cover

“ఎగిరే పావురమా” పుస్తక సమీక్ష

Download PDF EPUB MOBI

‘బహుముఖ ప్రజ్జాశాలి’ అన్న గుణవిశేషణం అతికినట్లు సరిపోయే పేరు శ్రీమతి కోసూరి ఉమాభారతి. ‘కూచిపూడి నృత్యకాళాకారిణి, నాట్యగురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి…’ ఇలా పలురంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల “ఎగిరే పావురమా”.

ఏదైనా సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేసే రచనలు, తమ ఉద్దేశాలను నెరవేర్చుకోగలిగాయా లేదో చెప్పడం కష్టం. ఆలోచింపజేసి, మనసులో మార్పు తెచ్చి సమాజంలోని చెడుని వేలెత్తి చూపి, లోటుపాట్లని సరిజేసుకునేలా ప్రేరేపించడం సామాజిక ప్రయోజనాలను ఆశించే రచనల ఉద్దేశం! ఆ దృష్ట్యా చూస్తే ఈ నవల ఉద్దేశం నెరవేరినట్లే.

భ్రూణ హత్యలు నివారించాలని, ఆడపిల్లలను పురిట్లోనే చంపేయకూడదని, లింగవివక్ష అన్యాయమని చెప్పే నవల “ఎగిరే పావురమా”.

మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని, ఆ పసికందుని పొదల్లో వదిలేసి వెడుతుందో తల్లి. తగిన సంరక్షణలు తీసుకోకపోవడంతో ఆ శిశువుకి అంగవైకల్యం కలుగుతుంది, మాట పోతుంది.

ఓ ముసలాయన ఆ శిశువుని చూసి జాలిపడి, ‘గాయత్రి’ అని పేరు పెట్టి, పెంచి పెద్ద చేస్తాడు. ఈ క్రమంలో ఎందరెందరో వ్యక్తులు గాయత్రి జీవితంలోకి ప్రవేశిస్తారు. కొందరు ఆమెకి మేలు చేస్తే, మరికొందరు ఆమెని వాడుకుందామనుకుంటారు.

కథని గాయత్రి చెబుతుంది, అంటే కథనం ప్రథమ పురుషలో సాగుతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం – ఈ మూడు దశలలో తన జీవితంలో జరిగిన సంఘటనలనూ, తన మనోభావాలను చెబుతూ ఉంటుంది గాయత్రి.

మూగమ్మాయి కదా, ఎలా చెబుతుందీ అని అనుకుంటున్నారు కదూ? ఇక్కడే తెలుస్తుంది రచయిత్రి ప్రతిభ. కథానాయిక తన కథని చెబుతోందని చదువరులకు తెలుసు. ఓ మూగపిల్ల, వికలాంగురాలు, మౌనంగానే, తన కథను ఇతరులకి చెప్పే స్థాయికి వెళ్ళిందంటే…. ఆమె ఎంతో సాధించిందని అర్థం! చదువు నేర్చుకుందని అర్థం! మంచీ చెడులు గ్రహించిందని అర్థం! కమ్యూనికేట్ చేయగలుగుతోందని అర్థం! అంటే… తాను ‘differently abled’ అని నిరూపించుకుందని అర్థం! కథానాయిక ఫ్లాష్‌బ్యాక్ చెప్పినట్లు ఉండదు కానీ, టెక్నిక్ అదే. తన బాల్యం, కౌమారం, యవ్వనం నుంచి వర్తమానం వరకు పాఠకులకు వివరిస్తుంది గాయత్రి. “గతంలోకి వెడితే…” లాంటి వాక్యాలు ఉండవు కానీ, జీవితంలో ఎదిగి, మంచీ చెడుల విచక్షణ సాధించిన స్థితి నుంచి… తాను నిరాదరణకు గురైన రోజులను చదువరులతో పంచుకుంటుంది గాయత్రి. అంటే తన సగం జీవితాన్ని పాఠకుల ముందుంచుతుంది కథానాయిక.

నవల చదువుతున్నప్పుడు, గాయత్రి పాత్ర చాలా passive గా ఉన్నట్లు, సానుభూతిని ఆశిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. ఓ నిస్సహాయ స్థితి నుంచి, జీవితపు బాటలో ఒక్కో అడుగూ వేసుకుంటూ, మౌనంగానే నేర్చుకుంటూ, తనని తాను కాపాడుకుంటుంది. తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్జతా భావం, తన భవిష్యత్తుని బంగారుమయం చేయాలనుకున్న తాత పట్ల ప్రేమాభిమానాలు మొదలైన ఉన్నత భావాలు…. గాయత్రి స్వార్థపరుల చేతికి చిక్కుకున్నాకా… అపోహలకి గురై, తనను ఆదరించిన వ్యక్తులను అనుమానించటం.. చివరికి తన తప్పు తెలుసుకోవటం వంటివి మనకీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. ఈ ఘటనలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి.

కథాగమనంలో చాలా పాత్రలు తారసబడతాయి. ఒక్కో వ్యక్తీ సమాజంలోని ఒక్కో లక్షణానికి ప్రతీక! కథానాయిక గాయత్రి కాకుండా, మిగతా పాత్రలలో అత్యంత ప్రధానమైనవి.. తాత, ఉమ పాత్రలు. కథానాయికను బాల్యంలోనే చేరదీసి, సొంతబిడ్డలా పెంచి, ఓ బతుకుతెరువుని కల్పిస్తాడు తాత. ఇక ఉమ, నవలలో అత్యంత కీలకమైన పాత్ర! తక్కువసార్లు కనబడుతూనే, గాయత్రి జీవితం మేలి మలుపులు తిరగడానికి కారణమవుతుంది. ఓ రకంగా గాయత్రితో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర. తాత దయకి, ఉమ సేవాభావానికి, గుడిపూజారిగారు ధర్మనిరతికి, కమలమ్మ కాపట్యానికి, జేమ్స్ కుత్సితానికి ప్రతిరూపాలయితే, వెన్నెముక లేని వ్యక్తిత్వానికి ప్రతీక గోవిందు. ఎవరి పంథా వారిదే, ఎవరికి వారికి వారి చర్యలని సమర్ధించుకోడానికి ఎన్నెన్నో కారణాలుంటాయి.. ఎవరి వాదన వారికి సమంజసంగానే అనిపిస్తుంది. కాని గాయత్రి దృష్టి కోణం నుంచి చూస్తే ఎవరెవరు తప్పు చేస్తున్నారో అర్థం అవుతుంది. మన మంచితనమే ఎదుటివారిలో ఆలోచనకీ, మార్పుకీ దోహదం చేస్తుందని ‘గోవిందు’ పరివర్తన తెలుపుతుంది. కథలోని ఆయా పాత్రలు మంచితనం, దుష్టత్వం ప్రదర్శించినట్లుగా ఉండవు, వాటి స్వభావరీత్యా ప్రవర్తిస్తాయి అంతే!

ఇలాంటి కథను నడపడంలో ఎంతో నైపుణ్యం కావాలి! ఎందుకంటే కథలో ఉత్కంఠని రేపే మలుపులు ఉండవు… పాఠకుల మనోవికారాలను రెచ్చగొట్టే అంగాంగ వర్ణనలుండవు… ఉద్రేకపరిచే వివాదాలూ లేవు. గల గలా పారే నదిలా… ఓ ఒరవడిలో సాగిపోతుంది కథనం. ఇది మనుషుల కథ… జీవితం కథ. అంతే!

‘ఎగిరే పావురమా’ అనే శీర్షిక ప్రతీకాత్మకం అనిపిస్తుంది. నడవలేని, మాటరాని ఓ అమ్మాయి… జీవితంలో బందీ అయిన ఓ అమ్మాయి.. శృంఖలాలు తెంచుకుని, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ స్వేచ్ఛగా సంచరించే శక్తిని సంతరించుకునే ప్రయత్నమే ఈ నవల సారాంశం.

ఆడపిల్లలు కుటుంబానికి భారం కాదని, మగపిల్లలే కావాలనుకుంటూ, ఆడపిల్లలు అసలే వద్దనుకుంటే… చివరికి ఆ మగపిల్లలని కనడానికి స్త్రీలే ఉండరని ఈ నవల చెబుతుంది. అవసరమైన వారికి సాయం చేయగలగడం, నిస్సహాయులకు ఆసరా ఇవ్వడం, అవకాశమున్నంత మేర తోటివాళ్ళకు నిస్వార్థంగా తోడ్పడడం వంటివి ఎంతటి పేదవాళ్ళనైనా గొప్పవాళ్ళు చేస్తాయని చెబుతుందీ నవల. శారీరక మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకు – సమాజం, ప్రభుత్వం సహకరిస్తే… వాళ్ళు తమలోని సహజ సామర్థ్యాలను వినియోగించుకుని… తమ జీవితాలలో వెలుగు నింపుకుంటారని ఈ నవల చెబుతుంది.

ఆసాంతం చదివాక, ఓ మంచి నవలని చదివామనే అనుభూతిని మిగిల్చే ఈ నవలని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు. అంతకుముందు ప్రముఖ వెబ్ మాగజైన్ “సారంగ”లో సీరియల్‍గా వెలువడింది ఈ నవల.

జీవితాలు వేగవంతమై, తోటివారి గురించి ఆలోచించేంత తీరిక కూడా లేదని భావించేవారికి ఈ నవల కాస్త దారి చూపుతుంది. వ్యష్టి నుంచి సమిష్టిగా మారడమే జీవితం అని చాటి చెప్పే ఈ 184 పేజీల నవల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. వెల 75/- రూపాయలు. ఈ బుక్‌ కినిగెలో లభ్యం. కినిగె వెబ్ సైట్ నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకు పొందవచ్చు.

~ కొల్లూరి సోమ శంకర్

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పుస్తక సమీక్ష and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.