cover

ఏకాసొక్కపొద్దు

Download PDF EPUB MOBI

ఏకాశి పండక్కు మావూర్లో ఆండోళ్లంతా ఒక్కపొద్దుంటారు. పగలూ రేత్రీ పండ్లూ, పాలూ తప్ప ఇంగేవిూ ముట్టుకోరు. ముట్టుకోరంటే ముట్టుకుంటారు. ఒక్కపొద్దులేని పిలకాయిల్కి, మొగోళ్లకీ పండక్కు సేసేవన్నీ సేత్తారు.వాళ్లు మాత్తరం తినరు. ఇంగ ఆ రెయ్యంతా జాగారం సేసి తెల్లారేలోపల పొయ్యిముట్టించి అన్నీ సేసి నట్టింట్లో తలిగిలేసి, కాయగొట్టి, కర్పూరమెలిగించి ఆరతిచ్చినాక, ఒక్కపొద్దిడస్తారు. ఇదంతా మసకమసగ్గా వుండంగానే జరిగిపోతాది.

నిద్రమేలుకోని రెయ్యంతా జాగారముండాలంటే కస్టం గదా! అందుకే ఆ పొద్దు రేత్రి మాయమ్మోళ్లు కూడా ఈదిలోకొచ్చి మా మాదిరిగానే కుంటాట, ఉప్పరపట్టి…. ఆట్లాడుకుంటారు. జంగమోళ్ల, పొంబలోళ్ల పాటలు పాడుకుంటారు.

రేపు ఏకాశి పండగనంగా సిగరసెట్ల కింద గొడ్లు గట్టేసిన సోట మాయమ్మ పేండ్లకల్ళెత్తతా వుండాది. ‘నేను యేమిసేతురా ఎల్లమంద నేడు – ఇది యేటి పీడరా దాపురించె నాకూ – ఇది సావనియ్యదూ బతకనియ్యదూ…. ’ అని పొంబళోళ్ల నాగడు పసలబాలరాజు కతలో బాడే పాట బాడుకుంటా మాయమ్మ దెగ్గిరికొచ్చి వాటేసుకునింది కౌసల్యక్క.

మా వూర్లో మాయమ్మ, కౌసల్యక్క, పొన్నెక్క, సాయిత్రక్క, సరోజక్క, సరస్వతక్క…. ఈళ్లంతా కలిసిమెలిసి వుంటారు. మంగసెక్కకు బోయినా, పొరకపుల్లలేరకరాను బొయినా, ఎర్రమొన్నుదేను బొయినా, కసువుకు బొయినా, సెరుకాక్కు బొయినా అందురూ కూడబలుక్కోని ఒగే సోటికి బోతారు. ఆకరికి సిత్తూరికి సినిమాకు బోవాలన్నా, ఇరుగూరు పొరుగూర్లల్లో జరిగే రెయ్యాటకు బోవాలన్నా అంతే.

రేపు రేత్రికి జాగారం సెత్తారు గాదా! కౌసల్యక్క పాటలో ఆ సంతోసమే కన్పించింది.

ఆ రాత్రే మాయమ్మ పెళ్లో తొట్లలోకి, దాలి మింద బానకు, కుడిత్తొట్టికి తటంగలుగా నీళ్లు సేంది పోసేసింది. ఇల్లలికి పిండి ముగ్గులేసి ఎరమన్ను బూసింది. వాకిట్లో పేన్నీళ్లు సల్లి ముగ్గు పిండితో పెద్దపెద్ద ముగ్గులు బోసింది.

నేను, మాయక్క తొట్టినిండా గుమ్మిడిమొగ్గలు దెచ్చి ఇడగేసుండాము. మాయక్క సిత్తూరి స్కూల్నించొస్తా దోవలో వుండే జానకారిపల్లి, కాజూరు, ఇరవారం, గాండ్లకొత్తూరు, మాలపల్లెల్లో వుండే గుమ్మిడి సెట్లలోనించి మొగ్గలు తెంపుకోని టిపను క్యారేజినిండా ఏసుకోనొచ్చింది. నేనూ మావూరి దిబ్బల్లో వుండే సెట్లల్లో పిందిలకుండే మొగ్గల్ని గూడా ఇడవకుండా కోసుకోనొచ్చేసినాను. సాకల ఎత్తిరాజులు పెండ్లామైతే వాళ్ల సెట్లో మొగ్గల్లేవని ‘కాపలా కాసినా ఏ సందులో వొచ్చి కోసుకోని పోతారో నా సవుతులు. కంట్లో పాపని కూడా కత్తరించేస్తార్రా సావిూ’ అని సాపిస్తానే వుండాదింకా. ఆటల్లో లీడరుగా నిలబడాలంటే అందురికంటే జాస్తిగా గుమ్మిడి ముద్దలు పెట్టాల గదా!

మాయమ్మ, మాయవ్వ ఏకాశి ఒక్కపొద్దుంటారు. ఆపొద్దంతా అన్నం దినరు. అంటిపండ్లుదిని పాలు దాగొచ్చు. అయినా పండగ్గదా! అన్నీ జేసింది మాయమ్మ. సుగుంట్లు కాల్చింది. వడలకోసమని పిండి రుబ్బతావుండాది. మెల్లింగా మాయమ్మ దెగ్గిరికి బొయినాను. ‘అమా, నేను గూడా ఒక్కపొద్దుంటాను మా’ అన్న్యాను. ‘ఈ ఒక్కపొద్దు సిన్న పిలకాయిలుండలేరు. పెద్దపండగ, తయామాస, గోయిందాల పండగ్గాదు. పదకొండు పన్నెండు కంతా తళిగిలేసేసి తినేసే దానికి. రేపు తెల్లారేదాకా వుండాల. రేత్రంతా మేలుకోవాల. నీవల్లగాదు’ అనింది.

‘నేనుంటాను మా. ఎన్నిల రాత్రులప్పుడు మేము రెయ్యంతా ఆడుకుంటావుండ్లా. మీ పోరు పల్లేకే మేమొచ్చి పండుకొనేది. అప్పుడు గూడా ఆట్లాడుకోవాలనే వుంటాది. నిద్రపట్టదు. నేను ఒక్కపొద్దుంటానంటే వుంటాను’ అని గెట్టింగానే మొండిపట్టుబట్టినాను.

‘యాడన్నాబో, నీయబ్బతోడు. పెదిమికి మించిన పల్లయి పొయినావు. నువ్వింటావా?’ అనిందో లేదో మూడంటి పండ్లు దెచ్చుకోని మాయమ్మ కెదురుంగా గోడకానుకొని కూసోని తింటావుండాను. నన్ను జూసిన మాయమ్మ మొగం మింద నవ్వు కన్పించింది.

మాయమ్మ పొయ్యిమింద సమురుబోసి పెట్టినప్పట్నుంచి మేమాడే తారట్లాడతా వుంటాము. మాయమ్మ ఏది సేసినా అంత తుంచి దేవునికి పొయ్యిగెడ్డమింద బెట్టి మళ్లి మాకిస్తాది. ఒక్కపొద్దుంటానంట్ని గదా అని నేనాపక్కకు బోలా. మాయమ్మ సుయ్‌ఁ సుయ్‌ఁ అని అలసందొడలు కాలస్సావుంటే గమగమాని వూరంతా వాసనెత్తుకోని పోతావుండాది. మాయక్క, మా పెద్దబ్బోడు గోపి వుడుకుడుకు వడల్ని బాదమాకులో సుట్టితెచ్చుకోని దిన్నిమింద నీరెండలో కూసోని వూదుకోని వూదుకోని తింటావుండారు. నాకు నోటినిండా నీళ్లూరిపోతావుంది. నేనొక్కపొద్దుంటానంట్ని గదా! తింటే వాళ్లు ఎగతాలి సేసి ఏడిపిస్తారు.

వాళ్లు ముందు దెచ్చుకున్నివి తినేసినారు. మాయక్క బొయ్యి మల్లీ కొన్ని దెచ్చి మాయబ్బోనికి రొండిచ్చింది. వాళ్లు నన్ను ‘తింటావా?’ అని అడగలేదు మాయక్కయితే నాకు సూపించి సూపించి తింటావుంది. నాకు రోసం పొడ్సుకోనొస్తావుండాది. వాళ్లేనా దినేది నేనూ దింటా అనుకుంటా గుడ్సింట్లో అడుగుబెట్నాను. మాయమ్మ సెవులో ఎవురికీ ఇన్పించకుండా అడగాలని ఈప్నింద పండుకున్న్యాను. మా యమ్మ వున్నెట్లుండి నన్ను బట్టుకోని ఎనక్కి నెట్టింది.

‘కసమాలమా, కాంగే పెనుముకాణ్ణా నీ సెల్లాటాలు. ఇంకొంచిముండుంటే కాంగే సముర్లో బడేదాన్ని, ఏమొచ్చింది నీకు సేటుగాలం అని తిట్టింది. మల్లీ పండగనాడు పసిబిడ్ని తిట్నానే అనుకునిందేమో! ఏమో! ‘సెప్పు నాయినా’ అని అడిగింది.

నేను ముదిగారాలు బోతా ఈ సారి మెల్లింగా మాయమ్మ ఈప్నిందనుంచి వొంగి మాయమ్మ సెవులో ‘రెండే రొండు వళ్లియిమా. ఎవురికీ తెలీకుండా పెల్లో బాడ్సిసెట్టుకాడ కూసోని తింటాను’ అన్న్యాను. మాయమ్మ మొగం మింద మళ్లీ నవ్వు. ‘అప్పుడే ఒక్కపొద్దిడ్సేస్తావా? ఇదంతా అంటిపండ్లకోసమేసిన యాసలు గాదా. నువ్వు ఆకిలికి కొంచేపు గూడా తాంగలేవు. అన్నం గూడా దినుపో’ అనింది.

‘అట్లయితే నాకు వొడలు గూడా వొద్దులే. ఒక్కపొద్దుంటాను మా అంటే’ అని ఏడుప్మొగం బెట్టినాను. మాయమ్మ పక్కనున్ని బాదమాకు దీసుకొని నాలుగొడలు సుట్టి నా సేతిలో బెట్టింది.

పెల్లో మా బాడ్సిసెట్టుకాడ ఆ పక్క కరేపాకు సెట్టు, కనకాంబరాల సెట్లుండాయి. దానికి మా నాయిన ఎదురు తడిక కట్టుండాడు. సెట్టుకింద ఈ పక్క గోడకానుకోని మామూలు పొయ్యొకటి వుండాది. సిత్తూరు నుంచి బాపనామె పిలకాయిల్తో వొచ్చినా, అమ్మకనాల రంగాచారొచ్చినా మాయమ్మిచ్చే ఉప్పు పప్పు బీము సింతపండు దీసుకోని సేందబాయిలో వాళ్లే నీళ్లు సేందుకోనొచ్చుకోని ఆ పొయ్యిమింద వొండుకోని తింటారు. మేము గొబ్బియ్యాల పండగప్పుడు మాయమ్మ బొమ్మరిల్లు గట్టిస్తే గుజ్జన బువ్వొండుకొనేది ఆడే. ఆ పొయ్యినలికి ముగ్గుబోసి ఎరమన్నుగూడా బూసుండాది మాయమ్మ. అందురూ నీళ్లుబోసుకొనేసినారు. మాయక్క మాయబ్బోడు ఇంటిముందర వాకిట్లో ఆట్లాడుకుంటావుండారు. వాళ్లకు తెలీకుండా తినాలని ఆడొచ్చి పొయ్యిగెడ్డమింద కూసోని పొట్లాన్ని పక్కన బెట్టుకోని ఒక వొడదీసుకోని తింటా వుండాను. బాడ్సి సెట్టుమింద కాకొచ్చి కూసోని ‘కావ్ కావ్’ అని అరస్తా వుండాది. తలపైకెత్తి సూత్తా వుండా. కాకి దబామనొచ్చి ఒక వొడను ఎత్తుకోని ఎగిరి యాడికోపూడ్సింది. నాకేడుపొచ్చేసింది. మల్లీ కాకొస్తాదేమో అని పొట్లం దీసి వొళ్లో కన్పించకుండా బెట్టుకున్న్యాను. వున్నెట్లుండి మాయవ్వొచ్చేసింది. ‘ఏం నాయినా ఈడొకదానివే కూసోని ఏంజేస్తావుండావు?’ అని అడిగింది.

‘ఏం లేదవ్వా కాకులు, రాంసిలకలు సెట్లో వుండే బాడ్సి పూలంతా రాల్చేస్తావుంటే తోలదామని ఈడకూసుంటి’ అంట్ని, ‘బాడ్సి పూలకు కాపలావున్నవతాదా? లేసి ఇంట్లోకి బో’ అని ఇంటెనక కట్టిలవామి దెగ్గిరికి బొయ్యింది. మాయవ్వ కట్టిపుల్లలు వాది బెట్టుకోనొచ్చే లోపల వొడలు గబగబా తినేసి, బాదమాకును సెట్లలోకిసిరేసి లేసి నిలబడి పావన్ను ఇదిలిస్తావుండాను.

‘అయ్యయ్యా. ఆ పావడంతా ఏంది సమురు మరకలు. మీయమ్మ పండగని పెట్లోనించి దీసిస్తే నువ్వుదాని సేసుకోనుండే గెతి సూడు’ అని అర్సింది. గుడ్సింట్లో పొయికాడ కట్టెలేసేసి ‘కమలా, అది పావడను జేసుకోనుండే తీరు జూడు’ అనింది. తలుపుకాడ నిల్సుకోనున్ని నన్ను మాయమ్మ ‘ఇట్రా’ అని పిల్సింది. ‘అదే పనిగా బాదమాకులో సుట్టిస్తే పావల్లో బెట్టుకోని తింటావా? నీతో ఎత్తుబారమై పొయ్యింది పాపా’ అని యాస్టపొయ్యింది మాయమ్మ.

‘ఒక్కపొద్దుంటానని వడలు దింటివా? పెల్లో పొయిగెడ్డమింద కూసోనుంటే దేనికాడ కూసోనుండావంటే ఇదేం జెప్పిందో దెల్సా కమలా? కాకులు, గువ్వలు బాడ్సిపూలను రాల్చేస్తా వుండాయంటా. వాటిని తోలతా వుండాననింది. ఇదా నువొక్కపొద్దుండే తీరూ తిర్నాలూ’ అని నవ్వింది మాయవ్వ.

ఈసారి వొడల్ని గిన్నిలోకేసిచ్చి ‘పావడగ్గాని సమురంటిందంటే సెమ్డాతోలు తీసేస్తాను’ అనింది. మాయక్కోళ్ళు సూడకుండా తినాలనివుంది నాకు. అందుకే పెద్దింట్లోకి బొయ్యి దొంతికుండల కానుకోని కూసున్న్యాను. వొడలుండే గిన్నిని దొంతికుండల సందులో బెట్టి ఒగోటే తీసుకోని తింటావుండాను. మాయబ్బోడు పరిగెత్తుకోనొచ్చినాడు. నేను వులిక్కి పడినాను. బొట్ట సందులో బెట్టిన తాడూ బొంగరాన్ని దీస్కోని పరికెత్తినాడు. వాడు నన్ను సూల్లేదు. రొండొడలు తినేసినాను. ఇంగా రొండుండాయి. ఎవురో లోపలికొస్తావున్ని సెపదమొచ్చింది. మూసుడవకుండా కూసోని సూస్తావుండా. వున్నట్లుండి మానాయిన లోపలికొచ్చినాడు. పైకి లెయ్యబొయినాను. కాలు తడబడి దొంతికుండల మింద బన్న్యాను. కింది కుండేమీ కాలేదు గానీ పైనుండే కాలీకుండ, దానిమిందుండే దుత్తవొచ్చి నామిందబడినాయి. ‘అమ్మా’ అని ఏడుపెత్తుకున్న్యానా, అందురూ పరుగెత్తుకోని పెద్దింట్లో కొచ్చేసినారు.

చిల్లాబిల్లా పడిన కుండపెంకుల్ని సూడంగానే మాయమ్మకు యాల్లేని కోపమొచ్చేసింది. నా ఈప్మింద రొండేట్లేసింది. ‘దొంతికుండలు ఆ బిడ్డిమింద బడితే తప్పిందా తగిలిందా అని సూడకుండా దాన్ని బట్టుకోని కొడ్తావా’ అని మా నాయిన నన్నీడ్సుకోని ‘యాడన్నా తగిలిందా నాయనా’ అని వొళ్లంతా తడిమిసూస్తావుండాడు.

‘పండగనాడు బంగారట్లాకుండల్ని పగలగొట్టింది’ అని గొనగతా పెంకుల్నేరి పెద్దపెంకులో యాస్తావుండాది మాయమ్మ.

‘నీకు అరువూ తెరువూ రొండూ లేదు కమలా. పండగనాడు కుండపగిలిపొయ్యిందని అంగలారస్తా వుండావే. వారం వర్జమని ల్యాకుండా ఈ పొద్దుగూడా పసిబిడ్ని బట్టుకోని కొట్నావే దాని కేమనాల?’ అని యాస్టగా మాట్లాడిరది మాయవ్వ.

‘అది పసిబిడ్డా. ఒక్కపొద్దుగూడా వుంటే’ అని నవ్వింది మాయమ్మ. నా సేతిలో సగం తినేసిన వడుంది. దొంతికుండల సందులో వడల గిన్నుంది. అది సూసిన మా నాయిన తాల్వారంలో కూసోని తినొచ్చుగద నాయినా. ఈ మొబ్బింట్లో మూలకూసోని తినకుంటే’ అన్న్యాడు.

‘తాల్వారంలో కూసోని తినడానికి అదేమన్నా ఈ పొద్దు మామూలుగా వుందా. ఏకాశి ఒకపొద్దుండాది గదా!’ అనిందా మాయమ్మ మా నాయిన పక్కున నవ్వి నన్నెత్తుకున్న్యాడు.

‘సుగుంట్లు, వడలు తప్ప ఇంతొరకు ఎవురూ అన్నం మెతుకు ముట్టుకోలేదు. పొయ్యి అన్నం. బెట్టుకొచ్చుకోని తినండి’ అని అర్సింది మాయమ్మ. మాయక్కబొయ్యి మా పెద్దబ్బోడికి పెట్టిచ్చి ఆయమ్మా తట్టకేసకొచ్చుకొనింది. నాకు పెట్టియ్యలేదు. పప్పుకూర బోసుకోని కందగెడ్డ తాళింపు నంచుకుంటా నడవలో కూసోని తింటా వుండారు. ‘నీ ఒక్క పొద్దయి పొయింది గానీ నువ్వూరా తిందువు. ఇంతొరకున్న్యందుకు ఏకంగా వైకుంఠానికే పొయి రావొచ్చు’ అనింది మాయమ్మ నాతో. అది ఎగతాళో, నిజంగానే అంటావుందో అర్తం గాలా.

‘ఒక్క పొద్దుండే వాళ్లెవురూ అన్నం దినరు. దేవునిదెగ్గిర తళిగేసి తినకుండా నా ఒక్క పొద్దు ఎట్లయిపోతాది. నాకు పాలు బోసియ్యి తాగతాను’ అన్న్యాను.

‘ఆఁ .. అంటి పండ్లొద్దా. పాలొకటి సాలా’ అని దాలిమింద పాలసట్టిలో ఎర్రంగా కాంగిన మీగడపాలు కుంబకోళం సెంబు నిండికీ తెచ్చిచ్చింది మాయమ్మ.

వూదుకోని వూదుకోని పాలుదాగతావున్ని నన్ను జూసి తింటావున్ని గిన్నిని దూరంగా తోసేసి ‘నేనూ ఒక్కపొద్దుంటా. నాకూ అంటి పండ్లు పాలూ దెచ్చియ్యి’ అని రాగం దీస్తా ఏడ్వబట్టినాడు మా పెద్దతమ్ముడు గోపి.

‘రేయ్‌, పాలు అంటిపండ్లు దింటే ఆకిలట్లేవుంటాది. అదే బువ్వ, అప్పచ్చులు దింటే రేత్రంతా ఎంతో బాగా అట్లాడుకోవచ్చు. అనింది మాయక్క.

‘మరి సిన్నక్కకు ఆకిలెయదా? అడిగినాడు వాడు. ‘ఆ బిడ్డికూడా ఆకిలేసినప్పుడు అన్నం దినేస్తాది. అట్లా ఒక్కపొదొద్దు మనకు. వొచ్చే సమత్సరం మనం అచ్చంగా ఒక్క పొద్దుందాం. అంటిపండ్లు దినేసి పాలు దాగదాం’ అని యేమేమో సెప్తావుండాది మాయక్క. రస్తాలంటి పొండ్లు దెచ్చి మాయవ్వ తలా ఒగిటిచ్చింది. ‘నేను ఒక్కపొద్దు గదా! నాకు రొండియ్యి’ అన్న్యాను రోసంగా. ‘ఒక పొద్దుకు ఒగటేదినాల ఇప్పటికి అరడజనంటి పండ్లయినాయి. రొండు పొద్దుల కయ్యేన్ని వడలు కుమ్మేసినావు. సెంబుడు పాలుదిగినావు. నాలుగు మెతుకులు గూడా గతికేస్తే పోలా’ అంటా మల్లీ తలా ఒకంటిపండు వొళ్లొకిసిరింది.

వాళ్లు అన్నం దింటావుంటే పప్పుకూర వాసనొస్తావుండాది. ‘ఎప్పుడెప్పుడు తిందారా’ అని వుండాది.పాలు ముందే తాగేసినాను. రొండంటి పండ్లలో ఒగటి తినేసినాను. ఇంగోటుండాది. మెల్లింగా గుడ్సింట్లోకి బొయ్యి బొప్పగిన్నిలో సెద్దిగాళ్లకోసమొండిన వుప్పిడి బీమన్నాన్ని ఏసుకోని కూరబోసు కుంటా వుండాను. మా యమ్మొచ్చేసింది. ‘ఇదెన్నో పొద్దుపాపా. ఎవురికీ కన్పించకుండా ఏ వొంకలోకి బొయి తినేసొస్తావు?’ అనింది. ‘ఇదొకసారేమా. మల్లేమీ తినను’ అన్న్యాను. ‘ఏడ్సినట్లుండాది నీ ఒక్కపొద్దెవ్వారం. సరే! తలుపు దెగ్గిరికేసి పోతా ఈడే గూచ్చోని తినేసిరా’ అని తలుపు దెగ్గిరికేసుకోని పూడ్సింది.

మా యక్కుందే అసాద్దురాలు. నేను గుడ్సింట్లో కొచ్చింది చూసింది గదా! మెల్లింగా పిల్లి మాదిరిగా వొచ్చి తలుపు సందులోంచి సూస్తా వుండాది. ఆ పక్క సూసి బయపడి పొయినాను. ఈలోపలే ‘అమా, అవ్వా ఈ బిడ్డి ఒక్కపొద్దు ఎంతబాగుండాదో సూస్తుర్రండి’ అని అర్సింది.

‘అది పసిబిడ్డి అయినా దానికి ఒక్కపొద్దుండాలనే ఆలోచనన్నా వొచ్చింది. నీకది గూడా లేదే’ అని దెప్పిపొడ్సింది మాయమ్మ. మాయక్క మూతిమూరెడు బెట్టుకోని ‘పాలు, అంటిపండ్లకోసం యాసాలెయడం అందురికీ సేతగాదులే’ అని మా తమ్మున్ని పిల్సుకోని ఈదిలేకి పూడ్సింది. వాళ్లిద్దురెప్పుడూ ఒకే జట్టుంటారు. ఆ గోపిగానికి కూడా మాయక్కంటేనే ఇస్టం. అందుకే వాళ్లను జూస్తే నాకువొళ్లు మంట. యామలత, నీలా వాళ్లతోనే నేనాట్లాడుకొనేది.

ఆ రాత్రంతా ఆట్లాడుకుంటా గూడా అడపాదడపా వడలు, సుగుంట్లు దెచ్చుకోని తింటానే వుండాము. మాయమ్మ శానా కాల్చి ఎదురు బుట్టిల్లోకి ఏసిపెట్టుండాది గదా!

దీపాలు బెట్టే యాళయిందో లేదో ఇంట్లో వాళ్లకు అన్నాలు బెట్టేసి సట్టీకుండా గిన్న్యాసెంబులు తోమి ఎగబెట్టుకోని అంతా ఈదుల్లోకి వొచ్చేసినారు ఆండోళ్లు. మాయమ్మోళ్లంతా పొన్నెక్కోళ్ల కడప్మెట్లమింద సేరినారు. కురప సీరాముడోళ్ల కడపలో, రాగిరెడ్డోళ్ల దిన్నె మింద, నడీదిలో కొత్తపల్లి రెడ్డోలింటికాడ, సాకల మంగోళ్లింటి ముందర, సమేగానింటికాడ, వొడ్డి పాపిగానింటి మెట్లమింద, గాండ్ల సెట్టి గుడ్సిముందర. సారాయంగిడి లచ్చుంబాయింటి పందిట్లో యాడజూసినా ఆండోళ్లు కూసోని ఒకటే మాటలు. నేను, నీల, యామలత, కాంత వూరంతా ఒక సుట్టేసుకోని రచ్చబండ దెగ్గిరికొచ్చినాము. పిలకాయిలమంతా కాసరబీసరని అర్సుకుంటా ఆట్లాడుకుంటా వుండాము. మాయమ్మ మామాదిరిగా ఆట్లాడుకోను ఈదిలోకి వొచ్చినందుకు శాణా కుశాలగా వుండాది నాకు.

కొంచేపిటికి మాయమ్మోళ్లంతా కొంగులెగజెక్కోని కుంటాటాడతావుంటే మేము ఎగిరేదిడ్సిపెట్టి ఆడజేరినాము. మాయమ్మ పనిపాటల్లోనేగాదు ఆటపాటల్లోనూ గబురు. ఒక వర్సకే కుంటుకుంటా నలుగుర్ని అంటి పారేసింది. జట్లుగా ఇడిపొయ్యేటప్పుడు మాయమ్మ వాళ్లపక్క రావాలని ఎందుకు మొండిగా జగడమేస్తారోతెలుసా. మా యమ్మునిందనుకో ఓడిపొయ్యేదుండదు. అందుకు

రొడ్డోళ్ల సెంద్రన్ని సెంబులో నీళ్లుదెమ్మని ఆడ్రేసింది కౌసల్యక్క. ఆ నీల్లను మద్దిలో అడ్డంగా పట్టమాదిరిగా పోసింది. ముందు సెరువా, గట్టా ఆడినారు. ఆపైన బల్చిప్లాం డూడుడూడు ఆడినారు. ఉప్పర పట్టాటాడినారు. అలిసిపోయి ఒగసోట కూసేని కతలు,పాటలు మొదులు బెట్న్యారు. మాయమ్మ, కౌసల్యక్క జంగమోళ్ల పాటలు, పొంబలోళ్ల పాటలు వాళ్లు ఈది నాటకమేసేటప్పుడు ఎవురెవరు ఎట్లపాడతారో అచ్చం అట్లే పాడతారు.

‘ఉత్తరాదియా బూమియందున కర్ణాటాకా బూమియందునా

శాంబపురియా పట్నమున్నదయ్యా                                            ‘తందానా…’

ఆ పట్నము యేలే కాంబోజరాజు…..’ అని మాయమ్మ పాడంగాన్నే కౌసల్యక్క గొంతు కలిపింది. ఆట్లాడుకొనే పిలకాయిలంతా ఆడేది వొదిలిపెట్టి ఆడికొచ్చి కూసున్న్యాము. ‘మొగ యాసకాలేసే జంగమోళ్ల లచ్చుమయ్య ఎట్ల పాడతాడో ఒక నుడుగు ఇనిపించే కమలా ‘అని అడిగింది పొన్నెక్క. పాపం వాళ్లొస్తే దినాము ఒకూరోళ్లు వక్కాకు పెడ్తారా! పొగులు నిద్ర యాడ సరిపోతాది. అందుకే తెల్లారుజామున నిద్రబోతా తూలతా పాడేవోడు లచ్చుమయ్య. కౌసల్యక్కెత్తుకునింది.

‘ఏమే భామామణీ, ముద్దులొలికే సిన్నదానా ముద్దియ్యవే ` వొక్క ముద్దియ్యవే’ అని నిద్రబోతా పాడినట్ల పాడతావుంటే అందురూ ఇరగబడి నవ్వినారు. జంగమోళ్ల నర్సయ్య, బోడోడు, పొంబలోళ్ల సెంగడు, గోయిందుడు అందురు పాడేవి కొంచిం కొంచిం పాడి ఇన్పించినారు. ‘వాళ్లపాటలు ఎంత బాగుంటాయో ఇంకా ఇందామా అనేట్లుగా’ అనింది సంపూర్ణక్క.

‘వాళ్ల పాటలట్లబోనీ. యాసాలు, పొగులు జూస్తే కల్లో కొచ్చే నల్లంగా వుండే అమ్మకణాల సెంగల్రాయుడు మొగానికి అద్దలమేసుకోని సీరగట్టుకోని జడా, పూలు బెట్టుకుంటే సూన్ను రొండు కండ్లు సరిపోతాయా?’ అనింది ఆదెమ్మ పెద్దమ్మ.

‘బారతం రెయ్యాటలో ఏనుగుంటపల్లిలో ద్రౌపది సీరలిప్పేటప్పుడు వాడెవుడోగాని 14 సీరలు గట్టుకున్న్యాడు ఒకదానిమిందొకటి. దుశ్శాసనుడు సీరలు లాగతావుంటే జనాలందురూ సీరల్నిలెక్కబెట్టేవోళ్లే. అన్ని సీరలు గట్టినోడు బుట్టిబొమ్మమాదిరున్న్యాడా అంటే వూహూఁ… లేదే ఒగసీరగట్టుకున్ని ఆడదున్న్యట్లే వున్న్యాడు’ సరస్పతక్క సెప్పింది.

‘సురబోళ్ల నాటకాల గురించి సెప్పాల్నా సరస్పతీ. వాళ్లు తెరల్లోనే కోటల్ని, అంతప్పురాల్ని సూపించేస్తారు’ అనింది మాయమ్మ. మా వూర్లో అందురమ్మోళ్లకంటే మాయమ్మకే తెలివెక్కువ’ అనుకుంట్ని.

వీళ్లిట్లా మాట్లాడుకుంటా వుంటే సిలగుండ్లపల్లి లచ్చుమక్క దిన్నికానుకోని నిద్రబోతావుంది. కొందుకు పిలకాయిలు గూడా ఆడే నిద్రబొయినారు. ‘లెయ్యండిరక కూసుంటే తూంగొస్తాది. జాగారముండీ లాబముండదు’ అని అందుర్నీ లేవదీసింది కౌసల్యక్క.

పిలకాయిలంతా యాడబొయినారో కన్పించలేదు. నిద్రొస్తావుంటే ఇండ్లకు పూడ్సినట్లుండారు. మేమొక ఐదారు మంది మాత్రమే ఉండాము. నువ్వు గుమ్మిడిసెట్టు. నువ్వు సిక్కుడుసెట్టు, నువ్వు వొంకాయిసెట్టు అని మమ్మల్ని ఆడొకర్ని ఈడొకర్ని కూసోబెట్టినారు.

పెద్దోళ్లు ‘గుమ్మిడిసెట్టుకు నీళ్లు గట్టేది నేనే, గుమ్మిడి కాయిల్ని కాయించేది నేనే’ అని మా సుట్టూ కుంటతా ఆడుకున్న్యారు. సంపూర్ణక్కొచ్చి మా యబ్బోన్ని లేపుకోని దూరంగా పూడ్సింది. ‘మా సెట్లో గుమ్మిడికాయనెవురో కోసుకోని బొయినారు నువు జూస్తివా నువ్వు జూస్తివా’ అంటా సరస్పతక్క అందుర్నీ అడిగింది. ఇట్లా ఈయాట కొంచేపాడినాక ‘సిట్టీ పుట్టిందా ఆడదామింక…’ అనింది పొన్నెక్క.

పిల్లాపెద్దా వుండేవోళ్లంతా ‘లాట్‌ బూట్‌ సీట్‌’ ఏసి రొండు గుంపులుగా ఇడిపొయినాము. ఎదురుబదురుగా పదడుగుల దూరమిడ్సి నిలబడినాక ఒకరి బుజంమిందొకరు సేతులు కూర్సుకున్న్యాము. ఆపక్కోళ్లు -

‘సిట్టీ పుట్టిందా – సిట్టెక్కా పుట్టిందా

దాదీ పుట్టిందా – దామరమొగ్గా పుట్టిందా’ అని పాడతా మాదెగ్గిరి కొచ్చి అట్టే ఎనక్కినడ్సినారు. ‘సిట్టీ పుట్టిందీ – సిట్టెక్కా పుట్టిందీ’ అని పాడతా మేము వాళ్లదెగ్గిరికి పొయి ఎనక్కొచ్చినాము.

‘సిట్టికి ఏంపేరు……’ అనుకుంటా వాళ్లొచ్చినారు.

ఇట్లా అన్ని ఇసయాలు సెప్పుకున్న్యాక వాళ్లు

‘గుజ గుజ రేకుల పిల్లుందా – గుజ్జారేకుల పిల్లుందా

సావిూదండల పిల్లుందా – సహరాజులు మెచ్చగ పిల్లుందా’ అని వొచ్చినారు. వీళ్లు వుందని సెప్పినారు. వాళ్లు ‘మా పిల్లోడికిస్తారా’ అని అడిగినారు. వీళ్లు ఇస్తామన్న్యారు. వాళ్లు ఏం కట్నమని అడిగితే వీళ్లు సెప్పినారు. ఇట్లా నగలు, సీరలు ఏమేమి బెట్తారో అన్నీ మాట్లాడుకున్న్యాక రొండు గుంపుల్లోని వాళ్లు మద్దిలో సేరి నాకూ, ఆ పక్క జట్టులోని యామలతకూ పెండ్లి సేసినారు.

పెండ్లి సేసినారు గాని పెండ్లి,కూతురోళ్లు సరింగా మర్యాదలు సెయ్యలేదని

‘ఉంటానికి వసతి లేదు

తింటానికి తిండిలేదు

కట్టుకోను కోకల్లేవు

అంటకోను ఆమిదం లేదు’ అని పక్క గుంపులో వాళ్లు అన్న్యారు.

‘వైశాకమాసాన వారింట పెండ్లి

వల్లబుడు మాయన్న పెండ్లి సేయించే

మిల్లి తడవొకుండ బొట్టుపడకుండా

నేర్పుగా పెద్దొదినె సేతులొడ్డించే

అంతకన్న నేర్పరే సిన్నన్న వొదినే

ఆకాశాన మిల్లి ఆడిరచి పోయే’ అని ఈ పక్క పెండ్లి కూతిరికి – అంటే నాకు అమ్మగా వున్ని కౌసల్యక్క వాళ్లను దెప్పిపొడ్సింది. సివరికి మా గుంపులో వాళ్లు కండ్లు తుడ్సుకుంటా నన్ను వాళ్లతో పంపించినారు.

అన్ని ఆటలకంటే ఈ ఆటే అందురూ బాగుందన్న్యారు. ‘సూర్యుడు బుట్టేలోపల ఒక్కపొద్దిడాల గదా! ఇంగ పోదాం పదండి’ అని గుర్తుసేసింది రుక్కమ్మక్క. ‘విూరందరూ ఒక్కపొద్దే. మా సినపాపైతే మూడు పొద్దులుండాది’ అని అందురితో సెప్పింది మాయమ్మ. ఏనుగెక్కినంత సంతోసమైంది నాకు. ఇంటికి పొయింది తెలుసు.

‘ఒక్కపొద్దు జాగారం వుంటానని కుంబకర్ణుని సెల్లెలి మాదిరిగా ఇంగా పండుకోనుండావా? మద్ద్యానమవతావుండాది లెయ్యి’ అని నిద్రలేపింది నన్ను మాయమ్మ.

‘నేను ల్యాకుండా ఎందుకు ఒక్కపొద్దిడ్సేసినార’ని ఏడ్సినాను. తళిగేసి, టెంకాయగొట్టి, కర్పూరం ఆరతిస్తేగానీ అన్నం దిననని మొండికేసినాను.

‘రేయ్‌ కోదండా ఆ సినబ్బను పిల్సిటెంకాయిలు తోసియిమన్రాబ్బా’ అని మాయవ్వ మా నాయినికి సెప్తావుంటే కుశాలయింది నాకు.

*

Download PDF EPUB MOBI

Posted in 2015, ఇర్లచెంగి కథలు, జనవరి, సీరియల్ and tagged , , , , , , .

3 Comments

  1. ఎకాదశి ఒక్కపొద్దు వీదుల్లో ఆడుకుంటూ జాగారం, ఇంకా తెల్లంగా తెల్లారకనే నట్టింట్లో నైవేద్యం పెట్టి భొంచేయడం, యెంత బాగుండేవో ఆరోజులు.

    ఇప్పుడంతా artificial life అయిపొయింది. టివీ ల ముందు తెల్లారిపొతోంది.

    కథ చదువుతుంటే ఆనాటి అనుభూతులు శరీరాన్నంతా తడిమినట్లైంది. ఇర్చ్లచెంగి కథలు సహజంగా చాలా బాగున్నయి.

  2. అసలు సిసలైన సిత్తూరు బాస అదిరింది. మాది కూడా చిత్తూరు జిల్లా, పాలసముద్రం. ఇప్పుడు ఊరి యాసకి దూరంగా ఉన్నా ఈ కథల ద్వారా దేగ్గర్లో ఉన్న భావన కలిగిస్తున్నారు. కృతఙ్ఞతలు! ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.