cover

రాజధానిలో రోజర్

Download PDF EPUB MOBI

(తన అభిమాన ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇటీవల ఢిల్లీలో ఆడిన ఆట చూసి వచ్చి ఆ అనుభవాన్ని పంచుకుంటున్నారు పూర్ణిమ)

బాక్‌గ్రౌండ్:

మార్కెట్లో ఒక మోడల్ హిట్ అయ్యిందంటే దాని నకలు చేస్తూ ఇంకో కొన్ని నమూనాలు వస్తూనే ఉంటాయి. బిసిసిఐ వారు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రెమియర్ లీగ్ (ఐపిఎల్) భారీ ఎత్తున సాధించిన విజయం క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాకుండా మరి కొన్ని క్రీడలని ప్రభావితం చేసింది. ఫలితంగా ఇండియన్ హాకీ లీగ్, ఇండియన్ బాడ్మింటన్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ (ఫుట్‌బాల్), ఛాంపియన్ టెన్నిస్ లీగ్ (సిటిఎల్) వగైరాలు పుట్టుకొచ్చాయి. ఎంతోకొంత అనుకున్న ఉద్దేశ్యాన్ని సాధించాయి. ఇవ్వన్నీ ఒకే ఫార్మాట్ పాటించాయి. దేశంలోని వివిధ నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో కొందరు పేరున్న విదేశీ ఆటగాళ్ళు, కొందరు జాతీయ స్థాయి ఆటగాళ్ళు, కొందరు ప్రాంతీయ ఆటగాళ్ళు ఉంటారు. ఆయా నగరాల్లో మాచ్‌లు జరుగుతుంటాయి.

దాదాపుగా అదే ఫార్మాట్‌ను కొంచెంగా మార్చి, దేశంలోని నగరాలకు బదులు నాలుగు దేశాలను ఎంచుకొని, వాటికి సూపర్‍స్టార్ టెన్నిస్ క్రీడాకారులను అసైన్ చేసి నిర్వహిస్తున్న లీగ్, ఇంటర్నేషనల్ ప్రెమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్), మూడు ఇతర దేశాలతో పాటు, న్యూ ఢిల్లీ, ఇండియాలోనూ జరిగింది, డిసెంబరు 6-8వరకు.

హైప్…పీక్స్…

ఐపిటిఎల్ లాంటిది ఒకటి మొదలవుతుందని ఒక మాట బయటకు రాగానే, దేశంలోని టెన్నిస్ క్రీడాభిమానులు కొంచెం ఆసక్తిగా అటువైపు చూశారు. భారతానికి వచ్చి ఆడనున్న ఆటగాళ్ళ జాబితాలో ప్రముఖంగా నాదల్ పేరు వినిపించింది. అయితే, దాని గురించి ఆలోచించటం కూడా తొందరపాటే అనేంత తక్కువ వివరాలు వచ్చాయి ఆ లీగ్ గురించి అప్పటికి.

ఒక నెల ఏమో గడిచాక, కాలి గాయం వల్ల నాదల్ ఆడకపోవచ్చననే వార్తలు వచ్చాయి. ఫెదరర్ అప్పటికే ఈ లీగ్‌కు తాను ఆడలేనని తేల్చి చెప్పాడు. కానీ, మళ్ళీ మంతనాలు జరిగినట్టున్నాయి. ఉన్నట్టుండి, ఓ పూట, ఫెదరర్ తాను ఇండియాలో ఆడబోతున్నానని ఫేస్‌బుక్ అప్‌డేట్ పెట్టాడు. కాసేపటికి, లీగ్ వారు ఆ వార్తను తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో పెట్టారు.

అంతే! అప్పటికి వరకూ ఈ లీగ్ గురించి చప్పచప్పగా జరుగుతున్న కబుర్లన్నీ ఒక్కసారి ఊపందుకున్నాయి. ఫెదరర్ ఇండియాలో ఆడ్డం అంటే అదో గొప్ప అదృష్టం అతడి అభిమానులకి. కలల్లో మాత్రమే సాధ్యమనిపించేది ఇప్పుడు నిజమవబోతుంది. దానికి తోడు రోజర్ కూడా ఇండియాకు రావడం గురించి ఆసక్తి చూపడం, తాను అన్ని చోట్లకి వెళ్ళడం కుదరదు కాబట్టి, తను ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్తూ, ఫోటోషాప్ చేసిన ఫోటోలు పెట్టమని ట్విట్టర్ లో అడిగాడు. దానికి అనూహ్య స్పందన వచ్చింది. అలా ఫోటోషాప్ చేయబడ్డ వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు.

మాచ్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధి ఇన్‌డోర్ స్టేడియంలో జరగవచ్చనని ఊహాగానాలు మొదలయ్యాయి. పదిహేను వేల కెపాసిటి ఉన్న ఆ స్టేడియంలో ఎవరికి చోటు దక్కుతుందో తేల్చే తారకమంత్రం – టికెట్స్.

టికెటింగ్ మెగలోమేనియా:

భారత దేశంలో, స్పోర్ట్స్ ఆర్గనైజర్‌కి సామాన్య క్రీడాభిమాని అంటే చెప్పలేనంత లోకువ. దేశానికి ప్రాతినిధ్యం వహించి, కీర్తిప్రతిష్టలు తెస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించే బాధ్యత ఈ సామాన్య క్రీడాభిమానిది. అందుకే, ఇండియా ఆడుతున్న క్రికెట్ టెస్ట్ మాచ్‌కు ఈడెన్ గార్డన్ ఖాళీగా ఉంటే, అది సగటు అభిమాని తప్పు. కానీ, అదే అభిమానిని వరల్డ్ కప్ ఫైనల్ టికెట్టో, సచిన్ ఆఖరి టెస్ట్ మాచ్ టికెట్టో ఇవ్వడానికి లెక్కపెట్టరు.

ఫెదరర్ ఒప్పుకున్నాక, ప్రిమియర్ లీగ్ కాస్తా, ప్రీమియం లీగ్ అయ్యింది. ఫెదరర్ ఆట చూడ్డానికి, బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సూపర్ రిచ్ కిడ్స్ ఎగబెడతారు. వాళ్ళతో పోటీపడలేమని సగటు ప్రేక్షకుడి భయం.

మరి నిజమో, అబద్ధమో ఇదే భయాన్ని ఓ మీడియా వర్గం పెద్ద వార్తగా ప్రచురించింది – టికెట్ ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండవని. లీగ్ ఓనర్ మహేష్ భూపతి భార్య, లారా దత్తా, ఈ వార్త చదివి మీడియా మీద ధ్వజమెత్తింది – ఇవ్వన్నీ కిట్టని వాళ్ళు రాసే వార్తలు; మూడు రోజుల టికెట్ మూడువేలకే అమ్మబోతున్నాం అని. అప్పటి వరకూ కొంచెం కొంచెం ఆశలు వదిలేసుకుంటున్న వాళ్ళకి మళ్ళీ ఉత్సాహం వచ్చింది.

“టికెట్ రేట్లు ఎంతో కొంతలే. అసలు, ఎప్పుడు అమ్మటం మొదలెడతారు? ఎక్కడ అమ్ముతారు? ఒక రోజుకు అమ్ముతారా? మూడు రోజులకీ కొనుక్కోవాలా? టికెట్లు ఎక్కడ తీసుకోవచ్చు? స్టూడెంట్లకు తగ్గింపు ఉంటుందా?” లాంటి ప్రశ్నలతో వాళ్ళ సోషల్ సైట్స్ నిండిపోయాయి. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. విసుగొచ్చిన జనాలు వెటకారం, చిరాకు ప్రదర్శించారు. అది శృతి మించుతోందని గ్రహించిన యాజమాన్యం, “దీపావళీ పండుగయ్యాక టికెట్స్ ఓపెన్ చేస్తాం” అని ప్రకటించారు.

దీపావళి వచ్చింది. వెళ్ళింది. అయినా వీళ్ళు ఐపూ అజా లేరు. మళ్ళీ జనం గోల మొదలుపెట్టారు. ఇంత ఆలస్యంగా విడుదల చేస్తే, ప్రయాణాలకి రైలు, ఫ్లైట్ టికెట్స్ ఎలా దొరుకుతాయని. (మేం ఇక తారాజువ్వల్లా పైకి పోతున్న విమానాల టికెట్ల పై ఆశలు వదిలేసుకొని, రైలు టికెట్లు బుక్ చేసుకున్నాం. ఒకవేళ, మాచ్ టికెట్లు దొరక్కపోయినా, రైలు టికెట్ కాన్సిలేషన్ ఛార్జెస్ తప్ప నష్టం ఉండదని.)

మాచెస్‌కి ఇంక నెల కన్నా తక్కువ ఉన్నప్పుడు, అప్పుడు, మొదటి విడత టికెట్స్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు – ఫలానా తారీఖు, ఫలానా సమయం అని. బుక్‍మైషో.కామ్ లో పెడతామన్నారు. రిజిస్టర్ చేసుకోమన్నారు. తక్కిన సమయాల్లో బానే పనిచేసే బుక్‍మై‌షో, మొత్తం buggyగా తయారయ్యింది. రిజిస్ట్రేషన్‌లో సంబంధం లేకుండా, చెప్పిన తారీఖున, చెప్పిన సమయాన మొదటి విడత విడుదల చేసేశారు.

ఐఆర్‌సిటిసి‌.కో.ఇన్ లో తత్కాల్ టికెట్ బుక్ చేయడం కన్నా దారుణమైన అనుభవం నాకు రాదనుకున్నాను గానీ, ఇది అంతకన్నా దారుణమైనది. వాళ్ళు చెప్పిన సమయానికి సైట్ హాంగ్ అయ్యింది. రెండో నిముషంలో తెర్చుకుంది, టికెట్స్ అయిపోయాయన్న వార్తతో! పేజ్ ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసినా లాభం లేకపోయింది. మూడువేల రూపాయల టికెట్ల తర్వాత పదమూడు వేల రూపాయల టికెట్లు ఉన్నాయి. ఆ పై, పదహారు, ఇరవై ఆరు, నలభై తొమ్మిది.. (అన్నీ వేలే! రూపాయలే!)

ఇంక అవే తీసుకుందామని అనుకుంటుండగా, ఎందుకో చిరాకులో మళ్ళి మళ్ళీ క్లిక్ చేస్తుంటే, సడెన్‌గా, రెండు సీట్లు సెలెక్ట్ అయ్యి షాపింగ్ కార్ట్ లోకి వెళ్ళాయి. వెంటనే పేమెంట్ చేస్తే, టికెట్స్ కన్‌ఫర్మ్ అని మెసేజ్ వచ్చింది. (నా జీవితంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మిరాకిల్ ఇది.)

ప్రయత్నించినవారిలో చాలా కొద్దిమందికి టికెట్లు దొరికాయి. దొరికిన వాళ్ళు సంబరాలు మొదలెట్టారు. దొరకని వాళ్ళు బ్లాక్‌లో టికెట్లు కొనడానికి బేరసారాలు మొదలెట్టారు. ఆర్గనైజర్స్ మొదటి విడత పదిహేను నిముషాల్లో సోల్డ్ అవుట్ అయిపోయిందని ప్రకటించుకున్నారు. ఇంకో రెండు విడతల్లో, దాదాపుగా ఇవే సీన్లు!

(ఇదే లీగ్‌‌లో వేరే దేశాలకు సంబంధించిన లెగ్స్ కు, టికెట్లు రెండు మూడు నెలల ముందు పెట్టారు. ఎర్లీ బర్డ్ టికెట్స్ తగ్గింపు ధరలో పెట్టారు. టికెట్ ధర కూడా ఎక్కువా కాకుండా, తక్కువా కాకుండా ఉంది. ఒక రోజు టికెట్టు, మూడు రోజుల టికెట్టు అని వేర్వేరుగా పెట్టారు. మనకేమో, గ్రాండ్ స్లామ్‍ కన్నా ఎక్కువ ధర పెట్టారు. ఒక్కరోజు మాత్రమే చూసే వీలున్నా, మూడు రోజుల టికెట్ కొనాల్సిందే!)

సెక్యురిటి ప్రహసనం:

ఇంకో మూడు నాలుగు రోజుల్లో మాచ్ మొదలవుతుందనగా, అప్పటికి టికెట్లు ఇంటికి చేరుకున్నాయి. వాటితో పాటు మేం ఢిల్లీ చేరుకున్నాం. మాచ్ జరగబోయే ఇందిరా గాంధి ఇండోర్ స్టేడియంకు దగ్గర్లో హోటెల్ తీసుకున్నాం.

స్పోర్ట్స్ ఈవెంట్ దగ్గర మన పోలీసులు (ఏ రాష్ట్రం వారైనా) చేసే సెక్యూరిటి ఒక ప్రహసనం. హైదరాబాదులో ఒంటి మీద బట్టలు, కొన్ని కరెన్సీ నోట్లు తప్ప ఏమీ తీసుకెళ్ళనివ్వరు. కెమారాల మాట అటుంచి, మొబైల్ కూడా తీసుకెళ్ళడానికి ఉండదు. తీరా లోపలికెళ్ళి చూస్తే ఎవరో ఒకరు మెడలో ఇంత పెద్ద కెమారా వేసుకొని కనిపిస్తారు. “మీరెలా తీసుకురాగలిగారు?” అని అడిగితే, “సెక్యూరిటి వాళ్ళు చూడలేదు” అనో, “పోలీసులు తెల్సు” అనో సమాధానాలు వినిపిస్తాయి.

ఢిల్లీలోనూ అంతే! తీసిన ఫోటోలను కమర్షియల్ పర్పస్‌లకు వాడుకోనంత వరకూ, కెమరా ఫోకల్ లెంత్ ఫలానా కన్నా తక్కువ ఉన్నంత వరకూ కెమారాలు తీసుకురావచ్చు అని టికెట్ల మీద ఇచ్చారు. తీరా, స్టేడియానికి వెళ్ళాక, పోలీసులు కెమారా ఉంటే లోపలికి పంపించలేదు. వాళ్ళకి టికెట్ మీద రాసున్నది చూపిస్తే, సంబంధం లేదని తేల్చేశారు. పోనీ, అక్కడెక్కడైనా లాకర్లు ఉన్నాయా? అంటే లేవన్నారు. హోటెల్లో, ఇళ్ళో దగ్గరున్న వాళ్ళు వెళ్ళి, కెమరాలు పెట్టి రావాల్సిన పరిస్థితి, ఒక రోజు ఆట మొత్తం మిస్ కాకూడదంటే!

అవి పెట్టొచ్చాక, సెక్యూరిటి చెక్ మళ్ళీ మొదలు. ఈసారి, పర్సులో ఉన్న చిల్లర అంతా తీసేసుకున్నారు. అదేమని? అడిగితే, కాయిన్స్ సెక్యూరిటి రిస్క్ అన్నారు. మగవాళ్ళ సెక్యూరిటి దగ్గర కనీసం డొనేషన్ బాక్స్ అని ఒకటి పెట్టి, అందులో కాయిన్స్ వేయించారు. నన్ను చెక్ చేసిన లేడీ పోలీస్, పాతిక రూపాయల చిల్లర ఆవిడ పర్సులో వేసుకుంది!

స్టేడియంలో..

మన దేశంలో జరిగే క్రీడల్లో, ఆ మధ్యలో ఉండే గ్రౌండ్, పిచ్, కోర్ట్, రింగ్, సర్క్యూట్ లాంటి వాటి మీదే శ్రద్ధ పెడతారు. (అదన్నా పెడుతున్నందుకు సంతోషం. లేకపోతే, ఇక్కడ ఆడ్డానికి ఎవరూ ఆసక్తి చూపరు.) ఆ గ్రౌండ్, సర్కిల్, రింగ్, సర్క్యూట్ చుట్టూ ఉండే ఆడియన్స్ గాలరి గురించి వీళ్ళకు పట్టదు. టికెట్ రూపంలో మన చెల్లించిన డబ్బు మనకి కనీస సౌకర్యాలు కూడా కలిపించదు.

ఈ లీగ్‌కు గ్రాండ్ స్లామ్ స్థాయిలో టికెట్లు పెట్టారు. ఒక్క కోర్టు పక్కనే ఉన్న వి.ఐ.పి గాలరి తప్పించి, మిగితా సీట్లన్నీ ఇంచు మందాన దుమ్ముతో ఉన్నాయి. వాటి మీద ఒక చీపురు కూడా వేయలేదని స్పష్టంగా తెల్సింది. ఇంకా, జనాలు కూర్చొని లేస్తుండడంతో, మూడో రోజు నాటికి సీటింగ్‌లు కొంచెం శుభ్రమయ్యాయి.

pic1

ఈ స్టేడియం, ఆసియాలో పెద్ద స్టేడియాల్లో మూడోది. అయినా, ఒకట్రెండు బాత్రూమ్‌లు మాత్రమే పనికొచ్చేలా ఉన్నాయి. మిగితా వన్నీ, తాళాలు వేసో, మూసేసో ఉన్నాయి. పనికి వస్తాయన్న వాటిలో లైట్లు లేవు. జనాలు తమ మొబైల్స్ ప్రసరించే వెలుతురు మీద ఆధారపడాల్సి వచ్చింది. నీళ్ళు సన్నగా వచ్చాయి. టిష్యూలు లేవు.

పై ఫ్లోర్‌లో సీటింగ్ ఉన్నవాళ్ళని ఒకట్రెండు ఫ్లోర్స్ మెట్ల ద్వారా వెళ్ళమన్నారు. ఆ మెట్ల నిండా దుమ్మూ, అశుద్ధం. చీకటిపడ్డాక, లైట్లు లేవు. పైగా, మధ్యలో తీగలు, రాడ్లూ అన్నీ పడేసి ఉన్నాయి.

తినడానికి, తాగడానికి ఏవో కొన్ని పెట్టారు. ఆ పెట్టినవాటికి నేరుగా డబ్బిచ్చి తీసుకొనే విధంగా కాక, మధ్యలో కూపెన్లు పెట్టారు. మెనూ పెద్దగానే పెట్టారు. కూపెన్లు కొన్నాక, ఏం అడిగినా లేదని అనడం మొదలెట్టారు. టీ, కాఫీ, కూల్ డ్రింక్ అన్ని ఆనవాయితీ తప్పించకుండా అధిక రేట్లకు అమ్మారు.

ఇహ, సీటింగ్ విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. మొదటి రోజున చాలా తక్కువ మంది రావడంతో సీట్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. మరి ఎవరన్నా రమ్మన్నారో, లేక వీళ్ళే వెళ్ళారో, కొందరు ఒక్కసారిగా దగ్గరగా ఉన్న ఖాళీ సీట్ల వైపు పరిగెత్తారు. వారిని చూసి మిగతా వారూ ముందుకు వెళ్ళారు. జనంతో నిండని కాన్సర్ట్ హాల్స్ లో ఇది మామూలే!

అయితే, కాసేపటికి అసలు సీటు గల వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఆక్రమించుకున్న వాళ్ళు లేవలేదు. గొడవ ఆర్గనైజర్స్ దాకా చేరింది. అప్పుడు సెక్యూరిటి వాళ్ళు వచ్చి ఒక్కొక్కొళ్ళీ టికెట్ అడిగి, వెనక్కి పంపించారు.

రెండో రోజు ఫెదరర్ ఆడ్డం వల్ల అసలు ఖాళీ ఉండదని అనుకున్నారుగానీ, ఆ పూటా యాభై శాతానికి మించి జనం నిండలేదు. మళ్ళీ మొదటి రోజులానే ముందుకు పరిగెత్తడం, మళ్ళీ వెనక్కి పంపబడటం.

మూడో రోజు నాటికి, ఆర్గనైజర్లు నిద్ర వదిలించుకొని, ఎంత మంది వచ్చినా, రాకపోయినా, ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చోవాలని పట్టుబట్టారు. దాని వల్ల గందరగోళానికి అవకాశం లేకుండా అంతా కూర్చున్న చోటే కూర్చొని మొత్తం మాచ్ చూశారు.

ఆటంటే ఆటే కాదు!

ఈ రోజుల్లో, మనుషుల దగ్గర డబ్బుంది కానీ, సమయం లేదని ఒక అభిప్రాయం. క్రికెట్ టెస్ట్ మాచులకి జనాలు ఎందుకు రావడం లేదు? ఐదు రోజుల పాటు ఎనిమిది గంటలు మాచ్ చూసే టైమ్ జనాలకి లేదు. దానికి పరిష్కారం? మూడు గంటల్లో ముగిసిపోయే టి-ట్వెంటి. వీలైతే, అందులోనే డాన్స్ లూ, పాటలూ. అచ్చంగా క్రికెట్ నడవని ఏ క్షణాన్ని అయినా ఎంటర్‌టేన్మెంట్ కోసం వాడుకోవడం.

ఇవ్వన్నీ టెన్నిస్‌కు ఆపాదించారు ఈ లీగ్‌లో. టెన్నిస్ కోర్టు అప్పుడప్పుడూ డిస్కో థెక్‌గా మారిపోతూ ఉంది. జిగేలుమనే లైట్లు. చెవులు తూట్లు పడేంత గట్టిగా డి.జె. ఆటకు ముందు, ఆట తర్వాత ఇలా ఉందనుకుంటే పర్లేదు, ఆట మధ్య, పాయింట్‌కి పాయింట్‌కి మధ్య ఇదే తీరు. ఆ అర నిముషంలో మనం ఎక్కడ బోరు అయిపోతామనే భయం కాబోలు వాళ్ళది! ఒక సెట్‌కు ఇంకో సెట్‌కు మధ్య గాపులో అమ్మాయిలు వచ్చి డాన్స్ చేసి పోవడం!

pic2

అసలు ఆటంటూ ఆస్వాదించగలిగితే, ఈ హంగులూ ఆర్భాటాలూ అవసరం లేదు! అమ్మాయిల డాన్సులు, ఆటలూ, పాటలూ కావాలనుకునేవాళ్ళు ఒక క్రికెట్ స్టేడియం‍కో, టెన్నిస్ స్టేడియం‌కో రారు కదా? అవి దొరికే ప్లేసులు వేరే కదా? స్పోర్ట్స్ ని స్పోర్ట్స్ లా ఉండనివ్వకుండా, ఇలా స్పొర్టెంటర్‌టేన్మెంట్ ఫీడ్ చేయడం వల్ల కొన్ని వర్గాలకి మంచి ఆదాయం లభించచ్చేమో కానీ, అసలు ఆటలో ఉన్న మజా పోతోంది. ముఖ్యంగా, ఈ లీగ్‌లో పాయింట్ అయ్యాక, దానికి ప్రతిస్పందన చప్పట్లో లేక నిట్టూర్పులో అయ్యాక, ఆ పాయింట్ గురించి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుకునే వీలైనంత వాల్యూమ్‌లో మ్యూజిక్. తలనొప్పి వచ్చేలా! అవసరమా?

ఇహ, ఎంటర్‌టేన్మెంట్ అన్నాక, బాలీవుడ్ వాళ్ళు లేకపోతే ఇండియాలో కుదరదుగా. మూడో రోజున, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, దీపిక పదుకునే, రితేష్ దేశ్‌ముఖ్ వచ్చారు. వాళ్ళ చేత డాన్సులూ, పాటలూ కాకుండా, మిగితా ఆటగాళ్ళతో కలిపి ఆట ఆడించారు. ఆమీర్ ఖాన్, రోజర్‌కు జట్టుగా ఆడాడు. సర్వ్ సరిగ్గా చేయలేకపోయినా, మిగితా ఆట బానే ఆడాడు. మిగితా వాళ్ళు ఉత్తిత్తినే ఆడి పక్కకు జరిగారు. రెండో రోజున, అమితాబ్ బచ్చన్ వచ్చారు.

ది మూమెంట్:

గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యమనే అర్థంలో సూక్తులు వినిపిస్తుంటాయి. కానీ, ఒక్కోసారి ప్రయాణమంతా విసుగ్గా, అలసిపోయే విధంగా నడిచి, అనుకున్న గమ్యంలోనే సేద తీరే అవకాశం ఉంటుంది. ఇది అలాంటి అనుభవమే!

ఢిల్లీకి బయలుదేరే ముందు ఎంతమందికి ప్రయాణం వెనుక కారణం చెప్పానో, అన్ని ప్రతిస్పందనలు వచ్చాయి. “వావ్! రోజర్‌ని చూస్తావా అయితే?” నుండి “ఏం పిచ్చి అంతగా ముదిరిందా?” వరకూ ఎవరికి తోచింది వాళ్ళు అన్నారు. స్టేడియం‌కు చేరుకున్నాక అదే స్థాయిలో పిచ్చి ముదిరిన వాళ్ళని చూసి ఆనందం కలిగింది.

నేను పైన రాసినవన్నీ దాదాపుగా అక్కడికి వచ్చిన సామాన్య ప్రేక్షకులందరికి, కొంచెం అటు, ఇటుగా, వర్తిస్తాయి. అయినా, ఈ కష్టాలను అధిగమించి (నాకు అక్కడ పరిచయమైన వాళ్ళల్లో) నాగ్‌పూర్, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ నుండి కేవలం ఈ లీగ్ చూడ్డానికే జనాలు వచ్చారు. తండ్రికూతుర్లు, తండ్రికొడుకులు, బామ్మా-మనవరాలు, అక్కచెల్లెల్లు, చిన్ననాటి స్నేహితులు, ఈ లీగ్ కోసమే పరిచయం ఏర్పడ్డవాళ్ళు, భార్యా-భర్తా-ఇద్దరు పిల్లలు, కొలీగ్స్, కజిన్స్ – ఇలా అనేక మంది వచ్చారు. వచ్చినవాళ్ళలో చాలా మంది ఫెదరర్ కోసమే వచ్చినట్టున్నారు.

మామూలు టెన్నిస్ కి ఇక్కడి టెన్నిస్ కి చాలా తేడా ఉంది. టెన్నిస్ లో సమయం పడతాయనుకునే అన్ని అంశాలను ఇందులోంచి పీకేశారు. అందుకని ఆట కొంచెం కంగారుగా సాగినట్టు అనిపించింది. మొత్తానికి, ఒక సెట్‌కు ముప్ఫై నిముషాలకన్నా ఎక్కువ పట్టకూడదని ప్లాన్.

అయినా కూడా ఆటగాళ్ళు ఆట మొదలెట్టాక, టెన్నిస్ తప్ప మరో ధ్యాస రానివ్వకుండా ఆడారు. మామూలు లీగ్ ఇది. వాళ్ళ రాంకింగ్స్ కు ఏ మాత్రం తేడా రాదు. అయినా కూడా ప్రతి మాచ్ చాలా సీరియస్‌గా ఆడారు. ఈ ఫార్మాట్, ఏ జట్టుకి ఎవరు ఆడుతున్నారు, ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి, ఎవరు గెలుస్తున్నారు అన్న వాటి మీద చాలా గందరగోళం, అయోమయం ఉన్నా కూడా కోర్టు మీద ఇద్దరు బాట్-బాల్ ద్వారా సంభాషించుకుంటున్నప్పుడు ధ్యాస మరోచోటికి పోలేదు. అదే, ఆటలోని అందం. దాన్ని ఆస్వాదించగల ప్రేక్షకుడు మరే ఇతర ఎంటర్‌టేన్మంట్ల కోసం చూడడు.

ఆ అందాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళారు ఫెదరర్, జోకోవిచ్ ఆడిన సెట్‌లో. అంతకు ముందు రోజునా ఫెదరర్ ఆడినా, ఆ ఆటను అందరూ ఎంజాయ్ చేసినా, ఆఖరి రోజున, ఆఖరి సెట్‌గా వీళ్ళిద్దరూ ఆడిన ఆట ఒక మరుపురాని అనుభవం.

చాలా మంది, ఇంట్లో రాజాలా కూర్చుని టివిలో మాచ్ చూడక, కష్టాలు పడి స్టేడియంలో చూడ్డం దేనికి అని వాపోతుంటారు. దానికి నా సమాధానం. స్టేడియంలో, మనది ఎంతటి ప్రేక్షక పాత్రే అయినా, మనకి మనం ప్రోత్సహిస్తున్న క్రీడాకారుడికి మధ్య ఒక అవ్యక్త సంభాషణ నడిచే అవకాశం పుష్కలం. ఆ అవకాశం కలిసొచ్చి, సంభాషణగానీ మొదలైతే, ఒకరి నుండి ఇంకొరికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ క్రీడాకారుడి చేత మరింత బాగా ఆడిస్తే, ప్రేక్షకులు మరింతగా ఆనందించగలిగేలా చేస్తుంది. ఆ అనుభవం ఒక జీవితకాలం పాటు మనతో నిలిచిపోతుంది. దొరికిన ఆటోగ్రాఫులు, తీసుకున్న ఫోటోగ్రాఫుల్లా ఈ అనుభవాన్ని వెంటనే ట్వీట్ చేయడానికి ఉండదు. కానీ, అంతకన్నా పదిలమైన చోటే ఉండి, అవసరమైనప్పుడల్లా పలకరించి పోతుంటుంది.

ఇదంతా వన్ వే ట్రాఫిక్ కాదని, ఆయా క్రీడాకారులు పోస్ట్ మాచ్ ప్రెస్ నోట్స్ లో చెప్పినప్పుడు తెలుస్తుంది. ఫెదరర్ కూడా తాను ఢిల్లిలో ఆడిన ఆటను మర్చిపోలేను అని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో స్టేటస్ పెట్టాడు.

pic3

ఆ క్షణాల్లో, ఆ పరిసరాల్లో అక్కడ ఉన్నవారెవ్వరూ ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. అది అంతటి అనుభవం!

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, డిసెంబర్, వ్యాసం and tagged , , , , , , , .

One Comment

  1. బాగుంది. ఫార్మాట్ గురించి మరి నాలుగు మాటలు రాసుంటే బాగుండేది. ఆ ముప్పై నిమిషాల నిబంధన పక్కనబెడితే…ఏం ఫార్మాటండీ ఇది! ఎన్ని కాంబినేషన్స్‌ చూశాం! ట్రూలీ గ్రేట్‌ ఫార్మాట్‌. గ్రేట్‌ ఐడియా. ఐ ఫీస్ట్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ లవర్స్.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.