NAREN-PHOTO

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: మధురాంతకం నరేంద్ర తో

Download PDF    ePub   MOBI

మధురాంతకం నరేంద్ర రాసిన నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” ఇటీవల విడుదలైన సందర్భంగా ఆయనతో ఈ ఇంటర్వ్యూ.
మీ ఇదివరకటి రచనలతో పోలిస్తే ఎంచుకున్న వస్తువు పరంగా, చెప్పిన తీరు పరంగా ఇది ఏరకంగా భిన్నమైంది?

యీ ప్రశ్నకు పాఠకుడే సరైన సమాధానం చెప్పగలడనుకుంటాను. కథావస్తువు కోసం, పనిగట్టుకుని, వెతకడం నాకిష్టం వుండదు. స్పాంటేనియస్‌గా జీవించడమే యిష్టం. అయితే ‘అనుభవాలు’ జరిగిపోయిన తర్వాత, కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతాయి. వాటిని కథలుగా మలచడానికే ప్రయత్నిస్తాను. వొకసారి రాసిన పద్ధతిలో, రీతిలో మరోసారి రాయడంలో నాకు ఆసక్తి కలగడం లేదు. యెక్కడో, యేదో వొక కొత్తదనమో, ప్రయోగమో సవాలు చేసినప్పుడే రాయడానికి మొగ్గుతాను. రాసి ముగించాక, ఆ సవాలును సరిగ్గానే యెదుర్కొన్నామన్న నమ్మకం కలిగినప్పుడే థ్రిల్ వుంటుంది. యిది నా గొడవ. తీరా, చివరకు తయారైన కథ, నేను రాసిన మునుపటి కథలకు భిన్నంగా వుందో లేదో, నిర్ణయించాల్సిన న్యాయనిర్ణేతలు పాఠకులే!

ఈ నవల చదివేటప్పుడు విమానాశ్రయాల వాతావరణం చుట్టూ వచ్చి పరుచుకుంటుంది. దీన్ని రాయటం మీకు ఎలాంటి అనుభవం?

యే రచన చేస్తున్నప్పుడైనా, a writer has to live (with it). సృజన చేస్తున్న సమయంలో, మనం జీవిస్తున్న ప్రపంచం నుంచీ, ఆ రచన జరుగుతున్న స్థలానికీ, కాలానికీ, ప్రదేశానికీ, పరకాయ ప్రవేశంలా బదిలీ జరిగాకే, రాయడం సాధ్యమవుతుంది.

యీ నవల రాసిన కొన్ని నెలల సమయంలో, మానసికంగా నేనా విమానాశ్రయంలో వున్నట్టే! ఆ పాత్రలతో బాటూ వాళ్ల సుఖ దుఃఖాలనూ నేనూ అనుభవించే వుంటాను. వొక జీవితంలో కనీసం పన్నెండు జీవితాలు జీవించాలని వుంది అంటాడో కవి. రచయిత తాను రాసే ప్రతి రచనతోనూ, వొక జీవితం జీవించే వుంటాడన్నది నా అనుభవం.

పెద్దగా నాటకీయత లేకుండా, దాదాపు ఒకేలాంటి వాతావరణంలో జరిగే నవల రాయటం కష్టమనిపించలేదా? 

స్థూలంగా చూసి, జీవితంలో నాటకీయత వుండదని అనుకుంటాం. కానీ అది నిజంగాదు. జీవితంలో వున్నంత నాటకీయతే, యీ నవలలో గూడా బోలెడంత వుంది. అయితే ఆ నాటకీయత ‘నాటకీయత’ అనిపించేటంత బలంగా కనబడలేదంటే, ఆ మాటను నేనొక కితాబుగానే భావిస్తాను.

పుస్తకం చివర్న మీరు రాసిన “భరత వాక్యం”లో ఈ నవల రాయటానికి ప్రేరేపించిన సంఘటనల్ని ప్రస్తావించారు. అవి ఆరేళ్ల క్రితం జరిగాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ నవల రాయాలని ఎందుకనిపించింది? 

2006లో జరిగిన అనువం, నవలగా పాఠకుల దగ్గరికి 2013లో గానీ రాలేదు. నిజమే! వొకసారి వెనుదిరిగి చూసుకుంటే, కొంత కాల వ్యవధి తర్వాతే, నేను రచన రూపంలో స్పందిస్తున్నానని అనిపిస్తోంది. యిలా వ్యవధి తీసుకోవడం వల్ల భావతీవ్రత (emotional) లేకుండా, నిర్మోహత్వం (detachment)తో స్పందించడం సాధ్యమవుతుందనుకుంటాను.

అయితే భౌతిక సమయానికీ, మానసిక సమయానికీ పొంతన వుండదు. 2006లో ఆ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత, నాకు ఆ అనుభవపు అనేక అనుసంగికమైన అంశాలపైన – వుదాహరణకు మతతీవ్రవాదం, మతాలపుట్టుక, ప్రవక్తల జీవితాలు, విమానాశ్రయాల్లో భద్రత, తీవ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాదుల స్థావరాలు, వాళ్ల స్వభావాలూ నమ్మకాలూ – మొదలైన అనేకమైన అంశాలపైన ఆశక్తి కలిగింది. యిదంతా చదివి, పరిశోధకుడిలాగా, నియమబద్ధంగా, వివరాలు సేకరించుకున్నానని చెప్పలేను గానీ, చాలారకాలుగా యీ విషయాలను గురించి తెలుసుకోడానికి ప్రయత్నించానని మాత్రం చెప్పగలను. యీ పనిలో పుస్తకాలతో బాటూ నాకు యింటర్నెట్ యెంతో వుపకరించింది. యింటర్నెట్ లేకపోతే చాలా విషయాలు తెలిసేవే గావు. యిలా యీ విషయాలనంతా తెలుసుకోడానికి చాలాకాలం పట్టింది.

ఆ తర్వాతే నవల రాయడానికి పూనుకున్నాను.

నవల రాస్తున్నప్పుడు మళ్లీ ఆ ప్రయాణమంతా – మానసిక కాలమానంలో – చేశాను.

ఆ సంఘటనల పట్ల అప్పటి మీ దృక్కోణానికీ, ఇప్పటి మీ దృక్కోణానికీ మధ్య మార్పులేమన్నా వచ్చాయా? 

యేదయినా జరుగుతున్నప్పుడు, యేదయినా కొత్త విషయం విన్నప్పుడు, వెంటనే దాని పట్ల వొక నిర్ణయానికి రావడమెందుకో నాకు చేతగాదు. నాలో ‘doubting tom’ లక్షణాలు, hamlet లో వుండే వూగిసలాట వున్నట్టు నాకనుమానం.

కొంత సమయం గడిచాక, కావలసినంత అవగాహన కలిగిన తర్వాతే, యే విషయం పైనయినా conviction వస్తోంది.

సత్యమనేది యెప్పుడూ పరిపూర్ణంగా దొరకదనీ, అది సాపాక్షికమేననీ, నా నమ్మకం. నమ్మకమన్నదాన్ని యెంత మేరకు నమ్మామో అంత వరకే చెప్పాలనీ, సమాధానాలు దొరకని సందేహాలను అలా సందేహాలుగా వుంచేయడమే న్యాయమనీ అనుకుంటాను.

నవల వాస్తవానికి మరీ దూరం జరిగినట్టు అనిపించలేదు. కథకుని లాగే మీరూ మెక్సికోకు ఏదో సెమినార్ మీద వెళ్లారన్నారు. మీతో పాటూ అఖిలేశ్వర్ అనే హిందీ రచయిత కూడా వచ్చారన్నారు. చదివేవాళ్లకి వెంటనే ఆయనే దమ్మపాల్ చోప్రా పాత్రకు ప్రేరణేమో అనిపిస్తుంది. ఏమంటారు? (ఈ మధ్య హాన్స్ ఇండియాలో మీరు రాసిన ఒక ఆర్టికల్లో ఒక ఫొటో ప్రచురించారు. అందులో ఉన్నాయన ఆహార్యం దమ్మపాల్ చోప్రా నే తలపించింది.) 

నవలలోని వాతావరణమూ, సంఘటనలూ అంతా వాస్తవమే! దమ్మపాల్ చోప్రా, కథకుడూ, మిగిలిన అన్ని పాత్రలూ కల్పితాలే! అయితే ఆ పాత్రలన్నింటికీ జీవితంలో prototypes వున్నాయి. లేదంటే తెలిసిన నలుగురైదుగురు వ్యక్తుల్లోంచీ భిన్న స్వభావాల్ని తీసుకుని, కలిపి, వొక కొత్త పాత్రను రూపొందించడం జరిగివుండవచ్చు. అప్పుడది కల్పిత పాత్రే అయినా, వాస్తవికతకు దూరం గాదు గదా!

Hans India లో వచ్చిన వ్యాసాన్ని అంత శ్రద్ధగా గమనించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. రూపం, ఆహార్యం వరకూ చూస్తే దమ్మపాల్ చోప్రాకూ, హిందీకవి మిత్రుడు అఖిలేష్‌కూ పోలికలుండడం నిజమే! అయితే ఆ పోలిక అంతవరకే! నవలకంతా మూలమైన ప్రతిపాదన కోసం తయారైన పాత్ర దమ్మపాల్ చోప్రా. ఆ పాత్ర మూలాలు చరిత్రలో వున్నాయి. అంతకంటే యెక్కువగా వాచ్యం చేస్తే, పాఠకుని ఆశక్తిని పలచబరిచే తప్పు చేసినట్టవుతుంది.

దమ్మపాల్ చోప్రాలో మతతీవ్రవాదానికి మూలాలు చూపించే ప్రయత్నం చేశారు. చివర్లో అతను తనకు కలిగిన జ్ఞానోదయాన్ని (అద్భుతాన్ని) ఆచరణలో పెట్టడానికి ప్రతిపాదించే పద్ధతులన్నీ నేటి తీవ్రవాదుల భావజాలాన్నే సూచిస్తాయి. కథకుడు ఇదంతా చూస్తుంటాడు గానీ, బాహటంగా ఏ వ్యాఖ్యానాలూ చేయడు. రచయితగా మీరు వ్యాఖ్యానాలు చేయటం బాగోదు నిజమే. కానీ మీ కథకుని చేత (నేరేటర్ చేత) కూడా ఆ నిగ్రహాన్ని ఎందుకు పాటింపజేశారు? 

రచయిత వ్యాఖ్యానాలు చేయలేదు. నిజమే! కానీ కథకుడు – గుర్రపురౌతు – తటస్థంగా లేడు. నవల చివరి పేజీల్లో అతను – “అతను చెబుతున్న పరమధర్మమేమో గొప్పదే! కానీ దాన్ని అనుసరింపజేయడానికి యితను మళ్లీ హింసామార్గాన్నే యెన్నుకుంటున్నాడు… రెండు మూడేళ్లలో యితడికి వేలమంది శిష్యులు దొరకవచ్చు. యీయనగారి బోధనల్ని అమలులో పెట్టడం కోసం, వాళ్లందరూ కత్తులు పట్టుకుని యుద్ధంలోకి దిగితే యేవవుతుంది? నాకు వెన్నులో చలిజ్వరం పుడుతున్నట్టుంది. భయంతో చెమటలుపోయసాగాయి” – అంటాడు (95 – 96 పేజీలు).

అయితే యిలా గుర్రపురౌతు స్పందించిన తర్వాత, అతగాడి హిందూ – ముస్లిం వారసత్వం గురించిన సంగతి వెల్లడయినప్పుడు, పాఠకుడి దృష్టి వెంటనే రెండవ అంశం పైకి మరలుతోందని నాకిప్పుడు, మీ ప్రశ్న విన్న తర్వాత, అనిపిస్తోంది.

ధమ్మపాల్ చోప్రా ప్రతిపాదించే పద్ధతులన్నీ ప్రస్తుత ఇస్లామిక్ తీవ్రవాదుల పద్ధతుల్నే గుర్తు తెస్తాయి. మరి ఆ పాత్రని హిందువుగా చేయటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా – అటువైపూ అలాంటి అతివాదం ఉండొచ్చని చెప్పటానికా, ఆ పాత్రని ముస్లిం చేస్తే పుస్తకం వివాదాస్పదం కావొచ్చనా?

యీ ప్రశ్నకు సమాధానంగా, పై జవాబును పొడిగిస్తే సరిపోతుంది. చూడ్డానికి ముస్లింలా కనబడుతున్న చోప్రాతో ప్రయాణం చేయడానికే గుర్రపురౌతు భయపడ్డాడు. గుర్రపురౌతు ‘ముస్లిం’ అని తెలిశాకా చోప్రా మాత్రం భయపడకుండా యెలాగుండగలడు? పుట్టుకతో ముస్లిమైన వ్యక్తిని, విమానాశ్రయ వుద్యోగులు, తీవ్రవాదిగా అనుమానించటంలో ఆశ్చర్యమేముంది? తీవ్రవాదపు ప్రభావం యెంత తీవ్రంగా వుందంటే, యిప్పుడు అందరూ, నీడల్ని చూసి, భ్రమల్ని ప్రేరేపించుకుని, హడలిపోతున్నారు.

మతం అనేది వొక సమూహపు నమ్మకంగా మారడంతోనే, యితర మతాలపైన ద్వేషం, అసహనం చెలరేగుతున్నాయి. మతం లేకుండా మనిషి జీవించలేడని చరిత్ర చెబుతోంది. “రష్యను ప్రజలు నాస్తికులైతే, అప్పుడు నాస్తికత్వాన్నే వాళ్ళు మతంగా మార్చుకుంటారు” – అంటాడు డాస్తోవిస్కీ. పరమత అసహనం మతాలన్నింటిలోనూ వుంది. మతతీవ్రవాదం యే వొక్క మతానికీ పరిమితం గాదు. యిది అన్ని మతాల్లోనూ, యేదో ఒక నిష్పత్తిలో, వుండనే వుంది.

మతం, దాని పుట్టుక, స్వభావం, దాని ఆవశ్యకత, దాని పరిమితులు – యీ అంశాల పైన open mindతో చర్చించగలిగే అవకాశమిప్పుడుందా?

కథకునికి గుర్రపు రౌతు అనే చిత్రమైన పేరు పెట్టడానికి కారణమేమిటన్న కుతూహలం కలిగింది? 

రాయలసీమలో దూదేకులవాళ్ళనే కులం వుంది. వాళ్ళు హిందూ, ముస్లిం సంప్రదాయాలు రెండూ, కొంత కొంత అనుసరిస్తారు. పీర్ల పండగ చేస్తారు. గత తరంలోనయితే ఆడవాళ్లు బొట్లు గూడా పెట్టుకునేవాళ్ళు. నల్లపూసలదండను మంగళసూత్రంలా ధరించేవాళ్లు. యాభై సంవత్సరాలక్రితం వరకూ కొందరు తమ సర్టిఫికెట్లలో ‘హిందూ – దూదేకుల’ అనే రాసుకునేవాళ్ళు. అయితే హిందూమతం చాలా rigid అయిన మతం కాబట్టి, వాళ్ళను దగ్గరకు చేర్చుకోలేదు. అందుకు వాళ్ళు క్రమంగా ముస్లింలకు దగ్గరై, యిప్పుడు ‘ముస్లిం – దూదేకుల’ అని తేల్చేసుకున్నారు. వీళ్ల పేర్లు గూడా కొంతవరకూ హిందువుల పేర్లలాగే వుంటాయి. వుదా: రెడ్డెప్ప, దస్తగిరి. మా ప్రాంతంలో కొందరు ‘గుర్రపు రౌతు’ అనే గ్రామదేవతను కొలుస్తారు. తమ పిల్లలకాపేరు పెట్టుకుంటారు.

అలా రెండు మతాల నేపథ్యముండే పాత్ర కావడం చేతే, ఆ పాత్రకు, ఆ పేరు. నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో, ఆ పేరుతో వొక సహాధ్యాయి వుండేవాడు.

మీ శైలికి ఉపమానం పెద్ద బలం అనిపించింది….    

రాస్తున్నప్పుడు కథ ముందుగా నాకు దృశ్యమానమయ్యేలా రాసుకోవడం నాకిష్టం. అప్పుడు నేను వాడుతున్న పోలికలను ‘ఉపమానాలు’ అనవచ్చునని మీ ప్రశ్నను చూశాకే నాకర్థమయింది. ఆ పోలికలు కథనంలో సాఫీగా కలసిపోయేలా వుంటేనే కథనం సాఫీగా సాగుతుంది.

శైలి చర్మంలాంటిది. సహజంగా వచ్చేది.

కథా రచయితగానే ఎక్కువ గుర్తింపు పొందిన మీకు ఇది ఎన్నో నవల?

యిది నేను రాసిన అయిదవ నవల. మొదటి నవలిక – ఇరుకు గదులు – 76 లో రాసింది. బాగా కుర్రచేష్టనిపిస్తుందిప్పుడు.

రెండవది – మృగతృష్ణ – పెద్ద కథగా కూడా చూడవచ్చు.

మూడూ, నాలుగూ నవలలు (భూచక్రం, కొండ కింద కొత్తూరు) రెండు దిన పత్రికల్లో రెండేళ్ల క్రితం సీరియల్లుగా వచ్చాయి. బహుశా వాటికి వొక పాఠకుడు గూడా లేడు.

యింకో వారం, పది రోజుల్లో విజయవాడ, అలకనంద ప్రచురణల ద్వారా అవి పుస్తకరూపంలో రాబోతున్నాయి.

రాసే ముందూ, రాస్తున్నప్పుడూ రచయిత మానసికంగా చేసుకునే సన్నాహాలు కథకీ, నవలకీ వేర్వేరుగా ఉంటాయంటారా? మీ విషయంలో ఎలా ఉంటుంది? 

నవల రాయడానికి చాలా సమయం కావాలి. కథ రాయాలంటే ఆ కథతో ఒక నెలైనా జీవించాలి. నవలయితే ఆ పని నెలల తరబడి జరగాలి. అంత వెసులుబాటు వుందన్న నమ్మకాం దొరికినప్పుడే నవల రాయడానికి పూనుకుంటాం.

నవలలు తక్కువ రాయటానికి కారణం అదేనా?

వుద్యోగం. నవల రాయడానికి కావలిసినంత సమయాన్ని కేటాయించడం వుద్యోగ జీవితంలో సాధారణంగా జరగని పని. అయితే వుపాధ్యాయులకు వేసవి సెలవులుండడం కొంత అవకాశాన్ని కలిగిస్తుంది.

ఈ నవలతో మీరు చేసిన ప్రయాణం రచయితగా, వ్యక్తిగా మీకేం నేర్పింది? 

రచన చేస్తున్నప్పుడు, యేదో వొక రసాయనిక చర్య జరిగి, రచయితలో యేదో వొక మార్పు రాకపోతే, ఆ రచన అస్తిత్వానికేం ప్రయోజనమున్నట్టు? రచనతో బాటూ ప్రయాణం చేసిన పాఠకుడికేది నేర్పిందో, దాన్నే నాకూ నేర్పింది.

ఈ పుస్తక రచనలో ఎదురైన సవాళ్లేమైనా? 

జీవితమిచ్చిన అనుభవంలో సార్వకాలికమూ, సార్వజనీనమైన అంశాన్ని గుర్తించినప్పుడే రచనకు బీజం పడుతుంది. ఆ నాజూకైన అంశాన్ని విస్పష్టంగానూ, కళాత్మకంగానూ వినిర్మించడమన్నదే సవాలు. యీ పనిలో నేను సఫలీకృతుడనయ్యానో లేదో సహృదయులైన పాఠకులే చెప్పాలి.

మధురాంతకం రాజారాం గారి అబ్బాయిగా బహుశా ఇప్పటికే చాలాసార్లు మీ ముందు తచ్చాడిన ప్రశ్నతో ఈ ఇంటర్వ్యూ ముగిస్తాను: సాహిత్యం అనువంశికం కాగలదా? 

నేను మరో యింట్లో పుట్టి వుంటే రచనలు చేసేవాడినా అని అడిగితే చేసేవాడినని చెప్పగలిగే అవకాశం లేదు. మా నాన్న తప్ప మరే యితర రచయితనయినా, మా నాన్నలా తన పిల్లల్ని తమకిష్టం వచ్చిన రీతిలో యెదిగే వాతావరణాన్ని కల్పించగలరా? – అని అడిగితే లేదనే అంటాను. మీ ప్రశ్నకు సమాధానం పై రెండు సమాధానాల మధ్యే వుంది.

*

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ Download PDF    బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ – Download ePub    బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ Download MOBI

Posted in Uncategorized, ఇంటర్వ్యూ and tagged , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.