palaparthi cover

5 డేస్ తర్వాత

రాత్రయ్యింది.

అమ్మ పాపని మంచం మీద పడుకోపెట్టి దుప్పటి కప్పింది.

లైట్లన్నీ ఆర్పేసింది.

నాన్న ఊరెళ్ళారు.

పాపకి అదే మొదటి సారి నాన్న లేకుండా.

అమ్మ పక్కన పడుకుని ఉన్నా

పాపకి ఏదో దిగులుగా ఉంది.

నిద్ర రావడం లేదు.

గదంతా చీకటిగా ఉంది.

కిటికీలోంచి ఏవో వెలుగు గీతలు గది కప్పు మీద వెలుగుతూ కదిలాయి.

పాపకి భయం వేసింది.

అమ్మా! ఏదో బూచి ఉంది పైన అంది.

ఎవరిదో కారు పోతోందిరా.

అదీ వెలుగు అంది అమ్మ.

బయట ఎవరో నడుస్తూన్న చప్పుడయ్యింది.

అమ్మా! ఎవరో దొంగ వాల్లు  వచ్చారు అంది పాప గుసగుసగా.

వాల్లు

బాడ్ వాల్లు..

ఏం భయం లేదురా.

అమ్మ బాడ్ వాళ్ళతో ఫైట్ చేస్తుంది.

అప్పుడు వాళ్ళు పారిపోతారు!

సరేనా అంది అమ్మ.

అమ్మ డిష్క్యాం డిష్క్యాం అని ఫైత్  చేస్తుందా

అంది పాప

సంతోషంగా

ఆశ్చర్యంగా.

పాప కూడా ఫైతింగ్ చెయ్యొచ్చా?

ఓ! అమ్మా పాపా కలిసి వాళ్ళని కొట్టేద్దాం.

అప్పుడు వాళ్ళు

అమ్మో!

కొట్టద్దు! కొట్టద్దు!

ప్లీజ్! ప్లీజ్! అని పారిపోతారు!  అంది అమ్మ.

పాప సంతోషించింది.

కానీ పూర్తిగా నమ్మకం కుదరలేదు.

చీకట్లో తలుపు పక్కన ఏదో తెల్ల బూచి దాక్కుని ఉన్నట్టు అనిపించింది.

మంచం కింద

గోడ మీద

కిటికీ బయట

అన్నీ బూచులే.

పాప భయంతో దగ్గరగా జరిగి అమ్మని కావిలించుకుంది.

అయితే నాన్న ఎప్పుడు వస్తారు మల్లీ?

వచ్చే శుక్ర వారం వస్తార్రా.

ఇంకా అయిదు రోజుల తర్వాత.

1, 2, 3, 4, 5 డేస్?

వేళ్ళు తెరిచి లెక్క పెట్టింది.

అమ్మా, అయితే మనమే ఉండాలా నాన్న లేకుండా.

అవును రా. నాన్న వేరే ఊరు వెళ్ళారు కదా.

చాలా చాలా చాలా దూరమా ఆ ఊరు?

అవున్రా. చాలా దూరం.

పాప కొంచెం ఆలోచించింది.

అమ్మా! నాకో అయిదియా వచ్చింది!

మనమిప్పుడు దిద్దాయిలు పోయి ఫైవ్ డేస్ తరవాత లేస్తే

అప్పుడు నాన్నొచ్చేస్తారు!

అంది అమ్మతో

గొప్ప సంతోషంగా.

 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, డిసెంబర్, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.