cover

పల్లి పాటల తల్లి – వల్లి

Download PDF EPUB MOBI

‘సినపాపా, బాగుండావామ్మా. ఎన్నాల్లయిందో నిన్ను సూడక. పిలకాయిలెంతమంది? ఏం సదవతా వుండారు! మీ రెడ్డి బాగుండాడా?’ గుక్క దిప్పుకోకుండా ప్రెశ్నెల వాన కురిపించేసింది నా మింద వల్లి.

వల్లి పుట్టింది మావూరే. అయితే మెట్టింది మాత్రం తమిళనాడు. తిరువన్నామలై వాల్లమ్మ పుట్నూరు. వల్లిని వాల్లమ్మ, వాల్ల పిన్నమ్మ కొడుక్కిచ్చి చేసింది. కన్పించలేదని నన్నంటా వుంది గానీ నల్ల పూసై పోయింది వల్లీనే.

మేము సిన్నపిల్లలుగా వుండాము. వొంటిమింద గుడ్డలు ల్యాకుండా తిరిగే వొయసు మాదప్పుడు. వల్లి వాళ్ల నాయన మా యింట్లో సేద్ద్యానికుండేటోడు. సేద్దిగాళ్లంటే నమ్మిన బంట్ల కిందే లెక్క. ఒగింటి రెడ్డికి ఇంగో ఇంటి రెడ్డికి మద్దెన పనులు సెయ్యడంలోను, పంటల్ని పండించడంలోనూ సేద్దిగాళ్లమద్దెన శానా పోటీవుండేది. మా ఇంటి సేద్దింపనుల్లోకి ఇంటిల్లిపాదీ వచ్చే వోళ్లు. అట్ల వల్లి వాళ్ల పెద్దతమ్ముడు బాలడు వాళ్ల నాయినతో వొచ్చి కూడా పనులు చేసేటోడు. వాళ్ల నాయన తర్వాత బాలడే మాయింట్లో సేద్ద్యానికి కుదిరినాడు. వాళ్ల నాయన సేతికింద మా ఇంటి పనులన్నీ చేసినోడు కావడం వల్ల చాలా వొడుపుగా సేద్దెం పనులు చేసేటోడు. మాకు కూలోళ్లు కావాల్సొచ్చినప్పుడు వాళ్లింట్లో వాళ్లే పిల్సుకోనొచ్చేవాళ్లు.

వల్లివాళ్ల నలుగురక్కసెల్లిళ్లు, ఇద్దురన్న దమ్ములు. అందురికంటే పెద్దదివల్లి, వల్లివాళ్ల సిన్నసెల్లి కిలి మా మడిలో గువ్వల్దొలను వచ్చినాక మా యింట్లో పేండాసెత్త దోసే పనికి కూడా కుదిరింది. అంతకు ముందు వాళ్లమ్మ బొజ్జి దినామూ తెల్లార్తోనే వొచ్చి పేండాసెత్త తోసిపోసేది. నాట్లు, కలుపులు తొమ్మిది గెంటలకు మొదలవుతాయా. ఆండ కూలోళ్లు ఏ పనికైనా ఆ టైంకే వొచ్చేది. ఆ లోపల బొజ్జి, మాయింటికాడ పని గానిచ్చేసేది.

మా ఇంటిపనికి రావడానికి కూలోళ్లు నేనంటే నేనని ముందుకొచ్చేవోళ్లు. మాయక్క సంగటి ముద్దలు పెద్ద తాటికాయలంత సెయ్యడమేగాదు కూర శానా రుసిగా కాంచతాది. వాళ్లు ఇంటికి సంగటేసుకొని పొయ్యేటప్పుడు వాళ్లు తెచ్చుకున్న గిన్నెల్లో కూరమాత్రమే పోసుకొని సంగటి ఒక ముద్ద తిని రొండోముద్దను అరి సేతిలో బెట్టుకోని ఎత్తుకోని బొయ్యేవాళ్లు. వూర్లో వాళ్లు సూడాలని అట్లా సేసేటోళ్లు. ‘పెద్దపాపా నువ్వు జేసే సంగటి జూసన్నా వూర్లో ఆండోళ్లు బుద్ది దెచ్చుకోవాల’ అనేది వల్లి సెల్లెలు పూబతి.

ఇంక ఇంటికి సంబంధించిన ఏ పన్లో అయినా వల్లి తప్పకుండా వుంటాది. వల్లి పాడే పాటలింటా పన్జేస్తావుంటే వాళ్లకు కష్టం తెలస్తాదా? మా ఇంటిపనికి ఎగబడడానికి ఈ రొండు కారణాలే గాకుండా మా నాయన తలమున్కలుగా కొలిచే కూలిగింజలు గూడా కారణమే.

వల్లి ఎక్కువగా అరవ పాటలే పాడేది. వాళ్లు ఇంట్లో గూడా మాట్లాడేది అరవమే. మా ఇండ్లలో పెద్దోళ్లు గూడా అరవంలోనే మాట్లాడేవోళ్లులే. మేం పిలకాయిలు మాత్రమే తెలుగు మాట్లాడేది. వాళ్లు అరవంలో మాట్లాడినా మాకంతా అర్తమయ్యేది. అందుకే మా ఆయన తన స్నేహితుల దెగ్గిర ‘వీళ్లు అరవోళ్లనేది మీకు తెలుసా? అరవము అరవము అంటా అరస్తావుంటారు’ అని ఎగతాళి జేస్తావుంటాడిప్పుడు.

వల్లి గొంతు ఒకలాంటి జీరతో ఇనడానికి సెవుల్లో తేనె బోసుకున్న్యట్లుగా వుండేది. ఎన్ని గెంటిలైనా ఇసుగూ ఇరామం ల్యాకుండా పాటలు పాడేది. నాట్లేసేటప్పుడు, కలుపు దీసేటప్పుడు, మడిగోసేటప్పుడు వల్లి పాడే పాటలు కతల పాటలు. ఒగోపాట పూర్తయ్యే పాటికి రొండు మూడు గెంట్లు పట్టేది. ఆ పాటలింటా వాటిలోని కష్టసుకాలను వీళ్లవే అనేట్లుగా సంతోషిస్తా, కన్నీళ్లు బెట్టుకుంటా వొంచిన నడుమెత్తకుండా కొంచిమైనా అలసటనేది ఎరగకుండా పన్జేసే వోళ్లు కూలోళ్లు. దేశింగురాజు కతను ఎంత దాటీగా పాడేదో, నల్లతంగాళ్‌ కతను అంత దీనంగాపాడేది. అదింటా అందురూ ఆ కతలో మునిగిపోయి కండ్లలో నీళ్లు బెట్టునొనేటోళ్లు. వల్లి ముందు సినమాపాటలు పాడే జానకి, సుశీల, జిక్కి ఎవురైనా దిగుదుడుపే. కావాలంటే సవాలిసరతా. రమ్మనండి నా ముందుకు.

గొబ్బియ్యాల పండగొచ్చిందంటే సాలు. మా వూరి మాలపల్లోళ్లు గొబ్బీదట్ను ఎప్పుడొస్తారా అని పిలకాయిలమే గాదు పెద్దోళ్లు గూడా ఎగజూసుకోనుండే వాళ్లం. వాళ్లు ఇరవై ముప్పై మంది వొచ్చేటోళ్లు. కొత్త కోకలు గట్టుకోని, సేతినిండా మంటి గాజులేసుకోని, తలనిండా సెండు మల్లి పూలు బెట్టుకోని గొబ్బిదంట్తావుంటే యాందమూరి తిర్నాల్లో తేరొచ్చి ఇంటి ముందు నిల్సినట్లుండేది. వాళ్ల కోకలు, జడల కొనల్లో వాళ్లుబెట్టు కోనుండే రిబ్బన్లు, జడకుచ్చులు, తల్లో పిన్నులు, పూలు సూడ్డానికి రొండు కండ్లు సాలేవి గావు.

ఎన్నో ఏండ్లుగా వాడికయినోళ్ళమాదిరిగా అంతమందీ ఒకేసారి వొంగి లేస్తా, అడుగులు మార్సుకుంటా గొబ్బిదట్తావుంటే ఎన్ని పనులున్న్యా ఎత్తుబారం పనులు ఎప్పుడూ వుండేవేలే అనుకోని వాళ్లు వూరొదిలి పేట్టేదాకా వాళ్ల ఎనకే తిరిగేవోళ్లం మేము.

ఇంగ వాళ్ల పాటల గురించి సెప్పాలంటే మాటలేడ సరిపోతాయి. వాళ్ల గొంతులూ సరే వాళ్లు పాడేపాటలు సరే. అంతమందిలో ఎక్కడే గాని పాటలు పాడేటప్పుడు అపస్రుతి అనేందో అంటారే, అది ఇన్పించనే ఇన్పించదు. సేన్లల్లో పాటలు పాడీ పాడీ బాగా ఆరితేరి పొయ్యుంటారు. దినాము పాడడం వల్ల వాళ్ల గొంతులు పూలిడిగినట్లు ఇడిగి పొయ్యుంటాయా. ఇంగ వాళ్లకు కస్టమేముంటాది పాడేందుకు.

అంతమందిలో పస్టుగా పాడేది మా వల్లే. ఈ మాట ఎవురైనా వొప్పుకోని తీరాల్సిందే. వల్లి, సత్తాసేరి ఇద్దురూ పాటెత్తుకుంటే మిగిలినోళ్లు ఐలెస్స, గొబ్బియ్యాలో, సరియపోడు (ఇది అరవ పదంలే) అని ఊతపదాలతో వూపు నిచ్చేటోళ్లు, ‘ఆ పాట పాడు వొల్లీ, ఈ పాటపాడు వొల్లీ’ అని ఇంటింటి దెగ్గర ఎవురిగ్గావాల్సినియి వాళ్లడగతా వుంటే వాళ్ల సంతోసం సెప్పనలివి గాదు.

మా ఇంటి ముందర కొచ్చినప్పుడు మేమడక్కుండానే వల్లి రెడ్డి కూతురి పాట పాడేది ముందుగా. ఆపాట విందారా కొంచిం.

వల్లి, సత్తాసేరి                                                  మిగిలినోళ్లు

‘ఇడియడిక్క యేలేల మైపేయ                               అయిలిస్సా

మైపేయ                                                         సరియపోడు

యంగ రెడ్డీ వూడు కట్టారాంగు పారుంగు                అయిలిస్సా

పారుంగు                                                       సరియపోడు

యల్లారుం వొక్కిరాంగు మన్ను సొవిరి                     అయిలిస్సా

మన్ను సొవిరి                                                  సరియపోడు

యంగ రెడ్డీ వొక్కిరాంగు కల్లు సొవిరి                      అయిలిస్సా

కల్లు సొవిరి                                                     సరియపోడు

కట్టారదు యేలేల గాందిమిద్ది                               అయిలిస్సా

గాంది మిద్ది                                                     సరియపోడు

మిద్దీ కుల్లా యేలేల రెడ్డీ పొన్ను                              అయిలిస్సా

రెడ్డీ పొన్ను                                                      సరియపోడు

కట్టారదు యేలేల పట్టూపొడవె                              అయిలిస్సా

పట్టుపొడవే                                                     సరియపోడు

పోడరదు యేలేల సరిగతుని                                 అయిలిస్సా

సరిగతుని                                                       సరియపోడు

యల్లారుం కుడికిరదు కంజితన్ని                           అయిలిస్సా

కంజితన్ని                                                       సరియపోడు

యంగ రెడ్డీ పొన్ను కుడిక్కరదు కాపితన్ని                 అయిలిస్సా

కాపితన్ని                                                        సరియపోడు

అందురికీ అరవం రాదుగతా! అందుకని నేను మల్లెప్పుడో మా సావాసగత్తెలకు తెలుగులో పాడి ఇన్పించేదాన్ని. విూరూ ఇనండి.

‘ఉరుమురుమ యేలేల వానరాగా                                    అయిలెస్స

వానరాగా                                                                 బాగా యెయ్యి

మారెడ్డీ ఇల్లు కడ్తాండాడు సూడండి                                  అ…

సూడండి                                                                 బా…

అందురూ పెట్టేది మంటిగోడ                                         అ…

మంటి గోడ                                                              బా…

మా రెడ్డీ పెట్టేది రాతిగోడ                                              అ…

రాతిగోడ                                                                  బా…

కట్టేది యేలేల గాంది మిద్ది                                            అయిలెస్స

గాంది మిద్ది                                                              బాగా యెయ్యి

మిద్దీలోపలుండేది రెడ్డీ బిడ్డి                                            అ….

రెడ్డీ బడ్డీ                                                                   బా….

కట్టేది యేలేల పట్టూకోక                                               అ….

పట్టూకోక                                                                 బా….

తొడిగేది యేలేల సరిగ గుడ్డ                                          అ….

సరిగ గుడ్డ                                                                బా….

అందురూ తాగేది గంజినీళ్లు                                          అ….

గంజినీళ్లు                                                                 బా….

మా రెడ్డీ బిడ్డ తాగేది కాపినీళ్లు                                         అ….

కాపినీళ్లు                                                                  బా….’

మా వల్లి పాడేపాటల్లో నాకు శానా నచ్చినపాట ‘మనిప్పురావు’. అది ఇనడానికి ఎంతో ఇంపుగా వుంటాది. దాని అర్తం ఒకప్పుడు నాకు తెలిసేదే కాదు. ఇప్పుడు అర్తం గూడా తెలస్తాదా. ఆ పాటను ఇస్టపడనోల్లెవురైనా వుంటారేమో ఇని మీరే సెప్పండి.

‘వా వా వా మణిప్పురావు వడక్కు తెరక్కు పోయ్‌ వరులాం

వడక్క వూరు తెన్నే మరం వగవగయా పూవ్‌ బూక్కిం

వగవగయా పూవ్‌ బూక్కిం వగవగయా కాయ్‌ కాక్కిం

తున్నా పలంబారిక్కుం దేసమెల్లా నెరింజిరుక్కుం.

అందావూడు ఇందావూడు కలందాలె నంబవూడు

నంబావూడు పసంగ లక్కు పాలూసోరు తైరుసోరు

ఎల్లారుం కలందాలే వెల్లాడ నల్లాయిరుక్కుం

అందా కొయంబు ఇందా కొయంబు సేంది తున్నా నల్లారిక్కుం

………………………………………………………….’

ఒకొరొకరికి నువ్వా నేనా అని ఇస్తా తీసుకుంటా వుంటే ఆ ఆనందమే ఏరే గదా! నన్ను ముట్టుకోకు నామాల కాకి అని వొంటి కొమ్ము సొంటి కాయ మాదిరుంటే ఏమన్నా బాగుంటాదా?

‘ఒక పావురం ఇంకో పావురాన్ని మేతకు బొయ్యొస్తాంరా’ అని పిలస్తావుందీ పాటలో, ఉత్తర, దచ్చిన దిక్కుల్ని బొయ్యొస్తాం రా అనే ఈ పాటలో ఉత్తర దిక్కులో వుండే సెట్లలో రకరకాల పూలు బూస్తాయని, పండ్లు పండతాయని వాటిని తిని ఆ ఇత్తనాల్ని దేసమంతా సల్లదాం అనీ అంటావుందా పావురం. ఆ ఇల్లు ఈ ఇల్లు కలిస్తే మనిల్లవుతాది. మనింట్లో పిలకాయిలకి పాలన్నం పెరుగన్నం బెడ్దాం. అందురూ కలిస్తేనే ఆట్లాడుకోను బాగుండేది’ – ఇట్లా ఆ పాటలో మంచి మంచి ఇసయాలుండాయి. ఇందమ్మా పూలగూరంటే ఇందమ్మా తీగూర అన ఇరుగు పొరుగోళ్లతో కలిసి మెలిసి వుంటేనే గదా! సంతోసం మన రాజకీయ నాయకులు అదేదో అంటా వుంటారే జాతి సమయిక్కత అని ఇంత కంటేనా?

ఎవురు కయిగట్నారో తెల్దుగాని వల్లి వొంటి నిండా పాటలే. పొట్టనిండా పదాలే. గొంతునిండా రాగాలే. నోట్లో మాత్రం యామార కుండా, తాగేటప్పుడు, తినేటప్పుడు తప్ప వక్కాకు.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, ఇర్లచెంగి కథలు, డిసెంబర్, సీరియల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.