cover1

బాపు బాలి లెయాండ్కర్ రాక్వెల్

Download PDF EPUB MOBI

coverబోర్ అనిపించినపుడు బొమ్మలేస్తాం, బొమ్మలేసి బోర్ అనిపించినపుడు బోర్ కొట్టించని పుస్తకమేదైనా అందుకుంటాం, అటువంటి ఇటీవలి పుస్తకం పేరు “నార్మన్ రాక్వెల్ – మై అడ్వెంచర్స్ యాజ్ యాన్ ఇలస్ట్రేటర్.” ఇది చిత్రకారుడి ఆత్మ కథ (రాక్వెల్ ఇరవయ్యో శతాబ్దపు అమెరికా అద్భుతాల్లో ఒకరు, తన ఎనభై నాలుగు సంవత్సరాల జీవిత ప్రస్థానంలో దాదాపు అరవై యేళ్ళపాటు వేసిన పెయింటింగ్ లలో అమెరికన్ జీవితాన్ని ఆయన ఆవిష్కరించారు, బహుశా నార్మన్ రాక్వెల్ బొమ్మలపై వచ్చినన్ని పుస్తకాలు మరే చిత్రకారుడివి రాలేదంటే అతియోశక్తి కానే కాదు) ఈ పుస్తకం లో “ది మాన్షియన్ ఆన్ టాం మౌంట్ రోడ్” అనే భాగంలో రాక్వెల్ తను ఆరాధించే ఒక చిత్రకారుదు జేసీ లెయాండ్కర్ గురించి 10 పేజీల జ్ఞాపకాలు వ్రాశారు. అవి చదువుతొంటే ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం చిత్రకారుడు బాలి గారు నాకు చెప్పిన ముచ్చట ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఒకరితో మరొకరికి సంబంధం లేని వేరు వేరు దేశాల, భాషల, ప్రాంతాల చిత్రకారులు ఒక్కొసారి బొమ్మని, కాంపొజిషన్ని, కార్టూన్ లో ఐడియాని ఒకేలా గీయడమనేది చాలా సర్వసాధారణమైన విషయం, కాని ఇక్కడ బాలి గారికి, రాక్వెల్ వారికి తమ అభిమాన చిత్రకారులతో కలిగిన అనుభవం దాదాపూ ఒకేలా వుండటమే విశేషం.

రాక్వెల్ వ్రాసిన ముచ్చట

ముక్కుని ఓవెన్లో ఉడుకుతున్న టర్కి మాంసం ఘుమఘుమ లకు అట్టి పెట్టి చూపులను గది కిటికీలకు ఆప్పగించా, ఎట్టకేలకు ఎదురు చూస్తున్న ఐదున్నర గంటల సమయం కానే వచ్చింది. కాసేపటికి వీధి చివర్లో కనపడ్డారు లెయాండ్కర్, అతని తమ్ముడు. అన్నాదమ్ములిద్దరు ఒకే రకమైన తెల్ల చొక్కాలపై నీలిరంగు కోట్లు తొడుకున్నారు, తలల పై ఒకే రకం టోపీలు, చేతుల్లోని పేము బెత్తాలు కాళ్ళకున్న తోలు బూట్లు ఒక పద్దతిలో ఒకే సమయానికి నేలకు తాకుతున్నాయి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ గతి తప్పని మిలట్రి కవాతు మా ఇంటి వైపు నడిచి వస్తున్నట్టుంది.

ఇరువురూ ఇల్లు చేరీ చేరంగానే ఒక్క ఉదుటున వాళ్ళ మొహం మీదే తలుపు తెరిచి “గుడ్ ఈవినింగ్ మిస్టర్ లెయాండ్కర్” అన్నా. అంత హఠాత్ ఆహ్వాన్నాన్ని ఊహించని లెయాండ్కర్ ఉలిక్కిపడ్డాడు, తేరుకుని తమ్ముణ్ణి పరిచయం చేశాడు. “వీడు నా తమ్ముడు ఫ్రాంక్”

ఇరువురిని ఇంట్లోకి ఆహ్వానించా, ముగ్గురం ముందుగదిలో కూచున్నాం. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు, అకస్మాత్తుగా వాతావరణం ఉక్కగా అనిపించసాగింది.

నేను : “బాగా ఉక్కగా ఉంది కదా?”

లెయాండ్కర్ : “అవును.”

నేను : “బహుశా వర్షం కురవచ్చేమో!

ఫ్రాంక్ : “ఏమో, కురవచ్చేమో! ఆకాశం మబ్బు పట్టి వుంది.”

నేను : “మరే!”

తరువాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, వాతావరణం ఇంకా ఉక్కగా అనిపిస్తుంది, అదే చెబుదామా అనుకుని ఇందాకా అదే కదా చెప్పింది అని ఊరుకున్నా, అంతలో మా ఆవిడ ఇరెన్ వచ్చింది నేను తనని వారిద్దరికి పరిచయం చేశా, ఆవిడ మొహం వెలిగిపొతుంది, బహుశా భగవంతుని దయ వలన వంట బాగా కుదిరినట్లుంది హమ్మయ్య! తల తిప్పి లెయాండ్కర్ వంక చూశా, ఆయన తల వంచి తన బూట్ల వంక అదే పనిగా చూస్తున్నాడు, పోని ఫ్రాంక్ ని పలకరిద్దామనుకుంటే అతను గదిలోని పియానో మెట్లను తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. ఇహ మా ఆవిడ, నా పక్కనే కూచుంది కాని ఆవిడ మనసంతా విజయవంతమైన వంట తాలూకూ విజయోత్సాహ లోకంలో విహరిస్తున్నట్టుంది ఎవరి వంకా చూడట్లేదు.

ఇక నాకు చూడానికి ఏం మిగలక ఇంటిగోడలను చూస్తున్నా, అవీ నాలాగే తెల్ల మొగం వేసుకుని తెల్లగా వున్నై. ఆబ్బా!! ఏం నిశ్శబ్దం! భరించలేనంత భారంగా వుంది.

తెల్లారిన దగ్గర్నించి నేను చేసుకున్న రిహార్సల్ అంతా నా కళ్ళముందు కదులుతోంది.

లెయాండ్కర్ రాగానే తలవంచి బౌ చేస్తా, ఆ పై షేక్ హాండ్ ఇచ్చి చేతిని విలాసంగా చాపి అన్నదమ్ములిద్దరిని ఇంట్లోకి అహ్వనిస్తా, ప్రతి నా కదలికలోనూ హూందాతనం ఉట్టిపడేలా వుంటా. తనతో బొమ్మల గురించీ మాట్లాడ్డం మొదలు పెడతా, నాకున్న అనుమానాలన్నీ తనముందు వెల్లడిస్తా, సమాధానాలు రాబడతా. ముందుగా తన బొమ్మల్లోని మనుష్యులు అంతటి రాజఠీవితో ఎలా మెరిసి పోతుంటారో కనుక్కోవాలి, అలా మెరవాలంటే విన్సర్ అండ్ న్యూటన్ రంగులు వాడాలా? మరింకా మంచి రంగులు ఏవైనా ఉన్నాయా? మిక్సింగ్ ఆయిల్ లో చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ తను కూచుని బొమ్మలు వేస్తాడా లేదా నిలబడి గీస్తాడా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అన్నట్టూ తన బొమ్మల్లో అంత షార్ప్ స్ట్రోక్స్ వుంటాయే అవి ఏ బ్రష్ తో వేస్తుండొచ్చో? బ్రష్ ఏంగిల్ ఏదో? ఇక మోడల్స్ విషయానికి వస్తే ఇల్లా పోజు పెట్టమని తనే సూచనలు ఇస్తాడా, లేక తనే పోజ్ పెట్టి అలా నిలబడమంటాడో…?

హు! ఎన్ని అడగాలనుకున్నాను ఎంత సమాచారం రాబట్టాలనుకున్నాను! అనుకున్నది ఏమిటీ? అవుతున్నది ఏమిటి?

ధైర్యం చేసి తలెత్తి లెయాండ్కర్ కేసి చూశా ఆయనింకా బూట్ల పైనుంచి దృష్టి మళ్ళించలా. తమ్ముడూ అంతే పియానోని వదలడం లేదు. చేసేందేం లేక నేను మళ్లీ గోడల వంక చూడ్డం మొదలెట్టా. ఇంకేం వుంది సమయమంతా అయిపోవచ్చింది. కాసేపట్లో భోజనాలు మొదలవుతాయి, అవి ముగించాకా గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి దారిన వారు…, అనుకుంటూ వుండగానే భోజనాలకి పిలుపు వచ్చింది. భోజనాల బల్ల పైకి లియాండ్కర్ స్పెషల్ గా మా ఆవిడ వండిన టర్కీ కోడి రప్పించబడింది. దాన్ని చూడగానే లెయాండ్కర్ గొంతు పలికింది “ఊహ్! ఇటు చూడు రాక్వెల్… ఆవిరిపై ఉడికి తెనేలూరే బంగారు గోధుమరంగు లోకి మళ్ళిన ఈ కోడి చర్మపు తాలూకు వాస్తవమైన ధవళ చర్మం తాలూకు వర్ణ సమ్మిళిమితం వుంది చూశావు, ఆయిల్ పెయింటింగ్ లోని అతి కష్టమైన ప్రక్రియల్లో ఇది ఒకటి, ఓసారి ఇలాంటి బొమ్మ ఒకటి నేను వేయాల్సి వచ్చింది, అప్పుడు……………… హమ్మయ్య మౌనం పారిపొయింది, థేంక్స్ టు టర్కి.

బాలి చెప్పిన కథ

ఒకసారి వచ్చి పొమ్మని భరాగో గారి దగ్గర్నుంచి పిలుపు, నాది విశాఖపట్నం వాటర్ వర్క్స్ లో ఉద్యోగం, భరాగో గారిది పక్క ఆఫీసే. ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడున్న ఇద్దరు పెద్ద మనుష్యులని పరిచయంచేసాడు. బాపు రమణ.

బాపు గారు అప్పటికే బొమ్మల్లో పెద్ద పేరు గడించి సినిమాల్లోకి వెళ్ళారు, పత్రికల నిండా ఆయన బొమ్మలు, కార్టూన్లు, బొమ్మలతో కార్టూన్లతో కూడిన అడ్వర్టయిజ్మెంట్లు. నా సంగతికి వస్తే నేను అప్పుడప్పుడే బొమ్మలు మొదలుపెట్టిన రోజులవి, ఒకటి రెండు సీరియల్లకి, వో పుంజీడు కథలకి బొమ్మలు వేసిన అనుభవం, ఆ మాత్రం బొమ్మలకే నలుగురు గుర్తుపట్టేంత పేరు సంపాదించానన్న భ్రమ నాకేమాత్రం లేదు. బాపు రమణ భరాగో లది పాత స్నేహం వాళ్ళు ముగ్గురు మిత్రులు గల గల మాట్లేడేసుకుంటున్నారు. నేను వుండీ లేనట్టే. బాపు రమణ అప్సర హోటల్లో దిగారని తెలిసింది సాయంత్రం కలుద్దామనుకున్నాం. నేను తిరిగి ఆఫీసుకు వెళ్ళిపొయాను.

సాయంత్రం అయిదున్నరకి ఆఫీస్ నుంచి బయలుదేరా. తొలకరి రోజులవి. సన్నగా వర్షం మొదలైంది. కలెక్టర్ ఆఫీస్ నుంచీ అప్సర హోటల్ వరకు మైలు దూరం. అక్కడికి బస్సులు లేవు, నడకే అయినా ఉత్సాహంగా ఉంది, వెళ్తుంది బొమ్మల విషయంగా కదా! బాపుగారు ఎప్పట్నుంచో బొమ్మలు వేస్తున్నారు, నేను బొమ్మల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఆయనకూ తగిలే వుంటాయి, వాటికి పరిష్కారాలు కనుక్కునే వుంటారు.

బొమ్మ స్కెచ్ అయాక ఇంకింగ్ వరకు లాగించేయవచ్చు. ఆ పై నలుపు రంగుతో దాని నీడలని బేలన్స్ చేయడం నాకు కష్టం గావుంది. అమ్మాయి నిటారైన ముక్కు పక్కనుంచీ బ్రష్ని ఫ్లాట్ గా లాగిన నలుపు నీడని ఎక్కడ ఆపాలి? ఆ లాగిన నీడకు అమ్మాయి బుగ్గ మీది సొట్టకు మధ్య దూరాన్ని అందం చెడకుండా ఎంతని తూకం చూపడం? చాతీ మీద వెలుతురు వున్నప్పుడు ఆ ఎత్తు తెలియడానికి కింద ఎంతవరకు నీడ గీయాలి అ మధ్య అడ్డం వచ్చే చీర మడతలను మేనేజ్ చేయ్యడం ఎలా? ఎప్పట్నుంచో ఉన్న అనుమానాలన్ని తోసుకు వచ్చేస్తున్నాయి. దీని ఠస్సదియ్యా! ఈ బ్రష్ సంగతి కూడా వుంది కదా! ఇంకింగ్ బ్రష్ ఈకల అడుగు నుంచీ పక్కకు తప్పుకుంటున్నాయి, అవన్ని అలా విచ్చేసుకుంటే గీతలు గీయడం ఎలా? దాని తాలూకూ మరమ్మతు తెలుసుకోవాలి, లేదా ఆయన వాడే బ్రష్ పేరేమిటో దాని నెంబర్ ఎంతో అడిగేస్తే పొలా!

మైలు దూరం కరిగి, వర్షంలో పూర్తిగా ములిగి అప్సర చేరుకున్నా, ఆరోజుల్లో అప్సర హోటల్ లోని రూములు కలిసి కాక ప్రయివేట్ గదుల్లా వేరు వేరు గా దూరం దూరం వుండేవి. రిసెప్షన్లో అడిగి వారి రూం బెల్ కొట్టా, తలుపు తీసింది రమణ గారు. నన్ను చూసి బాపుగారి కోసం లోపలికెళ్ళారు, వో పది నిముషాల్లో ఇద్దరు బయటికి వచ్చారు. తెల్లని బట్టల్లో మొహాలకు పౌడర్ అదీ రాసుకుని తెల్లగా మెరిసిపొతున్నారు.

ఇవతల నేను నిండా వర్షంలో మునిగి వచ్చిన వాణ్ణి, జుత్తు మీంచి నీరు పాయలు పాయలుగా కారి చొక్కా పై నుంచీ దిగి ప్యాంట్ చివర్ల ద్వారా బొట్లు బొట్లుగ చెప్పుల్ని పావనం చేస్తుంది.

ఆ వరండాలో ఇటు చివర బెంచి పై నేను, నా ఎదురుగా ఆ యింత దూరంలో వారు. “ఏమిటి, ఎందుకు, ఎలా” వారు అడగరు, వారు అడిగితే తప్ప నేను జవాబు ఇవ్వలేను. ఏం చెయ్యాలో తోచక కాసేపు తల వంచి వాచీ చూస్తూ గడిపా, చివరకి తెరుద్దామనుకుని తలెత్తి వాళ్ళ వైపు చూస్తే – రమణ గారు చూరు మీంచి కారుతున్న వర్షపు నీరు వరండా అంచున పేర్చిన క్రోటన్ మొక్క ఆకుల పైనుంచీ జారుతున్న విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు, బాపుగారేమో అలా ఆకుల పైనుంచీ జారిన నీరంతా గుమ్మం చివర తూములోకి పారడాన్ని తీక్షణంగా పరిశీలిస్తున్నారు!! నాకు ఆ కార్యక్రమం తాలూకూ పారుట మరియూ కారుటపై ఎటువంటి ఆసక్తి కలగడం లేదు

తల తడిసి, బట్టలు తడిసి, చెప్పులు తడిసి, చేతిలో అన్నం క్యారియరుతో చిరాకు బరువుతో వున్నా, వారేమో నోరు మెదపరు. ఆ నీళ్ళ పైనుంచి, మొక్కల పైనుంచీ, కన్నం పైనుంచీ కన్ను కదపరు. వీళ్ళను చూస్తుంటే అంతంత పేరు సంపాదించిన పెద్ద మనుష్యుల్లా కాక, జీవితంలో మొదటిసారి వర్షాన్ని చూస్తున్న చిన్న పిల్లల్లా వున్నారు.

ఇక అక్కడ శబ్దం అంటూ వుందా అంటే నా చేతి గడియారం టిక్కుం టిక్కుం మాత్రమే. మిగిలిందంతా దారుణమైన మౌనం! భరించలేనంత.

చాలాసేపైన తరువాత నేనే ఉండలేక బాపుగారితో “మరేమో మరి బొమ్మల్లో నలుపు తెలుపు వాటి బేలెన్స్, ఆ నీడలు వెనుక గోడలు ఆ స్త్రోక్స్??”

బాపు – “సోవియట్ లాడ్ పుస్తకం లోని బొమ్మలు గమనించండి”

నేను- “కుంచె, వాటి తాలూకు ఈకలు”

బాపు- “ఈకలని వేళ్ళ చివర్లతో నలుపుకుని దగ్గర చేసుకోవాలి”

ఇక మళ్ళీ మమూలే వర్షపు నీరు, మొక్కలు, కన్నం… చూసినంత చూశా, ఇక ఒపిక లేక వెళ్తానని లేచా, వారూ లేచారు.

లోపలున్నంత సేపు బయటి ముసురు లానేవుంది నా మనసు, బరువుగా బయటికి వచ్చా. బయట వర్షం ఆగింది ఎదురుగా ఉన్న చెట్టు వర్షపు స్నానం నుంచీ ఆరుతుంది, దాని ఆకుపై పచ్చ మెరుస్తొంది, ఆకు చివరి నీటి తెలుపు రాలుతుంది, ఆకు వెనుక అనేకానేక ఆకులు ముదురు రంగులోంచీ నలుపులోకి జారుతున్నాయి, ఇదే లైట్ అండ్ షేడ్ అనే పాఠం చెబుతున్నాయి, ఇక పై ఎవరినీ బొమ్మల గురించి అడగ కూడదనుకున్నా. నాకు ఆ రోజున ప్రకృతి అనే గురువు దొరికాడు.. ఆ క్షణం నుంచీ నేను మనుష్యుల దగ్గరినుంచి కాక ప్రపంచం నుంచీ బొమ్మలు నేర్చుకొవడం మొదలుపెట్టాను.

— అన్వర్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, జనవరి, వ్యాసం and tagged , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.