cover

ఆవిష్కరణ

(గత ఏడాది కినిగె.కాం నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో ద్వితీయ బహుమతికి ఎంపికైన కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించిన సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం.)

Download PDF EPUB MOBI

అతడి చేతులు ఎందుకో వణకుతున్నాయి. కానీ ఆ వణకు భయంవల్లో, కంగారువల్లో వచ్చిందికాదు. మరికొన్ని నిముషాలలో అతను ప్రపంచచరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించబోతున్నాడు. శాస్త్రసాంకేతికరంగాలలో ఒక విప్లవం సృష్టించబోతున్నాడు. భౌతిక శాస్త్ర రంగంలో అతని ఆవిష్కరణ అటువంటిది మరి. అది లండన్ లో జరుగుతున్న ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తల సమావేశం. అందరూ తలలు నెరసిన మహానుభావులు. సాంకేతికరంగంలో అపర ప్రవీణులు. విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు, రెండుసార్లు నోబుల్ బహుమతి పొందిన ఘనుడు, సర్ విలియమ్స్ కూడా ఆ వేదికమీద ఉన్నారు. సామాన్యులెవరూ దానిలోనికి అడుగుపెట్టలేరు.

అటువంటిది తిలక్ కేవలం ఇరవైఆరు సంవత్సరాల వయస్సులోనే, పిహెచ్. డి., కూడా పూర్తికాకుండానే ఆ సమావేశానికి అర్హత సాధించాడు. అతడు తన పరిశోధనను ముందు లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపాడు. తర్వాత వారే స్వయంగా ఆ సమావేశానికి అతన్ని ఆహ్వానించారు. ప్రతీ సంవత్సరం జరిగే ఈ సమావేశానికి హాజరవుతున్న తొలి తెలుగువాడు తిలక్. బహుశా భారతదేశంలోనే మొదటివాడు కావచ్చు. కానీ ఇవేవి తిలక్ పట్టించుకోవడంలేదు. తిలక్ విలియమ్స్ వైపు తదేకంగా చూస్తున్నాడు. ఈ ఆవిష్కరణ తర్వాత తనకు ఆయనంత పేరు రావడం ఖాయమని అతనికి తెలుసు. తన ఆవిష్కరణను ప్రపంచం ముందుంచే క్షణంకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడతను.

ఇంతలో ఆ సమావేశ వ్యాఖ్యాత “ఇప్పుడు ఈ సమావేశానికి హాజరయిన వారిలో అతి చిన్నవాడైన బాల గంగాధర్ తిలక్ తన ఆవిష్కరణను మన ముందు ఉంచబోతున్నారు” అని ప్రకటించాడు. ఈ క్షణంకోసమే ఎదురుచూస్తున్న తిలక్ మెల్లిగా స్టేజివైపు అడుగులు వేస్తున్నాడు. తను మాట్లాడే ఈ పదినిముషాలు తన జీవితంలో ఎంత ముఖ్యమైనవో తనకి తెలుసు. అందుకే ఏం మాట్లాడనుకుంటున్నాడో ముందునుండీ సిద్ధంగా ఉన్నాడు.

తిలక్ వేదికపైకి ఎక్కగానే విలియమ్స్ పాదాలకు సమస్కరించాడు. అక్కడున్న వారందరూ దాన్ని వింతగా చూడగా భారతీయసాంప్రదాయాలపై గౌరవమున్న విలియమ్స్ చిరునవ్వుతో ఆశీర్వదించాడు. తర్వాత తిలక్ చేసిన ప్రసంగమిలా సాగింది. “నేను భౌతిక శాస్త్రంలో ‘కాంతి’ అన్న అంశంలో పరిశోధక విద్యార్థిని. ఇప్పుడు నేను సమర్పిస్తున్న పరిశోధనా పత్రంకూడా దానికి సంబంధి౦చిందే. మనకు పురాణాల్లోనూ, ఫాంటసీ కథల్లోను కనిపించే అంశం అదృశ్యతాశక్తి అంటే ఇన్విసిబిలిటి. రామాయణంలో రావణాసురునికి, ఇటీవల ఆంగ్లనవల హారీపోటర్ లో కొన్ని పాత్రలకు ఈ అదృశ్యతాశక్తి మనం గమనించవచ్చు. దాన్ని చూసిన ప్రతీసారి మనం ఆ శక్తి నిజజీవితంలో అసాధ్యం అనుకుంటాం. కానీ సాంకేతికానికి సాధ్యంకానికి ఏదీ లేదని నేను మరోసారి నిరూపించబోతున్నాను”.

తిలక్ తన సంచిలోంచి ఒక వస్త్రాన్ని తీసి అక్కడున్న వారందరికీ చుపాడు. ఒక నిర్వాహకుడిని వేదికపైకి పిలిచి ఆ వస్త్రంతో అతనిని పూర్తిగా కప్పాడు. అక్కడివరకూ బాగానే ఉంది. తర్వాత తిలక్ ఒక రిమోట్ తీసుకున్నాడు. సర్ విలియమ్స్ తో సహా అక్కడున్న వారందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. తిలక్ ఆ రిమోట్ పై ఒక బటన్ నొక్కగానే ఆ వ్యక్తి కనిపించడం మానేశాడు. మళ్ళీ తిలక్ బటన్ నొక్కేంతవరకూ ఆ వ్యక్తి అదృశ్యంగానే ఉన్నాడు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తర్వార ఎవరో ముందు చప్పట్లు కొట్టారు అంతే మరో పదిహేను నిముషాలవరకు ఆ ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరి కళ్ళల్లోనూ అభినందనతో కూడిన ఆశ్చర్యం కనిపిస్తుంది ఒక్క విలియమ్స్ ముఖంలో తప్ప.

Aavishkaranaతర్వాత తిలక్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “మానవుని కంటి నిర్మాణం ప్రకారం మనం నాలుగు వందల నుండి ఏడువందల నానో మీటర్ల మధ్య పౌనఃపున్యం గల కాంతిని మాత్రమే చూడగలం. అంటే ఏ వస్తువులు అయితే ఈ పౌనఃపున్య పరిధిలో కాంతిని ప్రసరిస్తాయో ఆ వస్తువులను మాత్రమే మన కళ్ళు చూడగలవు. మిగిలిన ఏ పౌనఃపున్యాన్ని అవి గుర్తించలేవు. మనందరికీ తెలిసిన ఉదాహరణ “ఎక్స్ రే”. సాధారణ కాంతితో ఫోటో తీసే మన చర్మంతో సహా కనిపిస్తుంది. అదే నాలుగు వందల నానో మీటర్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ఎక్స్ రేతో ఫోటో తీస్తే మన ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. అంతకంటే తక్కువ పౌనఃపున్యం వాడితే ఆ ఎముకలు కూడా కనిపించవు. నేను వాడిన వస్త్రం యొక్క ప్రత్యేకత అదే. ఈ వస్త్రం, బటన్ ఆన్ చేయగానే వస్తువు ప్రసరించే కాంతి పౌనఃపున్యాన్ని తగ్గించేస్తుంది. తద్వారా ఆ వస్తువు కనిపించదు. అక్కడున్న వారందరూ శాస్త్రజ్ఞులు. ఆ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఇంత చిన్న ఆలోచన మాకెందుకు రాలేదని కొందరు, ఎవరో ఒకరు ప్రయాణించేవరకు ఏ మార్గమయినా కష్టమని మరికొందరనుకున్నారు.

ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత తిలక్ తన గదికి బయల్దేరబోతున్నాడు. మదినిండా ఎంతో కుతూహలంతో, ఆతృతతో వచ్చిన అతను గుండెనిండా ఎన్నో ఆనందాలూ, ప్రశంసలను తీసుకెళ్తున్నాడు. కానీ ఒక్కటే వెలితి. విలియమ్స్ ఇంకా ఏం స్పందించలేదు. ఇంతలో తన ఫోనుకి ఒక సందేశం వచ్చింది. “ఒకసారి నా ఛాంబర్ కి రా – విలియమ్స్”. వెంటనే ఆనందంతో అటువైపు పరుగులు తీసాడు.

తలుపు తెరవగానే తన కుర్చీలో విలియమ్స్. దాదాపు తొంభై ఏళ్ళుంటాయి. ఐన్ స్టీన్ తర్వాత అంతటిస్థాయి శాస్త్రజ్ఞుడు. గొప్ప వ్యక్తి. తనను ఇప్పుడు ప్రశంసిస్తాడని భావించాడు, తిలక్. విలియమ్స్ చాలా గంభీరంగా ఉన్నాడు. తనముందుకు వచ్చిన తిలక్ కి ఒక తాళాల గుత్తి ఇచ్చి ఎదురుగా ఉన్న బీరువాలో చివరి అరలో ఉన్న ఫైల్స్ ను తీసుకురమ్మని చెప్పాడు. అవన్నీ ఆయన పరిశోధనలు . తిలక్ తెచ్చి ఆయన చేతిలో పెట్టాడు. కాసేపు ఆ ఫైల్ వెతికిన విలియమ్స్ ఆ ఫైల్ లో కొన్ని కాగితాలను అతనికి ఇచ్చాడు. ఆ కాగితాలు చూసిన తిలక్ నిర్ఘాంతపోయాడు. అవి విలియమ్స్ విద్యార్థిగా ఉన్నప్పడు రాసినవి. అంటే దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం నాటివి. అందులో తిలక్ ఇప్పటివరకు చూపిన అదృశ్యతాశక్తి సాధనామార్గం గురించి ఇంకా వివరంగా ఉంది.

అప్పుడు విలియమ్స్ “నిన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్లుంది. కానీ నీ పరిశోధన గురించి తెలుసుకున్నాక నువ్వు నా అంత శాస్త్రజ్ఞుడివి అవుతావని ఖాయం అయింది. నీ ఆవిష్కరణం అమోఘం. కానీ నేను దీన్ని డెబ్భైఏళ్ళ క్రితమే సాధించాను. అయితే అదేసమయంలో హీరోషిమా, నాగసాకీలపై అణుబాంబుదాడులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తికోసం తయారు చేసిన అణుసిద్ధాంతం ప్రజలను చంపడానికి వాడారు. సాంకేతిక రంగాన్ని ప్రజాజీవనంలో శాంతికి వాడాలి. ఆత్మరక్షణకోసం కనిపెట్టిన తుపాకులు, అంతరిక్ష పరిశోధనకోసం తయారుచేసిన శతఘ్నులు అన్నీ విధ్వంసానికే వాడడం అవివేకం. అటువంటి వారికి ఈ అదృశ్యతాశక్తి ఎలా ఉపయోగపడుతుందో ఊహించుకో… విద్యను సక్రంగా వాడుకో. మానవజీవితం విలువైందని తెలుసుకో. మానవత్వం లేని సాంకేతికాభివృద్ది కంటే సాంకేతికం లేని మానవత్వమే మంచిది” అన్నాడు. ఒక్కసారి కళ్ళుమూసుకున్న తిలక్ కు అదృశ్యతాశక్తి మానవులకి పరిచయం అయితే జరిగే విధ్వంసాలన్ని కనిపించాయి. సరిహద్దులలో ధైర్యంగా పోరాడే సైనికులస్థానంలో మంత్ర ముసుగులలో దాక్కొని దొంగదెబ్బ తీసే గుంటనక్కలు కనిపించాయి. నగరాలకు నగరాలనే విధ్వంసంచేసే ఉగ్రవాదులు కనిపించారు. బ్యాంకులను దారుణంగా దోపిడీలుచేసే దొంగలు కనిపించారు. తన ఆవిష్కరణ మానవాళికి చేసే మంచి కంటే చెడే ఎక్కువ. మారు మాట్లాడకుండా తన పత్రాలు, విలియమ్స్ ఫైల్స్ అన్నీ కలపి అదే బీరువాలో ఉంచి తాళం వేసి విలియమ్స్ కి ఇచ్చాడు.

“అదృశ్యతాశక్తిపై యువ శాస్త్రవేత్త తిలక్ చేసిన ప్రయోగం విఫలం. అయినప్పటికినీ సముద్రపునీటి నుంచి మంచినీటిని చౌకగా తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించడం కోసం సర్ విలియమ్స్ చేస్తున్న పరిశోధనలో తిలక్ కి భాగస్వామ్యం కల్పించారు”. తర్వాత రోజు వార్తా పత్రికలలో ఈ వార్త కనిపించింది.

*

రచయిత వివరాలు

సాయికిరణ్

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటి), నూజివీడులో విద్యార్థి.

Download PDF EPUB MOBI

మొత్తం ఎంపికైన అన్ని కథలతోనూ వేసిన సంకలనం ఈబుక్‌ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

Posted in 2015, జనవరి, స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 and tagged , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.