fingerprint-pa

న్యాయాన్ని ఆశ్రయిస్తే..

Download PDF    ePub    MOBI

హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. “షికాయత్ ముఝె భీ హై” అనే వీరి వ్యాసాల సంపుటి నుండి “న్యాయ్ కా దర్వాజా” వ్యాసానికి తెలుగనువాదం ఇది.

న్యాయాన్ని ఆశ్రయిస్తే..

సామెతల్లో చెప్పినట్టు ఏం జరగటంలేదు ఈ మధ్య.

సామెతల ప్రకారం – అబద్ధానికున్నముసుగును తొలగిస్తే నిజం నగ్నంగా కనిపిస్తుంది. అబద్ధానికన్నా నిజానికి సిగ్గెక్కువ.

ఇప్పుడు న్యాయం తలుపు తట్టాక ఈ సామెతలకు విరుద్ధమైనవి కనుగొన్నాను. కొంతమంది పేదవాళ్లపై అబద్ధపు కేసు బనాయించబడింది. మేము వాళ్ళ తరపున న్యాయస్థానం తలుపులు తట్టాము. న్యాయం తలుపు దగ్గరే డ్యూటీ మీద కూర్చుంటుందనీ, ఇలా తలుపు తట్టగానే అలా న్యాయదర్శనం అవుతుందనీ అనుకున్నాము. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోయేసరికి ఆందోళన మొదలైయ్యింది. ఏమయ్యింది? న్యాయం “సిక్ లీవ్” గానీ తీసుకొనిపోలేదు గదా? అసలే, ముసలితనం కావటంతో తరచూ జబ్బు పడే అవకాశం ఎక్కువ.

చివరికి మేమే తలుపులు బద్దలుగొట్టుకొని లోపలికి ప్రవేశించాము. అంతా ఖాళీగా ఉంది. బాత్రూం తలుపు నెడితే, ఒకడు నగ్నంగా స్నానం చేస్తూ కనిపించాడు.

మేం అడిగాం – నువ్వు న్యాయానివి కదూ? త్వరగా బట్టలు వేసుకో. నీతో మాట్లాడాలి.

అతను అన్నాడు – నేను న్యాయాన్ని కాదు, అన్యాయాన్ని. నగ్నంగానే ఉంటాను. అన్యాయానికి సిగ్గేంటి: న్యాయానికి కవల సోదరుడిని. ఒకేలాంటి మొహం. జనాలు అతడనుకొని నన్ను కలుస్తుంటారు.

మేం అడిగాం – ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అయినా ఉండాలే!

అతను అన్నాడు – ఆ, ఉంది. చూడు, నాకు మెల్ల. ఎటో చూస్తున్నానని నువ్వు అనుకుంటావ్, కానీ నేను నిన్నే చూస్తున్నాను. మా సోదరుడు న్యాయం ఒంటి కన్నువాడు. ఒకవైపే చూస్తాడు. ఇప్పుడు వాడికి చెవుడు కూడా వచ్చింది.

మేం అడిగాం – మరి తలుపు కొట్టినప్పుడు ఎవరు తీస్తారు?

అతడు అన్నాడు – నేనే తెరుస్తాను. అదే కదా మజా. జనాలు నన్ను న్యాయమనుకుంటారు.

మేం అడిగాం – మీరిద్దరూ ఎవరి పిల్లలు?

అతడు అన్నాడు – “ఎవిడెన్స్ ఆక్ట్” మా నాన్న. “ఇండియన్ పీనల్ కోడ్” మా అమ్మ.

మేం అడిగాం – మేము న్యాయాన్ని కలవాలి. అతనేడీ?

అతనన్నాడు – ఇప్పుడే పెరటి గుమ్మం నుంచి పోలీస్ స్టేషన్‍కు వెళ్ళాడు. వచ్చేస్తుండచ్చు.

ఏం బాబూ, ఖలీల్ జిబ్రాన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు. న్యాయస్థానపు గుట్టు రట్టు చేస్తున్నాను. న్యాయం తలుపు తట్టేవాళ్లారా, మీరేమో ముందు గుమ్మం తలుపు తడుతుంటారు, అదేమో పెరటి గుమ్మం గూండా పోలీసుల ఆజ్ఞలు పాటించడానికి వెళ్ళిపోతుంది. న్యాయానికి చెవుడు. తలుపు కొట్టేది కూడా వినిపించదు. తలుపు కొట్టగానే తెరిచే ఆ మెల్లకన్ను వ్యక్తి అన్యాయం. తలుపు కొట్టినంత మాత్రాన దొరికేది అన్యాయమే. తలుపు బద్దలుగొడితే గానీ న్యాయం దొరకదు.

ఏం బాబూ, ఇప్పుడు నక్సలైటు అవుదామని ప్రయత్నిస్తున్నావా? లేదు. ఇది పెద్ద ప్రయత్నించకుండానే వచ్చి అంటుకునే బిరుదు. ఈ మధ్య నేను ఒక పత్రికలో, పోలీసులు హాస్టల్‍లో చొరబడి అమాయకులైన విద్యార్థులను ఎందుకు కొట్టారని రాస్తే, నేను నక్సలైట్ ఐపోయాననే గుసగుసలు వినబడ్డాయి. నల్లులు కుట్టినా అది నక్సలైట్ల పనే అనిపిస్తోందిప్పుడు. పిల్లవాడు పాలకోసం ఏడ్చినా తండ్రి వాడి తల్లితో అంటాడు – “పాలు పట్టీయకు. వాడికి ఆకలీ లేదు పాడూ లేదు. నక్సలిస్టయి కల్లోలం సృష్టిస్తున్నాడు.”

ఉన్నట్టుండి సత్యపు గుట్టు కూడా రట్టయిపోతూంటుంది. దేవునిపై ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో ఎన్ని అబద్ధాలు చెప్తారో అన్ని దేవుని వీపు వెనుక అయినా చెప్పరు. నరుడు కరుడుగట్టిపోయి నారాయణుని ముందే అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయాడు. ధర్మం మంచివాళ్ళని పిరికివాళ్ళ గానూ, చెడ్డవాళ్ళని ధైర్యస్తులుగానూ చేస్తుంది. అసత్యం కొద్దిపాటి పవిత్రత సాయంతో సత్యపు బెర్తు ఆక్రమించేస్తుంది. ఆ సాయం గంగామాత కావచ్చు, జంధ్యప్పోగు కావచ్చు, ధర్మమే కావచ్చు, లేక ఈశ్వరుడే కావచ్చు.

Posted in 2013, Uncategorized, అనువాదం, డిసెంబరు and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.