cover

ఎక్కాలిక్కాలు

Download PDF EPUB MOBI

మద్దేన్నం ఇంటికి బెల్లుగొట్టినారు. అందురూ ‘పోలో’మనిండ్లకు పరిగెత్తినాము ఇంట్లోకి కాలు బెట్న్యానో లేదో! మా మాసంద్రవ్వ గొంతినిపించింది. పరిగెత్తిపోయి మాయవ్వ కొంగుబట్టుకున్న్యాను. ‘రాజాకుట్టీ పల్లికూటం నించి వొచ్చేసినావా? సంగట్దిని మళ్లీ బోవాలేమో గదా!’ అంటా నా వొళ్లంతా నిమరతావుంది. మాయక్కతో గూడా మా సిన్న పెదనాయిన కూతురు నీలక్కొచ్చింది లోపలికి. మాయక్క పక్క జూసినాను అప్పిటికే మా నీలక్కదెచ్చిందేమో రోజాపువ్వు కలరు పూసలదండ మెల్లో ఏసుకోనుండాది మాయక్క.

వాళ్ల దెగ్గిరికి పోబోయినదాన్ని మూతి ముడ్సుకోని వున్నిసోటే నిలబడి పొయినాను. అందురికీ అర్తమైపొయ్యిండాది. పూసలదండ దెచ్చిన అలక అని ఎంటనే మా మాసంద్రవ్వ మెల్లో వుండే పగడాల దండ దీసి నామెల్లో ఎయ్యబోయింది. నేనేసుకుంటానా? పారాడే వొయిసు నుండి ఆదండను దీసి మాయవ్వ మాముందరేస్తావుండాది. ఆట్లాడుకోడానికని. దాన్నిదెచ్చి నామెల్లో ఏస్తే వొప్పుకోడానికి నేనేమన్నా మా ఇంటి బంకమన్నా?

మా నీలక్క మెల్లోవుండే ఎర్రపూసల దండ దీసి నా మెల్లో ఎయ్యబొయ్యింది. నేను వొద్దంటే వొద్దని సేతులడ్డంబెట్టుకోని ఎనికెనిక్కిబొయినాను. ‘అది నీలక్క నీకెయ్యాలనే దెచ్చింది. ఏసుకో నాయినా’ అనింది మా మాసంద్రవ్వ. మాయక్క మెడపక్క జూసినాను. అది వుత్తి దండమాత్రమే. దీనికొక పూసల బిళ్ల యాలాడతా శానా సోగ్గావుండాది. సరే అన్న్యట్లుగా నిలబన్న్యాను. మా నీలక్క ఆదండ నా మెల్లో యేసి అద్దం దెచ్చి సూపించింది. ఎప్పుడెప్పుడు. ఇస్కూలుకి బొయి అంసా, నీలా వాళ్లకు సూపిద్దామా అని వుండాది. అన్నం దినకుండా పోతే మా యమ్మూరుకుంటాదా?

మా మా సంద్రవ్వే మా నాయినోళ్లమ్మ. ఈడ మాయింట్లో వుండే మా దొరసానవ్వ మా నాయిన్కి మేనత్త. ఆయమ్మే మా నాయిన్ని సాకి సంతరించి బిడ్లు లేరని దత్తుదీసుకునింది. కొడుకును సూడాలనే కలవరంతో మా మాసంద్రవ్వ నెలకోపారన్నా వొచ్చిపోతా వుంటాది. వొచ్చిందంటే ఒగోసారి నెలకుపైనే వుండి పోతాది. ఆ యవ్వకు ఇదే పుట్నిల్లు. ‘కుండమార్పు పెండ్లిండ్లు కూడిరావంటారు. అందుకే విూ ఇద్దురు ముండుమోపులూ మిలిగినారు’ అని మా పక్కింటి సిలగుండ్లపల్లి లచ్చుమక్క శనాసార్లే ఆడ ఈడా అంటావుంటాది.

సరే! మా మాసంద్రవ్వొస్తే వూరికా వొస్తాదా. పిలకాయిలుండారు గదా! అని శానా అప్పచ్చులు కాల్చుకోనొస్తాది. బొరుగులు, అంటిపొండ్లు, పప్పరమిటాయిలు బస్సెక్కేసోట అమ్మతారులే. అవీ తీసుకోనొస్తాది. మాసంద్రంలో మా నాయినోళ్లమ్మోళ్లది శానా పెద్దిల్లు. ఇద్దురు పెదనాయినోళ్లు, మా సినతాత ఆయన కొడుకులిద్దురు మా సిన్నాయినోళ్లు, మా సిన్నవ్వ, ఇద్దురు పెద్దమ్మోళ్లు ఐదుమంది అక్కోళ్లు, ముగ్గురు తమ్ముడోళ్లు వుంటారక్కడ. ఇంటిసుట్టుపట్ల పూలసెట్లు, కనకాంబరాలు, డిసెంబరాలు, రోజూపూలు, దాసానిపూలు, ఒంటిరెక్క లోలాకు మందారాలు, స్యామంచి పూలు, మా ఇలాకాలోనే ఎవురింట్లోను లేవు. మా పట్నం సిన్నాయిన తెచ్చి నాటినవవి. ఆ సిన్నాయినిప్పుడు అమెరికాలో వుండాడు. మా యక్కదీ సమత్సరం ఐదో తరగతైపోతాది గదా! నిలపకుండా సిత్తూరిస్కూలుకు పంపించమని జాబురాసినాడు మొన్నే మా సిన్నాయిన. మా సంద్రంలో వుండే మాపెదనాయిన కూతుర్లెవురూ ఐదుదాక కూడా సదువుకోలేదు. రొండోమూడో అంతే.

దాసాని పూలు, స్యామంచిపూలు, రోజాపూలు, ఒగసంచికి దెచ్చింది మాయవ్వ. సుగుంట్లు, కజ్జాలు, అలసందొడలు కాల్చుకోనొచ్చింది. అప్పచ్చులే తినేదా? పూలే గట్టిపెట్టుకొనేదా? పూలెక్కువున్న్యప్పుడు సవరంబెట్టి జడేసి ఆ పూలన్నీ జడకు బెట్టుకుట్టి పూల జడేస్తాది మాయమ్మ. మాయక్కకు సిగ్గు. ఆ బిడ్డేసుకోదు పూలజడ. నాకు మాత్రం శానా ఇస్టం. పూలజడ రేపేసుకుందువనింది మాయమ్మ. నేను అప్పచ్చులు దినేలోపల అన్నీ కలిపి కదంబం గట్టి తల్లోబెట్టింది. సూస్తే అప్పుడే నీడ కడప్మెట్లు దిగేసింది.

ఇస్కూలుకు లేటుగా బోతే అయివోరు కొడ్తాడు. పోకుంటే రేపింకా శానా పడ్తాయి దెబ్బలు. పైగా పూసలదండ అంసా, నీలా వాళ్లకు ఎప్పుడెప్పుడు సూపిస్తామా అని వుండాది. రేపు పూలజడతో పొయి దెబ్బలు దింటే ఏమన్నా బాగుంటాదా? ఎంత నామోసీ. అందురూ నన్నే సూస్తావుంటారు గదా! ఈ పొద్దు అరిసెయ్యి అప్పచ్చులడగడం కాయం అనుకుంటా ‘నే బొయ్యొస్తానుమా’ అని తిరిగి సూడకుండా ఇస్కూలు దారి బట్న్యాను.

అయివోరు అందుర్నీ వర్సంగా నిలబెట్టి ఎక్కాలు సదివిపిస్తా వుండాడు. నేను మెల్లింగా నక్కతా నలస్తా అయివోరికి కన్పించకుండా బొయి ఎనకుండే వర్సలో నిలబణ్న్యాను. సేతిలో వున్ని బెత్తాన్ని కాలికి తాటించుకుంటా తిరగతావున్ని అయివోరు నిలబడిపోయి ‘ఎవురు సెప్తార్రా ఏడో ఎక్కం’ అని అడిగినాడు. ఒకరు కూడా మూసుడవల్యా.

నేను మనసులోనే ‘ఏడొకట్ల ఏడు, ఏడ్రెండ్ల పద్నాలుగు….’ అని సెప్పుకున్న్యాను. నాకొచ్చేసినట్లే అన్పించింది. ‘నే సప్తాసా’ అని సెయ్యిపైకెత్తినాను.

‘ఏం తల్లీ ఇప్పుడు తెల్లారిందా నీకు, అట్నెన్సేసినప్పుడు లేవే. ఎప్పుడు దొంగమాదిరిగా వొచ్చి ఈళ్లతో సేరిపొయినావు.’ అన్న్యాడా నాకు గుండికాయ నీళ్లైపోయింది. దెగ్గిరికొచ్చి ‘ఏదీ సెయిసాపు’ అని ఈడ్సి ఒకటింటించినాడు. నాకు వొణుకు బుట్టుకొచ్చేసింది. ‘వూఁ సెప్పు’ అన్న్యాడు.

‘ఏడోకోట్ల ఏడు – ఏడ్రెళ్ల పద్నాలు’ అని మొదలు బెట్న్యానా. ‘కోట్ల ఏంది కోట్ల’ అని బెత్తం పైకెత్తినాడు నాకు కండ్లల్లో నీళ్లు దిరిగేసింది.

‘నేనిప్పుడు కొట్నానా? సెప్పుకొట్నానా?’ అని అందురిపక్కదిరిగి ‘ఏరా నేనీబిడ్నిప్పుడు కొట్నానా? అని అడిగినాడు. అందురూ బెదురు సూపులు సూస్తావుండారు గానీ వులకలా, పలకలా. ఆరుమొగం మాత్రం ‘లేద్సా’ అన్న్యాడు గెట్టింగా. ‘దీనికైతే గొంతు ఎంత జోరుగా వస్తాదో సూడు. ఎదవా ఎంతొరకొచ్చురా నీకు ఎక్కాలు’ అని సెవ్వుబట్టుకున్న్యాడు.

‘రొండొస్తాది సా’ అన్న్యాడు మెల్లింగా ‘వొస్తాయిలే వొంటికి, రెంటికి’. వొచ్చే సమ్మత్సరం ఐదుకుబోవాల. ఐదో ఎక్కం దాకన్నా నేర్సుకోలేదనుకో! పొయ్యేది నీ పరువు గాదు. పెద్దయివోరు ముందర నా పరువు గంగలో కలిసిపోతాది. బెల్లు గొట్టేలోపల ఐద్దాకా నేర్సుకోని సెప్పు’ అనేసి నా దెగ్గిరికొచ్చినాడయివోరు.

నేను బిత్తరపొయి బిక్కుబిక్కుమంటావుండానా. ఏమనుకున్న్యాడో ఏమో! ‘ఈ ఎదవలెవురికీ ఐదో ఎక్కంకూడారాదు. నువ్వు సెప్పు తల్లీ’ అన్న్యాడు. ఆమాటతో నాకు యాడలేని ధైర్నమొచ్చేసింది.

‘సా, ఆరోఎక్కం సెబ్దునా సా?’ అన్న్యా. అయివోరెందుకో పక్కున నవ్వినాడు. అంతే పిలకాయిలు గూడా కిలకిలమంటా పండ్లికిలిస్తా ఒగటే నవ్వులు. ‘నవ్వొస్తాదారా మీకు నవ్వు, నువ్వేం పాపా ఆ బిడ్డికి ప్యాన స్నేయితురాలివి. నీ గ్గూడా వొస్తాదా నవ్వు సిలకనవ్వు నవ్వతా వుండావే’ అంటా వర్సబెట్టి తలా ఒకటి అంటుకున్న్యాడు. నీల సిగ్గుతో తలొంచుకొనింది.

మళ్లీ అయివోరు నాదెగ్గిరి కొచ్చినాడు. ‘ఏదీ ఆరో ఎక్కం సెప్తానంటివే సెప్పు’ అనంగానే సేతులు కట్టుకోని, తలొంచుకోని ‘ఆరోకోట్ల ఆరు, ఆర్రెండ్ల పన్నెండు… ఆరోపదుల అరవై’ అని గడగడా సెప్పేసి వొంచిన తలెత్తకుండా కండ్లు పైకెత్తి అయివోరి పక్క సూసినాను. అయివోరుబెత్తం కొనని నా గెడ్డం కిందబెట్టి నా మొగాన్ని పైకెత్తినాడు.

‘సెబాస్‌రా, ఏదీ ఇప్పుడు సెప్పు ఏడోఎక్కం’ అన్న్యాడో లేదో తలొంచుకొని ‘ఏడోకోట్ల ఏడు, ఏడ్రెండ్ల పద్నాలుగు, ఏడుమూడ్ల ఇరవయ్కొటి, ఏన్నాల్ల ఇరవై… ఇరవై… ఇరవై నాలుగూ, వూహూఁ… వూహూఁ ఏన్నాళ్ల… ఏన్నాళ’ గుర్తురాక నాన్చతా వుండాను. ఒగపక్క సెమట్లు కమ్ముకోనొస్తావుండాయి. ఇంగోపక్క కండ్లమింద నీళ్లు కదలాడతావుండాయి. అయివోరు ‘వూఁ సెప్పు. బయపడకుండా దైర్నంగా సెప్పు’ అన్న్యాడు. ఎంత సెప్పుకున్న్యా రాలా. అందురూ నాపక్కే సూస్తా వుండారు. నాకు శానా సిగ్గై పోయింది. ఈలోపన పురుసోత్తం ‘నే జెప్తా సా, ఏడో ఎక్కం’ అన్న్యాడు.

‘రారా ఈడికొచ్చి సెప్పు’ అని పిల్సినాడయివోరు. వాడొచ్చి సేతులు కట్టుకోని అయివోరి పక్కదిరిగి సెప్పబొయినాడు. ‘నాక్కాదు వాళ్లకు సెప్పు’ అని వాని బుజం బట్టుకోని మా పక్కకు దిప్పినాడు. వాడు గడగడా ఏడో ఎక్కం వొప్పజెప్పేసినాడు. వాడు సెప్తావుంటే వానితో బాటే నేనూ మనసులో సెప్పుకున్న్యాను. నాకు వొచ్చేసినట్లే వుండాది. అప్పుడెందుకు రాలేదబ్బా అని శానా బాదయిపోయింది మనసులో.

‘ఇంతకు ముందడిగినప్పుడు ఎందుకు సెప్పలేదురా నువ్వు’ అని అయివోరు కుశాలుగా వాని సెవ్వుబట్టుకున్న్యాడు. వాడొకసారి పండ్లికిలించి ‘వస్తాదా రాదా అని మనసులో ఒకసారి సెప్పుకుంటా వుండాన్సా. ఆయాలికే ఈ బిడ్డి సెయ్యెత్తేసింది’ అన్న్యాడు వాడు నన్ను సూపించి.

‘ఏమ్మా కాళిందీ. ఇప్పుడన్నా సెప్తావా?’ అని ఎగతాళి బట్టించినాడయివోరు. నాపేరు కాళింది కాదు గదా! అందుకే నా కొకపక్క ఏడుపొచ్చేస్తా వుండాది. ‘అన్నిటికీ ఏడస్తావే’ అని అయివోరు ఒకటిచ్చినా ఇస్తాడనుకోని కంటి రెప్పల్ని ఎడల్పుసేసి, పైకెత్తి, కంట్లో నీళ్లు రాకుండా అడ్డకట్టేసేసినాను. ఒక పక్కేమో సెప్పితీరల్ల అనుండాది. మనుసులో ఏమో ఏడోఎక్కం పైనించి కిందికి పరుగుల్దీస్తా వుండాది. ఏన్నాళ్ల ఇరవై ఎనిమిది సెప్పుకున్న్యాక అంతా వొచ్చేస్తావుండాది. వొచ్చేసింది. అందుకే ‘ఏడోకోట్ల ఏడు. ఏడ్రెండ్ల పద్నాల్గు…’ అని తలొంచుకొని సెప్తావుండా పక్కకు పోబోయిన అయివోరు ఎనకడుగేసి నా దెగ్గిరే నిలబడి పోయినాడు. ‘ఏడో పదుల డెబ్బై’ అన్న్యాక ఒకసారి వూపిరి బిగబట్టి అయివోరి కల్ల కల్లెత్తి సూసినా.

‘ఎరీ గుడ్డు’ అని ఈప్మింద తట్టినాడు. ‘రేయ్‌ ఏడుదాకా రానోళ్లంతా ఈడే ఎండలో నిలబడి సదుముకోనొచ్చి అప్పజెప్పండ్రా’ అని లోపల్నించి రొండు కోబ్బలపాలు తెచ్చి నాకోటి పుర్సోత్తానికోటి ఇచ్చి ‘ఇంగ విూరిద్దురూ పొయ్యి కూసోవొచ్చు’ అన్న్యాడు. ఎక్కడో సంతోసం నా వొళ్లంతా పర్సుకోనుండాదా. వాళ్లు ఏడుదాగా నేర్సుకొనేలోపల ఎనిమిది నేర్సుకొనేయాలనే ఆశి బోడికొండంతెత్తుకు పెరిగిపోయింది.

నోటు పుస్తకం పట్టుకోని గడగడా పైకే ఎనిమిది సదవతా సదవతా పుర్సోత్తం పక్క సూసినాను. వాడు మూడో తరగతి ఎంగటేసు దెగ్గిర ఆ పక్కకు దిరిగి కూసోని ఆట్లాడుకుంటా వుండాడు.

నాకు మా బక్కయివోరు గ్యాపకమొచ్చినాడు. ఆ అయివోరు పెండ్లాం బిడ్లితో మా మూలింటవ్వోలింట్లో కాపిరముంటాడు. ఇస్కూలు నించి ఇంటికి బొయినాక ఈదిలో అట్లాడుకోవాలని ఓం వర్కు కూడా ఇస్కూల్లోనే రాసేస్తానా! ఇంటికి బొయి పయిటేల సంగట్దిని ఈదిలోకి పోదామని అడుగుబైట పెడ్తానోలేదో సావిడింటి దిన్నిమింద ముడుక్కోని కూసోని పక్కనుండే వాళ్లతో మాట్తాడ్తావుండే బక్కయివోరు ఎట్ల సూస్తాడో సూసేస్తాడు. సూసినోడు ‘ఇంతసేపు శత్రసెనుబడి ఇస్కూల్లో సదుముకోనొచ్చింది కొంచేపు ఆడుకోనీలే’ అనుకుంటాడా? వూహూఁ ‘పాపా పొయి పుస్తకాలు దెచ్చుకోపో’ అంటాడు. ఇంట్లోంచి ఈదిలేకిబోను ఇంగో దోవుంటే ఎంతబాగున్నా’ అనుకుంటాను.

మాయవ్వుందే ఇంగా మించింది. అయివోరి పెండ్లాంతో, కిష్నారెడ్డితాత పెండ్లాంతో అరట్లుగొడ్తా కూసోనుంటాదే ‘అయ్యో, పాపం బిడ్డి కొంచేపు ఈదిలో పిలకాయిల్తో ఆట్లాడుకోని రానీ’ అనుకుంటాదా. ఇంగా అయివోరి నోట్లోమాట నోట్లో వుండంగానే ‘పో, పొయ్యి పస్తకాలంటా దెచ్చుకోపో’ అంటాది. అట్లాంటప్పుడే మాయవ్వోలింటినించి మా ఇంటికి పరిగెత్తి పూడాలన్పిస్తాది. ఆడికి బోతే మళ్లీ ఎన్నెల్లో సగం రేత్రిదాకా ఆట్లాడుకోనుండదు. అంతేసేపు కాదుగదా! కొంచేపుగూడా మంట్లో ఆట్లాడుకో గూడదు మా నాయనకి. అదీగాక మా ఇల్లు వూరి చివర రచ్చబండకవతల సేన్లో వుంటాది. రచ్చబండ దాటంగానే జోడు తాటిసెట్లు. ఆ సెట్లపైన బెమ్మరాచ్చసుంటాది కదా! మా నాయిన సెప్పేకతల్లో. ఆన్నించి ఇంటికి బోవాలంటే బయమే కదా! అందుకే మాయవ్వోలింట్లోనే వుండేది.

పాపం, బక్కయివోర్ని శనిముండాకొడుకని పెతిసారీ తిట్టుకుంటాను గాని ఆ అయివోరు సదిమించబట్టేగదా ఈ పొద్దు అందురిముందర మొగలాయనిపించుకొనింది. అయినా అదేమి పీడనాసినిమో ఈ ఎక్కాలు వొచ్చినట్లే వుంటాది. మల్లీ ఒకపక్కరాదు. లెక్కలు గూడా అంతే కూడికలు, తీసివేతలు ఏళ్లు లెక్కబెట్టుకుంటా ఎంతబాగా సేస్తాను. అయినా యాడో ఒగోసారి తప్పిపోతాది.

ఏళ్లు గుర్తురాంగానే ఎనిమిదో ఎక్కాన్ని పదేళ్లు లెక్కబెట్టుకుంటా పదిసార్లు సదివేయానిపించింది. సదవతా వుండా. ఆరోఏలు సదవతా వుండంగానే అంతావొచ్చేసినట్లయింది. అయినా పదేళ్లు సదిమినాగ్గాని ఆన్నించి కదలలేదు. అయివోరికి సెబ్దామని పోతి. సర్కారు సెట్టుకింద నిలబడి పెద్దయివోరితో మాట్లాడ్తావుండాడాయిన. పెద్దయివోరు శానా అసాద్దుడు. ఆయన ముందరికి బోవాలంటే అందురికి అడలే. బయింతో వొచ్చేదిగూడా కోడిగూట్లో దూరుకుంటాది. అందుకే దూరంగా నిలబడిపొయినాను. సిన్నయివోరు పక్కకెప్పుడొస్తాడా, ఎప్పుడుబొయి సెప్దామా అని కాసుకోనుండా. ఈ లోపల అంసవేనుండాదే దొప్పుమని కిందబడి పొయింది. అయివోర్లిద్దురూ పరిగెత్తుకోనొచ్చినారు. ఇస్కూల్లో వుండే పిల్లాపీసూవొచ్చి ఆబిడ్డి సుట్టూ సుట్టుకున్న్యారు. సిన్నయివోరు బెత్తంతో తలా వొగిటి తాటించి దూరంగా తరిమినాడు. ‘రేయ్‌ ఎవురన్నా ఒగరు బొయి నీళ్ల్లు తెండ్రా’ అన్నాడు. పాండు రంగడు పరిగెత్తుకోని బొయి నిండుగా వున్ని నీళ్ల బొక్కినెత్తుకో నొచ్చినాడు. అయివోరు సెయ్యి బొక్కిన్లోబెట్టి అంసవేని మొగంమీంద సిలకరించినాడు. అయినా కండ్లు తెరవలేదా బిడ్డి.

రేయ్‌, నువ్వేందిరా నీళ్లు దెమ్మంటే అనుమంతుడు సంజీవిని పర్వాతాన్ని దెచ్చినట్లు ఏకంగా బొక్కినే ఎత్తుకోనొచ్చినావు’ అన్న్యాడు పెద్దయివోరు. సిన్నయివోరి సూపు బొక్కిని మింద బడింది. ‘రేయ్‌, ఆ బొక్కిన్నో నీళ్లు ఈ బిడ్డిమింద గుమ్మరించురా’ అన్న్యాడో లేదో అయివోరు – అంస కండ్లు దెరవడం, దిగ్గున లేసి నిలబడడం ఒగేసారి జరిగిపోయింది.

‘ఏమైంది అంసా నీకు’ సిన్నయివోరే అడిగినాడు.

‘ఆఁ ఏమయ్యుంటాది. సెనిక్కాయిలు పెరికేకాలంగదా! పచ్చివి, కాల్చినవి, వుడికించినవి నిలుకు లేకుండా ఎక్కాతుక్కా తినుంటాది. అది కడుపులో తిప్పి కండ్లు దిరిగి పడిపొయ్యుంటాది’ పెద్దయివోరన్న్యాడు.

సిన్నయివోరొకసారి అంసా పక్క ఓరగా సూసినాడు. ఆ బిడ్డి తలొంచుకోనుండాది. గమనించలేదు. ‘అవునూ… నీళ్లూ సిలకరించినప్పుడు కండ్లు గూడా తెరవనందానివి, బొక్కిన్నో నీళ్లు మింద బొయమనంగానే దిగ్గున లేసి ఏకంగా నిల్సుకున్న్యావే’ అని అంసతో అని పెద్దయివోరి పక్కదిరిగి ‘ఇదంతా ఎక్కాలవల్ల వచ్చిన మూర్చ’ అన్న్యాడు.

పెద్దయివోరు ‘ఔరా, కలికాలమా’ అన్నట్లు సూసినాడు.

‘ఇది తొలిసారు గాదు. ఇంతకు ముందు రొండుసార్లిట్లే పడిపొయ్యింది. అందుకే నాకనుమానమొచ్చి నీళ్లు గుమ్మరించమన్న్యాను. అదిని పైకిలేసేసింది’ అని ‘ఏం అంసా. ఎక్కాలొచ్చేసినాయా?’ అని అడిగినాడు.

ఏం మాట్లాడకుండా మూతి నల్లంగా బెట్టుకొని తలొంచుకోని వుండిపోయింది. ‘ఇంగోసారిట్లా పడిపొయినావనుకో మస్తానమ్మ నర్సును రమ్మని సూదేపించేది కాయం’ అని ఎచ్చరించినాడయివోరు.

‘రేయ్‌ అందురూ బొయ్యి ఎవురితావుల్లో వాళ్లు కూసోండ్రా’ అని పెద్దయివోరు అందుర్నీ లోపలికి పంపించినాడు.

ఎనిమిదో ఎక్కం వొప్పజెప్పి సిన్నయివోరితో సెబాసనిపించుకోవాలనుకున్ని నా ఆశ సప్పంగా సల్లారిపోయింది. ఎందుకంటే లోపల బొయి కూసుంటా వుండంగానే ‘టంగ్‌ టంగ్‌ టంగ్‌’ అంటా బెల్లు గొట్టేసినారు.

*

Download PDF EPUB MOBI

Posted in 2015, ఇర్లచెంగి కథలు, జనవరి, సీరియల్ and tagged , , , , , , .

4 Comments

  1. ఈ మాండలికం లో కథలు చదివిన దగ్గరి నుంచి ‘ఇర్ల చెంగీ ఎక్కడ పెరిగింది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. నెను పెరిగింది చిత్తూరు జిల్లా మదనపల్లె లో. ఈ మాండలికం మా సొంత ఊరైన రామపురం మాండలికానికి బాగా దగ్గరగా ఉంది కాని కొంచెం తేడా కుడా ఉంది. ఆందుకే ఊరి పెరు తెలుసుకోవలని ఉంది. ఎవరికైనా తెలిస్థె చెప్పండి. దన్యవాధాలు !

  2. అబ్బ, తలనొప్పి లెక్కల వల్ల తన్నులు తప్పించుకోడానికి ‘అంస’ ఏసిన మూర్చ నాటకం, చిన్నప్పుడు అందరు చూసినవి, ఏసినవే. మా మాండలికం కాబట్టి నేను నా ఇస్కూలు వాతావరణం గుర్తుచేసుకుంటూ, ఈ కథని ఆ ఇస్కూల్లో ఊహించుకుంటూ చదివాను, చాలా నచ్చింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.