cover

విషాద వెన్నెల నిషాదం

Download PDF EPUB MOBI

ఆజ్ జానేకి జిద్ న కరో

ఫరీదా ఖానమ్

.

చీకటి గది నిండా దివుల పూలు. వుండుండి.. నీలి విషాద మిళిత గుభాళింపులు. గాలి గుబుల ఊసులకి తనూ వూగతూ దర్వాజా పరదాలు.

తనకి మరణం వుంటుందని తెలీదూ? అయితేనేం? -యవ్వనాల మల్లి నవ్వుతూ విరియనంటుందా?

విడిపోతున్నానని తెలిసీ, అనార్కలి తుది శ్వాస వరకు పేరుపెట్టి పిలవకుందా!!

చీకట్లోనే మెరుస్తానంటుంది నక్షత్రం. ఎంతకీ నీ రూపమే మోస్తానంటుంది నయనం.

ఎన్ని కన్నీళ్ళు తాగిన అద్దం ఈ హృదయం.

తీక్షణ వీక్షణాలన్నీ ఇప్పుడు క్షణంక్షణం బేల కన్యలైపోయాయి. ఎడబాటునిక ఏ మాత్రం ఓపనన్నాయి వలపు బాధలు.

* * *

నిశ్చల కాలం – రెక్క లార్చుకుని వాలింది, సందె వేళ గుమ్మంలో.

వలపువన్నె సారంగ దారాలు – గుమ్మాలనూగు రంగుపూల నీడలు.

ఓడిపోయిన ఒంటిరెక్క మందారం.. పిట్ట గోడమీద కనిపిస్తూ అర్ధ చంద్రాకారం.

- నీకై క్షణం క్షణం నా ఈ ప్రతీక్షణలు.. ఎవరికీ వినిపీయని గుండె గానాలు.

గదిలో నీ పద ధ్వనులు మదిలో అత్తరొలికిన సుగంధ శోభలు

ఇక మొదలౌ నని తెలుసులే – విరజాజి చెండు పై వలపువానజల్లులు.

ఏడాదికొకటే వసంతం. నువ్వొస్తే, అది నా ముంగిటే నిరంతరం

* * *

ఎంతగా చెప్పాలనుకున్నాను? వస్తే చాలు. వెళ్తూ మాత్రం – ప్రాణాలను తోడుకుపోకు.

ఊహు. పెదవి కదలనిదే! నమ్మవ్ కానీ, నువ్ నాతో వున్నప్పుడు

ఈ గొంతు నీ స్వరమౌతుంది. నేను అనేదే వుండదు. అంతా నీదైపోతుంది..

 * * *

ప్రేమికులు కోరుకునే చెరసాళ్ళు – ప్రియమయిన కౌగిళ్ళు. అవి – పారిపోను వీలు లేని స్వర్గాలు.

ఆ కాసిన్ని కొసరు క్షణాల కోసమే.. మరుగుతూ ఇన్ని యుగాలూ ఎదురుచూసానా!, అన్నట్టుండె

ఆత్రపు ఆరంభ సంబరాలలో.. నిన్నుస్వాగతించడానికే తప్ప, శాసించడానికెలా ఒప్పుతుంది మనసు?

అయినా సరె.. నన్ను నీతో చెప్పుకోనీ!.. నువు కదిలితే కదిలేది కాలం మాత్రమే అనుకోకు. నా లోని జీవం కూడా.

నువ్ కనిపించక విరహించేది – శరీరమే అని తలచకు. విలపించే హృదయమూ, ఇదేనని మరువకు.

* * *

దీపం తొలగనీయొద్దంటావ్ కానీ.. చీకటి కరుగుతుందనే నా భయాన్ని నువ్వెప్పుడు తీరుస్తావ్?

మరిక ఉంటానేం?…. అంటూ వీడ్కోలుకి సిద్ధమౌతున్న క్షణమల్లా

బలంగా అనిపిస్తుంది. – కదలని శిలైపొమ్మంటూ కాలాన్ని శపించాలని.

* * *

గడపదాటి పోయే నీ అడుగుల వెనకే పరుగులు . ఉసురు పోతూ నా గుండె చప్పుళ్ళూ!

ఖాళీ అయిపోతూ… దారి చివరి మలుపులు. శూన్యాన రగులు సెగలు ఎర్రనిప్పు నిట్టూర్పులు.

కాదనుకోలేని దుఃఖాలే శాశ్వతానందాలు.

తుదిలేని విషాద విందులే – ఈ కథాంతాలు.

కానీ, ఏంలే?

మళ్ళీ నువ్వొచ్చే చివరిక్షణపు కొసకల్లా

స్వప్న సౌధాలు నిర్మించుకోడమే నా వినోదాలు.

నే ప్రియమార లిఖించుకునే నూతన విరహ కావ్యాలు.

రాత్రి కలల దుప్పటి పై

నక్షత్రప్పూల నవ్వు నా సంతకం.

* * *

మరచిపోకు, ప్రియతమా!

నువ్వు రావడం కోసమే నే మిగిలి వుంటాను.

నీ కంటి మెరుపులలోనే జీవిస్తుంటాను.

వచ్చేయ్! ఈసారైనా, ఇక విడిచి పోనంటూ…

రాసిస్తూ – జన్మంతా. నా కళ్ళ ముందే వుంటానంటూ.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, జనవరి, మ్యూజింగ్స్ and tagged , , , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.