే సునీత ఈ రోజు తన చేతులతో తన శరీరానికి సబ్బు రాసుకుంటూ, వేరెవరి చేతులో తన శరీరాన్ని సున్నితంగా తాకుతున్నట్టుగా కొత్తగా ఫీలయింది. ఆ చేతులు, కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉండే అతనివైతే బావుండనుకుంది. అంతేకాదు అతను తనతోపాటే కలిసి స్నానం చేస్తే ఇంకెంతబావుంటుందీ అని ఊహించుకుంది. అలా ఊహించుకుంటూ…బాత్‍రూం లో గంటకి పైగానే గడిపేసింది.

బాత్‍రూం నుంచి బయటకొచ్చి, వంటికి టవల్ చుట్టుకుని గది పైకప్పు వైపు చూస్తూ తననిలా కాల్చివేస్తున్న ఆ ఫోటో ని ఉంచుకోవడమో, స్టవ్ మీద కాల్చేయడమా అని ఆలోచించి, చివరికి ఉంచుకోవాలనే నిర్ణయించుకుని దాన్ని తిరిగి తన పర్స్ లో జాగ్రత్తగా పెట్టుకుని తన ఊహాప్రపంచంలోకి వెళ్లిపోయింది. దూరంగా ఎక్కడ్నుంచో, ఎఫ్‍ఎమ్ లో “కొత్త కొత్తగా ఉన్నది. స్వర్గమిక్కడే అన్నది.” పాట వస్తోంది.

15

అద్దంలో చూసుకుంటున్న చంద్రశేఖర్ కి కాసేపు అందులో ఉన్నది తనేనా అనిపించింది. రెండు మూడు నిమిషాల పాటు మారిన తన రూపురేఖలను దిగులుగా పరిశీలించి హఠాత్తుగా అక్కడ్నుంచి బయల్దేరాడు. ఫుట్‍పాత్ మీద అంతమంది జనాల్లో నడుస్తున్న అతన్ని ఒంటరితనం చుట్టుముట్టేసింది. కొంచెం సేపు ఎక్కడైనా కూర్చోవాలనిపించి పక్కనే ఉన్న ఇరానీ కెఫె లోకి వెళ్లాడు.

intersectionజనాలు ఎక్కువగానే ఉన్నా మూలగా ఉన్న టేబుల్ ఖాళీగా కనిపించడంతో అక్కడ కూర్చున్నాడు. ఒక కాఫీ ఆర్డరిచ్చాడు. చుట్టూ కూర్చుని ఉన్న జనాలవైపు చూస్తుండగా అప్పుడే కెఫే లోకి వస్తున్న ఒక యువకుడ్ని చూశాడు. అతను పొడుగాటి జుట్టుతో, సన్నగా ఉన్నాడు. జీన్స్, టీషర్ట్ వేసుకుని జేబులో చేతులు పెట్టుకుని సిగెరెట్ తాగుతూ స్టైల్ గా నిలబడి ఎవరి కోసమో చూశాడు. చంద్రశేఖర్ కూర్చున్న పక్కన టేబుల్ దగ్గర బాగా గడ్డం పెంచుకుని ఒకతను కూర్చుని ఉన్నాడు. అతను కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని స్టైల్ గా సిగెరెట్ తాగుతున్నాడు. ఆ పొడుగాటి వ్యక్తి గడ్డం అతన్ని చూడగానే అతని టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

“చందూ భాయ్ ఏడి?”

“భాయ్ వెళ్లి గంటయింది. నీ కోసం చూసి చూసి ఇప్పటికి నాలుగు ఛాయ్ లు అయినయ్.”

“ఎంతిచ్చాడు?”

“పన్నెండు.”

“అంతేనా? పోయినసారి పదిహేనిచ్చాడు?”

“ఏమో నీతో మాట్లాడతానన్నాను.”

“నాతో మాట్లాడ్డానికి నువ్వెందుకు? పదిహేనుకి తక్కువ తీసుకోవద్దని చెప్పి పంపించినా నీకర్థం కాదా?”

గడ్డం వాడికి కోపమొచ్చింది. గట్టిగా దమ్ములాగి అక్కడ్నుంచి లేవబోయాడు.

“అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎక్కడికెళ్తున్నావ్?”

“మీ మధ్యలో నన్ను చంపేస్తున్నారు. మీరే డైరెక్ట్ గా డీల్ చేసుకోకుండా ప్రతి సారీ నన్ను ఇరికిస్తున్నారు. నావల్ల కాదు,” అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు గడ్డం వ్యక్తి.

“రేయ్. ఆగు,” అంటూ అతనివెంటే బయల్దేరాడు పొడువాటి వ్యక్తి.

వాళ్లిద్దరూ వెళ్లిపోతుంటే సర్వర్ వాళ్లని ఆపాడు.

“ఏంటి?”

“బిల్”

గడ్డం వ్యక్తి ఇరవై నోట్ తీసి సర్వర్ చేతిలో పెట్టి వేగంగా అక్కడ్నుంచి బయటకు నడిచాడు.

వాళ్లలా వెళ్లిపోగానే పక్కనే కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు కాలేజ్ కుర్రాళ్ల వైపు చూశాడు చంద్రశేఖర్. వాళ్లపాటికి వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు; ఒక కుర్రాడి మొబైల్ లో మాత్రం ఎఫ్‍ఎమ్ లో ““కొత్త కొత్తగా ఉన్నది. స్వర్గమిక్కడే అన్నది” పాట వస్తోంది.

ఆ పాటంటే చంద్రశేఖర్ కి చాలా ఇష్టం. తనెప్పుడైనా సినిమా తీస్తే, ఆ సినిమాకి ఇళయరాజా చేత పాటలు కొట్టించాలనుకునేవాడు. సినిమా కలలు కల్లలైపోయి తిరిగి విజయనగరం వెళ్లిపోయాక తన ఇంట్లోని పాత టేప్ రికార్డర్ లో కూలీనెంబర్ 1 క్యాసెట్ పెట్టుకుని పదే పదే ఈ పాట విన్న రోజులు గుర్తుకొచ్చాయి. చంద్రశేఖర్ కి ఇప్పుడు నిజంగానే ఇదంతా కొత్తగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో ఎన్నో కలలతో అడుగుపెట్టాడు. మళ్లీ చాలా ఏళ్లకి మరో సారి ఇక్కడికి తిరిగివచ్చాడు కానీ, అప్పటి ప్రపంచం వేరు; ఇప్పటి ప్రపంచం వేరు. అప్పటి చంద్రశేఖర్ వేరు; ఇప్పటి చంద్రశేఖర్ వేరు.

దాదాపు నలభై ఏళ్ల వయసున్న ఒక బక్కచిక్కిన వ్యక్తి తన ఏడేళ్ల కొడుకుతో కెఫేలోకి వచ్చాడు. చంద్రశేఖర్ కూర్చున్న టేబుల్ పక్కనే కూర్చున్నారు వాళ్లు.

“నాకు ఐస్ క్రీం కావాలి,” అన్నాడు పిల్లాడు.

“ఐస్‍క్రీం లేదు ఏం లేదు. నోర్ముయ్,” అన్నాడా వ్యక్తి.

“నాకు ఐస్ క్రీమ్ కావాలి,” మళ్లీ అన్నాడా పిల్లాడు.

“నాకు చాక్లెట్ కావాలి.”

“నోర్ముయ్.”

రెండు సమోసాలు, ఒక టీ ఆర్డర్ చేశాడా వ్యక్తి. సమోసా పిల్లాడికిచ్చి తినమన్నాడు.

“నాకు ఐస్ క్రీం కావాలి,” ఏడుస్తూ చెప్పాడా పిల్లాడు.

“దెబ్బలు పడతాయ్. సమోసా తిను,” గట్టిగా అన్నాడు.

“నాకు అమ్మ కావాలి,” అన్నాడా పిల్లాడు గట్టిగా ఏడుస్తూ.

“నోర్మూసుకుని తిను,” అన్నాడతను సమోసా తింటూ.

పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. కెఫెలో అందరూ వాళ్ల వైపే చూశారు. సమోసా తినడం పూర్తి చేసి సాసర్లో టీ పోసి కొడుకు ముందు పెట్టాడు .

“నాకు సమోసా వద్దు. చాక్లెట్ కావాలి,” అని సాసర్ ని గట్టిగా తోశాడు. సాసర్ లో ఉన్న టీ మొత్తం టేబుల్ మీద పడిపోయింది. కోపం ఆపుకోలేక ఆ పిల్లాడి చెంప ఛెళ్లుమనిపించాడు. అంతే, ఒక్కసారిగా పోలీస్ సైరన్ లా ఏడవడం మొదలు పెట్టాడా పిల్లాడు. కెఫెలో కూర్చున్న జనాలందరూ వాళ్లనే చూస్తున్నారు. అక్కడ్నుంచి లేచి కొడుకు చెయ్యిపట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు నడిచాడా వ్యక్తి.

చంద్రశేఖర్ జేబులోంచి సిగెరెట్ తీసి వెలిగించాడు.

16

సునీత బెడ్ మీద పడుకుని మెల్లిగా తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ తన కలలప్రపంచంలో మునిగిపోయింది. “నేను పెద్ద హీరోయిన్ అయిపోయాక, ఎంతో మంది అందమైన అబ్బాయిలు నా వెంటపడతారు. వాళ్లల్లో కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉండే అబ్బాయి కూడా ఉంటాడు. తనని పెళ్లిచేసుకోమని అతను అడుగుతాడు. నేను వెంటనే ఒప్పుకోను. అతను బతిమిలాడుతాడు. అయినా సరే ఒప్పుకోను. అతను నాకు వజ్రాల హారం కొని తెస్తాడు. అప్పుడు కూడా ఒప్పుకోను…” ఇలా సాగాయి ఆమె పగటికలలు.

అలా కలలుకంటూ ఇంటిపైకప్పు వైపే చూస్తున్న సునీతకు కాసేపటికి అక్కడంతా ఏవో చిత్రాలు కదుల్తున్నట్టుగా అనిపించింది. కొంచెం సేపటికి సీలింగ్ మొత్తం ఒక పెద్ద సైజు టివి లా అనిపించింది ఆమెకు. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ. ఒక వైపు పోలీసుల జనాల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జనాల్ని ఆపటం వారి వల్ల కావటం లేదు. ఇంతలో అక్కడకి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఒక అందమైన యువతి కిందకు దిగింది. పోలీసులు ఆమెను జనాల తాకిడి నుంచి కాపాడుతూ అక్కడ్నుంచి ముందుకు నడిపిస్తున్నారు. ఆమె ఎవరో ఆని సునీత ఆసక్తిగా చూసింది. ఆశ్చర్యం. ఆమె అచ్చం తనలానే ఉంది.

మందుతాగితే మత్తు ఎక్కుతుందని సునీత కి తెలుసుకానీ, ఏమీ తాగకుండానే, ఏమీ చెయ్యకుండానే ఆమెకు ఈ రోజు మత్తెక్కేసింది. ఇదొక కొత్తరకమైన అనుభూతి ఆమెకి. సీలింగ్ మీద చిత్రాలు మారిపోతున్నాయి. సునీత ఇప్పుడు అందంగా అలకరించిన పెళ్లిమండపంలోకి అడుగుపెట్టింది. లోపల కొన్ని వేలమంది జనాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. మండపంలో పెళ్లికొడుకు కూర్చుని ఉన్నాడు. అతను చూడ్డానికి కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉన్నాడు.

“ఈ టైంలో ఆ నిద్రేంటే?” అని అమ్మ మాట వినిపించడంతో సునీత తిరిగి ఈ లోకానికొచ్చింది.

“ఏంటమ్మా? ఏం చెయ్యమంటావిప్పుడు?”

“వచ్చి బియ్యం కడిగి కుక్కర్ లో పెట్టు.”

“నువ్వే పెట్టమ్మా. నాకు టైం అవుతుంది,” అని అక్కడ్నుంచి లేచింది సునీత.

“ఎక్కడికెళ్తున్నావే?”

“నేను సినిమాకెళ్తున్నాను.”

“డబ్బులెక్కడివి?”

“ఉన్నాయిలే!”

17

చంద్రశేఖర్ తల పైకెత్తి సిగెరెట్ పొగ గాల్లోకి వదిలాడు. అప్పటికే సగం సిగెరెట్ అయిపోయింది. సిగెరెట్ తాగినప్పుడల్లా అతనికి గత కాలపు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న చాలా చిన్న విషయాలే ఇలాంటప్పుడు ప్రత్యేకంగా బయటకు వస్తుంటాయి. చాలా చిన్న విషయాలు; చాలా సాధారణమైనవి కూడా. విజయనగరం మినర్వా థియేటర్ లో చంటి సినిమా చూడ్డం; పోస్ట్ మాస్టర్ కూతురు మంగ సైకిల్ మీద వస్తుంటే చెట్టు చాటున దాక్కుని చూడ్డం; సైకిల్ ఎక్కి గంటస్తంభం చుట్టూ తిరగడం…ఇలా ఎన్నో విషయాలు. పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫుల్లా అతని కళ్లముందుకు చేరి దూరమవుతున్నాయి. బహుశా చంద్రశేఖర్ కి ఇక మిగిలి ఉన్నది గతమే కాబోలు. అందుకే జీవితాన్ని కొనసాగించడానికి అతనికి కావాల్సిన ఇంధనం ఈ జ్ఞాపకాలే అయ్యుండొచ్చు.

మొదటిసారిగా సిగెరెట్ తాగిన సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది. స్కూల్ లో ఏడో తరగతి లో ఉండగా పైడితల్లి ఒకరోజు వాళ్లనాన్న దగ్గర్నుంచి రెండు చార్మినార్ సిగెరెట్లు దొంగలించి తెచ్చాడు. ఊరవతల పొలాల్లోకెళ్లి వాళ్లు మొదటిసారిగా సిగెరెట్ తాగారు. సిగెరెట్ తాగిన మొదటిసారి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు చంద్రశేఖర్. ఆ విషయమే ఇప్పుడు తాపీగా సిగెరెట్ పొగ వదుల్తూ గుర్తుకు తెచ్చుకున్నాడతను.

సిగెరెట్ తాగడం పూర్తిచేసి పక్క టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ తీసుకున్నాడు. సినిమా ప్రకటనలు ఉన్న లోపలి పేజీ వెతికాడు. కొత్తగా విడుదలైన సినిమా ఒకటి అమీర్‍పేట్ లోని ఒక థియేటర్ లో ఆడుతోందని చూసి, సినిమాకి వెళ్దామని నిర్ణయించుకుని వెయిటర్ కి డబ్బులిచ్చి బయటకు నడిచాడు చంద్రశేఖర్.

18

 ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్ దాటడం కోసం ఆగింది సునీత. ఎదురుగా గోడ మీద చాలా సినిమా పోస్టర్లు కనిపించాయి. ఒక దాంట్లో కాజల్ అగర్వాల్; మరొక దాంట్లో రెజీనా; మరొక దాంట్లో రకుల్ ప్రీత్; ఇంకో దాంట్లో త్రిష…

వాటి వైపే చూస్తూ ఆ పోస్టర్స్ పక్కనే తను నటించిన సినిమా పోస్టర్ కూడా ఉండడంతో ఆశ్చర్యపోయింది. సినిమా పేరు “కొత్త కొత్తగా ఉన్నది.” ఆ పోస్టర్ లో తన పక్కన ఉన్న హీరో కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉన్నాడు.

“జరగమ్మా,” అని ఎవరో ఆమెని తొయ్యడంతో ఉలిక్కిపడి తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. ఆ తోసిన వ్యక్తిని చిరాగ్గా చూస్తూ రోడ్ క్రాస్ చేసింది.

“ఏదో ఒక రోజు నా కల నిజమవకపోదు. ఆ రోజు నన్ను చూడ్డానికి వచ్చిన జనాలతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది,” అనుకుంటూ సునీత ముందుకు వెళ్తుండగా, క్రీచ్ మని శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూసింది.

ఒక మధ్యవయస్కురాలిని కారు గుద్దేసింది. డ్రైవర్ కారు దిగి పారిపోతుండగా జనాలు పట్టుకున్నారు. జనాలు గుమిగూడారు. ఇంతలోనే పోలీసులు వచ్చేశారు.

కిందపడిపోయిన మధ్యవయస్కురాలిని జనాలు ఫుట్ పాత్ మీద పడుకోబెట్టారు. ఆమె స్పృహ కోల్పోయింది. ఎవరో బాటిల్ లో నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరించడంతో ఆమె కళ్లు తెరిచింది. ఇదంతా జనాల్లో చేరి చూస్తున్న సునీత ఆమె కళ్లు తెరవడంతో ఊపిరి పీల్చుకుంది.

19

రోడ్ కి అవతలి వైపున జనాలు పోగై ఉన్నారు. చూస్తుంటే యాక్సిడెంట్ అయిందని తెలుస్తోంది కానీ, ఏం జరిగిందో వెళ్లి చూద్దామని చంద్రశేఖర్ కి అనిపించలేదు. ఫుట్ పాత్ మీద నిలబడి పోలీసులు చేస్తున్న హడావుడిని మాత్రం గమనిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే అతనికి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

మొట్టమొదటిసారి సైకిల్ నేర్చుకున్న ఆనందంలో సైకిల్ వేసుకుని విజయనగరం వీధుల్లో వీరవిహారం చేయసాగాడు. సైకిల్ మీద బ్యాలెన్స్ చేయడం వరకైతే బాగానే చేయగలిగేవాడు కానీ బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కాలుకింద పెట్టకుండా ఆపడం అతనికి చేతకాలేదు. ఎదురుగా వస్తున్న బస్ ని తప్పించబోయి బ్రేక్ వేసే ప్రయత్నంలో నడి రోడ్డు మీదా బోర్లా పడ్డాడు. బస్ డ్రైవర్, “చావడానికి నా బస్సే దొరికిందా!” అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత అదే డైలాగ్ చాలా సార్లు సినిమాలో చూసి గమ్మతుగా అనిపించింది అతనికి.

ఇప్పుడు కారు గుద్దడంతో కిందపడ్డ ఒక మహిళను చూస్తే అతనికి ముప్ఫై ఏళ్లనాటి ఆ సంఘటన గుర్తొచ్చింది. “చావంటే ఇక భయం లేదు,” అనుకున్నాడు అతను. ముప్ఫై ఏళ్లక్రితమే చావుకి అతి దగ్గరగా వెళ్లిరావడమే అందుకు కారణమేమో అనుకున్నాడు. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఆ మహిళ ను అందులోకి ఎక్కించారు. డ్రామా అయిపోయింది. అప్పటి వరకూ చుట్టూ గుమిగూడి చూస్తున్న జనాలు అక్కడ్నుంచి నెమ్మదిగా కదిలారు.

20

పెద్ద శబ్దం చేస్తూ అంబులెన్స్ వాహనం అక్కడకు వచ్చింది. పోలీసులు ఆ మధ్యవయస్కురాలిని అంబులెన్స్ లో ఎక్కించారు. పాపం వాళ్ళింట్లో వాళ్లకి ఈమెకి యాక్సిడెంట్ అయిన సంగతి తెలుసో లేదో అనుకుంటూ సునీత అక్కడ్నుంచి బయల్దేరింది. మిగతా జనాలు కూడా ఒక్కొక్కరే అక్కడ్నుంచి కదిలారు.

సునీత నడుస్తూ టైం చూసుకుంది. సినిమా మొదలవ్వడానికి ఇంకా పది నిమిషాలే ఉంది. వేగంగా అడుగులు వేస్తూ సినిమా థియేటర్ వైపు నడిచింది.

21

చంద్రశేఖర్ క్యూలో నిలబడి టికెట్లు కొంటుండగా సునీత అక్కడకు వచ్చింది. మల్టిప్లెక్స్ కావడంతో ఒకే చోట పది కి పైగా సినిమాలు ఆడుతున్నాయి. ఆ పోస్టర్లన్నింటినీ చూస్తూ నిలబడిపోయింది ఆమె. కానీ ఇంతలోనే తను వెళ్లాలనుకుంటున్న సినిమాకి టైం అవుతుండడంతో ఆమె కూడా వచ్చి క్యూలో నిల్చుంది. పోస్టర్ వైపు చూస్తూ “హీరో ఎంత బావున్నాడో,” అనుకుంది.

22

“హీరోయిన్ చూడ్డానికి చాలా బావుంది – బాపు బొమ్మలా,” అనుకున్నాడు చంద్రశేఖర్ పోస్టర్ వైపు చూస్తూ. “కానీ ఎందుకో మరీ ఎక్కువ మేకప్ వేసుకున్నట్టుగా ఉంది,” అనుకున్నాడు. అప్పట్లో తను సినిమా తీయాలనుకునే రోజుల్లో మీనా అంటే చాలా ఇష్టం ఉండేది అతనికి. అచ్చమైన తెలుగమ్మాయిలా ఉండే అమ్మాయినే తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలనుకునేవాడు.

“ఏ సినిమా సార్?”

సినిమా పేరు చెప్పి ఒక టికెట్టు అడిగాడు. థియేటర్ దాదాపు హౌస్ ఫుల్ అయిపోయుంది. మూడో వరుసలో రెండు టికెట్లు మాత్రం మిగిలిఉన్నాయి. నూట యాభై రూపాయలిచ్చి C23 టికెట్ తీసుకున్నాడు.

ఐదు రూపాయలుంటే బాల్కనీ లో సినిమా చూడ్డమే కాకుండా, సిటీ బస్ లో వెళ్ళి రావడం- ఆ తర్వాత ఇంటెర్వల్ లో సోడా, కొబ్బరి బిస్కెట్ తినగలిగే రోజులు పోయి నూటయాభై రూపాయలకి సినిమా చూసే రోజులొచ్చాయని దిగులుపడ్డాడు చంద్రశేఖర్.

టికెట్ తీసుకుని థియేటర్ లోపలకి నడిచాడు.

23

క్యూలో చాలా మంది జనాలు ఉన్నారు. తనకి టికెట్ దొరకదేమోనని అనుకుంది సునీత. పోస్టర్ లో ఉన్న హీరో ఆమె వైపే చూసి నవ్వుతున్నాడు. సినిమా చూడకుండానే ఇంటికి వెళ్లాల్సొస్తుందేమోనని ఆమె కి భయమేసింది.

క్యూలో ఆమె ముందు ఒక బక్క చిక్కిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనితోపాటే ఒక ఏడేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కళ్లు బాగా ఎర్రగా ఉన్నాయి. కన్నీటి చారలతో మొహం నిండిపోయింది.

“నాకు ఐస్ క్రీం కావాలి,” అడిగాడు ఆ అబ్బాయి.

“నోర్ముయ్. మళ్లీ దెబ్బలు పడాలా?” కోపంగా అన్నాడా వ్యక్తి.

“నాకు చాక్లెట్ కావాలి.”

“గొడవ చేశావంటే నిన్నక్కడే వదిలేసి నేను సినిమాకెళ్తాను.”

“నాకు సినిమా వద్దు. ఐస్ క్రీం కావాలి,” అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడా కుర్రాడు.

“ఛీ. దరిద్రుడా. నిన్ను తీసుకుని బయటకొచ్చాను చూడు. మీ అమ్మ దగ్గరే వదిలేసి రావాల్సింది,” అని ఆ పిల్లాడి ఏడుపు ని పట్టించుకోకుండా కౌంటర్ లోని వ్యక్తి తో,
“రెండు టికెట్లు,” అని డబ్బులిచ్చి టికెట్స్ తీసుకుని క్యూలోనుంచి బయటకు నడిచాడు. ఆ అబ్బాయి మాత్రం కింద పడి దొర్లాడుతూ, “నేను సినిమాకి రాను. ఐస్ క్రీం కావాలి,” అంటూ ఏడుస్తున్నాడు. జనాలంతా వాళ్లనే విచిత్రం గా చూస్తున్నారు. ఆ బక్కచిక్కిన వ్యక్తి తన కొడుకుని నేలమీద నుంచి బలవంతంగా లేపి ఎత్తుకుని థియేటర్ లోపలకి నడిచాడు.

“పాపం. ఒక ఐస్ క్రీం కొనిస్తే ఏం పోతుందో,” అనుకుంటూ కౌంటర్ దగ్గరకెళ్లి తను వెళ్లాలనుకున్న సినిమాకి టికెట్ అడిగింది. ఒక్క సీట్ మాత్రమే ఆమె కోసమే అన్నట్టు ఖాళీగా ఉంది.

టికెట్ తీసుకుని థియేటర్ లోపలకి నడిచింది సునీత.

24

థియేటర్ లోపల చంద్రశేఖర్ పక్క సీట్లో కూర్చుంది సునీత.

25

చంద్రశేఖర్ తలతిప్పి ఆమెను చూశాడు. సునీత కూడా అతని వైపు చూసింది.

“ఫర్వాలేదు. చూడ్డానికి బానే ఉంది. టెన్త్ క్లాస్ లో నాతోపాటు చదివిన ఒకమ్మాయి ఇలాగే ఉండేది. ఆ అమ్మాయి పేరేంటో ఇప్పుడు గుర్తుకు రావటం లేదు,” అనుకున్నాడు చంద్రశేఖర్.

“ఛీ. పోయి పోయి ఈ ముసలాడి పక్కన పడ్డానే! మహేశ్ బాబులాంటి అందమైన అబ్బాయి పక్కన సీట్ దొరికుంటే ఎంత బావుండేది,” అనుకుంది సునీత.

సినిమా ట్రైలర్స్ మొదలయ్యాయి. మొదట ఒక హిందీ సినిమా ట్రైలర్ వేశారు. అందులో ఒక అందమైన అమ్మాయి బికినీ వేసుకుని బీచ్ లో పరిగెడ్తోంది. క్లోజప్ లో ఆమె పెదవులు, వక్షోజాలు, ఆమె అందమైన కాళ్లు…కట్ చేస్తే, ఒక అందమైన యువకుడు సిక్స్ ప్యాక్ బాడీతో ఆ అమ్మాయి కి ఎదురుగా వచ్చాడు. ఇద్దరి కళ్లు కలిసాయి. కట్ చేస్తే…వాళ్లిద్దరూ ఒక అందమైన హోటల్ గదిలో బెడ్ మీద ఉన్నారు. ఆమె ఒంటిమీద ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడా యువకుడు. ఇద్దరూ దగ్గరయ్యారు. కౌగలించుకుని ముద్దాడారు. ఫేడ్ అవుట్ చేస్తే ఆ అమ్మాయి హోటల్ నుంచి బయల్దేరుతోంది. ఆ యువకుడు అలా ఎలా వెళ్లగలవని అడుగుతున్నాడు. అంతే ఇది జస్ట్ వన్ నైట్ స్టాండ్ అని ఆమె అక్కడ్నుంచి బయల్దేరింది. సినిమా టైటిల్ పడింది. పక్కనే పెద్దలకు మాత్రమే అన్నట్టు A అని పెద్ద అక్షరాలతో వేశారు. ఇంతలో “ఈ నగరానికేమైంది,” అనే ప్రకటనతో అసలు సినిమా మొదలైంది.

“పెద్దలకు మాత్రమే ప్రదర్శించాల్సిన ఈ ట్రైలర్ ని U సర్టిఫికేట్ ఉన్న ఈ థియేటర్ లో ఎలా ప్రదర్శిస్తున్నారు,” అనుకున్నాడు చంద్రశేఖర్.

“ఈ ముసలి వెధవ ఇప్పటిదాకా కళ్లప్పగించి ఆ ట్రైలర్ చూసి ఇప్పుడు మళ్లీ నా వైపు చూస్తున్నాడేంటి?” అనుకుంది సునీత.

26

తెర మీద హీరో హీరోయిన్ల పెళ్లి జరుగుతోంది. సినిమా మాయలో మునిగిపోయి ఇంకేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. సినిమాలో పూర్తిగా లీనమైపోయింది. తెరమీద బొమ్మలు మసకబారి ఇంతలోనే ఆ తెరమీద ప్రత్యక్షమైపోయింది సునీత. ఇప్పుడు అక్కడ హీరోయిన్ స్థానంలో సునీత ఉంది. తను కట్టుకున్న చీర కూడా అంతకుముందు బట్టల షాప్ లో చూసిన నెమలి పించాల అంచు పట్టు చీర. “ఎంత అందవిహీనంగా ఉన్నా ఈ చీరకట్టుకుంటే దేవతలా మారిపోవడం ఖాయం,” అనుకుంది సునీత. తన పక్కన కూర్చున్న పెళ్లికొడుకుని చూసింది. అతను కొంచెం మహేష్ బాబులా, కొంచెం ప్రభాస్ లా, కొంచెం సూర్యలా, కొంచెం హృతిక్ రోషన్ లా ఉన్నాడు. అతన్ని చూసి సిగ్గుతో తలవంచుకుంది సునీత.

27

తెర మీద హీరో హీరోయిన్ల పెళ్లి జరుగుతోంది; చంద్రశేఖర్ కి తన పెళ్లి చూపుల సంగతులు గుర్తుకొచ్చాయి.

తండ్రి చనిపోవడంతో తల్లి ఒంటరిదైపోతుందని విజయనగరం తిరిగివెళ్లిన చంద్రశేఖర్ అక్కడే పొలం పనులు చేసుకుంటూ ఉండిపోయాడు. ఏదో ఒక రోజు మళ్లీ హైదరాబాద్ తిరిగి వెళ్లాలని అతని కోరిక. కానీ పెళ్లి చేసుకుని ఊర్లోనే ఉండిపొమ్మని అతని తల్లి కోరిక. ఆ పరిస్థుతుల్లో తల్లి మాటలు కాదనలేక కొన్ని పెళ్లి చూపులకు వెళ్లాడు చంద్రశేఖర్. అలా వెళ్లిన ఒక పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చి సరే అందామనుకున్నాడు. ఆమెకి తన సినిమా కలల గురించి చెప్పాడు. అంతా విన్న ఆ అమ్మాయి అతని సినిమాల్లో తననే హీరోయిన్ గా పెట్టాలని కండిషన్ పెట్టింది. ఆ తర్వాత అసలా పెళ్లి జరగలేదు. అది వేరే విషయం. అదంతా తలుచుకుని చంద్రశేఖర్ గట్టిగా నవ్వాడు.

28

తెర మీద మంచి సెంటిమెంట్ సీన్ నడుస్తోంది. సునీత తన వాళ్లను వదల్లేక భోరున ఏడుస్తోంది. అమె తల్లిదండ్రులు ఆమెను బెంజ్ కారులో ఎక్కించడానికి వస్తున్నారు. ఇంతలో ఎవరో గట్టిగా నవ్వడంతో సునీత కల చెదిరింది. ఇప్పుడు తెర మీద ఉన్నది తను కాదు. ఒక్కసారిగా పక్కన కూర్చున్న వ్యక్తి ని చూసి విపరీతమైన కోపమొచ్చింది. “ఈ ముసలాడికి పెళ్లి కాలేదేమో, లేదంటే ఇంత మంచి సీన్ లో ఏడవకుండా నవ్వుతాడా?” అని మనసులోనే తిట్టుకుంది. అదీ కాక తన కల చెదరగొట్టినందుకు అతని మీద విపరీతమైన కోపంతో రగిలిపోయింది. ఇక ఆమె కు జరుగుతున్న కథ మీద ఏ మాత్రం ఆసక్తి కలగలేదు.

29

“శుభం” కార్డు పడింది. జనాలందరూ సీట్లలోనుంచి లేచారు. తను కూడా సీట్లోనుంచి లేచి థియేటర్ బయటకు బయల్దేరాడు చంద్రశేఖర్.

30

సునీత కోపంగా సీట్లోనుంచి లేచి చంద్రశేఖర్ వెళ్తున్న దారిలో కాకుండా మరో దారిలో థియేటర్ బయటకు బయల్దేరింది. థియేటర్ బయటకు వచ్చి ఆమె తూర్పు వైపుగా నడక సాగించింది

31

చంద్రశేఖర్ థియేటర్ బయటకు వచ్చి పడమర వైపుగా నడక సాగించాడు. అతను రోడ్డు మీద నడుస్తుండగా లాటరీ టికెట్లు అమ్ముతున్న ఒక వ్యక్తి అతనికి ఎదురయ్యాడు. ఐదు రూపాయల టికెట్ కి పది లక్షల ప్రైజ్. చంద్రశేఖర్ కి లాటరీల మీద నమ్మకం లేదు. కానీ వయసులో ఉండగా కొన్ని సార్లు లాటరీ టికెట్లు కొన్న విషయం గుర్తొచ్చింది. ఆ రోజుల్లో కూడా టికెట్ రేట్ ఐదు రూపాయలే; ప్రైజ్ కూడా లక్ష రూపాయలు. కానీ ఆ రోజుల్లో లక్ష రూపాయలతో ఇల్లు కొనుక్కోవొచ్చు. కానీ ఈ రోజుల్లో లక్ష రూపాయల్తో హైదరాబాద్ లో కనీసం సంవత్సరం రోజులు ఇంటి అద్దెకు కూడా సరిపోదు …ఇలా ఆలోచిస్తూ అతను అమీర్ పేట్ లో ప్రైవేట్ బస్సు లు బయల్దేరే చోటుకి చేరుకున్నాడు.

32

రోడ్ క్రాస్ చేసి ఇంటి వైపు కి నడిచింది సునీత. ఇంటికి వెళ్లే దారిలో గోడ మీద అంటించిన సినిమా పోస్టర్స్ చూసి, “ఏదో ఒక రోజు నా సినిమా పోస్టర్ కూడా ఈ గోడ మీద ఉంటుంది. కానీ అప్పుడు నేనిక్కడ ఉండనేమో! బంజారాహిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉంటాను,” అనుకుంది.

33

వైజాగ్ కి వెళ్లే బస్ టికెట్ కొనుక్కుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర కూర్చున్న చంద్రశేఖర్ కి ఆకలి వేసింది.

34

సునీత తన అపార్ట్‌మెంట్ లోకి అడుగుపెట్టింది. ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన పాత అపార్ట్‌మెంట్ అది. ఆ బిల్డింగ్ గోడలకి రంగు వేసి కొన్ని దశాబ్దాలు దాటి ఉంటుందనుకుంది. లిఫ్ట్ దగ్గర నిల్చుని లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా కూరగాయల షాప్ లో పని చేసే రవి కవర్లో కూరగాయలు మోసుకుంటూ వచ్చి పక్కన నిల్చున్నాడు.

సునీత వైపు చూశాడు రవి.

వాడు తననే చూస్తున్నాడని సునీతకి తెలుసు. అయినా వాడి వైపు తిరిగి చూడలేదామె. వాడి మొహం అస్సలు నచ్చదు తనకి. “వాడు; వాడి పళ్లెత్తు మొహం. దానికి తోడు బుగ్గ మీద పెద్ద మచ్చొకటి,” అనుకుంది సునీత.

ఇంతలో లిఫ్ట్ వచ్చింది.

రవి లిఫ్ట్ డోర్ తెరిచి, “సునీతా బావున్నావా?” అడిగాడు.

“హు…” అని ముభావంగా సమాధానం చెప్పింది సునీత.

వాడు చూపుల్తో కాల్చేస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియక తల పైకెత్తింది. పైన లిఫ్ట్ లో దుమ్ముతూ పేరుకుపోయిన ప్యాన్ కనిపించింది.

ఆమెకి ఎక్కడైనా ఫ్యాన్ చూసినప్పుడల్లా ఒక అనుమానం కలుగుతుంది. ఫ్యాన్ వేస్తే ఎక్కడెక్కడో దుమ్ము మొత్తం ఎగిరిపోతుంది. అలాంటిది ఎక్కడెక్కడో దుమ్ము వచ్చి ఆ ఫ్యాన్ మీదే ఎందుకు పేరుకుంటుందో అర్థం కాలేదు.

“ఏం చూస్తున్నావు సునీతా?” అడిగాడు రవి.

“నీకెందుకు రా పెంటమొహం వెధవా….” అని వాడిని తిట్టాలనిపించింది సునీతకు. కానీ ఇంతలోనే లిఫ్ట్ మూడో ఫ్లోర్ కి చేరుకోవడంతో సునీత లిఫ్ట్ డోర్ తెరుచుకుని బయటపడింది.

35

కాకతీయ మెస్ లో భోజనం చేసి ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరకి వచ్చాడు చంద్రశేఖర్.

“ఇప్పుడంటే ఎసి బస్ లు అవీ ఉన్నాయి కానీ, ఆ రోజుల్లో విజయనగరం నుంచి హైదరాబాద్ రావాలంటే ఎన్ని కష్టాలో! ట్రైన్ లో రిజర్వేషన్ దొరక్క, జనరల్ కంపార్ట్‌మెంట్ లో టాయిలెట్స్ దగ్గరో, లేదా ఏదో మూలన న్యూస్ పేపర్ పరుచుకుని నేల మీదో పడుకుని రావాల్సొచ్చేది. ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎంత మారిపోయింది. తన జీవితమే ఏమీ మారలేదు,” అనుకున్నాడు అతను.

ఇంతలో వైజాగ్ కి వెళ్లే ఎసి బస్ వచ్చింది.

బస్ ఎక్కి కూర్చున్నాడు చంద్రశేఖర్. బస్ కదిలింది. అమీర్‍పేట నుంచి లకడీకాపూల్ వైపు బస్ ప్రయాణిస్తోంది. ఎక్కడ చూసిన జనాలు.

ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ జనాభా ముప్ఫై లక్షలు; ఇప్పుడది కోటి దాకా చేరింది. ఒకప్పుడు కొండలు, గుట్టలతో నిండిపోయిన ప్రాంతాలలో ఇప్పుడు ఎత్తైన అద్దాల మేడలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో రెండతస్థుల మేడలున్న చోట ఇప్పుడు అపార్ట్మెంట్ లు లేచి నుంచున్నాయి.

అప్పట్లో మొదటి సారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది తను ఏల బోయే సామ్రాజ్యంలా అనిపించింది చంద్రశేఖర్ కి. కానీ ఇప్పుడు మాత్రం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నట్టనిపించింది.

బస్ లక్డీకాపూల్ లో లగేజ్ ఎక్కించుకోడానికి కొంచెం సేపు ఆగింది. బస్ దిగి ఒక ప్యాకెట్ బిస్కెట్స్, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని మళ్లీ బస్ ఎక్కి కూర్చున్నాడు చంద్రశేఖర్.

ఆకలి లేకపోయినా బిస్కెట్లు తింటూ గత కాలపు జ్ఞాపకాల్లో మునిగిపోయాడు చంద్రశేఖర్.

36

వద్దంటున్నా వినకుండా తల్లి పెట్టిన భోజనం తిని సునీత టివి ముందు కూర్చుంది. ఎప్పుడొస్తాడో, అసలొస్తాడో లేదో తెలియని నాన్న కోసం ఎదురుచూస్తే కూర్చునే అమ్మని చూసి ఆమె ఎప్పట్లానే చిరాకు పడింది. కానీ ఇది ఈ ఇంట్లో రోజూ జరిగే తంతు కాబట్టి వారిద్దరికీ అలవాటయిపోయింది.

టివిలో ఏదో కొత్త తెలుగు సినిమా వస్తోంది. అప్పటికే సగం సినిమా అయిపోయినట్టుంది. సగం అయిపోయిన సినిమానే అయినా ఆసక్తిగా చూస్తూ కూర్చుంది సునీత. సినిమాతో సునీత కి ఎప్పుడూ సంబంధం లేదు. అందులో హీరో బావుంటే చాలు.

37

బస్ లో ఏదో కొత్త తెలుగు సినిమా డివిడి పెట్టారు. అప్పుడే చూసొచ్చిన ఒక చెత్త తెలుగు సినిమా ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదు చంద్రశేఖర్. అందుకే టివిలో వస్తున్న సినిమా మీద ఆసక్తి లేదు అతనికి. కళ్లు మూసుకుని తన కలల ప్రపంచంలోకి వెళ్లిపోయాడు.

కలలో చంద్రశేఖర్ ఒక పార్క్ లో కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే సునీత కూడా ఉంది.

38

సినిమా అయిపోయింది. సునీత బెడ్ రూంలోకి వెళ్లి పడుకుంది. అమెకు నిద్రపట్టటం లేదు. తన పర్స్ లోనుంచి ఫోటో తీసి చూసుకుంది. ఆ ఫోటో చూస్తూ వేరే లోకంలోకి వెళ్లిపోయింది ఆమె.

ఆ లోకంలో తనొక పెద్ద బంగ్లాలోని పెద్ద బెడ్ రూంలో పడుకుని ఉంది. అతను మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి మెడ మీద ముద్దు పెట్టాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సునీత.

39

అప్పటి దాకా పార్క్ లా ఉన్న ఆ ప్రదేశం బెడ్ రూంలా మారిపోయింది. వాళ్లిద్దరూ కూర్చున్న పార్క్ బెంచీ పరుపులా మారింది. కానీ చుట్టూ చెట్లు, ఆ చెట్లకు అందమైన పూలు ఉన్నాయి.

ఎక్కడినుంచో అందమైన సువాసన వస్తోంది. అప్పటివరకూ తన పక్కనే కూర్చుని ఉన్న సునీత ఇప్పుడు నగ్నంగా తన కౌగిలిలో చేరుకుంది. బెడ్ కి ఎదురుగా ఉన్న అద్దంలో తనని చూసుకున్నాడు చంద్రశేఖర్. ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉండే వాడో అలాగే ఉన్నాడిప్పుడు.

బస్ హారన్ మోతలకి ఉలిక్కి పడి లేచాడు అతను. ఉదయమైంది.

40

అలారం మోతకు ఉలిక్కిపడిలేచింది సునీత. ఉదయమైంది. బాగా చలిగా ఉంది. బద్ధకంగా లేచి తెరిచి ఉన్న కిటికీ తలుపులు మూయడానికి వెళ్లింది.

కిటికే బయటే ఉన్న చెట్టు మీదకి ఎక్కడి నుంచో ఒక పిచుక వచ్చి వాలింది. కాసేపటికి మరో పిచుక వచ్చి దాని పక్కనే వాలింది.

మొదటి పిచుక రెండో పిచుక వైపు చూసింది; రెండో పిచుక కూడా మొదటి పిచుక వైపు చూసింది. కాసేపటికి రెండు పిచుకలూ గాల్లోకి ఎగిరిపోయాయి – ఒకటి తూర్పు వైపు; మరొకటి పడమర వైపు.

—*—

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, అనువాదం, డిసెంబర్, సినిమా వెనుక కథలు and tagged , , , , , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.