శూద్రమహాకవి "పద్మప్రాభృతకమ్" భాణానికి రవి ఇ.ఎన్.వి తెలుగు వ్యాఖ్యానం

పద్మప్రాభృతకమ్ (10)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

ప్రేంఖోలత్కుణ్డలాయా బలవదనిభృతే కందుకోన్మాదితాయాః

చంచద్బాహుద్వయాయాః ప్రవికచవిసృతోద్గీర్ణపుష్పాలకాయాః |

ఆవర్తోద్భ్రాన్తవేగప్రణయవిలసితక్షుబ్ధకాంచీగుణాయాః

మధ్యస్యావల్గమానస్తనభరనమితస్యాస్య తే క్షేమమస్తు ||

ఏషా పూర్ణే శతమితి వ్యవస్థితా వాసు ప్రియంగుయష్టికే సఖీజనపణితవిజయేన దిష్ట్యా వర్ధసే | కిం బ్రవీషి – “స్వాగతమార్యాయ, హన్త విజయార్ఘం గృహ్యతామ్” ఇతి | వాసు త్వద్దర్శనమేవానర్ఘో లాభః | స్మర్తవ్యా స్మః | సాధయామో వయమ్ | (పరిక్రమ్య)

అయే ఇదమపరం సుహృద్వినోదనాయతాముపస్థితమ్ | ఇదం హి చంద్రధరకామిన్యా నాగరికాయా దుహితుః శోణదాస్యా గృహమ్ | ఏష ప్రవిశామి | న శక్యమనభిభష్యాతిక్రమితుమ్ | (ప్రవిష్టకేనావలోక్య)

ప్రేఙ్ఖోత్కుండలాయా = ఎగురుచున్న చెవిపోగులదానికి, బలవత్ అనిభృతే = బలము వలన పట్టుకొనజాలని, కందుక ఉన్మాదితాయాః = బంతికై వెర్రిగ యగు దానికి, చంచద్భాహుద్వయాయ = చలించిన రెండు భుజములు గలదానికి, ప్రవికచ విస్రుత ఉద్గీర్ణ పుష్ప అలకాయాః = చెదరిన ముంగురులపై వికసించిన పూలు పడిన దానకు, మధ్యస్య ఆవల్గమాన స్తనభర నమితస్యాయ = స్తనభారమున వంగిన, చిక్కిన నడుము దానకు, ఆవర్త ఉద్భ్రాన్త వేగప్రణయవిలసిత క్షుబ్ధకాంచీగుణాయాః = వేగముగ తిరుగుటవలన పైకెగరుటవలన, వేగముగ కదలుటవలన మెరయుచూ చిన్నదిగ కనిపించు బంగరుమొలనూలు గల దానకు, తే = నీకు, క్షేమమస్తు = శుభమగుగాక!

తాత్పర్యము: ఎగరుచునున్న చెవిప్రోగులదానికి, వేగముగ బంతికై వెర్రిగ పరిగెడుదానకు, కదలుచున్న భుజద్వయముల దానకు, చెదరిన ముంగురులపై యతికిన పూల రేకులు కలదానకు, స్తనభరమున వంగిన నెన్నడుము దానకు, కంఠహారము తిరగుట, కదలుట, ఎగరుట మున్నగు కారణములచేత బంగరుమొలనూలు మెరపునొందిన దానకు నీకు శుభమగుగాక!

విశేషము: మనోహరమైన తరుణయువతీవర్ణనము. స్రగ్ధర.

నూరు పూర్తయినవి కాబోలు, ఆగినది. బాలా, ప్రియంగుయష్టికా. సఖులతో బంతియాట గెలిచినందుకభినందనలు.”ఆర్యునికి స్వాగతము. హా, విజయార్ఘ్యమును స్వీకరించుము” అనుచున్నావా? బాలా, నీ దర్శనమే నాకొకయమూల్య లాభము. మేము గుర్తుందుము గాక. ఇక మేమేగుదుము. (ముందుకు నడచి)

అరే, నా మిత్రుని వినోదింపజేయునొక గృహోద్యానమును జేరితిని. ఇదే చంద్రధరకామిని కూతురు శోణదాస్య ఇల్లు. ఈ ఇంటిలోనకు ప్రవేశింతును. ఈమెను పలుకరింపక వెడలజాలను. (ప్రవేశించి చుట్టూ చూచి),

అయే ఇయం శోణదాసీ కిమపి చిన్తయన్తీ ద్వారకోష్టక ఏవోపవిష్టా | తత్కిమిదానీం నిర్భక్తభూషణతయా వివిక్తశరీరలావణ్యా మలినప్రావారార్ధసంవృతశరీరా రక్తచందనానులిప్తలలాటాసితదుకూలపట్టికావేష్టితశీర్షావనతవదనచంద్రమండలాంకాధిరూఢం వల్లకీమీషత్కరరుహైరవఘట్టయన్తీ కాకలీమందమధురేణ స్వరేణ కైశికాశ్రయమాకూజయన్తీ తిష్టతి | ఉత్కణ్ఠితయానయా భవితవ్యమ్ | కైశికాశ్రయం హి గానం పర్యాయశబ్దో రుదితస్య | కిన్న ఖల్విదమ్ అశ్రుతపూర్వం మయా చంద్రోదయాదేవ ప్రణతకలహకృతం వ్యాహరణమనయోః |

ప్రియనిరోధాత్ పశ్చాత్తాపగృహీతయాऽనయా భవితవ్యమ్ | భవతు | పరిహాసిష్యామ్యేనామ్ |

వాసు శోణదాసి, కిమిదం వేషః పరిగృహ్యతే ? వాసు న ఖల్వయమపరాద్ధశ్చంద్రధరః ? కథం తేऽశ్రుమోక్షః ప్రతివచనమ్ ? నిగృహ్యతాం బాష్పః | కథ్యతాం తావత్ | కిం బ్రవీషి – “మానైకగ్రాహకుశలేన వ్యాపాదితాస్మి సఖీజనేన” ఇతి | నను సర్వజనాధికా తే సఖీ శోణదాసి త్వముత్థాపయతి ? కిం బ్రవీషి – “తస్యా ఏవ దుర్మంత్రితైరాపదమిమాద్వహామి” ఇతి | అపణ్డితా ఖల్వసి | నను సా త్వయైవం వక్తవ్యా -

అరే, ఈ శోణదాసి ఏదో ఆలోచించుచూ వెలుపలి వాకిట గడపవద్ద కూర్చున్నది. ఏమి ఈవేళ ఆభరణములు త్యజించి, ఏకాంతమైన శరీరలావణ్యముచేత, మలినమైన చీరను శరీరమునకు అడ్డదిడ్డముగ చుట్టుకుని, రక్తచందనమును, నొసటికి పూచుకొని, మేలి ముసుగుపట్టికతో తలను కప్పుకుని వంచిన చంద్రుని వంటి ముఖము కలదై, వడిని ఉన్న వీణనువ్రేళ్ళతో కొంచెముగ కదుపుచూ, సూక్ష్మమధురావ్యక్తధ్వనులతో కైశికీవృత్తిచేత గానమొనర్చుచు కూర్చున్నది. ఉత్కంఠముగనున్నట్టు కనిపించుచున్నది. కైశికాశ్రయమైన గానము శోకమునకు పర్యాయశబ్దము. చంద్రోదయమునకు ముందే వీరిద్దరి ప్రణయకలహమేల? వీరిద్దరి జగడ కారణమును నేను వినలేదు.

ప్రియుని యెడబాటువలన పశ్చాత్తాపమొందినట్లున్నది. కానిమ్ము. ఈమెను పరిహసింతును.

బాలా, శోణదాసి! ఏల ఈ వేషమును కట్టితివి? బాలా, చంద్రధరుడిచేత నేదైన అపరాధము జరిగినదా? నీ కన్నీటి సమాధానమెట్టూ? కన్నీరాపుకొనుము. ఏమిటది వివరింపుము.”నాపై కేవలము గౌరవము మాత్రము వహించి (స్నేహము వహింపని) సఖి చేత మోసగింపబడితిని” అంటివా? నీకు అత్యంతప్రియమైన సఖి ఈ ద్రోహము చేసెనా?”ఆమె తప్పు సలహా చేత ఈ ఆపద పుట్టుకు వచ్చినది” అన్నావా? ఆమె మూర్ఖురాలు. ఆమెకు నీవిలా చెప్పి ఉండవలెను –

ప్రాయశ్శీతాపరాద్ధా క్షణమపి న పునర్దూతి మానక్షమాऽహం

తుష్టేదానీమనార్యే భవ మదనతులాం మామిహారోప్య ఘోరామ్ |

మానైకగ్రాహవాక్యైరనునయవిధురైస్తావకైస్తత్ కృతం

పాణిభ్యాం యేన సంప్రత్యనుచితశిథిలాం మేఖలాముద్వహామి ||

కిం బ్రవీషి – “పరాజితా ఇదానీం మదనేన మానః | కింతు స ఏవ తు సౌభాగ్యకృతావలేపస్తే వయస్యః స్తబ్ధః” ఇతి | తతః కిమిదానీం నాభిసార్యతే ? సుందరి, అలమలం వ్రీడయా |

నిశ్వస్యాధోముఖీ కిం విచరసి మనసా బాష్పపర్యాకులాక్షీ

శైథిల్యాం భూషణానాం స్వయమపి సుభగే సాధ్వవేక్షస్వ తావత్ |

హిత్వా కూలస్థవాక్యాన్యనునయ రమణం కింవృథా ధీరహస్తైః

సంరూఢస్యాతిమూఢే ప్రణయసముదయస్యాతిమానోऽవమానః ||

దూతి = దూతికా, ప్రాయః శీతాపరాధ్యా = ప్రియతముని విషయమున ఉపేక్షను వహించిన అపరాధను, అహం = నేను, పునః = తిరిగి, క్షణమపి = క్షణమైనను, న మానక్షమా = సైపలేనిదానను. అనార్యే = అనార్యురాలా, ఇదానీం = ఇప్పుడు, మాం = నన్ను, ఘోరం = ఘోరమైన, మదనతులాం = మదనుడను త్రక్కెడపై, ఆరోప్య = నిలిపి, తుష్ట భవ = సంతోషించుము.మానైకగ్రాహవాక్యైః = గౌరవము కొరకే ఉపయోగించు వాక్యములవలన, అనునయవిధురైః = వికలము చెందిన అనునయములచేత, తావకైః = వచనములచేత, మే = నాకు తత్కృతం = ఆ చేయబడినది, సంప్రతి = ఇప్పుడు,అనుచితశిథిలాం = అవసరమునకంటే మించి వదులయిన, యేన = ఎవని, పాణిభ్యాం = చేతులచేత, మేఖలాం = వడ్డాణమును, ఉద్వహామి = సరిజూచుకొనుచున్నాను.

తాత్పర్యము: హే దూతి, ప్రియుని విషయమున ఉపేక్ష వహించుటయే నా అపరాధము. కానీ ఇప్పుడు క్షణమైన నాతనిని విడువలేకుంటిని. ఇప్పుడు నీవు నన్ను ఘోరమైన కాముని తరాజుపై నిలిపి యేల ఆనందింతువు? నాపై స్నేహము లేక గౌరవభావము మాత్రముంచి, అనునయవాక్యములచే నిట్లు చేసితివి. సాధారణముగ ప్రియుడు లాగుటచే శిథిలమగు వడ్డాణము యిప్పుడు కృశత్వముచే వదులుగనైనది. దానిని నేను సమ్మాళింపవలసి వచ్చుచున్నది. (స్రగ్ధర)

ఏమంటివి – “ఇప్పుడు మదనుని చేత మానము ఓడినది. కానీ సౌభాగ్యపు అహంకారము వలన నీ మిత్రుడు కఠినుడైనాడు” అనియా. అలాగైన అభిచరమేల చేయవు? సుందరి, అటువంటి సిగ్గు వీడుము.

నిశ్వస్య = నిట్టూర్చుచున్నది, అధోముఖీ = ముఖము దించుకునినది, మనసా = మనసునందు, బాష్పపర్యాకులాక్షీ = కన్నీటి పర్యంతమైన కనులు గలదియు (అయిన నీవు) కిం = ఎందుకు, విచరసి = ఆలోచింతువు, సుభగే = సుందరి, తావత్ = ఇకపై, శైథిల్యం భూషణానాం = తెగిన అలంకారములను, స్వయమపి = నీవే, సాధు = చక్కగ, అవేక్షస్వ = చూచుకొనుము.

కిం బ్రవీషి – “స్త్రియా నామ పురుషోऽనునేయో నను శౌర్యడీర్యమ్” ఇతి | మా తావత్ | అతిమనస్విని కిం న గంగా సాగరమభియాతి? అలమలం వ్రీడయా | అథవా సకామాऽస్తు భవతీ | అహమేవ చంద్రధరమనునయామి | కిం బహునా | అద్యైవ తే చిరవిరహసమారోపితస్య మదనాగ్నిహోత్రస్య పునరాధానం కరోమి | కథమనసితబాష్పయౌవ స్మితమనయా | ఇదం ఖలు వర్షర్తుజ్యోత్సాదర్శనమ్| సుందరి అలమలం రుదితేన | ప్రత్యుపస్థితం కల్యాణమ్ | కిం బ్రవీషి – “సత్యప్రతిజ్ఞేనేనీదానీం భావేన భవితవ్యమ్” ఇతి | ప్రభాతే జ్ఞాస్యసి | కథముపరతో బాష్పః | సాధయామ్యహమ్ |

(పరిక్రమ్య)

అహో ఇదమపరం శృంగారప్రకరణముపస్థితమ్ |

వాక్యాన్ = వాక్యములను, హిత్వా = చక్కగ కూర్చి, రమణం = ప్రియుని, అనునయ = అనునయింపుము.

వృథా ధీరహస్తైః = వ్యర్థమైన చంచలమనముతో, కిం = ఏల? అతిమూఢే = మూర్ఖురాలా, ప్రణయసముదయ = ప్రణయోదయము వలని, అస్య = ఇట్టి, అతిమాన అవమానః = మిక్కిలి అభిమానముచే జనించిన అవమానము, సంరూఢస్య = పాదుకొనును.

తాత్పర్యము: నిట్టూర్చుచూ, అధోముఖి అయి, కన్నీటి పర్యంతమైన మనసు గలదానా? ఎందులకాలోచన? ఇకపై శిథిలాభరణములను సజ్జీకరింపుము. ప్రియుని చక్కగ అనునయవాక్యములచే గారవింపుము. మూర్ఖురాలా, ప్రణయోదయము వలనే రాగమెక్కువై అవమానము జరుగుట సంభవించును.

ఏమంటావు – “స్త్రీలకు పురుషులచేత అనునయింపబడుట మాత్రమే వీరత్వము” అనియా? అలా కాదు. అభిమానినీ, గంగ సాగరాన్ని చేరటం లేదా? లజ్జ చాలును. నీ ఇచ్ఛ పూర్తియగుగాక. నేనే చంద్రధరుని అనునయింతును. వేయేల? ఈ రోజే చిరవిరహతప్త అయి మదనాగ్ని యజ్ఞమును తిరిగి ప్రజ్వలింపజేతును. కన్నీటిని తుడుచుకోకయే నవ్వుచున్నావు. ఇదే కదా, వర్షాకాలచంద్రదర్శనము. సుందరి, దుఃఖమిక చాలు. కల్యాణము ముందున్నది. ఏమంటున్నావు – “పండితుని ప్రతిజ్ఞ సత్యముగావలయును” అనియా. పొద్దుట తెలుసుకోగలవు. ఎట్టు, శోకమాగినది. ఇక ఏతెంతును.

(ముందుకు నడచి)

అహో, మరల శృంగార ప్రకరణము వచ్చినది.

ఏషా హి నాగరికాదుహితా గణికా మగధసుందరీ నామ శరదమలశశిసదృశవదనా అసితమృదుకంచితస్నిగ్ధసురభిశిరసిరుహా వికసితకువలయదళలోలలోచనయుగళా విద్రుమచారుతరతామ్రాధరసంపర్కపరిపాటలదశనమయూఖా కుందకుసుమముకుళధవళసమహసితశిఖరదరీ పీనకపోలస్తనోరుజఘనచక్రా బాహ్యద్వారకవాటార్ద్ధసంవృత్తశరీరా దక్షిణహస్తాంగుళిద్వయేన తిరస్కరిణ్యేకదేశమవలంబమానా వామచరణకమలైకదేశేన భూతలే తాలమభిసంయోజ్య రక్తస్వరమధుర తారసంయుక్తామసంకీర్ణవర్ణామవఘుష్టాలంకారాలంకృతా శ్రోత్రమనోహరం షడ్జగ్రామాశ్రయాం వల్లభాం నామ చతుష్పదాం ఆకూజమానా నేత్రభ్రూవిక్షేపైః సంకల్పితాన్ భావానభినయంతీ కస్యాపి సుభగస్యాగమనం ప్రతీక్షమాణా తిష్టతి | భోః కో ను ఖల్వయం మహేంద్ర ఇవ సురతయజ్ఞాయహూయతే| భవతు | పృచ్ఛామ్యేనమ్ | భవతి, వేశమేఘవిద్యుల్లతే పృచ్ఛామస్తావత్ -

శుక్లసితాంతరక్తా సాపాంగవేక్షిణీ వికసితేయమ్ |

ధన్యస్య కస్య హేతో: చంద్రముఖి బహిర్ముఖీ దృష్టిః ||

ఈమెయే నాగరిక కూతురయిన గణిక మగధసుందరి యనునది. ఈమె శరత్కాలశుభ్రచంద్రవదన, నల్లనిది చిక్కనిది సౌరభములీనుచున్నది అయిన ముఖమున నొప్పు వికసితకువలయద్వంద్వములు, చంచలములైన కనులు గలది, పగడముల వలె ఎర్రని పెదవుల యందించుక దంతసంపర్కమున కిరణములు వెదజల్లెడునది, మల్లెమొగ్గల వరుసల సమముగ వెల్లనై, వాడి దంతములు గలది, చక్రవాకముల వలె పీనస్తనములు, చక్రముల వంటి నితంబములు గలది, వెలుపలి వాకిలినానుకొని యుండిన శరీరము గలది, కుడిచేతి రెండు వ్రేళ్ళచేత పరదాను పట్టుకుని యున్నది, (ఆ రెండు లక్షణములునూ వాసకసజ్జిక యను శృంగారనాయికను సూచించునవి) పద్మమువంటి యెడమకాలిచేత భూమిపై దరువేయుచున్నది, రక్తపల్లవములమరగిన కోకిలవలె సంయుక్తమై, (స్థాయీ, సంచారీ, ఆరోహ, అవరోహ) వర్ణమిశ్రమము లేక గానవిధి నెరపుచూ, శ్రోత్రమనోహరమై, షడ్జమమునాశ్రయించిన వల్లభమను చతుష్పదమును (చతుష్పదములు పదునెనిమిది రకములని మానవల్లిరామకృష్ణకవి భరతకోశమున వివరించెను) యించుక గానము చేయునది, నేత్ర భ్రూ విక్షేపములతో భావములనభినయించునది, ఎవడో సౌభాగ్యవంతుని రాకకెదురుచూచునదిగ నున్నది. ఆహా, సురతయజ్ఞమునకు ఆహూతుడైన ఆ మహేంద్రుడెవడు?(ఇచ్చట మహేంద్రశబ్దము గుప్తరాజు కుమారగుప్తుని సూచించునని కొందరు) కానిమ్ము. ఆమెను అడుగుదును. ఓ వర్షాకాలమేఘము యొక్క మెరుపా! అడుగుచున్నాను -

శుక్లా = తెల్లని, అసితా = నల్లని, అన్తరక్తా = కోణమున ఎరుపురంగు, వికసితా = బాగుగా తెరిచి, సాపాంగవేక్షిణీ = క్రీగంట చూచునదైన అయం చంద్రముఖీ = ఈ చంద్రముఖి, కస్య ధన్యన్య = ఏ ధన్యునియొక్క, హేతోః = కారణాన, దృష్టిః = దృష్టి, బహిర్ముఖీ = బయట నిలుపునది?

తాత్పర్యము: తెలుపు (కనుపాప), నలుపు (కను గుడ్డు), ఎరుపు (కనుచివర) ల కనుల ఈ సుందరి తన వికచనేత్రములతో క్రీగంట , ఏ ధన్యునికై బయట ఎదురుచూచునది?

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

One Comment

  1. Pingback: పద్మప్రాభృతకమ్ (11) | కినిగె పత్రిక

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.