cover

బడి మూసేశార్రా అబ్బోడా

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికైన 4వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.)

Download PDF EPUB MOBI

ఆ రోజు బళ్ళు తెరిచేరోజు. ప్రతి ఏడు మాదిరిగానే ప్రైవేటు బళ్ళు తెరిచి పది రోజులైనాక గవర్నమెంట్‌వి తెరుచుకున్నాయ్.  చిన్నయ్య ఉదయాన్నే నిద్ర లేచాడు. తను అబ్బోడా అని ముద్దుగా పిలుచుకొనే కొడుకు సుధీర్‌ను బడి తిస్కేల్లడానికి.

నిద్ర పోతున్న కొడుకుతో  ‘అబ్బోడా బడి తెరిచారు పోదాం పద’  అన్నాడు చిన్నయ్య.

అబ్బోడికేమో ఆ బడికి పోడం ఇష్టం లేదు. ఊళ్లో కొంతమంది పిల్లల్లాగ వాన్లో ఎక్కి టౌన్లో ఉండే బడికి పోవాలని కోరిక. ఆ బల్లో అయితే కూర్చోడానికి బెంచీలు ఉంటాయ్. ఫ్యాన్ ఉంటది. టీచర్లు బాగా చెప్తారు. మంచి బట్టలు యేసుకొని  పోవచ్చు. ముఖ్యంగా ఆడుకోడానికి చాలా బాగుంటాది. తను ఎప్పుడూ వెళ్ళే బల్లో బెంచీలు ఉండవ్. ఒకే టీచర్ ఉంటాడు. ఆడుకోడానికి వస్తువులు ఉండవ్. నాయన్ని అడిగితే ఆ బల్లో చేర్చడానికి అన్ని డబ్బులు లేవంటాడు. బడికి టైం అయిపోయిందని చిన్నయ్య తొందర పెట్టడంతో అబ్బోడు అయిష్టంగానే రెడీ అయి వాళ్ళ నాయనతో బ్రాంది షాప్‌కి కుసంత దూరంలో రాములోరి గుడికి  వెనకున్న గవర్నమెంట్ బడికి వెళ్ళాడు.

తొలిరోజు కాడంతో పిల్లలు అమ్మానాన్నల్తో మంచిగా రెడీ అయి వచ్చారు. బడి తలుపులు ఇంకా తెరుచుకోలేదు. ఎప్పుడూ బడికి ముందుగా వచ్చే మాస్టర్ ఇంకా రాలేదు. తల్లితండ్రులకు ఏమీ అర్థం కాలేదు. బడి ఎందుకు తెర్వలేదని మాట్లాడుకుండంగా, పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. పొలం పనులకు టైం అవుతుండటంతో చిన్నయ్య బడి ఎందుకు తెర్వలేదని తెలుసుకోవాలనుకున్నాడు. బడికి ఎదురుగా ఉండే టీ కొట్టుకు వెళ్ళాడు.

టీ కొట్టు రంగయ్యను “ఏం రంగన్నా బడి తెరవలేదు” అని అడిగాడు.

రంగయ్య “పేపర్ చూడ్లేదా చిన్నోడా? పిల్లకాయలు లేరని మనూళ్ళో బడి మూసేసారంటా” అని టీ వేస్తూ  చెప్పాడు.

ఆచ్చర్యపాయిన చిన్నయ్య “ఊల్లో ఉండేది ఒక్కటే బడి దాన్ని మూసేస్తే మనపిల్లలు యాడ సదవాలి” అన్నాడు.

రంగయ్య నిట్టూరుస్తూ “ఉదయాన్నే ఆ కాలేజీ కుర్రోడు చైతన్య పేపర్ సదివి చెప్పిండు. పిల్లలు గవర్నమెంట్ బడికి పోకుండా  ప్రైవేటు బడికే పోతన్నారంట. దాంతో  జిల్లాలో మొత్తం రెండొందలు గవర్నమెంట్ బల్లు ముసేసరంట రా. పేపర్లో మనూరి బడి పేరు ఉందంట” అన్నాడు.

“అయ్యో రంగన్నా పక్కూల్లో ఐనా బడి ఉండాదా?”.

“లేదు రా చిన్నోడా. కొబ్బరిచెట్ల ఊర్లో ఉందంట. పిల్లల్ని ఇక ఆడికే పంపాలి”.

“రంగన్నా ఆ ఊరు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎట్లా?”.

“పంపాల్సిందే రా” అన్నాడు రంగయ్య.

చిన్నయ్యకి ఏం చేయాలో అర్ధంగాక గమ్ముగా బడి దగ్గరికి ఎల్లిపోయాడు. పిల్లకాయల తల్లితండ్రులకి విషయం చెప్పాడు. ఇంతలో ఒకాయన “ఎండివో ఆఫీస్ లో ఆఫీసర్ ఉంటాడు అయ్యన్ని కలిస్తే బడి తెరస్తారు” అన్నాడు. చిన్నయ్య, తల్లితండ్రులు మాట్లాడుకొని ఆడికి పోవాలని నిర్ణయించారు. పొలం పనులకి వెళ్ళాలని మర్చిపోయి వెంటనే రోడ్లోకి వచ్చి ఆటో మాట్లాడుకొని పిల్లల్ని ఎంటబెట్టుకొని  ఎండివో ఆఫీస్కు వెళ్లారు.

Badi Mosesarra Abbodaఅందరు గుంపుగా ఎండివో ఆఫీస్ లోపలికి పోయారు. ఆడ కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్న అధికారిని కలిసి విషయం అంతా చెప్పిండ్రు. అయన విసుక్కుంటూ “యో వెనకాల ఏంఈఓ ఉంటాడు అయ్యన్ని కల్వండి” అన్నాడు. ఈ గవర్నమెంటోల్లు ఎప్పుడూ ఇంతే సరిగ్గానే జవాబు చెప్పారు అనుకోని అందరూ వెనక్కి వెళ్లారు. ఏంఈఓ ఆఫీస్ ఇంకా తెర్వలేదు. ఆడ ఎవ్వరూ లేరు. చిన్నయ్య “కొంచెం సేపు చూద్దాం వస్తే మాట్లాడిపోదం” అన్నాడు పిల్లల తల్లితండ్రులతో.

చాలాసేపు ఐంది. అందరూ ఇంటికి పోయి రేపు వద్దాం అన్నారు. చిన్నయ్య మాత్రం “మాట్లడేపోదాం” అని అందరికి సర్దిచెప్పాడు. పిల్లలు, తల్లితండ్రులు బాగా డీలా పడిపోయిన తర్వాత ఏంఈఓ వచ్చాడు. వచ్చీరాగానే “ఏ ఊరయ్య మీది” అన్నాడు పరిస్థితి ఊహించి. “అయ్యా మేం పెద్దోరు నుంచి వస్తన్నాం. మా ఊల్లో బడి ముసేసినారంట. మా పిల్లలకి ఉండేది ఆ ఒక్క బడే సారు” అని చెప్పాడు చిన్నయ్య ఏంఈఓను అర్థిస్తున్నట్లుగా. “పెద్దోరా? మీ ఊరు. అక్కడ బడికి పదిమంది పిల్లలు కూడా రావట్లేదని గవర్నమెంట్ బడి మూసేసింది. మీకు దగ్గరాగా కొబ్బరిచెట్ల ఊర్లో బడి ఉంది ఆడికి పంపండి మీ పిల్లల్ని” అన్నాడు తాపీగా ఆఫీస్ లోపలి వెళ్తూ.

“’ఆ ఊరు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. పోవాలంటే చాలా కష్టం సారు. ఎట్లైన బడి తెరిపించండి మీ పుణ్యం ఉంటది.”  అన్నాడు చిన్నయ్య.

కుర్చీలో కూర్చున్న ఏంఈఓ తాపీగా “ఇది గవర్నమెంట్ నిర్ణయం నేనేమి చేయలేను”. అనేసరికి చిన్నయ్య ఏంఈఓ  కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు. ఏంఈఓ కసురుకొని “ఏం చేసినా లాభం లేదు. సరే బయటికి పోయి ఒక అర్జీ రాసుకొచ్చి ఇవ్వండి” అన్నాడు. అర్జీలో ఏం రాయాలో అర్థం గాక అందరూ బయటికి వచ్చారు.

ఇంతలో అక్కడికి ఒక టీచర్ రాడంతో ఆయన్ని బతిమిలాడి అర్జీ రాయించుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి ఏంఈఓకు ఇచ్చారు. అయన తీసుకొని “పై అధికారులకు పంపుతా” అన్నాడు.

“సారుకి అర్జీ ఇచ్చేసినాం ఇక ఊల్లో బడి తెరస్తారులే” అని అందరూ నవ్వు మొహంతో ఊరికి వెళ్ళిపోయారు.

* * *

కొద్ది రోజులు గడిచింది. బడి తెరవలేదు. పిల్లలు ఆడుకుంటూ బడికి దూరమైపోయారు. చిన్నయ్య ఎన్నిసార్లు ఏంఈఓ ఆఫీస్కి వెళ్ళినా అయన దొరకడం లేదు. ఫోన్ చేస్తే నేను మీటింగ్ లో ఉన్నాను మల్లి మాట్లాడుతా అంటున్నాడు విసుగ్గా.  రోజులు కాస్తా రెండు నెలలు అయ్యాయ్. చిన్నయ్య ఇంటిది “అబ్బోడిని ఆ ప్రైవేటు బల్లో చేర్చండి లేకపోతే చెడిపోతాడు” అని రోజు చెప్తోంది. అయితే స్థోమత లేక చిన్నయ్య గవర్నమేంట్ బడి తెరస్తారులే అని చెప్తూ వచ్చాడు. మిగిలిన పిల్లల్లో కొంతమంది మాత్రం ప్రైవేటు బళ్ళో చేరిపోయారు. అబ్బోడు మాత్రం ఉదయాన్నే వాన్లో ప్రైవేటు బడికి వెళ్తున్న పిల్లల్ని చూస్తూ నేను ఎప్పుడూ అక్కడికి వెళ్తానా అనుకుంటూ రోజుల్ని వెల్లదీస్తున్నాడు. అబ్బోడి భవిష్యత్ ఏమైపోతుందనే ఆలోచన, బాధ చిన్నయ్య మనసులో ఉన్నా ఇక కొత్తగా అప్పులు చేసే ధైర్యం లేక…

*

10ctr20a

రచయిత వివరాలు

వెంకటేష్ బాబు గోరంట్ల

వృత్తి: జర్నలిజం

ఇష్టమైన రచనలు:  బారిష్టర్ పార్వతీశం, చలం రచనలు

ఇష్టమైన రచయితలు: చలం

Download PDF EPUB MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2015, జనవరి, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.