cover

మదాం లా గింప్

cinema venuka kathalu1933లో ఫ్రాంక్ కాప్రా దర్శకత్వంలో విడుదలైన ‘లేడీ ఫర్ ఎ డే’ అనే కామెడీ సినిమాకు మూలమైన కథ ఇది. సినిమాగా తర్జుమా కావటంలో కొన్ని మార్పులకు గురైంది. ముఖ్యంగా కథలో లేని అమెరికన్ ‘గ్రేట్ డిప్రెషన్’ నేపథ్యం సినిమాకు వచ్చి చేరింది. రచయిత డేమన్ రున్యోన్ కూడా ఈ మార్పుల వల్ల కథ కన్నా సినిమా స్థాయి పెరిగిందని భావించాడు. ఇప్పుడీ కథను వెంకట్ సిద్ధారెడ్డి తొంభైల్లోని కృష్ణానగర్ సినిమా వాతావరణానికి అన్వయించి స్వేచ్ఛానువాదం చేశారు.

Download PDF EPUB MOBI

మదాం లా గింప్

డేమియన్ రున్యోన్

ఆ రోజు రాత్రి దేవి లో “నిన్నే పెళ్ళాడతా” ఫస్ట్ షో చూసి కృష్ణా నగర్ లో ఎంటరవగానే, కనకదుర్గ బార్ పక్కన తగిలాడు బిగ్‍బాస్ భాస్కర్. బార్ పక్కనే నిలబడి వయసైపోయిన కేరళ కుట్టి వంకర మహాలక్ష్మి తో మాట్లాడుతున్నాడు. అసలు చెప్పాలంటే మాట్లాడుతున్నది వంకర మహాలక్ష్మి అయితే, వింటున్నది మావాడు. ఆమె చెప్పినదానికన్నింటికీ  తలూపుతూ సరే సరే అంటున్నాడు. వినడం ఏ మాత్రం తెలియని వాగుడుకాయ మా బిగ్‍బాస్ భాస్కర్. అలాంటిది ఆ రోజు ఎందుకలా తెగ తలూపేస్తున్నాడో అర్థం కాలేదు.

అలా మా బిగ్‍బాస్ ని చూసి నాకు ముచ్చటేసిన విషయం పక్కన పెడితే, భాస్కర్ లాంటి వాడు, మహలక్ష్మితో మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేసింది. నోరు తెరిస్తే ఇక ఆపకుండా వాగుతుండే వంకర మహాలక్ష్మి ని చూస్తేనే జనాలు అటూ ఇటూ పారిపోతుంటారని  ఫిల్మ్‌నగర్ లో టాక్.  అదీ కాక వంకర మహాలక్ష్మి ఇప్పుడు వయసులో కూడా లేదు. నేను ఇండస్ట్రీ కి వచ్చిన పదిహేనేళ్ల నుంచీ చూస్తున్నా – కృష్ణానగర్, ఫిల్మ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ  కనిపిస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. ఆమె పేరుకీ, అవతారానికీ  ఏ మాత్రం సంబంధం ఉండదు. ఏ స్టూడియోలోనో, ఏ షూటింగ్ స్పాట్స్ లోనో ఆపనీ ఈపనీ చేస్తూ తిరుగుతుంటుంది.

నిజానికి మహాలక్ష్మి ని ఎవరూ పనికి పిలవరు. తనకిష్టమైన స్పాట్ కి, తనకిష్టమైనప్పుడు వస్తుంది. షూటింగ్ స్పాట్ లో జనాలు పడేసిన చెత్తాచెదారం ని ఊడ్చేస్తుంది. భోజనాల టైమ్ లో అక్కడుంటే క్యాటరింగ్ వాళ్ళకి ప్లేట్లు కడగడంలో సహాయం చేస్తుంది. ఒక్కోసారి షూటింగ్ టైంలో బ్యాక్‌గ్రౌండ్ లో ఎవరైనా పేద, ముసలి వాళ్ళు ఉండాల్సిన అవసరమొస్తే జూనియర్ ఆర్టిస్ట్ అవతారమెత్తుతుంది. షూటింగ్ లో ఏ పెళ్ళి సీనో జరుగుతుంటే, డెకరేషన్ కోసం తెచ్చిన పూలన్నీ తీసుకెళ్లి రాత్రుళ్ళు యూసఫ్‍గూడ లో అమ్ముకుంటుంది. ఇలా అదీ ఇదీ అని లేదు – అన్ని పనులూ చేస్తూ ఇండస్ట్రీ కి తెగ సాయం చేసేస్తుంటుంది.

ఇలా దిక్కూ దిశాణం లేకుండా ఊరి మీద పడి తిరిగే మహాలక్ష్మి లాంటి వాళ్లని చూస్తే నాకు చిరాకు. కానీ పెద్దమనసున్న బిగ్‌బాస్ భాస్కర్ లాంటి వాళ్ళు ఆమె బాధలు విని తోచిన సాయం చేస్తూంటారు. జనాలు చెప్పడమేంటంటే  పాత రోజుల్లో మహాలక్ష్మి గొప్ప డ్యాన్సరంట; ఆమె గ్రూప్ డ్యాన్స్ లో ఉంటే హీరోయిన్ కంటే ఈమెనే ఎక్కువ చూసేవాళ్ళంట! అందులో ఎంత నిజముందో  నేను చెప్పలేను – ఎందుకంటే ఈ కృష్ణానగర్  ఏరియా లో ఎవడిని కెలికినా, “ఆ రోజుల్లో….” అని మొదలు పెట్టేస్తారు.

సరే, మిగిలిన వాళ్ల సంగతి పక్కనబెడితే…. వంకర మహాలక్ష్మి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని కేరళ నుంచి మద్రాస్ వచ్చి,  తెలుగు సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్ గా సెటిల్ అయ్యి, చివరికి అందరితోపాటే హైదరాబాద్ వచ్చేసిందట. ఆ రోజుల్లో  మహాలక్ష్మి గొప్ప డ్యాన్సరే కాకుండా  మహాఅందగత్తె కూడానట. ఈమె అందం చూసి పెద్ద పెద్ద వాళ్లే ఆమె వెంటపడేవాళ్ళట. అలా పడిన వాళ్ళలో ఒకడితో మహాలక్ష్మి  ప్రేమలో పడిపోయిందంట. అంతా బావుందనుకుంటున్న టైంలో, ప్రేమించినవాడితో కాలు జారడం, ఒక యాక్సిడెంట్ లో ఆమె కాలు విరగడం జరిగిపోయాయట. అలా అప్పట్నుంచి కుంటుకుంటూ జీవితం నెట్టుకొస్తోంది కాబట్టే ఆమె పేరు వంకర మహాలక్ష్మి అయిపోయిందని  కృష్ణానగర్ సర్కిల్స్ లో ఎప్పట్నుంచో చెలామణిలో ఉన్న ఒక కథ.

వంకర మహాలక్ష్మి గురించి ఈ కథ నేనిప్పటికి చాలాసార్లే విన్నాను. ఆ మధ్యన ఒక షూటింగ్ కి మహాలక్ష్మి ని తీసుకొచ్చాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్. సరిగ్గా సమయానికి షూటింగ్ కి నిర్మాత వచ్చాడు. ఇలాంటి మొహాల్నా షూటింగ్ కి తీసుకొచ్చేది అని అందరినీ తిట్టిపోయడంతో, మహాలక్ష్మి కి కాస్తా తల అదీ దువ్వి కొంచెం మేకప్ వేసి తీసుకొచ్చారు. ఆ రోజు చూస్తే నిజంగానే ఒకప్పుడు అందంగా ఉండుండొచ్చేమో అనిపించింది.

ఆ రోజు తప్పితే ఆమెను మామూలుగా ఎప్పుడూ చూడలేదు నేను. ఎప్పుడూ చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో తిరుగుతుంటుంది మహాలక్ష్మి. వయసు ఒక యాభై దాకా ఉండొచ్చు. ఆమెది కేరళ అయితే అయ్యుండొచ్చుకానీ, తెలుగు మాత్రం అచ్చతెలుగు లో మాట్లాడుతుంది. కోపమొస్తే ఆమె నోటినుంచి వచ్చే బూతుల ప్రవాహంలో ఆమెను మించిన వాళ్ళు లేరు, ఒక్క మా బిగ్‌బాస్ భాస్కర్ తప్పితే.

సరే, అసలు విషయానికొస్తే, కనకదుర్గ బార్ పక్కన బిగ్‍బాస్ ని చూసి, నాకేమీ తెలియనట్టు నా పాటికి నేనేళ్తుంటే ఆగమని గట్టిగా అరిచాడు. వంకర మహాలక్ష్మి చెప్పడమంతా అయ్యాక, కుంటుకుంటూ వెళ్లిపోయింది. ఆమెలా వెళ్లిపోగానే టెన్షన్ పడుతూ నా దగ్గరకొచ్చాడు బిగ్‍బాస్ భాస్కర్.

“మహాలక్ష్మి పెద్ద కష్టంలో ఉంది రాంబాబూ,” అని మొదలుపెట్టాడు. “విషయమేంటంటే మహాలక్ష్మి కి కమల అని ఒక కూతురుంది. ఇక్కడ హైదరాబాద్ లో తన పరిస్థితి బాగోలేకపోవడంతో చిన్నప్పుడే కేరళ లోని తన చెల్లెలింటికి ఎక్స్‌పోర్ట్ చేసేసింది. అప్పట్నుంచీ అక్కడే తన పిన్ని దగ్గర పెరుగుతూ వచ్చింది కమల. సంగతేంటంటే ఆ పిల్ల ఇప్పుడు హైదరాబాద్ వస్తోంది. ఈ శనివారం కేరళ ఎక్స్‌ప్రెస్ కి ఇక్కడుంటుంది; చూస్తే ఈ రోజు బుధవారం- సాయం చెయ్యమని కాళ్ళావేళ్ళా పడింది మహాలక్ష్మి. ఇప్పుడేం చెయ్యాలంటావ్?”

“బాస్, మరి నాకర్థం కాని విషయమేంటంటే…ఈ పిల్ల కి తండ్రెవరు?” అమాయకంగా అడిగాను.

“అదీ…నిజమేరా! నాకూ అనుమానం వచ్చింది. కానీ నోరుతెరిచి నేను అడగలేకపోయాను; నువ్వు అడగ్గలిగావ్. అదే నీకూ నాకూ తేడా! అయినా మనమడిగినా, మహాలక్ష్మి చెప్పినా ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. నీకు తెలుసో లేదో అదో పెద్ద కథ.”

మళ్లీ మహాలక్ష్మి కథ వినాల్సొస్తుందేమోనని నాకో క్షణం పాటు భయమేసింది. అందుకే మాటమార్చి, “మరి ఇప్పుడు మనమేం చెయ్యాలంటావ్?” అడిగాను.

“అసలు విషయమేంటంటే…ఈ కమల  కేరళ లో ఎవడో మంచి డబ్బునవాడిని ప్రేమించింది. వాడు వాళ్ల నాన్నకి విషయం చెప్పి కమలని పెళ్ళి చేసుకుంటానన్నాడు. సరే అమ్మాయి బావుంది. కానీ అమ్మాయి తల్లిదండ్రులను కలవందే పెళ్ళి కి ఒప్పుకోనని ఒక కండిషన్ పెట్టాడంట ఆ పెద్దాయన. ఇప్పుడు మన మహాలక్ష్మి కూతురు కమల, ఆమెని ప్రేమించిన కుర్రాడు, అతని తల్లిదండ్రులు, మహాలక్ష్మి చెల్లెలితో కలిసి హైదరాబాద్ కి వస్తున్నారు.”

“బాసూ నాకొక అనుమానం. ఇదేదో సోది తెలుగు సినిమా కథలా ఉందే!” అని నోరు జారాను.

“రాంబాబూ, నీకు చెప్పడం నాదే తప్పు,” అని చిరాకు పడ్డాడు భాస్కర్.

మొత్తానికి అలా చిరాకు పడుతూనే మొత్తం విషయం చెప్పాడు. విషయమేంటంటే, ఇక్కడ చిల్లర ఏరుకుంటూ బతుకీడుస్తున్న మహాలక్ష్మి పెద్ద కథే నడిపింది. కమల అసలు తండ్రి చనిపోయాడని, ఆ తర్వాత ఒక లక్షాధికారి ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడిందనీ, సవతి తండ్రి తో కమల ఎలా మెలుగుతుందో అన్న భయంతో కమలని కేరళలో తన చెల్లెలి దగ్గర పెంపకానికి పంపిందనేది, ఈ కథ సారాంశం. ఇప్పుడు ఆ కథలో సారమెంతో కనుక్కుందామని కమలకి కాబోయే మామగారు కుటుంబసమేతంగా హైదరాబాద్ కి వస్తున్నారు.

నన్నసలే అందరూ అనుమానపు పక్షి అంటుంటారు. అంతా విన్నాక కూడా నాకు అర్థం కాని ప్రశ్నలు ఎన్నో మిగిలిపోయాయి. “ఈ కథంతా అసలు కమలకు తెలుసా? పోనీ కనీసం మహాలక్ష్మి చెల్లెలికన్నా తెలుసా? తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికెందుకొస్తున్నారు?” అని టకటకా అడిగేశాను.

“రాంబాబూ, మొత్తం చెప్పేదాకా నువ్వు వదిలేలా లేవు కాబట్టి, చెప్తా విను,” అని నెరేషన్ మొదలు పెట్టాడు భాస్కర్. “మహాలక్ష్మి మనమనుకున్నంత వెర్రిదేం కాదు. మనం షూటింగ్‍లకి తరచూ వాడే వైట్‍హౌస్ ఉందా, అక్కడ అప్పుడప్పుడూ పని చేస్తుంటుంది. ఎలాగో అక్కడి మేనేజర్ ని పట్టి ఆ ఇంటి అడ్రస్ తనది చేసుకుంది. ఈ అడ్రస్ కే కమల ఉత్తరాలు రాస్తుంటుంది. మహాలక్ష్మి కూడా ఇన్నాళ్లూ ఆ బంగ్లాలోనే తను ఉంటున్నట్టు నమ్మిస్తూ ఉత్తరాలు రాస్తూ వచ్చింది. ఎప్పుడైనా అక్కడికి కమల రాసిన ఉత్తరాలు వస్తే మేనేజర్ ద్వారా అవి తనకు చేరేలా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఏ పండగకో పబ్బానికో ఒకసారి కేరళ వెళ్లి కమలను చూసి వస్తుండేది. ఇలా గత పదిహేనేళ్లగా ఎలాగో మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇన్నాళ్లూ కట్టుకుంటూ వచ్చిన కట్టుకథల పేకమేడ ఒక్కసారిగా కూలిపోతుందనే భయంతో మహాలక్ష్మి నా దగ్గరకొచ్చింది.”

“బాసూ నాకెందుకో ఇదంతా తేడా కొడ్తుంది. అసలీ సినిమాటిక్ కథ సినిమా వాళ్ళమైన మనకే నమ్మబుద్ధి కావటం లేదంటే, ఆ కేరళ వాళ్ళు అసలే తెలివి మీరుంటారు. ఇదంతా వాళ్లెలా నమ్మారో,” అన్నాను.

“అది మనకనవసరం రాంబాబూ! అయినా ఆ కేరళ వాళ్ళు దుబాయ్ వెళ్లి దశాబ్దానికోసారి బంగారం మూటలతో ఇంటికొస్తుంటారంట. కాబట్టి వాళ్ళు మహాలక్ష్మి కథ నమ్ముండొచ్చు.”

“సరే నమ్మారే అనుకుందాం. ఇప్పుడు మనమేం చెయ్యాలి?” అడిగాను.

“అక్కడికే వస్తున్నా. ముందు ఒక మంచి ఆర్టిస్ట్ ని చూసి, మహాలక్ష్మి కి భర్తగా సెట్ చెయ్యాలి. ఇదంతా ఈ రెండు రోజుల్లో జరిగిపోవాలి. లేదంటే ఆ కేరళ బ్యాచ్ ఇక్కడికొచ్చి, మహాలక్ష్మి అసలు రూపం తెలుసుకున్నారనుకో, పాపం మహాలక్ష్మి కూతురికి ఆ కేరళ వాడితో పెళ్ళి కాదు. ఇదే జరిగితే మహాలక్షి గుండె పగల్తుంది. దాంతో పాటే ఆమె కూతురు కమల, నిజం తెలుసుకున్న మహాలక్ష్మి చెల్లెలు, కమల దక్కలేదని ఆ కేరళ కుర్రాడు…వీళ్ళంతా గుండె పగిలి ఏడుస్తారు. కాబట్టి మహాలక్ష్మి కి మనం ఈ సాయం చేసి తీరాల్సిందే!”

“…..,” నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఈ రోజు ఇలా ఇరుక్కుపోయానేంటని అనుకున్నాను.

“రాంబాబూ మనం సినిమా వాళ్లం. రోజూ ఎన్నో అబద్ధపు ప్రేమలను మనం నిజమని నమ్మిస్తుంటాం. అలాంటిది ఒక అబద్ధం తో ఒక ప్రేమను నిజం చేయలేమా? ఏమంటావ్?” అన్నాడు బిగ్‍బాస్.

మా మేనేజర్ భాస్కర్ ఒకసారి అనుకుంటే ఏదైనా సాధించి తీరుతాడు. అందుకే అందరూ ఆయన్ని బిగ్‍బాస్ అంటారు. అలాంటిది అతనే డిసైడైపోయాక ఇక మనం చేయగలిగిందేమీ లేదు. ఆర్డర్స్ ఫాలో అవడం తప్ప. అదీకాక పోయిన సినిమా పేమెంట్స్ కొన్ని భాస్కర్ దగ్గర ఇంకా పెండింగ్‍లో ఉన్నాయి. అందుకే, “అయితే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యమేమిటి?” అని అడిగాను.

“సింపుల్. నువ్వు మన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ భాషా దగ్గరకెళ్లి విషయం చెప్పి, మంచి ఆర్టిస్ట్ ని సిద్ధం చెయ్యి. మిగతా పనులు నేను చూసుకుంటాను,” అని నాకు పని చెప్పాడు.

బిగ్‍బాస్ ఆర్డర్ వేశాక ఇక చేయగలిగిందేమీ లేదు కనుక, భాషా వేటలో పడ్డాను. అక్కడా ఇక్కడా వెతికి భాషా కి విషయం చెప్పాను. హైదరాబాద్ ఆర్టిస్టుల్లో కోటీశ్వరుడి పాత్ర కి సరిపోయే జూనియర్ ఆర్టిస్ట్ ఎవరూ లేరు కానీ, ఈ మధ్యనే మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పాడు. ఎవరని ఆరా తీస్తే జడ్జి విశ్వనాథం అని చెప్పాడు.

జడ్జి విశ్వనాథం అంటే తెలియని వాళ్లు మద్రాస్ పాండీ బజార్ లో ఎవరూ ఉండరు. అక్కడి సినిమా పరిశ్రమలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అతను. గతంలో ఎప్పుడో ఏదో సినిమాలో జడ్జిగా నటించి తన విశ్వరూపం ప్రదర్శించిన కారణంగా ఆయన పేరు జడ్జి విశ్వనాథంగా మారింది.

ఈ విశ్వనాథం అనే వ్యక్తి నిజంగా జడ్జి కాకపోవచ్చు కానీ, ఏదో ఒకటి చేసి సుప్రీంకోర్ట్ లోకి తీసుకెళ్లి జడ్జి కోట్ వేసి కూర్చో బెట్టగలిగితే మాత్రం అతను జడ్జి కాదని ఎవరూ నమ్మరు. అతని మొహంలో ఠీవి అలాంటిది మరి. ఇస్త్రీ బట్టలు, పౌడర్ రాసిన మొహం, చెదరని తలకట్టు – పగలైనా, రాత్రైనా ఇదీ అతని వరస. వయసు లో పెద్ద వాడు కాబట్టి సినిమా వాళ్లకి గొడవలేవైనా వస్తే పెద్దమనిషిగా వ్యవరిస్తూ కూడా ఉండేవాడు. మహాలక్ష్మి అదృష్టమో ఏమో హైదరాబాద్ కి వచ్చాడు. మహాలక్ష్మి అల్లిన కథ ప్రకారం ఆమె భర్త పాత్రకు జడ్జి విశ్వనాథం సరైన వాడే. కానీ ఆయన్ని ఒప్పించే పని నా మీద పెట్టడమే నాకు నచ్చలేదు.

విశ్వనాథం ఉంటే ఏదైనా షూటింగ్ దగ్గర, లేదంటే ఏ క్లబ్ లోనో పేకాట దగ్గర ఉంటాడని భాషా చెప్పాడు. గతంలో మద్రాస్ లో ఉండబట్టి సినిమాల్లో పనిచేసే లైట్‍మెన్, మేకప్, కాస్ట్యూమ్స్ వాళ్లందరితో విశ్వనాథం కి మంచి పరిచయం. కాస్టూమ్స్ కన్నారావు, లైట్‍మెన్ యూనియన్ లీడర్ బాబ్జీ లాంటి వాళ్ళు  విశ్వనాథం కి పేకాట లో కంపెనీ ఇస్తుంటారు. జడ్జి విశ్వనాథం తో నాకు పెద్దగా పరిచయం లేనప్పటికీ, ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం బాగానే పలకరిస్తుంటాడు. బాబ్జీ, కన్నారావులాంటి కంత్రీ గాళ్లతో తిరిగినంత మాత్రాన విశ్వనాథం ని కంత్రీ అని తీసిపారేయలేము. అసలు విశ్వనాథం స్టైలే వేరు; పెద్ద పెద్ద కోటీశ్వరులు సైతం జడ్జి విశ్వనాథం స్టైల్ ముందు దిగదుడుపే.

ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దోళ్లకున్నట్టే మన జడ్జి గారికీ “ఆ రోజుల్లో” కథ ఒకటి ప్రచారంలో ఉంది. లక్షాధికారి ఇంట్లో జన్మించిన విశ్వనాధం హీరో అవ్వాలని కలలుకంటూ మద్రాస్ చేరుకుని, అక్కడ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా, చివరికి తనే నిర్మాతగా మారి కొన్ని సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకుని మద్రాస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి, ఈ మధ్యనే హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే మరొక కథనం ప్రకారం, విశ్వనాథం అంత తెలివితక్కువ వాడేమీ కాదనీ- ఒక సినిమా నిర్మించి అందులోని కష్టనష్టాలు తెలుసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ వచ్చిన వడ్డీతో హాయిగా బతికేస్తూ జీవితం ఎంజాయ్ చేస్తాడని అంటుంటారు.

స్టూడియోలన్నీ వెతికాక చివరికి జూబ్లీహిల్స్ క్లబ్ లో దొరికాడు జడ్జి విశ్వనాథం. ఎప్పట్లానే ముగ్గురు మిత్రులు పేకాట ఆడుతున్నారు. ఎవడో బొంబాయి నుంచి వచ్చిన నిర్మాత వీళ్లకి బలయ్యాడు. నేను వెళ్లేసరికి పాయింట్ కి యాభై పెట్టి ఆడుతున్నారు. విశ్వనాథం ఓడిపోతూనే ఉన్నాడు. బొంబాయి వాడు రెచ్చిపోయి పాయింట్ కి ఐదొందల దాకా వెళ్లాడు. విశ్వనాధం సామాన్యుడు కాదనేది అందుకే. ముందు ఓడిపోయి అవతలి వాడి కాన్ఫిడెన్స్ ని పెంచి, ఒకటే సారి ఫెడేళ్ మని కొట్టడమే జడ్జి గారి టెక్నిక్.

గమ్మత్తుగా సాగుతున్న ఆటని నేనూ కాసేపు చూసాను కానీ, నాకీ పేకాట పెద్దగా అర్థం కాదు. అందుకే ఓపిక నశించి విశ్వనాథం తో మాట్లాడాలి బయటకి రమ్మని సైగ చేశాను. అంతే, ఆ తర్వాత పది నిమిషాల్లో బొంబాయి నిర్మాతకి చుక్కలు చూపించి జేబులో పదివేలు వేసుకుని నాతో బయల్దేరాడు విశ్వనాథం. నేనే గనుక హడావుడి పెట్టకుండా ఉండుంటే బొంబాయి వాడి బరువు ఇంకో పాతికైనా తగ్గించుండేవాడినని చెప్పుకొచ్చాడు జడ్జి విశ్వనాథం. ఇవాళ కాకపోతే రేపు అన్నాను నేను. ఒకసారి తన పేక దెబ్బ తగిలాక మళ్లీ కోలుకోవడం ఉండదని బాధపడ్డాడు విశ్వనాథం.

భాస్కర్ చెప్పమన్న విషయమంతా విన్న జడ్జి విశ్వనాథం ఎగిరిగంతేస్తాడని నేననుకోలేదు కానీ, మరీ డీలా పడిపోతాడని మాత్రం ఊహించలేదు. కానీ ఫిల్మ్‌నగర్ లో బిగ్‍బాస్ మాటను కాదనే ధైర్యం ఎవరికుంటుంది? అందుకే విశ్వనాథంకీ ఒప్పుకోక తప్పలేదు. కాకపోతే భర్త పాత్రని పోషించేంతటి బాధ్యతను నెత్తిమీద వేసుకోవడానికే తనకు భయంగా ఉందన్నాడు. అసలే నిజజీవితంలో అలాంటి బాధ్యతలకు దూరంగా పారిపోయిన చరిత్ర తనకి ఉందనీ, కాకపోతే భాస్కర్ కోసం  ఎలాగో మేనేజ్ చేస్తానని  ఒప్పుకున్నాడు. నాకైతే లోలోపల విశ్వనాథం ఆనందంగానే ఉన్నాడేమో అనిపించింది. అంతే కదా మరి – అతని నటజీవితంలో పోషించబోయే అతి పెద్ద పాత్ర ఇది.

మొత్తానికి విశ్వనాథం ఒప్పుకున్నాడని తెలియగానే, బిగ్‍బాస్ భాస్కర్ మిగిలిన పనులన్నీ చకచకా చక్కబెట్టేశాడు. వంకర మహాలక్ష్మి అవతారం మార్చే పని తన భార్య సుందరి కి అప్పచెప్పాడు. సుందరి వెంటనే తన ఆప్తమిత్రురాలు, ఫ్రూటీ బ్యూటీ పార్లర్ యజమాని అయిన స్వీటీ ని సంప్రదించింది.

అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికే ఎక్కువ ఆసక్తి కనబరిచే స్వీటీ, ఈ విషయం విని ఇక్కడ ఎగిరి అక్కడ గంతేసింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా మా నలుగురిలోనే ఉండాల్సిన ఈ విషయాన్ని, హైదరాబాద్ మొత్తం చాటింపు వేసి చెప్పకుండా స్వీటీ ని అపడంలో మేము చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి మేకప్ బాధ్యత సుందరి-స్వీటీలదైతే , కాస్టూమ్స్ బాధ్యత కన్నారావు కి అప్పచెప్పాడు భాస్కర్.

ఆ విధంగా మహాలక్ష్మి రూపురేఖలను రాత్రికి రాత్రి మార్చే పని తలకెత్తుకుంది స్వీటీ. మహాలక్ష్మి ని బ్యూటీ పార్లర్ లో కూర్చోబెట్టి తల వెంట్రుకలతో మొదలుపెట్టి, ఆమె కాలి గోళ్ల వరకూ కడిగి అవతలపారేసారు.  ఆరుగంటల తర్వాత రిన్ సోప్ తో ఉతికిన తెల్ల చీరలా తళతళలాడుతూ బయటకొచ్చింది మహాలక్ష్మి.

బ్యూటీ పార్లర్ వరకే ఆమె పని అని చెప్పినా వినకుండా, కాస్టూమ్స్ పని లోకి కూడా దూరిపోయింది స్వీటీ. ఇదే సమయానికి హిందీ సినిమా షూటింగ్ కోసమని రెడీ చేసిన కాస్టూమ్స్ ని తీసుకొచ్చాడు కన్నారావు. ఆ కాస్ట్యూమ్స్ ఏమీ బాగోలేవని సుందరి తో గొడవకి దిగింది స్వీటీ. నీకేం తెలుసంటే, నీకేం తెలుసనీ వాళ్లిద్దరూ జుట్లు పట్టుకునే దాకా వెళ్లారని, మరీ అంత గొడవేమీ జరగలేదనీ, కిందపడి దొర్లాడుతూ కొట్టుకున్నారని – ఇలా పలురకాలుగా ఆ సాయంత్రం కృష్ణానగర్ మెస్సుల్లో హాట్‍టాపిక్ అయింది. ఇద్దరాడవాళ్ళు గొడవపడడానికి కారణాలేవీ అక్కర్లేదని ఆ రోజే నాకర్థమైంది.

పాకీ దానిలా తిరుగుతున్న దాన్ని తీసుకొచ్చి తన బ్యూటీ పార్లర్ లో నిజంగానే సుందరంగా తయారుచేశాననే కృతజ్ఞతైనా లేకుండా, సుందరి తనని అవమానించిందని కనిపించిన అందరితోనూ స్వీటీ తెగబాధపడిపోయిందని ఆ తర్వాతే నాకు తెలిసింది. అయితే ఒకప్పటి సుందరి వేరు; ఇప్పటి సుందరి వేరు. ఎంతలేదన్నా సుందరి ఇప్పుడు బిగ్‍బాస్ భాస్కర్ భార్య. అందుకే ఆ గొడవ వెంటనే సద్దుమణిగిపోయింది.

ఎలాగైతేనేం, రెండు మూడు రోజులు కృష్ణానగర్ లో మహాలక్ష్మి హడావుడే నడిచింది. తీరా చూసేసరికి కంచి పట్టు చీరకట్టి, మొహాన కుంకుమబొట్టు పెట్టి, ఒంటినిండా బండెడు నగలు వేసుకుని గురువారం నైటే వైట్ హౌస్ లో దిగిపోయింది మహాలక్ష్మి. రోజుకి వేలకి వేలు ఇస్తే తప్ప సినిమా షూటింగ్ లకి అద్దెకు దొరకని వైట్‍హౌస్ లో రెండు రోజుల ముందే మహాలక్ష్మి ని చేర్చగలిగే సామర్థ్యం ఫిల్మ్‌నగర్ లో ఒక్క మా బాస్ కే ఉంది. మా వాడి ట్యాలెంటే అది – అవతలి వాడి వీక్‍నెస్ చూసి కొడ్తాడు.

అందరికీ ఏదో ఒక వీక్‍నెస్ ఉన్నట్టే వైట్‍హౌస్ ఓనర్ నాయుడి వీక్‍నెస్ – మందు.  ఉదయాన్నే కచేరీ మొదలుపెడ్తాడు ఆయన. అలాంటిది అసలే ప్రొహిబిషన్ రోజులు; డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ. అలాంటి సమయంలో నెలకు సరిపడా సింగిల్ మాల్ట్ స్కాచ్ బాటిల్స్ ఇస్తానని చెప్పి నాయుడి వీక్‍నెస్ మీద కొట్టి వైట్ హౌస్ ని మూడు రోజులకి ఫ్రీగానే సెట్ చేసి సుందరి తో కలిసి వైట్ హౌస్ లో మకాం వేశాడు భాస్కర్.

అంతవరకూ బాగానే ఉంది. కానీ శుక్రవారం రాత్రి కథ అడ్డం తిరిగింది. అసలేం జరిగిందంటే, రాత్రి మందు మత్తులో అసలు విషయం బయటకు కక్కేశాడు మా బాస్. అప్పటికీ నేను ఆపమని గోకుతూనే ఉన్నా పట్టించుకోలేదు. తను ఇండస్టీకి వచ్చిన మొదటి రోజుల్లో ఒక రోజు ఆకలి తో అల్లాడుతుంటే మహాలక్ష్మి తనకు అన్నం పెట్టించిన కృతజ్ఞతతోనే ఇదంతా చేస్తున్నానని ఏదేదో వాగేశాడు. నాయుడి కి మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఏదో చిన్న బడ్జెట్ సినిమా షూటింగ్‍కని వైట్‍హౌస్ మూడు రోజులకు కావాలని నాయుడికి చెప్పిన అబద్ధం కాస్తా బట్టబయలైపోయింది.

ఇంత జరిగాక అసలు విషయం బయటపెట్టాల్సి వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే వస్తున్న కేరళ పార్టీ గురించి, జడ్జి విశ్వనాథం గురించీ, మహాలక్ష్మి గురించీ మొత్తం కథంతా నెరేట్ చేశాడు భాస్కర్. అంతా విన్న నాయుడు ఫక్కున నవ్వేసాడు. ఓసోస్ ఇంతేనా? అయితే ఈ డ్రామాలో నేనూ ఉంటానని మా టీం లో చేరిపోయాడు. ఆ వచ్చిన వాళ్లకి ఇళ్ళంతా చూపించే వాళ్లు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఇంటి ఓనర్ నాయుడు కి సర్వెంట్ కం డ్రైవర్ పాత్ర కి సెట్ చేశాం.

మొత్తానికి శనివారం రానే వచ్చింది. ఇంకో గంటలో వాళ్లు వస్తారనగా స్వీటీ వచ్చి వైట్‍హౌస్ లో వాలింది. అప్పటికే సుందరి-స్వీటీ ల మధ్య జరిగిన గొడవ కారణంగా బిగ్‍బాస్ టెన్షన్ పడిపోయాడు. కానీ స్వీటీ అన్నీ మర్చిపోయి – మహాలక్ష్మి కి మేకప్ చేయడంలో మునిగిపోయింది. ఇదంతా చూసి సుందరి కూడా , “వదినా, నన్ను క్షమించు,” అనడంతో వాళ్లిద్దరూ మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయారు.

జడ్జి విశ్వనాథం భలేగా తయారయ్యాడు. చూస్తుంటే నాకే ముచ్చటేసింది. వంకర మహాలక్ష్మి ఏమీ తక్కువకాదు. అప్పటిదాకా కుంటుతూ నడిచే మహాలక్ష్మి నడకలో కూడా మార్పొచ్చింది. అప్పటిదాకా కుంటి దానితో భర్తగా నటించడమేమిటి? అసలు తన ఠీవి ముందు ఆమె ఆనుతుందా అని అనుమానంతో ఉన్న విశ్వనాథం కూడా మహాలక్ష్మి ని చూసి షాక్ అయ్యాడు. బయట చూస్తే గుర్తుకూడా పట్టలేని చాలా మంది అమ్మాయిలు మేకప్ వేస్తే రంభ ఊర్వశుల్లా మారిపోవడం రోజూ చూసే నేనే మహాలక్ష్మి ని చూసి షాక్ అయిన మాట నిజం.

కేరళ ఎక్స్‌ప్రెస్ కి వస్తున్న పార్టీని రిసీవ్ చేసుకోడానికి నాయుడి గారే స్వయంగా- డ్రైవర్ వేషంలో – విశ్వనాథం, మహాలక్ష్మిలతో కలిసి స్టేషన్ కి బయల్దేరాడు.

ఆ రోజు స్టేషన్ లో నేను లేను కానీ, జనాలు చెప్పిందేంటంటే మహాలక్ష్మి తన కూతుర్ని చూసి ఒకటే ఏడుపంట. అదే విధంగా చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన ఆనందంలో మహాలక్ష్మి కూతురు కమల కూడా లీటర్లు లీటర్లు ఆనంద భాష్పాలు కార్చేసిందట. వీళ్లిద్దరి ఏడుపుకి మహాలక్ష్మి చెల్లెలి ఏడుపు కూడా తోడవడంతో అక్కడ కన్నీళ్లు నదులై పారిందంట. ఇదే ఛాన్స్ అనుకుని వైట్‍హౌస్ నాయుడు కూడా ఏడవడం మొదలు పెట్టాడంట. ఇంతమంది ఏడుస్తుంటే తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించాలని గుర్తొచ్చిన విశ్వనాథం కూడా కన్నీళ్లు పెట్టాడట. ఇంతలో ఆ చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్ లో వరదలు సృష్టించకండని వాళ్ళని మందలించేదాకా ఆ ఏడుపులు ఆగలేదట.

మొత్తానికి స్టేషన్ లో సీన్ బాగానే పండిందని నాయుడు గారు చెప్పారు. కాకపోతే విశ్వనాథం కాస్తా ఓవరాక్షన్ చేసి అందర్నీ ప్రేమతో కౌగలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడట. ఆ కేరళ వాళ్లు మాత్రం ఈ హడావుడంతా చూసి తెగ ముచ్చటపడిపోయారు. కమలని చేసుకోబోయే కుర్రాడు బానే ఉన్నాడు. అన్నింటికీ తెగ సిగ్గుపడిపోవడం అతని మేనరిజంలా ఉంది.

ఈ తంతంతా చూడ్డానికి వచ్చి వైట్‍హౌస్ పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతున్న విశ్వనాథం గ్యాంగ్, విశ్వనాథం అదృష్టం తలుచుకుని తెగ కుళ్లిపోయారు. అప్పటిదాకా ముసలి మొగుడు, కుంటి పెళ్లాం అని విశ్వనాథం ని ఏడిపించిన పేకాట గ్యాంగ్ అంతా, “ఛా మనకే ఈ అవకాశం వచ్చుంటే,” అని పగటి కలల్లో మునిగిపోయారు. అసలే కమల అన్నింటికీ డాడీ, డాడీ అని విశ్వనాథం కి ముద్దులు పెట్టేస్తుంటే బయట కాపుకాసిన జనాలకి ఒళ్ళుమండిపోయింది.

మహాలక్ష్మి స్నేహితులుగా స్వీటీ, సుందరి అక్కడే మకాం వేశారు. అసలే ఎప్పట్నుంచో యాక్టింగ్ చెయ్యాలనే కోరికను అణుచుకుని ఉన్న నాయుడు ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. ఇటువైపు జనల్లో మలయాళం వచ్చింది ఒక్క మహాలక్ష్మి కే. అటువైపు జనాల్లో ఒక్కరికీ ఒక్క ముక్కైనా తెలుగు రాదు. అయినా సరే అక్కడందరూ తెగమాట్లాడేసుకుంటున్నారు. చివరికి ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్లంటే చిరాకు పడే మా బిగ్‍బాస్ కూడా వచ్చీ రాని ఇంగ్లీష్ లో తెగ మాట్లాడేస్తున్నాడు. మొత్తానికి అందరూ హ్యాపీస్ – ఒక్క విశ్వనాథం తప్పితే.

కారణమేంటంటే – అసలే శనివారం రాత్రి. క్లబ్ లో పోటాపోటీగా ఆటలు నడుస్తుంటాయి. కనీసం ఒక పదో పాతికో గ్యారెంటీగా సంపాదించొచ్చు. మరో వైపు జీవితాంతం ఒంటరిగా బతుకుతూ వచ్చిన జడ్జి గారికి ఫ్యామిలీ డ్రామా ఓవర్‍డోస్ అయిపోయింది. అందుకే ఎలాగో కాసేపు అక్కడ్నుంచి బయటపడితే బావుండునని ఆయనకనిపించింది.  కానీ అక్కడ్నుంచి వెళ్లడం ఎలా అని నా దగ్గరకొచ్చాడు జడ్జి విశ్వనాథం. నాక్కూడా మొదట్లో ఈ డ్రామా అంతా కాసేపు సరదాగానే ఉన్నా, కాసేపటికి బోర్ కొట్టేసింది. అందుకే, కోట్ల విలువ చేసే బిజినెస్ డీల్ మీద సంతకం చెయ్యడానికి విశ్వనాథం గారు బయల్దేరుతున్నారని ప్రకటించేశాను. ఆ విధంగా నేనూ, విశ్వనాథం, నాయుడు గారు అక్కడ్నుంచి బయల్దేరాం.

క్లబ్ లో మందేసుకుని, కాసేపు పేకాట ఆడేసుకుని – ఇంకేముంది? మన డ్రామా సక్సెస్! రేపు ఉదయాన్నే ఆ కేరళ వాళ్లు చెక్కేస్తారు. మనం ఎప్పట్లా హాయిగా ఉండొచ్చని అని కబుర్లాడుకుంటూ వైట్‍హౌస్ కి చేరుకునే సరికి బిగ్‍బాస్ మాకో పెద్ద టాస్కే పెట్టాడు.

రాకరాక వచ్చిన కేరళ పార్టీని అంత త్వరగా పంపేస్తే ఏం బావుంటుందనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం నగరం లోని ప్రముఖలకు వైట్‍హౌస్ లో విందు ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించేశాడు భాస్కర్. వద్దు బాసూ మనకెందుకొచ్చిన గొడవని చెప్పినా వినలేదు. ఆడ లేడీస్ అంతా తమ కొత్త చీరలు ప్రదర్శించడానికి ఈ పార్టీ ఒక మంచి అవకాశం కాబట్టి వాళ్లూ సరేనన్నారు. దానికి తోడు పార్టీ అనగానే నాయుడు గారు బాస్ ని తెగ మెచ్చుకున్నాడు. పార్టీ పెట్టుకుంటే పెట్టారు, మధ్యలో నాకేంట్లే అనుకున్నాను. కానీ నా భయమల్లా – ఇంకోరోజంతా ఈ డ్రామా ని టైట్ గా నడిపించాలి; లేదంటే కేరళ పార్టీ కి అనుమానమొచ్చి మొదటికే మోసం రావొచ్చని.

మొత్తానికి ఆదివారం రాత్రి ఏడింటికి వైట్‍హౌస్ కి చేరుకున్నాను. బిగ్‍బాస్ అప్పటికే పార్టీ గురించి అందరికీ చెప్పి ఉండడంతో జనాల తాకిడి ఎక్కువైంది. వైట్‍హౌస్ లోపలకి అడుగుపెట్టబోతుంటే ఒక పోలీస్ నన్ను ఆపాడు. తీరాచూస్తే అతను పోలీసే కాదు. కేటరింగ్ సుబ్బారావు పోలీస్ వేషం లో ఉండి లోపలకి ఎవర్ని పంపించాలో ఎవర్ని పంపించకూడదో చూస్తున్నాడు. నన్ను చూడగానే నమస్తే చెప్పి లోపలకి పంపాడు. అబ్బో చాలానే ఉన్నాయి ఈ రోజు వేషాలు అనుకున్నాను.

లోపలకి అడుగుపెట్టగానే వైట్‍హౌస్ ఓనర్ నాయుడు గారు గ్లాసుల్లో డ్రింక్స్ పట్టుకొచ్చి, “కవీంద్రనాథ్ గారికి స్వాగతం,” అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. నాయుడు గారిని కాస్తా పక్కకు తీసుకెళ్లి, “నాయుడు గారూ, మీ వేషంతో బాటు నాపేరు మార్చేశారేంటి,” అని అడిగాను. కేరళ వాళ్ల లెక్కలో ఇదో పెద్దింటోళ్ల కుటుంబం. కాబట్టి వాళ్లింట్లో జరిగే పార్టీకి పెద్ద పెద్ద వాళ్లే  వస్తారు కాబట్టి, వాళ్లకి సరితగ్గ పేర్లనే పార్టీకొచ్చే వాళ్లందరూ వాడాలని నాయుడు గారి రీజనింగ్. ఎంత కేరళ లో ఉన్నా వాళ్లకీ ఏవరో కొంతమందైనా సినిమా వాళ్ల పేర్లు తెలిసుండే అవకాశం ఉంది కాబట్టి భాస్కరే ఈ ప్లాన్ వేశాడని చెప్పాడు నాయుడు గారు.

నా చేతిలో ఒక స్కాచ్ డ్రింక్ పెట్టేసి, నన్ను పక్క గదిలోకి తీసుకెళ్లాడు నాయుడు. అక్కడ అప్పటికే మహాలక్ష్మి అండ్ కో సోఫాలో కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. “అయ్యగారూ, ప్రముఖ రచయిత కవీంద్రనాథ్ గారు వచ్చారు,” అని నన్నక్కడ వదిలేసి వెళ్లిపోయాడు నాయుడు.

అక్కడున్న అందరికీ హ్యాం‍డ్‍షేక్ లూ గట్రా చేసేసారికి నా ఓపిక నశించింది. నా గురించి లేని విషయాలు మహాలక్ష్మి తన వాళ్లకి చెప్తుంటే ఆ భాష అర్థం కాక తలగోక్కున్నాను. జడ్జి విశ్వనాథం మాత్రం అప్పటికే మాంచి ఊపులో ఉన్నాడని తెలిసిపోతోంది. చేతిలో అప్పటికే డ్రింక్ ఉంది. ఎన్నోదన్నట్టు కనుసైగ చేశాను. నాలుగో పెగ్ అని వేళ్లు చూపించాడు. ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటూ అక్కడనుంచి బయటపడ్తుండగా, ఈ సారి సివిల్ క్లోత్స్ లో ఉన్న కానిస్టేబుల్ కృష్ణమోహన్ ఎదురొచ్చాడు. వాడికక్కడేం పనో ఆ రోజు నార్థం కాలేదు. తర్వాత తెలిసిన విషయమేంటంటే, మహాలక్ష్మి వేసుకున్న బంగారు నగలు నిజమైనవేనంట. అదీకాక అవి స్వయాన సుందరి కి బిగ్‍బాస్ కొనిచ్చినవి కావడంత, ఏ పనికి మాలిన వెధవో వాటిని కొట్టెయ్యకుండా జాగ్రత్త గా కాపాడ్డానికే ఆ రోజు అక్కడికొచ్చాడని కృష్ణమోహన్ తర్వాతెప్పుడో నాకు చెప్పాడు.

పార్టీకొచ్చిన లేడీస్ అందరికంటే మహాలక్ష్మి మెరిసిపోయిందా రోజు. అదేదో ఇంగ్లీష్ లో అంటారు, “ఎవెరీ డాగ్ హాజ్ ఇట్స్ డే,” అని. అలా ఆ రోజు మహాలక్ష్మి కి అంకితమైంది.  అసలా రోజు మహాలక్ష్మి ని చూస్తే రోజు చీపురు పట్టుకుని స్టూడియో కాంపౌండ్లు ఊడ్చే వంకర మహాలక్ష్మేనా ఈమె అని అందరికీ అనుమానమొచ్చింది. మహాలక్ష్మి కూతురు కమల కూడా ఆ రోజు ఏ మాత్రం తగ్గలేదు. కమలని చూసి కొంతమంది సినిమా వాళ్లు హీరోయిన్ గా బుక్ చేసుకుందామని కూడా డిసైడైపోయారు.

కాసేపటికి, నాయుడు గారు – “ప్రఖ్యాత దర్శకుడు కేసరి గారు వస్తున్నారు,” అని ప్రకటించాడు. ఈ వేషం ఎవరిదో అని మేమంతా ఆసక్తిగా చూస్తుంటే, మేకప్ ఛీఫ్ రాఘవ దిగాడు – సూటూ బూటూ వేసుకుని. తన వియ్యంకులకు కేసరి ని పరిచయం చేశాడు జడ్జి విశ్వనాథం. ఆ కేరళ వాళ్లకి ఇదంతా పెద్దగా పట్టించుకొనే ఓపిక లేనట్టే అనిపించింది. వాళ్ళపాటికి అన్నపూర్ణ క్యాటరింగ్ వారు ఏర్పాటు చేసిన అద్భుతమైన వంటకాలను రుచి చూడడంలో బిజీగా ఉన్నారు. సందట్లో సడేమియా మాదిరిగా కమల తన కాబోయే భర్తతో ఒక మూల కూర్చుని కుచ్చిబుచ్చిలాడుతోంది.

వీళ్లసంగతి ఎలా ఉన్నా, నాయుడు గారు మాత్రం ఒక్కొక్క సెలబ్రిటీని లోపలకి తీసుకొచ్చి పరిచయం చేయడం మానలేదు. కాస్టూమ్స్ కన్నారావు, లైట్‍మెన్ యూనియన్ లీడర్ బాబ్జీ కూడా గొప్ప వేషధారణతో పార్టీకి చేరుకున్నారు. ఈ నాటకంలో కన్నారావు – “ప్రముఖ లిరిక్ రైటర్ జాజిమల్లి,” అవతారమెత్తితే, బాబ్జీ మాత్రం – “ప్రముఖ నిర్మాత రామారావు,” అవతారమెత్తాడు. వీళ్లంతా ఒకెత్తైతే జూనియర్ ఆర్టిస్ సప్లయర్ భాషా, “ప్రముఖ కథానాయకుడు గోపీకృష్ణ,” అవతారమెత్తడం చూసి అందరూ “ఔరా” అనుకున్నారు.

సినిమా వాళ్ల లిస్ట్ అయిపోయుందో ఏమో, ఆ తర్వాత వచ్చిన ఒక్కొక్కరినీ, “హైదరబాద్ సిటీ కి చెందిన ప్రముఖ పోలీస్ కమీషనర్,” పాత్రలో సీనియర్ కెమెరా అసిస్టెంట్ మోహన్ బాబు, “రాష్ట్ర మంత్రి, ప్రముఖ రాజకీయనాయకుడు,” పాత్రలో గోవిందు దిగారు. నాకైతే అసలా పార్టీ ఎప్పుడైపోతుందా, విషయం బయటపడకముందే అక్కడ్నుంచి జారుకుందామా అనుకున్నాను.

ఈ జనాలంతా నాలుగు పెగ్గులెయ్యగానే వాళ్లవాళ్ల పాత్రలు మర్చిపోయి, అసలు అవతారాల్లోకొచ్చేసి నానా గోళ చేసేశారు. ఈ గందరగోళంలో అసలు నిజం బయటపడిపోతుందేమోనని భాస్కర్ కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటే నేనే ఒక పెగ్గు అతని చేతిలో పెట్టి కూల్ చేశాను.

అప్పటికే ఆ కేరళ వాళ్లకి పార్టీకి వస్తున్న “ప్రముఖ” వ్యక్తులందరికీ హ్యాండ్‍షేక్‍ లు చేసి చేతులు వాచిపోయాయి. అసలీ పార్టీ ఇంకెంత సేపు కొనసాగుతుందిరా బాబూ అన్నట్టుగా ఉన్నారు. కమలకి కాబోయే మామగారి మొహం – అలసట, చిరాకు, చిరునవ్వు కలిసిపోయి – ఆముదం తాగిన మొహంలా తయారయింది. “బాసూ, ఇంక చాలు. అందరికీ గుడ్ ‍బై, గుడ్ నైట్ చెప్పేసి పంపేద్దామన్నాను,” భాస్కర్ తో. మా బాస్ అంత ఈజీగా వింటాడని నేననుకోలేదు. అదీకాక ఆడ లేడీస్ గ్యాంగ్ మొత్తం స్వీటీ బ్యూటీ పార్లర్ లో తెగ సింగారించుకుని ఒకే సారి గుంపుగా దిగారు. అప్పుడు చూడాలి నాయుడు గారు చేసిన్ హంగామా- ఒక్కొక్కరినీ ఒక్కొక్క హీరోయిన్ లా పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఈ ఆడ లేడీసేమో, “మేమా? హోరోయినా?” అనుకుంటూ సిగ్గుపడుతూ ఒక మూలకు వెళ్లిపోవడం – అబ్బో అదంతా ఇంకో పెద్ద కథ.

ఆడ లేడీస్ ని చూసిన కేరళ పెద్దాయన మొహం కళకళలాడిపోయింది. అదే సమయానికి ఘంటసాల మ్యూజికల్ ట్రూప్ వాళ్ళు తమ బ్యాండ్ తో వచ్చేశారు. పాత తెలుగు, తమిళం పాటలతో ఊదరగొట్టేశారు. దాంతో పార్టీ మళ్లీ ఊపందుకుంది.

సంగీతం వల్లో లేక వచ్చిన లేడీన్ వల్లో తెలియదు కానీ కేరళ పెద్దాయన కొంచెం మూడ్ లోకొచ్చి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా ఎవరికి వాళ్ళు చిన్నచిన్న గుంపులుగా ఏర్పడి తాగుతున్న వాళ్ళు కాస్తా డ్యాన్స్‌లు చేయడం మొదలుపెట్టారు. జడ్జి విశ్వనాథం కి కూడా మధ్యలో మూడ్ వచ్చేసింది. మహాలక్ష్మి ని లాక్కు వెళ్లి అందరి మధ్యలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మందెక్కువై నిజంగానే మహాలక్ష్మి ని తన భార్య అనుకున్నాడో ఏమో తెలియదు గానీ, మహాలక్ష్మి తో విశ్వనాథం చేసిన హడావుడి చూసి, జనాలు “వారి నీ వేషాలు,” అని ముక్కున వేలేసుకున్నారు.

అర్థరాత్రెప్పుడో బాబ్జీ మరియు అతని మిత్రబృందం పెరట్లో పేకాట మొదలు పెట్టి, మధ్యలో ఏదో గొడవ జరిగి కానిస్టేబుల్ కృష్ణమోహన్ తో కొట్టుకునే వరకూ వస్తే – బిగ్‍బాస్ వెళ్ళి వాళ్లని చితకబాది వెనకనుంచే పంపించేశాడు. ఇలాంటి చెదురుముదురు సంఘటనలు మినహాయిస్తే మిగతా నాటకమంతా బాస్ అనుకున్నట్టే సాగింది.

రాత్రి ఒంటిగంట సమయంలో నాకు నిద్రొస్తుంటే బయల్దేరదామనిపించి భాస్కర్ కోసం చూశాను. మా వాడేమో ఒక వైపు సుందరి, మరో వైపు స్వీటీ తో మాంచి రసవత్తరంగా డ్యాన్స్ చేస్తున్నాడు. పోనీ ఇంత చేసిన ఆ కేరళ వాళ్లకైనా చెప్పేసి వెళ్దామనుకుంటే వాళ్లూ మన లోకంలో లేరు.

ఉదయం లేస్తే కృష్ణానగర్ లో ఎలాగూ చూడాల్సిన మొహాలే అయినా చెప్పి వెళ్తే డ్రామా కూడా రక్తి కట్టినట్టుంటుందనుకుని మహాలక్షి, విశ్వనాథం కోసం చూశాను. వాళ్లిద్దరూ ఎక్కడా కనిపించలేదు.

లంకంత కొంపలో వీళ్లని ఎక్కడ వెతకడంలే అనుకుని బయల్దేరబోతుంటే ఒక మూల చీకట్లో కూర్చున్న మహాలక్ష్మి కనిపించింది. ఎలాగూ చెప్పి వెళ్దామనుకున్నాను కదా అని ఆమె దగ్గరకు వెళ్లాక గానీ తెలియలేదు – పక్కనే చీకట్లో ఆమెకు చాలా దగ్గర్లో కూర్చుని ఉన్నాడు జడ్జి విశ్వనాథం. వాళ్లు నన్ను గమనించలేదు. ఇంత చీకట్లో కూర్చుని వీళ్లేం మాట్లాడుకుంటున్నారబ్బా అని నాకూ వినాలని అనిపించింది.

“మహాలక్ష్మీ, మూడు రోజుల్నుంచి నేనొక విషయం అడుగుదామనుకుంటున్నాను,” అని కొంచెం ఆగి, “నేనెవరో గుర్తొచ్చానా? నన్ను గుర్తు పట్టావా?” అన్నాడు విశ్వనాథం.

“గుర్తు పట్టాను విస్సూ,” అంది మహాలక్ష్మి.

ఇద్దరి మధ్యా కాసేఫు మౌనం.

“కానీ నువ్వు…హైదరాబాద్ లో ఉన్నావన్న విషయం నాకు తెలియదు,” అంది మహాలక్ష్మి.

“నాక్కూడా నువ్వు హైదరాబాద్ లో ఉన్నావన్న విషయం తెలియదు,” అన్నాడు విశ్వనాథం.

“ఇన్నాళ్ల తర్వాత నిన్ను మళ్లీ కలుస్తానని అనుకోలేదు విస్సూ,” అంది మహాలక్ష్మి.

“నిజమే లక్ష్మీ! ఇరవై ఏళ్లు దాటి పోయింది కదా మనం కలిసి.” అన్నాడు విశ్వనాథం.

“అవును. కమలకి ఈ నెలలో పందొమ్మిదేళ్లు వస్తాయి.”

“కమల వి అచ్చు నీ పోలికలే,” అన్నాడు విశ్వనాథం. “ఆ రోజుల్లో నువ్వు ఎంతందంగా ఉండేదానివో కమల అంతే అందంగా ఉంది.”

మహాలక్ష్మి సమాధానం చెప్పలేదు.

“అయినా నన్నెందుకు అలా వదిలేసి వెళ్లిపోయావు లక్ష్మీ. నీ కోసం నేను పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా?” అన్నాడు విశ్వనాథం బాధగా.

నాకు విషయమర్థమైంది. ఆ ముసలి లవ్‍బర్డ్స్ ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే అని నేనక్కడ్నుంచి బయల్దేరబోతుంటే భాస్కర్ ఎదురొచ్చాడు.

“రాంబాబూ ఏంటి సంగతులు? వెళ్లిపోతున్నావా,” అన్నాడు.

“అవును బాస్. రేపు షూటింగ్ ఉంది,” అని అక్కడ్నుంచి బయల్దేరాను.

ఆ తర్వాత ఒక వారం రోజులు రాజమండ్రిలో షూటింగ్ లో బిజీగా ఉండి, హైదరాబాద్ కి తిరిగొచ్చాక విషయం తెలిసింది. కమల ఆ కేరళ కుర్రాడిని పెళ్లి చేసుకోవడంతో పాటు, విశ్వనాథం కూడా మహాలక్ష్మి ని పెళ్లి చేసుకుని అందరూ తట్టా బుట్టా సర్దుకుని కేరళ వెళ్లిపోయారని. అంతేకాదు ఈ డ్రామా అంతా సెట్ చేసినందుకు భాస్కర్ కి మహాలక్ష్మి అక్షరాలా లక్ష రూపాయలు ఇచ్చిందట!

మొత్తానికి వంకర మహాలక్ష్మి కోసం ఆ రోజు ఫిల్మ్‌నగర్ వాసులు మొత్తం తరలివచ్చి ఆమె కథైనైతే సుఖాంతం చేశారు. కానీ, ఈ డ్రామాకి శుభం కార్డ్ వెయ్యడానికి కొన్ని రోజులు పట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇదంతా జరిగిన కొన్నాళ్ళకి మరోసారి కనకదుర్గా బార్ దగ్గర బిగ్‍బాస్ కి దొరికిపోయాను నేను. చేతిలో పెద్ద పేపర్ పట్టుకుని, దాన్నిండా ఏదో పెద్ద లిస్ట్ రాసుకుని రుసరుసలాడుతున్నాడు మా బాస్ ఆ రోజు.

“రాంబాబూ నువ్వేం చేస్తావో తెలియదు. ఆ రోజు వైట్‍హౌస్ కి పార్టీ కొచ్చిన వెధవనాయాళ్లందరి దగ్గరకెళ్లి, ఎవరెవరు ఏమేం పట్టుకెళ్లారో తెలుసుకుని అవన్నీ రెండు రోజుల్లో తిరిగి ఎక్కడివక్కడికి చేర్చకపోతే – కృష్ణానగర్ లో రక్తం ఏరులైపారుతుందని చెప్పు ఒక్కొక్కడికి,” అని నన్ను ఊరి మీదకి తరిమాడు. “అబ్బా! మళ్లీ దొరికిపోయాన్రా,” అనుకుంటూ నేనెళ్తుంటే “అసలా బీరువా….అంత పెద్ద బీరువా ఎలా ఎత్తుకెళ్లార్రా? ముందు అది ఈ రోజు రాత్రికే నా కళ్లముందుండాలి. లేదంటే ఒక్కొక్కరినీ పేగులు తీస్తానని చెప్పు,” అని కోపంగా వెళ్లిపోయాడు.

ఏం చేస్తాం. బిగ్‍బాస్ చెప్పాక తప్పుతుందా? మొత్తానికి మహాలక్ష్మి పిల్ల పెళ్లి నా చావుకొచ్చింది అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ అక్కడ్నుంచి బయల్దేరాను.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, అనువాదం, ఫిబ్రవరి, సినిమా వెనుక కథలు and tagged , , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.