cover

ఐ డోంట్ మి

Download PDF EPUB MOBI

బొల్లి మేస్త్రి గారాలు కింతల కాళింగులు. మా అమ్మాలు బ్రేమ్మన్సు. మా నాన్నాలు శిష్టు కరణాలు. మహంతులవారి వీధ్దుక్కొచ్చి ఫలానా శివ్వుమహంతి జగన్నాధరావు పట్నాయక్ BA LLB అనీసంటే మీకు ఏ రిక్షావోణ్ణడిగినా తెచ్చి దింపెస్తాడు. కరణం ప్లీడ్ర – కిష్టారావు పట్నాయక్ అనీసి మా తాత పేరు చెప్పినా ఒకటేని. నీను బ్రేమ్మర్ల కాడ ఆలకంటే యెక్కువ భ్రేమ్మన్స్ లాగ మాట్లాడతాను. “యేఁవటవే? ఒసే బుచ్చికాసన బాబు గారి చింతోచ్చికి దౌహిత్రుడి వరస కాట్టే మీ నాన్నా? అయ్యొ వల్లకాడు నాకెందుకు తెలీదే అమ్మా వీళ్ళది గుణానపురం! వీళ్ళూ మేఁవూను తాతా సహోదర్ల పిల్లలఁవి మరేం… ఫరవాలేదు… ఏదీ ఇలాగ రమ్మీ?!” అనీసి మా అమ్మమాలు మాటాణ్ణట్టిగే మాటాడుకుంటూని బొవ్వి నాయినమ్మాల్దెగ్గిర ముగ్గుళ్ళు చక్కిలాలు, పేరీ లచ్చప్ప గారింట్లోన జున్ను మోపు చేస్తాను. నీను శిష్టు కరణాల కాడ శిష్టు కరనాల్లాగే మాట్లాడ్తాను. ప్రకాశరావు పట్నాయిగ్గారికి ఇందరా కాంగ్రేస్ లేక లేక టిక్కట్టిస్తే ఊళ్ళోన ప్రతీ రిక్షావోడి రిక్షాకీ కాంగ్రేస్ జెండాలు కట్టింపించి “అమ్మల్లాలా అయ్యల్లాలా! మీ అపూర్వమైనా, అతీ పవిత్రమైనా… అథీ విలవైనా ఓటు ముద్రనూ… అస్తమస్తమస్తమస్తమస్తం హస్తం గుర్తుకే వేసి అత్యధికా మెజార్టీతోన గెలిపించవలిసిందిగా కోరుచున్నాం. అవర షింబలీజో హేండో! అవర షింబలీజో హేండో!!” అనీసి ఇటుసైడు మొత్తం సింగుపురం, టౌనుహాల్టు కుర్రోలందర్చేతా గొంతుకులు వెలుగురాసుకుపోయినట్టుగ అరిపించరిపించి కిర్రు పెటించలేద? మొత్తం యూతందరికి మోపు చేయించి ఓటర్లిష్టులు రాయించి, ఇంటింటికీ దింపుళ్ళు పంచిపెట్టించి తెలగాలు కరణాలేటి, కోఁవట బ్రేమ్మర్లేటి, ఎస్సీ ఎష్టీ ఓబీసి కొప్పలెలఁవల ఓట్లూ కూడన్నూ ఎలగ బెత్తాయించేనో మీకు తాలూకాఫీసు కలక్ట్రాఫీసు ఎటెండర్ల కెవలకడిగినా చెప్పెస్తారు. “మన కరణాల కుర్రోడంటె చెభాస్! అనిపించేడ్ర దద్దా నీ కొడుకు! ఇవాళ ప్రకాశరావు పట్నాయక్ గెల్చేడంటే ఈడి చలవే” ననీసి మా డాడీ పేరు వొయిజాగ్ పార్టీ ఆఫీసు వరుకు కిర్రుపెట్టించ లేదా?!

డిష్టిట్ కోర్ట్నుండీ ఎపెల్లేట్ కోర్ట్నుండీ జర్జీగారు గాని, మున్సఫ్ మేష్ట్రీటు గారాలు గాని తోటపిల్లి యెంకటేసుర్డు స్వాం దర్శానాలకనిసి అప్పటికప్పుడు ఫేమిలీస్ లేడీస్తోటి అంబాసడర్ కారుల్లోనొచ్చీసి ఫేన్లకింద కూచుంటే కాఫీలు, టిఫన్లు, ముక్కుడి వొటల్నుండి స్పెషల్ మీల్స్, కొబరబొండాలు మొత్తం బెత్తాయింపులన్నీ మనఁవేని. బయిట్నుండి పెద్దవాలెవరైనా వొస్తే క్లాస్‌గా మేనేజ్చేస్తాననీసి ఆ ఏర్పాట్లన్నీ నాకే వొప్పగించ్తారు వీధిలోన. నీను పెద్ద పైల్మేన్లాగ మొకం పెట్టుకోని “గవర్మెంట్ పోలసీస్ ఇదివరుకుట కంటా ఇప్పుడే మీకు బెటరంకుల్! ఎంసెట్‌లో ఏపాటి సుమారుగా రేంకీ వొచ్చినా పాపకి సీటు గేరంట్రి! లేదన్నా సరే మనకి బేంగ్లోర్ సైడు మేగ్జమమ్ తెలిసినోలున్నారు సీటైతే మటుకూ గేరంట్రీ మీకు ఆ డవుటేమక్కర్లేదు!” అనీసి ఒక్కాలేజీలు, వాయిదాల మాటొచ్చినా వొకెంగేజిమెంటు ఒక మంచీ చెడ్డొచ్చినా మన్దేని. మున్సబు కోర్టు వరండాల్లో మనం పెద్దవాల్తోటి మాటాడుతుంటె ఇగనా ష్టాఫల్లా కర్టెన్ యెనకాల్నుండి ఎలాగింటారో మా డాడీకడగండి. మా అమ్మ తాతాల కంట పడకుంట ఉగాదులకి ఎప్పుడేన సీతారామ స్వాం కోవిలకి కవుల మీటింగులంట దూరిపోయి నీను మా అమ్మ తాతకి మనవళ్ళాగ భ్యేమ్మన్స గొంతుకు పెట్టుకోని ముక్కుతోటి “నవ నవోన్మేష… సాహితీ విజిగీష… కావ్య గీర్వాణ మంజూష… రాఁవమ్మ ఓ ఉగాది లక్ష్మీ!!” అనీసి ఇలాగ్గానీ మా తాత కాడ విన్న ముక్కలు యెత్తుకున్నానంటే నాకొళ్ళు ‘జష్టే మినట్ యువరాన్ర!’ అనీసైన అనకుంట పేరీ మేష్టగారి చేతను, కోఁవటి మేషార్చేతన్నూ “ఎవల కుర్రవాడండీ వీడు? గుంటడు ఖణీగా మాటాడుతునాడు!” అనిపించుకోని గాని ఇంటి దుక్కు రాను! నీను డబ్బున్నావోల కాడ డబ్బున్నోల్లాగే మీకు మొత్తం పిక్చరంత మేనేజ్చేస్తాను – కారంటే కారు, ట్రైన్ టికట్స్, ఫ్లైట్టికట్స్, మీకు శిర్డీ కానియ్యండి, పుట్టపర్తి, తిరపతి గెష్టౌసంటె గెష్టౌసు, స్పెషల్ దర్శనం కూడన్ను ఒక్క రోజు ముందు చెప్పీసెల్లండి సాను! ఫలానా అనీసి ఏ ఇబ్బంది లేకుంటా పెద్దవారొచ్చినప్పుడు ఎరోవ్‌మెంట్స్ విషయంలోన మాత్రం ఏఁవి రయాణీ లేకుంట మీకెందుకు మీకు నీను సెట్చేస్తాను కదా?! దుస్సుగాడు, సర్వీ గాడూ, నీనూ మేమ్ముగ్గురిఁవీని ఇలాగున్నాఁవనీసేగాని మా డాడీ అన్నట్టుగ జష్ట్ ఎడ్యుకేటడ్ అనెంప్లాయ్డ్. ఇలా…గ మాతోటి తిరుక్కుని తిరుక్కునే కుక్కశీను గాడు కరంటాఫీసులోన పెద్దజీతగాడవ్వలేద? నవ్వినూళ్ళే పట్నాలౌతాయి. మన దశానాధుడు సమింగా లేక ఇల్లింగ్లీషు కొద్దిగ డౌటు, ఐటీఐ సబ్జక్ట్లు నేరో మిస్సులోన పోయి తిరుగుతునాననీసి గాని… ఇలాగున్నాననీసా?! అటుసైడు విజీవాడా నుండి ఇట్సైడు బిసింకటక్ వరుకు వొడ్డోల కాడ వొడ్డోల్లాగ, హిందీ వోల కాడ హిందీ వోల్లాగ, మారువోడీ వోల కాడ మారువోడీ వోళ్ళాగ, రెల్లోల కాడ రెల్లోళ్ళాగ ఆల్లోనొక నెంబరు కిందే ఎజ్జిష్టయిపోతాను, సమయా సమయాలొచ్చినప్పుడు కమ్మావోల్లోన కమ్మావోల్లాగే కలిసిపోతాన్నీను మీకు ఆ డౌటేమీ అక్కల్లేదు.

లవ్ ష్టోరీ వాల్ పోష్టర్ల మీద కూచోని అసుక్కొట్టుకుంటుంటె దుస్సుగాడొచ్చి “వోర యెస్కేపీ?! మీ అమ్మాల్ది లవ్ మేరేజి కదురా?” అనీసన్నాడు. బెజ్జునాకొడుకు! పనీ పాట్లేనోల్తోటి ఇదొకటి నూసెన్సు. ఎవల్దేం మేరీజయితే ఈడికెందుకు? ఈలక్క మేరేజీ ఊసు నీనొచ్చేన? తినీసి ఒక్కాడుండ్లేక? మా అమ్మాల్ది లవ్ మేరేజీ. ఇలాగనీసి మేస్త్రి గారే స్వయాన్నాకు చెప్పేరు. దుర్గతల్లి గుడవతల రైల్వే పట్టాల సైడు మూడడ్లోల కల్లాలవతల మేస్త్రి గారు దండీలు బస్కీలు తియ్యడానికి వ్యాయామ పాటశాలనీసంటె మేఁవే మొత్తం ట్రేకి ముక్కలు, ఫిష్ ప్లేట్లు తెప్పించి దళ్ళు కట్టించి, బందలుప్పి నుండి తాటి కమ్మలు, రాటలూ మోపు చేయించి భారీ యెత్తున డంగలా నిలబెట్టేఁవు. ఇందులో మనకి రూపాయొస్తాదనీసేం లేదు, ఊళ్ళోన యూత్ కోసము. బీట్లు కొట్టుకోని పేకాడుకోని తిరిగిన బదులు, ఆవిటికి తగువుల్లోన, కిరికిటు బెట్టింగులంట రక్తాలొచ్చినట్టుగ బుఱలు బదలగొట్టీసుకునీ బదులు డంగలాకెల్లి పుషప్స్ చేస్కుంటే తౌజండ్ టైమ్సు బెటర మీకు. కాదంటారా?! పాకలోన పేడలికిన గచ్చు మీద జింక చర్మం మీద కూకోని మేస్త్రిగారు యెనకాల ప్రసన్నాంజనేయా స్వామి త్రిశూలానికి ఎర్రట చిందూరం నిమ్మకాయా గుచ్చీసి కూకోని అటుదుక్కు ఎప్పుడెల్తున్న సరే నాదుక్కు నవ్వుతారు – “సెప్పండి పంతులు గారు?! యేటి చెప్పండి..?” అనీసొకసారి. “యేటి మనవడూ…? యేంటి సెప్పండీ!” అనీసొకసారి. మా నాన్నాలు శిష్టు కరణాలయితే నీను పంతుల్నెలాగయ్యేను? ఇలాగనీసి మేస్త్రి గారితోటి అనాలంటే మాత్రం నాకు మా చెడ్డ దీనిగా వుంటాది. మేస్త్రిగారు ఆరడుగులు ఎత్తరి మనిషి, వస్తాదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాలంట అటుసైడు కాశ్మీర్ సైడు జవాను కింద రిటారయ్యొచ్చేడీయను. లెఫ్ట్నెంట్ కల్నల్ కే. కే. ఫొటడార్, మేస్త్రిగారు, ఇంకొకలెవలో గూర్ఖావోడూ మిలట్రీల్లంట మంచు కొండల్లోన కలిపి దిగిన ఫొటోలోన చూడాల మేస్త్రిగారికి! “ఓల్డన్ డేస్ ది గోల్డన్ డేస్!” అనీసంటారు మా డేడి. నీను ఒక్క హాఫించీ లోన హైటు మిస్సయిపోయేను గాని లేదంటె ఈపాటికి లెఫ్ట్నెంట్ కల్నల్ ఫొటడార్ వాలల్లుడికి చెప్పి నన్ను డైరెక్టుగా సర్వీసులోకి ఎప్పుడో తీయించీవోణ్ణనీసి మా అమ్మతోటి మేస్త్రి గారు. ఇప్పుళ్ళాగ పొద్దుట్లెగిసి అరిటిపళ్ళు తినీసెళ్ళి ఆర్మీలోన జాయినయిపోడం కాదు! మిలిట్రీవోడైనా సరేని మేస్త్రిగారు మాట మీద మాట లెగనివ్వడు, సాధు జీవనీసి ఊళ్ళోన చెప్పుకుంటారు. నీనూ దుస్సుగాడూ కార్యసిద్ధి హనుమాన్ మంత్రఁవు మేస్త్రిగారి కాడే తీసుకున్నాఁవు. ఈయనూ, మా అమ్మ తాతియ్యా, మా నాన్తాతయ్య కిష్టారావు పట్నాయక్ చిన్నప్పుడు ఒక్క స్కూల్లోనే చదువుకున్నారు – మహంతులవారి వీధి శ్రీ రామ మునస్పల్ అప్పర ప్రైమరీ స్కూల్లోన. మా అమ్మ తాతయ్యకి నాన్తాతియ్యకీ ఫెండ్సనీసి మేస్త్రిగారికి ఎవలకీ ఏటీ అన్నివ్వము. నువ్వు ఎక్కడోడివైనా అవ్వండి! మా వీద్ధుక్కొచ్చినప్పుడు ఏఁవిండంటె యేఁవిండనీసి ఎలాగొచ్చినోడివలాగ మర్యాదాగ వెల్లండి! గివ్ రెస్పక్ట్  అండ్ టేక్ రెస్పక్ట్!

అలాట మేస్త్రిగారి పుణ్యఁవాన్ని ఊరొగిలీసి వెల్తాననీసి నీనేం కలగాసేన?! అవేళ ఇంక మన్నాడు రధాయాత్రనగాను తొన్నాడు. పెద్ద గాలీ వానా కొట్టీసి బార్నాల వారి గొడాఁవుల పెరడివతల సందులోన టేకు చెట్లలో ఒక సుమారైన చెట్టే జగన్నాధ్స్వాం కోవిల గేటుకడ్డంగ పడి పోయింది. ఆ చెట్టు బార్నాలోల్దనీసి దని మీదేం రాసున్నద? పండా గారాలవిడొచ్చి రధానికడ్డంగ చెట్టు పడిపోయింది, తీసీ మంటాదనీసి మీఁవేం కలగాసేఁవ?! బాబ్బాబు తీసీమన్నాది. “బాబ్బాబు! ఎక్కడేఁన ఒకైదు రూపాయిలుంటే తెచ్చీసిస్తాను కాలు కలిగిన పిల్లడివి, బాబ్బాబ్బాబ”నీసి. పండాగారికే తిండానికి లేదు, ఈవిడి మనకేటిచ్చెస్తాది? డబ్బులనీసి కాదు, దైవకార్యఁవనీసి – నీనూ, దుస్సుగాడూ, తాడిబెదరు, ఎలుమంతోడూ, సర్వీ గాడూ. బొండపిల్లి షావుకారుకి బతిమాలి కర్రల్రిక్షా రప్పించి నెమ్మదిగ సాయం పట్టి చెట్టు తీయించి డంగలా గోడివతల దాచీసొచ్చేము. డంగలా పాకలోన రాయి తిరగల్ల మీద కూచోని చెమట్లు తుడుచుకుంటంటే మేస్త్రిగారే టీల్రప్పించేరు. ఆంజనేయ స్వాం ఫొటోకి ఊదుబత్తులెలిగించుకోనొచ్చి కూచోనీ, దుస్సుగాడికి నోర్తిన్నగుండకా?! మా అమ్మాల్ది లవ్ మేరేజనీసి ఇఁగనా ఉన్నావోలందరికీ తెలిసీటట్టుగ అడిగినోలికీ అడగనోలికీ మేస్త్రిగారు! మా అమ్మా, టోపీ మేష్టగారి చక్కదనం, కొసింటి మున్సబు గారి వనేస్రీ, బొల్లి మేస్త్రి గారాల పార్వతీ గర్ల స్కూల్లోన ప్రేవోట్ల కెల్తుంటే మా నానా, సర్వీ వోల నాన్నా టౌన్లోన పనున్నాదనీసి మా తాతకి అబద్దాల్చెప్పీసి గర్లస్కూలు గోడవతల మా అమ్మాల గేంగీకి బీట్లు కొట్టీవోరు. మా అమ్మన్నాదనీసి మా నాన గోల్డ్‌ఫ్లేక్ సిరగట్లు కాల్చడం మానీసేరు. “ఎనిమిమంది సంతానంతోటి ఇంతకంటే మంచి సమంధం తెచ్చెస్తాఁవురా ఎఱ్ఱతేలూ? పిల్ల పసుకొమ్మిరిచినట్టుగున్నాది? కిష్టారావు నీ తోటి చదువుకున్నోడు నీకు తోబుట్టువుతోటి సమానం. అంతలెక్కన అడుగుతున్నాడు ఇచ్చీ పిల్లనీ!” అనీసి మేస్త్రిగారే మా అమ్మాలకి వింట్రకేష్ట్ మేరేజీకి ఎరోవ్‌మెంట్లన్నీ చేయించేరనీసి. మా అమ్మమ్మా తాతయ్యా పెళ్ళికెళ్ళకుండా జగన్నాస్స్వాం గుడరుగుల మీద ఉపోషాలు పడుకున్నారనీసి. శుభలేఖలియ్యడానికి మా నాన్తాతయ్యాలు కావిళ్ళు పట్టించుకోని పిలుపులకొస్తే మా తాతియ్య పెరటి తిన్న గెడ్డ వీధిలోన బూరుగ చెట్టుకి మా నాన్తాతయ్య లాగే మీసాలు దిద్దించిన దిష్టి పిడతకి చెట్టుక్కట్టి చేపాటీ కఱ్ఱ పట్టుకోని

పట్నాయుణ్ణిట్రమ్మని

నిట్రాటకి విరిచి కట్టి

కొట్ట్రా ఒక లెంపకాయ

కోపము తీరన్!

అనీసరుసుకుంటూ ఆ పిడతకి తుక్కు రేంగొట్టి రేంగొట్టి, రాత్తిరల్లా బూరుగు చెట్టుకి బాదీసి బాదీసి ఉక్రోషం తీర్చుకున్నాడంట ఇలాగనీసీ. “నాకు ఏడుగురు పిల్లలే అనుకుంటాను. ఫలానా ఎఱ్ఱతేలు మేషారమ్మాయిననీసి ఆ సిగ్గులేని మొహం తోటి ఇంకెక్కడా ఎవళ్దెగ్గిరా అనకు! నువ్వు నాక్కూతురివే కావే ఫొమ్మ”నీసి మా దొడ్డాల ఇంటి వరుకూ అమ్మని వెంటబెట్టి కొట్టడాలకెల్తే మా ఓంకారం పెదనాన మా అమ్మకి ధాన్యం గెరిసలో దాచీసి కాపలా కాసేడనీసి. ఇలాగనీసి బొల్లి మేస్త్రిగారే ఈ కధంత చెప్తుంటే దుస్సుగాడు, ఎలుమంతోడూ, సర్వీ గాడూ, తాడి బెదరు నవ్వు మొకాలేస్కోని టీలూదుకుంటూని నా దుక్కు పెద్ద పైల్మేన్లాగ! ఎందుకులే మన్లో మనఁవనీసి ఊరుకుంటాననీసా? అల్లదుగో నాకు తిక్క రానంచేపె! నాకు తిక్కొచ్చిందంటె ఈలందరి జాతకాలు! నా చేత స్లిప్పులు రప్పించుకోకుంట, మేష్టర్లకి మేనేజ్చెయ్యకుంట టెంతు పేసయినోడు ఇటు సైడు సెంటరు మొత్తమ్మీద ఒక్కడున్నాడా? సర్లే ఎందుకనీసి. మా అమ్మ అసలెప్పుడు పెళ్ళూసెత్తదు. మా అమ్మమ్మ గురించే మాటాడతాది – నెలవారీ హార్లిక్ సీసా, ఖర్జూరం పేకట్లు, అమ్మవారికి సాంబ్రాణీ, హారతి కర్పూరం, అమృతాంజనం ఇలాగ పట్టికెళ్ళి మా తాతియ్య చూడకుంట అమ్మమ్మకిచ్చీమనీసి. మా నానకి మున్సఫ్‌కోర్టు ఏపీపీ గారాలు మావిడి పళ్ళూ, మల్లిపువ్వులూ బుట్టలు దింపించినప్పుడు, డీయెస్పీ గారాలు ఎస్‌కోట నుండి దీపావళీ సామాన్లు పీపీ మామూల్లు రప్పించినప్పుడూ మా దొడ్డాలకీ మా అమ్మమ్మకీ వేరే తీసి నీనే తీసికెళ్ళిస్తాను. మా ఇంట్లో వొండినవైతే మా అమ్మమ్మా తాతియ్యా తిన్రనీసి పళ్ళూ కాయలే పంపిస్తాది మా అమ్మ.

టేకు చెట్టు ఎలాగ లేదన్న ఐదారువేలేనా ఉంటాది. బార్నాలోడి చెట్టనీసి దనిమీద పేరేటున్నాదా? మా పెదనానకి చెప్పి నెమ్మది మీద కిందపెట్టి మీదపెట్టి డంపింగ్ యార్డ్లోన ఏయింపించెస్తె ఏదో ఒగ్గూడ్సులోన ఎక్కించీసి గుమడా సిల్లావోల డిపో కిచ్చెస్తే పండుగు పూటా ఒక్కాణో పరకో ఎవల్డబ్బులు వాలకొచ్చెస్తాయి. తిలా పాపం తాలో పిడికిడూ, జగన్నాథ్స్వాం ప్రసాదమనీసి డిసైడయిపోయి. టీలు తాగుతనాఁవనీసే గాని మా కళ్ళన్ని గూడ్షెడ్ రోడ్డు వైపే ఉన్నాయి. ఇవాళ మా పెదనాన వొస్తాడో అట్నించటీపు బిసింకటక్ ఎలిపోతాడోననీసి. దుస్సుగాడిది శన్నోరు. ఉన్నోడునట్టు ఉండకుండా “వొరే శివ్వం! సర్వీ….! ఆ చెట్టు బార్నాలోల్ది రా! మనకెందుకురా?” అనీసి నానుముచ్చు నాకొడుకు. పండా గారాలు మాకు చిన్తాతియ్య తోన సమానం. మా నాన్తాతయ్యాలు ధర్మకర్తలు! ఆడి చెట్టొచ్చి మన గుళ్ళోన పడింది గాని మనమేఁవన్న ఎళ్ళి కొట్టుకోని తెచ్చేమ? మొదలు పుచ్చిన చెట్టు పడ్డాదంటే మన్తప్పా? దేవుడి దయవల్ల ఏమవలేదు గాని కోవిల గేటుకో గోడకో డేమేజీ అయితే ఎవడచ్చుకుంటాడు? చెట్టొచ్చి పండా గారి నెత్తి మీద పడిపోతె బార్నాల షావుకారేమన్న అచ్చుకుంటాడా? అవతలోణ్ణి ఒక మాటనీ ముందు ఇవన్ని ఓ సుట్టు ముందూ వెనకా చూసి మాటాడాలి. బార్నాలోల చిన్నాన కొడుకులు తొన్నాడు సునాబేడా నుండి దిగేరు. పాలకొండ అడివుల్లంట కర్రలడితీలు పెట్టి పెట్టి పులిసిపోయున్నారు నాకొళ్ళు. టాకింగ్ ది ఇంగ్లీష్ నో?! ఎందుకు ఒకలూసు మనకెందుకు? ఎండిపోయిన చెట్టు ఎంచేపు? మా పెదనాన్రానీ, ఇట్నించిటే ఎత్తెస్తే సునబేడావోడు సూడొచ్చేడా? రిక్షావోలకి చెరుకో ఐదో పదో చేతులో పెట్టీసి తెల్లారకుండ గూడ్షెడ్ యార్డ్లో పెట్టించీసి ఒక నెంబరేయించెస్తే ఇంకక్కణ్ణుంచి పెదనానే చూసుకుంటాడు. నెంబరింగిచ్చీసేక ఇంక సునబేడావోడేటి చెయ్యాలి, బార్నాలోడేటి చెయ్యాలి? ఈకల్తియ్యాలి!

మా ఓంకారం పెదనానాల్ది హేట్ మేరేజీ. దొడ్డాలకి పిల్లల్లేరనీసి నన్నే కొడుక్కింద చూసుకుంటాది మా దొడ్డ. సెకెండ్షో సినిమాలకెల్లొచ్చి ఇంక మరీ లేటయిపోతే దొంగల బండీ దిగి తిన్నగా రైల్వే కోటర్స్ కెళ్ళి పడుక్కోని పొద్దున్నే మా పెదనాన పంచె లుంగీలాగ కట్టుకోని డాడీ కోర్టుకెళ్ళిన వరుకూ ఆగి ఇంటికెళిపోతాను. “గూడ్సులకి గార్డయితేనేఁవే ఓ తీరూ తిమ్మయిన పిల్లడు! ఈ అంబేను! టింగరిది…!” అనీసి మా అమ్మ తాతియ్య మా పెదనానకే వెనకేసుకోనొస్తాడు. బిలాస్‌పూర్ నుండి ముక్కు పొడుం, రాయపూర్ సైడు రూపాయి ముద్దర్లు గుద్దినట్టుగ చందమాఁవలంతేసి కోవా ముద్దలూ తెచ్చీసిస్తాడనీసి మా అమ్మమ్మకీ తాతియ్యకీ ఓంకారం పెదనానంటే ఇది. “గాడ్రు డూటీ మీద వెళ్నప్పుడు కూడాను బైట పచ్చి మంచినీళ్ళెయినా తాగడు పిల్లడు!” అనీసి. నేరడ పండు రంగు చొక్కా, ఖాకీ నిక్కరు బుడబుక్కలోళ్ళాగ గబ గబా తొడిగీసుకుని “యేఁవిరా శివ్వడూ ఇహ్హిహ్హిహ్హీ..” అని నాకు టెంకి జెల్లలు కొట్టుకుంటూ గూడ్సు లోకెళ్ళీవోడు మా ఓంకారం పెదనాన. బండి నార్త్ కేబిన్ మలుపులోకెళి పోయీ వరుకూ ఇంక అక్ఖల్లేకపోయినా నీను అడిగేననీసి కను మరుగయిపోయిన వరుకూ పచ్చ జెండా ఊపుకోనే నిలబడీ వోడు. మా కిష్ట బావ ఒకరోజు ఇలాగిలాగ కనుబొమ్మలెగరేసుకుంటూ వొచ్చీసి మా అమ్మతోటి బిసింకటకులో మా పెదనానకి ముండున్నాదనీసి, ఆవిడి కోసమే ప్రెతీ సుక్కురువారం మరువం, మెత్తటి పకోడీలు, గట్టి పకోడీలూ, సంపంగి పువ్వులూ పేకట్లు కట్టించుకోనెల్లటం బొండపిల్లి షావుకారు స్వయంగా చూసొచ్చేడనీసీ చెప్పి కుంపటికెదురుగా కాఫీ కోసం కాసుక్కూసున్నాడు. మా అమ్మ “పోనీరా క్రిష్ణా నీకు పుణ్యఁవుంటుంది బాబ్బాబు! అంబకి చెప్పకురా, దాని కాపరం నిలబెట్టు!! అసలే అర్ధ రాత్రంటా అపరాత్రంటా తాగొచ్చీసి దాన్ని కొడుతునాడు, ఈ ముక్క చెవితే దాని గుండె పగిలిపోతుందీ…” అంటే దొంతర ఎత్తుపళ్ళు కుట్టుకుంటూను కిష్ట బావ మా సత్యోతక్కయ్య కేసి చూసి కళ్ళెగరేసి “ఏఁవే? సత్యోతీ …?!” అని “నాదేవిటున్నాది అమోఘం పిన్నీ! దీన్నోట్లో నువ్వు గింజ నాన్దు! దీన్నదుపులో పెట్టుకుంటే ఉన్నాది!” అనీసి చొక్కా చేతుల మడతలు ఇప్పి పెట్టుకుంటూను కిందికీ మీదికీని. ఇదే కిష్ట బావకి లాట్రీ టికట్లమ్ముతాననీసి లాభాలు గూబాల్లోకి తెచ్చుకోని ఉల్ఫాగా తిరుగుతున్నావోడికి పోన్లే మనవాడనీసి కనికారించి రైల్వేలోన ఎన్నెమ్మార్ కింద మా పెదనానే పోష్టింగు సెట్ చేయించేడు. ఆ ఇదైనా లేకుంట! ఈ రోజుల్లోన ఎవలకీ హెల్ప్ చెయ్యకోడదు. పెట్టినమ్మకే తిడతారు. గూడ్సింజిను పెట్లోన నన్నూ సర్దాగా కూచోబెట్టుకోని తోవ కడాకూ ఇంజిను అగ్గి నిప్పుల మీద సిలవరి తప్పేలాల్లోన వేడి వేడి ఉడుకులన్నం, గొడ్డ కంది పప్పూ, బ్రాందీ సీసా లోనుండి నెయ్యీ వేసి తినిపింస్తాడు మా ఓంకారం పెదనాన. తనకున్న ఆస్తల్లా నాకే రాసిచ్చెస్తాననీసి నాకు తేగలు తియ్య దుంపలూ ఒలిచి పెట్టించి గూడ్సు రఫ్రఫ్ మని గాలీ నిప్పు రవ్వలూ జిమ్ముతుంటే నా చేత హరిశ్చంద్రుడి కాట్సీను, “కొండలు పగలేసినం బండలు కరగేసినం” అన్న పాటా, నానాటి బతుకూ నాటకమూ మళ్ళీ మళ్ళీ పాడించుకునీవోడు. బిసిమ్‌కటక్ లోన పువ్వులూ, పకోడీలూ, జిలేబీ పొట్లాలూ పట్టుకుని బండి దిగుతున్నోణ్ణి చూసి ఎంత పళ్ళు కరుసుక్కూసున్నా నవ్వాగొద్దా? నాకు తెల్సనీసి పెదనానకి మాత్రం తెలీద? నైంటీ డౌన్లోన జాగర్తగా ఇంటికెళిపోమనీసి నన్ను గాడ్రు గారికప్పచెప్పీసి మా ఓంకారం పెదనాన మా అమ్మకీ దొడ్డకీ ఏ సంగతీ చెప్పననీసి దుర్గతల్లి చెట్టు బెరడు ముక్క మీద ప్రమాన పూర్తిగాను వొట్టు పెట్టించుకున్నాడు. ఒట్టనీసి కాదు, మన్తోటి మీకు ఆ డవుటక్ఖల్లేదు. ఇందమ్మంటే అందమ్మ.

మా అమ్మమ్మకీ ఓంకారం పెదనాననంటేనే రోకు. “బూర్జవలస మొగాసాదారు గారి మనవడు. ఈనాటికి పాపం చితికిపోయి ఇలాగయిపోయేరు గాని ఏఁవీ ఓ కన్ను వంకరా? ఓ కాలు వంకరా?” అనీసి. మా నాన్న నల్లగ కోటూ బిన్నీ ఫేంటూ ఏస్కోని జర్జీ కోర్ట్లోన నాగాస్పర్రా కటింగిచ్చుకోని అగ్రహారం వీది ప్లీడర్ల పక్కన ‘నువ్వా నీనా?’ అన్నట్టుగు నిలబడి “యువరానర! మై లెర్నడ ఫ్రెండ్ పాపయ్య శాస్త్రీ కంప్లీట్‌లీ మిస్సుడు ది పోయింట్ యువరానర్…!” అనీసి ఇద్దరు గుమస్తాల చేత కట్టలిప్పించి ఇటుకో దస్తావేజూ అటుకో దస్తావేజూ ఊపుకోని బిగురుతుంటే జైలుకీ జర్జీ కోర్టుకీ మజ్జిలోన నాగలింగం పువ్వులు కోసుకునీ మిష మీద అవన్నీ కిటికీలో కూచోని వినీసొచ్చి మా డాబా మీద చెప్పడానికొచ్చీసరికి. మా దొడ్డా మా అమ్మా మా అమ్మమ్మా డాబా గచ్చు కాలకుంట బిందిల్తోటి చల్లట్నూతినీళ్ళు తడిపించి చాపల మీద కూచోనుంటే నీను అచ్చం మా నానలాగే చేతులు తెగతిప్పుకోని, పాపయ్య సాస్త్రి గార్లాగ కచ్చ ఎగ్గట్టుకోడానికి ముడ్డి తిప్పుకుంటే మా అమ్మాలు పగలబడి నవ్వీవోలు. మా అమ్మమ్మ కొంగు చివార ముళ్ళోంచి రూపాయ కాయితం ఇప్పీసిచ్చి “నా దిష్టే తగిలిపోయిందే! శిష్టు కరణాలయితేనేఁవీ? వొడ్డి దేశంలో వాళ్ళే భ్రేమ్మర్ల్టమ్మా…” అనీసి ఉట్టుట్టికే డాబా గోడని పట్టుకుని ఏడుసుకునీది. అలాటప్పుడు మా అమ్మా మా దొడ్డా ఏమంటే ఏంటోనన్నటుగ అటేపు మెట్లు దుక్కు తిరిగి నోర్మూస్కూచుని మిడుకూ మిడుకూమని నిముర్ధించుకుని కూచూనీవోళ్ళు. నీనే మా అమ్మమ్మని ఊరుకోబెట్టి దాని కాడ సింపతీ వోట్లు కొట్టడానికి శివాలయం వీధి బ్రామ్మల కుర్రోళ్ళాగే గొంతు పెట్టుకోని దుర్గ తల్లి గుడికేసి మా అమ్మమ్మనీటట్టుగే “అమ్మా బాలా త్రిపుర సుందరీ! రాజ రాజేస్విరీ!! అమ్మా పెచిక్ష పరమేశ్విరీ తల్లీ వెయ్యేళ్ళకీ రక్షించి కాపాడు తల్లీ! పిల్లలవాళ్ళం! అమ్మా నీ చెప్పు కింద మట్టి రేణుఁవులఁవమ్మా నీ పీతిలో పురుగులం….!” అనీసి. “వెయ్యేళ్ళకీ కాపాడ్రక్షించు తల్లీ!” అనీసి లెంపలు వాయించుకోని మజ్జిలో దాని మెడకోళ్ళు పలకసర్లు నాన్తాడు గట్టిగా పట్టుకున్నోక్కిస్తాను. మా అమ్మమ్మ రవిక తోడుక్కునీది కాదు. దాని జబ్బలు వొడిలిపోయిన బీరకాయల్లాగ ముడతలు ముడతలుగాను వేలుకుంటూ ఆవు గంగడోల్లాగుంటే ఆ జబ్బలకి పట్టుకోని ముసిలి వాసన పీల్చుకోని నీను వెర్రి దుఃక్ఖఁవొచ్చినట్టుగ దొంగేక్షన్ చేస్సీవోణ్ణి. మొదట కొద్దిగ దొంగేడుపేడిస్తే నెమ్మది మీద నిజింగానే ఏడుపొచ్చెస్తాది, కావాలంటె ఈసుట్టు ఎవల్లేకుంట ఏడిచీస్చూడండి నా మాట అబద్ధఁవయితె?! ఒక్కాణో పరకో ఆడోలకాడ లాగడఁవే వీజీ. శివ్వుమహంతుల వారబ్బాయనీసి బైటికిలాగ మర్యాద మర్యాదగా ఉంటాననీసి అలగనుకున్నారు గాని సమయా సమయాలొచ్చినప్పుడు మీకు నా కంటే కికారపునాకొడుకు లేడు.

అవేళ బార్నాలోల కున్నీబాబ్మీదకి కొట్టడాలకెల్లేము. అంటే బార్నాలోడే ఫష్టు కొట్డానికొచ్చేడు. “అది మా టేకు చెట్టు. ఉబ్బరగా దొబ్బెద్దాఁవనుకున్నావా?” అనీసి. “అలాక్కదమ్మ మురళి! తొందరపడి తప్మాటనొద్దు!! అదేంటి మీ చెట్టా? అలాగనీసి రుజువున్నాద? ఏదీ పేరేది చూపించగలవ?” అంటె “వాట్? షటప్ నాన్సిన్స్” మనీసి బిగురుతన్నాడు కున్నీబాబు. బార్నాల మురళీకి చిన్నాన కొడుకు. మా మహంతుల వారి వీధోలకి గెంబలి వీధోలకీ తగువు ఈనాటిది కాదు. నిరుడు ఆల కేండేటు ఈకీసినప్పట్నుంచే మా మీదన చెడ్డ దీనిగా ఉన్నారు. మన్తోటి పెటుకోవొద్దనీసి ఆల గుమస్తా చేతే వార్నింగిప్పించేఁవు నీనూ, తాడిబెదరూ. సర్వీ వాల ప్రశాంతీ ప్రేవోటు కెళ్ళొస్తుంటే గెంబలీధి కొసాకి దుర్గతల్లి చెట్టు దగ్గిర బార్నాలోల చిన్నాన కొడుకులు విజిల్సేసి చప్పట్లు కొట్టి ఏడిపించేరు. ఆయమ్మాయి “ఏం పిల్డా? గీరేటి పిల్డా?? పళ్రాలిపోతాయి!” అని చెప్పు తీసి ఇసిరిందనీసి కోపం పెట్టుకున్నాడు బార్నాల కున్నీబాబు రుషీకపూర్లాగ కటింగిచ్చుకోని. ఆయమ్మాయిసిరిన చెప్పు బండి డిక్కీలోనె పెట్టుకోని మరుసట్నాడు మళ్ళీ వొచ్చి తారుడబ్బాలెనకాల్నుండి వొడ్డోల చిన్న పిల్లల్చేత కాయితం విమానాలు ఇసిరింపించి అల్లరి పెట్టేరు. ప్రశాంతీ పాపము తన మానాన్ని తను కాలేజీ గోడ వారంట పుస్తకాల బేగు పట్టుకోని వొంచిన తలెత్తకుండా ఇంటికొస్తుంటే నా కళ్ళార నేన్చూసేను. బార్నాలోల కున్నీ బాబు గెంబలీధి గొడౌను గుమస్తాల గుంటడొకడికి దుర్గ తల్లి చెట్టూడలకి ఊగటం ఎలాగో నేర్పించి సమింగా ప్రశాంతీ చెట్టు కిందకొచ్చిన టయానికి ఊడతోటి ఆ గుంటణ్ణి గాల్లోకి తోస్సేడు “గో! గో బగర్ గో…!!” అనరుచుకోని జోరుగా ఊపూపి. ఆ గుంటడు అమ్మలు మీద పడిపోయి ఇద్దరూ బుగ్గిలోన పడిపోయి ఏడుస్తుంటే డిక్కీలోంచి చెప్పు తీసి మీదిసిరీసి “ఏం పిల్లా? గీరేటి పిల్లా? పళ్రాలిపోతాయి..!” అనీసి అరుచుకోని బార్నాలోలు ఫైరాఫీస్ దుక్కు పారిపోడం దుస్సుగాడు, నీనూ కళ్ళారా చూశేఁవు.

అమ్మలు మోచెయ్యి చెక్కురుకుపోతే ఏడ్చుకోనొచ్చి సర్వీ గాడికి చెప్పింది. సర్వీగాడూ నీనూ దుస్సుగాడూ కుక్కశీను గాడూ మేస్త్రి గారాల డంగలాలో కామింట్రీ వింట్నాము. అసలే వెష్టిండీస్ లీడింగులో ఉన్నాదనీసి ఉసూరుమనున్నాఁవు. సర్వీ గాడు క్రిష్ణాల మంగల్షాపులోన ఉట్టుట్టుకే అద్దంలో చూసుకోని మీసాల కత్తిరి తోటి మీసాలు అజిష్ట్‌మెంట్ చేసుకుంట్నాడు. ఆ కత్తిరీ ఉడుకులాం సీసా ఎలాగున్నవి అలాగొగిలీసి “ఎవల్రా మా చెల్లిని కొట్టేరు…? దమ్ముంటే రారా….!” అనీసి కిరికీటు బేట్లు వికిట్లు పట్టుకోని బార్నాలోల గొడాఁవుల్దుక్కెల్తే నాకొళ్ళు ఒక్కడంటె ఒక్కడు ఎడ్రాస్ లేరు. “రారా మీ గొడౌన్లెనకాల ఇంట్లోందాక్కోడము కాదు! మాతోని పెట్టుకుంటె మరి సునాబేడా ఎల్లవు! దమ్ముంటే ఈ దుర్గతల్లి చెట్టుకి ఇటు దుక్కొచ్చీసి మాట్లాడండ్ర… నీ!!” అనీస్తిడితే బార్నాలోడూ ఆల చిన్నాన కొడుకులూ డాబా దిగ్కుంటే గొడౌనెనకాల అద్దాలెనకాల కుక్కలకి పుర్రెక్కించీసి మా మీదకొగ్గేరు. తారు బంగళా కాణ్ణించి మెట్లంగి రాళ్ళు రప్పించి ఆలింటిమీదికిసిరితే కుక్కలూ నోరుమూస్సేయి, బార్నాలోడూ నోరు మూస్సేడు. కుక్కశీనుగాడు ఇసిరిన బెడ్డ అద్దాలకి తగిలింది గాని పగల్లేదు. మా డాడీవాలు కోర్ట్నుంచొచ్చిన టైమనీసి, మేస్త్రి గారు కానాల్దుక్కు నడవటానికొచ్చిన టైమనీసి రైజైపోకుంట డంగలా కొచ్చీసేఁవు గాని అవేళే గెట్టిగిచ్చీసుందును. ఎక్కడిదక్కడే ఇచ్చీసుంటే ఇవాళ ఇంత పీకలమీదికొచ్చేద? ఎళిపోతున్నోల మీదికి మీఁవిసిరిన్రాళ్ళే ఇసురుకోని “గో బగర్! గో…ఫకాఫ్! బాల్స్…!!” అని తిట్టుకోనొచ్చేడు కున్నీ గాడు. మా వీధ్దుక్కు రాకుంట ఈడి కారు, ఎన్‌ఫీల్డు సునాబేడా ఎలాగెల్తాయో రమ్మను! “ఆడేట్రా గురూ తిడతనాడు?” అనిసి నన్నడుగుతున్నాడు దుస్సు గాడు. “‘బగర్’ అంటె అడుక్కునీవోడు…” అనీసి ఇంకూరుకున్నాను. ఆ ఉన్న ముక్కలు మనకి రావు. దరిద్రప్ముక్కలు రాకపోతేనేఁవి? హిందూ పేపర్రప్పిస్తనాఁవు! అల్ల ఇంగ్లీషైనాని సబ్జక్టు డౌటనీసి పేరే గాని సమయా సమయాలొచ్చినప్పుడు నాలుగు ముక్కలు బిగరడానికేఁవీ డవుట్లేదు మీకు. ఈ సునాబేడా వోడిదీ వొకింగ్లీషేన? నిరుడు శ్రీపతి వాల పాపని అమిరికా ఇచ్చేరు. ఆల మొగ పెల్ళివారొచ్చినప్పుడు బ్రెయిననీసి అమిరికా వోడే దిగేడు. ఆ పెళ్ళికొడుకు తోని, బ్రెయిన్ తోని మాటాడితే మాటకి ముందు “ఓ కూల్ కూల్! వావ్ దట్ డే న …?!” అనుకోని తిరుగుతనారు శ్రీపతోల పిల్లలు. నీను పందిట్లోన దుస్సు గాడికీ సర్వీ గాడికీ చెప్పకుంట ఒక్కణ్ణె డైరెక్టుగ బ్రెయిను కాడికెలిపోయి “హలో సార్! ఐ డోంట్ మి!! అయామాఫ్దీ నాటాఫ్దీ నాటాఫ్దీ మి! అయామాఫ్ది యూ!” అంటే ఆడు పీటల మీద కూకున్నోడు లెగిసిపోయి నన్ను కట్టి కావిలించుకున్నాడు. మాటాడితె అలాటింగ్లీషు మాటాడాల! ఆడంటె అమిరికావోడు. హిజ్ నేమీజ్దీ బ్రెయిన్! ఆడు మన్దుక్కొచ్చేడు గాని మనం ఆడి దుక్కెల్లేఁవ? వోకె, ఆడు బిగిరేడన్నా అర్ధఁవున్నాది, ఈ బార్నాలోడికేఁవి? ఇటు తెలుగోడూ కాడు అటు వొడ్డోడూ కాడు నావొడుకు. దనూసొచ్చింది కాబట్టి మీకు ఇవాళ చెప్తనాను గుర్తు పెట్టుకోండి! అవతలాడు ఇంగ్లీష్లోన బిగురుతుంటె “యెస్సార్ యెస్సార”నీసి కూకండపోకండి. త్రీ పీస్ షూటేసుకోని ఆతల కంటే పెద్దింగ్లీషు పెట్టుకోని “షటప్ ది నాన్సిన్స్! వాటిజ్దిస్ …?” అనీసి తగులుకోవాల. వుయారాల్సో హేవింగ్ నొ?! మన్ది మనకున్నాది! కలబడితె నిలబడతారు, నిలబడితె కలబడతారు. నాకొళ్ళు తొక్కీరా?!

బార్నాలోల అన్నదమ్ములిద్దరూ, సునాబేడా బెదర్సిద్దరూ, ఇద్దరు గుమస్తాలూ. మేస్త్రిగారూ పెదనాన కానాల్దుక్కు నడ్డానికెళ్న వరుకూ కాసుక్కూచోని. డంగలా మీదికొచ్చి మా టేకు చెట్టు మరేదాగా మాకిచ్చీమన్నారు. ఇంకెక్కడ టేకు చెట్టు? గెంట కిందటే చిన్న గంటు చెక్కించి తారు పూయించి రైల్వే నెంబరింగు ఏయించీసి గూడ్షెడ్ యార్డ్లోన పడీయించొచ్చేఁవు కామా? “కింద పడిన కాయలు ఎవళ్ళేరుకుంటే వాళ్ళవేను. వోన్రకి హక్కు లేదు! నెంబరు వేయించీసేక ఇంక బార్నాలోడేం చేస్తా” డనీసి భరోసా ఇచ్చేడు మా ఓంకారం పెదనాన. మేస్త్రిగారూ మా పెదనాన్న అలాగెళ్నిచ్చి అదున్చూసుకోని ఠొకడా జీపేసుకోని దిగేరు బార్నాలోలు. తిన్నగా నా దుక్కొచ్చీసి నా ఫిల్టు పట్టుకున్నాడు కున్నీబాబు. చేతికి ష్టీలు కడియం తెచ్చి నా గెడ్డానికి గుచ్చినట్టుగ పట్టుకోని, నాలిక మడత పెట్టుకోని “గివిట్ మేన్! గివిట్ మేన్?! ప్లీజ్ బగర్…” అనీసి. ఫిల్ట్లు పట్టుకోని బిగిరితె బెదిరిపోయినంత బెజ్జుగాలెవల్లేరిక్కడ. “నువ్వు బతిమాల్డానికొచ్చేవా, బెదిరించడానికొచ్చేవ?” అనీసన్నాను – బార్నాల మురళీ తోటి. ఆడేం మాటాడకుంట డంగలా అల్లా చెట్టు మొద్దు కోసం ఎతికింస్తున్నాడు గుమస్తాల్చేత. “కరక్టుగడుగమ్మా… తెచ్చిచ్చెస్తాఁవు! దీనికేనా ఇంత లెక్కని… వేష్ట”నీసి తాడిబెదరు నచ్చ్చెప్తున్నా వినకుంట. సర్వీ గాడూ దుస్సు గాడు ఆణ్ణి విడిపించడానికొస్తె నీనే చెయ్యడ్డం పెట్టి ఆగమన్నాను. “మరేదగా ముందు ఫిల్టొదిలీసి మాటాడమ్మ!” అన్నాను. “నో న్నొ! యూ ప్లీజ్ గివ్ రెస్పక్ట్  అండ్ టేక్ రెస్పక్ట్!” అనిసి. సమ్‌థింగ్ ఆర్ సంథింగ్ వియారాల్సో హేవింగ్ నొ?! సునాబేడావోడు నా మాటిన్లేదు. నా కాల్రు చిరిగిపోతే పట్టుకోని “థీఫ్! చోర్ హై తు! భట్టాచోర్…?! అర్రె దేనా బె! వాపస్ దేనా పేడ్…!” అనీసి పీక బిగింస్తున్నాడు. ఒక చేత్తోని ఆ చెయ్యి పట్టుకోని ఇంకో చేత్తోని ఆడి ఫిల్టు పట్టుకున్నాను. “తెలుగోడికి పుట్టేవా, ఇంగ్లీసోడికి పుట్టేవా తెలుగులోన మాటాడ్ర పేడి మొగం నావొడకా!” అనీసి ఇసిర్తే కింద పడిపోయినోడు బురదలోకెల్లి దులుపుకోని లెగిసొచ్చి మళ్ళీ నా మీదికి కొట్టడాలకొచ్చేడు. బార్నాలోడివైతె? కొట్టెస్తావ?! కొట్టేడనీసి కాదు. ఆడూ కొట్టేడు నీనూ కొట్టేను. నలుగుర్లోన నిలబెట్టి ఇంగ్లీసులోన తిడతావ?? లెగిసీవోణ్ణి లెగనివ్వకుంట గుమ్మిలోనే ఉణ్ణిచ్చి గుభీ గుభీమనిచ్చీసేను రెండెక్కువే. సునాబేడా తోవలోన కర్చుకుంటాయనీసి. చేసింది చెప్పడానికేఁటి? గుమ్మిలోనుండి పైకి లెగిసినోణ్ణి మళ్ళీ గుమ్మిలోకే తోసి లెగనివ్వకుంట ఫిల్టు పట్టుకోన్నొక్కీసి “ఇంగ్లీసు లోన్తిడతావార నాకొడక? షటప్‌ది బాష్టడ్!! ఇటీజది నాట్ యువర్ ట్రీ ఇటీజ్ది జగన్నాస్స్వాం ట్రీ నొ?! ఇటిజ్దీ పండా ట్రీ!! ఐ డోంట్ మి! అయామాఫ్ది నాటాఫ్ది నాటాఫ్ది మి! అయామాఫ్ది యూ! దడ్డేనా యువార్ బాదర్ ప్రశాంతీ…?!” అనుకోని పిచ్చ కొట్టుడు కొడుతుంటే ఆలన్నే ఒచ్చి ఇదా… నా దవడ పగలగొట్టేడు. చిన్నాన కొడుకులికి లేపుకోని బండ్లేసుకోని కిక్కురుమన్లేదు బార్నాలోడు. గుమస్తాలొచ్చి లేపీసి జీపులేసుకోనెళిపోయేరు కుర్రోల్ని. ఉట్టుట్టికే ఒచ్చి కొట్టెస్తే కొట్టించుకోడానికి ఇక్కడ చూస్తూ కూచున్నోడెవల్లేడు.

బార్నాలోడ్ని రక్తాలొచ్చీటట్టుక్కొట్టేననీసి మా డాడీ వొలందరూ నన్నంటారు. ఆడు చేసింది కళ్ళార చూళ్ళేద? బార్నాల షావుకారొచ్చి మా డాడీ కాడ తగువు పెట్టేడు. ఆల కున్నీబాబుకి మనం కొట్టిన్దెబ్బలకి పెదాలు చిట్లిపోయి రక్తాలొచ్చేయనీసి. షర్టు చిరిగిపోయిందనీసి. ఫొటోలు తీయించి తెచ్చేడు. నిరుడు ఇదే బార్నాలోలు స్వయంగా ఆల పెదనాన కూతురు రవణమ్మకి ఆస్తుల్దెగ్గిర జట్టీలొస్తేని వీధిలోంచి జుట్టు పట్టుకోని గొరగొరా ఈడ్చుకుంటూ కొట్టుకోని తీసుకెల్డం మొత్తం గెంబలి వీధి జనఁవల్ల చూసేరు ఒక్కడంటె ఒక్కడు నోరెత్తేడా? ఎవలకి తెలీదు? నాది కొత్త షర్టు మొన్న దసరాలక్కుట్టించిన షర్టు. కాలరు పట్టుకోని చింపెస్తే ఊరుకోవాలా? తొలీత మీవోడే కొట్టేడంటే నన్ను గసిరీసి. ‘కేసు పెట్టమంటారా మీ కుర్రోడికి కరక్టుక్కంట్రోల్లో పెటుకుంటావా జగ్గారావు?’ అనీసి వార్నింగులిచ్చీసెల్లేడు బార్నాలోలయ్య. “ఇంట్లోకెల్ర వెదవ! దమ్మిడీ సంపాదన లేదు గాని ఎక్కల్ళేని కుక్క జెట్టీలు ఇంటి మీదకి. ఛీ ఛ్ఛి! మెంటల పీస్ లేకుంట చేస్తనావు ఈ ఊళ్ళోన ప్రాక్టీస్ చేస్కోని బతకమన్నావా?” అనీసి మా డాడీ నా మీదను రైజైపోతుంటె మేస్త్రిగారే అన్నారు. “పోనీ జగ్గారావు! ఇక్కడుంటె చెడిపోతాడంటె పోనీ ఏ వొయిజాగ్ హైడ్రాబాడ్ పంపించీకోడదు?!” అనీసి. ఆయను ఆ ముక్కన్న వేలావిశేషం ఏంటో గాని ఆ ఒక్క ముక్క పట్టుకోనింక రెచ్చిపోయింది మాయమ్మ. ఇంతకీ మన ష్టారు బాఁవోలేదు. ఒకల్నన్డానికీ మాన్డానికీని…

“ఈ ఊళ్ళో ఉంటే ఆ గేంగిమేన్లు ఎన్నెమ్మార్లూను లేబరు గుంటల్తో తిరిగి చెడిపోతునాడు వీణ్ణి విసాపట్నం తోలీండి!” అని మా అమ్మ గొడవ గొడవ పెట్టీసింది. “ఓంకారం బావా అసల్నీవల్లే ఇదంతాను!! ఆ దిక్కుమాల్న టేకు మొద్దు మనకొద్దురా అన్న ముక్క నువ్వు అనాలా ఒద్దా? పోనీ అన్లేదే కట్టు! స్వయంగా పట్టికెళ్ళి షెడ్లో వేస్తావా? నీ ఉద్యోగమ్మీదికి తెస్తాట్ట ఆ బార్నాల వాడు చూసుకో!” మనీసి మరిడమ్మ లాగ బయిపించితే మా ఓంకారం పెదనాన నిజ్జింగానే దడిసిపోయి “పోనీ వాళ్ళ టేకు మాను వాళ్ళకి పడీసొచ్చిద్దాం…” అనీసి. మా డాడీకీ ఓంకారం పెదనానకీ తిసుకెళ్ళి డంగలాలో తగువు పెట్టించింది. “ఏఁవిరా సర్వీ? దుస్సుగా…? తాడి బ్రెదరూ? ఏఁవిరా వొరే కుక్క శ్రీనూ ఇదుగో పోనీ ఇలాగేనా?! ఇంక ఆజన్మాంతం ఓ తాడూ బొంగరం లేకుండా ఇలాగే తిరుగుతారా? ఎన్ని దొంగతనాలు దొమ్మీలూ చేసుకుంటే వెళ్ళింది ఈ వెధవ జీవితం?” అనీసి బజగోవిందం భజగోవిందం. “అయ్యో అమోఘఁవు! ప్రెమానపూర్తి నాకేటి తెల్దమ్మ! ఏదో పిల్లలాడుకుంట్నారు గావాల ఎక్కడిదో చెట్టు పడున్నాది ఇక్కడ తెచ్చి పడిసేరు పోన్లే అన్నఁవడిగిందా బట్టడిగిందా? అని చూసీ చూడ్ణట్టుగూరుకున్నాను గాని. ఇంతా మనకాడ డంగలాలోన ట్రైనింగయ్యీ ఇలాగేనయ్య? ఆ బార్నాలోల్తోటి మనకెందుకు? తప్పండి పంతులు గారు?!” అనీసి నా మీదనే రైజైపోతనారు మేస్త్రిగారు! దుస్సు గాడు సర్వీ గాడు కుక్కశీను గాడు తాడిబెదరు ఎప్పుడు సుణిగీసేరో ఎక్కడ ఐపన్నా లేరు. ఈ అదును చూసుకోని మా అమ్మ దాని కడుపులోని దుఃఖఁవల్లా కక్కుకోని పెద్దేడుపులే ఏడిచ్సింది. “అటేపు మా నాన్న అంత పెద్ద ఘనాపాఠీ. ఇటేపు మా మాఁవ గారు బరంపురం వరుకూ లీడింగు మెయిష్టీటు! కిష్టారావు పట్నాయక్కి కేసు వొప్పచెప్తే మరి హైకోర్టు కెళ్ళినా అప్పీల్లేదు. అలాటిది ఏదో ఈ వెర్రాయనా నేనూ ఛీ కాదూ భళా కాదూ అనీసి ఆ ఇల్లు పెట్టుకుని బతుకుతునాఁవు. పోనీ చిరంజీవి పెదనానా వీడికీ బస్కీలూ రవుడీ జెట్లూ ఏఁవిటీ? ఆ రత్తాలొచ్చీటట్టు కొట్టుకోడాలేఁవిటి? మిలట్రీలో వేయిస్తానన్నారు… నాయినా ఆ బార్నాల వాళ్ళూ తలతల పెద్దలు దండ నాయకులు! వాళ్ళతోటి మనం సాలగలఁవా? చచ్చీ చెడీ వీళ్ళ సంకా వాళ్ళ సంకా నాకి ఆ ఐటీఐలో సీటిప్పించుకుంటే… ముష్టి వెధవ ముష్టి వెధవా నీకు ఓట్లూ ఎలక్షన్లూ కావాలిట్రా దరిద్రిగొట్టు వెధవా?! అందుకే పగబట్టి సబ్జక్ట్లుంచీసేడు వాడు! ఉట్టిదేను! వెన్ను వేయీసేవురా నువ్వు మర్నువ్వింకుట్టిదేనూ!!” అని ఏడ్చుకుంటూ పళ్ళు పటపట్లాడించుకుంటూ నన్ను కొట్టుకుంటూను. “మీకే వల్లకాడూ తెలీదు మీరుండండి! అసలు మీవల్లే ఇదంతానూ… మొక్కై వంగంది మానై వంగునా?!” అని మా నాన్నకీ రెండు గసిరీసి. ఇక్కడుంటే చెడిపోతాడు వీడింక లాభం లేదు అసలిలాక్కాదుగాక కాదనీసి ఎఱ్ఱతేలు మేషారి కూతురు! “చిన్నానా పోనీగాని మీరూ నాన్నా ఇతనూ మాఁవగారూ ఇంతమందీ ఉండి ఒఖ్ఖగానొక్క పిల్లణ్ణి ఇలాగే వొదిలిస్తారా? ఏఁవో ఏ సినిమాకి వెళ్ళీటప్పుడో ష్టేషన్నుండొచ్చీటప్పుడే అసలే జీబు జీబుమనుంటుంది ఈ వెధవూరు. మన పిల్లడి తప్పనీసి కాదమ్మా అసలు ముందీ ఊరు మంచిది కాదు! అది!! ఒక్ఖ పెట్టు పెట్టిస్తే ఏఁవిటున్నాది …? వాళ్ళు బరిసిలూ సోడాబుడ్డీలూ బదలగొట్టి డబ్భై సెంట్లు ఈరిక ముక్క కోసం ఆడకూతురనైనా చూడకుండా నడివిధిలోంచి గొరగొర్లాగి కొట్టి చంపీవల్సిన మనుషులు వాళ్ళు! కళ్ళెదుటే చూస్తున్నదీ ఇదీనూ ఇంతకంటే దీన్లో ఏఁవిటున్నాది?!” అనీసి మళ్ళీ నామీదికి రెచ్చెస్తంది. “వాళ్ళ టేకు చెట్టు నీకెందుకురా దౌర్భాగ్యుడా?! పొద్దుట పదకొండు అవందీ లేచి పళ్ళేనా తోఁవు కోవూ! ముడ్డి కిందికి పంథొమ్మిదేళ్ళొస్తునాయి. తెల్లవారగట్లే లేచి గడగళ్ళాడి చదవమనీసి నీకు చెప్పి చెప్పి …?! గడగళ్ళాడీ చదువ్! గడగళ్ళాడీ …దేశబ్రాహ్మడు సిద్ధి రస్తూ మూ..ష్ఠి వెథ్థావా!” అని పళ్ళు పటపళ్ళాడించుకోని. మళ్ళీ మొట్టికాయలు పెట్టుకుంటూను కుంకం కరిగిపోయి ముక్కుపుడక నిండాను. “ఏ ఝాఁవునన్నా గడగళ్ళాడి పుస్తకం తీసి చదవగా చూసేరా మీరూ? అలాగ ఉత్సవ్విగ్రహం లాగ మాటాడ్రేఁవండీ?” అనీసి మజ్జిలోన మా డాడీ మీదకెల్తే మా డాడి బెదిరిపోయి ‘చూళ్ళేదు చూళ్ళేద’నీసి మై లెర్నడ ఫ్రెండు నాయొక్క డేడీ!! “…చెప్పి చెప్పి నా నోర్నొప్పే గాని మీకూ వీడికీ చీఁవ కుట్టినట్టేనా లేదు. ఎంథ సేపూ ఆ వాయిదాలకెళ్ళొచ్చీడం, అ క్లబ్బులోన పేకాడీసుకోడం, ఇంత తినీసొచ్చి పడుకోడం ఇదీ ఇతను! పోనీ ఆ ముష్టి ఐటీఐ కాయితమ్ముక్క తెచ్చుకోవే నేను తుట్టకట్టి ఏ డాకియార్డ్లోనో వేయించిస్తాననీసి మా సన్యాసిరావు చిలక్కి చెప్పినట్టు చెబితే విన్నావా? అసలు ముందు నిద్దరంటూ లేస్తే కదుట్రా?” అనీసి ఓఁమని ఏడ్చుకుంటూను. రెండు చేతులూ నెత్తి మీద పెట్టుకుని డంగలా అరుగుమీద కూలబడిపోయి “నిద్రా దేవత నిను వరించె గదరా నిర్భాగ్య దామోదరా!” అని మజ్జిలోన నా నిద్దరూసు, కిరికిట్లూసు, డంగలా ఊసు ఇప్పుడెందుకో మాటి మాటికీ అదే ముక్క ఎత్తుతుంటే మా అంబ దొడ్డా, అమ్మమ్మా, సర్వీవోల ప్రశాంతి అవన్నీ నిజాలైనట్టుగే నా దుక్కు! నీనెన్ని గంట్లకి లేస్తే ఈలకేఁటి? నీన్నాలుగ్గంటలకే లెగిసీసి దేవుడ్దీపం పెట్టెస్తే బార్నాలోడు మనూసెత్తకుంట తిన్నగెల్తాడా సునాబేడ? మీకు లేడీస్తోటిదే నూసిన్సు!

“సింహాలన్నయ్యకి నేనంటే అస్తి పుట్టిపోయింది చిన్నానా! కరణాల పిల్లణ్ణి చేసుకుని నేను ఇటు కన్నవాళ్ళకీ కాకుండాను అటు మాఁవగారి వైపూ కాకుండా రెండింటికీ చెడిపోయేను. నా అన్న రాజు! నేను రేవినైపోయేనా? నువ్వు చెబితే వింటాడు చిన్నానా ఎలాగేనా ఈ పుణ్యం కట్టుకో! వీణ్ణి ఈ ఊర్నుండి తోలీతాం..?!” అనీసి మేస్త్రి గారి కాళ్ళమీద పడిపోయింది మా అమ్మ. సింహాలు మాఁవయ్య బొల్లి మేస్త్రి గారి శిష్యుడేని. ఇప్పుడైతే రిప్లీ కంపినీలోన మేగ్జమమ్ రైజుమీదున్నాడు గాని చిన్నప్పుడు పచ్చకాఁవెర్లొచ్చీసి ఇంక సచ్చిపోయేడు మర్లాభం లేదనీసి లేపీబోతంటే మేస్త్రిగారే పసరు మందిప్పించి బతికించేరనీసి ఆ ఇది మాత్రం ఉంచుకున్నారు. సింహం మాఁవయ్యాల కుర్రాడికి చిరంజీవి రావనీసి మేస్త్రి గారి పేరే పెట్టుకున్నాడు. “నా పేరింటిగాడొకాయను అమిరికాలో ఉన్నాడు పంతుల”నీసి నాతోటి చెప్పుకోని హేపీ అయిపోతారు మేస్త్రిగారు. మా డాడీకి వింట్ర కేష్ట్ చేసుకున్నాదనీసి మా అమ్మంటె కోపం సింహాలోడికి. “ఇదుగో సింహాలన్నయ్యా నీకు నామీద కోపఁవైతే నాకు ఓ పసుపూ కుంకంవేనా ఏ నాడన్నా ఇచ్చిన పాపాన పోలేదు ఇవాళా అడగనూ. నా పిల్లడి మీద పగ బట్టేరు ఈ ఊరి కాఁవందులు. నాయిన్నాయినా నా ఇల్లు నిలబెట్టు! నువ్వే పిల్లడికి ఏదో ఒహ తోవ చూపించీ!” మనీసి తనన్నదమ్ముడికి చెప్పవలిసినవన్నీ మేస్త్రి గారికాడే ఏకరబెట్టెస్తంది. “సింహం రిటారయిపోయొచ్చీసి వొయిజాగులున్నాడు కదమ్మా? చెప్తానలగేని సెప్పడానికే బాగ్యమా? లెగు ముందు నీకు లెగమన్నాన?!” అనీసి మేస్త్రిగారూరుకోబెట్టినకొద్దీ ఇంకా ఇంకా రైజయిపోయి రాణీ రుద్రమ్మ దేవి లాగ. బార్నాలోడి ఫొటోలే కనిపించేయి గాని నీన్తిన్న తాపులెవలకీ అవుపించలేద? ఆడు దవడ మీద గుద్దిన గుద్దులికి ఇట్సైడు పన్ను కదిలి చుక్కా చుక్క రక్తమొస్తుంటె మింగుకోనున్నాను. వైజాగెళ్ళీ హైడ్రాబాడెళ్ళీ మనఁవేటి చెయ్యాలి? ఈకల్తియ్యాలి!

మేస్త్రిగారు ఇంక లాభం లేదు జగ్గారావు, మీ కుర్రోణ్ణెలాగైన వొయిజాగు తోలెద్దామనిసి భరోవుసా ఇచ్చేకే ఇంటికెళ్ళింది తల్లి. మేస్త్రిగారు బార్నోలాల టేకు దుంగ మాచేతే గూడ్షెడ్డు నుండి రప్పించి ఆల చెట్టు ఆలకిచ్చీమన్నారు. ఓంకారం పెదనాన బండీ డబ్బులు తనే అచ్చుకుని “ఇదుగోటివయ్యా! మీ చెట్టు మీరు చూసుకోండి. ఏవో ఒకూళ్ళో ఉన్నాక ఓ గాలీ వానా అన్నాకా ఇలాటి మిష్టిక్సూ ఇవీనీ సహజం! ఇవన్నీ కడుపులో పెట్టుకుంటాఁవా? తెల్లార్లెగిస్తే మొహాలూ మొహాలూ చూసుకోవాలి! ఏఁవిండంటే ఏఁవిండీ అనుకోవాలి!!” అనీసి బార్నాలోడి గుమస్తాకి అప్పచెప్పీసొచ్చేడు. మా కష్టార్జితఁవు! ఇంతా కొట్టుకుని కొట్టుకుని మనకేఁటొచ్చింది? తల్నొప్పీ కాళ్ళ పీకులూని. మన్నాడు బుధవారం మంచిరోజనీసి తెల్లార్ఝాఁవునే లేపీసి సరస్వతీ స్తోత్రం చదవమన్నాది. మల్ళీ టెంతప్పుట్లాగ తడి బట్టలు కట్టుకోని తులిసి కోట దెగ్గిర దీపం దీపం ముట్టించి “లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణి గణ ఖచితైర్ స్థాపితా హేమ కుంభైర్…” అనీసి వల్లించుకోని, నీను “టేక్సీ ఫర్ హైర్!” అంటే ఎప్పుడూ నవ్వీదాయి ఇవాళ నవ్వకుంటా మొగము ముటముట్లాడించుకోని. మేస్త్రిగారు మా అందరి కంట ముందే మూడు గెంట్లకే వొచ్చిసి జాబిరీలోనే పడుకున్నారు. “చిన్నానా అదుగో కాఫీ అక్కడ పెట్టేను చూసుహోండి!” అంటే స్సూ…స్సూ….మని ఊదుకుంటూని. అక్షయపాత్ర గాడు, వాలయ్యా చిడతలు కొట్టుకోనొచ్చి ఇవాళ మా ఇంట్లో దీపాలూ హడావుడి ఏదో ఉన్నాదనీసి మేలుకొలుపులు పాడుకుంటూ మా గుమ్మాలంటే తచ్చాడ్తన్నారు. “అలమేలూ మంఘాతో ఆరాగింథువు గానీ – అయ్యా పారాంజ్యోథీ లేవయ్యా! అయ్యా…!!” అని గే…ట్టిగా వీధదిరిపోయీలగ పాడుకోని. గిద్దిడు బియ్యం, పది రూపాయిలూ నాచేతే చెంబులో ఏయించి దండం పెట్టమన్నాది మా అమ్మ. పోనీ ఎందుకులే అనీసి అలగే దండం పెడితే అక్షయపాత్రా గాడాలయ్య బుర్ర మీద చెంబు పడకుంటా జాగర్తాగా వొంగి లెగిసి దీవించి “శాంతం!! శ్శాంతం హరిః….! నాయనా కుర్రవాలు ముందు ఏదానికైనా శాంతం!! అమ్మా శెలవు!” అనుకోని. నిన్నటకీ ఇవాల్టకీ చూడండి దశెలా తిరిగిపోద్దో? మన దశానాధుడు బావోలేకపోతె ఊళ్ళోన అప్పుడు పుట్టిన్నాకొడుకు నుండి ప్రెత్తీవోడూ మనకి లెక్చిర్లిచ్చీవోడేని. తాతావోరి సత్యోతీ ఫష్టు బస్సుకి రడీ ఐపోయి “కాదు నాకు తెలీకడుగుతాను గాని అమోఘఁ పిన్నీ యేఁవిటిప్పుడైతేను పోబ్లమ్?” అనుకోని.

చితచితలాడుతుంటే ఇళ్ళ కప్పుల వార్లంట నడుచుకోని “రిక్షా జట్కా ఎందుకూ? అఖ్ఖల్లేదు…. అక్ఖల్లేదు పదవే అమ్మా ఈ ఇంత లెక్ఖాను! నాలుగడుగులు వేస్తే అయిపోయిందానికి ఎందుకేఁవిటి చిన్నానా?” అని చెప్పులిప్పీసి చేతిలో పట్టుకుని, ఎత్తుగా ఉండే చీరకే కుచ్చిళ్ళెత్తి పట్టుకున్నాది. “అక్ఖల్లేదు పదవే సత్యోతీ, ఈ ఇంత లెక్ఖా నడవలేకపోఁవు?!” అనీసి ఎత్తెత్తీ ఆ బురదలోనే జాగర్తాగా అడుగులు వేసుకుంటూను. అమ్మా మేస్త్రిగారు తాతావారి సత్యోతీ నీనూ పొలాల గట్ల మీద ఒకళ్ళవెనకొకళ్ళవెనకొకళ్ళఁవు. కోదువాళ్ళ కావిళ్ళని తప్పించుకుంటకి నీను గట్లు గెంతి ముందరికెళిపోయి బురదలో హవాయి చెప్పులు చపక్ చపక్ మనీసి పరిగేఠుకుంటూ వెల్తుంటె “వెధవన్నా ఫేంటు నిండా బురదేను, చొక్కా వెనకల్లాను బురద… అయ్యొ! తడిసిపోతుందిరా! సింహం మాఁవయ్య చూస్తే ఛీ వీడికా ఉద్యోగం అనిస్తాడు వెధవన్నా!” అని నవ్వుకుంటూ కుచ్చిళ్ళు ఎత్తెత్తి. చిలక తోటకూరా, బుడంకాయలు ఏరుకుంటకి ఆగాగి మళ్ళలోకి దిగిపోయి. “వాన పడితే పడిందొసే సత్యౌతీ, తడిసిన బురదలోన ఎలాగూ తడిసేఁవు, మొక్క పదూనుగా ఉస్తికాయలు మళ్ళి దొరకవు!” అని చేతులాడించుకుంటూను. నాగలింగం పువ్వలచెట్ల దగ్గిర రాళ్ళు పరిచిన తోవ ఏనాడాయి ఎవరూ అడుగు పెట్టనట్టు నాచు పట్టిపోయి. జారుపాకు మీద చెప్పుల్లేకుండా అడుగు పెడుతుంటే సత్యోతక్కా వాల చంటిదాని బొజ్జమీద కాల్తోటి నొక్కుతునట్టుగున్నాదనీసి నవ్వుతుంటె గాలికి పన్ను కోసెస్తంది. నవ్వితే మళ్ళీ ఎందుకురా వెధవన్నా నవ్వుతునావంటాది. ఒక్కోసుట్టు ఎవలకి చెప్పకుంట కామ్ గా సౌండు కట్‌చేస్కోనుంటేనే బెష్టు మీకు. కాదంటారా?!

తాతావారి సత్యోతి మా సింహాలత్తయ్యకి ఓ వేలు విడిచిన మేనమాఁవ కూతురు. అందుకనీసి మేస్త్రిగార్నీ సత్యోతినీ దన్ను పెట్టుకోని మళ్ళీ పాతికేళ్ళకి మా మాఁవయ్యాల గుమ్మాలంట వెళ్దామనీసి మా అమ్మ. “నాకు ఉద్యోగం అడుక్కోడానికి నువ్వెందుకే వొయిజాగు? నెమ్మదిమీద అలుకువగా మెలుకువగా నీను సెట్చేస్తాను కదా నీకెందుకా డౌటు?” అంటే “అలగా కలగా బుధ్ధులన్నీ వొవ్వో ఫష్టు మార్కుగా వొచ్చేయి! సిరబ్బదు గాని చీడబ్బుతుంది, నోర్ముయ్ ముష్టి వెధావా, మూసీ నోరు!” అనీసి. సింహాలత్తకి ఉస్తికాయలు ఇష్టం అని సత్యోతి చెప్తే ఎలాగూ తోవలోనేనూ సూడిగాం ఉబ్బగార్రత్తప్పా వాళ్ళ కళ్ళానికెళ్ళి లావుగా ఉస్తికాయలేరుకుని అట్నుంచలాగ బస్సుకెళిపోదాఁవనీసి. రాళ్ళ తోవ చివార్న మట్టిగోడ ఒకవైపుది వంగిపోయి రెండోదాని మీదికి జంట కొబ్బరి చెట్లు ఇలా..గ వంగి పడిపోతూఉంటే పూరి కప్పులిల్లు జీబు జీబుమనీసి. ఉబ్బగార్రత్తప్పా వాల పడిపోయిన పాతిల్లు. పాత చెక్కల తలుపుకి తాళం కప్ప వేలాడుతునాది. లాగితే పుసుక్కుమని ఊడొచ్చీసింది. తలుపుతీసుకుని లోపలికెళిపోయేఁవు. ఎప్పటివో చేటలో బూడిది గుమ్మిడి పండు బూజెక్కి తడిసిపోయిన ముక్క వాసనా…! చందువాక పెట్టి తీసి చూస్తే దాంట్లోన దేవుడి పటాలూ, కిలుం పట్టిన ఇత్తడి కిష్టుడూ, జన్మాష్టమికి కట్టేవి బంగారపు ముచ్చి పాలకీల పాతబుట్ట. “చిల్లిబుగ్గల వెధవన్నా ఎక్కడున్నావురా?” అని తాతావారి సత్యోతీ అరికాళ్ళు టీఖ్ ఠాఖ్‌మని గోని పట్టామీద రాసుకుంటూ గుమ్మంలోంచి మెడకాయ వంచీసి ఉస్తికాయలన్నీ ఏరేరి నా చేతిలో సంచీలో పొస్తునాది. “ఉబ్బగార్రత్తప్ప ఇల్లే ఇదీ! ఉబ్బగారి రత్తంపిన్ని ఇల్లిదీ..!!” అని ఆశ్చర్యంగాను. అమ్మ కళ్ళూ చేతులూ తిప్పుకుంటూను అదేదో దెయ్యాల కొంప లాగ సందేహంగా, అబ్బురంగాను. “రెండేళ్లకిందట మార్గీశిమాసంలో పోయింది సుమీ, ఒసే దానికి మీరందరూ ఉండీ ఎవళ్ళూ లేరూ! చూసేకావు సత్యోతీ ఇల్లిలాగ పాడుబెట్టీసేరా…?” అని ముక్కు మీద వేలు వేసుకుని మూలమూలా అలమార్లు తెరిచి ధూళికి దగ్గుకుంటూ ఇత్తడి గిన్నిలూ, కత్తిపీటా, పెనం, పాతది ద్వారమందానికి వేసే పచ్చవీ ఎర్రవీ పెయింటు డబ్బాలూ. భూత గృహం లాగున్నాది ఉబ్బగార్రత్తప్పాల ఇల్లు. పైన ఎత్తు దూలానికి ఒక పా..త చేట, గుడ్డపీలికలూను. మా ఇల్లూ ఇంకో పాతికేళ్ళకి ఇలాగే అవుతాదా? అమ్మా మేస్త్రిగారూ సత్యోతీ నా జాబూసు, సింహాలోడూసూ మరిచేపోయేరు. కన్నంలోంచి బైట చెరుకు బండోల చలి మంటల వెల్తురుకి గోడ కన్నాల్లెల్లి ధూళి సుళ్ళు తిరుగుతూను. ఉబ్బగార్రత్తప్ప బోదకాలు ఎంతలావుండీదో నవ్వుకుంటూ అమ్మా సత్యోతీ ఉస్తికాయలన్నీ గుడ్డ మూట కట్టుకుని పురికోస్తాడు కోసం వెతుకుతుంటే మేస్త్రిగారు చి..న్న మొగము చేసుకోని ఎర్ర గచ్చు మీద్ది, లాంతరు మీద్ది, దీపం గూడు మీద్దీ ధూళి ఇలా..గ వేల్తోటి తీసి టార్చి లైటుతోటి చూసుకోని గచ్చుమనిపోయి. అటీపు తిరిగి నాగల గావంచా తోటి మొగం తుడుచుకుంట్నారు. “అమోఘం పిన్నీ! అయ్యొ బస్సొచ్చిస్తునాది! అదుగో బస్సొచ్చిస్తునాదే!!” అనీసి సత్యోతక్క చెప్పులిప్పీసి మళ్ళ కడ్డంగా పరిగెట్టించుతుంటేను, చెక్కల తలుపు అడ్డ గడియాకి మళ్ళీ తాళం నొక్కీసి మేస్త్రిగార్తోటన్నాను – “అన్నిళ్ళూ ఇలాగే కూలిపోతాయేటి మేస్త్రి తాతియ్యా?!” అనీసి. మేస్త్రిగారు గట్టెక్కి రోడ్డు మీదకి పరిగెడుతున్నారు నా మాట ఆలకించలేదో, లేదు వినుకోనీ విననట్టుగే ఎలిపోయేరో గాని. మేస్త్రిగారు సచ్చిపోయేక డంగలా నిండా పిచ్చి మొక్కలూ, ఆటికెల్లి ఉస్తికాయలొచ్చీసినట్టుగ, మీఁవందరము వొయిజాగ్ హైడ్రాబాడెలిపోతె మా అమ్మా ఒక్కద్దాయీ ఉబ్బగార్రత్తప్ప లాగె మా ఇంట్లోనా…? “బస్సు కంటే ఒఖ్ఖ గడియ ముందే ఒచ్చీసేఁవర్రా! ఒసే నీ గొల్లే మిగిపోయిందే సత్యోతీ!” అనీసి మా అమ్మ తడి గచ్చు మీద అడుగులు ఎత్తెత్తి జాగర్తాగాను. “ఎంత సేపు ఒగ్గంట కళ్ళు మూసుకుంటే రేసవాని పాలెం దెగ్గిర టీబీ ఆస్పట్లెదూరుగ దింపిస్తాడు ఆ పిల్లడు మంచివాడేనూ!” అని బస్సులప్పారావు బండి మీద ఫుల్ భరోసాగాను.

రేసవాని పాలం లోన ముందర పునాది గట్లన్నీ జాగర్తగా దాటుకోని నడిచీసెల్తే మేస్త్రిగారి మొహఁవూ సత్యోతి మొహఁవూ చూసి లోపటకి రమ్మన్నాడు గాని మా సింహాలు మాఁవయ్య మొహం ముటముట్లాడించుకుంట్నాడు. పాల సీసాలు గిన్నిలోకి వొంచుకోని, ముచ్చి మూతల మీద వెన్న గోటితోటి గీసి గిన్నిలోకి ఏసుకుంటూని. మా ఇంట్లో ఆల్బంలో చూసినోడికీ ఇక్కడ ఎదురుగ్గా కుర్చీలోన కూచున్నోడికీ అస్సలు పోలికే లేదు, కోషండం కాయ లాగ ఒక్క ముక్కొకటి తప్పించి. పట్టబుఱ్ఱకి ఇటీపు ఇన్నెంట్రుకలూ అటీపు అన్నెంట్రుకలూ ఫేను గాలికి ఎగురుతుంటే పెద్ద పెద్ద మిడి గుడ్లు ముదిరిపోయిన ఉడతకి బైటికొచ్చినట్టుగున్నాడు ఎర్రగ చూసుకోని. కిందన మూడు వాటాలూ మీదన మూడు వాటాలూ వేయించి అద్దిలకిచ్చేడనీసి మా అమ్మ తోవలోన బస్సులోనే చెప్పింది. ఇంటి జాబిరీకి దిష్టి గుమ్మిడి కాయ, శ్రీ యంత్రం పక్కనే Brig. K. N. Rao (Rtd.) Dy. GM R. N. Ripley & Co, Stevedors అనీసి రాసుంటాది. ఎప్పుడు లోపటకెళిపోయిందో ఇలాగ నవ్వుకోని ఫ్రిజ్జి వాటరు తెచ్చీసిచ్చింది సత్యోతి – వొయిజాగ్ కటింగిస్తంది. అంత చల్లట్నీలు అలవాట్లేక కొద్ది కొద్దిగ తాగుంతుంటె పన్ను కోసెస్తుంటే నీను ఎటు దుక్కేన చూడ్డఁవాలిస్యం నా దుక్కే చూసి, నీనూ అటు చూడగానే ఇలా…గ మొగం బిగదీసుకుంట్నాడు సింహాలోడు. పొన్లె మనకేటి మనం గుంట్నాకొళ్ళుఁవి. హీ ఈజ్ హేవింగ్ సమ్‌థింగ్ ఇన్ లైఫ్… యెస్స్!! లైఫంటె… మెంట్నెన్సంటె…! “అమ్మా సత్యోతీ! ఈ ఉస్తికాయలూ పాలగుండా పట్టికెళ్ళి లోపట ఒదినకిచ్చీవే!” అని చనువుగా పురమాయించి ఇంక సద్దుతున్నాది మా అమ్మ. కచేరీకి.

“అన్నయ్యా చదువొచ్చింది కాదు సుమీ వీడికి! నాన్నా అంతటి పండితుడూ కోరాఁవు గుచ్చుకున్న నిభానికి కాలు సెప్టీ అయిపోయి మంచం పట్టీసేడు! నువ్వింత పెద్ద పొజీషన్లో ఉన్నావు. సన్నిబాబు ఏఁవీ దూరానున్నాడనీసే గాని వాడంతటి వాడు వాడూ. వీడి తోటి పిల్లలు చక్కగా మంచి మంచి రేంకులు తెచ్చుకుని పెద్దింజినీరు చదువుతునారు! వీడేను… చదువబ్బింది కాదు! చెడు తిరుగుళ్ళు తిరుగుతునాడు! మరి ఉన్నమాట నీతోటి చెప్పకేఁవీ?!” అనీసి. నాకు ఎక్కడ పెట్టుకోవాలొ తెలీలేదు. అవన్నీ ఇక్కడెందుకు? వైజాగు మనకేం కొత్త కాదు. వాయిదాలప్పుడు కోర్ట్లోన కాయితాలిచ్చీడానికనీసి, పారిన్నాయుడు గారాల్తోటి పార్టీ జెండాలు, పోష్టర్లు లారీలో వేయించుకోనొచ్చినప్పుడూ ఒచ్చీ వెళ్ళీ ఊరేను. ఇక్కడ మా అమ్మకీ మేస్త్రిగారికీ ఈ సింహాలోడి ముందు అన్యాయంగ బుక్కైపోయేను. ఎదవ బార్నాలోడి టేకు చెట్టు ధర్మఁవాన్ని! సింహాలోడి మొహం చూస్తే పాత కక్షలు తీర్చుకునీటట్టుగున్నాడు గాని మనకేఁవీ రిప్లై కంపినీలో పిలిచి పోష్టింగిప్పించినోళ్ళాగైతే లేడు. కాఫీ గళాసా నోటికడ్డం పెట్టుకోని కళ్ళ నిండ వెటకారం గాను మా అమ్మ దుక్కే ఉడతలాగ చూస్తనాడు. ఊఁ అనకుంటా, ఉఁఊఁ అనకుంటా నిముర్ధించుకుని. మేఁవు దడుసుకున్నంత భయంకరంగా ఏమి లేడు గాని పోష్టింగిప్పించినోళ్ళాగైతే మటుకూ లేడు సింహాలు బెదరు. అవతలోడి జాతకం ఏటి మాట బట్టేఁటి? కాదు! మనిషి నడకబట్టి చెప్పీయొచ్చు అవతలోడి మంచీ చెడ్డాని.

“మనూరు హైస్కూల్లోన వానాకాలం చదువు సమంగా చూసుకున్నాం కాఁవు. అప్పట్లోనే ఏ శ్రిహాకోళం విశాపట్నఁవో తెచ్చి పెట్టిస్తే ఏఁవో మరి ఇవాళ్టికెలాగుండీదోను గాని…! మరి చెడ్డ తిరుగుళ్ళు మరిగీసేడు. నీ చేతి మీదుగా మనవాళ్ళకి ఎంతమందికో ఉద్యోగాలు వేయించేవంటారు. నువ్వెంత కాదనుకున్నా నా కడుపున పుట్టిన పిల్లడు. రిప్లై కంపినీలో ఏ చిన్న ఫిట్టరు పోష్టో వెల్డరు పోష్టో వేయించీ బాబ్బాబు! నీ పేరు చెప్పుకుని బతుకుతాఁడు…” అనీసి మరీ నిమానుగా సతీ సావిత్రీ కటింగిస్తనాది మ అమ్మ.

పొడుండబ్బీ మూత్తీసి అమ్మన్నదేఁవీ అస్సలు విననట్టుగే పొడుం పీల్చి చేతికున్నది ఎర్ర పొత్తుపంచకి తుడుచుకోని పొడుంబీ మీద తప్ప్… తప్పమని బొటకనేల్తో కొట్టుకుంటనాడు. కర్ర కుర్చీలో కూచోనున్నోడు లెగిసి మేస్త్రి గారి కుర్చీ మీదకి వంగి గౌరవంగా తువ్వాల పెట్టి దులిపినట్టుగ దులిపీసి మళ్ళి కుర్చీలోన కూచోని -

“చెడు తిరుగుళ్ళు తిరుతునాడా? మంచి తిరుగుళ్ళు తిరగలేదా?! ఎవరి కొడుకమ్మా వాడూ? నీ కొడుకే కదా?! నువ్వు మంచి తిరుగుళ్ళు తిరిగేవా వాడిప్పుడు మంచి తిరుగుళ్ళు తిరగడానికీ..?!” అనీసి పోయింటు తీసేడు. ఇదే మున్సబు కోర్ట్లోనైతే ఈడి పని డాడీ వరుకూ అఖ్ఖల్లేదు నీనూ దుస్సుగాడే చూస్సేవోలఁవి. అమ్మా నీనూ మేస్త్రి గారు ‘దేహీ!’ అనొచ్చేఁవు. రాయి కింద చెయ్యి పడిపోయింది. అలుకువగా మెలుకువగా బైటికి తీసుకోవాలి గాని రుంజుకుంటే మన్చెయ్యే రగిడిపోతాది. ఉడత మొహాన్న కళ్ళూ బుగ్గలూ ఉబ్బరించుకుంట్నాడు గానీ నాకు అదేమి కోపమనిపించలేదు. నీను ఆడి దుక్కే చూస్తుంటె ఆడు అమ్మ దుక్కూ మేస్త్రిగార్దుక్కూ చూసుకోని.

IMG_20141218_221921“పెద్దవాళ్ళ మాట నువ్వు విన్నావా? అన్నా పెద్దవాడూ అని నాకు ఏం గౌరవం ఇచ్చేవు నువ్వూ? నీ స్వయంవరం నువ్వే చేసుకున్నావు కదా? కళ్ళిప్పి చూడగానే కనిపించిన మొదటివాడే నా మొగుడూ అనీసి నువ్వూ? ఏనాడైనా నన్ను సరిగ్గా అంచనా వేసుకున్నావా నువ్వూ? లేదు కదా…? ఆఁ…?!” అనీసి మెళ్ళోని రుద్రాక్షకాయల దండ నలుపుకుంటూను. “ఓహోహో! శివ్వుమహంతి!! ఆ బట్టలో తానేనూ ఇదీని! ఇప్పటికిప్పుడు మాం…ఛి తిరుగుళ్ళు రమ్మంటే వొస్తాయా?!!” అని కుర్చీలోంచి మీరాబాయి లాగ చేతుల్తిప్పుకుంటూ లెగిసిపోయి. సమయానికి మేస్త్రిగారున్నారనీసి గాని ఎక్కడిదక్కడే ఇచ్చిద్దునా అనుకున్నాను. అసలే మనకి రోజులు బావోలేవు. అచ్చం ఉడతలాగున్నాడనీసి ఇంకొక సుట్టు చూసి తల్తిప్పీసుకున్నాను, నేలమీదకి. చెవులకెల్లి దుబ్బుగా వెంట్రుకలున్నాయి సింహాలు మాఁవయ్యకి. నాకు నవ్వొచ్చెస్తంటె ఆపలేక యేక్షనకి కాఫీ ఊదుకున్నట్టుగ ఊదుకుంట్నాను గాని తుపుక్కుమనీసి ఇంత కాఫీ నవ్వుతోటి కలిసి బైటికొచ్చీసింది. మేనమాఁవ చెవుల్లో ఎంట్రుకలుంటే మేనల్లుడికి చాల అదుష్టఁవంటారు. మరి మన్దశానాథుడేఁవి ఇంత డౌన్లోనున్నాడనీసి ఫ్ఫ్…. ఫ్ఫ్ఫ్…. మనీసి మనకి నవ్వొచ్చెస్తుంటేని.

“ఏంవోయ్ నవ్వుతునావ్? శివ్వుమహంతీ…? వాటిజ్ ఫన్నీ? ఆఁ…?” అనీసన్నాడు నన్నూ ఒగ్గకుండాను. నీను బ్రెయినోల్తోటి అన్నట్టుగే “నో న్నొ సార్! జష్ట్ … ఐ డోంట్ మి! అయామాఫ్ది నాటాఫ్దీ నాటాఫ్దీ యూ! అయామాఫ్దీ మి!” అందాఁవనుకున్నాను గాని ఎందుకసలకే మనకి ఏల్నాటి శని, రోజులు బావులేవనీసి తలదించుకోని నేల చూపులు చుసుకోనున్నాను మూసిన కోళ్ళాగ. అమ్మా మేస్త్రి గారూ అప్పుడే రిప్లై కంపినీలో నీను ఫిట్టర కింద ఫిటింగైనట్టుగా, జీతాలు కరుకులందుకోని ఈ ఉస్తికాయల బేగీలో ఏస్కోని ఇంక పెద్ద పండుగులికి మా ఊర్లోన దిగినట్టుగే నవ్వు మొకాలు పెట్టుకోని. నాకు ఆకలేస్తంది. ఇంట్లో ఉంటే ఎంత బతిమాల్న ఏమఖ్ఖల్లేదు గాని, ఇల్లూ వొదిలొచ్చేనా శాన గడాకలేసెస్తాది నాకు. “ఏం..? నవ్వుతునావేం…?” అని మళ్ళీ దబాయింస్తే “అచ్చీ…ఏంట్లేద్సార్! నో….న్నో! జష్ట్…” అనీసి ఇలాగ ఠొప్పాసి మొగం పెట్టుకోని కూచున్నాను గాని. ఏమో పోష్టింగేయించినా వేయించుతాడేమో ఏమో ఎవల్చూడొచ్చేరు?

ఇంక చిలకట్టెగ్గట్టుకోని స్వయాన్న మేస్త్రి గారే రంగంలోకి దిగిపోయేరు. “సూడ్నాన్న సింహఁవు! నీ సేతిలున్న పని. ఎప్పుడో పాతికేళ్ళ కిందట ఏదో ఆయమ్మాయి అలాట నిర్నయం తీస్సుకున్నాది. ఆ నాట్నుండి ఈనాటి వరుకు మీ నాన్నా నాతోటి మాటాడ్డు, ఆ కిష్టారావు ఆడూ సచ్చేపోయేడు గాని బతికున్నాళ్ళు నా మొగమన్న మరి చూసేడు కాడు! అయిపోయిందేదొ అయిపోయింది, ఇప్పుడు తవ్వుకుంటె ఏటున్నాది? ఈయను తెలివైనోడేని. చదువొచ్చింది కాదు గాని మీ అయ్య మొండితనఁవొచ్చింది. సూడు మరేటి? ఎక్కడో వొక్కడ ఏదో నీకు తోచించోట పెట్టించెస్తె నీ పేరు చెప్పుకోని బతికిపొతాడు. నీన్చెప్పవలిసిన ముక్క నీన్చెప్పేను మరి సూణ్ణీ ఇష్టఁవు!” అనీసి మేస్త్రి గారంటుంటె మరింకేమి రైజయిపోకుంట నోరు పిత్త పరిగి లాగ ముందుకీ ఎనక్కీ ముడుసుకుంట్నాడు గాని అవునలాగేనన్న ముక్క అన్నాడు కాడు సింహాలోడు. ఈడేమి శిష్యుడు మేస్త్రిగారికి? నలుగురు ఎదురెదురూగ్గా కూచున్న కాడ ఎవలూ ఏమీ అనకుంటా మర్యాదా మర్యాదాగా కూకుంటే నాకొళ్ళు పిచ్చెక్కెస్తాది మా అమ్మకి! కాఫీ గళాసులు కింద పెట్టీసి ఇంకెల్తామనీసి లెగిసిపోతే మా అమ్మ అప్పుడొచ్చింది మా సింహాలత్తయ్య – పెరట్లోంచి చేతుల్తుడుచుకోని. “అయ్యొ?! అప్పుడే? పోనీ కూచోండి గడీసేపు?” అనుకుంటూనే గేటు దాక సాగనంపుతూను. సింహాలోడు డ్రైవరుకి పిల్చి ఏదో పురమాయించుతుంటె మా అమ్మే -

“ఎందుకొదినా ఈ ఇంత లెక్ఖకీ మళ్ళీను? గెంట గెంటకీ బస్సులున్నాయి. ఏదో మరి చాల్దయుంచండి…” అనీసి సింహాలోడి దుక్కు ఆశగా చూస్తంది. “మా వల్ల తప్పులున్నట్టుగైనా మమల్ని మన్నించండి!” అనీసి కొలాయిలిప్పీసి. సమయా సమయాలొచ్చినప్పుడు దానికి కొలాయిలు రడీగుంటాయి. మెట్లు దిగొచ్చెస్తుంటే మేస్త్రి గారికొకటి, సత్యోతి చేతికొకటీ రెండు బొమ్మనా బ్రెదర్స్ సంచీలు తెచ్చీసిచ్చేడు డ్రైవరు. నాకూ మా అమ్మకే ఉట్టి చేతులు నమస్తె!

“పోనీ నాయినా! కడుపులో మనమీద అంత దుఃఖం పెట్టుకున్నాడు. పోనీ వేయించట్ట ఉద్యోగం మరేం మించిపోయింది అలాగేను పోనీ! ఏదో నీ అంతట్నువ్వే ఎక్కడేనా ఏ ఉద్యోగఁవేనా తెచ్చుకుని ఇంత నీ అన్నం నువ్వు తింటే నీ అంతటి వాడివి నువ్వూ…” అనీసి ముక్కు చీదీసి బస్సు కిటికీ ఊసలు తడిసీటట్టు ఏడుస్తాది. “చూడూ మనన్నం మనం తిని, మన బట్ట మనం కట్టుకుని, లోకానికి వెఱవాలి!” అనీసి నాకూ, నా పక్కన సత్యోతికీ. ఏడుస్తున్నదాయికి ఊరుకోబెడదామనీసి “ఇదుగో చూడు సత్యోతీ ఎవళ్ళ ఖర్మకి ఎవళ్ళు కర్తలు? అంథా వొట్టిదీ!” అనీసి ఇలాగేదైనా కటింగిద్దామనుకున్నాను గాని ఎందుకెందుకనీసి. “అమ్మా! కనకమాలక్ష్మీ వీడికో తోవ చూపిస్తే ఒచ్చి నీకు కొబ్బరికాయ కొట్టుకుంటాను కాపాడ్రక్షించు తల్లీ!” అనీసి. సింహాలు మాఁవయ్యయితేనేటి, ఏడుకొండలు ఎంకటేస్స్వాం అయితేనేఁటీ? ఒకలకెందుకడగాలే అంటే విన్దు. తెల్లారి లెగలేకనీసి కదు… అలాగే లెగుస్తనాను. లెగిసి మేస్త్రిగారి కాడికెళిపోతాను. ఇంట్లో కంటే డంగలా మీకు తౌజండ్ టైమ్సు బెటరు. సర్వీ గాడు, దుస్సుగాడూ నీనూ డంగలా యెనక ముగ్గురం మూడు టేకు మొక్కలు నాటేఁవు. ఒక టేకు చెట్టు అమ్మితే గనక ఏడాది హేపీ. జాబంటే చేదనీసి కాదు. ఒకల్తోటి మాటెందుకు పడాల? ఆపాటీపాటి లెవిలూ మెంట్నెన్సూ మనకున్నదేదో మనకున్నాది. హిందూ పేపరు, ఎంప్లాయిమెంట్ న్యూస్ రప్పిస్తనాఁవు. ఎన్డియ్యే ఎగ్జామ్సంటే, ఎలక్ట్రీ బోర్డ్లోన క్లాస్ ఫోర్ పోష్టింగులున్నాయంటే మొదాటి చలానా మన్దేని మీకు! మీకీరోజు డంగలా మీద ఆంజనేస్స్వాం మీద ప్రమాన పూర్తి, ఇదివరుకుట్లాగ కాదు. బార్నాలోడూసూ, గెంబలీధి ఊసే ఒగ్గే ఒగిలీసేఁవు, కావాలంటె యెంక్వైరీ చేసుకోండి. డాడీ కూడన్ను చెలానాలు, పోష్టలార్డర్లకి, మరి సైడు ఖర్చులకైనా ఎప్పుడేన అడిగితే ఎంత టైటుగున్న కూడన్నూ ఒద్దన్రు. సాయింకాలాలు ఒక్కళ్ళె మడత కుర్చీలోన కూచోని ఆకాశం లోకి చూసుకుంటంటె ఏంటనాలో తోచకా ఉట్టికే ఆయనకి మరిపింతాలకనీసి “బియ్యే ప్రైవోటుగ కట్టీమంటారేంటి డేడీ?” అంటే దిగ్గున్లెగిసెళ్ళి అలమార్లోనుండి మా తాత పుస్తకాలు తెచ్చీసిచ్చేరు – రెన్నండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర, శంకర నారాయణా డిక్షన్రీ. ఎద్దురా బాబంటె గిద్దిడు పాలియ్యదా? అనీసి. ఇలాగనీసి చెప్పుకుంటే మేస్త్రి గారు “పట్టుదలగా సదివీసి పేసయిపోండి పంతులు గారు! సదువుకుంటె ఆ గవురం, ఆ షైనింగు వేరు!” అంటారు గాని అది మన్లైను కాదు. ఆ సంగతి మేస్త్రిగారికీ తెల్సు, మనకీ తెల్సు. మా అమ్మ తాతాల కాడ ఇంటి నిండా అన్ని పుస్తకాలుంటాయి. మా డాడీ వోల తాతకి ఇంగ్లాండ్ నుంచొచ్చిన లా పుస్తకాలకి చోటు చాలకే ఇప్పుడీ మహంతులవారి వీధిలో తొలీత మిద్దిల్లు కట్టేడు మా తాతాల నాన. “అన్నీసి పుస్తకాలు చదివీస్చదివీసి మా తాతలు ఊడబొడిసిందేటి మేస్త్రి గారు, మీరు పొడవందేటి?… ఐ డోంట్ మి!!” అంటే “తప్పు నాన్న అలాగంటావ?” అనీసి గంధం, సింధూరఁవు గెడ్డ అరగదీసుకుంటారు గాని మరేటన్రు మేస్త్రిగారు. మనిషి కామాపయిపోయేరు. ఉబ్బగార్రత్తప్పాల పాతింటికెల్దాఁవు ఒస్తారేటి పదండంటే మాత్రఁవు “అయితే పదండి మనవడూ!” అనీసి ఎక్కడిదక్కడొగ్గీసి చేపాటీ కఱ్ఱ పట్టుకోని లడీ అయిపోతారు. అవేళ ఉబ్బగార్రత్తాప్పాలింటి కాడ మీఁవు ముగ్గురము ఉస్తి కాయలు కోసుకుంటుంటె ఎవలూ చూడకుంట దేవుడి పెట్టి దుక్కు కూకోని ఏడ్చుకుంట్నారు మేస్త్రి గారు. తీరా నీనూ ఒచ్చి చూస్సరికి నాగల గావంచా తోన మొగం తుడిసీసుకోని. ఊరొగ్గీసెకడికెళిపోమంటావు? ఉచ్చా పియ్యా తచ్చాడాలి!

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, కథ, డిసెంబర్ and tagged , , , , .

2 Comments

 1. మన కరణాల కుర్రోడంటె చెభాస్! అనిపించేడ్ర దద్దా త్రిపురా నీ కనక!
  మన దశానాధుడు సమింగా లేక ఇల్లింగ్లీషు కొద్దిగ డౌటు, ఐటీఐ సబ్జక్ట్లు నేరో మిస్సులోన పోయి తిరుగుతునాననీసి గాని… ఇలాగున్నాననీసా?!

  … ఏంటనాలో తోచకా ఉట్టికే ఆయనకి మరిపింతాలకనీసి “బియ్యే ప్రైవోటుగ కట్టీమంటారేంటి డేడీ?” అంటే దిగ్గున్లెగిసెళ్ళి అలమార్లోనుండి మా తాత పుస్తకాలు తెచ్చీసిచ్చేరు – “అన్నీసి పుస్తకాలు చదివీస్చదివీసి మా తాతలు ఊడబొడిసిందేటి మేస్త్రి గారు, మీరు పొడవందేటి?… ఐ డోంట్ మి!!”

  వుయారాల్సో హేవింగ్ నొ?! మన్ది మనకున్నాది! కలబడితె నిలబడతారు, నిలబడితె కలబడతారు. ఇంతకీ మన ష్టారు బాఁవోలేదు. ఒకల్నన్డానికీ మాన్డానికీని… వైజాగెళ్ళీ హైడ్రాబాడెళ్ళీ మనఁవేటి చెయ్యాలి? ఈకల్తియ్యాలి. ఊరొగ్గీసెకడి కెళిపో మంటావు? ఉచ్చా పియ్యా తచ్చాడాలి!

  ( త్రిపుర గారి వీరాభిమాని, మా బందరు ఆరెస్కే మూర్తి మాస్టారు గారబ్బాయి రాజనాల ఆర్వీ రమణ కనక ప్రసాదు గారి యీ కధను తెగ మెచ్చుకుంటూ ఇలా రాసారు. నామిని అన్న, డా వంశీధరరేడ్డి, స. వెం రమేష్ గారు, నరేష్ నున్నా, శిరీష ఆదిత్య, గోపీ గారపాటి, గుర్రం ఆనంద్ అనేకానిక ప్రతిభావంతులు కినిగేలో తెలుగు మాండలీకాల మరపురాని కధల మాయాజాలాలు చేస్తున్నారంటూ తెగ మురిసిపోయారు.~ కె కె రామయ్య )

 2. “వొడ్డి దేశంలో వాళ్ళే భ్రేమ్మర్ల్టమ్మా… నీను బ్రేమ్మర్ల కాడ ఆలకంటే యెక్కువ భ్రేమ్మన్స్ లాగ మాట్లాడతాను “ చెభాస్! అనిపించేడ్ర ఒడ్డి దేశం త్రిపురా నీ కనక !

  రెన్నండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర, శంకర నారాయణా డిక్షన్రీ. ఎవల కుర్రవాడండీ వీడు? గుంటడు ఖణీగా మాటాడుతునాడు! అప్పట్లోనే ఏ శ్రిహాకోళం విశాపట్నఁవో తెచ్చి పెట్టిస్తే ఏఁవో మరి ఇవాళ్టికెలాగుండీదోను గాని…! ఇలాగనీసి అనాలంటే మాత్రం నాకు మా చెడ్డ దీనిగా వుంటాది
  త్రిపుర మేస్త్రి గారు … ఐ డోంట్ మి!!”

  “అమ్మా బాలా త్రిపుర సుందరీ! రాజ రాజేస్విరీ!! అమ్మా పెచిక్ష పరమేశ్విరీ తల్లీ గుంటడ్ని వెయ్యేళ్ళకీ రక్షించి కాపాడు తల్లీ!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.