cover

అదొక బెరుముడా ట్రయాంగిల్!

ఇవాళ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా…

Download PDF EPUB MOBI

వెంకట్రామా అండ్‌ కో

సోలెడు బియ్యం వండుకో

పప్పు తినీ పండుకో – అనే తెలుగు రైమ్‌ని మా చిన్నప్పుడు వుత్సాహంగా పాడుకుంటూ వుండేవాళ్లం. దీనికో నేపథ్యం వుంది. (నేను నేపథ్యం అనే మాటని ఎక్కడోక్కడ గురి చూసి వెయ్యాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా. ఇన్నాల్టికి పడింది. థాంక్ గాడ్!) అప్పట్లో మా వాచకం పుస్తకాలన్నీ వెంకట్రామా పేరు మీదే వుండేవి. వీళ్లు కదా బొత్తులు బొత్తులు అచ్చుకొట్టి అభం శుభం తెలియని మా మీదకు వదిలిందని మహా మంటగా వుండేది. పవరుపేట, ఏలూరు అని కూడా అట్టల మీద వుంటం వల్ల యిప్పటికీ ఏలూరు నాలిక మీద వుండిపోయింది.

Mo-4ఆర్టిస్ట్ మోహన్‌ది కూడా అదే ఏలూరు అనేసరికి మా అనుబంధం అరవైఏళ్లదిగా పెనవేసుకుంది. పాతిక ముప్ఫైఏళ్ల నాడు మొదటిసారి కలిసినపుడు మోహన్ కొత్తగా అనిపించలేదు. కనిపించలేదు. మాట్లాడుతూన్నప్పుడు యీయన ఆచితూచి మాట్లాడతాడని అర్థమైంది. అదేంకాదని, మాట తీరే అంతని నిలకడ మీద గ్రహించాను. నాకు కొత్తగా అనిపించిందల్లా మోహన్ గీత. ఆకారాలు, అక్షరాలు కొడవళ్లు కొడవళ్లుగా కనిపించేవి. ధిక్కారం ధ్వనించేది. మోహన్ అంటే కమ్యూనిస్టు భావాలున్న ఆర్టిస్ట్ అని బెజవాడ మిత్రులు నన్ను హెచ్చరించారు. వాళ్లంతే, ఏదీ సూచించరు హెచ్చరిస్తారు. పదేళ్ల తర్వాత దీన్నే “సామాజిక స్పృహ” అంటారని గుంటూరు మిత్రులు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారు. ఎంతైనా వ్యక్తీకరణలో గుంటూరుకో మర్యాద హుందాతనం వుంటాయి. మాది గుంటూరే! ఆనక నేను హైదరాబాదు వచ్చాక ప్రతి అడ్డమైన చోటా మోహన్ సంతకం దృగ్గోచరం కాసాగింది. నేనాయన కళను ఎంతగానో యిష్టపడ్డాను. అంతగానూ అభిమానించాను. లేకుంటే దృగ్గోచరం అనే శబ్దం వాడను. యుగం ఏదైనా, పాత్ర పౌరాణికమైనా జానపదమైనా ఆ సామాజిక స్పృహ మోహన్‌ని వదలదు. భీముడైనా, కృష్ణుడైనా, బకాసురుడైనా యీసురోమంటూ ఎముకలు బయటేసుకుని జాలిగా కనిపిస్తారు. హనుమంతుడుకి సముద్రం దాటేప్పుడు బోలెడు ఎక్స్‌ప్రెషన్స్‌ని పెడతారు మోహన్. అది తన పని కాదు, తన రాజుది రాజ్యానిది అంతకంటే కాదు. మరెందుకింతటి దుస్సాహసానికి ఒడి కట్టాలి? కట్టాలి. అంతే! జాంబవంతుడు లాంటి సీనియర్స్, “నీకు కెపాసిటీ వుంది.. వుంది” అంటూ ధూపం వేసి ఎగిరేదాకా కేకలేస్తూనే వున్నారు. కాబోలనుకుని హనుమంతుడు లంఘించాడు. అదే మరి కమ్యూనిజమ్ అంటే. అందరూ కలిసి ఒక్కడి టాలెంట్‌ని వెలికి తీయడం! మోహన్ ఆ కోతి ముఖంలో యీ ఇజాలన్నింటిని దర్శింపచేస్తారు. అదీ ఆయన కమిటెడ్ ప్రతిభ.

sarasam1అప్పుడెప్పుడో “నీహార్ ఆన్‌లైన్” అని ఒక పోర్టల్ పుట్టింది. దాని అనకొమ్మ సరసమ్‌డాట్‌కామ్. వారం వారం ఇరవై వెబ్‌పేజీలు. అయ్య బాబోయ్! కడుపుబ్బి నవ్వుకునే హాస్యం, వ్యంగ్యం, అవహేళన, పేరడీలు గారడీలు వుండేవి అందులో. శ్రీరమణ అక్షరాలకు తన రేఖా విలాసంతో గంధపు పూతలు పెట్టేవారు మోహన్. చప్పన్న దేశాలలో తెలుగు వచ్చినవారు రాని వారు కూడా ముందాశ్చర్యపోయి తర్వాత నవ్వుకున్నారు. ఇందుకు లక్షలాది క్లిక్కులే సాక్ష్యం. దాదాపు వంద వారాల పాటు కొనసాగిన యీ మా జుగల్‌బందీ అనితరసాధ్యం. అసలిప్పుడు మాకే అసాధ్యం. అదొక్కొక్క సమయం. ఇప్పుడు కెసిఆర్ తెలంగాణ సాధించాలంటే అసాధ్యం. నాడది నల్లేరు మీద బండి. నాడు మోహన్‌తో కలిసి ఆ బండిని కేక్‌వాక్ గానే నడిపించాను. ఇది ఎప్పటికీ నాకో మంచి జ్ఞాపకం. దర్మిలా ఆంధ్రజ్యోతి (డైలీ) ఆదివారం చిలకలపందిరిలో మళ్లీ మా డ్యూయెట్ సాగింది. అది కూడా వన్స్‌మోర్ అనిపించుకుంది.

మోహన్ అందరిలా ఆలోచించడు. ఒకలా కాకుండా మరోలా ఆలోచిస్తాడు. భావప్రకటనలో తెగిస్తాడు. శివుడు సైతం తలపాగాలో కొడవలి దోపుకుని కనిపిస్తాడు. మోహన్ మంచి రచయిత. పదునైన వచనం రాయగలరు. శైలి సమ్మోహనంగా వుంటుంది. రకరకాల సాహిత్యాలు బాగా చదివిన అనుభవం లేకపోతే అలాగ రాయలేరు. మోహన్ వ్యక్తుల గురించి రాస్తున్నా, పుస్తకానికి ముందుమాట రాస్తున్నా పొగడ్తలు చాలా పొదుపుగా వాడతారు. అందుకని నాకు మరీ యిష్టం. ఆర్ట్ మీద ఆర్టిస్ట్‌ల మీద మోహన్ వ్యాసాలు చదివేవారికి అర్థమై కావల్సినవారికి కొంచెం వుపయోగపడతాయి. మెచ్చినా మెచ్చకున్నా, అందరికీ నచ్చినా నచ్చకపోయినా తన శైలి తనదే! నా “వెంకట సత్య స్టాలిన్” జ్ఞాపకాల పాతరకి బొమ్మలు వేసిచ్చారు – ముఖచిత్రంతో సహా. పుస్తకం యింకా రాలేదు. సత్యస్టాలిన్ చాలా గొప్ప ఆల్‌రౌండర్. మోహన్ యింతగా ఎదగడానికి సత్యస్టా దోహదపడ్డాడేమో తెలియదు.

Mo-3

కవళికల్లో మోహన్‌కి అడవిదొంగ వీరప్పన్‌కి చాలా పోలికలు కనిపిస్తాయి. నైజం విషయం అంటారా నాకు వీరప్పన్‌తో ఎక్కువ పరిచయం లేదు. అయితే, మోహన్‌కి సొంత అడివి వుంది. అందులో ఎందరో నటవిటగాయక ప్రముఖులు వర్ధమానులు వున్నారు. ఇక కుంచెలవారు నిబ్బులవారు సరేసరి. అడివిలో తిరుగాడుతూ, దొరికిన చోట దప్పికలు తీర్చుకుంటూ, చిరుమేతలు మేస్తూ జంగిల్‌ లా పాటిస్తూ కనిపిస్తారు. అక్కడ పగలూ రాత్రీ తేడా తెలియదు. వేటాడక తిండి దొరకదు. అక్కడ నీ నా బేధం లేకుండా సీసా నించి సిస్టమ్‍ దాకా వినియోగానికి గురి అవుతూవుంటాయి. మోహన్ వునికి బెరుముడా ట్రయాంగిల్ లాంటిది. లాగేస్తది.

మోహన్ కోరి తయారు చెయ్యకపోయినా కనీసం ఓ పాతికమంది ఆర్టిస్టులు ఆయన లైట్ అండ్ షేడ్ లో తయారయారు. పీఠాధిపతికి వుండే స్థాయి ఆయనకువుంది. కొందరు సమున్నత స్థాయిలో బొమ్మలు వేస్తూ పేరుతెచ్చుకున్నవారు వున్నారు. కాని బొమ్మలు వేసే వేళ మీసాలు పీక్కునే చేవాటం మాత్రం అందరికీ అబ్బింది. అది భావి తరాలకు కూడా పాకుతుందని ఆశిద్దాం.

రాష్ట్రంలో వుప్పెనల్లా వచ్చిన వుద్యమాల వెనక మోహన్ పోస్టర్లు వున్నాయి. జెండా నడవదు, కాని నడిపిస్తుంది. కారికేచర్లు, కార్టూనిస్టులస్ట్రేషన్లు గీయడంలో మొదటి స్థానాలు ఆయనవే. అభిమానాలకు, ఆపేక్షలకు అర్థం తెలిసినవాడు. అందరూ అభిమానించే చిత్రకారుడు మోహన్. వర్ధిల్లుగాక!

– శ్రీరమణ

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, డిసెంబర్, వ్యాసం and tagged , , , , , , , , .

5 Comments

  1. మోహన్ గీత, ఆకారాలు, అక్షరాలూ కొడవళ్ళు, కొడవళ్ళు గా కనిపించాయట. ‘జెండా నడవదు కానీ నడిపిస్తుంది’. మంచి ‘మిత్ర వైరుధ్యమే’ వీరిద్దరిదీ. బాగుంది.

  2. బాపూ చెప్పినట్లు శ్రీ రమణ గారి వాక్యం తెలుగు’ధనం అని తెలుసు… ఇపుడిక వజ్ర సమానంగా మెరుస్తోంది…వెంకట్రామా అండ్ కో! పవర్ పేట!, ఏలూరు! ఆ తెలుగు రైమ్…మోహన్ గారిది ఏలూరని తెలియడం ఎన్నెన్ని ఆశ్చర్యాలో! అదేదో సినిమాలో మీది తెనాలి మాది తెనాలి అన్నట్లుగా…అంత సంబరంగానూ ఉంది. మోహన్ గారూ పుట్టిన రోజు జేజేలు – మల్లీశ్వరి

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.