cover

ఇద్దరం కాదు ఒక్కరం…

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 5వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.)

Download PDF EPUB MOBI

“ఇద్దరు ఒకరవ్వడం ఎలా సాధ్యం?” సూటిగా అడిగేసింది మా చెల్లెలు.

“అదే కదా పెళ్ళి మహత్యం.. అందులోనూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళం” నవ్వుతూ చెప్పాన్నేను.

“అది కాదే, మరి నేను దీపు కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నాంగా.. మరి ఈ గొడవలెందుకొస్తున్నట్టు?” అమాయకంగా అడిగిందది.

“ప్రేమించుకుంటే గొడవ పడకూడదని ఏమైనా ఉందా, లేదా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళ మధ్య అసలు గొడవలే రావని ఎవరైనా చెప్పారా?” నవ్వుతూ అన్నాన్నేను.

“అంటే నువ్వు బావ కూడా గొడవ పడతారా?”

ఆ ప్రశ్నకి సారి ఆశ్చర్యపోవడం నా వంతైంది.

“మరి అందరు మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారని, బావకి నువ్వంటే ఏంతో ప్రేమని అంటారే!!”

“అది అక్షరాలా నిజం” మనస్ఫూర్తిగా చెప్పానామాట.

“అసలేంటో నాకేమర్థం కావడం లేదక్కా.. కొంచెం మీ ప్రేమ గురించి మీరు దాన్ని గెలుచుకున్న తీరు గురించి చెప్పవా ప్లీస్” బతిమాలుతూ అడిగింది కొత్త పెళ్ళి కూతురు.

“తప్పకుండా చెప్తానురా. రుతువుల్లాగే ప్రేమలోనూ మార్పులు జరుగుతూ ఉంటాయి. మీ బావ నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణ స్నేహితులం. ఆ స్నేహం ప్రేమగా మారడానికి పెద్దగా కష్టపడాల్సి రాలేదు కానీ, ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి, దాన్ని పెళ్ళిదాకా తీసుకురావడానికి మాత్రం చాలా కష్టపడాల్సొచ్చింది. ఇక జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటి సంవత్సరం ఎంత మధురంగా గడిచిందో చెప్పలేను. ఒకరు మనల్నే లోకంగా చేసుకుని బతుకుతున్నారనే భావనే చాలా గొప్పది శ్రీ.

“కాని అంత ఆనందంలోనూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉండేది, మేము ఇలా కలిసి బ్రతకాలని తీసుకున్న నిర్ణయం సరైందేనా అని!! దానికి మీ బావ గారి ప్రేమే సమాధానమైంది. ఆ రాముడైనా సీతను వదిలిపెట్టగలిగాడేమో కాని తను మాత్రం మాట వరసకైనా నా చేతిని విడిచిపెడతాను అనలేదు. అన్నీ అలాగే జరిగిపోతూ ఉంటే అది జీవితం ఎలా ఔతుంది? మేమిద్దరం దేన్నైనా భరించగలిగే వాళ్ళం కాని, ఎడబాటుని మాత్రం సహించలేకపోయేవాళ్ళం. నిజంగానే ఏదో పరీక్షకి గురి చేస్తున్నట్టు నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆయన చెన్నైలో నేను బెంగళూరులో. నన్ను ట్రైన్ ఎక్కించేటప్పుడు ఆయన కళ్ళలో తిరిగిన నీళ్ళు నాకింకా గుర్తే. నన్నొక 10 రోజులు చూడకుండా ఉండలేని మనిషి అన్నేసి నెలలు ఎలా ఉండగలరో అన్న బెంగతోనే బెంగళూరు వెళ్ళిపోయాను. ఇద్దరం ఎన్ని రాత్రుళ్ళు ఏడుస్తూ గడిపి ఉంటామో… ఐనా కుంగిపొలేదు. నేనే ధైర్యంగా ఉందామని చెప్పాను. కష్టమో నష్టమో ఓర్చుకుని ముందుకెళ్ళాలని చెప్పాను. మీ బావ గారికో అభిప్రాయముండేది, అదేంటంటే మా ఇద్దరికి సంబంధించింది ఏదైనా మా మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తి జోక్యం ఉండొద్దని. మొదట్లో కండిషన్ లా అనిపించినా తర్వాత తెలిసొచ్చింది దాని సౌలభ్యమేంటో.

“తను బెంగళూరు కంపెనీస్ కి ప్రయత్నించిన మొదట్లో అపజయాలే. అయినా నాకు తన మీద నమ్మకం సడలలేదు. మా విషయం వాళ్ళింట్లో తెలుసు. తన పురోగతి కి నేను ఉత్ప్రేరకాన్ని కాకపోయినా ఫర్వాలేదు కాని నా ప్రేమ తనకి అడ్డంకి గా మారిందని వాళ్ళెక్కడ అనుకుంటారో అనే భయం వెంటాడుతూనే ఉండేది. తను సక్సెస్ అవ్వలేక పోతున్నానని బాధపడినప్పుదల్లా విలవిల్లాడిపోయేదాన్ని. కాని ఎక్కడో ఓ చిన్న ఆశ ఉండేది, తను ఎంత కష్టమైనా సరే నన్ను చేరుకుంటాడని. అదే తనతో చెప్పేదాన్ని, నా ప్రేమ నిన్ను తప్పక నా దగ్గరికి చేరుస్తుందని.

005a“ఒక సారి నా కాలికి చిన్న రాయి కొట్టుకుని రక్తం వచ్చేసింది. ఆ నొప్పికి నా కళ్ళల్లో నీళ్ళు. చూస్తే ఈయన కళ్ళల్లోనూ అవే. నేను బాధ పడితే చూడలేని వ్యక్తులు ఈ ప్రపంచంలో అప్పటికి ఇద్దరే; మా అమ్మ నాన్న. ఆ క్షణం నుంచి ముగ్గురయ్యారు. అలాంటి మనిషికి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఎంత బాధేసేదో. అప్పుడు నేను చేయగలిగిన సహాయం ఏంటో తెలుసా, ఆయన్ని మరింత ప్రేమించడం. అంత బాధ లోనూ మేము బాధ్యతాయుతంగానే నడుచుకున్నాం. నేను అమ్మకి ఇష్టమైన బ్యాంక్ జాబ్ సంపాదించాను, అక్క పెళ్ళికి సాయపడ్డాను. తనూ ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతలు నెరవేర్చాడు. ఈ క్రమం లో మా కోసం మేము కేటాయించగలిగిన సమయం చాలా తక్కువ. జీ(వి)తాన్ని మెరుగుపరుచుకునే పనిలో తను కాస్త యాంత్రికంగా మారిపొతున్నాడని అనిపించేది. అప్పుడు నేనే కాసేపైనా ప్రేమ గా మాట్లాడి మా ఆత్మీయత సజీవంగా ఉండేలా చూసుకునేదాన్ని. ప్రేమించిన కొత్తల్లోలా తను నిరంతరం నాతో ఉండట్లేదు అని నేను బాధ పడుతూ తనని బాధ పెట్టడం కూడదనిపించింది.

“చిన్ని మొక్కకి ఎంతో ఉత్సాహంతో నీళ్ళు పోసి పెంచుతాం. అదే చెట్టు మన నిర్లక్ష్యానికి ఎండిపొతే ఎవరి తప్పది శ్రీ? ప్రేమైనా అంతే శ్రీ, అది ఎప్పటికీ పచ్చగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎప్పటికీ తన తీరు అంటే నాపైన చూపే ప్రేమ, నాకోసం తను పడ్డ కష్టం, నన్ను చేరుకోవాలనే తపన, నాకు కష్టమొస్తే తను పడే బాధే గుర్తొస్తాయి కానీ మా ఇద్దరి మధ్య నడిచిన వాదులు, తలెత్తిన భేదాభిప్రాయాలు, కోపంగా అరుచుకున్న సందర్భాలు గుర్తు రావు. ఇదంతా నా గొప్పదనం కాదు. ఇవన్నీ నేను నేర్చుకుంది తన దగ్గరే. మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోక పోతే విడిపోదామని అన్నాను. నా ప్రాణాన్ని నేను వదులుకోలేను, ఎలా అయినా సాధించుకుంటాననేవారు. అలా ఓ రకంగా నాలో ధైర్యాన్ని నింపింది తనే. అంతెందుకు మా ప్రేమని పీటల వరకు తీసుకురావడం లో ఆయన పడ్డ కష్టమే ఎక్కువ. అమ్మ ఒప్పుకోకపోతే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఒప్పించింది ఆయనే. తను బెంగళూరు కి వచ్చేయడం, నా మెడలో తాళి కట్టడం మరపురాని క్షణాలు శ్రీ!

“మా ఇద్దరిలో నేనే కాస్త పిరికిదాన్ని, తనే ధీశాలి. కాని ఆయన తన బలం నేనేనంటారు. ఒక గమ్మత్తైన విషయం చెప్పనా… మీ బావ గారి కి తెలుగు లో అంత పట్టు లేదు… కాని నేను ఆయనకు పంపే ప్రేమలేఖలు తెలుగులోనే సాగేవి. ఆయన నా మీద రాసే కవితల్లోని కొన్ని ఇంగ్లిష్ పదాలకు అర్థాలు తెలిసేవి కాదు నాకు. ఇదెందుకు చెప్పానంటే, మా ప్రేమకి మా భిన్న స్వభావాలు అడ్డు కాలేదని చెప్పడానికి. పెళ్ళయ్యాక కుడా తన ప్రేమ లో ఏ మార్పు లేదు. పెళ్ళికి ముందులా భార్యని ఇంతలా ప్రేమించకూడదు అని నేనే సరదాగా ఆట పట్టించేదాన్ని, జీవితం చివరిదాకా తరిగిపోలేని మమతే ప్రేమనేవారు. ఇంతలా ప్రేమించొచ్చా అనేలా భర్త ఉండాలి, ఇలా కూడా ప్రేమించొచ్చా అనేలా భార్య ఉండాలి. అలా ఉండగలిగిన నాడు విడిపోవడం అనే మాట కి తావే లేదు శ్రీ. భార్య భర్తల అనురాగం వసంత రుతువులో వెన్నెల్లాంటిది శ్రీ, దాన్ని అనుభవించగలగడం గొప్ప వరం. ఏం చేయాలో నేను నీకు చెప్పాల్సిన పని లేదుగా శ్రీ”

“నిజమే మీ ఇద్దరూ నిజంగానే అదృష్టవంతులు… మా జీవితాలు హాయిగా సాగేలా నడుచుకుంటాను అక్కా..” సంతోషంగా చెప్పింది శ్రీ.

ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది.

“ఎవరా ఇద్దరు శ్రీ?” ఓ ప్రశ్న నవ్వుతూ ఎదురైంది మా చెల్లికి.

“మీ ఇద్దరే బావా” నవ్వుతూనే చెప్పిందది.

“మేమిద్దరం కాదు ఒక్కరమే” సరిచేసారు మా శ్రీవారు.

*

రచయిత వివరాలు

Pavani_jpg

బి. నాగ పావని

వృత్తి: ఐటీ రంగం

ఇష్టమైన రచనలు:  తెలుగు లో భానుమతి గారి అత్తగారి కథలంటే ఎక్కువిష్టం. హాస్యమిళితమైన యే రచనలనైనాచదవడానికి ఇష్టపడతాను.

ఇష్టమైన రచయితలు: భానుమతి గారు, యద్దనపూడి గారు, యండమూరి గారు.

Download PDF EPUB MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2014, డిసెంబర్, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.