cover

మనం తలతిప్పుకునే జీవితాల కథ

Download PDF EPUB MOBI

అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కరుణామయుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని తిరిగి అయోధ్యకి వెళ్ళవలిసిందిగా చెప్పి తనపై వారికి ఉన్న ప్రేమకు కృతజ్ఞత చెప్పాడు. అందరూ తిరిగి అయోధ్యకు బయలుదేరారు. కాని కొంతమంది మాత్రం అక్కడ నుంచి కదలలేదు. అది చూసిన రాముడు మీరెందుకు వెళ్ళలేదని అడిగాడు. మీరు ఆడవారిని మగవాళ్ళని వెళ్ళమన్నారు. మేము ఈ రెండింటికి చెందిన వారం కాదు, అందుకే మీ వెంటే ఉండి పోయాము అని చెప్పారు. రాముడు వాళ్ళ సత్యనిరతికి సంతోషించి వాళ్ళ మాట ఎపుడూ సత్యమయ్యేలా దీవించి వరమిచ్చాడు. వాళ్ళే ఇప్పుడు మనమంతా కనీసం మనుషులుగా నైనా చూడడానికి ఇష్టపడని హిజ్రాలు.

OkaHijraAtmakatha600ఈసారి అనగనగా ద్వాపరయుగం. కురుపాండవులిరువురూ కురుక్షేత్ర యుధ్ధ సన్నాహాల్లో ఉన్నారు. పాండవులు యుద్ధానికి ముందు యుద్ధంలో గెలుపు కోసం నరబలి ఇవ్వాలి. ఆ బలి కాబోయేవాడు సకల శాస్త్రాల్లో ఆరితేరినవాడు ఉత్తమజాతి పురుషుడై ఉండాలి. ఆ కాలంలో అలాంటివాళ్ళు ముగ్గురే ముగ్గురు. ఒకరు సాక్షాత్ శ్రీ కృష్ణపరమాత్ముడు, ఇంకొకరు అర్జునుడు, మరొకరు అర్జునునికి నాగకన్యకి పుట్టిన అరవానుడు. నరనారాయణులిద్దరు కురుక్షేత్రంలో చేయవలసింది చాలా ఉంది కాబట్టి వాళ్ళు అరవానుని బలికి సిద్ధం చేస్తారు. ఐతే బలి కాబోయే ముందు తనకి ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని ఒక్కసారైనా సంసార సుఖం అనుభవించాలని ఉంటుంది. కాని ఆ రాజ్యంలో ఒక్కరు కూడ ముందుకురారు. అది చూసిన శ్రీ కృష్ణుడు ఒక స్త్రీగా మారి ఆతడిని పెళ్ళి చేసుకుంటాడు. అర్వాన్ ని బలి ఇచ్చిన తర్వాత విధవగా మారతాడు. అప్పట్నుంచి ఈ ఒక ఉత్సవం జరుగుతుంది దానినే అర్వాణి ఉత్సవం అంటారు. ఆ ఉత్సవం చేసుకునే వాళ్ళు అర్వాణులు. వారికి మరో పేరే హిజ్రాలు. ఈ హిజ్రాలందరు శ్రీ కృష్ణున్ని తమ పూర్వీకుడిగా అర్వాణ్ ని తమ భర్త గా పూజిస్తారు.

పైన చెప్పిన రెండు కథలూ రేవతి (దొరైస్వామి) తన ఆత్మకథలో చెప్పిన సంగతులు. నిజానికి దొరైస్వామి అని పిలిస్తే తనకి నచ్చదు. ఎందుకంటే ఆమె మగవాడి శరీరంలో బంధింపబడిన స్త్రీ. ఆ లక్షణాల వల్లనే తన కుటుంబానికి దూరం అయ్యింది. సమాజంలో అతి హీనంగా చీత్కారానికి గురైంది. మనసు స్త్రీది అయ్యి మనిషి మగవాడైతే ఎంత నరకమో అది ఎన్ని దారుణమైన పరిస్థితులకి దారి తీస్తుందో “నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మ కథ”లో మనకి అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మనకి కంట తడి పెట్టిస్తాయి. రేవతిలాంటి బతుకు పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. కాదు కాదు, పగదానికి కూడ రాకూడదనిపిస్తుంది. లింగ వివక్ష ఒక్క స్త్రీలకే అనుకుంటే వీళ్ళ స్థితి ఇంకా దారుణం. వీళ్ళపై పోలీసులు రౌడీలు చేసే దౌర్జన్యం అమానుషం.

దొరై స్వామి తమిళనాడులోని ఒకానొక పల్లెటూరులో పుట్టిన అభాగ్యుడు. తను ఒక స్త్రీగానే పుట్టాడు ఒక స్త్రీగానే పెరిగాడు. కాని అదంతా తన కోణంలోనే. సమజానికి, కుటుంబానికి తను అబ్బాయిలా వుండి అమ్మాయి వేషాలు వేసే ఆడంగి వెధవ. జీవితం ఒకటే కాని చూసే కోణాలే వేరు. ఎంత దారుణమైనది ఈ సమాజం! అంతా తను చెపినట్టే జరగాలి అనుకుంటుంది. వినలేదంటే పగ తీర్చుకుంటుంది. అలాగే రేవతి పైనా తీర్చుకుంది.

తనకి ఇష్టమొచ్చినట్టుగా బతకడానికి వీలు లేదని రేవతిని వెలివేసింది. కుటుంబం లోనె అన్నల చేతిలో దారుణమైన అవమానాలు, చచ్చేలా దెబ్బలు తింది. ఇంక ఆక్కడ ఉండలేక తన లాంటి వాళ్ళ సహాయంతో పారిపోతుంది. అక్కడ హిజ్రా సమాజాన్ని వాళ్ళ కట్టుబాట్లని మనకి కళ్ళకి కట్టినట్లు చెబ్తుంది రేవతి. హా.. అన్నట్టు తనకి రేవతి అని పేరు కూడా తను సినిమా హీరోయిన్ రేవతిలా ఉంటుందని తన గురువైన ఒక హిజ్రా నామకరణం చేసింది. అత్యంత సాహసంతో కూడిన రేవతి ప్రయాణం మనకి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలని చెబ్తుంది. అంతేకాదు హిజ్రా సమాజంలో ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు తమ గురువులని యెంత గౌరవిస్తారు, అలాగే వాళ్ళని వీళ్ళు ఎలా పోషిస్తారు, వీళ్ళు పూర్తిగా ఆడవాల్లుగా మారడానికి చేసుకునే ఆపరేషన్, దాని కోసం పడే అవస్థలూ… అబ్బో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఈ సమాజం వీళ్ళకి సెక్స్ వర్క్ లేదా అడుక్కోవడం ఈ రెండుదార్లే చూపించింది. వేరే దారి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు పని ఇవ్వరు, సరి కదా కనీసం సాటి మనుషులుగా నైనా చూడరు. అందుకే వీళ్ళు మనకి ట్రైన్లలో షాపుల్లో అడుక్కుంటూ కనిపిస్తారు. ఇంకా రేవతి జీవితంలో ఐతే అడుగడునా విషాదమే కాని కొన్ని తను ఎలా కొనితెచ్చుకుందో మనకి తనే నిర్భయంగా చెప్పుకుంటూ పోతుంది. తను కేవలం తన లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి సెక్స్ వర్క్ మొదలు పెడుతుంది. కాని చివరకి అదే తన వృత్తి ఐపోతుంది. రేవతికి మొదటి నుంచి తమ జీవితాలు ఎందుకు ఇంత హీనంగా ఉన్నై అన్న బాధ “సంగమ” అనే స్వచ్ఛంద సంస్థలో పని చేసెలా చేసింది. కాని తను అందులో పని చేస్తున్నప్పుడే తన గురువు, ఇంకా స్నేహితుల హత్యలని చూస్తుంది. హిజ్రాలు కాబట్టి ఆ కేసుల్ని కూడ ఎవరూ పట్టించుకోరు. వీళ్ళని రోడ్లపైన రౌడీలు వెంటపడి కొడుతున్నా సాటి మనుషులు ఎవరూ అడ్డుకోకపోవడాన్ని దీనంగా మనతో చెప్పుకుంటుంది. బస్సుల్లో ట్రైన్లలో వారి పై జరిగే అత్యాచారాన్ని ఎంత మౌనంగా అనుభవించారో చెప్పుకుంటుంది. ఇంక ఒక పోలీసు ఒక రోజు రాత్రి పోలిస్టేషన్లో తనతో ఎంత హేయంగా ప్రవర్తించాడో చాలా నిజాయితీగా చెప్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా మనకి హిజ్రాల మీద ఉన్న చిన్న చూపు పోతుంది. వాల్లు కూడా సాటి మనుషులుగా కనిపిస్తారు. అంతే కాదు, ఈ పుస్తకంలో ఎవరు తనపైన అమానుషంగా ప్రవర్తించినా వాళ్ళని ‘మీ ఇంట్లో కూడ నాలాంటి వాడు ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ’ అని అంటుంది. తను తెలిసి అన్నా తెలియక అన్నా ఈ సమాజంలో వాళ్ళకి సమానహక్కులు రావాలంటే ఖచ్చితంగా ప్రతీ ఇంట్లో ఆడ మగతో పాటు ఒక హిజ్రా కూడ అంతే సహజంగా పుట్టాలి అప్పుడే అర్థమవుతుంది అనిపిస్తుంది. “సంగమ”లో ఒక మంచి కార్యకర్తగా ఉంటూ తమవారి బాగుకోసం తను చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అలాగే ఇంత నిజాయితీగా తనకోసం తన సమాజం కోసం తను చెప్పడం చాలా చాలా బాగుంది. పుస్తకం మూయగానే ఒక ఆర్ధ్రత మనసులో నింపిపోయే పుస్తకం ఇది. మిస్ కాకండి.

కినిగెలో లభ్యం

*

Download PDF EPUB MOBI

Posted in 2015, జనవరి, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

7 Comments

 1. మన చుట్టూ వున్న సమాజం స్త్రీలకు, దళితులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు – మొత్తంగా మెజారిటీ జనసందోహానికి బాగోలేదని తెలుసు. కానీ ‘ఆడంగులుగా’ పిలువబడుతూ ఇతరుల ఏహ్యానికి, చీదరింపుకు, భయానికి, వెలివేతకు గురవుతున్న హిజ్రాల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించగలదో “ ఒక హిజ్రా ఆత్మ కధ “ పుస్తకం మనకు అర్ధం చేయిస్తుంది

  ఈ దేశంలో పేదగా పుట్టినా, అణగారిన కులాల్లో పుట్టినా, మైనారిటీ మతాల్లో పుట్టినా, అంగవైకల్యంతో పుట్టినా పేరుకి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ హిజ్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రేవతి తన జీవితాన్నే ప్రదర్శనగా చూపిస్తూ చట్టాలనూ యితర రాజ్యాంగ యంత్రాలను చాలా ప్రశ్నలు వేసింది.

  ఈ గడ్డ మీది ప్రతి మానవ పుటకా హుందాయైన బ్రతుకు తెరువు, గౌరవనీయమైన జీవనం అభయంగా పొందాలి. అలా పొందలేనపుడు వందల సమూహాల అస్థిత్వాలు వాటి ఉనికి కోసం ఆక్రోశిస్తాయి. ఆ సమూహాల్లో ఒక సమూహం ఈ హిజ్రా సమూహం. “ ఒక హిజ్రా ఆత్మ కధ “ పుస్తకం చదివి ఆ సమూహాల పట్ల, వాళ్ళు చేస్తున్న పోరాటాల పట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పరుచుకోగలిగితే రేవతి కృషి ఫలించినట్లే .

  ~ రమా సుందరి ( మోదుగు పూలు బ్లాగు నుండి )
  https://kadhalu.wordpress.com/2015/01/09/%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%82%E0%B0%B9%E0%B0%AA%E0%B1%81-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B8/

 2. సమాజంలో హిజ్రాలను థర్డ్ జండర్‌గా గుర్తించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ఓటర్ గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సుతోసహా అన్ని సౌకర్యాలను హిజ్రాలకు కూడా అందచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తగిన చర్యలను తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను ఆదేశించింది.

  హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని సుప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. లింగమార్పిడి చేయించుకున్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని, విద్య, ఉపాధిలో సమాన హక్కులు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. మూడవ జెండర్‌కు వారు ఇతర వెనకబడిన తరగతుల కిందకు వస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.

  హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పురుషుడు, స్ర్త్రీ తరువాత విడిగా ‘తృతీయ ప్రకృతి’గా హిజ్రాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారు కూడా దేశపౌరులేనని, విద్య, ఆరోగ్యసంరక్షణ, ఉపాధి అవకాశాలలో స్త్రీపురుషులతో సమానంగా వారికి కూడా అవకాశాలు కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హిజ్రాలకు ఎదురవుతున్న వేధింపులు, వివక్ష పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వారి సంక్షేమానికి కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

  On April 15, 2014, the Supreme Court of India recognized a third gender that is neither male nor female, and as a class entitled to reservation in education and jobs, stating “Recognition of Transgenders as a Third Gender is not a social or medical issue but a human rights issue.” This verdict made India one of the few countries to give this landmark judgment.

  In April 2014, Justice KS Radhakrishnan, of Supreme Court of India declared transgender to be the third gender in Indian law, in a case brought by the National Legal Services Authority (Nalsa) against Union of India and others. The ruling said:

  Seldom, our society realises or cares to realise the trauma, agony and pain which the members of Transgender community undergo, nor appreciates the innate feelings of the members of the Transgender community, especially of those whose mind and body disown their biological sex. Our society often ridicules and abuses the Transgender community and in public places like railway stations, bus stands, schools, workplaces, malls, theatres, hospitals, they are sidelined and treated as untouchables, forgetting the fact that the moral failure lies in the society’s unwillingness to contain or embrace different gender identities and expressions, a mindset which we have to change.

  Justice Radhakrishnan said that transgender people should be treated consistently with other minorities under the law, enabling them to access jobs, healthcare and education. He framed the issue as one of human rights, saying that, “These TGs, even though insignificant in numbers, are still human beings and therefore they have every right to enjoy their human rights” ( from: http://en.wikipedia.org/wiki/Third_gender )

 3. సమాజం నిర్లక్ష్యానికి, వెక్కిరింపులకు గురి అవుతూ దైనందిన జీవితంలో కనిపించే హిజ్రాలు, ఎవరింట్లోనైనా ఓ పసికందు జన్మిస్తే అక్కడికి వచ్చి సంబరంతో నాట్యం చేసే హిజ్రాలు, ప్రపంచ ప్రఖ్యాత పవిత్ర అజ్మీర్ దర్గా షరీఫ్ దగ్గర కూడా కనిపించే హిజ్రాలు. పౌరాణికాలలోని బృహన్నల, శిఖండి పాత్రల పట్ల చూపించే ఆదర భావం, వాస్తవ్ జీవితంలోని సాటి మనుషుల పట్ల చూపించలేకపోవటానికి కారణం వారి పట్ల మన అవగాహనా లోపం.

  శ్యాం బెనెగల్ హింది చిత్రం వెల్ కం టు సజ్జన్ పూర్ (Welcome to Sajjanpur) లోని మున్నీబాయి ముఖన్ని పాత్రకూడా మనసుని ద్రవింపచేస్తుంది.
  “ఈ సమాజం వీళ్ళకి సెక్స్ వర్క్ లేదా అడుక్కోవడం ఈ రెండుదార్లే చూపించింది “ సమాజంలోని అనేక దారుణాలు, అసమానలలో ఇదొకటీ.

  “సంగమ”లో ఒక మంచి కార్యకర్తగా ఉంటూ తమవారి బాగుకోసం “రేవతి” చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా మనకి హిజ్రాల మీద ఉన్న చిన్నచూపు పోతుంది. “ఒక హిజ్రాఆత్మ కధ” పుస్తక సమీక్షను ఎంతో ఆర్తితో రాసిన భాను ప్రకాష్ గారికి కృతజ్ఞతలు

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.