cover 2

అజాత

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

5

సామాన్య జన జీవనానికి నిసర్గ రమణీయ దర్పణం జానపద సాహిత్యం. హృద్గతమైన ఆవేశం, సుఖం, దు:ఖం, భయం, భక్తి, అనురాగం, అపకారం, వ్యామోహం, వాత్సల్యం, క్రోధం, కార్పణ్యం మరెన్నో మానవ స్వభావాల సహజ వ్యక్త రూపమే జానపద వాఙ్మయం. నాగరిక సాహిత్యంలో వీటికే కృత్రిమత్వం పులమడం జరుగుతుంది.” - బిరుదురాజు రామరాజు

రస వ్యవస్థ నిర్వహణకు ఔచిత్య చర్చ అవసరాన్ని ఆనందవర్ధనుడు ఎత్తిచూపిస్తున్నారు. ఆయన ధ్వన్యాలోకం నుండి భారతీయ లాక్షణికులు ప్రామాణికంగా ఉదహరించే శ్లోకం:

అనౌచిత్యాదృతే నాన్యద్ రస భంగస్య కారకమ్

ప్రసిద్ధౌచిత్య బంధంతు రసస్యోపనిషత్ పరా.

సృజన రస వ్యవస్థను భంగం చెయ్యటంలో అనౌచిత్యాన్ని మించిన దోషం లేదు. రసోచితమైన ఔచిత్య నియమాలను పాటించటమే రస స్ఫూర్తి వెనుకనున్న రహస్యం – అంటే “రసొపనిషత్తు” అని. రస వ్యవస్థ లోని అనౌచిత్యాల వలన చాల వరకు రచనల్లోన రస స్ఫూర్తి – అంటే Manifestation of aesthetic emotion కనీసమాత్రంగానైనా సరే ఆవిష్కృతం కాదు. భరత ముని రస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడూ, ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడూ, కుంతకుడు వక్రోక్తిని ప్రతిపాదించినప్పుడు కూడా ఔచిత్యానికి ఉన్న ఆవశ్యకతను గురించి క్లుప్తంగానో, విస్తారంగానో ప్రస్తావిస్తూనే వచ్చేరు. అయితే ఉచితానుచితాలను సృజన ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి పార్శ్వంలోనూ పరిశీలించి, విశ్లేషించడమే లక్షణ చర్చకు ముఖ్యమనీ, ఔచిత్య చర్చే రస నిర్ణయానికి పునాది అనీ వివరంగా ప్రతిపాదించినవాడు వీళ్ళందరి కంటె వెనుకగా వచ్చిన క్షేమేంద్రుడు. ఇదివరకే చెప్పుకున్నట్టు ఈ ప్రాచీన లాక్షణికుల వివేచన సారం అయితే ఇప్పటికీ మనకి ఉపయోగంగా ఉంటుంది గాని, ఆ కాలంలో వాళ్ళు స్వీకరించి అన్వయించిన ఉదాహరణలు – శకుంతల దుష్యంతుల ప్రణయ గాథ, ఇలాంటివి – ఇప్పటి పరికింతకు అంతగా ఉపకరించవు. ఉదాహరణకు ఆ కాలపు ఔచిత్య చర్చకు నియమాలు (Rules) ఏమో సంస్కృత కావ్యాల్లోని గాథల నుండి స్వీకరించినవి. శివుడు పార్వతుల ప్రణయ సన్నివేశాల్ని కాళిదాసు మామూలుగా సగటు ప్రేయసీ ప్రియుల ప్రణయానుభవాన్ని వర్ణిస్తున్నట్టే వర్ణించేరని, అది అనుచితమనీ క్షేమేంద్రుడు అభ్యంతరం చెప్పింది ఉంది. ఇప్పటి కథలు, నవలలు, కవిత్వాల్లోన ఔచిత్యాన్ని పరికించడానికి ఇలాంటి నియమాలు అప్రస్తుతం కదా? ఇప్పటి సృజనకు ఉచితానుచితాలను ఎవరు, ఎలా నిర్ణయిస్తారు? పాత కాలపు ఔచిత్య నియమాల్ని యధాతథంగా ఇప్పటి సృజనకు అన్వయించాలని చేసే ప్రయత్నమే అనుచితం అవుతుంది, Force Fit లాగ ఉంటుంది. ఈ ఇబ్బందిని దాటడానికి రెండు ఉపాయాలని ఇదివరకు చెప్పింది: స్వీయమైన అనుభవమే ప్రాతిపదికగా పాత సిద్ధాంతాల్లోని సారాంశాన్ని మాత్రం గ్రహించి, ఇంకా ఇప్పటి కాలంలో ఎక్కువమంది అంగీకరించే పాశ్చాత్య శాస్త్రాలను తులనాత్మకంగా పరిశీలిస్తూనూ రసం, ఔచిత్యం, వక్రోక్తి, రీతి వంటి పాతకాలపు ప్రతిపాదనలను ఇప్పటి పరికింతకు అన్వయించుకోవచ్చు. ఇది ఆసక్తి, అవసరం ఉన్నవాళ్ళకి సహాయంగా ఉంటుంది.

ఔచిత్యాన్ని, అనౌచిత్యాన్ని పరిశీలించడానికి సృజనాత్మకమైన కాల్పనిక వచనం లక్షణాలలో ప్రధానమైనవని ఇది వరకు చెప్పినవి ఏడు – కథకు కేంద్ర బిందువుగా ఉండే కథాంశం, కథలోని పాత్రలు, కథ ఇతివృత్తం, కథ నేపథ్యం – ఆవరణం (Setting), కథకుని దృష్టి, కథను నిర్మించిన భాష, కథలోని గొంతు. వీటిని ఒక్కొకదాన్నీ ఆధారంగా స్వీకరించి కథను, నవలను చదువుతూ పోతూ ఆ ఒక్క లక్షణంలోని ఉచితానుచితాలను పరిశీలించవచ్చును. కవిత్వానికి మౌలికమైన లక్షణాలని గురించి అస్పర్శలో ప్రస్తావన వచ్చింది. ఇవి కాక సృజనకు మౌలికమైనవి, పాఠ్యానంతట్నీ ఆవరించి ఉండే నిర్మాణ వ్యవస్థలు – రస వ్యవస్థ, నిర్మాణ వ్యవస్థ (Architecture), నిష్పత్తి (Proportionality), పొంతన (Internal Consistency), నాద వ్యవస్థ (Musicality), విశ్వసనీయత (Credibility), స్వచ్ఛత (Authenticity), ప్రతిపాదన (Essential message of the work), నవ్యత (Novelty), ఉత్కంఠ (Suspense), అలవాటైన దృష్టిని భంగం చెయ్యటం (Dishabituation) – ఇలాంటివి ఒక్కొక్క వ్యవస్థలోని ఉచితానుచితాలనూ పరిశీలించడము సహాయం అవుతుంది. ఈ వ్యవస్థలన్నింటికీ తల మానికమైనది, ఆధారభూతమైనదీ ప్రధమంగా రస వ్యవస్థ. అంటే – రస వ్యవస్థ నిర్మాణం అనుచితంగా ఉంటే ఇంక మిగత వ్యవస్థల్లోను, లక్షణాల్లోని ఔచిత్యాన్నీ, అందాన్ని గురించిన చర్చ వలన ఏమంత ప్రయోజనం లేదు. ఎలాగంటే ఇది వరకు చెప్పినట్లు సొగసైనవి రక రకాల దుస్తులు, ఆభరణాలు ధరింపచేసిన గొప్ప అందగత్తె విగత దేహాన్ని గురించిన చర్చ లాగ. పాశ్చాత్య కళా సిద్ధాంతాన్ని నిర్మించినవాళ్ళు ఎంతోమంది రస స్ఫూర్తి (Aesthetic Emotion) సృజనకు ఆయువుపట్టు అన్న ఈ ప్రతిపాదననే బలంగా, ముక్త కంఠంతో ప్రతిపాదిస్తూనే వస్తున్నారు. ఉదాహరణకు కొన్ని మట్టుకు:

“Works of art are essentially expressions of emotion.” – R. G. Collingwood

“To evoke in oneself a feeling one has once experienced, and having evoked it in oneself, then by means of movements, lines, colors, sounds, or forms expressed through words, so to convey this so that others may experience the same feeling – this is the activity of art.” – Leo Tolstoy.

“…poetry’s importance comes from the emotions it causes.” – I. A. Richards.

“The experience, you will notice, the elements which enter the presence of the transforming catalyst, are of two kinds: emotions and feelings. The effect of a work of art upon the person who enjoys it is an experience different in kind from any experience not of art. It may be formed out of one emotion, or may be a combination of several; and various feelings, inhering for the writer in particular words or phrases or images, may be added to compose the final result. Or great poetry may be made without the direct use of any emotion whatever: composed out of feelings solely.” – T. S. Eliot ఇలా…గ. ఈ దృష్టీ, ప్రతిపాదనా రస మతానికి చెందినవి. ఇందుకు ఎడంగా అలంకార మతమని ఉంది. ఈ రెండింటి మధ్య బేధాలను, సారూప్యాలను విడిగా చర్చించాలి.

కాల్పనిక సృజనకూ, భాషనే వాహికగా చేసుకుని నిర్వహించే మిగతా అనేకమైన పనులు – వ్యాసం, ఉపన్యాసం, సైన్స్ విజ్ఞానం, చరిత్ర, భాషా శాస్త్రం, రాజకీయం, Activism, సంఘ సేవ, కౌన్సెలింగ్ వంటి వాటికీ మధ్య ఉండవలసిన బేధాల్ని పోల్చుకోడానికీ, కాల్పనిక సృజన సరిహద్దుల్ని అవగతం చేసుకోడానికీ రస వ్యవస్థను గురించిన అవగాహన, ఔచిత్యాన్ని గురించిన చర్చా ఉపయోగపడతాయి. బిరుదురాజు రామరాజు గారు ఎత్తిచెప్పిన ప్రసక్తి కూడా ఎన్నో రకాల మానవ ఉద్వేగాలనే ప్రస్తావించి, సృజనలోని నైసర్గికమైన స్వచ్ఛత – అంటే Authenticity కీ రసోద్వేగాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్నీ, అందుకు భిన్నంగా నాగరికులు సాహిత్యానికి పులిమే కృత్రిమత్వాన్ని గురించీ విశదం చేస్తున్నాది. జానపదులు అంటే పల్లెల్లో ఉండే అమాయకులనీ, నాగరికులంటే నగరాల్లో ఉండే గడుసువాళ్ళనీ ఇలాంటి పడికట్టు ఊహగా దీన్ని అర్ధం చేసుకోకూడదు. జనపదం అంటే మానవ సంఘం – అంటే నగరం, పల్లె, స్వదేశం, విదేశం ఎక్కడి సంఘం అయినా జనపదం అంటే Community. ఆ జనం ఎక్కడి జనం అక్కడా తమ జీవితానుభవాల్లోంచి సహజంగా, అవసరంగా వెలువరించే సృజన జానపద వాఙ్మయం. ఈ సందర్భంలో జానపదులు ఎవరంటే తమదే ప్రత్యేకం, నైసర్గికం, స్వంతమైన ఔద్వేగికానుభవంతో మగ్నమై ఉండగలుగుతున్నవాళ్ళు. నాగరికులు ఎవరంటే ఇలాంటి ఔద్వేగిక మగ్నతను ఎన్నో కారణాల వలన నిలబెట్టుకోలేక కోల్పోయిన మనుషులు; రసమగ్నతను ఇతరమైన ప్రయోజనాల కోసమని బేఖాతరు చేస్తూ తమవైన ఔద్వేగికానుభవాలను దాచి, సాహిత్యంలో ఉన్నది లేనట్టూ లేనిది ఉన్నట్టూ మసి పూసి, కృత్రిమత్వాన్ని పులిమేవాళ్ళు.

వలసపక్షినే కానీ… ఒక కథా ఖండం. పూర్తిగా కథ కాలేదు. మూడు పేరాల్లో నిర్మించిన ఈ ఖండిక కథకుడు తనకు తనే రాసుకుంటున్న ఉత్తరమో, డైరీయో అన్నట్టు మొదలై, రెండు పేరాలతో promisingగా మొదలయి, మూడావ పేరాలో డెవలప్‌మెంట్ గురించిన ఉపన్యాసం లోకి మారి, నాలుగవ పేరాలో అనవసరమైన వ్యాఖ్యతో ఆర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సగం కథ లోని ఆకర్షణ ఏమిటి?

ఈ చిన్ని సగం కథలోని మొదటి రెండూ పేరాల్లోనే కథకునిది, కథలోని పాత్రలు – మావయ్య, నానిగాడు ఈ ఇద్దరి పాత్రలు పరికల్పించే ఔద్వేగికావరణ స్వఛ్చంగా, స్ఫుటంగా, కాంతివంతంగా ఉంది. ఈ రెండు పేరాల్లోనూ అటు కథకుడు గాని, ఇటు ఆ రెండు పాత్రలు గాని అబద్ధాలాట్టం లేదు. అంటే – రస వ్యవస్థలోన అనౌచిత్యాలు లేవు. సముచితమైన నిర్మాణం ఉంది. ఈ దృశ్యం, వివరం అంతా మల్లికార్జున్ గారికి సుపరిచితమైనవి అని, ఆయన సృజనాంతరంగం ఆ ఆవరణతో మగ్నమై ఉందనీ తెలుస్తుంది. ఆ సమాచారం కథలోనే ఉంది. ఈ రెండు పేరాల మాత్రపు రస శిల్పాన్ని కథకుడు చెక్కిన పద్ధతి – అంటే రీతిని గురించి ముందుకి, Keith Oatley ప్రతిపాదన చర్చించిన తర్వాత వివరించటానికి వీలవుతుంది. ఇప్పటికి ప్రస్తుతం ఏమంటే ఈ రెండు పేరాల నిర్మాణం అంతరాంతరాల్లోంచి, అప్రయత్నంగా సునాయాసంగా వస్తున్నాయి. ఈ పాతిక, ముప్ఫై వాక్యాల్లో ఇమిడే చిత్రణలోనే వందలాదిగా రస నిర్ణయాలు (Aesthtic Decisions) ఒదిగి ఉంటాయి. వీటినే రస వ్యవస్థలోని ఔచిత్యాలు, అనౌచిత్యాలుగా అర్థం చేసుకోవచ్చును. ఉదాహరణకు మొదటి పేరాలోని దృశ్యం కల అని రెండవ పేరాలో చెప్పడం, మొదటి పేరాలో సున్నితంగా, సూచనలతో నిర్మించినది నాని – మావయ్య వాళ్ళిద్దరి అనుబంధం, ప్రవర్తన, వాటికోసం కథకుడు ఎంచుకున్న అనుభావ విభావాలు – పసివాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, నవ్వటం, గుండెల మీదికి ఎక్కి కూర్చుని, అంతలోనే అలిగి మళ్ళీ దూరంగా పోవడం – ఇవన్నీ హృద్యమైన వివరాలు. ఇవి ఒక్కొక్కటీ వీటినే స్వీకరించాలనీ, అవి ఒక్కొక్కటీ ఆ క్రమంలోనే పేరుస్తూ మనో దృశ్యాన్ని చెక్కివ్వాలనీ ఇలాంటి నిర్ణయాలు మల్లికార్జున్ గారికి ఎవరు చేసి ఇస్తునారు?

ఇందుకు ఎడంగా అనౌచిత్యాలైతే వందలాదిగా ఉంటాయి. ఎక్కడో ఏ ఒక్కటో తప్ప కథ, కవిత పరిపూర్ణంగా ఇంక ఎంచిపెట్టడానికి వీలు లేకుండా అలరించేవి చాల అరుదు కాబట్టి, ఔచిత్య విచార చర్చ అనేది వాస్తవానికి – అంటే in practice అనౌచిత్య విచార చర్చే అవుతుంది. గత్యంతరం లేక. బంగారం నగలు చేసే కొట్ల ముందు కుళ్ళు కాలవల్లోని బురదని రోజంతా ఓపిగ్గా జల్లిస్తే చివరికి ఒక నలుసో, పిసరో బంగారం దొరికితే దొరుకుతుంది కదా. ఔచిత్య విచార చర్చ అలాంటి జల్లింపు పని. ఈ చిన్ని కథ లోని రస స్ఫూర్తిని మూడవ పేరా నుండి స్వయంగా మల్లికార్జున్ గారే చెడగొట్టుకున్నారు. మొదటి రెండు పేరాల్నీ చెడగొట్టడానికి కొన్ని అనౌచిత్యాల్ని, అంటే అవకరం చేసే ఊహ, భావం, చిత్రణ, భాష, చిత్రణ, గొంతు వంటి వాటిని ఎవరికి వాళ్ళం ఊహించుకోవచ్చును. సృజన రస వ్యవస్థను చెడపడానికి వందలాది అనౌచిత్యాల్లోంచి ఏ ఒక్కటైనా చాలు. ఇలాంటి అనౌచిత్యాలకు ఉదాహరణలు ఈ కథలోంచే మూడవ పేరా నుండి వెతక్కుండానే దొరుకుతాయి.

కథకుని ప్రయత్నం మూడవ పేరాలో తలెత్తుతుంది. అది “…ప్రేమనిచ్చే అమ్మ, స్వఛ్చంగ నవ్వే నాని గాడు, తోడుండే దోస్తులు, బాగు జూస్కునే అన్న…” అని నాగరికమైన మర్యాద ఊహల్ని వాచ్యంగా, వరుస క్రమంలో కవాతు చేయిస్తూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టి, డెవలప్మెంట్ అంటే ఏమిటో అన్న ఉపన్యాసంగా పతనమౌతుంది. ఆ మూడావ పేరాలోన తను ఉద్దేశించిన రస వ్యవస్థ విరిగి పడిందని తనకే స్పృహ కలిగిందా అన్నట్టు నాలుగవ పేరా లోన తాజా కలం (P. S.) ఏమో మహబూబ్ నగర్ వలసల్ని గురించి, దేవుణ్ణి, పాలకుల్ని గురించీ, మళ్ళీ వలస గురించీ విమర్శగా దిగి, మూడవ పేరాలో ఇంకా ఏ కొంచమేనా మిగిలున్న తడిని, జీవాన్నీ పీక నొక్కి సఫా చేసి, ఈ ఖండికను అటు కథా కాకుండా ఇటు వ్యాసమూ కాకుండా విడిచిపెడుతుంది. ఇంత జరిగినా, మొదటి రెండు పేరాల్లోని రసావరణలోని బలం వలన, స్వచ్ఛత వలనా ఆ మొదటి పార్శ్వం మాత్రం చదువరి మనసులో నిలిచిపోతుంది.

ఏం? మూడు, నాలుగు పేరాలూ మాత్రం అనుచితమని ఎందుకు అనుకోవాలి? డెవలప్మెంట్ అన్నది ఎంత ముఖ్యమైన చర్చనీయాంశం? పాలమూరు కూలి జీవితాల్ని పట్టించుకోడం చారిత్రక బాధ్యత కదా? అవి కూడా కథ, కథకుడి అనుభవాలే కదా! అని ఇలా వాదించొచ్చును. ఆ అనుభవాలన్నీ నిజమే కావచ్చు గాని వాటిని ఈ కథలోకి బలవంతంగా ఇంజెక్ట్ చెయ్యడం వలన రస వ్యవస్థతో పాటు, పొంతన, విశ్వసనీయత, ప్రతిపాదన వంటి వ్యవస్థలు బాగా దెబ్బ తిన్నాయి. ఇలా పతనం కానివ్వకుండా, ఏ వ్యవస్థకూ భంగం కలుగకుండా నిర్వహించగలిగితే ఈ “sincere” కథ సంతృప్తికరంగా పూర్తయ్యి ఉండేది.

ఇదివరకు చెప్పిన ప్రవాస అనుభవం రస మగ్నతను కష్టతరం చేస్తుంది. ఉదాహరణ కోసం వలసపక్షినే కానీ.. కథనంలోని మొదటి రెండు పేరాలతోను చివరి రెండు పేరాలనూ తులనాత్మకంగా పరికిస్తే తెలుస్తుంది. మొదటిది జానపదుడు చెప్పుకుంటున్న కథ; రెండవది నాగరికుడు ప్రకటిస్తున్న మర్యాద. ప్రవాసం లేనివాళ్ళు ఎవరంటే ఎక్కడైతే పుట్టి పెరిగేరో ఆ ఊళ్ళోను, అంతే కాక అదే సాంస్కృతికావరణం లోనూ ఉండగలిగినవాళ్ళు. ఇలా ఎందుకౌతుందంటే మనిషి ఔద్వేగిక మూర్తిమత్వం, వ్యక్తిత్వమూ బాగా చిన్నప్పుడే విశేషంగా రూపుదిద్దుకుంటాయి. చిన్నప్పటి ఊరు, చుట్టూ సంఘం, సాంస్కృతికావరణం దీన్ని విశేషంగా ప్రభావితం చేస్తాయి. Global Village అని వ్యవహరిస్తున్న ఈ రోజుల్లోన ఇలాగ ఔద్వేగిక, సాంస్కృతిక వ్యక్తిత్వ మూలాల్ని నిలబెట్టుకోవడం దాదాపు ఏ ఒక్కరికీ సాధ్యమయ్యేది కాదు; దీనికి పట్నం పల్లె అని బేధం లేదు. అవే టీవీలూ, సినిమాలూ, ఇంటర్నెట్ గ్లోబల్ విలేజీ నిండా అన్ని చోట్లా ఉన్నాయి. ప్రవాసం వలన త్వరితంగా మారిపోతూ వస్తున్న ఔద్వేగిక వ్యవస్థతో ఎప్పటికప్పుడు సమాధాన పడుతూనే ఆ మారుతున్న వ్యవస్థలోనే మగ్నమయి ఉండడానికి వ్యక్తిత్వ బలం – అంటే inner resources మరింతగా అవసరం అవుతాయి. సృజన జూటాగా పతనం కానంత కాలం అది ఈ ఔద్వేగిక నిర్మాణానికి ఎంతో ఉపకరిస్తుంది. కాల్పనిక సృజన నిర్వర్తించే ధర్మాల్లోన ప్రధానమైనది ఈ పని – అంటే మనిషి తన పరిసరాలతో ఎప్పటికప్పుడు Emotional unityని, Integrationనూ సాధించుకోవడం. Keith Oatley పరిశోధనలు ముందుకి ప్రస్తావనకి వచ్చినప్పుడు దీన్ని గురించిన వివరం మరింత తెలుస్తుంది.

త్రిపుర sincere అని చెప్పినదీ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు “జూటా” అని చెప్పినదీ, హెమింగ్వే shit detection అని చెప్పినదీ ఇవన్నీ కూడా ఒకటి ‘ఇతి! ఇతి!’ అని via positiva గాను, మిగిలినవి ‘నేతి! నేతి!!’ అని via negativaగానూ రస మగ్నతనూ, రస హీనతల్నే ప్రస్తావిస్తున్నాయి. సృజన రస వ్యవస్థను, దానిలోని ఔచిత్యం, అనౌచిత్యాల స్వరూపాన్ని, స్వభావాన్నీ పరిశీలించటం, అవగతం చేసుకోవటం Writers Talkకు ప్రాణప్రదమైన పని. ఎవరైనా ఇద్దరు సృజనకారులు అంటే Literary Artists కలిసి కలబోసుకొనేది ఈ సంగతుల్నే. ఉదాహరణకు Iowa Writers Workshop వంటి చోట్ల పెద్ద పెద్ద చదువులు, పట్టాలు, పదవులూ ఉన్న శాస్త్ర పండితులు సైతం కవులు, కథకుల వ్యాసంగం, చర్చల మీద పెత్తనాన్ని ఆశించకుండా, వాళ్ళ సృజనను మన్నించి ఎడంగా ఉంటారు. మేలైన కవులు, కథకులకు పెద్దగా ఏ చదువులూ, పదవులూ లేనివాళ్ళనే అక్కడ కాల్పనిక సృజనకు మార్గదర్శకులుగా అక్కడ నియమిస్తారు. ఈ వివరం ఇంకా ఆసక్తి ఉంటే ఇలాంటి పుస్తకాల్లోన విస్తారంగా దొరుకుతుంది: “The Workshop“, “We Wanted to Be Writers“. కాని దురదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీదనే కాల్పనిక సృజనను గుర్తించి, బోధించి, చర్చించే వనరులు, ప్రతిపత్తి ఉన్న కళాశాలల్ని వేళ్ళమీద లెక్కించవచ్చును. ఇలాంటి సంస్థలు, వ్యవస్థల ప్రాథమికమైన బలం, ధ్యాసా రస చర్చ పట్ల వాళ్ళకున్న అవగాహన, నిష్ట.

మన పూర్వీకులు సృజనానుభవం, ఆధ్యాత్మికమైన అనుభవం ఈ రెండింటినీ చాల దగ్గరివిగా, సహోదరమైన అనుభవాలుగా అర్థం చేసుకొని, అలాగే ప్రతిపాదిస్తూ వచ్చేరు. బిరుదురాజు రామరాజు గారు కూడా జీవితాంతం తన ధ్యాసను, పరిశ్రమను యావత్తూ జానపదుల నైసర్గికమైన సృజనానుభవం, యోగుల అనుభవం ఈ రెండింటి మీద మాత్రమే లగ్నం చేసి వెళ్ళేరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ప్రతిభావంతుల వివేచన ఫలితమే రసం అనే ప్రతిపాదన. ఇదివరకు చెప్పినట్లు మన పూర్వీకులు యోగి అనుభవానికీ, కవి అనుభవానికీ మాటి మాటికీ లంకెలు వేస్తూ రావటం వలన రసానుభవం అంటే ఏదో నిగూఢం, మార్మికం, ఇంకా దైవికమైన వివేచనలాగనే తోస్తుంది. ఇది రస సిద్ధాంతాన్ని ఇప్పటి సృజనకు అన్వయించుకోవడంలోన ముఖ్యంగా ఆధునికులకు, అంటే secular భావాల మీద, సైన్స్ మీదా మక్కువ ఉండి, వాటి పరిధిలోనికి రాని అనుభవాల మీద అనాసక్తి, చిన్న చూపూ ఉన్నవాళ్ళకి పెద్ద ఇబ్బందే. అందుకని ముందుగా రస సిద్ధాంతాన్ని secular termsలోన, సైన్స్ చదువుకున్నవాళ్ళ దృష్టి – అంటే “శాస్త్రీయ దృక్పథం” అని వ్యవహరించే దృష్టితోను ఎలా పరిశీలించవచ్చునో చూడాలి.

రసం, రసానుభవం అంటే ఏదో నిగూఢమైన అనుభవం ఏమీ కాదు. అది సర్వ సాధారణంగా మనుషులందరికీ అనుభవంలో ఉందే ఔద్వేగిక అనుభవాన్నే సృజన అనుభవానికి అన్వయించి చెప్పేది. ఇంగ్లిష్‌లోన దాన్నే Aesthetic Emotion అన్నారు. భరతముని ప్రతిపాదించిన రస సిద్ధాంతానికి చాల సమీపమైన ఊహల్నే Keith Oatley 1990 ల నుండి Taxonomy of Aethetic Emotions అని ప్రకటించి, పరిశోధిస్తూ వస్తున్నారు. ఈ వివేచన కాల్పనిక సృజనలోన Aesthetic Emotion స్వరూపం ఏంటి, Aesthetic Emotions అంటే రసాలు ఎన్ని రకాలు, వాటి స్వరూపం, ఉదాహరణలూ ఇలాగ చర్చిస్తుంది. భరత ముని రస సిద్ధాంతం చేసిన పనీ ఇదే కదా?! ఏదైనా కొత్తది, అపరిచితమైన వ్యవస్థను అర్ధం చేసుకోడానికి మనుషులు అప్రయత్నంగా చేసే మొదటి ప్రయత్నాల్లోన ఒకటి వర్గీకరణ, అంటే Taxonomy. రకరకాల విజ్ఞాన శాస్త్రాల్లోన మొదటి పాఠాల్లో నేర్పేది ఇలాంటి వర్గీకరణే. సృజనకారులు అప్రయత్నంగా, నిరంతరమూ జీవితంలోనూ, పుస్తకాల్లోనూ వెతుక్కొనేది ప్రధమంగా రసానుభవాన్ని, రస పారీణతను – అంటే Experience of Aesthetic Emotion, Discrimination about Aestehtic Emotionను.

శాస్త్రం అంటే తెలుసుకున్నది (Known) అని. శాస్త్రీయ దృష్టి అంటే తెలిసింది, పరిచితమైనదీ అయిన అనుభవానికి సమ్మతం, అంగీకారయోగ్యమైన ప్రతిపాదనల్ని మాత్రమే స్వీకరించి, అందుకు భిన్నమైన ప్రతిపాదనల్ని తిరస్కరించడమే ప్రాతిపదికగా ఉండే దృష్టి. ఏ పనికి, వ్యాపకానికీ దేనికి ప్రత్యేకమైన అనుభవం దానికే ఉంటుంది. ఉదాహరణకు చెప్పులు కుట్టడానికి పనికొచ్చే శాస్త్రీయ దృక్పథం ఏమిటంటే చమారి అనుభవం, ఆ అనుభవాన్ని, పరిశీలననూ ప్రాతిపదికగా ఆయన చేసి, నిరూపించే ప్రతిపాదనలూను. విజ్ఞాన శాస్త్రాలు (Empirical Sciences)కి ఉన్న గొప్ప వెసులుబాటు ఏమిటంటే నిర్జీవమైన వస్తువుల్ని మచ్చు (Sample) చూస్తే అవన్నీ సుమారు ఒక్కలాంటి ధర్మాల్నే కలిగి ఉంటాయి. రాళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, చక్రాలన్నీ ఒక్కలాగే కదుల్తాయీ ఇలాగ. జీవశాస్త్రంలో ఇంతకంటె వైవిధ్యం ఉంటుంది కాని, ఒకే జాతికి చెందిన జీవులన్నీ సుమారు ఒక్కలాగే ప్రవర్తిస్తాయి. చమారి పనిలోనూ వెసులుబాటు ఏమిటంటే చెప్పుల్లో ఉంటే కొన్ని వందల రకాల చెప్పులుంటాయి; ఆ పని (Trade) నేర్చుకుంటే అందరు చమార్ల సిద్ధాంతం, శాస్త్రీయ దృక్పథమూ సుమారు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ప్రతీ వ్యాసంగానికీ తనదైన అనుభవమూ, దాని మీదనే ఆధారపడి ఒక శాస్త్రమూ, ఆ శాస్త్ర ప్రాతిపదికగా శాస్త్రీయ దృక్పథమూ ఉన్నాయి, ఏ వ్యాసంగంలోన దాంట్లో ఎంతో కొంత అంగీకారమైతే ఉంది.

కాని కాల్పనిక సృజన పరిస్థితి ఈ అంగీకారం విషయంలోన చాల గడ్డుగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్రజ్ఞులు అవే వస్తువుల్ని పరికిస్తున్నారు, చమార్లు అందరూ అవే చెప్పుల్ని కుడుతున్నారు, కాని కవులూ, కథకులూ ప్రతి ఒక్కరూ తమకే చాల ప్రత్యేకమైన అనుభవం నుండి మనో దృశ్య శిల్పాన్ని మాటల్లో చెక్కి ఇస్తున్నారు. బలమైన, నిజమైన కవులు, కథకులు అయితే ఏ ఇద్దరి మధ్యనూ వాళ్ళ దర్శనాల మధ్య, సృజన తత్వాల నడుమ సాంతం “అంగీకారం” ఉండే అవకాశం లేదు. అలా ఉండాలన్న ఆపేక్ష అశాస్త్రీయం, అసమంజసం అవుతుంది. తప్పనిసరిగా, స్వతఃకవులు, కథకులైన వాళ్ళు తమదే వ్యక్తిగతము, ప్రత్యేకమైన సృజన తత్వాన్ని ఇలా తమదైన ఔద్వేగిక అనుభవం ప్రాతిపదికగా నిర్మిచుకుంటున్నారు. చాల వ్యక్తిగతం, ఆంతరంగికము, ప్రత్యేకమైన ఈ రస తత్వానికి అనివార్యంగా మిగత దృక్పథాల నుండి ఎంతో కొంత ఎడం ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా తిమురెక్కి “కవయాః నిరంకుశః” అవుతున్నారు. కాని వాళ్ళందరి దృష్టికీ, వ్యాసంగానికీ సామాన్యంగా (Common) ఉండేది రస మగ్నత. ఈ ఒక్క అనుభవం, లక్ష్యం ప్రాతిపదికగా మాత్రం వాళ్ళు తమ దర్శనాల్ని తమవంటి ఇతరులతో కలబోసుకోగలుగుతారు. రస మగ్నత పట్ల అనురక్తి, ఖాతరు లేని రచనలు, రచయితల ప్రవృత్తి, వ్యాసంగం వేరు. దాన్ని సృజనశీలి “It isn’t Literature. It is something else.” అని తిరస్కరించి, ఎడంగా ఉంటున్నాడు.

బామహుడు, ఉద్భటుడు, రుద్రటుడు వరుసగా క్రీ. శ. ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అలంకారికులు. వీళ్ళ గ్రంధాలు కావ్యాలంకారం అని, అలంకార సంగ్రహమనీ ఇవి కావ్య శరీరానికి చేసే అలంకరణల్నే అలంకారములు (Poetic Embellishments) అని ప్రతిపాదించి, వర్ణిస్తాయి. వీళ్ళు ముగ్గురూ స్వతః అలంకార వాదులు, అంటే కావ్యంలోని Aesthetic Emotion (రసం) మీద కంటె Figures of Poetry (అలంకారం) మీదనే ఎక్కువ మక్కువ ఉన్నవాళ్ళు. కవుల్లో, పండితుల్లోన సంగీతజ్ఞులు, భాష మీద విశేషమైన మక్కువ ఉన్నవాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది, వాళ్ళు అలంకారం వైపు మొగ్గుతారు. మన ప్రాచీన కవుల్లోన రామరాజ భూషణుడు (భట్టుమూర్తి) ఇలాగ అలంకార ప్రియుడైన కవి. ఆయన స్వయంగా సంగీతవేత్త, లాక్షణికుడు. ఆయన రాసిన మొదటి గ్రంథమే కావ్యాలంకార సంగ్రహం. ఆయన పద్యాల్లో ప్రసిద్ధమైనవి అలంకార బలం వలనే రంజింపచేసేవి. “లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోః ప్రసంగ” మొదలైనవి. ఇప్పటి తెలుగు పాఠ్యపుస్తకాల్లోన నేర్పించే కావ్య లక్షణాలు – యతి, ప్రాస, అనుపాస, అలంకారాలు – ఇటువంటివి కూడా ముఖ్యంగా అలంకార ప్రధానమైన poetic devices. తెలుగులో పెద్ద చదువులు చదువుకునేవాళ్ళు అప్ప కవీయం, నరస భూపాలీయం, చంద్రాలోకం ఇలాంటి అలంకార గ్రంథాల నుండి ఉపమాలంకారం, రూపకాలంకారం ఇలాంటివి వందలాదిగా అలంకారాలను వర్ణిస్తారు. యతి, ప్రాస, చందస్సు వంటివి ఇంకొన్ని ఉదాహరణలు. శిల్పికి ఉలి, సుత్తి వంటి పనిముట్లు ఎలా పనికొస్తాయో సృజనశీలికి రస శిల్పాన్ని – అంటే ఔద్వేగికానుభవాన్ని శిల్పంగా చెక్కే పనిలో అలంకారాలు పనిముట్లుగా పనికొస్తాయి. పాత కాలపు సిద్ధాంతాలకు వలెనే పాత కాలపు అలంకారాల్ని కూడా యధాతథంగా ఇప్పటి సృజన కోసం వినియోగించలేము.

ఆనంద వర్ధనుడు, లోల్లటుడు వంటి వాళ్ళు, రసానుభవమంటే ఎక్కువ మక్కువ ఉన్నవాళ్ళు, తీవ్రమైన రసవాదులు. వాళ్ళు మితి మీరిన అలంకరణ రస వ్యవస్థను దెబ్బతీస్తుందన్న కారణం చేత అలాంటి రచనను చిత్ర కవిత్వమని నిరసించేరు. వాక్కు (Word), అర్థము (Import) ఇవి రెండూ వరుసగా అలంకారానికీ, రసానుభవానికీ చెందినవి. అంటే కేవలం మాటల్ని ప్రయోగించడంలోని లాఘవం వలన అందమైన అలంకరణను సాధించుకోవచ్చును. కాని అంతరార్థం ఆలంబనగా Suggestion of Aesthetic Emotionను అంటే రస స్ఫూర్తిని సాధించుకో లేకపోతే “అర్థం” బలహీనమైనట్టు. ఇలాగ రస మతానికీ, అలంకార మతానికీ మధ్య ఉండగల వైరుధ్యంతో కవులు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానపడుతూ వస్తున్నారు. ఉదాహరణకు కాళిదాసు ఈ పేచీతో ఎలా సమాధాన పడ్డారో “వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అనే శ్లోకం తెల్లం చేస్తుంది. వాక్కు, అర్థం – అంటే అలంకారము, రసానుభవం సృజనకు అమ్మా నాన్నా లాంటివి. అవి రెండూ వేటి పనులు అవీ విడదీయరానంతగా కలిసుండి నిర్వహించినప్పుడే సృజన రాణించేది అని ప్రార్ధనా పూర్వకమైన సూచన. ఈ భావాన్నే రస మతానికి చెందిన అలంకారికులు సమర్ధిస్తూ వచ్చేరు. అంటే అలంకరణలో అనౌచిత్యం లేనంతకాలం అది రస స్ఫూర్తికి సహకరిస్తుంది. రసం మీద ధ్యాస – అంటే రస మగ్నత లోపిస్తే అలంకారం ఒక్కటే తేలిపోయి అనుచితం అవుతుంది. అంటే ఔచిత్య విచార చర్చను ఆధారంగా రసానికీ అలంకారానికీ నడుమ బాంధవ్యాన్నీ, పొంతననూ నిర్ధారించుకొని, ఈ సందేహాన్ని పరిష్కరించుకోవచ్చును.

అలంకార ప్రధానమైన కవిత్వానికి రామరాజ భూషణుడివి పైన ఊదహరిచినవంటి పద్యాల్ని, కాల్పనిక వచనానికి చిన్నయ సూరి గారిది మిత్రబేధం నుండి “… అది పుండరీకముల ఖండించుచు నలుగుల నలుగులంపడఁ జేయుచుఁ గాసరముల మీసరము గాసించుచు ఋక్షముల శిక్షించుచుఁ దక్కిన మ్రుక్కడి మృగములను లెక్కింపక…” వంటి శబ్దాలంకార ప్రధానమైన వచనాన్నీ, రావిశాస్త్రి గారి వెన్నెల వంటి కథల్లో వర్ణనల్నీ, ఆయనవే అనేకమైన కథల్లోని ఉపమల్నీ, శ్రీ శ్రీ గారి కవిత్వం నుండి “కవీ! నీ గళ గళన్మంగళ కళా కాహళ హళాహళిలో” వంటి పాదాల్నీ ఉదాహరణలుగా చూడొచ్చును. ఇలాంటి సృజనల్లోనూ అందం ఉంది, రంజింపజేసే శక్తి ఉంది. కాని పరిశీలించి చూస్తే వీటీలోన “ఇదిగో ఇదీ ప్రధానమైన ఉద్వేగం!” అని స్పష్టంగా, ఇదివరకు అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం, పౌరుషం వంటి కథల్ని పరిశీలిస్తూ ఎత్తి చూపించినట్టుగా Emotionని ఎత్తి చూపించడానికి అవకాశం లేదు. ఉదాహరణకు “లలనా జనాపాంగ వలనా వసదనంగ…” అనే పాదాల్లోన సంతోషం అనో, ఆహ్లాదం అనో, ఇలాగ ఏ రకమైన ఉద్వేగపు చాయల్నీ బలంగా ప్రతిపాదించలేము. కాని పఠనానుభవంలో అది చాల సమ్మోహకంగా నడిచే పద్యం, చదువరిని విశేషంగ కదిలించేది అంటే immensely moving. అంటే పాఠ్యంలోని అంతరార్ధంలో బలమైన రస ప్రతిపాదన (Import) లేదు, కాని పఠనమేమో అలంకార బలం వల్లనే చాల ఉద్వేగభరితంగా ఫలించింది. ఇదెలాగ సాధ్యమయ్యింది? ఈ ప్రశ్నకు Oatley ఆయన అనుయాయుల వంటి వాళ్ళ ప్రతిపాదనల్లో సంతృప్తికరమైన జవాబు దొరుకుతుంది. కాని దురదృష్ట వశాత్తు అది చాల సుదీర్ఘమైన చర్చ. అది ఏ కొంతైనా వివరించితే తప్ప ఇక్కడ లేవనెత్తిన వివాదానికి సంతృప్తికరంగా సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఉదాహరణాకు “దాందేఁవుంది నాయనా! రసం అలంకారం రెండూ కావ్యానికి రెండు కళ్ళ వంటివి. రెండు కళ్ళూ ఉంటేనే కదా సరిగ్గా చూడగలం?!” అని ఇలాంటి మాటలు ఏ సహాయమూ కావు. ఎందుకంటే అవి ఉన్న ప్రశ్ననే అటు ఇటు తిప్పి మళ్ళీ ప్రకటిస్తున్నాయి తప్ప కొత్తగా విశదం చేసింది ఏమీ లేదు.

Oatley ప్రతిపాదనల్ని వివరంచే ముందు ఒక జాగర్తను చెప్పే తీరాలి. అలంకార మతం చాటున దాక్కునే వెసులుబాటు జూటా రచనలకు లేదు. పాఠ్యంలో రసోచితమైన అలంకారాలు కూడా కావ్యార్ధం లాగనే అంతిమంగా రస సిద్ధికే ఉపకరిస్తున్నాయి. ఎలాగంటే పైన చెప్పిన అందగత్తె ఒకవేళ బతికి గనక ఉన్నట్టయితే ఆవిడ దేహం మీది అలంకారాలు అన్నీ శోభిస్తాయి, రోత ఏమీ లేదు కదా – అలాగ. రసం సృజనకు ప్రాణ లక్షణం అన్నమాట. ఇంకోలా ఎలా చూడొచ్చునంటే అంతిమంగా రసం, అలంకారం అని విడి విడిగా ఏం లేదు; ఉన్నది రసానుభవం ఒక్కటే. Oatley, ఆయన అనుయాయులు ప్రతిపాదించిన సిద్ధాంతం (Taxonomy of Aesthetic Emotion) కాల్పనిక సృజనను చదవడం (Reading) లోని రసానుభవాన్ని అంటే (Experience of Aesthetic Emotion)ను అటు ఉద్వేగానికి అంటే జీవితానుభవాల్లోనివి సంతోషం, దుఃఖం వంటి ఎమోషన్స్ కూ, ఇటు పఠనానుభవానికే ప్రత్యేకమైనవి – కథనంలోని కౌశలం, మాటలు, శబ్దాలు, చందస్సు వంటి అలంకరణల ద్వారా ప్రేరేపితమయ్యే “పఠనోద్వేగాలూ” ఈ రెండింటినీ కలిపి పఠనం అనే అనుభవాన్ని విశదీకరించి ఈ వైరుధ్యాన్ని సమంజసంగా పరిష్కరిస్తుంది.

ఈ ప్రతిపాదనకు అవసరమైన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే – కథలు, కవితలు, నవలలు, నాటకాలూ వంటి సృజన మొత్తం పాఠ్యం అంతట్నీ జాగర్తగా పరిశీలిస్తే ప్రతి వాక్యమూ, ప్రతి సన్నివేశమూ ఉద్వేగ భరితంగానే ఉండవన్న సంగతి బోధపడుతుంది. అంటే రస స్ఫూర్తి అనేది కేవలం భరత ముని చెప్పిన జీవనోద్వేగాలు – సంతోషం, దుఃఖం, క్రోధం, ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా పాత్రల మాటలు, హావభావాల్లోన పలికించడం ద్వారానో, లేకుంటే రచయిత ఆ అనుభవాల్ని వర్ణించడం వల్లనో మాత్రమే ఉత్పన్నమౌతుందని అనుకోవడం పొరపాటు. రస స్ఫూర్తికి ఇవి – పాత్రల ఔద్వేగిక చిత్రణ, కథకుని సన్నివేశ చిత్రణా ఈ రెండూ ప్రధానమైన హేతువులే గాని, వీటి కంటే భిన్నమైన వ్యవస్థలని పాఠ్యంలో వాహికలుగా చేసుకొని కూడా రస స్ఫూర్తిని సాధించుకోవచ్చును. ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థలకు ఉదాహరణలు కొన్ని: నాద వ్యవస్థ (Musicality), నవ్యత (Novelty), ఉత్కంఠ (Suspense), అలవాటైన దృష్టిని భంగం చెయ్యటం (Dishabituation), ప్రతిపాదన (Essential message of the work). పాత్రల గొంతూ, నడవడి, కథకుని గొంతూ ఆలంబనలుగా పాఠ్యంలో ప్రత్యక్షం అయ్యే మానవోద్వేగాల జోలికే పోకుండా కేవలం ఈ వ్యవస్థల్నే అలంకార బలంతో సమున్నతంగా నిర్వహించి కవి సాధించే రంజకత్వం కూడా అంతిమంగా రసానుభవమే. ఈ తరహా రసానుభవం పాత్రలూ, సన్నివేశాల్లో ద్యోతకం కానక్కర్లేకుండానే తిన్నగా పాఠకుడికి పాఠ్యం (Text)లోని అలంకరణల సొబగుల వలన ద్యోతకమయ్యే పఠనోద్వేగం అన్నమాట. కాని చివరికి, అంటే అంతిమంగా అది కూడా ఒక aesthetic emotion లోనే సఫలమయ్యింది కాబట్టి అలంకారాలు అంతిమంగా సాధించేదీ రస స్ఫూర్తినే! రామరాజ భూషణుడి కవిత్వాన్నీ, చిన్నయ సూరి, రావి శాస్త్రి, శ్రీ శ్రీ “స్విన్‌బర్న్ కవికి” కవిత వంటివాటిలోని రమ్యతను ఇలా అర్థం చేసుకోవచ్చును. సంగ్రహమైన ఈ ప్రతిపాదనను, మొత్తంగా రస సిద్ధాంతాన్నీ ఇప్పటి కాలపు శాస్త్రీయ దృష్టితోన అర్ధం చేసుకోడానికి Oatley పరిశోధన పనికొస్తుంది.

ఇందుకోసమని Oatley వాళ్ళూ ముందుగా జీవితానుభవం లోని నిజం ఉద్వేగాన్ని (Emotion) గురించి పరిశోధించి, ఆ పైన పఠనానుభవం లోని రసానుభావం (Aesthetic Emotion)ని గురించి పరిశోధిస్తున్నారు. Keith Oatley మనస్తత్వ శాస్త్రంలో, Cognitive Scienceలో పరిశోధకుడు మత్రమే కాకుండా స్వయంగా నవలా రచయిత. ఆయన నవల The Case of Emily V అని 1994 Commonwealth Prize for First Novel ని గెలుచుకుంది. ఆయన తన పరిశీలనల నుండీ, ఇతరుల పరిశీలనల నుండీ క్రోడీకరించి ఉద్వేగాల్ని గురించి చెప్పినది – మనిషిని మిగతా జంతు ప్రపంచం నుండి ప్రత్యేకం చేసే గుణాల్లో ముఖ్యమైనది ఉద్వేగం (Emotion). మనిషి సంఘజీవి కాబట్టి విశేషమైన విజయాల్ని సాధించగలిగేడు. ఈ సాంఘిక విజయానికి, సాంఘిక జీవనానికీ పునాది ఎమోషన్ – “Emotional development is social development.” ఒకసారి మన దైనందిన జీవితాన్నీ, చుట్టూ ప్రపంచాన్నీ పరిశీలిస్తే మనుగడ కోసం మనం ఎంతగా ఒకరొకరి మీద ఆధారపడి ఉన్నామో తెలుస్తుంది. సాంఘిక నిర్మాణం ఏ ఒక్కరి వలనో, కొందరి వలనో సాధ్యమయ్యేది కాదు. ఈ వ్యవస్థను, నెట్‌వర్క్నూ నిర్మించి పోషించేది Emotion. మనిషి జీవితంలో ఉద్వేగపు పాత్ర ఏమిటంటే అది అంతరంగ ప్రపంచానికీ బహిరంగ ప్రపంచానికీ నడుమ వంతెనలాగ పనిచేస్తుంది. బయటి ప్రపంచంలో మనకి లక్ష్యాలు (Goals), చింతలు (Concerns) ఉంటాయి – బతకాలి, కుటుంబం కావాలి, సంపాదించాలి – ఇలాగ. ఒకసారి ఇవి స్థిరపడ్డాక మనిషి అంతరంగాన్ని, అతని ప్రవర్తననూ ఆ లక్ష్యాల్ని సాధించుకోడంలోనూ, చింతల్ని తీర్చుకోడంలోనూ సఫలమయ్యేలా ప్రేరేపించడం ఉద్వేగాలకున్న ముఖ్యమైన పని. సంఘం మన మనుగడకు అవసరం కాబట్టి, సాంఘిక జీవనం కూడా మన లక్ష్యాల్లో ఒకటి – నలుగురితో కలిసుండాలి, పన్లు పూర్తి చేసుకోవాలి ఇలాగ. ఈ సాంఘిక జీవితానికీ, మనదే అయిన వ్యక్తిగత జీవితానికీని ఉద్వేగం ఇలా ప్రేరకంగా సహకరిస్తుంది. ఇంకా వీళ్ళు ఏమని తీర్మానించేరంటే మనకి ఆకలిదప్పులు, నిద్ర, సెక్స్ ఇలాంటి జాంతవమైన అవసరాలున్నది నిజమే గాని, మన ప్రవర్తనను నియంత్రించేది ఈ Drives కావు, మన ప్రవర్తనను నియంత్రించేది ఉద్వేగాలు. ఈ ఉద్వేగాలని మనం ప్రకటించేదీ, ఇతరుల్లో గమనించేదీ ముఖ్యంగా ముఖం (Face) ద్వారా. ఆలోచిస్తే ఇది మన అనుభవంలోని నిజమే.

పాశ్చాత్య సంస్కృతిలోన ఉద్వేగాల్ని వర్గీకరించడానికి 1872 లోన మొదటిసారిగా ప్రయత్నించినవాడు డార్విన్. ఆయన తరవాత ఆధునిక మనస్తత్వ శాస్త్రం లోన Emotionను గురించిన అవగాహనకు ప్రమాణంగా N. H. Frijda 1988 లో ప్రచురించిన పరిశోధనని వాడుకుంటారు. నెలల పిల్లల నుండే మనుషులు సంతోషం, దుఃఖం, కోపం, భయం, అసహ్యం – ఈ ఐదు రకాల ఉద్వేగాల్నీ గుర్తించగలుగుతాము, ముఖంలోను, శరీరంలో హావభావాలుగానూ ఈ ఐదు ఉద్వేగాల్నీ ప్రదర్శించగలుగుతాము. ఇలా మొదలయిన ఉద్వేగాన్ని గురించిన సిద్ధాంతం Theory of Emotions, కాని రస సిద్ధాంతం కాదు – ఎందుకంటే జీవితానుభవంలోని ఉద్వేగాలూ, రసోద్వేగాలూ రెండూ ఒకటే కావు. ఉద్వేగం (Emotion)ను సశాస్త్రీయంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నాలు కేవలం ముప్ఫయ్యేళ్ళ క్రితం నుండే మళ్ళీ బలంగా జరుగుతున్నాయి. మనిషిని ఇతర జంతువుల్నుండీ, కంప్యుటర్ నుండీ ప్రత్యేకంగా నిలబెటేది ఉద్వేగం కాబట్టి, కంప్యూటర్‌కి ఉద్వేగానుభవం నేర్పించగలిగితే అప్పుడు మర మనుషులు (Robot) కూడా మనుషుల్లాగే ప్రవర్తించగలుగుతాయి. దీనివలన కొత్త కొత్త ఉపయోగాలున్నాయి. అందుకని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ విషయం అంటే ఆసక్తి ఎక్కువయ్యింది. Oatley, ఆయన అనుయాయులూ జీవితానుభవం లోని ఉద్వేగాల్నీ, రసోద్వేగాల్నీ రెండింటి గురించీ విడి విడిగా పరిశోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. జీవితానుభవంలోని ఎమోషన్స్ గురించి ఆయన ప్రతిపాదన ఏమిటంటే ఉద్వేగాలు (Emotions) మన లక్ష్యాలు, ఆకాంక్షల్ని గురించి మనం మనకూ, ఇతరులకూ ఇచ్చుకునే సంకేతాలు (signals). ఎదుటి మనుషులూ, పరిస్థితులూ మన లక్ష్యాలు, ఆకాంక్ష (Goals and Concerns)కి అనుకూలంగా ఉంటే ఉత్పన్నమయ్యే సంకేతమే సంతోషం (Happiness). లక్ష్యాలకు ఎదటివాళ్ళు, పరిస్థితులూ అడ్డం పడితే ఉత్పన్నమయ్యే సంకేతమే క్రోధం (Anger). లక్ష్యాలకు ఆటంకం వచ్చి, లక్ష్యాల్నే మార్చుకోవలసినట్టు పరిస్థితులు మారిపోతే అప్పుడు ప్రకటితమయ్యేది విచారం (Sadness). లక్ష్యాలకు ప్రత్యక్షంగా ప్రమాదం (Threat) ఎదురైతే ఉత్పన్నమయ్యే సంకేతమే భయం (Fear) ఇలాగ. సంతోషం, దుఃఖం, కోపం, భయం – ఈ నాలుగూ ప్రాధమికమైన ఉద్వేగాలు; ఇవి ఎదుట లక్ష్యపెట్టడానికి ఏ మనిషీ, వస్తువూ (Subject) లేకుండానే ఉత్పన్నమయ్యేవి. ఇవి కాక ప్రేమ, మోహం, అసహ్యం వంటివి ఎదుట ఇంకొక జంతువో, మనిషో subjectగా ఆలంబన చేసుకొని ప్రకటితమయ్యేవి. జీవితానుభవంలోని ఎమోషన్స్ని గురించి ఇలాంటి పరిశోధన, చర్చా ఇప్పుడు విస్తారంగా నడుస్తున్నాది. స్థూల దృష్టికి ఉద్వేగం అంటే ఆవేశం అనీ, అది ఆలోచనకు, తార్కిక దృష్టికీ భిన్నం అనీ, వ్యతిరిక్తమనీ ఇలాంటి అవగాహన ఉంది. ఇది సరి కాదు. ఉద్వేగం కూడ ఒక ప్రత్యేకమైన వివేచన. అదీ ఆలోచన వంటిదే గాని, చాల త్వరితంగా (Extremely fast) మస్తిష్కంలోనే జరిగే ప్రక్రియ. అంటే – Emotion has its own logic. సృజనశీలి అప్రయత్నంగా, సహజంగా ఈ అనుభవాన్ని గురించిన సూక్ష్మమైన, సున్నితమైన దృష్టితో పరిశీలించగలుగుతున్నాడు. ఈ శక్తే ఆయనను మేధావి నుండి, లౌక్యుడి నుండీ ఎడంగా నిలబెడుతున్నాది.

ఇది జీవితంలో ఉద్వేగాల్ని గురించిన సంగతి. మరి రసోద్వేగాలు (Aesthetic Emotions) ఎందుకు? కథలు, కవిత్వం, సినిమాలు, నాటకాలు, పాటలూ వీటిని మనుషులు వెదుక్కొనివెళ్ళి మరీ అనుభవించి, ఆనందిస్తారు కదా. ఈ సృజనంతా ఎందుకు? అంటే – కళలు, వాటి అనుభవమూ ఎందుకు? Oatley వాళ్ళూ ప్రతిపాదించేది ఏమిటంటే ఉద్వేగం జీవితానుభవానికి చాల మౌలికమైనది కాబట్టి, కళల్లోని రసానుభవం – అంటే Experience of Aesthetic Emotion ద్వారా మనం ఇతరులవి, మనవీ ఔద్వేగిక ప్రపంచాలతో మరింత అవగాహననూ, ఐక్యతనూ సాధించుకోవడం కోసమని Fictionను వెదుక్కొంటున్నాము. ఇది కాక, నిజం జీవితంలోలాగ రిస్క్ తీసుకోకుండానే రక రకాల ఔద్వేగిక అనుభవాల్నీ, వాటిలోని కష్ట నష్టాల్నీ కాల్పనిక సృజనలో simulate చెసుకుని, ఆ అనుభవాన్ని సుళువుగా అనుభవించగలుగుతున్నాము. ఈ అంశాన్నే ప్రతిపాదిస్తూ Emily Dickisnon కవిత ఒకటుంది – పుస్తకం ఎక్కి చల్ చల్.

పనికొచ్చే పుస్తకాలు:
  • Mohit Kumar Ray (2008) A Comparative Study of the Indian Poetics and the Western Poetics
  • Oatley (1995) “A taxonomy of the emotions of literary response and a theory of identification in fictional narrative,” Poetics. Elsevier.
  • Understanding Emotions (2nd ed.) Oatley, Keith; Keltner, Dacher; Jenkins, Jennifer M.
  • Malden: Blackwell Publishing. (2006).

(ఇంకా ఉంది)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, జనవరి, వ్యాసం and tagged , , , , , , , , , , , , , , , , .

One Comment

  1. రస స్వరూపం గురించి చక్కటి వివేచన చేశారు. నేటి తెలుగు సాహిత్య విమర్శ గతి తార్కిక భౌతిక వాద (dialectical materialism) మార్క్సిస్ట్ సిద్ధాంత దృక్పథంతో సామాజిక స్పృహ అనే ప్రాతిపదికన జరుగుతూండటం వలన ప్రాచీన సంస్కృత కవులు ప్రతిపాదించిన రస సిద్ధాంతాల పట్ల ఒక అవహేళనా భావం విమర్శకులలో బలంగా పాతుకుపోయింది. అటువంటివారికి మీ వ్యాసం ఒక ఆలోచనామృతం. పాశ్చాత్య సాహిత్యకారులు సద్యః పర నివృత్తి అనగా ఆనంద ఉపదేశాలను రెండింటిని కావ్య ప్రయోజనాలుగ విచారించారు. అవి బుద్ధి భావన సాధనాలుగ ఆనంద సత్యాల ఐక్యాన్ని సంఘటించేందుకు అన్నాడు ఆంగ్ల కవి షెల్లీ. జాన్ డ్రైడెన్ “ఏకైక ప్రయోజనం కాకున్నా కావ్యానికి ముఖ్య ప్రయోజనం సద్యః పర నివృత్తి అనగా రసానందానుభూతి; ఉపదేశాన్ని అనుషంగికంగా మాత్రమే అంగీకరించవచ్చు,” అన్నాడు. మనుచరిత్రకారుడు, అల్లసాని పెద్దన కవిత్వం ఉదాత్త సంవిధానమై, పఠితలు లేక శ్రోతలు హృదయ నైవేద్యం అనగా రసానుభూతి కావాలి అన్నాడు. ‘కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే — సద్యః పర నివృత్తయే కాంతోపదేశయుజే,’ అని మమ్మటుడు తన ‘కావ్య ప్రకాశం’లో కావ్య ప్రయోజనాలను వివరించాడు. కావ్యం యశస్సు కొరకు, ధన సంపాదన కొరకు, వ్యవహార జ్ఞానము కొరకు, అమంగళ పరిహరణ కొరకు, మోక్ష సాధన కొరకు, కాంతా సమ్మితమైన ప్రబోధం కొరకు అని కావ్య ప్రయోజనాలను ఏకరువు పెట్టడంలో ఔచిత్య పోషణ సూచన ధ్వని రూపంలో ఉంది.ఇక్కడ వ్యష్టి సమిష్టులకు, ఇహ పర ప్రస్తావనలు జోడించి కాంతా సమ్మితంగా అంటే ఉపదేశాన్ని రమణీయంగా చేయాలనే సూచన కూడా చేశాడు మమ్మ్తుటుడు. శిల్పికి శిలపై సాధికారత అర్హత. అతని ఉలి వ్రేటుకు (దెబ్బకు) శిల వశం కావలిసినదే. అనగా మనసులో మెదిలిన రూపం శిలపై మలచ గల నైపుణ్యం గలవాడే మహాశిల్పి. శిల్పికి శిల ఉపకరణ మయినట్లే, కవికి శబ్దం ఉపకరణం. రసాలంకారాలు కావ్యశిల్పి కున్న విభూతులు. ప్రకృతిలోని ప్రత్యణువులో పరమాద్భుత శోభాన్విత సౌందర్యం నిర్లిప్త స్థాయిలో నిద్రిస్తుంటుంది. నిద్రిత సౌందర్యాన్ని(sleeping beauty) ఉలిన్మిషిత మొనరిస్తే, నిగూఢ సుందరతకు అక్షర రమ్యత చేకూరుస్తుంది కవి శబ్దం కావ్య రూపంలో. కవి శిల్ప కళామందిరానికి సౌందర్యం మూల స్తంభం. సౌందర్యాన్వేషణలో కావ్యసౌధం స్వప్న మధుర పరిరంభము. ఆ సుఖాన్ని కలుగజేసేది రసానుభూతి.
    ——–మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.