cover

చెదిరిన ఆదర్శం

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో తృతీయ బహుమతికి ఎంపికైన కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.)

Download PDF EPUB MOBI

ఏవో తీరం చేరని కెరటాల ఆలోచనలు, గమ్యం తెలియని తెగిపడిన గాలిపటపు అడుగుల సవ్వడులు, వేలెత్తి చూపే సంఘ విలువల వికటాట్టహాసం, కష్టాల ఈదురుగాలులకు కొట్టుమిట్టాడుతున్న ఆశయాల దీపపు కాంతి పుంజాలు. జీవితపు అర్థం తెలుసుకోవాలని పిచ్చి వెదుకులాట. అసలు ఎందుకు మనిషి మాత్రమే, మనిషి జీవితాన్ని ప్రశ్నించాలి? ఒకవేళ కుక్కలు, నక్కలు, పసిడి పైర్లపై వాలే తూనీగలు కూడా వాటి జీవితాలను ఇలాగే తర్కించుకుంటాయా? భావం ఏదో తెలియని కారుమబ్బొకటి నా మొహాన్ని కమ్మేసింది. బస్సేమో ఇంకా రావట్లేదు. అరిగిపోయిన చెప్పులను పక్కన ఉన్న అమ్మాయి చూడకుండా వాటి మీదే కూర్చొని ఏదో కాలక్షేపానికి పుస్తకం తెరిచాను.

మాసిన గడ్డం, కళతప్పిన మొహం, నడకతీరును బట్టి చూస్తే దేన్ని లెక్కచేయని మనస్తత్వం… అరవై సంవత్సరాల స్వాతంత్ర్యపు నిరుద్యోగాభివృద్ధికి ప్రతీకగా ఉన్నాడతడు. ప్రార్థనాపూరితమైన వాడి మొహానికి, నొసలు చిట్లించిన హేయమైన చూపులే సమాధానాలుగా దొరుకుతున్నాయి. నా ఎదురుగా వచ్చి దారిఖర్చులకు డబ్బులేదని ఒక పది రుపాయలుంటే ఇమ్మన్నాడు, దీనమైన మొహంతో.

తోడులేక, సత్తువలేక అడుక్కుతినే ముదుసలులపై నాకు జాలి ఉంది. కాని దానిని కూడా వ్యాపారంగా మార్చే వీడిలాంటి వాళ్లమీదే నా కోపమంతా. చూడ్డానికీ యువకుడి మల్లే ఉన్నాడుగా, చెమట చిందించి బతికితే ఏం? సగటు మనిషి ఆలోచన. నాతోపాటు అక్కడున్న వాళ్లందరూ ఒకేలాగ కనిపించారు నాకా క్షణం. నిర్ధాక్షిణ్యంగా వెగటు నవ్వొకటినవ్వి బస్సులో వెళ్ళి కూర్చున్నా. టికెట్ తీసుకొని ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మధ్య నా అంతరాంతర అణువుల ప్రతిస్పందనలు వినడానికై మదికి దగ్గరగా భుజం మీద చెవి ఆనించి కళ్ళు మూసుకున్నా.

కళ్ళు మూస్తే నా జీవితపు ఒడిదొడుకులు… సర్కారి రోడ్డుకి మల్లే.

నాన్న:– పదేళ్ళకే తన కుటుంబ భారాన్ని భుజస్కంధాలపై వేసుకొని, అన్నను చదివించి, చెల్లికి పెళ్ళి చేసి, తన అమ్మను అవసాన దశలో కంటికి రెప్పలా కాచుకొని, తన్ను నమ్మి వచ్చిన ‘పెళ్ళాం’పై సంఘమిచ్చిన అధికారం చెలాయిస్తూ, ఇద్దరి కూతుళ్ళకు పెళ్ళి చేసి, మరో ఇద్దరి కొడుకులను చదివిస్తూ, పనిచేసి అలసిపోయి మాపటేల శరీరకష్టాలతో పాటు బతుకు బాధలను మర్చిపోవాలని తాగుడుకి బానిసై, అర్ధశతాబ్ధి వయస్సులో, తొంబై యేళ్ళ బోసి నవ్వొకటి వేసుకొని, ఆనందాన్ని, బాధని కొలచే గీటురాళ్ళు తనదగ్గర లేవని, వాలిపోయిన తన భుజాల లోతులలో కష్టాలను గుర్తుచేసుకుంటూ చెప్పిన తన బతుకు సత్యం- “డబ్బే” ఈ లోకంలో ప్రధానం.

నా సమాధానం మాత్రం డబ్బు ప్రధానమే, కానీ డబ్బే లోకం కాదు.

“Don’t generalise people as materialists”

ఏవో పనికి మాలిన దృక్పథాల పొగచూరిన నా అమాయకపు కళ్ళ కేసి నాన్న చూసిన ఆ చూపు, నాకింకా గుర్తే.

అమ్మ:– తన ఈడు అమ్మలక్కలంతా చంకలో పలకేసుకోని పట్నపు బడికెళ్తుంటే, తను మాత్రం వాళ్ళ అయ్య అల్లిన చాపలను నెత్తినెట్టికొని, చేతి లోని చీపుళ్ల అధికభారాన్ని పంటి బిగువున భరిస్తూ, వానాకాలంలో నారుమళ్ళతో సావాసం, ఎండాకాలంలో గేదెల్తో బంజరభూముల్లో కోలాహలం, తనతో బొమ్మలాడిన పటేల్ కూతురు చదువుకొని సుఖంగా ఉంటుంటే, ఆ చదువు విలువ తెలుసుకొని, ఎంత కష్టాన్నైనా గుండెలో దాచుకొని, నాన్న తాగొచ్చి కొడుతుంటే ముళ్ళ కంపల మధ్య దాక్కొని, చీరుకు పోయిన నుదుట నుంచి ఉబికి వస్తున్న రుధిరాన్ని తుడుచుకున్న అమ్మ… నాకు చెప్పిన జీవిత సత్యం-‘చదువుకో బిడ్డా, మాలా చదువులేక ఇలా ఊడిగపు బతుకులొద్దు, ఇలా తప్ప తాగొచ్చి నిన్ను నమ్ముకొన్నపెళ్ళాన్ని కొట్టబాక, మీ కోసం ఎన్ని కష్టాలైన పడతా, పటేల్ల మల్లే పెద్ద చదువులు చదివి, నౌకరీ తెచ్చుకో బిడ్డా’

నేను మాత్రం చదివేది కేవలం నౌకరీ సంపాదించడానికే కాదు… నా పిచ్చి సమాధానం.

“Don’t generalise students as selfish people ever”

నా పరిపక్వత లేని ఆలోచనలకు స్పందనగా, ఏమి అర్థం కానట్టు అయోమయ స్థితిలో అమ్మ పెట్టిన మొహం నాకింకా గుర్తే .

చిన్నక్క:– అమ్మ నాన్నల బాధలు చూడలేక యేడో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, పెద్దక్క పదో తరగతి పరీక్షలకు తన పని డబ్బులు పంపించి, నాకు అన్నయ్యకు తను నేర్చిన అక్షరాలనే వాగొడ్డు ఇసుకలో నేర్పిస్తూ, చినిగిపోయిన లంగాకు రోజూ కొత్త కుట్లు వేస్తూ, చెదిరిన తన రంగుల ఆశలను మొక్క జొన్న పొత్తుల మెరిసే తీగలలో చూసుకుంటూ తన ఇష్టం ఏంటో తనకే తెలియక, తలంటి స్నానం చేయించి గుంపు ముందు కూర్చోమంటే కూర్చొని, అంతవరకు ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళి అంటే, ఏదో భారం వీగి పోతుందనే ఆశతో చూస్తున్న నాన్న కేసి చూసి ఒప్పుకుంది. తీరా జీవితమంతా చీకటిమయం, బానిస బతుకు. తన ఇష్టాఇష్టాలు మొగుడుకి అనవసరం. అలాగని తప్ప తాగొచ్చి కొట్టడు. శారీరక హింసకంటే మానసిక హింస ఎంత క్రూరమైనదో అర్థమైంది తనకు. తన బిడ్డలను నాకు అప్పగిస్తూ స్త్రీల భావాలకు స్వేచ్ఛనిచ్చే ‘మానవులుగా’ పెంచమని ప్రాధేయపడుతున్న అక్కకేసి జాలిగా చూసి నే చెప్పిన సమాధానం, చిన్నలోకం చూసి మగాళ్ళందరినీ ఒకే దృష్టితో చూడొద్దు.

“Don’t generalise men as a misogynist”

నా అర్ధంపర్ధం లేని పురుషావేశాన్ని చూసి, నిష్కల్మషమైన నవ్వు నవ్వింది తన ఐదేళ్ళ కూతురు తనకేమి అర్థం కాలేదనడానికి చిహ్నంగా.

అన్నయ్య:– దుమ్ము లేపుకెల్తున్న ఎర్ర బస్సెనకాల, భుజాన పుస్తకాల సంచితో, రేగే దుమ్ములో బడికి పోతూ పదహారేళ్ళ ప్రాయంలో, పడుచుల సాన్నిహిత్యంలో సామాజిక దృక్పథాన్ని కోల్పోయి, రొమాంటిక్ ఆలోచనల శిఖరాగ్రాన ఉన్న తనను, కుల దాస్య శృంఖలాల కిందకు నెట్టేస్తేగాని తెలియరాలేదు తనకు సంఘంలో ముసుగేసుకున్న నీతిలేని దురాచారాలు. చేయిచేయి కలపడం, చెంచాలాగా వాడుకోవడం. సహపంక్తి భోజనాలనడం, పండించిన పంటనంతా యెత్తుకెల్లడం. దీపపు వెలుగులో చదువుతున్న కనుపాపలు మూతపడుతుండగా తను చెప్పిన తన జీవన సత్యం “సమాజంలో మనిషి, మనిషికి ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలున్నాయిరా”

అన్న కేసి చూస్తూ, కాలం మారింది, సంఘం మారింది.

“Don’t generalise people as casteists”

ఎర్ర రంగు ఆవరించిన నా భావాలకేసి చూసి, అన్న రాల్చిన కన్నీటి బొట్టు నాకింకా గుర్తే.

chedirina adarsamడ్రైవర్ సాబ్ బ్రేకుకు, ముందున్న ఇనుప కడ్డీ నా నుదుటిని ముద్దాడింది. నాలుగు స్టాపుల ఆవల ఉన్న నా గమ్యస్థానం వచ్చినట్టుంది. ఆశగా, ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేసాను. మళ్ళీ అదే కథ, గేటుకి తాళం వేసుంది. నే రాసిన కథ గెల్చుకున్న డబ్బు కోసం వచ్చి ఇలా వెనుదిరగటం ఇది అయిదోసారి. కడుపు నిండా భోంచేసి రెండు రోజులయింది. ఇల్లు గుర్తొచ్చింది. వెనువెంటనే పొలం మీదున్న “బాకీ” కుడా గుర్తొచ్చింది. నిరాశపవనాలు నన్నావరించాయి.

చేసేదేమి లేక బస్టాపుకు నడకారంభించాను. బస్సెక్కేముందు జేబులు తడిమాను. బస్ టికెట్ కు రెండు రూపాయులు తక్కువగా ఉన్నాయి. పొద్దున్నే కనిపించిన ‘గడ్డపు మనిషి’ గుర్తొచ్చాడు. ఏదో ఆత్మన్యూనత భావం నా మదిలో మెదిలింది. నేను చదివిన పుస్తకాలు, పాటించిన జీవితపు విలువలు, గౌరవించిన భావజాలం అన్నీ కకావికలమైనాయి. సాధారణ సగటు మనిషి లాగానే నేను ఆలోచించానే అనే భావన నన్ను తొలచివేస్తున్నది. ఏదైన అనుభవిస్తేనే గాని తెలియదంటారు, బహుశా ఇదేనేమో.

బస్టాపులో చూస్తే అందరూ నాలాంటి సాధారణ మనుషులే, అతీత మానవులు ఎవరూలేరిక్కడ. ఆత్మగౌరవాన్ని పక్కన బెట్టి అందరిని అడిగా రెందు రూపాయలిమ్మని. నా వెగటు నవ్వే నాకు సమాధానంగా దొరికింది. ఆ రెండురూపాయలే ఇప్పుడు నా జీవితపు విలువలను తూచే పడిరాళ్ళు. ఏం లాభం లేదు, నా మీద దయావర్షం కురిసేలాగా లేదు. అలసిపోయి బస్టాప్ దిమ్మ మీద కూర్చున్నా… అడుక్కునే కళ లేక.

ఎదురుగా బస్సొచ్చి ఆగింది. తన తల్లీదండ్రుల ఆరాటపు అడుగులను తప్పించుకొని, చేతిలో రెండు రూపాయలు పెట్టింది ఓ చిన్నపాప.

కళ్ళెత్తి చూస్తే, ఆ పాలబుగ్గల పసి మొహం చాటున -

నాన్న ‘మెటేరియల్ అప్రోచ్’ వెనుకనున్న డబ్బు నేర్పిన జీవితపుపాఠాలు,

అమ్మ ‘ప్రాక్టికల్ అప్రోచ్’ వెనుకనున్న సమాజపు ఈసడింపులు, చీదరింపులు,

పురుషాహంకారపు కోరలలో అణగదొక్కబడిన ఆశల ఊయలలో ఊగుతున్న అక్క ‘ఆశావాదమూ’,

కుల, జాతి వివక్షలో కొట్టుమిట్టాడి, చదువు పంచన చేరి తన మీదున్న ‘మట్టికాళ్ళ కులరాక్షసి’ కోరలు పీకాలని దహించుకు పోతున్న అన్న ఆవేశపు అగ్నినేత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

ఆకలి, అస్థిరత, అభిప్రాయ బేధాలు, దృక్పథాల సంఘర్షణలు, బతుకికీ చావుకి మధ్య ఊగిసలాటలు, ఒకేసారి అమ్మ, నాన్న, అక్క, అన్న నాలుగు దిక్కులూ చేరి ముక్త కంఠంతో,

“Don’t live in utopian society, live in reality” అని గద్దించారు.

*

రచయిత వివరాలు

మేడి చైతన్య

దూర విద్య విధానంలో BA (తత్వశాస్త్రం) చదువుతున్నాను. పుస్తకాలు చదవడం నా ఏకైక హాబీ. నిజజీవితానికి దగ్గరగా ఉండే రచనలు చెయ్యలనుంది. నచ్చిన రచనలు  గబ్బిలం, మ్యూజింగ్స్. నచ్చే రచయితలు చాసో, జాషువా, చలం.

Download PDF EPUB MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2015, జనవరి, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.