cover1

రెండు మొదటిసార్లు

Download PDF EPUB MOBI

ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు.

గత రాత్రి చలిమంట దగ్గర ఎవరో మరిచివెళ్లిన ‘తునికాకుల చుట్లు’ పుట్టించిన కుతూహలం మొట్టమొదటి అనుభవం. కానీ లేత పెదాలకు ఆ రుచేమీ గుర్తులేదు.

మళ్లీ కౌమారపు మలిపాదంలో- బస్‌పాస్‌ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందన్న భరోసా ఉన్న కాలంలో- అంటే- ఊరికే ఏదో బస్సెక్కేసి, ఎక్కడో దిగేసి, మరో బస్సెక్కి వచ్చెయ్యాలంతే! అలా ఉన్నట్టుండి జూ పార్కు ముందు దిగాం, నేనూ, శివిగాడూ.

ఏదో మాట్లాడుతూ నడుస్తుండగా, టాపిక్‌ ఎందుకో పొగజూరింది. వాడు ఎప్పటినుంచి దీనికి సంబంధించిన ప్రణాళిక వేసుకున్నాడో! లేక ‘తప్పు’ చేయడానికి కావాల్సిన ధైర్యపు తోడు నేను కాగలననుకున్నాడో!

‘నువ్వు ముందు తేపోరా చూద్దా’మన్నాను. అంటే మీసాలు కూడా రాని మూతితో వాడు పాన్‌షాపుకెళ్లి, అది ఇమ్మని అడిగి, తెస్తాడని నాకు నమ్మకం లేదు. కానీ వాడు తెచ్చాడు. తేగలిగాడు. అగ్గిపెట్టె సహా! అప్పుడు కూడా నాకు టేస్ట్‌ గుర్తులేదు. కానీ భయం, సాహసం కలగలిసిన క్షణాలేవో గాల్లో కలిసిపోయాయి.

మళ్లీ- కౌమారపు తుదిపాదం దాకా ఆ ఊసే లేదు. ఎప్పుడో సినిమా టాకీసులో ‘వీజయ్‌… వీజయ్‌’ అని యాడ్‌ చూసేదాకా! అవునుగదా, దానికి నేను ఎక్కడ కామా పెట్టాను! ఈసారి చొరవ మా రాంరెడ్డిగాడిది. రూముకొచ్చాం. తలుపులన్నీ బిగించాం. వాడు ఒక్కటే తీసుకున్నాడు. వాటిని నేను మార్కుల్లాగా భావించుకున్నానేమో! 9/10 వేసేసుకున్నాను. వాడు నాకంటే అనుభవజ్ఞుడు. అందుకే ఒక్కదాన్నే గట్టిగా పట్టుపట్టాడు. నాకు దమ్మును ఎలా నిలపాలో తెలియలేదు. ‘రెండ్రూపాయలు’ ఖర్చయినా ఆసారీ రుచి తెలియలేదు.

యౌవనంలోకి అడుగిడాక- ఓరోజు మా శ్రీనన్న- తాను ఆ దశను దాటివచ్చానన్న సంగతిని తెలియనిస్తూ- ‘‘ఏంరా, ఇదిగిట్ట అలవాటైందా?’’ అన్నాడు, రెండువేళ్ల ఏటవాలు సంజ్ఞతో.

మేడ్చల్‌ డిపో దగ్గరున్న చిన్న రోడ్‌ డ్యామ్‌ దగ్గరున్నామప్పుడు.

ఇంకేం! చక్కటి గురువుకోసం ఎన్నాళ్లుగానో అట్టిపెట్టుకున్న ప్రశ్నను వదిలాను: ‘‘ఏమనిపిస్త లేదేంది?’’

‘‘పైపైన దాగుతవా? లోపల్కి గుంజుతున్నవా?’’

ఒక దమ్ములాగి, ఊపిరితిత్తులకు తాకేట్టుగా అలా కాసేపు ఉంచాలి. అబ్బా! మూడు పఫ్పులకే మెదడు మొద్దుబారింది; కాళ్లు వణికినై; ఆ డ్యామ్‌పైన అలా కూలబడిపోయాను. అదీ అసలైన తొలి పొగసంగమం!

*

అది అమృతం కావొచ్చు! మధురాతి మధురమైన తీపిదనమేదో అందులో ఉండొచ్చు. మరులుగొలిపే పరిమళం కావొచ్చు. లేకపోతే ఇంతమంది దానికోసం ఎందుకు ఉవ్విళ్లూరుతారు?

భూమేష్‌గాడు (గ్రామర్‌ తప్పు; భూమీశ్‌ ఉండాలేమో!) నాకన్నా ఒకట్రెండేళ్లు వయసులో పెద్దోడే. గృహధర్మాల్లో భాగంగా వేరే మెకానిక్‌ పనిచేసి మళ్లీ నాతో కలిశాడు. వాడిది ఆర్ట్స్‌. నాది సైన్సు. పక్కూరు పక్కూరు స్నేహం.

పండగ సెలవుల తర్వాత ఇంకా ఎవరూ రాలేదు. కళాశాల ఆవరణ మీద చీకటి పరుచుకుంటోంది. ‘బ్లాక్‌’గానూ ‘నైట్‌’గానూ ‘కూల్‌’గానూ ఉంది!

ఈసారి శివిగాడి పాత్ర నేను పోషించాను.

‘‘సాఫ్ట్‌ గావాల్నా? హార్డ్‌గుండాల్నా?’’ అన్నాడు యజమాని.

నేను పెద్దవాణ్నని ధ్వనించాలనేమో, ‘‘హార్డే’’ అనేశాను.

ఒక మహా ఉత్కంఠ. అద్భుతమైనదేదో చేతుల్లో ఉందన్న మిడిసిపాటు.

మూత మూసివుండటానికీ, తీయడానికీ మధ్య ఇంత వైరుధ్యం ఉంటుందనుకోలేదు. కలల ప్రపంచం తలకిందులైపోవడమంటే ఏమిటో ఆ సాయంత్రం నిజంగా అనుభవించాను. చ్చే…దు! ఒయిక్‌!

ముక్కు మూసుకుని, నాలుక్కి తగలకుండా, ఎలాగోలా గొంతులోకి జారవిడిచాం.

ఆ దిగమింగిన చేదును అది పూర్తయ్యేలాగా మరిచిపోతామనీ, అదే అందులోని అసలు సిసలు మాయనీ ఆరోజే ఒకమేరకు తెలుసుకున్నాను.

*

కరెంట్‌ స్టేటస్‌ ఏమిటో చెప్పకుండా, దీనికి సరైన ముగింపు రాదనుకుంటాను. కుతూహలం ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే రెండు విభాగాలుగా నేను మనుషుల్ని విభజిస్తాను. మంచీ లేదూ, చెడూ లేదూ; అది చేస్తున్నది మాయ అన్న గ్రహింపు మనకు ఉన్నంతవరకూ!

– పూడూరి రాజిరెడ్డి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఫిబ్రవరి, మ్యూజింగ్స్ and tagged , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.