cover

మూడ్రాల్ముక్రాయి

Download PDF EPUB MOBI

అన్ని పనులు కట్టేసి మరుసటి రోజుకు శక్తి పుంజుకోవడానికి రేవుల దిన్నె ఆ రాత్రి నిద్రకు సమాయత్తమౌతుంది. వేసవి కాలం అప్పుడే మొదలౌతుంది. రాయలసీమ ఎండల్లో మసిలిన రోడ్డు, మట్టి ఇళ్ళు, అరుగులు, ప్రతి వస్తువు, జీవి – రాత్రి వీచే చల్ల గాలికి తడపాయిస్తున్నాయి.

ఆ మధ్యే ఊరి ప్రధాన రహదారి మీద వేసిన సిమెంటు రోడ్డుకు వీధి దీపాలు ఆరిపోయినా, పండు వెన్నెల విరగ కాయడం వలన పెద్ద తేడా తెలియడం లేదు. చెట్టు కొమ్మకు ఆకులు అతుక్కుని ఉన్నట్టు, ఆ రోడ్డు వెంబడి అటూ ఇటూ మట్టి ఇళ్ళు ఆనుకుని ఉన్నాయి. అక్కడో ఇక్కడో ఆర్ సీ సీ ఇళ్ళు చిలకరించినట్టు ఉన్నాయి.

మట్టి ఇళ్ళు సుమారు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పై కప్పు నుండి ఈత మట్టలు బయట వేలాడుతూ ఉన్నాయి. దాదాపుగా అన్ని ఇళ్ళల్లో మొదటగా పెద్ద వసారా లాంటి గది ఉండి అందులో ఎనుములను కట్టేసి ఉంటారు. ఆ ముందంతా గడ్డి పడి ఉంటుంది.

గంటకో అరగంటకో కర్నూలు లేదా ఆదోని వెళ్ళే బస్సులు ఇళ్ళ ముందు నుండి ‘బుఋౠన’ వెల్తూ, పశువుల మెడల్లో ‘గణ గణ’ గజ్జెల చప్పుడును, ఇంట్లో నిద్రకొచ్చిన పిల్లల ఏదుపుల అల్లరిని, రోడ్డు చివరి అరుగులో పెళ్ళాన్ని తిడ్తూ అరిచే మొగుడి గొంతును డిస్టర్బ్ చేస్తున్నాయి.

ఇంటి మధ్యలో వెలిగే ఒకే 40 వాట్ల బల్బును ఆర్పేసి, మాదేవి అరుగు మీద వాళ్ళ అమ్మమ్మ పక్కన చేరింది. మెత్తటి నూలు చీరను వంటికి చుట్టపెట్టుకుని, ఒక మోకాలు ఎత్తి మడిచి పెట్టుకు కూర్చుని నోట్లో ఆకు వక్క వేసుకుంటుంది రామ లచుమమ్మ, మాదేవి అమ్మమ్మ. మాదేవిని చూసి నవ్వినట్టుంది. యథావిధిగా ఒడిని కొంచెం ముందుకు చాపింది. మాదేవి దబ్బున తల పడేసింది అమ్మమ్మ ఒళ్ళో.

‘అబ్బ ఏం పిల్ల !’ అమ్మమ్మ తొడనొప్పిని సర్దుకుంది.

మాదేవి కిసుక్కుమంది.

మాదేవికి 20-22 ఏళ్ళు ఉంటాయి. చలాకీ పిల్ల. ఇంట్లో వ్యవహారాల్లో తల్లిదండ్రులకు తోడుగా ఉంటుంది. గోధుమ రంగు వర్ణం లో ఉన్న చర్మం పై ఎర్రటి మట్టి గాజులు వెన్నెల్లో మెరుస్తున్నాయి. మాదేవి చెవులకు రెందు మూడు బంగారు పోగులు కుట్టించుకుని ఉంటుంది. చెవి పోగులు చెవి తమ్మెపై సభలో కొలువు తీరిన రాజు, రాణి, మంత్రిలా ఒక్కో రూపంలో సైజులో ఉన్నాయి.

ఇంటి ముందు గోడను, ఆనుకున్న అరుగునూ ఇటుక రంగుతో అలికి సున్నం బొట్లు పెట్టినట్టున్నారు. ప్రధాన ద్వారానికి అటో అరుగు మీద మాదేవి, మాదేవి అమ్మమ్మ, ఇటో అరుగు మీద మాదేవి నాన్న పడుకుంటారు, వేసవి కాలం రోజుల్లో. లేదంటే అందరి పడక లోపలే. మాదేవి తమ్ముడికి బయట పడుకోవడం భయం అందునా ఇంట్లో రాత్రి పూట ఏ దొంగలు పడ్తారేమో అని మాదేవి అమ్మ – పెద్ద లచ్చిమి – కొడుకు గురప్పతో కలిసి లోపలే ఎనుములు కట్టేసిన వసారాకు ఆనుకున్న వరండాలో పడకేస్తుంది.

మాదేవి వాళ్ళ ఇంటి వద్ద నుండి బోయ గేరి (వీధి) మొదలుతుంది. ఇరవై సంవత్సరాల క్రితం బోయ గేరి ఊరికి అంత దగ్గరగా లేదు. ఊరు పెరిగి పెద్దగై బోయ గేరి ఇప్పుడు బాగా ఊరు లోపలికి వచ్చేసింది.

ఇంటి పక్కన పెద్ద రావి చెట్టు ‘నీకు నేను కొండంత అండ’ అన్నట్టు కొమ్మలు చాపుకుని ఉంది. రావి ఆకులను తోసుకుని వచ్చి మరీ వెన్నెల ఆ ఇంటి గోడలపై పడుతుంది. మట్టి గోడలవ్వడం వలన అక్కడక్కడ నీడ గోడలపై బుడిపెల్లాగ అగుపిస్తుంది.

తల వద్ద టేబుల్ ఫేను ఆన్ చేసి పెద్ద లచ్చిమి అరిచింది ‘ఓ పేయ్ ! మాదేవి ! ముందర తలుపులెయ్యి’

మాదేవి బరువుగా లేచి తలుపు దగ్గర చేర్చి పైన కొక్కెం తగిలించి మళ్ళీ వచ్చి రాం లచ్చుమమ్మ ఒళ్ళో దబ్బున తల పడేసింది. రాం లచుమమ్మ ‘ హయ్’ అంటూ కొడ్తున్నట్టుగా చేయి పైకి తీసింది. మాదేవి నవ్వుకుంటూ ఒళ్ళో ముడుచుకు పోయి తల చుట్టూ చేతులు పెట్టేసుకుంది. మాదేవికి ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గరే బాగా చనువు. అమ్మ, నాన్న , తమ్ముడు ఆ తర్వాతే. చిన్నప్పట్నుంచి గుర్తు తెలిసాక ఏ ఒక్క రోజూ అమ్మమ్మను వీడి పడుకోలేదు.

‘అవ్వా!’ మాదేవి గారాలు పోతూ, మరింతగా అమ్మమ్మ ఒళ్ళో దూరిపోతూ పిలిచింది.

‘ఊ న్..’ రాం లచుమమ్మ పంటి కింద వక్క రసాన్ని పీలుస్తూ

‘అవ్వా!’ తలతో ఒడిని కుమ్ముతూ అంది

‘అబ్బ! ఏందీపే ?! ఊర్కె పొడ్సుతావ్!’ చిన్నగా కసిరింది

‘నాకి మూడ్రాల్ముక్రాయి గావల్ల’

రావి చెట్టు కొమ్మల్లో పిట్ట అందంగా కూస్తుంది. గాలి తెమ్మెర మాదేవి చెంప మీద వెంట్రుకలను ముద్దాడుతూ వెల్లిపోయింది.

రాం లచ్చుమమ్మకు అర్థమయ్యింది ఎందుకంత గారాలు పోతుందో.

‘మీ నాయన ఆడ పొణుకుని ఉండాడు గద… అడుగుఫో’

‘అవ్వా…’ నసిగింది మాదేవి. ‘అవ్వా… ఎట్లన్న సేపీవే’

‘నా కాడ యాడుండయ్ దుడ్లు (డబ్బులు)?’ రాం లచుమమ్మ కు మనవరాలు ఏది అడిగినా మురిపమే. మాదేవి కొండ పగలకొట్టు అంటే చలిక, పార వేసుకుని ఉరుకుతుంది. మాదేవి, చనిపోయిన రాంలచుమమ్మ మొగుడి పోలికలతో పుట్టిందనీ మరీ ప్రేమ ఒలక బోస్తుంది. ఈ బలహీనత తెలిసే మాదేవి ఏది కావాలన్నా మొదట అమ్మమ్మ దగ్గరే బయట పడ్తుంది.

మాదేవి, అమ్మమ్మ ఒళ్ళో వెన్నెలతో స్నానం చేసిన భూదేవిలా ఉంది. పొడవాటి నాసిక చివర్లో గుండుగా ఉన్న మాదేవి ముక్కుపుటాలు ఆ వెన్నెల్లో రాంలచ్చిమికి ముద్దుగా అనిపించాయి. ఇంతవరకు ఎప్పుడూ గమనించనట్టు మాదేవి ముక్కురాయిని పట్టి చీకట్లోనే పరికించింది రాం లచ్చిమి.

పైట నడుము కింద లాక్కుంటూ ‘అవ్వా…’ అంటూ మరోసారి గోముగా మూలిగింది.

‘సూడ్పే! మీ నాయ్ననడుగు.. నా వద్ద డుడ్లు లేవు’

ఒక ముక్కు రాయి ఉంది కదా మరోటి ఎందుకు అని అడగని రాం లచ్చిమి, ఖచ్చితంగా కొనిస్తుందని మాదేవికి అర్థం ఐపోయింది.

ఒళ్ళో నుండి లేచి మాదేవి ‘అవ్వా… సూడ్వే నా ముక్కుకి బాండదా.. మూడ్రాల్ముక్రాయి… జెప్పు’ అంది. ఇంకా ఎగదోస్తూ ‘మొన్న బుజ్జిదానికి వాళ్ళమ్మ జేపిస్తే పెట్కొచ్చింది మన సాపుకి. దానికైతే ఎంత బాగుందో…. దానికైతే కొనిపిచ్చే వాల్లుండారు… నాకి?… నాయ్నేమో ఓటి కూడా కొనీడు.. దుడ్లొస్తే టాక్టురు గొనల్లని అన్ని సేటు బేంకిలో ఏస్తాడు…’

‘ఊర్కే వాగొద్దు. నా వద్ద ఇప్పుడు దుడ్లు లేవు. సాపులో యాపారం నీకు తెలుసు కదా?… దుడ్లు ఇంకొన్ని మిగిల్సినాక కొంటా’

రాం లచ్చిమి భర్త చనిపోతూ మిగిలించిన ఆస్తి ఆ ఇల్లు, ఆ ఇంటిని ఆనుకుని ఉండే ఒక మోస్తారు షాపు. షాపులో బియ్యము, పప్పులు లాంటి కిరాణా వస్తువులతో పాటు, కొన్ని చిన్న చిన్న బొమ్మలు, వక్కలు, పెన్నులు, పెన్సిళ్ళు లాంటి వివిధ రకాల వస్తువులు అమ్ముతారు. వీటితో పాటు ఒక పబ్లిక్ టెలిఫోను బూతు ఉంటుంది. అదో చిన్న సైజు డిపార్ట్మెంటల్ స్టోర్ ఆ ఊరికి.

‘సాపు నడ్పినందుకు నాకేమన్న జీతమిస్తుండవా? ఊర్కే చెస్తండ కదా’ మాదేవి, వాళ్ళ అమ్మమ్మనుండి ఏదోలా లాగాలి అన్నట్టు.

‘యప్పో! నీకు జీతం గూడ కావల్లా? సర్లే సాపు నేనే జూస్కుంటా ఆ జీతం నాకే మిగుల్తది’ అదే ఎకసెక్కంతో రాం లచ్చిమి బదులిచ్చింది.

‘ఇన్ని రోజులు జేసిందానికి ఎవుడిస్తాడు అది సెప్పు’ అంది మాదేవి

ఇకా మాదేవితో వాదనొద్దనుకునిందో ఏమో ‘సూడు నేను కొంచం దుడ్లేస్త. మీ మామ చిట్టీకి తిప్పే నా దుడ్లల్లో కొంచెం తీస్తా ఐతే….’ అంది.

మాదేవి లోపల్లోపల చాలా ఖుష్ అయ్యింది. అది చాలు తనకు ముక్రాయి తెచ్చుకోడనికి. రుణ మాఫీ చేస్తే గుండె మీద బరువు తగ్గించుకున్న రైతు మనసల్లే మాదేవి గండె తేలికయ్యింది. ఆ మూడు రాళ్ళ ముక్కురాయి తన ముక్కు మీద నిజంగా అతుక్కుని ఉన్నట్టే ఫీల్ అయ్యింది. ఎవరో తనను చూస్తుంటే సిగ్గు పడ్డట్టు నవ్వి , ఒళ్ళో నుంచి తల తీసి, అమ్మమ్మ నడుము చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకుంది. మాదేవి బుగ్గల మీద పూసిన నవ్వు ఏ మధ్య రాత్రో నిద్ర పోవాలని నిర్ణయించుకుంది.

* * *

ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం యమ్మిగనూరు కాలేజీలొ చదివి, పరీక్షలు దగ్గరకొచ్చినప్పుడు చదువు ఆ పేసి అమ్మమ్మతో పాటు ఆ కొట్టు వ్యవహారం చూస్తుంది మాదేవి. కొట్టు బాగా నడుపుతుందని మాదేవికే కొట్టు వదిలేసి, రాం లచ్చిమి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. మధ్యలో ఇంటి పనుల్లో కూతురుకు సాయపడ్తుంది. మాదేవి వాళ్ళ నాన్న సాధారణంగా కొట్టు విషయం పట్టించుకోడు. తనంతా వేరుసెనక్కాయ పంట, ఆయిల్ కంపనీకి అమ్మడంలో, ఆయిల్ కంపనీ నుండి అప్పు తీసుకోవడం, సర్దడం లో బిజీగా ఉంటాడు.

మాదేవే కర్నూల్ వెళ్ళి సరుకులు బేరమాడి కొని కొట్టులో పెట్టి, కొనడానికి వచ్చిన వాళ్ళతో సరిగా బేరమాడి బాగా నడపగలుగుతుంది.

ముందు రోజు మధ్యాహ్నం వీరేశు షాపుకు రాక పోయి ఉండి ఉంటే ఆ రాత్రి రాం లచ్చిమి వద్ద మూడు రాళ్ళ ముక్కురాయి కోసం నస పెట్టేది కాదు.

వీరేశు, మాదేవితో పాటు పదో తరగతి వరకు చదివి, చదువు ఆపేసి పొలం పనులు చూసుకుంటున్నాడు. మాదేవి చిన్నప్పట్నుంచి వీరేశు బాగా పరిచయం. వీరేశు వాళ్ళ ఇళ్ళు కూడా అదే బోయ గేరిలో ఉంటుంది. స్కూలు చదువు అయ్యాక వీరేషు చదువు ఆపేసి పొలం పనులు చూసుకుంటాడు. మాదేవికి వీరేశు అంటే చిన్నప్పట్నుంచీ అభిమానమే. మిగత బోయొళ్ళ పిల్లల్లా కాకుండా వీరేశు ఒద్దికగా ఉంటాడు. ఆ బోయ గేరిలా బుద్దిమంతుడు ఎవరంటే అందరూ తడుముకోకుండా సమాధానం ఇచ్చేది ‘వీరేశు’ అనే.

ముందు రోజు మధ్యాహ్నం షాపు దగ్గర ఎవ్వరూ లేరు. సాధారణంగా మద్యాహ్నం పూట తక్కువ గిరాకీ నడుస్తుంది. మాదేవి సాక్షి పత్రిక తీసి అందులో సినిమా వార్తలు చదువుతుంది. వీరేశు షాపు వద్దకు వచ్చి నిల్చున్నాడు. ఎవరో అన్నట్టు పేపర్లో నుండి తలెత్తి చూసిన మాదేవి బుగ్గలనిండా నవ్వు పులుముకుంది. కొద్దిగా బొద్దుగా ఉంటుందేమో బుగ్గలు కళ్ళ కిందకు జరిగి పొడువాటి కంటి రెప్పల అందాన్ని వ్యక్త పరిచాయి.

వీరేశు సన్నగా ఐదున్నర అడుగులుండి గట్టి శరీరం కలిగి ఉంటాడు. మాదేవి కన్నా వర్ణం మెరుగు. పొట్ట గుండెకు సరి సమానంగా ఉండి దృఢత్వాన్ని తెలుపుతుంది. సన్నటి మీసాలు. ఒత్తైన జుట్టు. బోయ గేరిలో పెద్ద మనుష్యుల్లో తలలో నాలుకగా ఉంటాడు. ప్రతి మనిషిని తనివి తీరా పలకరిస్తాడు. రేవుల దిన్నె రెడ్డి ఏ పని చేసుకు రావాలన్నా, తనతో తోడుగా హైదరాబాదుకు నమ్మకంగా వెంటబెట్టుకుని వెళ్ళేది వీరేశునే.

వీరేశు షాపు ముందు వరసలో ఉన్న గాజు సీసాల వద్దకొచ్చి నిలబడ్డాడు నవ్వుతూ. మాదేవి ‘కుచ్చో వీరేస’ అని షాపుకు రెండు పక్కల వేసిన బెంచీలను చూపించింది.

‘ఏం వీరేశా, ఈ మద్దిన కంపిచ్చడం లేదు ?’ అడిగింది. జవాబు వినాలనే శ్రద్ధత గొంతులో ధ్వనించింది.

‘రెడ్డి ఐదరబాదుకు తీస్కొని బోయ్ నాడు’

‘ఏమంట?’

‘సుమోకి మోటారు పార్టు కావలంట, యాదొ కంపనీ సీడు యాపారానికి పిలిసిన్నంట… ఇంగేమో మణెమ్మ రెడ్డమ్మ సిన తమ్ముడు అమెరికా పోతున్నడంట… అట్ల యావో అన్ని పనులుండే.. ఇంగ రెండ్రోజులు ఆన్నే ఉండినాము’

‘మొత్తం రెడ్డి ఇంట్లో వాళ్ళొచ్చినారా ?’

‘ఆ మరి… మనెమ్మ రెడ్డమ్మ తమ్మున్ని ఇమానం ఎక్కించల్ల కదా’

కొన్ని క్షణాలు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. మాదేవి గాజు సీసా నుండి బర్ఫీ తీసి వీరేశు చేతికిచ్చింది. వీరేశు అందుకుని ‘ఈ రెండ్రోజులు ఏం చేస్నావ్ మాదేవి? కర్నూలుకేమన్న పొయింటివా?’

వీరేశుకు, మాదేవికి ఇద్దరికీ తెలుస్తుంది… రెండు రోజులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేక పోవడం, మాట్లాడుకోలేక పోవడం వలన వెలితిగా అనిపిస్తుందని.

మాదేవి ‘లేదు’ అంది తాను కూర్చునా కుర్చీ షాపు ముందు వరసలోకి లాక్కుని.

వీరేశు ఎంత పనుల్లో ఉన్నా, మాదేవికి షాపు వద్ద పనులెన్ని ఉన్నా మాదేవి, వీరేశు రోజుకొక్కసారి ఐనా కనీసం ఓ పది నిమిషాలు కలవకుండా మాట్లాడకుండా ఉండరు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి వల్లమాలిన అభిమానం. ఎప్పుడూ నోరు విప్పి ఒకరికొకరు ఏమీ వ్యక్త పరుచుకోలేదు. కాని ఇప్పటికి ఏ వంద సార్లు ఒకరి మనసు మరొకరికి చెపుకుని ఉంటారో అన్నట్టు ఉంటుంది వారి మాటల్లో భావన. రేవుల దిన్నెలో తోటలు లేవు వాగులు లేవు. ఇన్ని సంవత్సరాల పరిచయం లో ఇద్దరు కలిసి ఎన్నో ప్రదేశాలు చుట్టేసినట్టు ఉంటుంది వారి సాన్నిహిత్యం.

‘మాదేవి!’ నెమ్మదిగా పిలిచాడు వీరేశు.

‘ఏం వీరేశ?’ మాదేవి మార్దవంగా బదులిచ్చింది

‘నీ ముక్కుకేమన్నా చేపించొచ్చు గదా’ వీరేశు మాదేవి మొహం లోకి చూస్తూ అడిగాడు.

మాదేవి అలానే తల తమాషాగా తిప్పుతూ ‘ముక్రాయి కనిపించడం లేదా?’ అనింది పెదాల మీద చిరునవ్వుతో.

‘నీ ముక్కుకు మూడ్రాల్ముక్రాయి బాగా ఒప్పుతుంది మాదేవి’

‘ఎందుకనిపిచ్చింది ?’ ఆసక్తిగా అడిగింది.

‘మొన్న మనెమ్మ రెడ్డమ్మ ఐదరాబాదు నగల షాపులో ముక్రాయిలు చూస్తుంటే అనిపిచ్చింది మాదేవి’

ఒక క్షణం ఆగి అన్నాడు ‘మాదేవి, రెడ్డి వద్ద కొంచెం బాకీ తీస్కొని ఇస్త. మన కంసలి క్రిస్నన్న తావ చేపిచ్చుకుంటావా?’

మాదేవి నవ్వుతూ వీరేశు కళ్ళల్లో కనిపిస్తున్న అభిమానాన్ని చూసి ఆనందిస్తుంది. మాదేవికి తెలుసు వీరేశు స్థోమతకు అది ఎక్కువ పెట్టుబడి అని. గత సంవత్సరం వీరేశు నాన్న ఏదో గుర్తు తెలీని వ్యాధితో చనిపోయాక కుటుంబం కొంచెం చితికింది. ఐతే ఉన్న ఐదెకరాలు రెడ్డి బావి కింద ఉండడం తో ఆపై జీవితం గడవడానికి పెద్ద చింత లేక పోయినా, త్వరగా ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకోవడం సమస్యే. వీరేశు మొహం లోని ఆతృత మాదేవికి ముచ్చట తెప్పించింది.

‘మనెమ్మ రెడ్డమ్మకైతే బాంటాది వీరేశా! నాకేం ఒప్పుతది చెప్పు’ మాదేవి ఉద్దేశ్యము వీరేశు నోటి నుండి విందామని.

ఒక చిన్న నవ్వు నవ్వాడు. మరి అది సిగ్గొ, తనకు మాదేవి గడుసుతనం తెలుసు అనో లేదా ఎలా వ్యక్తపరచాలి అనే సంశయమో తెలీదు.

‘మాదేవి, నీ ముక్కు రాంబాణం పువ్వులా ఉంటాది, ఒక్క రాయి కంటే మూడ్రాల్ముక్రాయి బాగా అతికినట్లుంటాది’

ఆ తర్వాత ఏదో అన్నాడు కాని మాదేవి ఆలోచనలు వీరేశు వ్యక్తీకరణలోని అర్ధ్రత మీదనే ఆగిపొయాయి.

వీరేశు వెల్లిపోయాక రాం బానం పువ్వులా తన ముక్కు ఉంటుందనే పోలికను తన కోసం వీరేశు ఎన్నుకోవడం చూసి మాదేవి ఆలోచనల్లో పడింది – వీరేశు తనను ఎంత పరిశీలనగా చూసాడు అని, తన గురించి ఎంత ఆలోచించాడు అని.

ఒక అరలో కవరు తీసి ఒక కొత్త చేతి అద్దాన్ని తీసి మొహం ముందు పెట్టుకుని నాసికను పరిశీలించుకుంది. అప్పుడు మాదేవి బుగ్గల మీద పూసిన అదే నవ్వే మరుసటి రోజు రాత్రి మళ్ళీ తలుక్కుమంది.

* * *

అమ్మమ్మ వద్ద మాట తీసుకున్న మాదేవి, మరుసటి రోజు పొద్దున్నే షాపు తెరిచిన వెంటనే పబ్లిక్ ఫోను నుండి కర్నూలులో మామకు ఫోను చేసింది తాను వస్తున్నట్టు. మధ్యాహ్నం బస్సు పట్టుకుని కర్నూలు వెళ్ళిపోయింది మాదేవి. అమ్మమ్మ తప్ప ఇంట్లో వాళ్ళు అందరు షాపుకు సరుకుల కోసం వెళ్ళి ఉంటుందని ఊహించుకున్నారు.

కర్నూలు బస్ స్టాండుకు మాదేవి మామ – దస్తగిరి – వచ్చాడు. దస్తగిరి కర్నూలులో సెకండ్ హేండు సెల్ ఫోన్లు అమ్ముతుంటాడు. చీటి వ్యాపారం కూడా చేస్తుంటాడు. రేవుల దిన్నెలో బోయ గేరిలో ఉండే సెల్ ఫోన్లలో సగం దస్తగిరి అమ్మినవే.

ఇంటికెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కుని దస్తగిరి వద్ద నస మొదలు పెట్టింది మాదేవి.

దస్తగిరి ‘అదిగాదుపే మాదేవి, అమ్మ ఇప్పుడిప్పుడు సీటి దుడ్లెత్తమంటే యాన్నుండి తీస్క రావల్ల నేను?’ అన్నాడు.

మాదేవి కాసేపు మౌనంగా ఉండి ‘వచ్చే నెల చీటి దుడ్లు ఈ తావ ఎవురి వద్దనన్నా తీస్కొ ముందే……. వచ్చే నెల అవ్వ చీటి పాడినట్ల చెప్పి తీస్కో’

‘నీ మాట ఇంటే ఎవురన్నా నవ్తారు’ బదులు చెప్పాడు దస్తగిరి.

‘మనమేమన్న దుడ్లెత్తుకు బోతున్నమా జనాల్వి ? ఎట్లన్నా గట్టల్ల కదా వాల్లు’

‘అట్ల కాదు గాని… వచ్చే నెలదాంక ఓపిక బట్టు. ఇంగ నీకు వర్రీనె వద్దు. నేనిస్తా’

‘అట్లేం లేదు నాకి మూడ్రాల్ముక్రాయి ఇప్పుడే గావల్ల’

దస్తగిరి పెద్దగ నవ్వి ‘నీకి మూడ్రాల్ముక్రాయి గావల్లా?’ అన్నాడు

మాదేవి మొహం బుంగ పోయింది.

‘ఏం నాకి బాండదా?’

దస్తగిరి సముదాయిస్తున్నట్టు ‘అట్లకాదు పే, ఇయాల్రోజుల్లొ ఎవురు పెట్టుకుంటరు ముక్రాయి… అదీ మూడ్రాల్లతో’

‘నాకి కావల్ల’ అదే బుంగ మూతితో మాదేవి బదులిచ్చింది.

‘నీవింటవా.. ఒగ మాట చెప్తే’ అని దస్తగిరి మాదేవి గడ్డం ఎత్తుతూ అడిగాడు.

‘నేనినను’

‘నీకి మూడ్రాల్ముక్రాయి బలే ఉంటది. అంతకంటే బాగుండే సమాధానం ఒకటి చెప్తా ఇంటవా?’ అదేదో తనకు సాయం చేసే మాటనే అన్నట్టు అనిపించి ‘చెప్పు’ అని తల తిప్పుతూ అంది మాదేవి

‘నీకి సెల్ ఫోనిస్తా ఒకటి.. దుడ్లేమీ ఇయ్యొద్దు… నీతానే పెట్టుకో… అర్ధం రేటు లెక్కన అమ్మ చీటి దుడ్ల నుంచి తీసుకుంటా… అదీ ఇప్పుడొద్దు… రెన్నెల్ల తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటా.. చూడు మరి’ ఆపకుండా సూటిగా చూస్తూ చెప్పాడు దస్తగిరి.

మాదేవి చటుక్కున దస్తగిరి వేపు తల తిప్పింది.

మాదేవి వెంటనే ఆలోచనల దారాన్ని తడుముకుంది. ఎన్ని సార్లు రెడ్డితో కలిసి వీరేశు హైద్రాబాదు పోయినప్పుడు మాట్లాడాలి అనుకుని ఎన్నో సార్లు ఆగిపొయింది, ఊర్లో అల్లటప్పా తిరిగే యువకులు ఏదో సెల్ ఫోను డాబుగా మెయింటెయిన్ చేయడం, రోడ్డు మధ్యన సెల్ ఫోను పట్టుకుని మాట్లాట్టం చూసి మాదేవికి చాలా సార్లు అనిపించింది వీరేశుకు ఒక సెల్ ఫోను ఉంటే బావున్ను అని. తనకు మూడ్రాల్ముక్రాయి చేయించాలని వీరేశు పడిన తపన చూసి తాను చేయించుకోవాలని అనుకుంది కాని తన గురించి ఆలోచించే వీరేశుకు తను ఏదైనా ఇవ్వాలనే ఆలోచన తనకు కలగలేదు.

మామ మంచి సూచన ఇచ్చాడు. తాను సెల్ ఫోను కొని అమ్మమ్మ, అమ్మ, నాన్న కళ్ళు గప్పి వీరేశుకు బహుమతిగా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. తన మీద చూపే గారాబాన్ని ఏదోలా మసి పూసి మారేడు చేయగలదు మాదేవి. దస్తగిరి మామ సలహా బాగుందనే అనిపించింది. తాను వీరేశు చేతుల్లో సెల్ ఫోను ఉంచి వీరేశు కళ్ళల్లో చూస్తున్నట్టు ఊహించుకుంది మాదేవి.

‘ఐతే పోదాం పా’ అని దస్తగిరి అనడంతో మాదేవి దస్తగిరితో పాటు బయలు దేరింది. దస్తగిరి తన మోపెడ్ మీద కూర్చొబెట్టుకుని షాపుకు తీసుకెల్తూ మాదేవిని ‘నీవు పెట్టే పోరుకు శత్రువులు కూడా పారిపోవల్ల సూడు ‘ అని కామెంట్ చేస్తే మాదేవి విజయ గర్వంగా నవ్వుకుంది.

మార్గం మధ్యలో ‘తనకు కలర్ నోకియా ఫోను తప్ప ఏది తీసుకోను’ అని నస పెట్టింది. షాపు కెళ్ళి సెల్ ఫోను మోడల్ ఒకటి వెతికి వెతికి సెలెక్ట్ చేసుకుని చివరికి దస్తగిరి ప్రిపేర్ ఐన బడ్జెట్ ను కూడా తారు మారు చేసింది.

* * *

మూడ్రాల్ముక్రాయి కోసం వెళ్ళిన మాదేవి, చేతిలో సెల్ ఫోనుతో తిరిగొచ్చేసరికి రాం లచ్చిమి కొంత ఊహించగలిగింది. మాదేవి వాళ్ళ అమ్మ కొంచెం నసిగినా మళ్ళీ సర్దుకుంది ఏదో పిల్ల ముచ్చట పడిందిలే అని. మాదేవి తమ్ముడు ఎంతో ఉత్సాహంగా ఫోనును అటు తిప్పి ఇటు తిప్పి అది నొక్కి ఇది నొక్కి చూసి ఆనందించాడు. మాదేవి వాళ్ళ నాన్న ఇది తన జేబుకు ఏ మాత్రం చిల్లు పడకుండా జరిగిన వ్యవహారం అయి ఉంటుందని పెద్ద పట్టించుకోలేదు.

మరుసటి రోజు వీరేశు చేతిలో పెట్టి వీరేశు కళ్ళల్లో తనపై అభిమానాన్ని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది మాదేవి. ఎలాగో వీరేశుకు కబురంపింది ఆ రోజు సాయంత్రం బుడ్డల చేను వద్దకు రమ్మని. సాయంత్రం వీరేశుని కలిస్తే ఎలా అందజేయాలో ఆ తర్వాత తాను సెల్ ఫోను ఎలా పోగుట్టుకుందని ఇంట్లోఅవాళ్ళకు ఎలాంటి కథ వినిపించాలో ఆలోచిస్తూ పరధ్యాన్నంగా గడిపింది ఆ రోజంతా.

* * *

బుడ్డల చేను ఆ సంవత్సరం వర్షాలు రాకపోయేసరికి రెడ్డిని బతిమాలి పంపు నీళ్ళు వదిలించుకోవడం తో కొంచెం నదురుగా ఉంది పంట. బూడిద, ఇటుక రంగు కలిసిన మట్టి మీద వేరుశనగ మొక్కలు పచ్చగా పరుచుకుని చేను పెళ్ళి పట్టు చీరలా మెరుస్తుంది. మాదేవి మడి గట్టు మీద కూర్చుని అటు పక్క కుంగే సూర్యున్ని చూస్తుంది. ఇంత నెమ్మదస్తుడిగా ఉండే సూర్యుడు మిట్ట మద్యాన్నం అంత రెచ్చిపోతాడెందుకో అనుకుంది మాదేవి.

మడి గట్టు మీద అటువేపు నుండి వీరేశు వస్తూ కనిపించాడు. మాదేవికి మొహం నిండా నవ్వు వ్యాపించింది. మాదేవి వీరేశును చూస్తూ నవ్వుతూ మడి గట్టు మీదే కూర్చుండి పోయింది. వీరేశు వచ్చి కొంచెం దూరంగా కూర్చున్నాడు.

moodraalmukraayiiii‘ఏం మాదేవి అర్జెంటుగా రమ్మని పిల్సినావంట?’ అడిగాడు వీరేశు.

మాదేవి అదే నవ్వు మొహంతో వీరేశు కళ్ళలోకి చూస్తూ ‘వీరేశా, నాకి మూడ్రాల్ముక్రాయి బాంటదా?’ అంది.

‘ఆరోజే చెప్పినా బాంటాదని. నన్ని ముక్రాయి గొనమంటవా మరి?’ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా అడిగాడు

‘అట్ల కాదు… నేనే నీకు కొందామనుకున్నా ఒకటి…’

‘ఏంది.. ముక్రాయా…’ అని ఫక్కుమన్నడు వీరేశు

‘అబ్బ యిన్ రాదా చెప్పేది… నేను మొన్న కర్నూలు పొయ్ నీకోసం ఒకటి కొన్నా…’ ఏదో సస్పెన్స్ త్వరలో విప్పబోతున్నట్టు చూసింది మాదేవి.

‘ఏంది?’ అడిగాడు వీరేశు. గొంతులో ఒక మూల ఆసక్తి ధ్వనించింది.

మాదేవి కొంగు చాటు నుంచి తీసి సెల్ ఫోనును వీరేశు చేతిలో పెట్టింది.

వీరేశు చేతిలో మొబైలును రెండు క్షణాలు అలానే చూసి… మొహం లో ఏ ఎక్స్ ప్రెషను లేకుండా మాదేవిని ‘ఇదెందుకు తీస్నావు మాదేవి?’ అన్నాడు.

మాదేవికి వీరేశు మొహం లో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించక పోయే సరికి రవ్వంత ఆశ్చర్యమేసి మాదేవి వీరేశు ఎక్స్ప్రెషన్ ను అంచనా వేయ సాగింది

‘మొన్న కర్నూలుకు ముక్రాయి గురించి కదా పోయినావు?’ అడిగాడు వీరేశు.

‘అహా… లేదు …. నా ముక్రాయి కంటే నీ తాన ఇదుంటేనే బాగుంటది అనిపించి ఇది కొన్నా..’ ఊర్లో మీసాలు రాని పిల్లల వద్ద కూడా సెల్ ఫోను పెట్టుకుని ఫోజు కొడ్తుంటే వీరేశు ఎందుకు ఎగ్జైట్ కాలేదో మాదేవి బుర్ర అన్ని కోణాలను లోపలే తడుముకుంటుంది.

‘నీకు నచ్చలేదా?’ మాదేవి వీరేశులో ఏ మూల ఆసక్తి దాగి ఉందో వెతుకుతుంది.

‘నచ్చడం నచ్చక పోవడం కాదు. ఎందుకింత కష్టం నీకు అని…’

‘నీకు నచ్చలేదా…?’ రెట్టించింది

‘అట్ల కాదు…..’

వీరేశు తనకు తట్టనిదేదో చెప్పలనుకుంటున్నాడు అని అర్థం అయ్యింది మాదేవికి.

‘చెప్పులె…’ అంది

‘మాదేవి…. నాయ్న సచ్చిపొయింతర్వాత నేను ఏమన్న ఖర్చు పెట్టి కొనిన్నా…. నాయ్న పోయిన్ తర్వాత ఇంట్లో సొంతంగా ఏమి కావాలనుకున్నాము ఏమి వద్దనుకున్నాము అన్న ఆలోచనలు లేకుండా పొయినాయి…. బువ్వ బట్టలు తప్ప….’

మాదేవి వింటూ ఉంది

‘రెడ్డి, కుటుంబాన్ని మొత్తం ఎంత దగ్గర తీసినాడు అంటే… ఏం రా వీరేశు బట్టలు కావాల్న అని అడిగితే కాని నేను కొత్త బట్టలు తీసుకోల్యా. రెడ్డి నీళ్ళు పెడ్తేనే పంట. పంట పండితేనే కోర్కెలు. పంట ఏం ఇత్తనం ఎంత ఏయాలా అనేది రెడ్డి సెప్తాడు. నేను ఏస్తాను. ఈడ రెడ్డి సెప్పినట్టు ఇనాలా వద్దా అని ప్రశ్న కాదు. రెడ్డి సెప్పినట్టే ఇనాల్సిన పరిస్తితి. ఐదరాబదుకు పోయినా, ఆదోనికి పోయినా నేను ఎంట ఉండాల రెడ్డికి. ఆయన ఎంటనే ఉండే వీరేశు ఆయన ఎట్ల ఉండాలనుకుంటాడో అట్లనే ఉండాల. అట్లని రెడ్డి నాకు తక్కువ జేస్తుండాడని కాదు. ఉన్నంతలో జూసుకుంటాడు. ఐతే ఆయనకు తెల్యకుండా నా దగ్గర ఏం జరిగినా ఆయన చుట్టు పక్కన పపంచంలో ఆయ్నకు ఏదో పోగొట్టుకున్నట్లే ఉంటాది. అట్ల అని మమ్మల్ని అనవసరమైన పెత్తనం చేసి ఇబ్బంది పెట్టేదేమీ ల్యా. ఇరవై నాలుగ్గంటలు తన మీదే ఆధారపన్నోడు తనకు తెలీకుండా యాదో విలాసానికి అలవాటు పడ్తుండాడు అంటే రెడ్డికి రుచించదు మాదేవి! రెడ్డి నా సెల్ ఫోనునేమీ గుంజుకోడు. అట్లాటోడు కాదు. నా పంట బతుకు ఆయన మీద ఆధారపన్యప్పుడు ఆయన ప్రమైయం లేకుండా నా బతుకులో కొన్ని మార్పులు జరుగుతుండాయి అని ఆలోచన వాయనకు తెప్పీడం నాకు అవ్‌సరమా? ఆ మార్పులు ఆయ్‌నకు ఇసుమంత అపకారం కాదు అని నాకు తెలుసు. ఆయనకుండే కార్నాలను బట్టీ, అవి మంచో చెడో, ఆయన కొత్త రకం మాటలు మెచ్క పోడు. వాయన దృష్టిలో వీరేశు అలవాట్లలో వీరేశు నడకలో తనకు తెలీకుండా మార్పు రాదు అని. అట్ల అని నీతో పెళ్ళి గురించి ఏమన్నా అంటాడా అని అనుకొవద్దు. రెడ్డి మన పెండ్లి దగ్గరుండి వైభోగంగా జర్పుతాడు. అది ఖచ్చితం… అన్నింటికంటే ప్రధానంగా ఆయన కండ్లముందు పెళ్ళి అయ్యిందన్న తృప్తి ఆయనకెక్కువ. ఆయ్‌న మీద ఆధారపడ్తున్న నాకు ఆయ్‌న సంతోషపడితే నష్టం ఏముంది… ఇగో నీ చేతిలో ఉన్న సెల్ ఫోను తీసుకునేటప్పుడు ఒగటికి రెండు సార్లు ఆలోచించడం తప్ప…’ అని నవ్వుతూ గట్టు మీద వేసి ఉన్న మాదేవి అరచేయిని మెత్తగా తట్టుతూ నవ్వాడు.

మాదేవి నవ్వింది… వీరేశు చెప్తున్న లాజిక్ అర్థం అవుతుంది….

‘మాదేవి.. రెడ్డి మీద మనం బత్కుతున్నం. రెడ్డి కూడా మన మీద బత్కుతున్నడు. మనం బైటికి చెప్పుకుంటాము రెడ్డి మీదనే బత్కుతున్నట్టు. చెప్పకున్నా అది అందరికీ అర్థం అయితది. యామంటే మన జీవనాధారం యాడుందో అందరికీ ప్రతిక్షంగా తెల్సు కాబట్టి. రెడ్డి మన మింద ఆధారపడి బత్కుతున్నా, ఆ మాట ఆయన నోరు తెర్సి చెప్పుకోలేడు. ఆయన జీవనాధారాన్ని మనం సాశించడం లేదు గాని… మనం లేకుండా ఆయన జీవనాధారం ఇబ్బందిలో పడ్తది. ఆయ్‌నను కాదని ఆయ్‌నను ఇబ్బంది పెట్టి మనం జరుపు కునేది ఏమీ లేదు. ఆపైన ఊర్లో ఉన్నంత సేపు ఊర్లో లేనంత సేపు మొత్తం టైము ఆయనతోనే ఉంటా. ఆయన నా పంటకు ఏమి కావాలో ఆలోచించి సాయం సేస్తున్నడు. ఆయన తత్వం అట్లా ఉంది… ఆయన ఆధారపడ్డోల్లందరూ ఆయ్‌నను తెల్యకుండా వాల్ల వెవారంలో అలవాట్ల లో తేడా జూపిత్తే కంపం పడ్తడు.’ వీరేశు ముసిముసిగా నవ్వాడు

మాదేవి వీరేశు ఊర్లో అందరికీ తలలో నాలుక ఎందుకయ్యడో ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది.

‘ఓ పంజేస్తా… రెడ్డమ్మకు కూడా అర్థం అయ్యెతట్టు రెడ్డికి అర్థం అయ్యేతట్టు సెల్ ఫోను గురించి సమయం చూసి చెప్పుకుంటా. వాల్లకు అప్పుడు కంగారు ఏమీ లేదు అని అర్థం చేపించడానికి ఒక నెల పడ్తాదేమో……. అప్పుడొచ్చి నీ తాన సెల్ ఫోను తీసుకుంటా….’ అని అన్నాడు వీరేశు.

మాదేవి వీరేశు ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడో అర్థం అయ్యింది.

‘అప్పుదు నీ వద్దకు వచ్చి… సెల్ ఫోను తీసుకుని ఒకటి అడుగుతా..’

‘ఏంది.. ?’

‘సెల్ ఫోను సైలెన్సు లో ఎట్ల పెట్టాలా అని….’

వీరేశు కళ్ళు నవ్వుతున్నాయి. మాదేవి మొహం మీద వెంట్రుకలు వెనక్కు తోసుకుంటూ నవ్వుతుంది.

దూరాన ఎనుముల మంద రేపిన దుమ్ము వెనక నీరెండ నారింజ రంగులో ఉంది. చేను మొత్తం ఇద్దర్నీ చూసి పచ్చగా మురిసిపోతుంది.

– పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కథ, జనవరి and tagged , , , , , , .

7 Comments

  1. Pingback: అజాత | కినిగె పత్రిక

  2. కథ బాగుంది. భూత, వర్తమాన, భవిష్యత్ గురించి చెప్పినప్పుడు కొద్దిగా “గ్రామర్” చూసుకుంటే సరిపోతుంది.
    వస్తువుకీ, వాతావర్ణానికీ సమాన హోదా కల్పించడం వల్ల కథలో దృశ్యం కళ్ళకు కట్టినట్టు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కథలో బిగి ఉంది. అల్లిక అందంగా ఉంది. రచయిత తన కలం కెమెరాను ఆకాశం నుండి చిత్రీకరిస్తూ మాదేవి ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్ళడం ఒక ఆర్ట్ సినిమాను గుర్తు చేసింది.

  3. మనసును సృశించిన మంచి కధ.విలువల ఔన్నత్యాన్ని పొదిగిన పల్లెటూరి సజీవచిత్రం.చెప్పదలచుకున్నదాన్ని సూటిగాచెప్పి అనుబంధాల మాధుర్యంతో సందేశాన్ని అందించారు.

  4. రాయలసీమ కు మరో గొప్ప కథకుడు పుట్టాడు.ఫ్యూడల్ సమాజంలో ఆధునికత అందుకోవాలంటే ఎంత కష్టమో, కట్టడి చేయబడ్డ వీరేశం ఆలోచనలు చెబుతున్నాయ్. వేరేశం లేకుండా రెడ్డి మనుగడ కష్టమే కానీ రెడ్డి లేకున్నా వీరేశం మనగలిగే స్థితి ఉన్నా ఫ్యూడల్ సమాజాలు కింది కులాల ఆలోచనలు , బావోద్వేగాలు, ప్రేమలు, కట్టు , బట్ట, తిండి ఇవేమీ ఎవరకి నచ్చినట్లు వాళ్ళకు అందకుండా చేయడమే రెడ్డి తత్వం. దాన్ని పతనం చేసే శక్తి మాదేవి ప్రేమలో ఉంది, సెల్ ఫోన్ తీసుకున్నా రెడ్డి ప్రతి గటనకు విరుగుడు మాదేవి లో ఉంది. గొప్ప నవలకి కావాల్సిన సరుకు ఉంది ఈ కథలో, ఇంకా మాదేవి జీవితాన్ని రాస్తే అది అంటరాని వసంతం అంత గొప్ప నవల అవుతది”మాదేవి, అమ్మమ్మ ఒళ్ళో వెన్నెలతో స్నానం చేసిన భూదేవిలా ఉంది” ఎన్నాలయింది ఇంత మంచి వాక్యాలు విని. అరుణ రాసిన ‘ఎల్లి’ నవల లో ‘పారోతి’ కేసవరెడ్డి మునెమ్మ లా అనిపించింది. ఈ మధ్య నేను చద్విన గొప్ప జీవితం ఇది