cover

పెళ్ళిపందిరి

Download PDF EPUB MOBI

పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఇవన్నీ ఉంటేనే పెళ్ళా అంటే… ఉంటే బాగుంటుంది నిండుగా. మూడేళ్ళుగా ఒక్కపెళ్లికీ పిలుపులేదేమో రఘూ పెళ్ళనీ అదీ పల్లెటూరిలో అనీ తెలీగానే నాకు భలే సంతోషం వేసింది. నాకు దూరమైన నా తమ్ముడి తర్వాత తమ్ముడిలాంటివాడు రఘు. సొంత తమ్ముడి పెళ్లిలో మసిలే యోగం ఎలాగా లేదు. అక్కడ నేను చేయాలనుకున్నంత హడావిడీ ఇక్కడ రఘు పెళ్లిలో చేయాలనుకున్నాను. అర్ధరాత్రి ముహూర్తం అని శుభలేఖలో చూడగానే చాలా ఊహించేసుకున్నాను. చిక్కని రాత్రిలో చందమామ సాక్షిగా పెళ్ళి. పొగ మంచు కప్పేసుకుని, మంచు బిందువులతో ముస్తాబైన పచ్చని పంటపొలాలు, పాడి గెదెలు, పాల బిందెల మోతలు, పేడకళ్లాపులు, పిండి ముగ్గులు, రంగురంగుల పూల పెరళ్ళు, చలికాలంలో సాయంత్రం వేసే గడ్డి మంటలు, అమాయకమైన పలకరింపులు… తలుచుకుంటేనే ఎంత ఆనందంగా అనిపించిందో.

నెలరోజుల ముందు నుంచే నా ప్రయాణం సరంజామా సర్దడం మొదలైపోయింది. ఇంత హడావుడి పెళ్లివారింటిలోనూ ఉండదనుకుంట. స్వయంగా పెళ్ళికొడుకే “ఇంకా వారం ఉందిగా అక్కా బట్టలు అవీ కొనుక్కోటానికి” అనేవాడు. మరి నేనో… నచ్చిన చీరలు, వాటిమీదకు బ్లౌజులు, మేచింగ్ గాజులు, ఇలా నెల ముందు నుండీ ఏదోటి కొంటూనే ఉన్నాను.

అక్కడ ఉండేది రెండే రోజులని ఆయన ముందు నుండీ చెపుతున్నా, కార్యం అయ్యేదాకా రానంటే రానన్నాను. మూడురోజుల బట్టలు సర్దుకుంటే పోయేది, వారానికి సరిపడా సర్దాను. రెండు పెద్ద బేగ్గులు తయారైయ్యాయి. వాటిని చూసి మోత మోయాల్సిన ఆయన ఎక్కడ ప్రయాణం వద్దంటారో అనే భయంతో బేగ్గులు మంచాలకిందా, గూళ్ళల్లోనూ దాచాను.

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కాని సరిగ్గా ప్రయాణానికి ముందురోజు ఆయనకు సుస్తీ చేసింది. నూట రెండు జ్వరం. “ఇక ఊరు ప్రయాణం లేనట్టేనా, ఏ చిరుతిళ్ళు తినేసాడో మహానుభావుడు అనుకుంటూ మనసులోనే తిట్టుకున్నాను”.

నీరసంతో మూలుగుతున్న ఆయనకు జ్వరం బాధకన్నా నా ప్రయాణం పోటు ఎక్కువైపోయింది. పిచ్చిగా పెరిగిన గడ్డాన్ని తీయించుకోమంటే అసలే ఒంట్లో కుదురుగా లేని తను నామీద అంతెత్తున లేచాడు. నాకూ పంతం పెరిగి పట్టుబట్టాను. అయినా లొంగకపోతే సరే ఇంకో రూటులో వద్దామని, “ఐతే పెళ్ళికి రామని చెప్పేస్తాలే” అని ఊరకనే రఘుకి ఫోన్ చేసి “మేము రావడంలేదు” అని తను వినేలా చెప్పాను. అటునుండీ నా మాటవిన్న రఘు ఏవిటని గానీ ఎందుకని గానీ కారణాలు అడగకుండానే మౌనంగా అలిగి ఫోన్ పెట్టేసాడు. ఇటు చూస్తే ఈ జడపదార్థం చిన్న కదలిక కూడా లేకుండా ముడుచుకు పడుకుంది. రేపు ప్రయాణం ఉన్నట్టా లేనట్టా ఏం తెలియకుండా ఉంది. పాలవాడికి, పేపర్ వాడికీ రెండురోజులు ఉండమ్ అని చెప్పేశాను. ఇరుగు పొరుగు వాళ్లకు ఊరెళుతున్నామని ఓ వాళ్లు విసుక్కునే వరకూ నించో పెట్టి చెప్పేశాను. రాత్రి నిద్రలేదు. ఆలోచనల్లో అంతా పెళ్లి సందడే. చివరకు మర్నాడు ఆఖరుక్షణం దాకా ఏమీ తేలకుండా, ఎవరూ ఒక మెట్టంటే మెట్టు కూడా దిగకుండా, పోట్లాట పరాకాష్టకు చేరనిచ్చి, ఇంకో అరగంట అటూ ఇటూ ఐతే బస్సు మిస్సవుతుందన్న పరిస్థితి వచ్చాకా ఎలాగో సంధి కుదుర్చుకుని… ఇద్దరం మా చిన్నోడితో ప్రయాణమయ్యాం.

ఉదయం పదకుండు గంటలకు జూబ్లీ బస్టేషన్‌లో మొదలైంది ప్రయాణం. ప్రయాణమంతా బాబును నేనే చూసుకున్నాను. జ్వరం తిక్కలో ఉన్న ఆయనగారు లగేజీ మోయగలను కానీ పిల్లాడి సంగతి నువ్వే చూసుకోవాలన్నారు. చేసేదేం లేక మనసులోనే తిట్టుకున్నాను. ఇప్పుడుకాదు ఇంటికెళ్ళాకా అప్పుడు చెపుతాన్నీపని అంటూ మూలుక్కున్నాను. సూపర్లగ్జరీ బస్సులో వాడు వేశాకా ఇక చూడకతప్పని సినిమాలు చూసుకుంటూ మధ్యమధ్యలో కిటికీలోంచి మిట్టమధ్యాన్నమల్లా సాయంత్రంగా మారుతూంటాన్ని చూస్తూ మా పిల్లాడు సీట్ల మీదకెక్కి పాసింజర్ల జుట్లు పీకటానికి ఎగబడుతుంటే వాడ్ని అదుపు చేస్తూ ఇలా జరిగిపోయింది. బస్సులో ఉండగానే ఆరింటికే చలి, దాని కూడా చీకటి ఆవరించేసింది చుట్టూ. రాత్రి ఎనిమిదికి నిజామాబాద్‌లో ఓ చిన్నపల్లెటూరు వర్నిలో దిగాం. రేపటి ముహూర్తానికే ఇంకొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టున్నాయి ఊళ్ళో. ఆ సందడి తెలుస్తూంది.

ఈ ఊరు తెలంగాణలోనే ఉన్నా ఇక్కడ ఎక్కువ కుటుంబాలు ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన కమ్మోళ్ళవి. అమ్మానాన్నలు ఆంధ్రయాస మాట్లాడితే, పిల్లలు తెలంగాణయాస మాట్లాడుతున్నారు. పద్ధతులు కూడా అటు తెలంగాణవీ ఇటు ఆంధ్రావీ కలిసిపోయి వున్నాయి. పల్లెటూరు కాబట్టి ఎనిమిదంటే పది కింద లెక్క. ఆ పాటికే భోజనాలు కానిచ్చేసి పడుకునేవేళ. కుశలప్రశ్నల తర్వాత స్నానాలు చేసి, భోజనాలకు కూర్చున్నాం. కమ్మని నెయ్యి, గడ్డ పెరుగు, వంకాయి పచ్చడి, అది తింటుంటే ఎప్పుడో చిన్ననాడు పరిచయం ఉన్న రుచి నాలుకమీద తగిలి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో ప్రత్యక్షం అయ్యాయి.

మేం దిగిన విడిదింటి వాతావరణంలో పెళ్ళి సందడి పెద్దగా లేదనిపించింది. ఆ చలికదా అంతా పెద్దవాళ్ళు రేపు చూసుకుందాంలే అనుకుని మనసుకు కాస్త నచ్చజెప్పుకున్నాను. మా బుజ్జోడు ఇక్కడ రాత్రి రెండు దాటితేగాని పడుకోడు, అలాంటిది అక్కడ పన్నెండు తర్వాత మేలుకోవడం చిత్రంగా చూసారు. ఓ కబుర్లుల్లేవు, పలకరింపులు లేవు అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు చలికి. ఈయన, రఘు వేరే ఇంటికి పడుకుందుకు వెళ్ళిపోయారు. అంత కొత్తచోటులో హడావుడిగా నన్ను పలకరించడానికి బయలుదేరింది ఓ దోమల గుంపు, రాత్రంతా వాటితో చర్చలు జరపడంతోనే సరిపోయింది. నిద్ర పట్టలేదు.

అందరికన్నా ముందుగా తెల్లారుజాము మూడుగంటలకే నిద్రలేచి కూర్చున్నాను. నా తరువాత ఒక్కొక్కరూ నిద్రలేచారు. బైట చాలా చలిగా ఉంది. కొబ్బరి మట్టలతో, కట్టెలతో గాడిపొయ్యి వెలిగించాను. మసిపట్టిన బానలో వేణ్ణీళ్లు కాగుతుంటే పొయ్యి ముందుకూచుని చలి కాగటం భలే అనిపించింది. నెమ్మదిగా అందరితోపాటు స్నానాలు ముగించి చీరకట్టుకుని ముస్తాబైపోయాను.

మహానగరంలో కనిపించని జీవుల్ని, ఈ ఊరిలో నా బుజ్జోడికి పరిచయం చేసాను. ఇదిగో నువ్వు తాగుతావే ఆ పాలు ఇచ్చేది ఇదేరా బుజ్జీ అంటూ ఆవును, ఇంకా కుక్కల్నీ, మేకల్నీ, కోళ్లనీ ఇలా నాకు కనిపించిన జంతువులన్నీ చూపించాను. రాట పాతడం అయింది. గుమ్మం ముందు తాటాకుల పందిరి వేశారు. పెళ్ళికొడుకుని చేయడానికి సన్నాహాలు జరుగుతుండగానే అక్కడకు దగ్గరలో ఉన్న పెళ్ళి కూతురింటికి ఓ పలకరింపు విసరడానికి వెళ్ళాను. మనసారా అంతా పలకరించారు. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికూతురితో ఫోన్లలో పరిచయం అయింది కాబట్టి ఆ అమ్మాయితో కాసేపు గడిపి సాయంత్రం పెళ్ళికి కలుస్తా అని చెప్పి వచ్చాను. మధ్యాహ్నం భోజనాల తర్వాత, కాలిగోళ్ల తంతూ అదీ అయ్యేసరికి నెమ్మదిగా సాయంత్రం అయ్యింది. రఘుని పెళ్ళి కొడుకు ముస్తాబులో వీధులన్నీ ఊరేగించి తీసుకువచ్చారు. అంతా పక్క వీధికి పెళ్ళికి తరలి వెళ్ళాం. పానకాల తంతు అయిపోయిం తర్వాత, చక్కని భోజనం చేసాకా, చలీ దాంతోపాటూ చీకటీ దోమలదండూ పలకరించడానికి వచ్చాయి నన్ను. ఎంతని కాపలాకాయను పిల్లాణ్ని కుట్టకుండా, నెమ్మదిగా నాలో ఉత్సాహం సన్నగిల్లుతుంది.

పెళ్ళిలో పెట్టుపోతల విషయంలో జరిగే వాదులాటలు ఎలాగూ ఉండనే ఉంటాయి. వాటితోపాటు నాకు తెలియని పాత పేచీలేమున్నాయో తెలియదుగానీ, ఆడవాళ్ళలో సైలెంట్ యుద్ధాలు చాలా అవుతున్నట్టు చూచాయగా తెలుస్తుంది. ఇది మా ఆనవాయి కాదని కొందరు, ఈ పద్ధతి మాకు లేదంటూ కొందరు. వీటన్నిటి మధ్యా పెళ్ళికూతురికి, నలుగు స్నానాలు లేవు, పసుపుకొట్టడాలు లేవు, అప్పగింతలు లేవు. కాస్త సమయం తరువాత పరిసరాలతో మారే పద్దతులను పట్టించుకోకూడదని అనిపించింది. పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, తెలిసిన పద్దతులు, సాంప్రదాయాలు, మనిషిపై ఎంతగా ప్రభావాన్ని చూపుతాయో నెమ్మదిగా భోదపడసాగింది. మొదట నామనసే నాకు ఎదురుతిరిగినా నెమ్మదిగా సర్దుకుంది. కొన్ని తంతులు తూతూమంత్రంగా ఐపోయినా, కొన్ని మాత్రం బాగా కుదిరాయి. పాత పెళ్ళిళ్ళ తరహాలో పెళ్ళిపందిరి ఆడంబరం లేకుండా బాగుంది. చలికి అందరం వణుకుతూ పందిరి చుట్టూ మూగి కూర్చున్నాం. వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు పెళ్ళి తంతుని సాఫీగా సాగిపోనీకుండా వాళ్ళ ఆల్బమ్స్‌కి నప్పే ఫోజుల కోసం సాధ్యమైనంతగా అటకాయిస్తూ అందర్నీ విసిగిస్తున్నారు. మంత్రాల విషయంలో డౌటున్నప్పుడల్లా పంతులు బాండుమేళాన్ని వాయించండీ అని పురమాయించి నోరు కదిపేస్తున్నాడు. రఘు స్నేహితులంతా కలిసి పందిరి ముందుభాగం అంతా ఆక్రమించి అతన్ని కామెంట్లతో ఎంత ఇబ్బంది పెట్టగలరో అంతా పెడుతున్నారు. ముహూర్తం దాటిపోతోందేమోనన్న తొందర. అటు అక్షింతలు, ఇటు నురగల స్ప్రే బాటిళ్ళు.. ఈమధ్య అన్ని పెళ్ళిళ్లలాగే కాస్త మనపద్ధతి, కాస్త పెడపద్ధతీ కలిసి జరిగిపోయింది. రఘూని పీటలమీద చూస్తుంటే నా తమ్ముడు మనసులో మెదిలాడు. నాకళ్ళు తెలియకుండానే కన్నీరు పెట్టాయి. ఓ ఇద్దరు అపరిచితులను ఒక్కటిగా పెనవేసే పెళ్ళి అనే బంధం నాకు ఇప్పుడు మరీ కొత్తగా కనిపించింది. మరుసటి రోజు కార్యానిక్కూడా ఉండమని అంతా బతిమాలినా, ఈ చలిలో ఇంకో రాత్రి అటు పిల్లాడ్నీ, ఇటు వంట్లో బాలేని ఈయన్నీ ఎలా సంభాళించుకోవాలో అని భయమేసి బయల్దేరదీశాను. మళ్ళీ సూపర్ లగ్జరీ బస్సెక్కి మహానగరం కాలుష్యంలోకి.

*

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, మ్యూజింగ్స్ and tagged , , , , .

2 Comments

  1. “కమ్మని నెయ్యి, గడ్డ పెరుగు, వంకాయి పచ్చడి, అది తింటుంటే ఎప్పుడో చిన్ననాడు పరిచయం ఉన్న రుచి నాలుకమీద తగిలి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో ప్రత్యక్షం అయ్యాయి. … తలుచుకుంటేనే ఎంత ఆనందంగా అనిపించిందో “ మహానగరం కాలుష్యం నుండీ పల్లెటూరుకి మీ పెళ్లి ప్రయాణం. అభినందన చందనాలు శ్రీ శాంతి గారు.

  2. బాగుందండీ మీ పెళ్ళి ప్రయాణం. పోన్లెండి … మరోసారి వాళ్ళకి పిల్లో/పిల్లోడో పుడితే బారసాలకు వెల్దురుగానీ . అప్పుడు ఏకంగా వారం ఉండిపోదురు. ఈ లోపు గడ్డాలు పెరక్కుండా ఉండే మందేదయినా తెలిస్తే మీ చెవిలో వేస్తాను. సుబ్బరంగా తను నిద్రలో ఉన్నప్పుడు చెంపలకి పూసేద్దురు గానీ!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.