cover

పొంబలోల్లాట

Download PDF EPUB MOBI

ఆపొద్దు ఆదివారం ఇస్కూల్లేదు. నేను, మా పెత్తమ్ముడు గోపిగాడు ఆపొద్దేపుట్టిన ఆవుదూడతో బాటు గెంతులేస్తా ఆట్లాడుకుంటా వుండాము. నడీదిలో డబుకు డబుకుమని పలకలిన్పించినాయి. యాడుండే పిలకాయిలంతా నడీదిలోకి వురుకో వురుకు. మాల సెంగడు ‘జెజ్జెనక డుబుకు డబుకు – జెజ్జెనక డబుకు డబుకు’ అని పూనకమొచ్చినోడు మాదిరిగా తలను కిందికీ పైకీ ఎగరేస్తా పలగ్గొడ్తా వుండాడు. ఇండ్లలో వుండే ఆండోళ్లంతా సీమల పుట్టలో నుంచి సీమలు బైటికొచ్చినట్లుగా వొచ్చేసినారు. సేన్లకు పోక ఇండ్లకాడుండే అరాకొరా మొగోళ్లు గూడా ఈదిలోకొచ్చేసినారు. ముసిలీముతకకూడా దిన్నిలమింద కూలబడినారు. జనాల్ని జూసి ఇంగా రెచ్చిపొయినాడు సెంగడు.

శానామంది జనాలు సేరేదాకా ఏ ఇసయం సెప్పకుండా వూరిస్తా పలగ్గొడ్తావుండాడు. సెంగడు ఏం జెప్తాడా అని అందురూ కాసుకోనుండాము. నాకైతే శానా కుశాలగా వుండాది. అప్పుడిప్పినాడు నోరు పలగ్గొట్టేదిడ్సిపెట్టి.

‘ఇందుమూలంగా వరిగిపల్లి గ్రామంలోని పిల్లా జెల్లా, ఆండా మొగా, ముసలీముతక యావన్మందికి తెలీజెయ్యడమేమంటే…’ అని ‘డబుకు డబుకు’ అని రొండుసార్లు గొట్టి ‘పడమట దేశమైన పల్నేరు నించి పొంబలోళ్లొచ్చి దిగుండారు. వాళ్లు మన గ్రామాల్లో ఈదినాటకాలేసి అందుర్నీ సంతోసపెట్టాలని సూస్తావుండారు. ముత్తరపల్లిలోని నల్లమనాయుడు వాళ్లను పిలిపించినట్లు వర్తమానం’ అని మాట్లాడేదిడ్సిపెట్టి మళ్లీ జెజ్జెనక…జెజ్జెనక అని కొడ్తావుండాడు. ఎప్పుడు బొయినాడో మా తమ్ముడు ఈశినేరోళ్ల కడప్మెట్లమింద కూసోనుండిన మాయమ్మ వొళ్లో జేరినాడు. నీల వొచ్చి నా బుజంమింద సెయ్యేసుకోని నిలబడుండాది.సెంగడిరకా ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇలావరిగా సెప్పకుండా ‘జెజ్జెనక నక నక’… కొట్తానే వుండాడు. అందరూ గలాం బులాం అని మాట్లాడుకుంటా వుండారా? ‘ఇసయమేందో సెప్పురా’ అని మా నర్సిమ్మారెడ్డి మామ పైగుడ్డిసిరి సైగజేసినాడు.

వాడర్తం సేసుకోని వాంచేది వొదిలిపెట్టంగానే అందురూ మాటలు మానేసి సెవులు ఆ పక్కకు బెట్టినారు.

‘అయ్యలారా, అమ్మలారా ఇనండి’ అనంగానే నడీది శీన్రెడ్డి ‘ఈడి సోది పెద్దదయిందే. పెద్ద పండితుడైపొయినట్లు ఈడూ ఈడి మాటలు’ అనంగానే ఆడుండే వోళ్లంతా కిలకిలా నవ్వినాము.

‘ఎల్లుండికి అంటే మంగలారం రేత్రి ఎనిమిదిగెంటల నుంచి తెల్లారేదాకా ముత్తరపల్లి గ్రామంలో పొంబలోళ్లు కాంబోజరాజుకత ఆడతారు. సూసేదానికి సుట్టుపట్లూర్లోళ్లందురూ రావాలని నల్లమనాయుడు సెలవిచ్చుండాడు’ అని పలకమింద ఈసారి ‘జెజ్జెనక’ అని కాకుండా ‘డబుకు డబుకు’ అని వాయించి వొదిలేసినాడు. అందురి మొగాల్లోనూ సంతోసం తాండవమాడతావుండాది.

‘మాల సెంగన్న అయ్యోర్లు మాట్లాన్న్యట్లు ఎంతబాగా మాట్లాడ్తాడు గదమే ‘అన్న్యాను నీలాతో. అదెక్కడుండాది. సెంగడు పక్కీదిలో టాం టాం ఎయడానికి పలగ్గొట్టుకుంటాపోతావుంటే వాడెనకే బోతావుండాది నేనూ పరిగెత్తినాను.

మంగలారం సాయంతరమే మా పిలకాయిల్లో అడావుడి మొదలైపోయింది. ఎప్పుడెప్పుడు ముత్తరపల్లికి దారిబట్తామా అని కాసుకోనుండాము. యామతల, కాంత కలిసి అప్పుడే రొండుసార్లొచ్చిపొయినారు. మాయమ్మ బాయికాన్నించి ఇంగా ఇంటికి రాలేదు. ‘ముత్తరపల్లిలో ఈ పొద్దు ఆటుండాది గదవ్వా, మల్లీ ముందర తావు దొరకదు. యామలతా వాళ్లు అప్పుడే పోదామంటా వుండారు. నేనూ పోతానవ్వా’ అని గునిసినాను.

‘పాపా, రాత్రికి ఆటైతే ఇప్పున్నుంచి ఏంది మీ రావిడి. నువ్వుండావే వొగసోట కాలు నిలబడదు నీకు. అక్కను జూసినేర్సుకో, ఎంత నిమ్మలంగా పూలుగట్టుకుంటా కూసోనుందో’ అనింది.

మాయక్క పక్కజూసినాను. సెట్లో నుంచి అన్ని మల్లిమొగ్గల్ని ఎప్పుడు కోసుకోనొచ్చిందో! సేత్తో గట్నురాక కాలిబొట్నేలుకు నూలు దారాన్ని సుట్టుకోని పూలుగట్టుకుంటావుండాది. మాయమ్మకు పూలుగట్టియను గూడా తీరికుండదులే.

మెల్లింగా మాయక్క పక్కన సేరినాను. ‘అకా అకా ఈపొద్దు ముత్తరపల్లిలో ఆటుండాది. మర్సిపోతివా?’ అన్న్యాను.

‘నేనేం మర్సిపోలేదే’ అనింది.

‘మరి నువ్వు ఆటకు రావా’

‘ఎందుకు రాను’

‘మేమిప్పుడేపోతాము. నువ్వూరాకా. అవ్వ నన్ను పంపిచడంలేదు. నువ్వూ వొస్తానంటే నన్నేమనదుకా’

‘నేనమ్మతోనే వొస్తా. మీతోరాను. మీరాడికి బొయినాక నన్నొకదాన్నొదిలేసి యాడాడో బొయి ఎగరతావుంటారు.

‘లేదుకా. మనకోసం ముందుపక్క సాపలేస్తాం గదా! ఆడ కూసోనుందువుగాని’

‘మేయ్ నీకెన్నిసార్లు జెప్పల్ల నేను రానంటే రానని. సాప్మింద కూసోవల్లంట. సూసినోళ్లు కారూంచరా! ఒకపక్క ఇంగా పొద్దు పోలేదు అప్పుడే వొచ్చి కూసోనుండాద’ని కాలితో గట్టిన పూలని తుంచనుగాదని కట్టిందాన్ని పక్కనబెట్టి మల్లీ కాలికి నూల్దారమేసుకునింది. పక్కన కట్టిపెట్టిన పూలను జూసి ‘ఇది నేను దీసుకొనేదా’ అంట్ని.

‘ఆశ- దోశ – అప్పలం – వడ. పాపం. ఇంతసేపు నేను కోసుకోనొచ్చి కట్టింది నీకోసమా. కావాలంటే ఇప్పుడు కడ్తా వుండేదిస్తా’.

‘వూహూఁ నాకిదేగావాల’ అని ఎత్తుకోబోతి. గబుక్కుని అవి తీసి ఒళ్లో బెట్టుకుని ‘అవ్వా, సూడవా ఈ బిడ్డి నా పూలు పెరుక్కుంటా వుండాది’ అని గెట్టింగా మాయవ్వను పిల్సింది.

మాయవ్వొచ్చి, ‘ఈ అగ్రగొండితనమే వొద్దని కొట్టేది. ఒక మాటన్నా సెప్పినట్లిని అణకువగా వుంటావా అంటే ల్యా. ఒక పక్కింకా సూర్యుడు పరమట కూడా వాలలేదు. అప్పుడే తయారయింది. ఆటకు బోతానని. ఆ సైతాన్లుండాయే అప్పుడే రొండుసార్లొచ్చిపొయినాయి… ఇర్లసెంగి మాదిరిగా అట్లే బోవాలనుకుంటివా ఆడకు. ఆ సింపిరి తలకంత సమురు కొరివి బెట్టి దూబాని దీస్కరా తలదువ్వతాను’ అని కొంచిం గెట్టింగానే మాట్లాడిరది మాయవ్వ.

మాయక్క ముందర నన్నెవరన్నా తిడితే నాకు రోసం పొడ్సుకోనొస్తాది. అందుకే మూతి మూరెడు పొడుగుబెట్టుకొని గోడకుండే సున్నం గిల్లుకుంటా నిలబడిపొయినాను. మాయవ్వ సమురుసీసాయి, సెక్కదూబాని తెచ్చి తలదువ్వుతానని వొచ్చింది. నేను కదల్లేదు. రెక్కబట్టి ఈడ్సింది. వూహూఁ. ‘నువ్వు దువ్వుకోకపోతే నాకేమన్నా తలనొస్తాదా. అట్లే వుండు నాదేం బొయ్యింది. మీయమ్మొచ్చేపాటికి పొద్దుమునగతాది. తలదువ్వుకోకుండా అస్సలు పంపియదు. నీయిస్టం నా రాజా యాడన్నాబో!’ అని దిన్నిమిందికి బొయికూసునింది. మెల్లింగా బొయ్యి ముందర కూసున్న్యాను.

తలకు సమురు బెడ్తాకూడా ‘వొయసు పెరగతావుండాది గానీ మకురుతనం పోలేదు నీకు. నీతో యేంగేది శానా కస్టం పాపా, పెద్దయ్యేకొద్దీ బుద్ది దెచ్చుకోనక్కరలేదా’ అని ఏదో ఒకటి అంటానే వుండాది.

సమురు బెట్టేదయిపోయి దూబాని తల్లోబెట్టింది. ‘అయ్యయ్యయ్య’ అని తలబట్టుకున్న్యాను. ‘సెక్కదుబానితో అయితే నేను దువ్వుకోనుబో’ అని లేసి పరిగెత్తిపొయ్యి నడవగూట్లోవున్ని దంతం దుబాని తెచ్చిచ్చినాను.

మాయవ్వకు రొండుజల్లేసేది సరింగా రాదు. ఒక జడకూడా కిందికి దువ్వి ఈడ్సీడ్సి యేస్తాది. ఆటకు బోవాలనే ఆత్రంలో ఎట్లో ఒగట్ల యేస్తేసాలనుకున్న్యాను. కానీ మాయవ్వ నున్నంగా తలదువ్వి నూక్కాయల జడేసింది.

మల్లీ పూలుదెగ్గిరొచ్చింది కొట్లాట నాకు మాయక్కకు. ‘అన్నీ సూపించు’ అంటాను నేను. ‘నేనెందుకు సూపెట్టాల’ అని మాయక్క. ‘అమ్మరానీ వుండు నీకత సెప్తాను’ అంటావుండాను. కాంత వొచ్చేసింది. ఆబిడ్డి ‘అన్నం దినేస్తివా’ అనేదాకా నాకా ఆలోసనరాలేదు ‘అవ్వా, నాకన్నం బెట్టియ్యి’ అన్న్యాను.

‘వుప్పిడి బీమన్నం. ఒక మానాన వుడికిసావదు అంటా గుడ్సింట్లోకి బోయింది. నేనూ ఎనకే బొయినాను. ఇంకా పొయ్యిమింద అన్నం కుతకుతా వుడకతావుంది. ఇదయ్యేది గాదని మద్దేన్నం సంగటి బెట్టుకోని సింతాకు, వొంకాయలేసి ఎనిపిన పూలగూర బోసుకొని తింటావుంటే ఇంగా తిందామా అనుండాది. అంతబాగుండాది. నేను సంగటి దినేలోపల మాయవ్వ అన్న మొంచేసి గిన్నిలో ఆరబెట్టి పుచ్చారు బోసుకోనొచ్చింది.

తింటావుండంగానే యామలత, నీలా గూడా వొచ్చేసినారు. ‘మేయ్‌. బాయికాన్నించి మాయమ్మొచ్చినాక పోదారి మే’ అంటే వాళ్లేమీ మాట్లాడలేదు.

ఇంటెనక్కి పరిగెత్తుకోనిబొయి సూసినాను. వూహూఁ యాడా కన్పించల్యా. దిగులు మొగమేసుకోని ఎనక్కొచ్చినాను. ఎద్దులబండి ఇంటిముందర నిలబడుండాది. బండ్లోంచి మాయమ్మ కసువుగంప దించుకుంటావుంది. సూడంగానే సంతోసమైపోయింది.

‘మా… సాపలెత్తుకోని బొయ్యేదా. బొంతలా’ అడిగినాను.

‘యాడికి’

‘ముత్తరపల్లిలో ఈపొద్దు ఆటుండాది గదమా. మర్సిపోతివా’ మాయమ్మ మొగంలో సంతోసం. మాకంటేకూడా మాయమ్మకే ఆయాటలంటే శానా ఇస్టం. మేము నిద్రబోతామని తెలిసినా పిల్సుకోని బోతాది. మాయబ్బోడోళ్లు సందకాన్నే నిద్రబోతారు. ‘వాళ్ల నేడఈడ్సుకోని బోతావు. పండుకోనీలే’ అంటారు మాయవ్వ, మా నాయిన. అయినా మెల్లింగా ‘రేయ్‌ నేనాటకు బోతావుండా ‘లెయ్‌, లెయ్‌రా’ అని గుసగుసాని మాయవ్వోళ్లకు దెలియకుండా వాళ్లను లేపేస్తాది. వాళ్లు నిద్రమొగాలతో యాడస్తావుంటే వాళ్లనెత్తుకోని నడ్సి ఆవూర్లకు బోవాలంటే ఎంత కస్టం.

మా సిన్నబ్బోన్నెత్తుకోని మా గోపిగాన్ని సెయిబట్టుకోని నడిపించుకుంటా బయలు దేరతాదా. రేత్రికదా! మొబ్బుగా కూడా వుంటాది. వాడు నిద్రమొగంతో సీకట్లో నడవలేక ఆడే కూలబడతాడు. అప్పుడు సూడాల మాయమ్మని. మా సిన్నబ్బోన్ని ఎవురికన్నా ఇచ్చి వీడు బొలువు కదా వీన్నెత్తుకుందామంటే వాడు ఎవురిదెగ్గరికీ పోడు. ఎత్తే పిలకాయిలుకారు, దించే పిలకాయిలుకారు. మాయమ్మ కస్టాన్ని సూళ్లేక పాపం కౌసల్యక్కే మా గోపిగాన్ని కొంచేపెత్తుకోని కొంచేపు మాయమాటలు సెప్పి నడిపిస్తా ఎట్లో ఒగట్ల ఆటాడే సోటికి సేరతారు. మేము సిన్నపిలకాయిలం గదా రెయ్యంతా మేలుకోలేము. మాయబ్బోడోళ్లయితే ఒగోసారి కొంచి ఆట కూడా సూడరు. నేను మాయక్క ఆండేసాలొచ్చేదాకా మేల్కొనే వుంటాము. మళ్లిఎప్పుడు ముడుక్కుంటామో మాకే తెలీదు. కానీ కొత్త ఆండేసాలొచ్చినప్పుడు వాళ్లు మంచి పాటలు పాడినప్పుడు బలమంతంగా మాయమ్మలేపి కూసోబెడతాది. ఒకోసారి వాళ్లు సిల్మాపాటలు గూడా పాడతారులే. అయినా మేము నిద్రకు తాంగలేముగదా ఇంగ ఆటైపోయినాకుంటాది మాయమ్మ అగసాట్లు. మమ్మల్నంతా లేపుకోని సాపా బొంతలు సుట్టజుట్టుకోని ఇంటికొస్తాదా. మేమేమో రెయ్యంతా నిద్రపొయినా ఇంట్లో నిద్రపొయినట్లు కాదుగదా! ఇస్కూలుకు గూడా పోకుండా యాడోళ్లాడ పండుకొనేస్తాము. పాపం మాయమ్మకు పగలంతా పనిజెయ్యక తప్పదు. మర్సనాడు యాడా ఆటలేకపోతే సరి. ఏ వూరోళ్లన్నా ఆపొద్దుగ్గూడా వక్కాకు బెట్టేసిరా. ఇంగ మాయమ్మపని అయిపొయినట్లే. ఎంత కస్టమైనా మళ్లీరెయ్యంతా మేల్కొని ఆటసూస్తాది.

మాయమ్మేగాదు. కౌసల్యక్కోళ్లుగూడా అంతే. మా కుక్కలపల్లి పెద్దమోళ్లుండారే వాళ్లింకా మించినోళ్లు. మాయమ్మ, మాసిన్నపెద్దమ్మ పండమ్మ, మా పెద్దపెద్దమ్మ కిష్నమ్మ ముగ్గూరూ సొంత అక్కసెల్లెళ్లు. ఆటోళ్లు ఎవరన్నా వూర్లోకొస్తే అందురి దెగ్గిర అణా, అర్దణా వసూలు జేసి మావూర్లో ఆటాడేందుకు మావూర్లో మాయమ్మ, వాళ్లూర్లో మాపెద్దమ్మోళ్లే వక్కాకుపెట్టేది. వాళ్లకు వొండి వొడ్డించేది అప్పచ్చులు కాల్చిపెట్టేది వీళ్లే. ఎవురెవుర్ని ఎవురింటికి అన్నాలకు పంపించాలో పంపించేసినాక మిగిలినోల్లు ఎందురున్నా పిల్చి మరీ అన్నం బెడతాది మాయమ్మ. మా నాయనుండాడే ఇంగా మించినోడు. ‘ఆ ఇంటికొకర్ని ఈ ఇంటికొకర్ని పంపిచకపోతే మనింట్లోనే సేసి పెట్టొచ్చుగదా! బియ్యానికి ఉప్పుపప్పుకేమన్నా గొడ్డుకరువొచ్చేసిందా’ అని తిడ్తాడు మాయమ్మను. మాయవ్వ వాళ్లొస్తారని పచ్చిబాదమాకులు దెచ్చి ఇస్తరాకులు కుట్టి పెడతాది. అయితే మాయవ్వ, మా నాయన మావూర్లోనే ఆటాడినా సూసేది మాత్రం లేదు.

ముత్తరపల్లిలో ఆటకు సిరిసాపలొద్దని ఈతసాపొకటి, పాత జంకాలమొగటి ఇచ్చి ‘మద్దిలో ముందర పక్క ఎయ్యండి పాపా పక్కలో ఏస్తే అన్ని ఏసాలు సరిగా కన్పించవు’ అని సెప్పి బద్రంగాపొండి ఆడబొయి ఎవురితోను కొట్లాడొద్దండి’ అని సెప్పి పంపించింది మాయమ్మ.

నేను. యామలత, కాంత, నీల సాపలెత్తుకోని తలమింద బెట్టుకోని పోతావుంటే సాకలోళ్ల రాజేస్పరి, మల్లీక మేమూ వొస్తామని ఇంటికి పరిగెత్తిబొయ్యి సాపలు దెచ్చుకున్న్యారు.

ముత్తరపల్లిలో మావూర్లో వున్న్యట్లుగా నడీదిలో నాలుగు దోవలు కలిసే తలమేలేదు. వూరుగూడా ఇరుకిరుకు సందులుగా వుంటాది. అందుకని వూరికానుకోనుండే పాంచెరువులో ఏసాలు గట్టుకోను ఒక జోబిడేసి దానిముందర ఆటాడను టెంకాయి మట్టలతో పందిలేసినారు.

ముందరిగా కూసోవాలని అందురికీ మునాసే. అందుకేగదా మేము అంత బిన్నిగా పరిగెత్తుకోనొచ్చింది. మేం బొయ్యేసరికి ఆడ ఆర్మోనీ వాయించే వాళ్లకోసం ఏసిన బెంచీలపైన ఒక కుక్క పండుకోనుండాది. ఇద్దురు మొగోళ్లు మాత్తరం గెట్టింగా ఇన్పించేందుకు రొండు బుర్రలు దానికి తలకాయిలూ వుండే వాటిని పందిలికి ఈపక్క ఆ పక్క యాలాడగడ్తావుండారు. ఆటాడే సోట మాత్తరమే సెక్కుడుబారతో సెక్కి కిలీను సేసుండారు. మిగతా సోటంతా గెడ్డి మొలిచి మెత్తంగా వుండాది. ఆడాడ కొన్ని తుమ్మిసెట్లు, సీమ్మిరపసెట్లు వున్న్యా కూడా పెరికితే రావడంలేదు. కొడివిలితో కోస్తే దాని మొక్కలు గుచ్చుకుంటాయిగదా! అందుకే అట్లే వొదిలేసినారు.

పందిలి సుట్టూ, జోబిడి సుట్టూ ఐదారు మంది పిలకాయిలు పరిగెత్తతా ఒకర్నొకరు తరుముకుంటా ఆట్లాడుకుంటా వుండారు.

మేము సాపల్ని దీస్కోని బోయి పందిలి ముందర పరస్తావుండామా. వాళ్లు పరిగెత్తుకో నొచ్చినారు.

‘ఏమ్మే. అప్పుడే వొచ్చేసినారు?’ కొంచిం పెద్దంగా వుండే పిల్ల అడిగింది.

‘మల్లీ సీకటయిపోతాదని’ యామలత సెప్పింది.

‘మీ సాపలెత్తుకోని బొయ్యి ఆడ దూరంగా ఏసుకోపొండి ఈడ మేమేసుకోవాల’ సింపిరి జుట్టు మెల్లకన్ను బిడ్డి అనింది.

‘మేం ముందుగా వొచ్చింది దేనికంటా. ముందరగా కూసోని ఆట సూడాలనే.’ అన్న్యాను.

‘మీ వూర్లో ఆటాడినప్పుడు కూసోండి ముందర ఇది మావూరు, మేమే కూసుంటాము ముందర.’

‘ఏవూరోలైనా ఎవురు ముందొచ్చి యాడ సాపలేసుకుంటారో ఆడ వాళ్లే కూసుంటారు’ ఈ మాట రాజేస్పరి అనింది.

నీల, కాంత, యామలత, మల్లీక సాపలు పరస్తావుండారు. నేను, రాజేస్సరి వాళ్లతో మాట్లాడ్తావుండాము. మల్లీక, యామలత నేనుదెచ్చిన ఈతసాప ముందరగా ఏసినారు. ముందరెయ్యకపోతే మళ్లీ నేనేడ కొట్లాడ్తానో అని బయం వాళ్లకి.

పెద్దంగా వుండే బిడ్డి బొయి దాన్ని ఈడ్సి పారేసింది.

‘ఏమ్మే నీకంత కొవ్వు. మాసాపనెత్తి పారేస్తావు. మేము ఎవురనుకుంటావుండావు’ గెద్దించింది. మల్లీక.

‘ఎవురైతే మాకేం మే. మావూరికాడొచ్చి కిండల్‌ జేస్తా వుండారు’ ఆబేడ్డే అనింది.

‘ఇదేం మీ వూరుగాదు. పాంచెరువు. ఈ సెరువు ఎవుర్దనుకున్న్యారు. ఈ బిడ్డోళ్ల తాతోళ్లది’ అని నన్ను సూపించింది యామలత.

‘వాళ్ల తాతోళ్లదని యాడన్నా రాసిపెట్టుండాదా?’ పెద్దబిడ్డి ప్రెస్నె.

‘రాసి పెట్టకపోతే ఈ సెరువులో పట్టే స్యాపల్ని ఈళ్లతాతోళ్లకే ఎందుకిస్తారంట’ – యామలత.

పందిలికి జోరుగా ఇన్పించే పైపులు గడ్తావున్ని మొగోళ్లిద్దురూ పనాపేసి మమ్మల్నే సూస్తావుండారు.

ఎవురా అనిసూస్తే వాల్లలో ఒకడు మాదిగోళ్ల సినబ్బ. మా పెద్దమ్మోలింట్లో సేద్ద్యానికుంటాడు. ‘సినపాపా, నువ్వామ్మా. ఎందుకప్పుడే వొచ్చేస్తిరి’.

‘సూడు సిన్నబ్బన్నా. ముందర కూసోవాలని ముందే వొస్తే ఈ ళ్లు మమ్మల్ని తిడ్తావుండారు’.

‘ఏంది బిడ్డా. ఎందుకు మీరు వాళ్లను తిట్టేది?’ సిన్నబ్బన్నడిగినాడు.

‘మావూరోళ్లాట కదా! ముందర మేమే కూసుంటామని సెప్తావుండాము. కావాలంటే ఆపక్క కొంచిం దూరంలో ఏసుకోమని.’ పెద్దబిడ్డి సెప్పింది.

‘ఏవూరి న్యాయం పాపా ఇది. ముత్తర పల్లిలో ఎవురి బిడ్డినువ్వు’

‘సెవుటామి మనవరాలు’

‘నువ్వు పాపా’

‘లచ్చుమయ్య నాయుడు మా నాన్నే’ మెల్లకన్నుపిల్ల సెప్పింది.

‘నువ్వు?’ ఇంకో బిడ్ని అడిగినాడు.

‘రాములక్క మా యవ్వే’ సెప్పిందా బిడ్డి.

‘ఈ బిడ్డెవురో తెలుసా మీకు?’ నన్ను సూపించి అడిగినాడు.

తెలీదన్నట్లు సూసినారు వాళ్లు.

‘వరిగిపల్లి వొర్దారెడ్డి పేరిన్న్యారా ఎప్పుడైనా? ఈ సెరువుకి కిస్తీగట్టేదాయినే. ఆయన మనుమరాలీబిడ్డి. కోదండరెడ్డి కూతురు. మా సెంగ్రల్రెడ్డి బార్య ఈ బిడ్డికి పెద్దమ్మవతాది’ సిన్నబ్బన్న వాళ్లను బెదిరిస్తావుంటే రాజేస్పరి, నీల, కాంతా వాళ్లు మా వన్నీ పర్సేసి వాటిమిందే కూసోనుండారు.

వాళ్లు బిత్తరపొయ్యి నిలబడుండారు. వున్న్యట్లుండి మెల్లకన్ను పిల్ల యాడస్తా వాళ్లింటికి పరిగెత్తింది. ఇంగిద్దురు గూడా అదే దోవ బట్న్యారు. ‘మీకేం బయం లేదు. మీ జోలికింగెవురూ రారు నేను బొయి అన్నం దినేసి పెద్దమ్మోళ్లను పిల్సుకోనొస్తాను. వాళ్ల గ్గూడ తావు సూసి పెట్టుకోండి’ అని సెప్పేసి అదే పతా పూడ్సినాడు సిన్నబ్బన్న.

మేం తప్ప ఆడింగెవురూ లేరు. పరిగెత్తే ఆట ఆడుకుంటావుండాము. ఆటోళ్లు ఆర్మోనీ పెట్టి, యాసం సామాన్లు ఎత్తుకోనొస్తావుండారు. మాకానందం పట్నుగాలేదు. వొచ్చీ రాంగానే వాళ్లు జోబిట్లో దూరినారు. మొగాలకు అద్దలం బూసుకుంటావుంటే మేమాడే నిలబడి సూస్తావుండాము. ముందొక నలుగురు మాత్రమే యాసాలేసినారు. జనాలొకరొకరూ ఇద్దురూ రాబట్న్యారు. ఆర్మోనీ, తబలా వాయించే వోళ్లొచ్చి బెంచీ మింద కూసోని కిర్రు బర్రు అంటా వుంటే మేము జోబిట్లో నుంచి ముందుకొచ్చి కూసున్న్యాము.

మాతో కొట్లాడి పొయి పిలకాయిలు సాపలు, గోనె సంచులు దెచ్చుకోని బెంచీల కెదురు పక్కంగా పర్సుకుంటావుంటే వాళ్ల పెద్దోళ్లు గూడా వొచ్చినారు. మమ్మల్ని సూపెట్టి ఆ పిలకాయిలు వాళ్లతో ఏమో సెప్తావుండారు.

‘ఏం పాపా, మా వూర్లో ఆటక్కూడా వొరిగి బల్లోళ్ల పెత్తనాలేంది. మీ సాపల్ని ఇంకొంచిమట్ల జరుపుకోండి. మా పాపోళ్లు సాయింతరం నించీ ఈడే కాసుకోనుండారు’. అనిందొక ముసిలామి. సిన్నబ్బన్న గూడా లేడా మాక్కొంచిం డర్రు బట్టుకొనింది. అయినా వాళ్లెంత అర్సిగీపెట్టినా మేమాన్నించి కదల్లేదు మెదల్లేదు.

‘అగ్ర గొండితనం జాస్తిగా వుందాపిలకాయిల్లో. ఏమన్నా పెద్దోళ్లం సెప్తావుండామని బయమూ బక్తీ వుండాదా? ముందర మొత్తం వాళ్లే పర్సుకోని కూసోనుండారు. సిన్నబ్బ గూడా మన పిలకాయిల్నే బెదిరించినాడంట. రానీ వాని కతేందో సూస్తాను’ అని తిడ్తానే వుండాదాయమ్మ.

‘మ్మో, అర్సకుండా వుంటారా లేదా!’ ఒకాయనొచ్చి వాళ్లను అదిలించినాడు. ‘సూడ్రాబ్బా జగన్నాదా మనపిలకాయిల్ని ముందర కూసోనియకుండా వొరిగి పల్లి పిలకాయిలొచ్చి కూసోనుండారు’. ఇంగొకామె అనింది.

‘యాడైతే ఏముందత్తా. ఆడగూడా బాగా కన్పిస్తాది గదా! ఓయమ్మా ఏడూర్లజనం వొచ్చినారంటే కాలుబాగం సెరువు నిండిపోతాది. మరి వాళ్లంతా సూడరా ఆట’ అని వాళ్లతో అని మాదెగ్గిరికొచ్చి ‘లెయండి పాపా, మీరింకొంచిం ఆపక్కకు జరిపి ఏసుకోండి’ అన్న్యాడు.

‘ఆడ మాకు కన్పించదు. ఆ బెంచీ మింద అందురూ కూసున్న్యారంటే మాకేమీ కన్పించదు’ అనింది మల్లీకా. ‘మేయ్‌ మనం అంతముందుగా వొచ్చింది ఎందుకంటా. ఎవురుసెప్పినా ఇనద్దండి. గమ్మన కూసోండి’ అన్న్యాను.

ఈ లోపలే మాయమ్మోళ్లొచ్చేసినారు. ‘కమాలా, బాగుండావా. శాన్నాళ్లైపోయా నిన్ను సూడక’ అని ఒకామె, కిస్నమ్మక్కోళ్లు రాలేదా కమలా’ అని ఒకరు, ఈబిడ్డి మనపాపా అని ఒకరు వొచ్చి మాయమ్మ సేతులు బట్టుకోని మాట్లాడిస్తావుండారు. ఇంతదాకా మమ్మల్ని తిట్టినోళ్లు.

‘అంతా బాగుండాము. అక్కోళ్లు రాకుండా వుంటారా పొంబలోళ్లాట. వొచ్చేస్తానే వుంటారు. ఇది మా పెద్దపాప. అద్దో ఆడ ముందర మల్లిపూలు బెట్టుకోని కూసోనుండాదే అది రొండోది వీడు పెద్ద పిలగాడు మాయమ్మ మమ్మల్ని సూపెట్టి సెప్తావుండాది.

‘మీ రొండోపాపుండాదే. శానా తెలివైంది. దైర్నస్తురాలు గూడా. ఎంతముందుగా వొచ్చి ముందరగా సాపలేసిపెట్టింది మీకు. ఉంటే ఇట్లాంటి పిలకాయిలుండాల. మావి వుండాయి సూడు. ఉప్పురాతికి గూడా కొరగావు. మద్దేనంనించి సెర్లోనే బడుండారు. ఏం లాబం’ రాములక్క అనింది మనవరాలి తలమిందొక పోటుపొడస్తా.

మాయమ్మోళ్లొచ్చేసినాక మేము యాసాలేస్తావుండే జోబిడికాడ బొయి నిలబడినాము. అద్దలమేసుకోని గోసిపంచిలు గట్టుకోని కూసోనుండారిద్దురు. వాళ్లలో ఒగాయన ఏనుగు తొండముండే కిరీటం బెట్టుకున్న్యాడు ఇంగొకాయన మామూల్ది బెట్టుకున్న్యాడు. ‘ఇంగాట మొదలవతాది పొయ్యి కూకోండి’ అన్న్యాడొకాయన. మేమొచ్చి మాయమ్మోళ్లతో సుట్టూ వుండే వాళ్లగ్గూడా ఇన్పించేట్ల ఆ ఇసయం సెప్పినాము.

‘గప్‌చిప్‌గా వొచ్చి కూసోని ఆటసూడు. మాటికీ ఈడకూ ఆడకూ లేసి పోతావున్న్యావంటే రేపట్నుంచి యాడికీ పిల్సకొచ్చేది లేదు’ అనింది మాయమ్మ. అందరం బుద్దిగా కూసున్న్యాము.

ముందుగా ఇద్దురు మనుసులొచ్చి ఒక పంచిని అడ్డంగా బట్టుకున్న్యారు. మామూలు కిరీటం బెట్టుకున్నాయిన ఆ పంచికి ఎనక నిలబడి ఇనాయక సామి పాట పాడతావున్నాడు. ఆయన పెట్టుకున్ని కిరీటం మాత్తరమే కనిపిస్తావుండాది. కొంచేపు పాట పాడినాక పంచి బట్టుకున్నోళ్లు పక్కకు బొయినారు. తొండం కిరీటం బెట్టుకున్నాయిన కుర్సీలో కూసోనుంటే ఈయన పాటపాడతా మొక్కతానే వుండాడు.

కొంచేపిటికి జనాలముందు నిలబడినాడు మాయమ్మ మా పెద్దమ్మోల్లను సూసి దండం బెట్టినాడు. బెంచీమింద ఆర్మోనీ వాంచే వాళ్లపక్కన ఇద్దురు మొగోళ్లు కూసోనుంటే వాళ్లగ్గూడా మొక్కినాడు. ఆపైన వొచ్చినోళ్లందురికీ మొక్కి ‘ఈపొద్దు ముత్తరపల్లి గ్రామంలో కాంబోజరాజు కత నాటకం కన్నులపండగ్గా జరగతాది. మీరందరూ నిద్రాదేవిని నెత్తిమింద నించి దించి పక్కన బెట్టి ఆటను సూసి ఆనంద పడతారని ఆశిస్తాను’ అన్న్యాడు. ఈ లోపల ఒగాయనొచ్చి ఆయన సేతిలో దుడ్లుబెట్టి సెవులో ఏందో సెప్పి పక్కకుబొయ్యి నిలబడినారు.

‘ఈ రోజు కళాకారులను గౌరవించి నల్లమనాయుడు గారు సమర్పించుకొంటున్న తొలికానుక. ఆయనకు ఆయన కుటుంబానికి ఆ పార్వతీదేవి ఆయురారోగ్గ్యాలను, సకల సౌబాగ్యాలను అందించుగాక’ అన్న్యాడు.

ఇంగా ఎవురో ఏందో తెచ్చియబొయినారు. కొంచిం కతనడ్సినాక ఇస్తే బాగుంటాదని సెప్పి ఆ సదివింపులు మాత్రం సదివినాడు. మల్లీ ఇద్దురొచ్చి పంచిగుడ్డను అడ్డంగా బెట్టుకున్న్యారు. ఇంగో యాసమొచ్చి దానెనక నిలబడి పాటపాడినాక ‘రాజుయెడలె రవి తేజము లలరగ’ అంటా పంచిని పక్కకుదోసి శానాసేపు సేతిలో కత్తిబట్టుకొని ఎగిరినాక ‘యెడలే కాంబోజరాజు సబకు’ అంటా పాడతావుండాడు. ఆ కాంబోజరాజు అచ్చు ఏమ్టీరామారావు మాదిరిగానే వుండాడు. కట్టేగాని యాసంతో ఇంగోడొచ్చి రాజుతో పరాసికాలాడతా దెబ్బలు దింటా అందుర్నీ నవ్వించినాడు. ఇద్దురాడయాసాలు గూడా వొచ్చేసినారు. వాళ్లల్లో ఒగామె సూస్తావుంటే ఇంగా సూద్దారా అని వుండాది. ‘సెంగల్రాయుడు ఆడేసం గడ్తే సూన్ను వుండే రొండుకండ్లు సాలవు’ అని మాయమ్మ పక్కనున్ని మా సిన్నపెద్దమ్మతో శానా మెల్లింగా సెప్పింది. అయినా ముందర కూసోనుండాము గదా ఇన్పించిందేమో మాయమ్మను సూసి నవ్వి మా యమ్మకు మా పెద్దమ్మోళ్లకు దండం బెట్టినాడు. మాయమ్మోళ్ల సంతోసం సెప్పనలివిగాలేదు. కొంచేపుండి దుడ్లు నాసేతికిచ్చి ఇచ్చిరమ్మనింది. ‘ఏం జెప్పాలమా?’ అని అడిగినాను. ‘నువ్వేమీ జెప్పనక్కరలేదుబో వాళ్లకే తెల్సు’ అనింది. మా నాయన పేరు జెప్పి పొగిడినారు వాళ్లు.

ఎంతొరకు ఆట సూసినామో తెలీదు. ఎప్పుడు నిద్రపొయినామో తెలియదు. ఇట్లొరు అట్లొకరు పండుకొనేసినాము. మాయమ్మ లేపేదాకా ఎక్కడుండామో గూడా అర్తం గాలా. పుల్లూరోళ్ల నీల తప్ప అందురు పిలకాయిలు ముడుక్కోని నిద్రబోతావుండారు.

‘పాపా శరబందిరాజు రాచపుండుకు ముందుతయారు జెయను ఏమేమడగతాడో ఇని నేర్సుకోండి’ అని బలవంతంగా కూసోబెట్టింది.

‘ఏమేమొస్తులు గావాలో సెప్పు నాయినా శరబందిరాజా’ అని మంత్రి అడిగినాడు. కాంబోజిరాజు కుర్సీలో వాలుకోని కండ్లు మూసుకోనుండాడు.

అమా, ఆ రాజు నిద్రబోతావుండాడుమా. పాపం, మాకుమాదిరిగానే ఆయనగ్గూడా నిద్రొచ్చినట్లుండాది’ అన్న్యాను. ‘నిద్రగాదు పాపా, ఆయనకు ఈపులో రాచపుండు లేసింది. ఆనొప్పికి తట్టుకోలేక పండుకోని కండ్లుమూసుకున్న్యాడు’ అనింది మాయమ్మ.

‘సెప్పు సెరబందీ ఏమేమి వొస్తువులు గావాలో సెప్పినావంటే మా రాజకుమారులు ఆరుమంది వీరులు, సూరులు, ఇక్రమార్కులు. వాళ్లు క్షణాల్లో అన్నీ సమకూర్సిపెడ్తారు’ అని అడిగినాడు మంత్రి.

శెరబంది రాజు పాటెత్తుకున్న్యాడు. పక్కనోళ్లిద్దురూ వంతబాడతా వున్నారు.

‘‘ఊంగని మాను ఆకు గావాల

తొనకని బాయి నీళ్లుగావాల

అంత్ర మద్యాన పక్షిగావాల

కన్నిపడుచు కనుగుడ్లుగావాల

ఈనని పులి జున్నుగావాల

ఆట్లాడే ఆకులు గావాల

పోట్లాడే పోకాలు గావాల

సూక్షము జెప్పే సున్నమె గావాల         ॥ తందానా ॥’

‘ఎట్లాంటి వస్తువులు అడిగినాడో సూడు శరబందిరాజు ఊంగని మాను ఆకు యాడన్నా వుంటాదా? తొనకని బాయి నీళ్లుంటాయా, ఈనని పులి పాలిస్తాదా జున్ను దొరకడానికి ఇంగా ఏందోదో అడిగినాడు గుర్తుండి సస్తేనా’ తెల్లారి ఆటయిపోయి ఇంటికొచ్చేటప్పుడనింది మాయమ్మ కౌసల్యక్కకు ఇట్లాంటివి బాగా గుర్తుంటాయి. ‘ఆకాశాన తిరిగే పక్చి గావాలంటాడు. కన్నిపిల్ల కనుగుడ్లడగతాడు. అట్లాడే ఆకులంట, పోట్లాడే పోకలంట, సూక్చము జెప్పే సున్నము గావాలంట’ మాట్లాడుకుంటా నడస్తావుండాము.

‘కమలా, మనూర్లో ఆట ఎప్పుడిడస్తాము సెప్పు. ఆటకు ఆర్రూపాయలంటే ఇంటింటికి అణా అన్నా ఇయ్యమనాల. అన్నాలు సరే! మనము ఐదారిండ్లోళ్లు పెడ్తాము. ఇంటికి ఒకరో ఇద్దరో వొస్తారు. ఆటోళ్లకు మనం పెట్టుండాల్సింది వొక్కాకు. మీయక్కోళ్లు బెట్టేసినారు ఎల్లుండికని.

‘దినమిడ్సి దినమైతేనే బాగుంటాది. కుక్కలపల్లిలో ఆటాడేరోజు మనం వొక్కాకుపెట్టి తీరాల్సిందే’ అనింది సరస్పతక్క.

‘ఏమాటాడమందాము మనూర్లో’ అడిగింది సంపూర్ణక్క.

‘మనూర్లో ఎన్నో ఆటలాడినారిప్పటికి, వొచ్చిన ప్రతెసారీ ఆంటాది కమలమ్మక్క నల్లతంగాల్‌ కత ఆడమందామని. ఈ సారన్నా ఆదాడమందాము’ అనింది కౌసల్యక్క.

‘ఆమా, ఏదోకతలో ఏడుమందాడపిలకాయిలంటారు. వాళ్లను వాళ్లపిన్నమ్మ ఎప్పుడూ కొడ్తాతిడ్తావుంటాది. వాళ్లనాయిన మంటిముద్దైపోతాడు అదాడమందారిమా’ అన్న్యాను నేను.

‘బాలనాగమ్మ కతా. అది శానాసార్లు సూసినాము కదా! ఇదింకా బాగుంటాది. దీంట్లోగూడా కాశిరాజుకు ఏడుమంది కొడుకులు. వాళ్లూర్లో కరువొస్తే ఆకలికి తట్టుకోలేక వాళ్ల మామోళ్లూరికి పిల్సకొస్తాది వాళ్లమ్మ. కానీ వాళ్లత్త వాళ్లకు అన్నంగూడా పెట్టదు’ మాయమ్మ సెప్తావుండాది. కౌసల్యక్క రాగమెత్తుకునింది.

‘మూలియా అలంకారి మూదేవి సెండాలి

తలనొప్పి సాకుబెట్టి తలకు గుడ్డ కట్టుకొనె

తాగను నీల్లులేక తల్లడిల్లినారు బాలలు

…………………………………….’

‘అమా ఈయాటే ఇడస్తామ్మా మనూర్లో. ఎంత బాగుండాదో’ అన్న్యాను.

‘ఆయాట పేరేందో సెప్పుసూస్తాము’ మాయక్క నన్ను నలుగురిలో ఏవిూతెలీని దాన్నని సెప్పించాలని సూస్తావుంది. ‘నల్ల నల్ల’ అని పేరు గుర్తు సేకుకుంటావుంటే ముత్తరపల్లిలో ఆటిడ్సిన నల్లమనాయుడు పేరు గుర్తొస్తావుంది. ‘అది పసిబిడ్డిం పైగా కొత్తపేరు, నువ్వు సెప్పు సూస్తాము’ అనింది మాయమ్మ. పేరు దెలియక నల్లమొగమేసిన మాయక్కను సూస్తావుంటే నా సామిరంగా…. ఎంత సంతోసంగా వుండాదో నాకు.

– ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఇర్లచెంగి కథలు, జనవరి, సీరియల్ and tagged , , , , , , .

4 Comments

  1. కథ చాలా బాగుంది. మా అమ్మ చెప్పే కథల లాగా అనిపించింది. ఛదువుతుంటె నెనే ఆ పల్లెలొ ఉండి ఆ చెరువు చుట్టూ తిరిగి అన్నీ చూసినట్టు అనిపించింది. ధన్యవాదాలు !

  2. అబ్బ ఈదినాటకం కండ్లతో సూసినంత సంతోసంగా ఉండాది. తూంగు మొగాలేసుకొని రేత్రంతా ఆట చూడడం చిన్ననాటి తియ్యటి జ్ఞాపకం. ఎంత బాగా రాశారు దేవకీ గారూ.

    చిన్నపిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా ఉందీ కథ.

  3. పల్లెల్లో తుడుమేసి విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజెప్పడమే సాంప్రదాయం. ఒక ఇరవై ముప్పై ఎండలకు ముందు ఎక్కువగా ఉండేది. దాన్ని కళ్ళకు గట్టేట్లు సెప్పిన మీకు అభినందనలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.