coverfinal

ఇంకా రెండు రోజులుండవూ…

Download PDF EPUB MOBI

“బుజ్జీ అత్తయ్య నీ దగ్గరకు వస్తుందంట. మొన్న నాగమాణిక్యం గారింట్లో పెళ్లిలో కనబడి చెప్పింది” ఫోన్ లో అమ్మగొంతు.

“ఎందుకూ!”

“ఏమో! నాకు తెలియదు. ఎందుకని అడిగితే ఊరికే లేవే అంది.”

“నేనీ ఊరు వచ్చి ఎనిమిదేళ్లయినా రానిది ఇప్పుడెందుకొస్తుందో!”

నిజానికి నాకు అత్తయ్య వస్తుందంటే ఆనందం! ఎప్పుడూ రానిది ఎందుకొస్తోంది?

అత్తయ్యని చూసి దాదాపు అయిదేళ్లవుతోంది. అది కూడ ఏదో పెళ్లిలొ కొద్దిసేపు కలిసానంతే! భౌతికంగానూ, మానసికంగానూ పెరిగిన దూరం అత్తయ్యతో సాన్నిహిత్యాన్ని మాయం చేసింది. అప్పుడప్పుడూ మెరిసే బాల్యస్మృతుల మధ్య అందమైన అత్తయ్య ఓ తీపి జ్ఞాపకం.

‘దూరమైన కొలదీ పెరుగును అనురాగం’ అనేది అబద్ధం. అది విరహానికే పరిమితం. తరచూ కలుసుకోకుంటే మనుష్యుల మధ్య దూరం పెరగడమే గాని తరగడం ఉండకపోవచ్చు.

చిన్నప్పుడు సెలవులన్నీ అత్తయ్య వాళ్ల ఊరిలోనే! ఊరి చుట్టూ కొండలే. రాంబాబు బావ కొండ దాటించి వాళ్ల తోటకి తీసుకెళ్లడం ఇంకా గుర్తే. తోట నిండా మామిడి చెట్లు, పనస చెట్లు, కుంకుడు, మునగా…

ఎలా మర్చిపోను?.

నిజానికి నేనుండే ఊరికీ మా అత్తయ్య వాళ్ల ఊరికీ పెద్ద దూరం లేదు. ఒక రాత్రి ప్రయాణం ఇప్పుడేమంత దూరం.

కాని నాకే వెళ్లడం కుదరటం లేదు. కుదర లేదో వెళ్లాలనుకోలేదో నాకే తెలియదు. అభిమానం హృదయాంతరంలో అలానే ఉంది. అభిమానాన్ని ప్రదర్శించడానికి కూడా కొంత ప్రయత్నం అవసరమేమో!

నాచిన్నప్పుడు అత్తయ్యా వాళ్లది చాలా పెద్దకమతం. పాతికెకరాల మాగాణి, జీడి మామిడి తోటలూ! అన్నీ మావయ్య చేతకానితనానికీ, వ్యసనాలకీ, పిల్లల పెళ్లిళ్లకీ ఖర్చయిపోయాయి. మావయ్య తన జీవితాన్ని వీధి అరుగుల మీద ఆడే పులి జూదానికీ, చదరంగానికీ, పొలిటికల్ కబుర్లకీ ఖర్చు చేసేశాడు.

ఉన్న ఒక్కకొడుకూ వేరే ఊరిలో ఉద్యోగం చేసుకుంటూ రావడమే మానేశాడు.

వాడి సంసారమే వాడికి బరువు.

వాడి పెళ్లాం వైపు వాళ్లే ఉద్యోగం వేయించడంతో ఒక రకంగా ఇల్లరికపు అల్లుడయ్యాడు.

ప్రభుత్వమిచ్చే వృద్ధాప్య ఫించను తోనే జీవితాన్ని నెట్టేస్తున్నారు అత్తయ్యా మావయ్యా. ఈకాలంలో అదేంసరిపోతుంది? బతికి చెడడం అంత నరకం ఏదీ లేదు.

చిన్నప్పుడు బాగా ఆస్తిపరుడు కావడం మావయ్యని ఏపనీ చేతకానివాడిగా చేస్తే, అత్తయ్యని గడప దాటితేనే పోయే గౌరవానికి ప్రతీకని చేసింది. అభిమానం అన్నం పెడితే ఎంత బాగుంటుంది!

“మావయ్యకి ఏదో ఆపరేషన్ చేయించాలంట. నిన్నేమన్నా డబ్బడుగుతుందేమో!” అటునించి అంది అమ్మ.

“ఇమ్మంటావా?”

“ఇస్తే ఇంక వెనక్కి రాదనుకొని ఇవ్వు. అయినా వాళ్లబ్బాయికి పట్టనిది నీకెందుకురా.”

ఎందుకో చిన్నప్పుడు నా కోసం అత్తయ్య ప్రత్యేకంగా చేసే తొక్కుడు లడ్లు గుర్తొచ్చాయ్. వాళ్లింట్లో నేనెంత అల్లరిచేసినా ఎప్పుడూ ఎదుటి వాళ్లనే తిట్టేది కాని నన్నేమీ అనేది కాదు.

“చూద్దాంలే రానీ” అభావంగా అన్నాన్నేను.

ఆ మర్నాడే అత్తయ్య వచ్చింది. అత్తయ్యని చూసి ఆనందించాలో, బాధపడాలో అర్థం కాలేదు. మనిషి పూర్తిగా పాడయిపోయింది. పచ్చటి శరీరం వృద్ధాప్యం తోనో కష్టాలతోనో కమిలి నల్లబడింది. లోతు కళ్లపై భూతద్దాల కళ్ల జోడు. చూసి చాలా కాలమవడం వల్లనేమో, నాఊహల్లోని అందమైన అత్తయ్య నాకు పరిచయం లేనిదానిలా కనిపించింది.

“ఏంట్రా! ఒక్క పిల్లతోనే ఆపేసినట్లేనా! ఇంకొకళ్లన్నా ఉంటే బాగుంటుంది.”

“నీకేం బాగానే చెప్తావు! పెంచే వాళ్లకి తెలుస్తుంది.” అనుకోకుండా అనేసాన్నేను.

“మేమంతా అలా అనుకునుంటే మీరంతా పుట్టేవారంట్రా!”

ఏమనాలో అర్థం కాలేదు. పిల్లలని పెంచడంలోని కష్టం ఐదుగురు అమ్మాయిలనీ, ఒక అబ్బాయినీ కని పెంచిన అత్తయ్యకి చెప్పాలనుకోవడం!

ఎన్నాళ్లుంటావు? అని అడుగుదామనుకున్నాను. చిన్నప్పుడు మాఇంటికి వస్తే ముందు అదే అడిగేవాడిని. ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత బాగుండునని కోరుకొనేవాడిని. ఎన్ని రోజులున్నా ఇంకో రోజు ఉండమని ఏడ్చేవాడిని. వెళ్లేటప్పుడు తనతో బాటే వాళ్లూరు తీసుకెళ్లేది అత్తయ్య.

అదే ప్రశ్న ఇప్పుడు ఏ ఉద్దేశంతో అడగాలనుకున్నానో నాకే తెలియదు. తొందరగా వెళ్లాలనా? ఎక్కువకాలం ఉండాలనా? అంతరాంతరాల్లో అభిమానం లేకపోలేదు. అవసరార్ధం వచ్చిందనే సందేహం అసంతృప్తిని కలిగిస్తోందా? చిన్నప్పుడు అత్తయ్యని చూస్తేనే పొంగే హృదయం ఇప్పుడెందుకు స్పందించడం లేదు?

మనుష్యుల మధ్య పెరిగిన దూరం అపరిచితులని చేస్తోందా? లేక సహాయం చేయాల్సొస్తుందనే అనుమానం పొంగే హృదయంపై నీళ్లుచల్లిందా?

“మావయ్యని కూడా తీసుకురాకపోయావా, అత్తయ్యా..”

“కదిలేలా లేడురా, ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. మా బావ గారింట్లో ఉండమని వచ్చాను,” చెప్పింది అత్తయ్య.

అవసరాన్ని చూచాయగా చెప్పిందా! మనుష్యుల మధ్య బంధాలకీ, డబ్బుకీ సంబంధం లేకపోతే ఎంత బాగుండును!

అత్తయ్య డబ్బడిగితే ఎంతడుగుతుంది? డబ్బు సరిగా లేనప్పుదు నాకు డబ్బంటే అంత ప్రీతి లేదు. అది పోగుచేయడం ప్రారంభించిన తర్వాతే ప్రీతి పెరిగి పోయింది. ఎంతయినా డబ్బు పోగుచేయడంలో ఒక ఆనందం ఉంది. అది తిండీతిప్పలూ కూడా మానేసి చేయాల్సిన తపస్సులాంటిది.

పెరుగుతున్న నిల్వలు ఇచ్చిన ఆనందం సృష్టిలో ఏదీ ఇవ్వదేమో.

అయినా ఒక్కసారి నేను సాయం చేసినంత మాత్రాన అత్తయ్య కష్టాలన్నీ తీరిపోతాయా?

అత్తయ్య వచ్చి రెండు రోజులయినా ఎందుకువచ్చిందో చెప్పలేదు. నాకిష్టమని తొక్కుడు లడ్లు చేసింది. మనిషి ఎక్కడా బాధ పడుతున్న ఛాయలు లేవు. నన్ను డబ్బు అడగాలంటే మొగమాట పడుతుందేమో!

rendurojulundavooనాకేమో అడిగితే చూద్దాంలే అనిపిస్తోంది. అంత దూరం నించి అదేపనిగా వచ్చింది అడగక ఎక్కడికి పోతుంది? పోని నేనే అడిగితే! బాగానే ఉంటుంది. కానీ డబ్బు మీద నాకు పెరిగిన నడమంత్రపు ప్రీతి నన్ను ఆపుతుంది. అయినా అంత డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద లేదు. వాళ్ల కొడుకుండగా నా కెందుకీ బాధ?

అత్తయ్య డబ్బుకోసం కాక మామూలుగా వచ్చుంటే అత్తయ్య సాన్నిహిత్యాన్ని మరింతగా ఆనందించేవాడినేమో! అత్తయ్యకి సాయం చేయడంలో ఎక్కువ ఆనందముందో, చేయకపోవడంలో ఉందో నాకు తెలియడంలేదు. ద్వైదీభావం అసహనాన్నీ, అసంతృప్తినీ కలిగిస్తుంది.

నిజానికి రెండురోజులు బాగానే గడిచాయి. నా భార్యాపిల్లలు అత్తయ్య సాన్నిహిత్యాన్ని పూర్తిగా ఆనందిస్తున్నారు. నా కూతురు అత్తయ్య దగ్గరే పడుకుంటోంది. అత్తయ్య ఎందుకొచ్చిందో తెలిస్తే నా భార్యకి అంత ఆనందం ఉంటుందా!

అత్తయ్య చేత రకరకాల కథలు చెప్పించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్న నా కూతురిని చూస్తే నా బాల్యం గుర్తుకొస్తోంది.

“చిన్నప్పుడు మీనాన్న కూడా నాదగ్గర పడుకుని తెల్లవార్లూ కథలు చెప్పమని గొడవ చేసేవాడు.” అత్తయ్య గొంతు.

ఎందుకో మనసు బాధగా మూలిగింది. చిన్నప్పుడు ఎన్నిసార్లు పక్క తడిపినా ఎప్పుడూ ఏమీ అనేది కాదు. నాకూతురు పక్క తడిపినప్పుడల్లా మా ఆవిడ చూపే విసుగూ అసహనం తలుచుకుంటేనే భయమేస్తోంది.

“శీనూ – నేను రేపు వెళ్లిపోతానురా పొద్దుటే రైలెక్కించేయి,” మూడవ రోజు రాత్రి అంది అత్తయ్య.

ఇప్పుడైనా వచ్చిన సంగతి చెబుతుందేమో?

“ఇంకా రెండు రోజులుండి వెళ్లొచ్చు గదా అత్తయ్యా” అప్రయత్నంగానే అడిగాన్నేను.

“అవును మామ్మా టు డేస్ ఉండు” ఆశగా అడిగింది చిన్ని (నా కూతురు). నా కూతురిని అలా చూస్తే నా బాల్యం తీయగా మెదిలినట్లయ్యింది. నా కూతురి గొంతులోని నిజాయితీ ఆనందం నాలో లేవు.

గుండె మెదడుల నిరంతర పోరాటం పెద్దల్లో!

గుండే మెదడైన అద్వైతానందం పిల్లల్లో!!

“లేదులేరా వెళ్లాలి, మీమావయ్య ఉండ లేరు. ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు.”

“ఎందుకొచ్చావో చెప్పనేలేదు?” ఉండబట్టలేక అడిగేశాను.

“నిన్ను చూడాలనిపించి వచ్చాన్రా” క్లుప్తంగా చెప్పింది.

చూడాలనుకొని దారిఖర్చులు పెట్టుకుని వచ్చే ఆర్థికస్థితి అత్తయ్యకి లేదు. మొగమాట పడుతోంది.

“అత్తయ్యా! మావయ్యకి బాగానే ఉందా? డబ్బులేమన్నా కావాలా?” పక్కకి తీసుకెళ్లి గబగబా అడిగేశాను. ఎందుకో అలా అడగాలనిపించింది. ఎంతోకొంత సాయం చేస్తేనే ఆనందంగా ఉండగలననిపించింది.

అత్తయ్య నవ్వింది. ఒక్క క్షణం నా చిన్నప్పటి అందమైన అత్తయ్య నా కళ్ల ముందు మెరిసి మాయమైంది. అంతలోనే మనసు విపరీతార్థాలకై వెదకడం మొదలెట్టింది. అర్థం కాని అసహనానికి గురిచేసే ద్వంద్వం.

“నిన్ను చూడాలనిపించిందిరా! శీనూ! నిన్నే పిలిపించుకుందామని మీ మావయ్య అన్నాడు. నీకు వీలవుతుందా! ఉద్యోగాలు చేసుకునే వాళ్లు రావడం కంటే ఖాళీగా ఉండే మేము రావడమే మేలనిపించింది. మీ మావయ్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు. నేనెంతకాలం బతుకుతానో! చని పోయిన తర్వాత అందరూ వస్తారురా. బతికున్నప్పుడే అందరిని ఒక్కసారి చూడాలనిపించింది. నీ కూతురిని పక్కలో పడుకోబెట్టుకుని కథలు చెబుతుంటే చిన్నప్పటి నువ్వే గుర్తుకొచ్చావురా! మీ నాన్న కూడా నీలాగే పక్క తడిపాడని చెబితే ఎంత నవ్విందనుకున్నావ్? దాన్ని వదిలి వెళ్లాలంటే బెంగగా ఉందిరా శీనూ! దాన్ని నాతో తీసుకెళ్లి పది రోజులుంచుకునే స్థితి మాకు లేదు. రేపు పొద్దుటే అది లేచే లోపునే నన్ను రైలెక్కించేయి,” ఏ నిష్టూరమూ లేని అత్తయ్య గొంతు నా హృదయాన్ని తాకింది.

పెళ్లి కోసమో, దినం కోసమో, అవసరార్థమో కాక కేవలం నన్ను చూడాలని వచ్చిందా! నా ఙ్ఞాపకాలని పదిలపరచుకోవాలని వచ్చిందా! ద్వైదీభావంతో బంగారం లాంటి అత్తయ్య సాన్నిహిత్యాన్ని నేను పాడు చేసుకుంటే తను మాత్రం నేను కోల్పోయిన బాల్యాన్ని నా కూతురిలో చూసుకుని తీయని ఙ్ఞాపకాలని తోడుతీసుకుని ఆనందంగా (బెంగగా?) వెళుతోందా!

నాసికాత్రయంబకంలో పుట్టిన చిన్న ధార ఎన్నో ఉపనదుల్ని కలుపుకుని నిండు గోదావరయినట్టు అంతరాంతరాల్లో, గుండెలోతుల్లోని చెమ్మ నరనరానా వ్యాపించి అశ్రుగోదావరయ్యింది. అప్రయత్నంగానే నా నుదురు ఆమె పాదాలని తాకింది. గుండె, మెదడు ఏకమై అద్వైతం అనుభూతమయింది.

“అత్తయ్యా నాకోసం రెండు రోజులుండవూ…”

— నరుకుర్తి శ్రీధర్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కథ, జనవరి and tagged , , , , .

22 Comments

 1. కధంతా చదివిన తర్వాత మనసెందుకో ఒక్కసారి ఎలాగో అయ్యింది. బరువైన భావాన్ని చిన్న కధలో చక్కగా ఇమిడ్చేరు. రక్త సంభందం బిగువును బాగా చెప్పేరు. ఇలాంటి వస్తువు తో మరిన్ని కధలు మీనుంచి ఆశిస్తున్నాను.

 2. Enduko, Ento ane oka bhavam tho oka atmeeyurali sanihityanni anubhavinchaleni paristitini chala nijaiteega chepparu.

  Dabbu pogu cheyyadam lo padi jeevitam lo manassanti, santosham kolpoyi, aatmeeyuluku kuda upayoga pade chance vacchinappudu, danni gurtinchaka Dabbu ane Manasika rogamtho bhada padevariki ee story lo unde neethi ardam avutundo ledo!

  Ammani kuda avasaram untene preminche vallanu chustunnanu. ee nee story andaru chadivi ardam chesukunte baguntundi.

  Ee story lo ee kinda lines chala nacchai, experience kanipinchindi.

  అభిమానాన్ని ప్రదర్శించడానికి కూడా కొంత ప్రయత్నం అవసరమేమో!

  ‘దూరమైన కొలదీ పెరుగును అనురాగం’ అనేది అబద్ధం. అది విరహానికే పరిమితం. తరచూ కలుసుకోకుంటే మనుష్యుల మధ్య దూరం పెరగడమే గాని తరగడం ఉండకపోవచ్చు.

  మనుష్యుల మధ్య బంధాలకీ, డబ్బుకీ సంబంధం లేకపోతే ఎంత బాగుండును!

  అత్తయ్య డబ్బుకోసం కాక మామూలుగా వచ్చుంటే అత్తయ్య సాన్నిహిత్యాన్ని మరింతగా ఆనందించేవాడినేమో! అత్తయ్యకి సాయం చేయడంలో ఎక్కువ ఆనందముందో, చేయకపోవడంలో ఉందో నాకు తెలియడంలేదు. ద్వైదీభావం అసహనాన్నీ, అసంతృప్తినీ కలిగిస్తుంది.

 3. చాల అద్బుతంగా నేటి రిలేషన్స్ ని ఆవిష్కరించారు.
  నాకు నచ్చిన లైన్స్
  గుండె మెదడుల నిరంతర పోరాటం పెద్దల్లో!
  గుండే మెదడైన అద్వైతానందం పిల్లల్లో!!

 4. ఎంత ఏడిపించింది ఈ కథ.అభిమానం అన్నం పెడితే బాగున్ను అనే వాక్యం నుంచి ఆగకుండా చదివించింది.ఒక అత్తగా నన్ను నేను identify చేసుకోవడమే అందుకు కారణం కావచ్చు.మనసంతా పిండేసి కళ్ల వెంట బాధగా స్రవింపజేసింది కథ ధన్యవాదాలు

 5. చాలా మంచి కథ. కథ ను సరిగ్గా ఒక ఫ్రేం లో బంధించారు. ఒక వాక్యం ఎక్కువా తక్కువా కాకుండా. తెలిసిన సెంటిమెంట్ కథ అయినా చదివాక కంటి రెప్పలతోపాటూ గుండె చెమ్మ గిల్లింది. అభినందనలు శ్రీధర్ గారూ!

 6. కళ్ళలో నీరు నిండిపోయింది. మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉంటాయి అన్న సిద్దాంతం బలంగా వేళ్ళూనుకుంటున్న ఈ రోజుల్లో మమతలు కూడా ఉంటాయని నిరూపించిన కధ. రచయితకి అభినందనలు.
  ఈ కధను నేను తమిళం లో అనువదించాలని అనుకుంటున్నాను. రచయిత కాంటాక్ట్ వివరాలు తెలియచేయగలరు. my email id. tkgowri@gmail.com

 7. చాలా బాగుంది. చదువుతున్నంతసేపు , నేను సన్నివేసాల్ని చూడగలిగాను. 21 వ శతాబ్ధఁలో మనిషి యొక్క ఆలోచనా విధానం మరియు మానవ సంబన్ధాలను ఆవిష్కరించే పద్ధతి బాగుంది. గతం లోకి తొంగి చూస్తే, ఎవరికైనా హ్రృదయం ద్రవించి, మనపై మన వాళ్ళు చూపించే ప్రేమ గుర్తొస్తే మన కళ్ళు చెమరుస్తాయి. ద్వంద్వం మరియు ద్వైదీభావంతో పదాల స్థానం లో సాదా సీదా పదాలు వాడితే ఇంకాచాలా బాగుండుననిపించింది.