cover

#witchORbitch

Download PDF EPUB MOBI

#witchORbitch – చాన్నాళ్ళు ట్రెండింగ్‍లో కొనసాగిన హాష్‍టాగ్. దాదాపుగా ప్రతి హాష్‍టాగ్ వెనుకా ఉన్నట్టే దీని వెనుకా కొందరు మనుషులు, కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ రాత్రి ఆమె ఏ ఉద్దేశ్యంతో అతడికి మెయిల్ చేసిందో ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు డిజిటిల్ మీడియాలోని ప్రజానీకం. వాదోపవాదాలు గొడవలుగా మారాయి.

ఈ గొడవంతా మొదలవ్వడానికి ముందు డిజిటల్ ప్రపంచం ప్రశాంతంగా ఉన్న ఆ రాత్రి, ఆమె మాత్రం తీవ్రమైన అలజడితో కొట్టుమిట్టాడింది. రోజూవారి పనితో ఆమె బిజిగా లేదని కాదు, అయినా అతడితో జరిగిన వాదులాటను మర్చిపోలేకపోయింది. అదేం పెద్దది కాదు. అదే మాటా అతడూ అనుండేవాడు మర్నాడు, పట్టించుకోనవసరం లేదని, మర్చిపొమ్మని.

అతడికి సంబంధించిన ఏదీ ఆమెకు చిన్న విషయం కాదు. అది అతడికి అర్థం కాదు. ఎప్పుడూ వినేదే అని మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఆ అలజడిలో, ఆమె ఆమె. ఆమె అతడు కూడా. ఆమె వాళ్ళిద్దరి మధ్యనున్న వారధి. ఆ వారధిని కూల్చే విస్ఫోటనం కూడా ఆమే. ఆమెలో ఈ రూపాలన్నీ అక్షరధారలై అతడి మెయిల్ బాక్స్ లో మెయిల్‍గా ఆవిర్భవించాయి.

ఆడ్స్, నోటిఫికేషన్స్, స్పామ్, ఆమె మెయిల్. రిప్లై చేయాల్సిన ఆబ్లిగేషన్ లేని మెయిల్స్. ఆ ఉదయం, ఆమెతో ఏదో చిన్న గొడవ లాంటిది జరిగిందని అతడికి లీలగా గుర్తుందిగానీ, బిజీ బిజినెస్ డే లో అది బాక్‍గ్రౌండ్ అయిపోయింది. అర్థరాత్రి ఆఫీసునుండి వచ్చాక, అలసిపోయిన శరీరాన్ని మంచాన పడేసి, నిద్ర కరువైన కళ్ళకి పని చెప్పటానికి తెరచిన లాప్‍టాప్‍లోఆమె మెయిల్ కనిపించింది.

చదవటం మొదలెట్టాడు. చదువుతూనే నిద్రలోకి జారుకున్నాడు.

మర్నాడు, ఉదయాన్నే అతడి కుటుంబసభ్యులు అలవాటుగా ఫోన్ చేశారు. బదులు రాలేదు. రాత్రి ఆలస్యం అవ్వడం వల్ల ఇంకా నిద్రపోతున్నాడనుకొని ఊరుకున్నారు. ఆమె కూడా చేసింది. ఫోన్ మోగి, మోగి ఆగిపోయింది. అతడి సెల్ అయినా బదులిచ్చినందుకు ఆమె సంతోషించింది.

మధ్యాహ్నం పన్నెండింటికి అతడి ఫ్రెండొకడు వచ్చాడు ఇంటికి. తలుపెంత కొట్టినా తెరవలేదు. ఫోన్ చేసినా ఎత్తలేదు. కంగారుగా, తమ వాట్సాప్ గ్రూప్‌లో ఈ విషయం టైపు చేశాడు. డుప్లికేట్ కీ తన దగ్గర ఉందని ఇంకొకడు మెసేజ్ పెట్టి, కీ తో పాటు చేరుకున్నాడు పది నిమిషాల్లో.

కీ పనిచేసింది. కానీ తలుపు మాత్రం అంగుళం కూడా జరగలేదు. బలమంతా ఉపయోగించి నెట్టడానికి ప్రయత్నించారు ఇద్దరూ. కొద్దిగా జరిగి మళ్ళీ మూసుకుపోయింది. మళ్ళీ బలాన్నంతా ఉపయోగించారు. తలుపు కొద్దిగా జరిగినట్టు అనిపించింది. తెరుచుకున్న కాస్త సందులోనూ ఒకడు చేయి పెట్టాడు. చేతికి ఏవో తగిలాయి. కొన్ని అతని మీదకు పాకాయి. అతడు వెంటనే చేతిని వెనక్కి తీసుకొని, పక్కన ఉన్నవాడికి చూపించాడు. ఇద్దరికీ ఏమీ పాలుపోలేదు. వాట్సాప్‌ గ్రూప్‌లో తక్కినవారందరికి “ఎమెర్జన్సీ. స్టార్ట్ నౌ!” అని అరిచినంత పనిచేశారు.

వాళ్ళ గ్యాంగే ఒక ఐదారుగురు వచ్చారు. వీళ్ల కంగారు చూసి ఎదురుబొదురు ఫ్లాట్స్ లో ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చి చేరారు. తర్జనభర్జనల తర్వాత, తలుపు తెర్చుకోవడం లేదు కాబట్టి కిటికి నుండి ఏం జరిగిందో చూడాలనుకున్నారు. అందుగ్గానూ ఒక కుర్రాడిని పైపు ద్వారా కిటికి చేరుకునేలా చేశారు. ఆ కుర్రాడు, కిటికిలోంచి చూస్తూ ఉండిపోయాడు. ఏం చూస్తున్నాడో చెప్పలేకపోయాడు. చెప్పడానికి ప్రయత్నించినవేవీ కిందనున్న వాళ్ళకి అర్థం కాలేదు. కిటికి తలుపులు తెరవమన్నారు. ఆ కుర్రాడు కిటికి తలుపులు వెనక్కుతోసి, పైపు మీదకు ఉరికి, దాన్ని బల్లిలా పట్టుకొని ఉన్నాడు. తెరుచుకున్న కిటికిల్లోంచి వెల్లువలా ఏవో వచ్చి పడ్డాయి.

అప్పటికే అక్కడ గుమ్మిగూడిన కొంతమందిలో వాళ్ళు చూస్తున్నది ఓ వింతని పసిగట్టిన ఒక్కరిద్దరు ఆ వెల్లువను ఫోటోలుగా, వీడియోగా తీశారు. ఓ అపార్ట్మెంట్ కిటికి. అందులో ధారగా పొంగుకొస్తున్నవేవో. పక్కనే పైపుకి అతుక్కున్న కుర్రాడు. దాన్ని ఫేస్‍బుక్, ట్విటర్లలో అప్‍లోడ్ చేశారు.

వచ్చి పడుతున్నవేంటో ఎవరికి అర్థం కాలేదు. వాటి మధ్యన, లోపల అతడు ఇరుక్కుపోయాడన్న నిజం అతడి సన్నిహితులను, శ్రేయోభిలాషులను కంగారు పెట్టింది. ఫ్లాట్‌కున్న అన్ని కిటికిలు, వెంటిలేటర్లు తెరిపించి ఆ వింతవి వీలైనంతగా బయటకి వచ్చేలా చూశారు. మొహాలకి, కాళ్ళూ చేతులకీ కవర్లు తొడుక్కొని, పలుగూ, పారా తీసుకొని, తలుపు బద్దలు కొట్టుకొని లోపలకి జొరబడ్డారు. వాటిని ఎత్తిపోస్తూ, బెడ్‌రూమ్ వరకూ దారి చేసుకుంటూ వెళ్ళారు. ఊహించినట్టే, అతడు వాటికింద కూరుకొనిపోయి ఉన్నాడు. వెంటనే ఆంబులెన్స్ పిలిపించారు.

అదే పూట, ఆ అపార్ట్మెంట్స్ లో ఏదో అత్తాకోడళ్ళ గేమ్ షో షూటింగ్‌కని ఒక ఛానెల్ వాళ్ళు వచ్చున్నారు. టివిలో కనిపించడానికి తెగ ముస్తాబై వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా మాయమైపోతుండడంతో, అనుమానం వచ్చి ఆ షో హోస్టేస్ అటు పక్కెళ్ళి చూస్తే, ఒక కిటికిలోంచి ఏవో చినుకులు కురుస్తున్నట్టు కిందకు రాలుతున్నాయి. అందరిలానే, ఆమెకు ఏమీ అర్థం కాలేదుగానీ, వెంటనే వాళ్ళ న్యూస్ ఛానెల్‍లోనే పనిచేస్తున్న తన బాయ్‍ఫ్రెండ్‍కి ఆ అపార్ట్మెంట్స్ అడ్రస్ మెసేజ్ చేసింది.

మొదట చేరుకున్న న్యూస్ ఛానెళ్ళ వాళ్ళు ఉబ్బితబ్బైపోయారు. ఎక్స్-క్లూజివ్‍ పిక్చర్స్ ను బ్రేకింగ్ న్యూస్ కింద విడుదల చేశారు. అప్పటికే, సోషల్ మీడియాలో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు అప్‍డేట్ చేసిన వీడియోలను, ఫోటోలను తీసుకుని కొన్ని ఛానెల్స్ వార్తను చూపెట్టటం మొదలెట్టారు. వార్త ఊపందుకుంటుందని గ్రహించి, మీడియా వాళ్ళ ఇంటి దగ్గర, అతడిని చేర్పించిన ఆసుపత్రి దగ్గర తిష్టవేశారు.

అతడిని తీసుకెళ్ళిన ఆసుపత్రిలో డాక్టర్లు ఏమయ్యిందని అడిగారు. అదే అర్థం కావటం లేదని చెప్తే, పోలీసులొస్తే తప్ప అడ్మిట్ చేసుకోమన్నారు. అప్పటికే, తమ అపార్ట్మెంట్స్ లో అంత్రాక్స్ లాంటిదేదో పుట్టుకొచ్చిందని ఓ హడావిడి మనిషి పోలీసులకి కాల్ చేశాడు.

అపార్ట్మెంట్స్ కి చేరుకున్న పోలీసులు జరిగిందేమిటో అక్కడున్న వాళ్ళని కనుక్కొని, అతడు తప్పించి ఆ వింతవాటి వల్ల మరెవ్వరికి హాని జరగలేదని నిర్ధారించుకొని, ఆ ఫ్లాట్‍లోకి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఎస్సై ధైర్యం చేసి వాటిని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. అవి మరీ మెత్తగా లేవు. గట్టిగా లేవు. పరికించగా కొన్నింటి ఆకారాలు తెలిసినట్టే అనిపించాయి. వాటిని చిటికెడు తీసుకొని, మరో అరచేతిలోకి వేసుకొని, వీలైనంతగా వాటిని విడదీసి పేర్చాడు. ఆయన ధైర్య సాహసాలకి పెద్దలు అబ్బురపోయి చూశారు. అక్కడ గుమ్మిగూడిన జనంలో పిల్లలు మాత్రం ఆయన గాల్లో లేపి పట్టుకున్న ప్రతి ఆకారాన్ని గుర్తుపట్టి, దాని పేరును అరవడం మొదలుపెట్టారు. “ఏ”, “ఉ”, “ఎమ్.”, “హా”, “జ”, “ఎల్”…

సాంపిల్స్ ని లాబ్‌కి పంపారు. అప్పటికే వార్త దేశమంతా పాకింది. వార్త విన్న ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. అతడి ఊరూ, పేరూ, ఉద్యోగంతో సహా మీడియాలో వినిపిస్తున్నాయి. అతడు కాదనుకోడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఆమె అతడిని చేర్పించిన ఆసుపత్రికి చేరుకుంది. డాక్టర్లు అప్పుడే ఏమీ చెప్పలేమని పెదవి విరిచారు.

ఇదో కొత్త రకం టెర్రరిస్ట్ అటాక్ అని పుకార్లు లేచాయి. అదేం కాదు, ఇవి కేవలం టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్‍లో ఉన్న అక్షరాల ఆకారాలని, ప్లాస్టిక్ తో చేయబడినవని, ఎలాంటి హానీ లేదని సాంపిల్స్ పరీక్షించిన సైంటిస్టులు చెప్పారు. అతడు కేవలం ఊపిరాడకపోవడం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాడని, మిగితా అంతా బానే ఉందని డాక్టర్లు ప్రకటించారు.

జనాలు తమ ప్రాణాలకు గండం లేదనగానే ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కొన్ని ప్రశ్నలు అందరిని వేధించాయి – అవి ఏవైనాగానీ ఎలా వచ్చాయి? అన్ని ఎలా వచ్చాయి? ఎక్కడ నుండి వచ్చాయి? ఎవరు పంపితే వచ్చాయి?

అతడి ఫ్లాట్‌ను తనిఖీ చేసిన పోలీసులు కొన్ని సమాధానాలు కనుక్కున్నారు. అతడి మంచం మీద స్లీప్ మోడ్‌లో ఒక లాప్‌టాప్ ఉందని. దాన్ని అన్‌లాక్ చేస్తే ఆక్టివ్ విండోలోని ఆక్టివ్ టాబ్‌నుండి ఇంకా కొన్ని అక్షరాలు రాలుతున్నాయని. అందులో ఒక మెయిల్ తెరచి ఉందని.

మళ్ళీ ప్రశ్నలు – ఎవరా మెయిల్ రాసింది? ఎందుకు రాశారు? ఏమని రాశారు?

మీడియా కొన్ని ప్రశ్నలకు జవాబులు పట్టుకొంది, తన స్టైల్లో — ఆ మెయిల్ రాసింది ఎవరనేది ఇప్పుడు దేశాన్ని వేధిస్తున్న ప్రశ్న? అది ఆమె! ఆమె! ఆమే! ప్రపంచం దృష్టిలో “ఫ్రెండ్స్”గా ముసుగేసుకొని చెలామణి అవుతున్న వాళ్ళిద్దరి అసలు బంఢారం మీకు తెలుసా? ఆమె అతడిని ప్రేమించింది. అతడు కాదన్నాడు. ఆమె ఊరుకోలేదు. ప్రేమించమని వెంటపడింది. వేధించింది. చివరకు అతడి ప్రాణం తీయడానికి ఇలా పన్నాగం చేసింది. (ఇవ్వన్నీ చేరవేయడానికి విశ్వసనీయ వర్గాలు అతడి ఈమెయిల్‍ను హాక్ చేశాయి.)

bitch R witchసోషల్ మీడియాలో తొలి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. డిజిటల్ మీడియా ప్రజానీకం, ఈ వార్తలో ప్రతి చిన్న విషయాన్ని తమ శాయశక్తులా శ్రద్ధగా ఫాలో అయ్యి, లైక్ చేసి, షేర్ చేసుకున్నారు. ఆమె అతడిపై హత్యాయత్నం చేసిందన్న ఊహాగానం సోషల్ నెట్వర్క్స్ లో పెనుతుఫానయ్యింది. మొదట టెర్రరిస్ట్ అటాక్ అనుకున్నది కాస్త ఇప్పుడో మామూలు “నాకు దక్కనిది మరెవ్వరికి దక్కనివ్వను” అనే సోది టాలీవుడ్ విలన్‍ కథలా మారినందుకు కొందరు నిరాశచెందారు. ఆమెకి #mailkiller అని నామకరణం చేశారు కొందరు. దేశంలో మగవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందని వాపోయిన మరికొందరు #withYouBro అంటూ అతడికి సంఘీభావం వ్యక్తం చేశారు. ఆమెకి ఇంకా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడానికి మొగ్గుచూపిన ఇంకొందరు ఆమె #witchORbitch అన్న ప్రశ్న లేపారు. నూట నలభై కారెక్టర్లు దాటి మాట్లాడుకోని డిజిటల్ యుగంలో అవతలివాళ్ళని చంపేంత భారీగా ఉత్తరాలు రాసే మూర్ఖులు ఎలా ఉంటారనేది అంతుబట్టలేదు చాలామందికి. “లిఖె జొ మెయిల్ తుఝె…వొ తెరి నఫ్‍రత్ మె.. హజార్ తరహ్‍ కె ఖతెరె బన్‍గయె..” అని పేరడీలు మొదలయ్యాయి. ఇంటర్నెట్ జోకులు లెక్కకు మించిపోయాయి.

ఆమె ఆమే అని మీడియా తేల్చేశాక, ఆమె ఇంక ఇంటి బయట కాలు పెట్టలేని పరిస్థితి. ఇంటి చుట్టూ మీడియా, ఆమెను ఇంటర్వ్యూ, ఇన్నర్ వ్యూ ఇవ్వమంటూ. ఆమె మాట్లాడ్డానికి నిరాకరించింది – మీడియా వాళ్ళతో, తనవాళ్ళతో. పరిస్థితి ఇంత చేయిదాటిపోయాక, అసలేం జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో ఆమెకే అర్థం కాలేదు. ఆమె నేరం చేయడం వల్లే మాట్లాడ్డం లేదని మీడియా నిర్ధారించింది. ఆమె గురించి అనేక రకాల కథనాలు వచ్చాయి. వాటి అన్నింటి మధ్యా అతడి ఆరోగ్య పరిస్థితి తెలిపే స్క్రోలింగ్ కోసం ఆమె చూస్తూ ఉండేది.

“మీరు వాళ్ళపై కేసులు వేస్తున్నారా?”, “మీరు వాళ్ళ చేత కేసులు వేయించుకుంటున్నారా?” అని మీడియా ఆ రెండు కుటుంబాల వెంటపడ్డారు. విసిగించారు. మారు వేషాల్లో తిరుగుతున్నా పసిగట్టి అవే ప్రశ్నలు అడిగారు. అతడింకా కోలుకోకపోవడంతో, అతడి తరఫున అతడి కుటుంబసభ్యుల్లో ఒకరు వచ్చి, “మేము దీన్నో అక్సిడెంటని అనుకుంటున్నాం. మేమే కేసూ వేయడం లేదు.” అని చెప్పారు.

“కేసు మేం వేస్తున్నాం!” అన్నారు ఎవరో ప్రపంచంలో ఇంకో మూలనుండి. అందరూ అటువైపు చూశారు.

అన్నవాళ్ళే ఇంకొన్ని ప్రశ్నలు లేపారు: అసలు తెరిచి ఉన్న మెయిల్ నుండి అక్షరాలు పుట్టుకురావటం ఏంటి? వచ్చినవి వచ్చినట్టు ఉండకుండా అంతలా మల్టిప్లై ఎలా అయ్యాయి?

వాళ్ళే జవాబులకు హింట్స్ అందించారు: నాన్ లివింగ్ థింగ్స్ ను సృష్టించే టెక్నాలజి కొన్ని పెద్ద టెక్ కంపెనీల దగ్గర ఉంది. వర్చువల్ వరల్డ్ లో దోచుకోడానికి ఇంకేం మిగలక, ఇప్పుడిలా అక్షరాల ఆకారాలతో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి, వాటిలో నానో కెమరాలు పెట్టి, రియల్ వరల్డ్ లోని డేటాను కూడా లాక్కునేందుకు చూసినా చూడచ్చు కదా? ఇంతకీ, ఈ సంఘటన జరిగినప్పుడు, వాళ్ళిద్దరూ వాడిన మెయిల్ డొమేన్ ఏ కంపెనీది? వాళ్ళిద్దరూ వాడిన బ్రౌజర్లు?

అందరూ ఒకే కంపెనీ వైపు చూశారు. అదీ ఇదీ అని లేక, ఇంటెర్నెట్‌లో అన్ని సర్వీసులూ అందించడంలో మార్కెట్‌ను ఆక్రమించుకున్న ఆ జెయింట్ కంపెనీ ఆ చూపుల నుండి దాక్కోలేకపోయింది.

నెట్‌లో ప్రైవసీ లేదు. మన డేటా అంతా మరొకడి సొత్తు. కానీ ఇప్పుడు సెక్యూరిటి కూడా లేదు. ఒక మామూలు మెయిల్ ప్రాణం తీసేంత దాకా రాగలిగిందంటే, ఇంకేమేం జరగచ్చో ఊహించుకోండి – అని రెచ్చగొట్టారు కేసు వేస్తున్నామన్నవాళ్ళు.

ప్రపంచం ఉలిక్కిపడింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వస్తే ఆన్‌లైన్ మర్డర్లకు తెరలేస్తుందన్న హెచ్చరికలను ఆ టెక్నాలిజిస్ ఇంకా లాబ్‌లో ఉన్నాయనుకొని కొట్టిపారేసినవారు ఇప్పుడవి తమ బెడ్రూమ్‌లోకి రావొచ్చునని భయపడి చచ్చారు. ఆ భయాన్నంతా ఇంటర్నెట్‍లోనే పంచుకున్నారు.

అప్పటిదాకా #mailkiller అనిపించుకున్న ఆమెపై ఇప్పుడు బోలెడు సింపథీ కురిసింది, ఓ జెయింట్ కంపెనీ ప్రయోగంలో పావుగా మారిపోయిన విక్టిమ్ అయినందుకు. ఆమె బిచ్ కాదు, పాపం ప్రేమలో ఉన్న ఒక మామూలు మనిషి అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని విమర్శలకు, విసుర్లకు ఆమె వహించిన మౌనం ఋషులను తలపించేదని కథనాలు వచ్చాయి. మామూలు మనుషులకు సాధ్యమవ్వని గుణాలు ఆమెకున్నాయని, ఆమె విచ్ అని అనుకున్నారు. ఎండని, వానని, ఆకలిని, నిద్రని, చెమటని మర్చిపోయి అలుపెరుగక తమ లైకులు, షేర్లు, అప్‍లోడ్లతో ఆ కంపెనీ సామ్రాజ్యం విస్తరించడానికి దోహదపడిన తమలాంటి అమయాకులను చంపేంత వరకూ వచ్చినందుకు అందరికీ కోపం వచ్చింది.

ఇవన్నీ కిట్టనివాళ్ళ పన్నాగాలని ఆ కంపెనీ ఎదురుతిరిగింది. తమ మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఆయా దేశాలను కోరింది. జరిగిన విపత్తుకి తమ సర్వీసులకి ఏ సంబంధం లేదని నిరూపించుకునేందుకు వీలుగా ఆమెను, అతడిని న్యూట్రల్ లాబ్స్ లో జరిగే ఎక్సిపరిమెంట్స్ లో పాల్గొనేలా ఆదేశించాలని భారతీయ కోర్టులను అభ్యర్థించింది.

అనుమతి వచ్చీరాగానే ఆమెపై ప్రయోగాలు మొదలైయ్యాయి. ఆమె చేత అప్పటికే గీగాబైట్ల మెయిల్స్ రాయించినా అక్షరాలు పుట్టుకురాలేదు. అతడికి స్పృహ రావడమే తరువాయి కోర్టు సమ్మన్లు చూపించారు. అతడికి పరిస్థితి అర్థమయ్యే లోపు లాబ్‌కు తరలించారు.

వాళ్ళచేత మెకానికల్‍గా ఎన్నిసార్లు సినారియో రిపీట్ చేసినా లాభముండదని గ్రహించి వాళ్ళద్దిరికి కొంచెం సమయం ఇచ్చారు.

అతడు శారీరికంగా అలసిపోయున్నాడు. ఆమె మానసికంగా. అయినా, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉన్నది, ఇంకా మిగిలుంది. అది మళ్ళీ చిగురించింది. అతడి మనసు గెల్చుకునే అవకాశం ఇంకా ఉందనే చిన్న ఆశ కూడా పుట్టిందామెకు.

షరా మామూలుగానే ఆమె ఆశ పుట్టీపుట్టగానే చచ్చిపోయింది. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అభిప్రాయబేధాలు తలెత్తాయి. అతడు గొడవ మధ్యలోనే అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆమె మెయిల్ రాసింది కాసేపటికి. మరి కాసేపటికి అతడా ఉత్తరం చదివాడు.

అక్షరాలు పుట్టుకొచ్చాయి. అతడి ఎదురుగా ఉన్న స్క్రీన్‌ నుండే కాక, పక్కకు మళ్ళించిన అదే మెయిల్, వేరే ఈమెయిల్ డొమెన్, వేరే బ్రౌజర్ నుండి కూడా అక్షరాలు బయలుదేరాయి. వెంటనే అందరూ అప్రమత్తులయ్యారు.

ఈసారి అతడు మెలకువగానే ఉన్నాడు. ఆ అక్షరాలు వస్తున్న చోట వేలు పెట్టాడు. అవి అతడి వేలు మీదకు ఎక్కాయి. అతడిని తడిమాయి. నిమిరాయి. అతడింకా వాటిని ఇంకా నమ్మలేకుండా చూస్తున్నప్పుడే వాళ్ళొచ్చి అతడిని పక్కకు తీసుకెళ్ళిపోయారు.

పోయినసారిలా కుప్పలకుప్పల అక్షరాలు పుట్టుకొస్తాయని అందరూ కంగారు పడ్డారు. ఆ ఆవరణ నుండి అందరిని పక్కకు పంపేశారు.

కానీ, ఈసారి కొన్నింటితోనే ఆగిపోయాయి. ఆమె వైపు వెళ్ళి చూస్తే, అప్పటికే ఆమె పడిపోయుంది. ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి ఆమె ఊపిరి వదిలింది.

ప్రపంచం ఊపిరి తీసుకుంది, ఇంటర్నెట్ పై భయాలేవీ అవసరం లేదని. ఆమె #witchORbitch అన్న డిబేట్ మళ్ళీ మొదలయ్యింది. లీక్ అయిన వాళ్ళ మెయిల్స్ మీద సైకలాజికల్ అనాలిసిస్ జరిగింది. ప్రేమ టెక్నాలజికి, సైన్స్ కి మించిందని, ఆమె తన ఘాటైన ఫీలింగ్స్ వల్లే అలా అక్షరాలు కదిలేలా చేయగలిగిందని కొందరు నమ్మటం మొదలెట్టారు. ఇది టెక్నినికల్ mishap అని, ఆ కంపెనీవాళ్ళు తమ పరపతి వాడుకొని కేసు నుండి బయటపడ్డారని ఇంకొందరు బల్ల గుద్ది చెప్పారు. వీళ్ళ మధ్య హోరాహోరిగా వాదోపవాదాలు జరిగాయి. సెంటిమెంట్ అనాలిసిస్ మీద రిసెర్చ్ చేస్తున్నవాళ్ళకి డేటా దండిగా దొరికింది. ఫీలింగ్‍లోని బలాన్ని బట్టి మెషీన్‍ను కదిలించవచ్చా అనే అంశాన్ని ఒక్కళ్ళిద్దరు పిహెచ్‍డి థీసెస్‍గా తీసుకున్నారు. జరిగినదాని ఆధారంగా కొత్త వీడియో గేమ్‍లు వచ్చాయి.

ఈ మొత్తం ఎపిసోడ్ గురించి అతడి అభిప్రాయం కనుక్కోవాలని మీడియా బాగా ప్రయత్నించింది. అతడు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు — ఇద్దరి మధ్య ఉండాల్సింది ఇందరి మధ్యకు వచ్చాక దాని స్వరూపస్వభావాలే మారిపోతాయి. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు.

కొన్నాళ్ళకు సెన్సేషన్ సద్దుమణిగింది. చానాళ్ళు ట్రెండింగ్‍లో ఆ హాష్‍టాగ్ మరుగునపడిపోయింది – ఎప్పటికీ.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, కథ, డిసెంబర్ and tagged , , , , .

3 Comments

 1. My feedback:

  1. The POV and the description has issues in places. You have chosen a 3rd person POV. You should matters as they unfold. A few places it is too ambiguous. For instance: “ఏం చూస్తున్నాడో చెప్పలేకపోయాడు.” He may not be able to identify it, But he can describe it. Is it liquid or solid? Living or dead? plants or animals? Solid or pieces? The lack of description is perplexing, until later, they are described to be soft plastic letters. It doesn’t look so difficult to describe, if not identified.

  2. The tone taken is even, journalistic tone. That suits these stories as they can be narrated without emotion, but with only soupçon of social commentary. A few places where this even tone is broken — (typically when you break it, you are creating a big effect or a climax). Here are the instances:
  2a. ఆమె వాళ్ళిద్దరి మధ్యనున్న వారధి. ఆ వారధిని కూల్చే విస్ఫోటనం కూడా ఆమే. ఆమెలో ఈ రూపాలన్నీ అక్షరధారలై అతడి మెయిల్ బాక్స్ లో మెయిల్‍గా ఆవిర్భవించాయి. — too different from the rest of the style. Too metaphorical.

  2b. అవతలివాళ్ళని చంపేంత భారీగా ఉత్తరాలు రాసే మూర్ఖులు ఎలా ఉంటారనేది అంతుబట్టలేదు చాలామందికి. — మూర్ఖులు does not fit here. Who passed the judgment? It doesn’t appear to be people. Looks like editorial interjection in what people are (not) saying, which is not warranted.

  2c. The narration is very straight faced, except times like these “మీరు వాళ్ళ చేత కేసులు వేయించుకుంటున్నారా?” — after the belief is suspended the rest doesn’t defy reality. Except for statement like these, which seem to treat the story as a satire. (which it is not). Nix the statement.

  2d. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు. — shouldn’t it be in quotes?

  3. There are some uneven parts. Here are some:
  3a. # witchofbitch — her bitchiness doesn’t even show anywhere. Nobody seemed to accuse her of that. That did not generate discussion. In fact, the gender did not even seem to play a role here. Considering that these words are loaded with gender stereotypes, there isn’t enough justification or discussion around the words.

  3b. The common, mundane, routine conflicts between sexes and the public face of it — I think the climax somehow pulling the punch back. I think the last but one paragraph should have been the last part. It ought to have been couple of sentences more.

  3c. I think the changing nature of communication and the implications — which is the main focus of the story, is submerged in the even journalistic tone. Do break the tone, with quotes from “athadu”, but use it in climax, like I said in 3b.

  Btw, somewhere in the discussion, there was the use of the word “font”. There is a difference between font and script. You mean script, not font.

  Hope this is helpful.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.