cover

జూలీ రొమైన్

Download PDF EPUB MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “జూలీ రొమైన్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

జూలీ రొమైన్

గై డి మొపాసా

రెండేళ్లక్రితం ఓ చైత్రవేళ మధ్యధరా సముద్రతీరం వెంబడి తాపీగా నడుస్తున్నాను. ఒంటరిదారిలో నడుస్తూ కలలు కనడానికి మించి సౌఖ్యమేముంటుంది? కొండలెక్కుతున్నప్పుడో, సముద్రపుటొడ్డున నింపాదిగా నడుస్తున్నప్పుడో నులివెచ్చని ఎండనీ, కావలించే తెమ్మెరనీ అనుభవిస్తాం. రికామీదారుల్లో అడుగులేసే మనిషి పగటికలల్లోకి ఆ కొంతసేపు చొరబడేవి ఎన్నిఊహలు, ఏమివింతలు, ఏమేమికవిత్వాలు…! తత్తరపడినవో, ఉల్లాసపరిచేవో ఏవేవో ఆశలు వెచ్చని మంద్రమైన గాలితో కలగలిసి నడిచే వ్యక్తిలోకి చొరబడేస్తాయి; పిల్లతెమ్మెరతో పాటుగా ఆ విశ్వాసాల్ని అతడు గుండెల నిండుగా ఉచ్ఛ్వాసిస్తాడు. అవి అతనిలో సౌఖ్యలాలసని రేపి నడక వల్ల కలిగిన ఆకలి మల్లే అది పెచ్చరిల్లడానికి మూలమౌతాయి. ప్రకృతికి చేరువౌతున్న కొద్దీ నిలకడలేని తీయని తలపులేవో అతని ఆత్మలో గానంచేస్తాయి.

సెయింట్ రఫెల్ నుంచి ఇటలీకి దారితీసే ఆ రోడ్డు వెంట నడిచాను, లేదా భూగోళం మీది ప్రేమ కవితలన్నింటి ఉత్సవానికి సంసిద్ధం చేసినట్టుండే అద్భుత దృశ్య చంచలత్వం గుండా దారితీశాను. కేన్స్ నుంచి మొనకొ వరకూ మధ్య ఉన్న ఈ ప్రాంతానికి ఎన్నో ఇబ్బందులకోర్చి, డబ్బూదస్కం గుల్ల చేస్కొనీ ఎవరైనా వస్తారన్న ఆలోచనే నాకు జాలిగొలుపుతుంది. ఇంపైన ఈ ఆకాశం కింది, అతిశయించిన గులాబీ, కమలా తోటల మధ్య బతకడానికి ఎవరైనా వచ్చారంటే దానికి కారణం ఏవో తెలివిమాలిన సాకులు, పనికిమాలిన ప్రలోభాలే. అంతే కాకుండా, మనిషి బుర్ర ఎంత అవివేకమైందో, అల్పమైదో, ఎంత అహంకారపూరితమో కూడా అది నిరూపిస్తుంది.

మనోహరమైన ఆ తీరాల ఒకానొక ఒంపులో నాలుగైదుకి మించని విల్లాల సముదాయం చూశాను హఠాత్తుగా. పర్వతపాదం దగ్గర, సముద్రానికి అభిముఖంగా ఉన్నదా భవన సముదాయం. వాటి వెనక రెండు గొప్ప లోయల్ని ఏ బాటలూ లేవన్నట్టుగా దట్టంగా కప్పేసిన దేవదారు వృక్షాల చిక్కని వనం. ఆ గిరి కుటీరాల్లో ఒక దాని గేటు ముందు అప్రయత్నంగా ఆగిపోయాను. ఏవో గోధుమ రంగు నగిషీల అందమైన ఆ తెల్లని ఇంటి పైకప్పు ఎగబాకిన గులాబీలతో కప్పిఉంది. ఇంటి చుట్టూ తోటంతా బుద్ధిపూర్వక నిర్లక్ష్యంతో యధేచ్ఛగా పెరిగిన పలువన్నెల చిన్నెల పూలమొక్కల కులుకు.

పూలశయ్య పరిచిన బయిలు, వరండా మెట్టుమీద సజ్జలో తీగలు సాగుతూ పైపైకి పాకిపోతున్న లతలు, కిటికీల మీదుగా గుత్తులుగా వేలాడుతున్న ఊదారంగు ద్రాక్షపండ్లు, రమ్యమైన ఆ ఇంటి చుట్టూతా ఉన్న రాతి నిట్రాతి పిట్టగోడ మొత్తాన్నీ తీగలుగా అల్లేసుకొని క్రొన్నెత్తుటి మరకల్లా మెరుస్తున్న ఎర్రటి విష్ణుక్రాంతి పూలు. ఇంటి వెనక పర్వత పాదం వరకూ బారులు తీరిన నారింజ రంగు పూలచెట్ల వరసలు.

ఆ విల్లా వాకిటి తలుపు మీద మెరుస్తున్న చిన్న అక్షరాల్ని చదివాను: ‘పురామందిరం’. ఏ కవి, లేదా ఏ దివిజ నివాసమో ఈ ఇల్లు- అని నాతో నేను చెప్పుకున్నాను. పూల సందోహాల నుంచి వసంతానికి తారసిల్లిన ఈ కలల సౌధాన్ని ఏ ఏకాంతుడు శోధించి సాధించాడో.

ఆ ఇంటికి చేరువగా రోడ్డు మీద రాళ్లు పగలకొడుతున్నాడో పనివాడు. ఈ పర్ణశాల ఎవరిదని అడిగానతన్ని. నిన్నటి తరాల తారామణి జూలీ రొమైన్ ఇల్లని చెప్పాడతను.

జూలీ రొమైన్! నా చిన్నతనంలో తరుచూ ఆమె ముచ్చట్లే వినేవాడ్ని. రచెల్ కి ధీటుగా పేరొందిన గొప్ప నటీమణి. అంత కీర్తిని పొందిన, అంత ప్రేమాస్పదురాలైన స్త్రీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంత పోటీ, ఆమె ప్రేమని పొందాలని! ఎన్ని ద్వంద్వయుద్ధాల్లో ఆమె మూలాన, ఎన్ని ఆత్మహత్యలో ఆమె వల్ల, ఎన్ని దుస్సాహసాలో ఆమె కోసం. ఈ వగలాడి వయసెంతుంటుందో ఇప్పుడు? అరవై- కాదు, డెబ్భై… ఊహూ…. డెబ్భై ఐదేళ్లు. జూలీ రొమైన్! ఇక్కడ ఈ ఇంట్లోనా? ఫ్రాన్స్ మొత్తాన్నీ పెరపెరలాడించిన అప్పటి (అప్పుడు నా వయసు పన్నెండేళ్లు) సంఘటనొకటి తలుచుకున్నాను; ఓ ప్రియుడితో దెబ్బలాట రచ్చకెక్కాక, కవి అయిన మరో ప్రియుడితో సిసిలె లేచిపోవడం అప్పుడొక సంచలనం.

ఓ తొలిరేయి శోభనపు అనుభవాన్ని ఆమె అభినయించిన తీరుకి వెర్రెక్కిపోయిన ప్రేక్షకులు పదకొండు సార్లు ‘వన్స్ మోర్’ అంటూ ఆమెని మళ్లీ మళ్లీ స్టేజ్ మీదకి పిలిచి నటింపజేసిన ఆ రాత్రే ఆమె తన కొత్త ప్రియుడితో ఉడాయించింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం, రెండు గుర్రాలు పూన్చిన బగ్గీలో తాను కవితో వెళ్లిపోయింది. పాలెర్మో పరిసరాల్లో నారింజ వృక్షాలతో సంతులితమైన Conque d’Ov అనే ఆ ప్రాచీన ద్వీపానికి వాళ్లు సముద్రాన్ని దాటి చేరుకున్నారు. ఇట్న అగ్నిపర్వత సానువుల్ని వాళ్లు చెట్టాపట్టాలేసుకొని, చెంపాచెంపా రాసుకుంటూ ఆ జ్వాలాముఖ బిలానికి తమని తాము అర్పించుకోడానికే అన్నట్టు ఎక్కడం గురించి ఎన్నెన్ని పుకార్లో.

గొప్ప ప్రభావశీలమైన కవిత్వాన్ని అందించిన అతనిప్పుడు లేడు. ఒక తరాన్నే సంభ్రమాశ్చర్యాలకి గురిచేసిన కవితలు, గాఢమై, నిగూఢమై తోటి కవులకి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచిన కవితలు వెలార్చిన ఆ కవి మరణించాడు. ఆమె కోసం అజరామరమైన సంగీతాన్ని అందించిన, జయాపజయాలని ఆలపించి మైమరపించి, గుండెలు బరువెక్కించిన బాణీలెన్నో కట్టిన ఆమె మాజీ ప్రియుడు కూడా కన్నుమూశాడు.

పూలతో కప్పేసిన ఈ ఆవాసంలో ఆమె జీవించి ఉంది.

ఎంతమాత్రం తటపటాయించకుండా తలుపు తట్టాను. ఎడ్డిమడ్డిగా బెరుకుబెరుగ్గా ఉన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడొకడు అతనికి తగ్గట్టే ఉన్న చేతులతో తలుపు తీశాడు. ఆమెనుద్దేశించి ఓ అందమైన ప్రశంసని, కలుసుకోవాలంటూ గట్టి విన్నపాన్ని నా కార్డు మీద రాసి పంపాను. బహుశా ఆమె నా పేరు వినే ఉంటుంది, కలవడానికి ఒప్పుకోవచ్చు కూడా.

లోపలికెళ్లిన ఆ పనబ్బాయి వెంటనే తిరిగొచ్చాడు తన వెంట రమ్మంటూ. భారీగా, ఉదాసీనంగా ఉన్న ఫర్నీచర్ తో లూయిస్ పిలిప్పీ స్టైల్ కి అనుగుణంగా తీర్చిదిద్దిన డ్రాయింగ్ రూములోకి తీసుకుపోయాడతను. ఏమంత అందం లేని పదారేళ్ల ఓ బక్కపలుచని పనమ్మాయి మర్యాదపూర్వకంగా కుర్చీ సరిచేసింది, నేను కూర్చోడానికి వీలుగా. తర్వాత పనివాళ్లిద్దరూ నన్ను ఒక్కడ్నే వదిలేసి వెళ్లిపోయారు. ఆ గదిని తేరిపారాచూశాను. గోడలకి మూడు చిత్రపటాలు తగిలించి ఉన్నాయి. ఆ నటీమణి ఆనాటి చిత్రపటం ఒకటైతే, ఆ రోజుల్లో వేసుకునే కుచ్చుల చొక్కా, నడుము దగ్గర బిగుతుగా ఉండే పొడవాటి కోటు వేసుకున్న ఆమె కవి-ప్రియుడిది మరో చిత్తరువు; ఇక మూడోది- ఫియానో వంటి సంగీతసాధనం ముందు కూర్చొని ఉన్న మ్యుజీషియన్. ఆ ఫొటోలో ఆమె తెల్లగా మెరిసిపోతూ కళ్లు చెదరగొడుతుంది; అయితే, ఆనాటి ఫ్యాషన్ కి తగ్గట్టుగా ఉండటం వల్ల ఆమె పోజు కొంచెం తేడాగా అన్పిస్తుంది. మనోహరమైన ఆమె పెదాలు, నీలి కళ్ల మీద చిర్నవ్వు లాస్యమాడుతుంది. ఆ పెయింటింగ్ కూడా అత్యున్నతమైన కళాసృజన. చిత్తర్వుల్లోని ఆ ముగ్గురు మూర్తులూ మరుసటి తరాల వంక చూస్తున్నట్టనిపించింది. వాటి పరిసరాలన్నీ గతించిన కాలాల గాలితో, మరిప్పుడు మిగలని వారి వ్యక్తిత్వాలతో నిండినట్టు తోచింది.

తలుపు తెరుచుకోని ఓ కూసింత ఆడమనిషి లోనికొచ్చింది. బాగా వయసు మళ్లి, కుంగిపోయి, జుత్తు, కనుబొమ్మలతో సహా నెరిసిపోయిన స్త్రీ. తత్తరబిత్తరగా, వడివడిగా అడుగులేస్తున్న తనని చూస్తుంటే తెల్లని చుంచెలుక గుర్తొచ్చింది. నాతో చేయి కలుపుతూ, ఇంకా స్వచ్ఛంగా, శ్రావ్యంగా మన్నన నిండిన గొంతుకతో పలికిందిలా: “దయచేసి కూర్చోండి. ముదిఒగ్గులైన నిన్నటి తరాల ఆడవారిని ఇప్పటి అబ్బాయిలు తలుచుకోవడమంటే ఎంతో ఔదార్యం.”

నిజానికి ఆ ఇల్లు నన్నెంతో ఆకర్షించిందనీ, ఇంటి యజమాని పేరు తెలుసుకునే ప్రయత్నంలో అది ఆమే అని తెలిసి నిలవలేక పోయాననీ చెప్పాను.

“మీ రాక నన్నెంతో సంతోషపెట్టింది. ఇటువంటిది జరగటం ఇదే మొదటిసారి. గొప్ప ఉదారమైన మెచ్చుకోలుతో పాటు వచ్చిన మీ కార్డు చూసి ఇరవై ఏళ్లనాడు కలిసిన పాత స్నేహితుడు హఠాత్తుగా వచ్చాడని చెప్పినప్పటిలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను. నన్ను మర్చిపోయారు, నిజంగానే నన్నందరూ మర్చిపోయారు. నేనెవరికీ గుర్తుకురాను, నేను చనిపోయిన రోజు తప్ప నన్ను తలుచుకునే వారే లేరు. అప్పుడు ఓ మూడ్రోజుల పాటు ఈ జూలీ రొమైన్ ప్రస్తావన చేస్తాయి పత్రికలు, పాత సంఘటనల్ని తలపోస్తూ, అప్పటి వివరాలు తవ్విపోస్తూ, బహుశా అప్పటి పుకార్లని తిరగదోడుతూ, చచ్చినదాని కళ్లు చారడేసి అని పొగుడుతూ- ఇక అది నా ముగింపు”

కాసేపు మౌనంగా ఉండి, మళ్లీ మొదలెట్టింది: “అది మరింకెంతో దూరం లేదు. కొద్ది నెలలు, లేదా కాసిన్ని రోజులు అంతే. ఇప్పటికి బతికున్న ఈ నిర్భాగ్యురాలు మరి కొద్దినాళ్లకి ఓ నిర్జీవి.”

ఆమె తలెత్తి గోడ మీద తన చిత్తర్వుని చూసింది, వాడి వడిలిపోయిన ఇప్పటి తన ప్రతిరూపాన్ని చూసి ఆ బొమ్మ అవహేళనగా నవ్వినట్టు తోచిందామెకి. ఆ ఇద్దరు ప్రియుల- డాబుసరి కవి, ఆరాటపెట్టే మేళగాడు- బొమ్మలు చూసింది: “ఈ శిధిల సౌందర్యం మమ్మల్నేమని నిలదీస్తుంది?” అని అవి అడిగినట్టు అన్పించిందనుకుంటా.

లోతైన నీళ్లలో మునిగిపోయిన మనిషి ఊపిరికోసం తన్నుకులాడినట్టు, జీవచ్ఛవాలుగా మిగిలి నిరంతరం జ్ఞాపకాలతో పెనుగులాడే వాళ్లని కమ్మేసిన వేదన వంటి ఒక అనిర్వచనీయమైన, ప్రబలమైన వ్యాకులత చుట్టేసింది నన్ను.

నైస్ నుంచి మంటె కర్లొకి వడివడిగా పరుగులిడుతున్న బగ్గీల్ని నేను కూర్చున్న ప్రదేశం నుంచి చూడగలుగుతున్నాను. అందులో తుళ్లుతూ వెళ్తున్న కలవారింటి కలికి కామాక్షులు, వారిని చూసుకొని ముసిముసినవ్వుల్తో మురిసిపోతున్న కుర్రాళ్లు కూడా కనబడుతున్నారు. నేను చూసిన వంక చూసి, నా భావాన్ని పసిగడ్తూ జీవంలేని అరనవ్వుతో అందామె: “ఉట్టిగా ఉండటం, పొంది ఉండటం ఏకకాలంలో సాధ్యం కాదు.”

“ఎంత సుందరమైన జీవితం మీది” బదులుగా అన్నాను.

గాఢంగా నిట్టూర్చుతూ అందామె: “అవును, సుందరం, సుమధురం! దాని గురించి వగపందుకే ఎప్పుడూ”.

ఒక సలపరింతల గాయాన్ని తాకినట్టు సున్నితంగా, తగు జాగ్రత్తలతో ఆమె తన గురించి మాట్లాడేందుకు సిద్ధమైనట్టు అర్థమయ్యి, నేను ఆరాలు తీయడం మొదలెట్టాను. తన విజయాల గురించి, విభవాల గురించి, కైపెక్కించే ఆనందాలు, స్నేహితులు, ఇంకా తన మొత్తం గెలుపుల గాథని చెప్పుకొచ్చింది.

“నాటకరంగం వల్లనే మీలో గొప్ప ఉత్సాహం, గాఢమైన సంతోషం అనుకోవచ్చునా?”

“కాదు…,” చప్పున బదులిచ్చింది.

సాలోచనగా నవ్వాను. కళ్లెత్తి గోడకి తగిలించి ఉన్న ఆ ఇద్దరు నేస్తాల చిత్రపటాలు చూస్తూ మళ్లీ మొదలెట్టింది.

“నా మహోల్లాసానికి కారకులు వాళ్లే”.

వాళ్లిద్దరిలో ఎవరెక్కువ అని అడగకుండా ఉండలేకపోయాను.

“ఇద్దరికీ ఋణగ్రస్తని. అసలు కొన్నిసార్లు వాళ్లని ఒకరికొకర్ని నేనే తారుమారు చేసేసుకుంటాను. దానికి తోడు, వారిలో ఒకరి పట్ల ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుంటాను.”

“బహుశా అదేగానీ నిజమైతే, వాళ్లకి కాకుండా, అసలు ప్రేమ అనే భావనకే మీరు రుణపడిపోయారేమోనమ్మా. వాళ్లు కేవలం ప్రేమకి సాధనాలు మాత్రమే.”

“అంతే అయ్యిండొచ్చు. కానీ, ఎంత అద్భుతమైన సాధనాలు!”

“ఏవిధంగానూ గొప్ప గాని ఓ సాధారణమైన మగవాడు తన హృదయాన్ని, తన యావత్ జీవితాన్ని, తన మొత్తం అస్తిత్వాన్ని, ఇంకా తన ప్రతి తలపునీ, ప్రతి క్షణాన్నీ మీకే అర్పించి ప్రగాఢంగా మిమ్మల్ని ప్రేమించాల్సినంతగా మరింత తీవ్రంగా ప్రేమించలేదని మీరేమన్నా అనుకుంటున్నారా? ఆ ఇద్దరు ప్రియుల వల్ల మాత్రం మీకు విదిలించుకోడానికి వీల్లేని శత్రువులిద్దరు – సంగీతం, కవిత్వం- చేరువయ్యారు.”

ఇప్పటికీ ఆత్మల్ని ఉద్దీపించే తన ఎలయవ్వన స్వరంతో ఆమె ఆక్రోశించింది: “లేదు బాబూ, లేదు. ఒక మామూలు మగాడు నన్ను బాగా ప్రేమించి ఉండేవాడేమో బహుశా; కానీ, ఆ ఇద్దరు ప్రేమించినంతగా మాత్రం కానేకాదు. ప్రపంచంలో మరెవ్వరూ పాడని విధంగా ప్రణయగీతాన్ని ఆలపించడం వాళ్లిద్దరికి మాత్రమే తెలుసు.

“ఎంత మైమరపించారు నన్ను. పదాలలో, స్వరాలలో వాళ్లు ప్రేమని ఒడిసి పట్టినంతగా పట్టడం మరెవరికైనా సాధ్యమేనా? ప్రేమలోకి మొత్తం కవిత్వాన్ని నింపడం, నింగీనేలని కమ్మేసిన యావత్ సంగీతాన్ని ఒంపడం తెలియకపోతే ప్రేమించడం వృధా. వాళ్లకి తెలుసు, వాళ్లిద్దరికీ మొత్తం తెలుసు- వాళ్ల పాటలతో, మాటలతో… ఇంకా వాళ్ల చేతలతో ఓ స్త్రీని పారవశ్య శిఖరపుటంచులకి తీసుకుపోవడం వాళ్లకే తెలుసు. మా వలపుల కథలో వాస్తవాల కంటే ఊహలే బహుశా ఎక్కువ కావొచ్చు; కానీ, ఆ మధురోహలే నిన్ను మబ్బుల్లోకి లేపుతాయి, వాస్తవాలైతే నిన్ను నేలకి కుదేస్తాయి. ఒకవేళ ఇతరులు నన్ను అధికంగా ప్రేమించినా, ఈ ఇద్దరి వల్ల మాత్రమే నేను ప్రేమని గ్రహించి, అనుభవించి, ఆరాధించగలిగాను!”

కరుడుగట్టిన దుఃఖం హఠాత్ కన్నీరై ఆమెలోంచి నిశ్శబ్దంగా ధారగట్టడాన్ని నేను గమనించనట్టుగా, కిటికీలోంచి ఎక్కడో దూరంగా చూస్తున్నట్టుగా ఉండిపోయాను. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఆమె కొనసాగించింది:

“చాలామందికి శరీరంతో పాటు మనసుకీ వయసు మళ్లుతుంది తెలుసా. కానీ, నా విషయంలో అది జరగలేదు. ఈ అర్భక దేహానికి డెభైఐదేళ్లు, కానీ హృదయానికి మాత్రం ఇరవయ్యే. ఆ కారణం చేతే నేనిలా నా పూలతో, నా కలలతో ఒంటరిగా మిగిలిపోయాను.”

మళ్లీ చాలాసేపు మా మధ్య నిశ్శబ్దపు నీడ తారాడింది. కాసేపు తనని తాను సమాధానపర్చుకొని మళ్లీ చెప్పుకొచ్చింది చిర్నవ్వుతో:

“ఆహ్లాదమైన సాయంత్రాల్ని నేనెలా గడుపుతానో తెలిస్తే మాత్రం నన్ను చూసి నవ్వుకుంటావు. అయితే, నా వెర్రితనానికి నాకు బోల్డు సిగ్గేస్తుంది, అదే క్షణంలో నా మీద నాకే జాలేస్తుంది కూడా.”

ఆ వెర్రితనమేమిటో అడిగి వృధా. ఆమె ఎలాగైనా అది చెప్పదుగాక చెప్పదు. ఇక నేను వెళ్లడానికన్నట్టు లేచాను.

వెంటనే వారించినట్టుగా అందామె- “ఎందుకింత త్వరగా?”

మంటె కర్లొలో భోజనం చేయాలనుకున్నట్టు చెప్పాను. కొంచెం తటపటాయిస్తూనే అందామె చప్పున: “నాతో భోంచేయడం ఇష్టం లేదా? నాకైతే అది చాలా సంతోషానిస్తుంది.”

తన ఆహ్వానాన్ని వెంటనే ఒప్పేసుకున్నాను. ఆమె ముఖమైతే వెలిగిపోయింది. గంట మోగించి, పనమ్మాయికి చకచకా కొన్ని పనులు పురమాయించింది. తర్వాత నాకు ఇల్లంతా చూపించడానికి ముచ్చటపడింది.

గాజు పరదాల వరండా, మొత్తం మొక్కలే. చూడటానికి వీలుగా డైనింగ్ రూం నుంచి తెరిచే ఉంది అంతా. ఈ చివర్నుంచి ఆ కొస వరకూ చూడ్డానికి వీలుగా ఉంది. పర్వత పాదాల వరకూ బారులు తీరిన నారింజ చెట్లు. దుబ్బుపొదల మాటున ఒత్తిగిల్లినట్టు ఓ ఆసనం వంటి చోటు, ఆమె తరుచూ కూర్చుంటుందని సూచిస్తూ.

పూలని చూస్తానికి తోటలోకి వెళ్లాం. సాయంత్రం, ఐహిక పరిమళాలు అన్నింటినీ మోసుకొచ్చే ప్రశాంతమైన నులివెచ్చని సాయంత్రాల్లో ఒకానొకటి మెత్తగా ప్రవేశించింది. మేము భోజనానికి కూర్చునేసరికి బాగా పొద్దుపోయింది. డిన్నర్ అద్భుతంగా ఉండటంతో అక్కడే చాలాసేపు గడిపేసాము. మొత్తానికి మేము చాలా దగ్గర స్నేహితులమైపోయాం. గాఢమైన ఆపేక్ష ఆమె పట్ల నా మనసులో ఏర్పడిపోయింది. ఓ గ్లాసు వైన్ తాగాక తను మరింత చేరువయ్యింది.

julieromain“పద, అలాగ వెళ్లి చందమామని చూద్దాం,” అని మళ్లీ చెప్పటం మొదలెట్టింది: “ఈ చెంగల్వల చెలికాడు, చూడచక్కని చుక్కలరాయుడంటే ఎంతిష్టమో నాకు. ఎగసిన నా ఉత్తుంగ తరంగోత్సాహాలన్నింటికీ సాక్షి తానే. నా మధురస్మృతులన్నీ అక్కడే పోగుబడ్డాయనీ, వాటిని తిరిగి తెచ్చేసుకోవాలంటే మాత్రం ఆ వెన్నెలపోగుని చూస్తూ ఉండాలని అన్పిస్తుంటుంది నాకెప్పుడూ. కొన్ని సాయంత్రాలు కమనీయమైన, నీకు మాత్రమే తెలిసిన బహు ఇంపైన దృశ్యాన్ని నాకోసం కల్పించుకుంటాను. వద్దులే, నన్ను మరీ ఎగతాళి చేస్తావు. నీతో చెప్పలేను – అంత పని చేయలేను- ఊహూ… నీతో చెప్పలేను బాబు..”

“భలేవారే… చెప్పండమ్మా,” అంటూ ప్రాథేయపడ్డాను- “మీరు గుట్టుగా దాచేస్తున్న ఆ బుల్లి రహస్యం నాకు చెప్పరూ. నేనేమీ నవ్వనుగాక నవ్వను, ఒట్టు!”

ఆమె తటాపటాయిస్తుంటే, తన సన్నని, చల్లని చేతుల్ని పొదివి పట్టుకొని ఆమె ప్రియులు ఆ రోజుల్లో చేసినట్టు ఒకదాని తర్వాత మరో చేతిని పదేపదే ముద్దులాడాను. ఆమె విచలితమయ్యింది గానీ, ఇంకా ముందువెనుకలాడుతూనే ఉంది.

“నువ్వు నవ్వనని నాకు ఒట్టేశావు సుమీ….” బెరుకుగానే అంది.

“అవును. కచ్చితంగా..”

“సరే… అయితే రా,” అంది చిర్నవ్వుతో. మేము లేచాము. తోటలో ఆమె లేచాక కుర్చీని వెనక్కి లాగి వినయంగా నిల్చొన్న ఎడ్డిమడ్డి పనబ్బాయి చెవిలో చిన్నగా ఏదో చెప్పిందామె. “చిత్తం… అలాగేనమ్మా….” అంటూ వాడు వినయంగా బదులిచ్చాడు.

ఆమె నా చెయ్యి పట్టుకొని వరండా వైపు నడిచింది. నారింజ చెట్ల మధ్య నడక ఓ మనోహర సందర్భం. ఆ చెట్ల పొడగూతా చంద్రుడు ఒక పల్చని వెండిగీతని గీస్తున్నాడు. దట్టమైన కొమ్మల మధ్య నుంచి దీర్ఘమైన వెలుగు రేఖ లేతపసుపు ఇసుకమీద వాలుతోంది. చెట్లన్నీ పక్వానికొచ్చి, లోలోపలకి చొరబడిపోతున్న పరిమళ మాధుర్యంతో గాలి బరువెక్కిపోయింది. ఆ చీకటి గుబురుల్లో వేల మిణుగురుల చిరుదీపకాంతి ఆకాశంలోని చుక్కల రేతస్సులా తోస్తోంది.

“ఓహ్… ప్రణయ సన్నివేశానికి ఎంత అనువైన వాతావరణమిది,” అంటూ ఎలుగెత్తాను.

ఆమె చిర్నవ్వులు చిందిస్తూ అంది- “కదా…. అవును కదా. నువ్విప్పుడు చూస్తావ్!”

తన పక్కన కూర్చోబెట్టుకొని, గొణిగినట్టుగా చెప్పుకుపోయింది:

“అటువంటి సన్నివేశాల తలపోతే జీవితానికి సంబంధించి నాలో దిగులు రేపుతుంది. మీరు, ఈ తరం మగాళ్లు అటువంటి వాటిని కలలోనైనా ఊహించడం కొంచెం కష్టమే. మీరు కేవలం డబ్బుజబ్బు చేసిన బేహారులు. మాతో ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలియదు. మాతో అంటున్నానంటే ఈడొచ్చిన ఆడపిల్లల్తో అని. ప్రేమ వ్యవహారాలన్నీ కేవలం ఓ దర్జీవాడి బిల్లులోంచి పుట్టే లావాదేవీలుగా మారిపోయాయి. ఆ అమ్మాయి కంటే ఆ బిల్లే ముఖ్యమనిపిస్తే మీరు మాయమైపోతారు, లేదా ఆ బిల్లు కంటే ఆ అమ్మాయే ఎక్కువ విలువచేస్తుందని లెక్కతేలితే బిల్లు కట్టేస్తారు. అబ్బా… ఏం పద్ధతులు, ఏం ప్రేమలు!”

ఇంతలో నా చేతిని తన చేతిలోకి తీస్కొని అంది: “చూడు మరి”

కనిపించిన ఆ మోహన దృశ్యానికి సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను. మా కింద చెట్ల వరసల కొసన రాకాచంద్రుడి పండు వెన్నెలలో నిండార తడుస్తూ ఒకరినొకరు నడుముల చుట్టూ చేతులు పెనవేసుకొని మెల్లగా నడిచివస్తుందో యువ జంట. కాసేపు చీకట్లోకి అదృశ్యమయ్యిందా జోడి. తిరిగి అంతలోనే ప్రత్యక్షమయ్యింది ఆ చెట్ల వరుసల మధ్య బాటలో మరింత దిగువున. వెనకటికాలంలో వేసుకునే తెల్లని పట్టు దుస్తుల్లో ముస్తాబై ఉన్నాడా యువకుడు, తలకి వెడల్పాటి టోపీ, దాని అంచున నిప్పుకోడి ఈకల పింఛం. వెడల్పాటి పావడాల గౌను వేసుకుంది అతని పక్కన పడుచు. ఆమె తలమీద రాచరికపు రోజుల్లో అందమైన దొరసానుల్ని పోలిన కేశాలంకరణ.

అలా నడిచొస్తూ వాళ్లు క్రమేణా మాకు దగ్గరగా వచ్చేశారు. చెట్ల బారుల మధ్య ఆగి, ఒకర్నొకరూ సరసంగా పొదువుకొని అల్లుకుపోయారు.

హఠాత్తుగా గుర్తుపట్టాను, వాళ్లిద్దరూ ఆమె పనివాళ్లు! ఒళ్లంతా కదిలిపోయేలా ఒక్క పెట్టున నవ్వాలని అణచుకోవడానికి అలవికాని కోర్కె చెలరేగింది నాలో. అయితే నేనేమీ నవ్వలేదు. అన్నీ అదిమిపెట్టుకోని, ఆ అసాధారణ హాస్యోదంతంలో తర్వాత ఘట్టమేమిటా- అని ఎదురుచూశాను.

అప్పుడా ప్రేమ జంట వెనుదిరిగి ఆ తోవ చివరికి వెళ్లిపోయింది, పెరుగుతున్న దూరం వల్ల దృశ్యానికి మళ్లీ సోయగాన్ని సోకిస్తూ. క్రమక్రమేణా దూరమై చివరికి అదృశ్యమైపోయారు, కలలొ తారాడే బింబాల్లా. వాళ్లు మరుగైన ఆ మార్గం మళ్లీ ఒంటరైనట్టు తోచింది.

నేను కూడా సెలవు తీసుకొని వచ్చేశాను. ఎంత అబద్ధమో అంత సత్యసుందరమైన గతం, మరిపించే, మరులు గొలిపించే కాల్పానిక గతం, దృశ్యానుగతమైన ఆ వలపుల గతాన్ని జ్ఞప్తికి తేవడం కోసం, ఆ నిన్నటి తరాల నటీమణీ విమోహ వక్షపు మాటు పిచ్చి హృదయం కొట్టుకోవడం కోసం నన్నొక అంతిమ సాధనంగా వాడి కల్పించబడిన ప్రణయ పర్వం నాలో కలకాలం నిలిచిపోతుందనిపించి, మళ్లీ ఆ జంటని చూడబుద్ధిగాక వచ్చేశాను అక్కడ్నుంచి చప్పున.

*

Download PDF EPUB MOBI

Posted in 2015, అనువాదం, జనవరి and tagged , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.