palaparthi cover

పాలు తాగితే చావు లేదు

పాపకి పొద్దున్నే గ్లాసుతో పాలు ఇస్తుంది అమ్మ.
పాప
తొందరగా తాగదవి.
అటు వెళ్ళి
కాసేపు బొమ్మలతో ఆడుకుని వస్తుంది.
ఇటు వచ్చి
అమ్మ దగ్గర ఊరికే నిలబడి
ఏం చేస్తోందా అని చూస్తూ ఉంటుంది
గానీ
పాలే తాగదు.

పాలు తాగావా?

అని అమ్మ హెచ్చరించినప్పుడల్లా
ఒక గుటక తాగి
మళ్ళీ మామూలే.
ఇల్లంతా తిరుగూ ఉంటుంది.
ఇవాళ పాపకి పాల గురించి
గట్టిగా పాఠం చెప్పాలనుకుంది
అమ్మ .

పాపా!

పిలిచింది అమ్మ.
నా బేబీ బొమ్మకి దుప్పతి కప్పుతున్నా!
అరిచి చెప్పింది పాప.

తర్వాత కప్పుదువులే

ఇట్రా ఓసారి!

గట్టిగా కేకేసింది అమ్మ.
పరిగెత్తుకుంటూ వచ్చింది పాప.
చూడూ నాన్నా!
పాలు తాగితే
చాలా బలమొస్తుంది తెలుసా?
మొదలు పెట్టింది అమ్మ.
చాలా చాలా  బలమొస్తుందా?
అడిగింది పాప.
అవును రా!
చాలా బలమొస్తుంది.
చాలా పొడుగు అవుతావు.
అన్నది అమ్మ.

నీ అంత బొడుగా?

అడిగింది పాప
చెయ్యి బారుగా పైకెత్తి చూపిస్తూ.
ఓ! నాకన్నా పొడుగు!
బలమొస్తే
చాలా ధైర్యమొస్తుంది.
అప్పుడు అన్ని పనులూ
గబగబా చేసెయ్యొచ్చు.
కాబట్టి రోజూ పాలు తాగాలి.
తెలిసిందా తల్లీ?
బోధించింది అమ్మ.
చాలా చాలా ఫాస్టుగా చేసెయ్యొచ్చా?
సూపర్ మాన్ లాగానా?
ఉత్సాహంగా అడిగింది పాప.
అవును!

సూపర్ మాన్ పాప!

నవ్వింది అమ్మ.
పాప గబగబా
టేబిల్ దగ్గరకు వెళ్ళి
ఎత్తిన గ్లాసు
దించకుండా
గట గటా
పాలన్నీ
తాగేసింది.
తాగేసిన
ఖాళీ గ్లాసు
అమ్మ చేతికిస్తూ
ఏదో ఆలోచన వచ్చినట్టు
రోజూ పాలు తాగితే

అస్సలు చచ్చిపోం!

కదమ్మా?
అంది.

*

Download PDF EPUB MOBI

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, జనవరి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.