cover

నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం

(ఇష్టమైన పుస్తకంపై ఎవరు ఏ రెండుముక్కలు మాట్లాడినా, అవి వృత్తిగత సమీక్షకులు పేజీల కొద్దీ రాసిన సమీక్షలకన్నా నిశితంగా పుస్తకసారాన్ని పట్టిస్తాయి. 2014 పూర్తి కావొస్తున్న సందర్భంగా కొందరిని ఈ ఏడాది వారికి బాగా నచ్చిన పుస్తకం గురించి క్లుప్తంగా రాయమని అడిగాం. అడగిన వెంటనే రాసి పంపిన అందరికీ మా ధన్యవాదాలు. వారి పేర్లను ఆంగ్ల అక్షరానుక్రమం ప్రకారం వరుసలో ఇచ్చాము. వీరే కాదు, ఇది చదివిన వారు కూడా తమకు నచ్చిన పుస్తకాల గురించి కామెంట్ల రూపంలో రాస్తే బాగుంటుంది.)


ఆదిత్య కొర్రపాటిAditya Korrapati

Essays in Idleness and Hojoki

Authors: Yoshida Kenko and Kamo No Chomei

Translated by Meredith McKinney

Penguin Classics UK, 2013

ISBN: 978-0141192109

Yoshida Kenko అనే జపనీస్ బౌద్ధభిక్షువు 14వ శతాబ్దంలో చేసిన రచన. కళాత్మక దృక్పథం లేదా శ్రమణ దృక్పథం – ఏదో వొక్కటే ఎంచుకోవాల్సిన సమస్యని చాల సృజనాత్మకంగా దాటవేస్తూ, పెనుగులాటకు గురౌతూ Kenko ‘అట్టే బలవత్తరం కాదు కాని మహత్తరం (బైరాగి)’ అనదగ్గ వచనశైలిని సాధించాడు. కవిత్వమూ, కళాస్వాదనా విషయప్రపంచంలో కూరుకుపోయేలా చేస్తాయి కాబట్టి, బౌద్ధసాధువులకవి త్యాజ్యాలు అని ఆకాలపు hardliners వాదిస్తే, అలా కాదు, కావ్యపఠనం ద్వారా సిద్ధించే నిశితమైన ‘ఎరుకే’ అసలైన బౌద్ధమార్గం అని Kenko వంటి ‘semi-recluses’ విశ్వసించారు. ఇలా భావించడం ద్వారా వాళ్ళు వారి సమకాలీన కళాస్వరూపాన్నే కాక, ఆచారధర్మాల స్వరూపాన్ని కూడా మార్చారు. Kenkoది విలక్షణమైన authorial voice. పుస్తకంలో ప్రతిచోటా, ఒక ‘tender skepticism’ కనిపిస్తూవుంటుంది. పైగా, మనకి పరిచితమైన Eurocentric ఆధునికతకి భిన్నమైన ప్రత్యమ్నాయ ఆధునికత (alternative modernity) చాలా సున్నితంగా వ్యక్తమౌతుంది. ఆధునికంగా వుంటూనే, దాని inherent vice అయిన ‘self-consciousness’ కి పట్టుబడకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. Nietzsche aphorism కీ, Montaigne essay కీ మధ్యస్తంగా వుంటూ, ఆ రెండూ సాధించలేని సౌకుమార్యం, మసృణత్వం ఈ Essays in Idleness సాధించాయి.

‘The plants in the carefully untended garden carry a hint of delicate feelings’ అని ఓ ఇంటిని వర్ణిస్తూ అంటాడు రచయిత. అటువంటి ‘carefully untended’ వచనానికి రెండు ఉదాహరణలు:

‘A certain recluse monk once remarked, ‘I have relinquished all that ties me to the world, but one thing that still haunts me is the beauty of the sky.’ I can quite see why he would feel this.’

‘People with poor handwriting should not hesitate to go ahead and write their own letters. It is tasteless to get someone else to do it for you on the grounds that your writing is terrible.’

 ఇంత మంచి ఫలితాల్నిచ్చిన ‘నిర్వ్యాపారం’(Idleness) సాహిత్యంలో అరుదు.


అజయ్ ప్రసాద్ బి.Ajay Prasad B

ఈ సంవత్సరం పనిగట్టుకుని సేకరించిన పుస్తకాలేం లేవు. గతంలా నా పరిస్థితి ఇప్పుడు లేదు. వాటంతటవే ఇమైల్ ద్వారానో, మిత్రులద్వారానో వచ్చిన కొన్ని పుస్తకాలు చదివాను.

చాలాకాలం నుంచి ఎదురు చూసిన “నేనూ చీకటి” నవల అనుకున్నంతగా లేదు. సగంలోనే వదిలేశాను. పది పదిహేనేళ్ళ క్రితమైతే ఇంకా బాగా నచ్చేదేమో. పూర్తి చేసాక నచ్చుతుందేమో కూడా చెప్పలేను. అబిడ్స్ లో ఆతృతగా అందుకున్న Ivan Turgenev “Hunters Sketches” కూడా పేవలంగా ఉండి చదివించలేకపోయింది. ఒక మిత్రుడు ఇచ్చిన Alessandro Baricco “Silk” జిరాక్స్ కాపి ఇచ్చిన సంవత్సరానికి చదివాను. ఇంతకాలం ఎందుకు చదవలేదా అనిపించింది.

బెల్లంకొండ రామదాసు నాకు ఇష్టమైన అనువాదకుడు. ఆయన అనువదించిన టాల్ స్టాయ్ పిచ్చివాని జ్ఞాపకాలు, ఇవాన్ ఇల్యీచ్ మృతి, బాల్జాక్ నీలికళ్ళు బాగా నచ్చాయి. ముఖ్యంగా నీలికళ్ళు నవలలో పారిస్ నగర వర్ణన వెనక్కీ ముందుకీ నాలుగైదుసార్లు చదివాను.

ఇంటర్లో బెల్లంకొండ రామదాసు అనువాదం డోరియన్ గ్రే నవలని చదివి దాని ప్రభావంలోంచి చాలాకాలం బయటపడలేకపోయాను. ఈ సంవత్సరం తెన్నేటి హేమలత రాసిన “పిచ్చివాళ్ళ స్వర్గం” చదివి ఆశ్చర్యపోయాను. డోరియన్ గ్రే పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకం ఇది. నవల సగానికిపైగా డోరియన్ గ్రే నవలకు అనువాదంలానో అనుకరణలాగానో ఉంటుంది. నవలలో పాత్ర కూడా ‘తన జీవితం అచ్చం డోరియన్ గ్రే నవలలా ఉంది’ అనుకుంటుంది. నవలలో మిగతా సగం డోరియన్ గ్రే నవలని కొనసాగించినట్లుగా ఉంటుంది. లత గారికి డోరియన్ గ్రే నవలలో హెన్రీ వాటన్ (నవలలో ఒక పాత్ర) ఒక ఆబ్సెషన్ అయి ఉండాలి. ఇక్కడి విషయం వాస్తవానికి అనుకరణ గురించి కాదు. హెన్రీ వాటన్ తో రచయిత్రి అభిప్రాయబేధాలే నవల రాయడానికి ప్రేరేపించాయనిపిస్తుంది. హెన్రీ వాటన్ అభిప్రాయాలకు స్థలకాల పరిమితులున్నాయి.
మొత్తానికి నచ్చిన పుస్తకం అనలేనుగాని ఆసక్తికరమైన, చదవదగిన పుస్తకం ఇది.


ఆనంద్ గుర్రంAnand Gurram

ఈ సంవత్సరం నన్ను అత్యంత ప్రభావితం చేసి నా ఆలోచన విధానాన్ని మార్చిన పుస్తకం రామాయణ విషవృక్షం. ఉగ్గుపాలతో నా రక్తంలోకి అమృతంలా ఇంకిపోయిన రామాయణ కథని రాత్రికి రాత్రి విషమని తేల్చి, ఉదయానికల్లా పాచితో పాటు కక్కించారు రంగనాయకమ్మగారు. రాముడు, దేవుడు, విశ్వాసం, భక్తి, మతం… ఇవన్నీ కొద్ది సేపు పక్కనపెట్టి కేవలం సాహిత్య కోణంలో చూస్తే ఒక పాత్రని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆతృత, ఉత్సాహంతో కవి (వాల్మీకి) చేసిన లోపాలను తర్కంతో, సహేతుక కారణాలతో కుండ బద్దలు కొట్టారు రంగనాయకమ్మగారు. ఈ గ్రంథం రామాయణంపై దాడి అనే బదులు ఒక కవిపై మరో కవి చేసిన విమర్శ అంటే సరిపోతుందని నా ఉద్దేశ్యం. రాముడి భక్తులైనా సరే తార్కికంగా ఆలోచించగలిగే వారైతే అందరికీ ఈ పుస్తకం నచ్చుతుంది.


అనిల్ బత్తుల

Anil Battula

ఈ ఏడాది నాకు నచ్చిన పుస్తకం “నొప్పి డాక్టరు”

“కోర్నేయ్ చుకోవ్ స్కి” రాసిన “డా. పౌడర్ పిల్” అనే ఈ రష్యన్ పుస్తకాన్ని “ఆర్వీఆర్” గారు తెలుగులో చక్కగా అనువదించారు. “వి. దువీదొవ్” వేసిన బొమ్మలు నిజంగా ఓ అద్భుతం.

ఈ పుస్తకం లొని బొమ్మల్ని ఎన్ని వందల సార్లు చూసానొ నాకే తెలీదు. కథ విషయనికి వస్తే: జంతువుల, పక్షుల భాష తెలిసిన డాక్టరు గారు, మర్కటరాజ్యానికి చేరుకుని కడుపునొప్పితో బాధ పడుతున్న కోతుల్ని కాపాడటం, జాలరి కుర్రవాడి తండ్రిని సముద్రపు దొంగలు ఎత్తుకుపోతే అతడిని రక్షించడం చేస్తాడు. సాహసాలు చేసే డాక్టరు గారికి కికా అనే బాతు, కరూడో అనే చిలుక, అవ్వా అనే కుక్క, బుంబా అనే గుడ్లగూబ సహాయపడుతూ ఉంటాయి. చక్కటి చందమామ కథ లాంటి కథ.

పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చే కథ.


అనిల్ ఎస్. రాయల్Anil S. Royal

ఈ ఏడాది చదివిన పుస్తకాల్లో నన్ను అమితంగా ఆకట్టుకుంది ప్రఖ్యాత పోలిష్ సైన్స్ ఫిక్షన్ రచయిత స్టానిస్లావ్ లెమ్ రచించిన ‘Tales of Pirx the Pilot’ (ఆంగ్లానువాదం). స్టానిస్లావ్ లెమ్ అంటే ఎవరో ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ ‘Solaris’ రచయిత అంటే వెంటనే గుర్తుపట్టే అవకాశం ఉంది. (‘Solaris’ పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమా, దానికి మాతృకైన రష్యన్ సినిమా ‘Solyaris’ రెండిటికీ మూలం లెమ్ అదే పేరుతో రాసిన నవల). ఆంగ్లేతర భాషల్లో సైన్స్‌ఫిక్షన్ విరివిగా రాసినవారిలో లెమ్ అగ్రగణ్యుడు. ‘Tales of Pirx the Pilot’ విషయానికొస్తే, అందులో నాకు బాగా నచ్చిన విషయం ప్రధాన పాత్ర Pirx రూపకల్పన. అతి సాధారణంగా, అమాయకంగా కనిపించే Pirx తెలిసీ తెలియనితనంతో రోదసిలో చేసే సాహసాలు పాఠకులకి వినోదాన్నీ, విజ్ఞానాన్నీ ఏకకాలంలో పంచుతాయి. సైన్స్‌ఫిక్షన్ అంటే అర్థం కాని బ్రహ్మపదార్ధమని దడుచుకునేవాళ్ల అభిప్రాయం పటాపంచలు చేసే పుస్తకమిది. ఈ పుస్తకం, దీనికి కొనసాగింపు భాగం ‘More Tales of Pirx the Pilot’ ప్రతి సై-ఫై అభిమాని భాండాగారంలో తప్పక ఉండాల్సిన పుస్తకాలు.


భగవంతంBhagavantham

టర్కీ రచయిత సెర్దర్ ఓజ్‌కాన్ నవల “ద మిస్సింగ్ రోజ్” కి కె. సురేష్ (మంచి పుస్తకం ప్రచురణకర్త) తెలుగు అనువాదమైన “ఒక రోజా కోసం” ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి పుస్తకం. నాలాంటి ఇంగ్లీష్ చదవలేని పాఠకులకి ఇలాంటి అనువాద రచనలు వరప్రసాదాల్లాంటివి. ఈ నవల చదువుతున్నప్పుడూ, చదవటం పూర్తి చేశాకా కలిగిన భావోద్వేగం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అవి బాగా బతికిన క్షణాలు. మనిషిని మానసికంగా తేలికగా ఉండేలా చేయగలిగిన ఏ కళాప్రక్రియ అయినా గొప్పదే. ఈ నవల రూపంలో సాహిత్యం కూడా ఆ టర్కీ రచయిత ద్వారా ఆ పనిని సమర్ధవంతంగా చేయించగలిగిందనిపించింది.


Chandra Kannegantiచంద్ర కన్నెగంటి

Influence: The Psychology of Persuasion

ఈ ఏడు నేను చదివిన పుస్తకాలలో నచ్చిన వాటిలో ఇది ఒకటి. దైనందిన లావాదేవీలలో మనకు పూర్తిగా సంతృప్తికరం కాని నిర్ణయాలు అనేకం తీసుకోవడం, ఆనక వాటిని సమర్థించుకుంటూ మనకు మనం నచ్చచెప్పుకోవడం మామూలే. మనకు తెలీకుండానే ఏ బలహీనతలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నాయో, మామూలు పరిస్థితుల్లో వొప్పుకోనివాటికి తలొగ్గేలా చేస్తున్నాయో ఉదాహరణలతో వివరించే పుస్తకం ఇది. ఎదుటి మనిషిని మనకు అనుకూలంగా వొప్పించాలనుకునే కాలమిది. మరిన్ని వస్తువులూ, సేవలూ విపణివీధిలో అమ్మకానికి సిద్ధంగా ఉంటున్న రోజులివి. అమ్మకమే జీవనంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజానికి ఇది అమ్మజూపేవాళ్ళకు విలువయినది. కానీ మిగతా పాఠకులూ ఆ రహస్యాలని తెలుసుకోవడంలో, తెర వెనుక లింకుల కిటుకులు గమనించడంలో అబ్బురపడడమే కాక వాటినుంచి తప్పించుకునే తెలివీ సంపాదించుకోవచ్చు. సైకాలజీ, సోషియాలజీల మీద నాకున్న ఆసక్తి కూడా ఇది నాకు నచ్చటానికి కారణం కావచ్చు.


గోపి గారపాటిGopi Garapati

తత్వశాస్త్రానికి సంబంధించి నండూరి రామ్మోహన రావు గారు రాసిన రెండు పుస్తకాలు, ఒకటి ‘విశ్వదర్శనం పాశ్చాత్య చింతన’ ఇంకోటి ‘విశ్వదర్శనం భారతీయ చింతన’ వీటిలో మొదటిదయిన పాశ్చాత్య చింతన చదువుతున్నప్పుడు నేను చాలా చిత్రమయిన ఉద్వేగపూరిత అనుభూతికి లోనయ్యాను. దానికి ఒక కారణం నాకు తత్వశాస్త్రం మీద ఉన్న ఆసక్తి కాగా, రెండోది అంతకు ముందు నేను కొన్న Will Durant రాసిన The Story of Philosophy అన్న ఇంగ్లీషు పుస్తకం లోని కఠిన మయిన ఇంగ్లీషు పదాలు అర్థం చేసుకోవటంలో నేను ఎదుర్కొన్న కష్టం. తెలుగులో తత్వశాస్త్రానికి సంబంధించి ఇంత సులభ శైలిలో పుస్తకం దొరుకుతుందని నేను అసలు ఊహించ లేదు. ఇందులో క్రీస్తు పూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రితం గ్రీకు లో ఊపిరి పోసుకున్న తత్వశాస్త్ర భావాల దగ్గర నుంచి నేటి కాలంలో ప్రసిధ్ధి చెందిన జీన్ పాల్ సార్త్ర వరకు ముఖ్యమయిన అందరి పాశ్చాత్య తత్వశాస్త్రజ్ఞుల సిద్ధాంతాల గురించి అరటిపండు వొలిచినట్టు వివరించబడింది. తత్వశాస్త్రమంటే అదేదో అనవసరమయిన వేదాంతమనో, కష్టమయిన విషయమనో అనుకునే వైఖరిని పటాపంచలు చెయ్యగల పుస్తకమిది. నిజానికి తత్వశాస్త్రం అనవసరమైంది కాదు, చాలా అవసరమయింది. మనం చిన్నప్పుడు లెక్కల్లోను, సైన్స్ లోనూ చదువుకున్న పైధాగరస్, లైబ్నిజ్, దె కార్త్ లాంటి వాళ్ళందరూ ముందు తత్వవేత్తలే. అసలు తాత్వికుల సత్యాన్వేషణలో భాగంగా పుట్టిందే నేటి విజ్ఞానం. అంతే కాకుండా భగవంతుని గురించి, విశ్వం గురించి, ప్రజా పరిపాలన గురించి తత్వవేత్తలు చేసిన అర్ధవంతమయిన కృషిని ఈ పుస్తకం లో తెలుసుకోవచ్చు. కేవలం వారి సిధ్ధాంతాల గురించే కాక వారి వ్యక్తిగత జీవిత విశేషాల గురించి కూడా సమాచారం ఇవ్వటం వల్ల పుస్తకం మనల్ని ఆసక్తిగా చదివిస్తుంది. ఈ రోజు మనం చాలా మామూలుగా అంగీకరించేస్తున్న చాలా విషయాల్ని నిజాలని నిరూపించటానికి ఆనాటి తాత్వికులు ఎంత కష్టపడ్డారో, నమ్మిన దాని కోసం కటిక దారిద్ర్యాన్నీ ఎలా అనుభవించారో కూడా తెలుసుకోవచ్చు. కొంతమంది తాత్వికులు భగవంతుని అస్తిత్వాన్ని తర్కం ద్వారా, గణితం ద్వారా నిరూపించటానికి చేసే ప్రయత్నం, ఇంకొంత మంది భగవంతుని ఉనికిని ప్రశ్నించటం, దేవుడు ఉన్నా ఆ దేవుడితో మనకి ఏవిధమయిన సంబంధం లేదని నమ్మిన ఎపిక్యురస్, ప్రశ్నకి పట్టం కట్టిన సోక్రటీస్, వాక్స్వాతంత్ర్యం కోసం పోరాడిన వోల్టెయిర్, బాధల వల్ల మనిషి బలవంతుడు అవుతాడన్న నీషె, కమ్యూనిజం ప్రతిపాదించిన మార్క్స్, ఇలా అన్ని కోణాలనీ స్పృశించిన మహా తాత్వికుల గురించిన ఈ పుస్తకం చదవటం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. చేతిలో ఇమిడిపోయిన భూమిని ఈ పుస్తకానికి బాపు గారు కవర్ డెజైన్ గా వేసినట్టు, నిజంగానే ఇంగ్లీషులో ఉన్న చాలా పుస్తకాలని మధించి వాటి సారాన్ని కరతలామలకంగా తెలుగులో అందించిన నండూరి రామ్మోహనరావు గారికి మనం కృతజ్ఞులం. చదివాక మన ఆలోచనా విధానాన్ని మార్చగల పుస్తకం ఇది. తాత్వికతలో భారతీయ ఋషుల కృషి కూడా చాలా ఉన్నతమయినది, అందుకే పై వరసలో రెండోదయిన ‘భారతీయ చింతన’ని కూడా కనీసం వచ్చే సంవత్సరమయినా తప్పకుండా చదవాలనుకుంటున్నాను.


గొరుసుGorusu

నాగప్పగారి సుందర్ రాజు ‘మాదిగోడు’ కథలు.

ఈ సంవత్సరం నేను చదివిన రచనల్లో ఇష్టపడ్డవి చాలానే ఉన్నాయి. కొత్తగా కథా ప్రపంచం లోకి అడుగుపెట్టిన వంశీధర్‌రెడ్డి రాస్తున్న (మెదక్) మాండలీకం సొంపు, సొగసు వర్ణనాతీతం. Inhibitions లేకుండా తను రాసే కథలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. స.వెం. రమేష్ ‘కతల గంప’ కథలతో పాటు సతీష్‌చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, పసునూరి రవీందర్, హోసూరు దళిత కథలన్నీ నన్ను డిస్టర్బ్ చేసినవే.

నాగప్పగారి సుందర్ రాజు ‘మాదిగోడు’ కథల సంపుటి అనుకోకుండా ఈ మధ్య (మిత్రుడు జి. ఉమామహేశ్వర్ ద్వారా) నా చేతికి వచ్చింది. గతంలో ఒకటీ అరా కథా సంకలనాల్లో సుందర్రాజ్ కథలు చదివినా ‘మాదిగోడు’ సంపుటిలోని కథలన్నీ ఒకేసారి చదివే అవకాశం ఇన్నాళ్లకు కలిగింది. పశువులను పూజించే ఈ దేశంలో, పందిని దశావతారాల్లో చేర్చిన ఈ పుణ్యభూమిలో, చెప్పులకు పట్టాభిషేకం చేసిన ఈ పవిత్ర నేలలో మనుషులను అంటరానివారుగా నిర్ణయించి కుల సరిహద్దురేఖను గీసిన జాతిపై ‘ఇది నిజాల నిప్పుల తప్పెట!’ అంటూ సుందర్రాజు కొట్టిన దరువు నా గుండె మీది పెంకుల్ని ఎగరగొట్టింది.

ముఖ్యంరా ‘జొరేసావు కత’ ఎన్ని సార్లు చదివినా నా మనసు నిండలేదు. అంత గొప్ప కథ.

“కర్నము అయివారు తంతే తన్నేడకాని ఈరారెడ్డి మునుమురాలు వుమాదేవి మింద నేను పడితే జంగమయ్య ఈరుబద్రుసామి కొడుకుతాకి నా ‘ముట్టు’ సేరిడిసేద, కరెంటు సాకులక్క. యట్లాగయితేనేమి ఈ పొద్దు యంతమందికి బజార్లో నిలబడి సన్నీళ్ళు పోసుకునే పని బెట్టిడిసెన. ఇపుడసులే సలికాలము. బజార్లో నిలబడి యేడుసుకుంట నీళ్ళు పోసుకునల్లంటే యేమన్న సిన్నపనా. యెవురన్నా సూసినోళ్ళు యేమయ్యేద్నాని అడిగితే ఈ పొద్దు బళ్ళో మాదిగ రంగన్న కొడుకు ముట్టుకునేన్నంటాని సెప్పల్ల. పెదవి దాటితే పెన్నేరు దాటినట్లంట. ఆ పొద్దల్లా వూరంతా నా పేరే సెప్పుకుంటారంటాని లోపుల సొంతోసుము అయితాంటే సంకరప్ప అయివారు తన్నింది మరిసిపొయ్యి వుమాదేవి మిందినుంచి పెయికిలేసి దుమ్ము ఇదిరిచ్చుకుని కిందబడిన నా బుక్కులు తీసుకుంటా వొగసారి వుమక్క మగుములోకి సూసి లటుక్కున కన్నుకొట్టి పారిపొయ్యి యేమి యరుగునట్లు యెనిక్కి కుసునేన.”

అక్షరమక్షరం, పదం పదం, వాక్యం వాక్యం.. నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అంతర్లీనంగా అక్షరాల్లో దాగిన కసి, వేదన నన్ను హతాశున్ని చేశాయి. కర్నూలు – కర్ణాటక సరిహద్దులోని పల్లె మాండలీకం సొబగులీనింది. కులరేఖలు చెరపడానికి ఉప్పెన లాంటి, ఉరుముల్లాంటి ఇలాంటి ఎన్ని కథలొచ్చినా ఆహ్వానించి గుండెకత్తుకుంటాను.


హెచ్చార్కెHRK

‘అసురుడు’ పరాజితుల గాథ, రావణుడూ, అతని ప్రజల కథ

- ఆనంద్ నీలకంఠన్. అనువాదం: ఆర్. శాంతసుందరి

నాలుగైదు మంచి పుస్తకాలు చదివాను ఈ ఏడాది. అందులో ‘అసురుడు’ చాల ప్రత్యేకం అనిపించింది. ఈ నవల రచయిత ఆనంద్ నీలకంఠన్. కన్నడం నుంచి అనువదించిన వారు ఆర్ శాంతసుందరి. రాముడి కన్న రావణుడిలో ఎక్కువ మంచితనాన్ని చూసే పుస్తకం ఇది. నేను ఈ పుస్తకాన్ని ఇంతగా ఇష్టపడ్డానికి కారణం వేరు. రాముడైనా, రావణుడైనా రాజులు రాజులే పేదలు పేదలే అని చెప్పడానికి రాసిన రావణ-పక్షపాత నవల యిది. జాతి వైరుధ్యంతో పాటు రామాయణ కాలానికే రూపొందిన వర్గ వైరుధ్యాన్ని గొప్పగా ప్రదర్శించింది. రామాయణ, భారత పాత్రలు ఆధారంగా వచ్చిన పుస్తకాల్లో ఆనాటి వర్గ వైరుధ్యాల్ని ఎత్తి చూపించి, ‘అసల్సంగతి ఇదిరా నయ్నా’ అనిపించిన పుస్తకం మరేదైనా వున్నదా? నా మట్టుకు నాకు ఆ కోవలో ఇదే మొదటి పుస్తకం. కీలక సమయాల్లో రావణుడి విజయాలకు కారకుడైన పేద సైనికుడు, పేదరికం కారణంగా అవమాన పడిన భృత్యుడు భద్రునిలోనే నేను నా పూర్వీకులను ఎక్కువగా చూసుకున్నాను. ఈ నవలలో రావణుడికెంత ప్రాధాన్యం వుందో భద్రునికి అంత ప్రాధాన్యం వుంది. పుస్తకంలో రామ, రావణుల జాతుల మధ్య వైరుధ్యానికి ఎంత ప్రాముఖ్యం వుందో పేద, ధనిక వర్గాల మధ్య వైరుధ్యానికి అంత ప్రాముఖ్యం వుంది. ఇలా… జాతులు, కులాల మధ్య వైరుధ్యాల్ని ఏమాత్రం విస్మరించకుండా వర్గ వైరుధ్యాన్ని గట్టిగా పట్టించుకునే ప్రాపంచిక దృష్టి పెరిగే కొద్దీ లోకం మరింత బాగు పడుతుందని నా ఆశ. భద్రుని వల్ల నవలకు సొంత వ్యక్తిత్వం అబ్బింది. లేకుంటే భారత, రామాయణ పాత్రలు ఆధారంగా వచ్చిన పలు పుస్తకాలలో ఇదీ ఒకటయ్యేది.


చిత్తర్వు మధుMadhu Chittarvu

ఈ ఏడాది నేను చదివిన పుస్తకాలు తక్కువే. తెలుగులో మూలింటామె, నల్ల మిరియం చెట్టు, బియాండ్ కాఫీ, పాకుడు రాళ్ళూ, భూ భావ (నవలలు); త్రిపుర కథలు (రిపీట్ రీడింగ్), ఒక వెళ్ళిపోతాను, మరువం, వెన్నెల దారి (కవిత్వం); కొన్ని కథాసంకలనాలూ, ఇంగ్లీష్ లో హంగర్ గేమ్స్, కైట్ రన్నర్, ట్రయిన్ టు పాకిస్తాన్, లాంటివి. కాని అన్నిటిలో మాత్రం నాకు నచ్చిన పుస్తకం కదిలించినది మాత్రం… నల్ల మిరియం చెట్టు.

నవల అంటే జీవితం గురించి చెప్పడం కాదట.. వ్యాఖ్యానం కూడాకాదట… ఇది జీవితంలో సమస్యలకి పరిష్కారం చూపించడమో ఇంకేదో కూడా కాదట.. మరి ఏమిటి? నవల అంటే జీవితమే! ఇలా అని బుకర్ ప్రైజ్ వచ్చిన రిచర్డ్ ఫ్లాగాన్ అంటున్నాడు. ఇది నిజం! జీవితాన్ని తను చూసిన విధంగా చిత్రించడం వరకే రచయిత బాధ్యత. ప్రచారమో సమాచారమో ఉద్యమమో కాదని నేనూ నమ్ముతాను. చంద్రశేఖరరావు గారు రాసిన “నల్లమిరియం చెట్టు” గురించి ఎంతైనా రాయచ్చు. దళితఉద్యమాల గురించి, ఆర్థికంగా ముందుకు వచ్చినా ఇంకా సామాజికంగా కొనసాగే వివక్ష.. దళిత ఉపకులాలలోనే అసమానతలు.. మరిచిపోతున్న మూలాలు, ఒక ప్రత్యేక సంస్కృతి… ఇవన్నీ ఎన్నో వున్నాయి. కాని ఇది జీవితం. మనుషులు నలుపు తెలుపు లో వుండరు. ఆర్థికంగా పైకి వచ్చిన రాజారత్నం రాజకీయాల్లో ఇంకా పైకిపోవాలని తన మేధా శక్తి తో దండోరా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఆ ఉద్యమానికి ఆకర్షితులైన తన కొడుకు కూతురు రూమి, కమ్లిలని వాతలు పెట్టి శిక్షించడానికి కూడా వెనుదీయడు, భార్యని హింసించే మనిషి. తన కుటుంబ మూలాలు వెదుక్కుంటూ అక్కడి తన బాబాయి దండోరాలో నే విప్లవకారుడుగా పోరాడే వారని తెలుసుకుని అన్ని రాజకీయాలని నిశబ్దంగా చూస్తూ ఈ కథ ని చెప్పే అమ్మాయి భావాలకీ తండ్రి భావాలకి పడదు. ఇలా ఎన్నెన్నో ఈ కథలో ఉన్నాయి. ఈ నవల మనసులో ఒక గాఢమైన విషాదాన్ని నింపుతుంది. ఈ వచనం కవిత్వం కంటే అద్భుతంగా వుంటుంది. ఈ వచనానికి ఒక లక్ష్యం ఉంది బాధ వుంది. అందుకనే ఇది అజరామరమైన దృశ్య సౌందర్యాన్ని – పల్లెటూరు, గుండ్లకమ్మ వాగు తెల్లని చారలా కిటికిలో కనిపించడం, వెండి చీరలు ఆరేసుకున్న ఆకాశం, పేడ తో అలికిన ఇల్లు, వెన్నెల్లో చెట్ల కింద సామూహిక భోజనాలు… కసితో మండి పోయే యువతీ యువకుల ఉద్యమాలు ఇలాంటివే, ఇవన్ని ఈ నవలకి ప్రాణం. ఇది చంద్రశేఖర రావు గానం చేసిన ఆత్మ గీతం అనడం చాలా నిజం. నా ఫిర్యాదు ఒకటే! నవల చివరలో విషాదంగా నల్ల మిరియం చెట్టు ఎందుకు మండిపొవాలి? నాకు నచ్చిన, నేను అందుకో లేని మరొక రచయిత కేశవరెడ్డి నవలలో బక్కి రెడ్డి చని పోయినట్లు గానే ఈ అంతిమ విషాదం ఎందుకు…? కొంచెం ఆశా దృక్పధం వుంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. కాని ఇది జీవితం! బహుశా రచయిత విధి జీవితాన్ని మనసుకు హత్తు కొనేలా చూపించడం వరకేనేమో. మళ్ళీ చదివి చదివి ఆస్వాదించాల్సిన నవల. గొప్ప నవల. సాహిత్యం లో నిలిచిపోయే నవల.


మల్లికార్జున్ విmallikarjun v

గత యేడాది దాకా ఎక్కువగా ఇంజనీరింగ్ పుస్తకాలను మాత్రమే చదివే అవకాశం (అవసరం) కలిగి ఉన్న నాకు.. ఈ సంవత్సరం ఆ అవసరం తీరి కొత్త పుస్తకాల వైపు పరుగులు పెట్టే అవకాశం దక్కింది. గతంలోనూ కొన్ని పుస్తకాలను చదివున్నా, ఈ సంవత్సరం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోగలిగేన్ని పుస్తకాలను చదివేశా. వాటన్నింటిలో నాకు బాగా నచ్చిన పుస్తకమంటే.. ‘ప్రాతినిధ్య 2013’. అద్భుతమని చెప్పను కానీ ఏదో మత్తుందీ పుస్తకంలో. సాధారణంగా ఏదైనా నవల చదువుతున్నప్పుడు కొంచెం చదివాక ఎక్కడైతే ఆపేస్తామో అక్కణ్ణుంచి ఏం జరిగుంటుందా అనే ఒక కుతూహలమే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ మొదలెట్టేలా చేస్తుంది. ఈ పుస్తకం విషయంలో మాత్రం ఒక కథ అయిపోగానే పుస్తకాన్ని పక్కన పడేయాలనిపిస్తుంది. ఆ కథ చెప్పాలనుకున్నదాన్ని ఆస్వాదించడానికి కొంత సమయం తీసుకోవాలనిపిస్తుంది. మెల్లిగా బయటకొచ్చాక మళ్ళీ ఓ కొత్త కథను చదవాలనిపిస్తుంది. ఇదంతా చాలా కొత్తగా అనిపించింది. బహుశా మొదటిసారొక కథల సంపుటిని చదవడం వల్ల వచ్చిన అనుభూతేమో అది. ప్రతీ కథలోనూ నేనున్నా, నా చుట్టూ ఉన్న ఓ ప్రపంచముంది, నేను పట్టించుకోని ఓ ప్రపంచముంది, నన్ను పట్టించుకోని ఓ ప్రపంచముంది. అన్నీ ఒకేసారలా చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసి పారేశాయి. అందుకేనేమో ఈ సంవత్సరానికి నాకు దగ్గరైన పుస్తకంగా ప్రాతినిధ్య 2013 మిగిలిపోయింది.


మమత కొడిదెలMamatha Kodidela

తమ కోసమే కాక సమసమాజం కోసం ఉద్యమిస్తూ, రాజకీయ ఖైదీలుగా చిత్రహింసలకు గురై, విడుదలైన తరువాత మళ్ళీ అదే అనుభవం ఎదురవుతుందని తెలిసినా ఉద్యమాన్ని వదలని ధీరులుంటారా? ఉంటారనే చెప్తోంది ‘గుయెర్నిక’ను తలపించిన “కిటికీ పిట్ట”. ఏమంటే ఈ గుయెర్నికాలో భీభత్సమే కాక ఎర్రని మందారాలు, పచ్చని చింత చెట్లున్నాయి. మానవాళి పట్ల తరగని ప్రేమ వుంది. వెలుగులు చిమ్మే రంగులను మాత్రమే చూడగలిగే కళ్ళ ముందు మురికి ముఖాలపై చెరగని చిరునవ్వుల్ని ఆవిష్కరిస్తుంది. తనను హింసించిన వారిలోని మానవత్వం ఎక్కడికీ పోదని ఆశ పడుతూ, తన జీవితం ఆ శత్రువు విముక్తి కోసం కూడా అని ఓదారుస్తోందంటే మానవాళి పట్ల ఎంత ప్రేమను నింపుకుని వుండాలి ఈ కిటికీ పిట్ట?

వర్గ రహిత సమాజం వచ్చేవరకు ఉద్యమాలుంటాయి, తోడుగా వాదాలు ఉంటాయి. వాటికి తన పాటనిస్తుంది కిటికీ పిట్ట. “చేతులు వెనక్కి విరిచినా/ మోకాళ్ళపై పిడుగులు కురిపించినా/ దేహమంతా ఒక ఎర్రని కాంతి వలయం/ దిగంతాల్లో లీనమయ్యే ఆ ఎర్ర నేలల పంట సాక్షిగా/ తుమ్మ చెట్లల్లో కువకువలాడే ఆ పక్షుల సాక్షిగా/ మీరు నన్నేమీ చేయలేరు/ మీరు బహుశా నన్నేమీ చంపలేరు”.

2006 లో విడుదలైన ఈ పుస్తకం ఈ డిసెంబర్ మొదటి వారంలో చదివాను. పుస్తకం చదివిన తరువాత పి. మోహన్ ఎలావుంటారో అని ఊహించుకోబోయాను. కళ్ళెంత గట్టిగా మూసుకున్నా, గాలి మాత్రమే గోచరిస్తోంది… ప్రాణవాయువు నింపుకున్న గాలి!!


మానస చామర్తిManasa Chamarthi

గాంధి అన్నది ఇప్పుడు మనలో చాలా మందికి అతి సామాన్యమైన పేరు. మనం వినీ వినీ చలించకుండా పోయిన పేరు. మన ఊరిలో ఏ ప్రత్యేకతా లేని ఓ వీధి పేరు. మనం నిర్లక్ష్యంగా పారేసే రూపాయి నోటు మీది బొమ్మ పేరు. ఓ భగత్సింగ్ పేరు వింటే వెన్ను నిటారుగా అయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు, గాంధి పేరు చెబితే ఎప్పుడూ నాలో స్పందన కలిగేది కాదు. భగత్‌సింగ్ తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసిన రోజు “ ‘విప్లవమంటే భగత్‌సింగ్’ అని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చనిపోకపోయినా జీవితకాలంలో ఏ క్షణమైనా సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు దానిని వ్యక్తికి ఆపాదించరు. విప్లవ సిద్ధాంతానికి ఆపాదించి నిరసిస్తారు. కొన్ని వేల గుండెల్లో స్పూర్తిని నింపుతున్నాననుకుంటూ, నవ్వుతూ మరణించగలను” అన్న మాటలను, పసితనంలో అమాయకత్వంతో కురిసిన కన్నీళ్ళతోనూ, యవ్వనంలో ఆవేశంతోనూ, అటుపైన ఆ మాటల్లోని లోతైన భావానికి చలించి కృతజ్ఞతతోనూ కొనియాడినట్టు, గాంధిని మనస్పూర్తిగా అభినందించిన క్షణాలు నా జీవితంలో లేనేలేవు… “సత్యశోధన” పుస్తకం నా చేతుల్లో పడేవరకూ. అది కూడా ఎప్పుడు? మన లోలోపలి పేరుపెట్టలేని వెలితో, దుఖఃమో లేదా సందిగ్ధతో మనను నలిబిలి చేస్తూన్నప్పుడు, అప్పుడెప్పుడో ధర్మరాజు అడుగుతాడు చూడండీ “అసలు లోకంలో ఇంకెవరైనా ఇలాంటి బాధలు అనుభవించారా, నేనేనా? వీటి నుండి నాకెప్పటికైనా విముక్తి లభిస్తుందా?” అనీ, అలా అడిగేందుకు కూడా మరొకరెవ్వరూ కనపడనప్పుడు, కనపడ్డా అడగాలని అనిపించనప్పుడు, ఇదుగో, ఈ సత్యశోధన లాంటి పుస్తకమొక్కటి మళ్ళీ మనని నిబ్బరంగా నిలబెట్టగలదు అనిపించింది.

పద్ధతిగా బ్రతకడమంటే పర్వర్షన్, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించడం తమని తాము మోసం చేసుకోవడం; వ్యాయామం చేయడమంటే అనారోగ్యం కలిగి ఉండటం; దేవుణ్ణి నమ్మడమంటే పాపం చేసి ఉండటం; జీవితకాలపు సహచరుడి కోసం అలవాట్లు మార్చుకోవడమంటే పతివ్రతలా నటిస్తూ లోపల ఏడవటం; సంస్కారం మాయముసుగు; సంతోషం నటన; ఉద్యోగం అవసరం; ప్రేమ బలహీనత; మంచితనం మూర్ఖత్వం – ఈ రోజు మన చుట్టూ స్వేచ్ఛగా చలమాణీ అవుతున్న ఈ నిర్వచాలన్నీ చూస్తూ చూస్తూ, సత్యాన్ని శోధిస్తూ ఓ మనిషి తన జీవితంలోని ప్రతి తప్పుని అంగీకరిస్తూ దాన్ని దాటి వచ్చిన వైనాన్ని జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తూ విప్పి చెప్పాడంటే ఎంత ఆశ్చర్యమో! అసత్యం నుండి సత్యం వైపూ, భోగాల నుండి సరళజీవిత విధానం వైపు, ఆవేశం నుండీ ఉద్వేగం నుండీ సౌమ్యత వైపూ స్థితప్రజ్ఞత వైపూ జీవితపు చివరి క్షణాల వరకూ ప్రయత్నపూర్వకంగా ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళ్ళిన ఒక మహాత్ముడు, ఇక్కడే, ఈ నేల మీదే తిరిగాడంటే నమ్మశక్యం కాని కల్పనలానే అనిపించింది. రాజకీయంగా అతనేమిటో ఈ పుస్తకంలో నాకు దొరకలేదు. ఆ మరకలు తుడిపే ఆసక్తీ నాకు లేదు. కానీ, ఒక్క రామ మంత్రాన్ని నమ్ముకుని బ్రతుకుని పండించుకున్న మనిషి అందించగల స్పూర్తి ఇంతింతని మాత్రం చెప్పనలవి కాదు. తనకు తానే నియమాలు విధించుకునీ, తనను తానే కష్టపెట్టుకుని, సత్యంతో ప్రయోగాలంటూ తనకు మాత్రమే తెలిసిన, తెలియాల్సిన కోణాలను చూసే ఆసక్తి ఉన్నంతమందికీ చెప్పుకుని… ఏం సాధించాడయ్యా ఈ బక్కపల్చని మనిషీ అంటే… అందుకూ సమాధానమూ ఆ బ్రతుకు పుస్తకపు చివరి పుటలో దొరికింది నాకు. అజామిళోపాఖ్యానము చదివిన వారెవ్వరికైనా ఆఖరు క్షణాల్లో రామనామ స్మరణ ఎంత గొప్ప వరమో, ఎంత పుణ్యఫలమో అర్థం కాకపోదు.


మణి వడ్లమానిMani Vadlamani

ఆకునూరి హసన్ గారి “అందని ఆకాశం”. నాకు ఎంతో నచ్చిన, ఇష్టమైన పుస్తకం.

గుండె లోతుల్ని స్పృశించి. చదువుతున్నంత సేపు ఒక స్వాప్నిక జగత్తులో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది.

 “ఆమె జ్ఞాపకం తన జీవితం తో పాటే నడుస్తూ ఓదారుస్తూనే ఉంటుంది. గుండెకొసల్ని పట్టుకుని జీరాడే ఒక్క జ్ఞాపకం చాలు బ్రతకడానికి”.

“రాబోయే కాలంలో జీవితాలు కలిసేది నిజమే అయితే మనం మళ్ళి ఏ మలుపులోనో తప్పక కలుస్తాము”.

ఈ వాక్యాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. మనసు దిగులు గా ఉన్నప్పుడు ఈ పుస్తకం చదివితే ఏదో తెలియని ఓదార్పు కలుగుతుంది. చెట్టు నుంచి జారే ప్రతి ఆకు శిథిలం కాదు, అలాగే జరిగి పోయిన ప్రతీది కథ గానే మిగలదు, కొత్త చిగురు వేసి సరికొత్త అనుభవానికి చోటు కలిపిస్తుంది


పూర్ణిమ తమ్మిరెడ్డిPurnima Tammireddy

The Lover’s Dictionary: David Levithan

ప్రేమకథలు ఎన్ని రాలేదని?! ఇదీ ప్రేమకథ అయితే, దీని ప్రత్యేకత ఏంటి? ఇందులో రెండు ప్రేమకథలున్నాయి. ఒకటి పాఠకులిగా మనకి ముందుగా కనిపించేది – ఆ అమ్మాయి, అబ్బాయి మధ్య పరిచయం, ప్రణయం. ఇంకోటి కనిపించనిది – రచయితకు, భాషకు మధ్య రొమాన్స్. భాషతో పీకలోతు ప్రేమ లేకపోతే, ఒక ప్రేమకథను అక్షరక్రమంలో చెప్పవచ్చనే ఊహ రాదనుకుంటాను. ప్రేమకే నిఘంటువు తయారుచేయవచ్చుననే ఆలోచన రాదనుకుంటాను. ఒకే కథను అనేక పిట్టకథల్లో, ఒకే మనసును కలైడిస్కోప్‌లోని రంగుల్లా చూపటం మాటలు కాదు.

మనలోని పాఠకుడిని అబ్బురపరచి, మనలోని రచయితకు ఈర్ష్య కలిగించే రచనల్లో ఇది ఒకటి.


పూడూరి రాజిరెడ్డిRajireddy Poodoori

నాకు నచ్చిన పుస్తకం: పర్వ

రచయిత: ఎస్ ఎల్ భైరప్ప

తెలుగు: గంగిశెట్టి లక్ష్మీనారాయణ

ఈ ఏడాది నేను చదివిన మంచి పుస్తకాల జాబితాలో తప్పక ప్రస్తావించాల్సినవి: పర్వ, బాలగోపాల్ సీరిస్, గాన్ విత్ ద విండ్ అనువాదం చివరికి మిగిలింది. ఇందులో భైరప్ప రచన గురించి రెండు మాటలు: కల్లూరి భాస్కరం గారి కాలమ్ ‘పురాగమనం’ వల్ల పర్వ చదవాలన్న ప్రేరేపణ కలిగింది. దాన్ని సాధ్యం చేసింది అన్వర్ గారు.

ఏడు చెట్లెత్తు రాక్షసుల కథల్ని చిన్నారుల చెవుల్లో వేసే సమాజం మనది. ఈ అధివాస్తవికతలోంచి వాస్తవాన్ని వేరుచేసుకోవడం ఎలా? ఇక, అది మహాభారతమే అయితే!

మానవాతీత శక్తుల్ని మామూలు మనుషుల్లా సాధారణీకరించి, అప్పటి సామాజిక లక్షణాలను అర్థం చేయించే బృహద్రచన పర్వ. మహాభారతం చదవకుండా మన సాహిత్య పఠనం పూర్తికాదేమో! అలాగే, పర్వ చదవకుండా మహాభారత పఠనం సంపూర్ణం కాదేమో!

ఈ పుస్తకమంతటా పరుచుకునివుండే ‘నియోగం’ కాన్సెప్ట్ నాకేమీ లైంగిక షాక్ కలిగించలేదు. సంతానం కావాల్సినవారు, విధిలేక మరో సంబంధంలోకి పోవలసిన పరిస్థితిలో, తమ కుటుంబాన్ని (దాంపత్యాన్ని) కాపాడుకుంటూనే నైతిక పశ్చాత్తాపానికి లోనుకాకుండా ఉండటానికి జరిగిన సంబంధాల క్రమబద్ధీకరణే నియోగమేమో అనిపించింది. ఆధునిక సమాజంలో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ లాంటిది! అలా జరగకపోతే అది వ్యవస్థకూ మంచిదికాదూ, వ్యక్తులకూ మేలుచేయదు.


రవి ఇ.ఎన్.విRavi ENV

ఈ యేడాది చదివిన పుస్తకాల్లో –

శ్రీపాద వారి అనుభవాలు జ్ఞాపకాలూ, నామిని మూలింటామె, ఆధునిక మహాభారతం పర్వ, కావ్యకంఠ గణపతి ముని గారి మోనోగ్రాఫ్, ఇంకా సంస్కృతసాహిత్యంలో రసగంగాధరమ్, భాసుని మధ్యమవ్యాయోగమ్ అనే గొప్ప ఏకాంకిక, విమర్శను కావ్యస్థాయికి తీసుకు పోయిన వ్యక్తివివేకం అన్న ఒక సంస్కృత విమర్శనం… ఇలా వేటికవే విలక్షణమైన, విశిష్టమైన పుస్తకాలు. దేని ప్రత్యేకత దానిదే. పుస్తకం చదవడం – అంటే తనలో తనకు తెలియని తనను వెతుక్కునే ప్రయత్నమేమో! ఈ యేడాది పుస్తకాల విషయంలో చాలా fulfilling year.

అయితే…

***

ఆ రోజు మా ఆఫీసుకు “పెద్దవాళ్ళె”వరో వచ్చారు. వాళ్ళ డిన్నర్ చాలా ఖరీదైన ఒక చేపను ఓ తారల హోటల్లో నిర్ధారించారు. ఆ చేప – కోసిన తర్వాత కూడా ఎక్కువసేపు బ్రతికే ఉంటుందిట. శరీర భాగాలు వేటికవే గిలగిలా కొట్టుకుంటుంటాయట. అలా కొట్టుకుంటున్న “రా” ఫిష్ ను సాస్ లో అద్దుకుంటే చాలా రుచిగా ఉంటుందని, ఆ ఫుడ్డు దొరకడం ఎప్పుడో తప్ప దొరకదని ఆఫీసువారు చెప్పేరు. దాని తాలూకు వీడియో యూట్యూబు లో చూపారు.

ప్రకృతిలో ఒక విలక్షణమైన జీవానికి, దాని లో specialty కి విలువ కట్టి అందమైన చేపకు – మన ప్రాచీన కవులు “చలన్మీనాభలోచన” అంటూ అందమైన అమ్మాయి కళ్ళతో పోల్చే ఒక చేప అవస్థను చూచి లొట్టలు వేయటమూ. ఆ ఆహారం తాను తినకపోయినా పక్కన ఉన్న వాడు చాలా మామూలుగా ఉండటమూ…

మనలో ఉన్న negative energies గురించి, అంటే కామక్రోధాది అరిషడ్వర్గాల గురించి వేదకాలం నుండీ మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ కామక్రోధలోభమోహ మదమాత్సర్యాల కన్నా జుగుప్సాకరమైన, అసహ్యకరమైన స్వభావం (లేదా గుణం) మనుషుల్లో, మనలో, (నాలో) ఉంది. callousness. డొల్లతనం.

ఆ నేపథ్యంలో ఆ రోజు అనుకోకుండా చదివిన కథ – త్రిపుర గారి “హోటల్లో”. త్రిపుర callousness “గురించి” చెప్పడు. ఆ డొల్లతనాన్ని ప్రతిక్షేపిస్తాడు. త్రిపుర కథ పెట్టిన అవస్థ నుండి కోలుకోలేక, తేరుకోలేక, తన నుండి తాను దూరంగా పారిపోలేక, తనను తాను స్వీకరించనూ లేక ఇందాక చెప్పిన చేపలా కొట్టుకోవాలి. అఫ్‌కోర్స్ అలా కొట్టుకోవాలంటే పాఠకుడికీ కాస్త “హృదయం” లాంటిదొకటి ఉండాలి.

త్రిపుర కథలు – పుస్తకం పూర్తిగా చదవలేదు. “పూర్తిగా” చదవనూ లేను. దాచుకుంటున్నాను. ఈ యేడాది నాకు నచ్చినా, నచ్చకపోయినా వీడని పుస్తకం.


సత్యవతి పి.Sathyavathi Pochiraju

ఈ సంవత్సరం నేను చదివీ, నా మనసులో నిలిచిపోయిన పుస్తకాలలో మొదటిది ఫాతిమా భుట్టో వ్రాసిన “The Shadow of the crescent moon” షియాలను తుడిచిపెట్టడానికి నిర్దాక్షిణ్యంగా ఊచకోతకి దిగే వాళ్ళూ, రాజ్యహింస, అభివృద్ధి రాహిత్యం, ఉగ్రవాదం వీటిమధ్య ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతమైన వజీరిస్థాన్ లోని ఒక కొండప్రాంతంలోని ఒక పట్టణంలో ఒక రోజు మూడు గంటల పాటు జరిగిన కథ ఈ నవల. ఇందులోని పాత్రల గతాలూ వర్తమానాలూ కలగలసి ఉత్కంఠ నిలుపుకుంటూ యదార్థ పరిస్థితిని కళ్ళకు కట్టించే కాల్పనిక కథ. ముగ్గురు అన్నదమ్ములు ఈద్ కి ముందురోజు కలుసుకుంటారు. వాళ్ళు ముగ్గురూ మూడు వేర్వేరు మసీదులకు పోవడానికి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే కుటుంబమంతా ఒకే మసీదుకు పోవడం క్షేమంకాదు. ఎక్కడ బాంబు పేలినా ఎవరో ఒకరైనా బ్రతుకుతారు కదా? ఈ నవలలో ఉగ్రవాద దాడిలో తన చిన్నారి కొడుకుతో పాటు మానసిక స్థైర్యాన్నీపోగొట్టుకున్న మినా, తాలిబన్లు తన భర్త నుదుటిమీద కలష్నికోవ్ పెట్టి చంపబోతున్నా లక్ష్య పెట్టక ఆ తాలిబన్ యువకుడి ఛాతీ పట్టుకుని “నువ్వు చేసే యుద్ధం ఎవరితో? పసిపిల్లవాడిని చంపడమా నీకు న్యాయం?” అని ఏడుస్తూనే దులిపేస్తుంది. మిలిటరీ ఆఫిసర్ బూటు కాళ్ళ క్రింద ఒక చెవిలో వినికిడి పోగుట్టుకున్న సమరా లో మరింత పట్టుదల, మరింత తెగింపు. స్త్రీలు బయట కనిపించడమే అరుదు అని ప్రపంచం అనుకునే పాకిస్థాన్ లో ఇలాంటి స్త్రీలున్నారని చెబుతుంది ఫాతిమా. ఆమె ఈ నవలలో చాలా విషయాలు చర్చించింది. యుద్ధం ఎవరిది? ఎవరికోసం? అనుక్షణం రక్తపాతం, తగలబడిపోయిన యూనివర్సిటీలూ స్టేడియాలూ, నడుస్తూ నడుస్తూ వుండగానే ప్రొఫెసర్లనీ విద్యార్థులనీ అమాంతం ఎత్తుకుపోయి మాయం చేసే కార్లు, కేసులు నమోదు చేసుకోని పోలీసులు… ఒక భీబత్స భయానక వాతావరణం. ఎప్పటికి ఆ జనాలకి విముక్తి? అనే వేదన వెంటాడుతుంది. ఫాతిమా కథనం బాగుంటుంది.


సతీష్ పోలిశెట్టిSatish Polisetty

నచ్చిన పుస్తకం రూపాంతరం (ఫ్రాంజ్ కాఫ్కా Metamorphosis కు మెహెర్ తెలుగు తర్జుమా)

గమ్మతైన ఊహ. ఊహని సజీవపరిచే శైలి. నిండైన పాత్రలు. ప్రతి ఫుల్ స్టాప్ తర్వాత మనకంటు వదిలేసే ఖాళీలు. ఒంటరితనాన్ని సవాలు చేసే ఆలోచనలు. క్రితం ఎరగని భావాలు. ఇంతేనా అంటే వినబడే మన భావ దారిద్రపు కేకలు.


శిరీష్ ఆదిత్య

వి. యెస్. నైపాల్ రాసిన A House for Mr. Biswas ఈ ఏడాది నేను చదివిన మంచి పుస్తకాల్లో అత్యుత్తమమైనది. నేను ఇద్దరు ముగ్గురు స్నేహితులకి ఈ పుస్తకం చదవమని సిఫార్సు చేస్తే వాళ్ళు, “గొప్ప పుస్తకమని విన్నాము. చదవాలి. కథ ఏంటి?” అనడిగారు. నేను కథ ఇది అని మొదలు పెట్టే ప్రయత్నం చేసాను కానీ ఎలా చెప్పాలో తెలీలేదు. ఇంకొంత దీర్ఘంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే నాకే సరిగ్గా ప్లాట్ గుర్తు రాలేదు. నా బుర్రలో ఆ పుస్తకానికి సంబంధించిన కొన్ని చిత్రాలు తిరుగుతున్నాయి, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా సమయాల్లో నా ఒళ్ళు పులకరించిన క్షణాలు గుర్తొస్తున్నాయి, నా పెదవుల మీద చిరునవ్వు మొలుస్తోంది సరే – కానీ ఈ పుస్తకం ఏంటో, ఎందుకు Sirish Adityaనచ్చిందో చెప్పలేకపోయాను. అదే దాని గొప్పతనం ఏమో. నైపాల్ తన తండ్రి, తన కుటుంబం, తన చిన్ననాటి జీవితం యొక్క కథలను ముడి సరుకుగా తీసుకుని, ఎంతో ప్రేమతో పూలహారాన్ని అల్లినట్టు ఒక్కొక్క జ్ఞాపకాన్ని ఇంత అందంగా అల్లాడు. ఇది మోహన్ బిస్వాస్ కథ. తన జీవితం. తను గొప్పవాడు కాదు. పుణ్యాత్ముడు కాదు. మేధావీ కాదు. సగటు మనిషి, అంతే. సృష్టిలోని కొన్ని కోట్ల జీవరాసుల్లో తన ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రయాణం చేసిన ఒక మనిషి కథ. గొప్పవాడి కథ చెప్పడం చాలా తేలిక. తన జీవితంలోనే కావలసినంత డ్రామా ఉంటుంది. కానీ మామూలు మనిషి కథ చెప్పడం ఎంత కష్టమో పేపరు మీద పెన్ను పెట్టి muse కోసం ఎదురు చూసే ప్రతీ closet రచయితకి తెలుసు; దాన్ని బట్టి ఇంత సాధారణమైన కథని ఇంత అసాధారణ ప్రజ్ఞతో చెప్పిన నైపాల్ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకం అయిపోయాక ఆనందం వేసింది, బాధ వేసింది, మనిషి జీవితం ఇంత గొప్పదా అని ఆశ్చర్యం వేసింది, ఎంతో ప్రయాణం చేసి ఇంటికొచ్చినంత హాయి కలిగింది. కానీ అన్నిటికంటే ముందుగా, ఈ పుస్తకం ఇచ్చిన దీక్షిత్ కి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది.


శివ సోమయాజులSiva Somayajula

“జుమ్మా” షరీఫ్ వేంపల్లె గారి కథాసంకలనం గురించి రెండుమూడేళ్ల క్రితమే విన్నా, అవేవో ముస్లిం అస్తిత్వవాద కథలూ అన్న భ్రమతో పాటు, “వాద” కథల పట్ల నాకున్న అసహనం వల్ల, నేను దీన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యలేదు. అనుకోకుండా చేతికి చిక్కటంతో ఈ మధ్యనే ఈ సంకలనాన్ని చదివాను. నా అపోహలపై సిగ్గుపడ్డాను. “నాలుగిళ్ళు ఆడుకున్నా పర్వాలా… వెళ్ళిపోతా” అంటూ “పర్దా” దాటుకుని ఇల్లు వదలి వెళ్ళిపోయిన ఆ “జేజీ” తో ప్రారంభమైన ఈ సంకలనం, నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎక్కువ శాతం కథలు ఒక నిరుపేద ముస్లిం పిల్లవాడి గ్రామీణ నేపథ్యంలో నడుస్తాయి. ఆ “అమాయకపు దృక్కోణం” లోంచి పుట్టే ప్రశ్నలు, పరిశీలనలు, అనుభవాలు, సమాజంలోని ధార్మిక, ఆర్థిక వైరుధ్యాలను ఎత్తిచూపుతూ ఛళ్లున చరుస్తూ ఉంటే, మరో పక్క అప్రమేయంగా కంటతడి పెట్టిస్తాయి. “ఇంటి ముంగిట్లో వేసే తెల్లముగ్గు, చేతిలో వేసే ‘ఆకుపచ్చ ముగ్గు’, ఇంతే కదా రెండు మతాలకీ తేడా?” అని “అక్క” వేసే అమాయకపు ప్రశ్నలో ఎంత లోతు! కథ చెప్పటంలో “నిజాయితీ” ప్రతి పదంలోనూ కనపడుతుంది. ఏదో నీతులు చెప్పేద్దామనీ, సమాజాన్ని ఉద్ధరించే లేనిపోని బాధ్యతలను తలకెత్తుకొని, ఉద్బోధలు, పోరాటాలు చేద్దామన్న డాంబికాలు లేవు. అందుకే ఈ కథలు వెంటాడతాయి అంతలా. “మాల్గుడీ డేస్” “స్వామి” మధ్యతరగతి బాల్యాన్ని ఒక కాల్పనిక గ్రామంలో చిత్రిస్తే, ఈ కథలు వాస్తవికతకు అతిదగ్గరగా ఉన్న ఓ నిరుపేద బాల్యాన్ని అంతే హృద్యంగా చెప్పినట్లు, నా కనిపించింది. తగుపాళ్ళలో వాడిన మాండలీకం కథలలోని జీవితాలకు నన్ను మరింత చేరువ చేసింది. మరోపక్క రైతుల కష్టాల గురించిన కథలు కూడా ఉన్నాయి ఈ సంకలనంలో. కదిలిస్తాయి కానీ నాకెందుకో అవి వేరే సంకలనంగా వేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇవి “మైనారిటీ కథలు” అంటే నేను ఒప్పుకోను. మంచి కథలు. అంతే!


శ్రీశాంతి దుగ్గిరాలSreesanthi Duggirala

“అర్ధరాత్రి దాటిపోయింది. ఆకాశం మీద పాలిపోయిన చంద్రవంక కుంగిపోతోంది. పేరుకుపోతున్న తారుముద్దలా చీకటి దట్టమైంది. చుక్కల వెలుగులో దూరాన కొండలు మసక మసగ్గా కనిపిస్తున్నాయి.”

చీకటిలో అందాన్ని చూడగలిగే కళ్లు అల్లం శేషగిరిరావుగారికే సొంతం. ప్రకృతిలోని చీకటినే కాదు, ప్రతి మనిషిలోని బయటపడని చీకటిగుణాన్నీ పట్టుకుని తన కథల రూపంలో చెప్పారు. ప్రతి కథలో అడవి, వేట, చీకటీ కథా వస్తువులుగా తీసుకుని ఉత్కంఠరేపే వాక్యనిర్మాణంతో కథ అల్లటం ఆయనకే సాధ్యం. ఈ ఏడాది నేను చదివిన కథల్లో మర్చిపోలేని రచన ఆయన కథాసంపుటి “అరణ్యఘోష”.


శ్రీనిధి యల్లలSrinidhi Yellala

ఈ సంవత్సరం నేను చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చిన పుస్తకం: మార్గరెట్ మిషెల్ రాసిన “గాన్ విత్ ది విండ్.” తన జీవిత కాలంలో మార్గరెట్ రచించిన ఒకే ఒక్క నవల. కాలాలకి అతీతంగా ఎప్పటికీ మిగిలిపోయే నవల. జీవితంలోని అన్ని కోణాలను కళ్ళకి కట్టినట్టు చూపించే నవల ఇది. కథ మొత్తం “స్కార్లెట్ ఓ హారా” అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అమెరికా లో జరిగిన సివిల్ వార్ ఇతివృత్తంగా, యుద్దానికి ముందు, యుద్ధానికి తరువాత దక్షిణ అమెరికాలోని జీవన విధానం ఏవిధంగా మార్పు చెందిందో, బానిసత్వం నుండి నల్ల జాతీయులు ఎలా విముక్తి చెందారో, వాటి ప్రభావం అప్పటి సంఘంపై ఎలాంటి ప్రభావం చూపిందో మనకు తెలియజేసే నవల.

ఇక అసలు కథకి వస్తే, ఎంతో అపురూపంగా పెరిగిన అమ్మాయి, యుద్ధానికి తరువాత తనకు కలిగిన కష్టాల గురించి ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంతో చాల క్లిష్టమైన సమస్యలని ఎదుర్కోవడం, ఈ ప్రయత్నంలో అప్పటి సమాజంలో స్త్రీలపై వున్న కట్టుబాట్లని ఎదుర్కుని పోరాడి, మగవారికి దీటుగా సంపాదించడం మనం చూస్తాము. ఇన్ని కష్టాల్లో కూడా తను ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోవటానికి తను పడే ఆరాటం, ఆ ప్రయత్నంలో తనని నిజంగా, నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తిని నిర్లక్ష్యం చెయ్యడం, చివరికి ఆకర్షణకి, ప్రేమకి గల తేడాని తెలుసుకోవడం ఇవన్నీ కూడా, మనకి జీవితంలో గల ఎన్నో భావావేశాలని చాలా దగ్గరగా చుసిన అనుభూతిని కలిగిస్తాయి.

ముఖ్యంగా నాయిక నాయికల మధ్య జరిగే కథ ఎంతో రసవత్తరంగా వుంటుంది. నవరసాలని తనలో కలుపుకున్న నవల ఇది. పువ్వులాంటి మెత్తని మనసున్న అమ్మాయి, ఎలా కాలంతో వచ్చిన కష్టాలని ఎదుర్కుని నిలబడిందో, వివరించే ఈ కథ మనల్ని ఆద్యంతం చదివిస్తుంది. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది ఈ నవలని చదువుతుంటే. మళ్ళి మళ్ళి చదవాలనిపించే నవల. చదివిన తరువాత ఒకలాంటి ఆశావహ దృక్పధం మనకు కలుగుతుంది.


తృష్ణTrishna Venta

ఈ ఏడాది కొన్న పుస్తకాల్లో చదివిన పుస్తకాల సంఖ్య తక్కువ, చదవాల్సినవాటి రాశి ఎక్కువగా ఉంది. చదివినవాటిలో నన్ను బాగా ఆకట్టుకున్నది డా. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె’. ప్రేమవివాహం చేసుకున్న ఓ భార్యాభర్తల అనుబంధాన్ని స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంతో సృజించి, ఆ ఉద్యమ ప్రభావం వారి వైవాహికజీవితాన్ని ఏ దరికి చేర్చింది? ఆనాటి జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్వాతంత్ర్యోద్యమం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది.. వారిద్దరి మానసిక సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.. మొదలైన అంశాలను రచయిత డాక్టర్ ఉప్పల లక్ష్మణరావుగారు చాలా ఆసక్తికరంగా చిత్రీకరించిన నవల “అతడు-ఆమె”. కథను అటోబయోగ్రఫికల్ టెక్నిక్ ద్వారా ఆసక్తికరంగా నడిపిస్తారు రచయిత. ఈ ఆటోబయోగ్రాఫికల్ టెక్నిక్ ద్వారా నాయికా నాయకుల వ్యక్తిత్వాలను తెలిపే పరంపరలోనే మనకు స్వాతంత్ర్యోద్యమం, జైలు జీవనం, గాంధీజీ నడిపించిన ఉద్యమాలు, అప్పటి కాంగ్రెస్, స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మద్రాసు నగరం, ఆంధ్రా-తెలంగాణా ఉద్యమాలు, విభజనలు-వివాదాలు; సమాజంపై వ్యక్తులపై స్వాతంత్ర్యోద్యమ ప్రభావం, ఆనాటి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, క్విట్ ఇండియా ఉద్యమం, కమ్యూనిజం; రకరకాల పుస్తకాలు, తెలుగు వంటలు, వైవాహిక జీవితం, జీవితభాగస్వామిని ఎన్నుకునే పద్ధతి, స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ పురుషుల అనుబంధాలూ-స్నేహాలు, మానసిక సంఘర్షణలు మొదలైన ఎన్నో అంశాలను స్పృశిస్తుందీ నవల. అందువల్ల ఇది స్వాతంత్ర్యపోరాటాన్ని చిత్రీకరించిన నవల లేదా ఒక సామాజిక నవల అనే ముద్ర వేసుకుంది కానీ ఇదొక అభ్యుదయ రచన అని కూడా అనిపిస్తుంది నాకు. లక్ష్మణరావుగారి విస్తృత పరిజ్ఞానం, అభ్యుదయ భావాలూ, పాకశాస్త్రంలో ఆయనకున్న ప్రావీణ్యం, వివిధ ఆసక్తులూ, కళాభిరుచి మొదలయినవాటి గురించిన అవగాహన కూడా కల్పిస్తుందీ నవల. ముఖ్యంగా చెప్పాల్సింది నాకు బాగా నచ్చిన ఈ నవలా ప్రక్రియ గురించి..! కథంతా నాయికా నాయకుల డైరీల రూపంలోనే మనకు తెలుస్తుంది. అతడు, ఆమె, అతడు, ఆమె.. ఇలా ఒక జంట వరుసగా రాసుకునే డైరీ పేజీలే కథను తెలుపుతాయి. పాత్రల వ్యక్తిత్వాలనూ, వికాసాలనూ, పురుషాహంకారాలనూ, పరిపూర్ణమైన ప్రేమతత్వాన్నీ గురించి కూడా చెప్పే నవల ఇది. ఈ పుస్తకం చదవడం వల్ల కొంతమేర స్వాతంత్ర్యోద్యమ చరిత్ర తెలియడమే కాక స్త్రీ పురుష సంబంధాలను గురించిన విశ్లేషణాత్మకమైన చర్చల ద్వారా ఎన్నో తెలియని, ఆలోచించదగిన విషయాలు అవగాహనలోకి వస్తాయి.

ఓ గొప్ప పుస్తకం చదివానన్న అనుభూతి పాఠకుడికి మిగిలినప్పుడు రచయిత ఆలోచనలకు, ఆ రచన చేయడం వెనుక ఉన్న అతడు/ఆమె ఉద్దేశ్యానికీ సార్థకత లభిస్తుంది. రచనాకాలం ఏభై అరవై ఏళ్ల క్రితందైనా సమకాలీనంగా అనిపిస్తే, రచయిత ప్రకటించిన భావాలు నేటి సమాజానికి కూడా ఉపయుక్తంగా అనిపిస్తే తప్పకుండా అదొక విశ్వజనీనమైన నవల అనిపించుకుంటుంది.

ఆ రకంగా చూస్తే తప్పకుండా ‘అతడు – ఆమె’ ఒక విశ్వజనీనమైన నవలే!


ఆర్ ఎం ఉమామహేశ్వరరావుUma Maheswararao RM

చిట్టచివరి రేడియో నాటకం: డాక్టర్ వి చంద్రశేఖరరావు

‘తలా తోకా లేని ఈ కథలెందుకు వేస్తున్నావబ్బా..’ అంటూ చనువుగా మొదలైన మందలింపులు, నాలుగైదేళ్లు గడిచేసరికి, ‘ఇట్లాంటి కథలు వేసి నువ్వు తెలుగు కథకి ద్రోహం చేస్తున్నావు’ అని హెచ్చరించే దాకా సాగాయి. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికల్లో డాక్టర్ వి చంద్రశేఖర్ రావు కథలు వేస్తున్నపుడు నాకు దగ్గరగా ఉండే మిత్రుల నుంచి తరచూ విన్న దెప్పిపొడుపు మాటలు ఇవి. చంద్రశేఖర రావు కథల్లో నాకయితే, తలా తోకా రెండూ కనిపించేవి గానీ, కాకపోతే, అవి విడివిడిగా కనిపించేవి. అసంపూర్ణ శరీరాలు. అసంపూర్ణ వాక్యాలు. ‘పెరట్లో దండెం మీద ఉతికిన చీరను కమల ఆరేస్తోంది’ అనే వాక్యం లేనివి కథలెలా అవుతాయని నా మిత్రులు తెగ బోలెడు ఆశ్చర్యపడిపోయి, నా మీద జాలి కూడా చూపించేవాళ్ళు.

 నడి మధ్యలో మొదలయ్యే కథ, శకలశకలాలుగా సాగే కథనం, ప్రతీకలతో నిండిన వాక్యం… కథ మొత్తం చదివాక ఏమిటిదీ అని వెతుక్కుంటే గబుక్కున ఏమీ దొరికేది కాదు కానీ, ఏదో ఉందని మాత్రం అనిపించేది. ఆ ‘ఏదో’ ఊహల్లోంచి ఊడిపడలేదనీ, అచ్చమైన బతుకులోంచే తనుకులాడి బయటపడిందనీ పాఠకుడిగా నాకు అందేది. గొంతుకలో ఏదో అడ్డుపడ్డపుడు మాట అస్పష్టంగానే వస్తుంది. అసంపూర్ణంగానే ఉంటుంది. అడ్డుపడుతున్నదేమిటో అర్థమయితేగానీ కథకుడి మాట పాఠకుడికి అందదు. ఆ అడ్డుపడుతున్న దేమిటో చంద్రశేఖరరావు తర్వాతి కథల్లో అస్పష్టంగా అయినా అర్థమయినా, విస్పష్టంగా అర్థమయింది మాత్రం – ‘చిట్టచివరి రేడియో నాటకం’ కథా సంపుటితోనే.

డాక్టర్లూ, టీచర్లూ, పిల్లలూ పాత్రలుగా.. జీవని , పార్వతి కల, నైట్ డ్యూటీ, బహుమతి వంటి కథలు రాసినపుడు డాక్టర్ వి చంద్రశేఖర్ రావు పట్ల కథకుడిగా ఎవ్వరికీ పెద్దగా అభ్యంతరం లేదు. ఉద్యమాలు, ద్రోహాలు, కుట్రలు, సకల జీవన బీభత్సాలూ ఆయన కథల్లోకి సరాసరి నడిచి వచ్చేయడం మొదలయ్యాకే ఆయని కొంచం ఎడంగా చూడ్డం మొదలు పెట్టారనిపిస్తుంది. కథలు రాయడం మొదలైన అయిదారేళ్ళ తర్వాతే చంద్రశేఖరరావులోని అసలు కథకుడు బయటకు వచ్చాడు. ‘చిట్టచివరి రేడియో నాటకం’ కథా సంపుటిలో ‘జీవని’ నుంచి ‘హంసల రెక్కలు’ దాకా చంద్రశేఖరరావు కథాపరిణామక్రమాన్ని వివరిస్తాయి. ఒక అధికారిగా, వాడ దాటిన మనిషిగా ఆయన గొంతుకు అడ్డుపడుతున్న దేమిటో అర్ధమవుతుంది. అది గడ్డకట్టిన దుఖం, అణచుకున్న కోపం, బద్దలు కాలేక బాధపడుతున్న అగ్నిపర్వతం. ఈ తనకలాటే చంద్రశేఖరరావు కథలకు ప్రత్యేక శిల్పాన్నిచ్చాయి. అమూర్తమనో, అస్పష్టమనో, అయోమయమనో, అథివాస్తవమనో, అబ్సర్డ్ అనో ఎవరే పేరు పెట్టుకున్నా ఈ కథలు వాటికవే శిల్పాన్ని నిర్మించుకున్నాయి. తొంభైల తొలినాళ్ళలో తనకూ కథకూ మధ్య ఈ కథకుడు నిర్మించుకున్న ఇనుప గోడలు కాల క్రమంలో పలుచని తెరలుగా మరిపోతూ వచ్చాయి. ‘మోహనా మోహనా’ కథ రాయడం ఒక సాహసమే. ఈ ధైర్యాన్ని ఆయనకు ఆయన రాసిన కథలే ఇచ్చాయి. వామపక్ష అజ్ఞాత ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, వాటిల్లోని వేర్పాటు పోరాటాలు, ద్రోహాలు, పతనాలు, కుట్రలు… ఇవే చంద్రశేఖరరావు కథలు. ఈ కథలన్నీ ఆయనవే. ‘నా కథల్లోని మోహనసుందరం, మాలతి, మోహిని పాత్రలన్నీ నేనే’ అంటూ ‘చిట్టచివరి రేడియో నాటకం’ ముందు మాటలో ఆయన గుండె విప్పి చెప్పేశారు. ఈ ముందు మాట చదివాక చంద్రశేఖరరావు మీద నాకున్న ఇష్టం మరింత పెరిగింది. వర్తమాన చరిత్రలోని ద్రోహవృక్షం విత్తనాలను రేపటి తరం కోసం ఈ కథకుడు ఎంతో భద్రంగా కథలుగా మలిచి దాచి ఉంచాడు, ఏ పురుగులు తొలవని మొక్కలు మొలిపించుకుని ఫలాలు అందుకోవాలన్న ఆశతో. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు జూన్ 2014 న ఈ పుస్తకం ప్రచురించారు.


విజయవర్ధన్ బి.Vijayavardhan B

నేను fiction ఎక్కువగా చదువను. ఈ సంవత్సరం నాకు నచ్చిన పుస్తకం కూడా non-fiction పుస్తకమే. ఒక మిత్రుడి చెబితే ఈ పుస్తకం చదివాను. అది ఎంతగా నచ్చిందంటే నాకు తెలిసిన చాలా మందికి సిఫారసు చేసాను. కొంత మందికి బహుమతిగా ఇచ్చాను. ఈ పుస్తకంలో నచ్చిందేమిటంటే: నిజాయితిగా జీవించే వాళ్ళే విజయం సాధించే అవకాశం ఎక్కువ వుంటుందని mathematical గా నిరూపిస్తాడు రచయత వి. రఘునాథన్. చివరికి భగవద్గీత ను కూడా mathematical గా విశ్లేషించాడు. Prisonaer’s Paradox పరిచయము తో మొదలు పెట్టి ప్రతీ భారతీయుడి చేష్టలను విష్లేషించాడు. చాలా సరళంగా వుంది రచయత శైలి.

Behavioural financeను ప్రొఫెసర్ గా బోధించిన రఘురామన్ ఇంకా పుస్తకాలు వ్రాసారు. అవి కూడా చదవాలని నిర్ణయించుకున్నాను. రచయత ఇచ్చిన TED talk ఇక్కడ చూడొచ్చు:

https://www.youtube.com/watch?v=kld-H9Hei5c


Happy Reading Next Year :)

Posted in 2014, డిసెంబర్, పుస్తక జాలం, పుస్తక సమీక్ష and tagged , , , .

5 Comments

  1. S.L. బైరప్ప గారి “పర్వ” లావు పాటి పుస్తకాన్ని పేజీ తిప్పకుండా పూజిస్తున్నాను, “త్రిపుర కధల పుస్తకం” తలగడ కింద పెట్టుకునే ఉన్నాను, బాధాధగ్ధ కంఠం బైరాగి ని చదవాలని ఆదిత్య ఆదరువు తీసుకుంటున్నాను, స వెం రమేష్ కధలు సాంతం చదవలేదు, రంగనాయకమ్మ ( కా. రంగాజి ) లేఖలు చదవాల్సి ఉంది కాని డా. మల్లీశ్వరి గారి “పెద్దక్క ప్రయాణం” ( http://kinige.com/book/Peddakka+Prayanam ), కొండపల్లి కోటేశ్వరమ్మ గారి “నిర్జన వారధి“ ( http://kinige.com/book/Nirjana+Vaaradhi ) మాత్రం అందరూ చదవమని అర్ధిస్తున్నాను

  2. మిత్రులంతా ,వారికి నచ్చిన పుస్తకాల గురుంచి రాసిన వివరాలు చదివాను,అవన్నీ కూడా చదవాలనే జిజ్ఞాస మొదలయింది.. అద్భుతమైన రచనలు, నాకు ‘ఈ ఏడాది నచ్చిన పుస్తకం ” శీర్షిక లో భాగం కలిపించినందుకు కినిగే పత్రికకు ధన్యవాదాలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.