cover

వేయివన్నెల కుంచె

Download PDF EPUB MOBI

ఎన్నియల్లో… ఎన్నియల్లో చందమామ అయ్యవారింటికి దారేదమ్మా చందమామ. ఆమడ దూరం ఉందోయమ్మ చందమామ… ఆమడదూరం ఉన్నాగానీ ఎల్లాలమ్మా… ఉయ్‌… ఎన్నియల్లో… ఎన్నియల్లో… చందమామ…

ఏడుకొండల్నీ దాటి, పాలాడబండ గుట్టల్ని దాటి, అంజేరమ్మ కోనల్ని దాటి, అడవిపూల వనంలో మేమిద్దరం వెళుతూవున్నాం. గడ్డి చాలా ఎత్తుగా పెరిగి ఉంది. అడుగు వేస్తుంటే సడి తెలయడమే లేదు. పాదం కింద మోపుతుంటే ఆ గరిక మీద తేమతో కొద్దిగా అడుగు జారుతా ఉంది. ఉరుకులు పరుగుల మీద వెళ్లాల్సిన ఈ సమయానికి అవి బంధం వేస్తూ వేగాన్ని నియంత్రిస్తూ ఉన్నాయి. గుండె మాత్రం దడదడ కొట్టుకుంటూ పరుగెడుతూనే ఉంది. ముందు ఉమాసార్‌ నడుస్తూ వున్నారు. నేను ఆయన వెనుకే. గడ్డిలో పోయే పాముల్లాగా మేము వేసుకొన్న ప్యాంట్లు సర్‌సర్‌ మంటూ శబ్దం చేస్తూ ఉన్నాయి.

“అదిగో వచ్చేశాం” అన్నాడు ఆర్‌.ఎం. ఉమా సార్‌. ఎదురుగా ఇటుక రంగు పూసిన గోడలతో ఒక పెద్ద కుటీరం. దాని మీద చుక్కల ముగ్గుల తోరణాలు… “అదిగో ఆ వెనుక ఉండేదే నది.. పారే శబ్దం కూడా వినపడుతోంది. బలే దోమలిక్కడ. ఇంతింత లావుంటాయి.” చూపుడు వేలు, బొటన వేలి మధ్యన దోమను పట్టుకున్నట్లుగా చూపిస్తూ చెప్పాడు. “అయినా కూడా అవేవీ లెక్క చేయడాయన.” చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడాయన.

“పనిలో పడితే అంతే కదా సార్‌” అన్నాను. “అందునా చేసేది ప్రతి సృష్టి” గుండె గొంతుకలో కొట్టుకుంటా ఉంది రెండు చెవులూ అదురుతున్నాయి. పది అడుగులూ పరుగులో కలిసిపోయాయి. తలుపు నెమ్మదిగా తెరిచాడు ఉమా సార్‌..

తెల్లని బనియన్‌తో నిండుగా నవ్వుతూ రమణగారు… ముళ్లపూడి వెంకటరమణ గారు.. తెల్లని జుబ్బాలో మల్లెపువ్వులాగా వెలుగుతూ గుంబనంగా నోటికి చేయి అడ్డం పెట్టుకుని బాపూ గారు… తలుపు తెరుచుకోకముందే నా చేతులు రెండూ జోడించినట్లున్నాను… గమనించి నవ్వుతున్నారిద్దరూ. గవాక్షం నుండి ఓ కాంతిపుంజం ధారలాగా వారిద్దరి మీద పడుతూ వారిని తాకి కొంతమేరకు పైకి లేస్తా ఉంది.

వెలుగులో ఉన్న బుద్ధజీవులు. వెలుగుకు వెలుగై ఉన్నారు. గది నిండా పరచుకుని ఉన్న పేపర్లు ఓపక్క, దొంతర్లు దొంతర్లుగా ఉన్న పుస్తకాలు ఓపక్క, అదీ వారి సంస్థానం. బాసింపట్టు వేసుకుని శ్రద్ధగా పని చేసుకుని అలసిపోతే, ఆ పేపర్లనూ, పుస్తకాలనూ కొంచెం అటూ ఇటూ జరిపి అక్కడే నిద్రపోతారట బాపు. ఇంతకు ముందు ఉమా సార్‌ ఛానల్‌ ఇంటర్వ్యూ కోసం వచ్చినపుడు చూసింది చెప్పారు. అల్లాగే ఉంది ఇప్పటి పరిస్థితి. అంత తక్కువ స్థలం నుండి కోటానుకోట్ల మంది తెలుగు వారి హృదయ సామ్రాజ్యాలను ఏలుతున్న సంస్కృతీ చక్రవర్తులు… సామాన్యంగా జీవిస్తూ తెలుగు లోగిళ్ల సింహాసనాలను అధిష్టించిన సార్వభౌములు… ‘చెప్పవోయి సంగతేంటి’ అన్నట్లు నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నారు. కూర్చోమని bapu kathaచూపిస్తున్న బాపు రమణలను కళ్లనిండా నిలుపుకుంటూ వారి ముందు కూర్చున్నాను. ‘‘సార్‌ మీ ‘కానుక’ కథ మరచిపోలేను సార్‌ తపస్సుకు మరోరూపం ఆ కథ కదా సార్‌ ’’ అని రమణగారితో అన్నాను. ‘‘అన్ని వేణువులు మ్రోగుతున్నట్లు, క్రిష్ణ భగవానుడు పాడుత్నుట్లు మీరు వేసిన బొమ్మ ఇంకా గొప్పగా ఉంది సార్‌’’ అని బాపుగారితో అన్నాను. ‘‘అదే అదే… ఇడ్లీ కంటే చట్నీ రుచి అన్నారు కదా…’’ రమణ గారు అన్నారు నవ్వుతూ… చట్నీ లేనిదే ఇడ్లీ లేదు ఇడ్లీ లేనిదే చట్నీకి విలువ లేదు అని చెపుతున్నట్లు రెండు చిరునవ్వులు నవ్వారు బాపు గారు. “సార్‌ ఇంకో మాట అడగనా సర్‌… ఆడపిల్లలకు బాపు బొమ్మ అనే పేరు ఎప్పట్నుంచి వచ్చింది సార్‌” అన్నాను నేను తమకంగా. “ఒరే! నువ్వు బలే చమత్కారంగా మాట్లాడుతున్నావురోయ్‌ ఎట్లాంటి ప్రశ్న వేశావురా” అన్నారు రమణగారు. “సార్‌ ఒక నవలా పరిచయం పుస్తకంలో డెబ్బయ్‌ దశకంలో వచ్చిన సీరియల్లకు మీరు వేసిన బొమ్మల కోసం పాఠకులు వారం వారం వేచి ఉండేవారట. ముఖ్యంగా విశాల నేత్రాలు సీరియల్‌కైతే మరీ మీ బొమ్మలు మహాద్భుతంగా ఉండేవంట. అప్పట్నుంచేనా సర్‌ ఆడపిల్లలకు ఆ పేరు వచ్చింది. ఆ బొమ్మల్ని చూడాలని ఉంది సర్‌ చూపిస్తారా?” ఆశగా అడిగాన్నేను. ఇన్ని లక్షల బొమ్మల్లో ఎక్కడని వెతకడం… అన్నట్లు చూసి ‘‘ఆ… అన్వర్‌ను అడగవయ్యా… ఆయన దగ్గర అన్ని బొమ్మలు ఫైల్‌ చేసి ఉంటాడు’’ అన్నారు బాపుగారు. “ఆయన్ను అడిగాను సార్‌ ఆయన కూడా చూస్తాను వెతకాలి అన్నారు. అందుకే మిమ్మల్ని అడిగేశాను.” ధైర్యంగా అన్నాను. “వెంకట్రావ్‌! ఆ పైన ర్యాక్‌లో ఉన్నాయోమో చూడు, నేను ఇక్కడ వెతుకుతాను” బాపు అన్నారు. రమణగారు లేచి ఆ పక్కన వెతుకుతుంటే బాపుగారు లేచి ఇంకో పక్కన వెతకడం మొదలుపెట్టారు. నేనేమో కింద పరచుకున్న బొమ్మలను ఒకదానినొకటిని చూస్తూ ఉండిపోయాను. ఉమాసార్‌ వారితో పాటే లేచి నుంచొని, నన్ను చేతితో భుజంపై తడుతూ లేవమన్నారు. అంత పెద్దవారు నిలబడి వుంటే మనం కూర్చోవడం ఏమిటి? అన్నట్లు. నేను బొమ్మలను చూస్తూ, మైమరచి ఉండిపోయాను. ఉమా సార్‌ కొంచెం గట్టిగానే చరిచి లేవమన్నారు… హుఫ్‌…

లేచేశాను… ఎదురుగా గౌతమ్‌… ఉమాసార్‌ లేడు. కల కరిగి మెలుకువలోకి వచ్చాను. ఎదురుగా వాడున్నాడు. బాపురమణలు… గుండెల్లోకి వెళ్లిపోయారు. ఇంకాసేపు ఉంటే బాపు బొమ్మల విశాల నేత్రాలు చూసేవాడిని. ప్చ్‌ ఎన్నాళ్లని వెతుకులాట…. బాపును చూడాలన్నది, ఆయనతో మాట్లాడాలన్నది… అబ్బో ఎంత గొప్ప కల. ఒకటి తీరింది. ఇంకొకటి తీరుతుంది…

‘‘నాణ్ణా లేయ్‌ లేయ్‌ అమ్మ కాఫీ చేస్తావుంది’’ అంటూ భుజం పట్టుకుని ఇంకా కదిలిస్తూ ఉన్నాడు గౌతముడు. బాపు గారిని చూశాను, మాట్లాడాను అన్న సంతోషంలో గుండె కొట్టుకుంటా ఉంది. లేచి వాడ్ని అట్టే ఎత్తుకుని వంటింట్లోకి నడిచాను. ‘‘వొరేయ్‌ కన్నా మీ తాతయ్య కల్లోకి వచ్చాడ్రోయ్‌ అన్నా వాడితో మురిపాలు పోతూ… వాడు నా చెవులతో ఆడుకుంటూ “మరే చెక్కిలాలు తెచ్చినాడా… నుగుంటలు, పప్పుబిళ్లలు ఏవీ” అని గెలివి చేసినాడు. ‘‘ఆ తాతకాదురా బొమ్మలతాత, రంగురంగుల బొమ్మలూ, దేవుళ్ల బొమ్మలూ వేసే బాపూ తాతయ్యరా’’ అంటూ… వంటింట్లోకి నడిచాను. నా అలికిడికి వంట పనిలో ఉన్న నా లక్ష్మి తలెత్తి చూసి “అయ్యవారు హుషారెక్కి ఉన్నారేంటి పొద్దున్నే…” అంటూ నవ్వుతూ పలుకరించింది. బాబును కిందకు దించాల్సిన అవసరం లేకుండానే సర్రున కిందకు జారి హాలులోకి పరుగెత్తాడు. కళ్లెగరేసిన మోములోకి నిశ్శబ్దంగా నవ్వుతూ చూసి “కలొచ్చిందోయ్‌ కల అద్భుతమైన కల” అన్నాను. “ఏంటో ఆ కల” అన్నట్లు రెండోసారి కళ్లెగరేసింది. అదేంటో ఈ రెండుజెళ్ల సీతాకోకచిలకలు కాస్తా వాలు జడల సత్యభామలై కంటి విల్లు ఎక్కుపెట్టి చూపుల్ని, ఒంటి విల్లు ఎక్కుపెట్టి తాపాల్ని బాణాలుగా చేసి విసురుతారా… కష్టంరా బాబు తట్టుకోవడం… ముద్దుల పెళ్లాం మనకు తెలియకుండానే మిస్టర్‌ పెళ్లాం అయిపోయుంటుంది, మినిస్టర్‌ పెళ్లాం కూడా అయిపోయుంటుంది.

‘‘మిస్టర్‌ పెళ్లామా బాపు గారిని చూసినట్లు, కలిసినట్లు కలొచ్చింది. మాట్లాడినట్లు కలొచ్చిందోయ్‌’’ అన్నాను. నా ఉబ్బులు, తబ్బులు చూసి తను ఓ రకంగా నవ్వుతూ కంగ్రాట్స్‌ అంది, చేతిలోని కత్తినిచూపుతూ… నేను చూపుడువేలు, బొటనవేలు కలిపి చాకుమొనను పట్టుకుని కొంచెం షేక్‌ చేసి ఆనక వదిలాను. “నిజంరా బాబూ నిజంగానే బుడుగు రాతల రమణ కొంటె బొమ్మల బాపు ఇద్దురూ ఒక్కసారిగా కల్లోకి ఝాటర్ ఢమాల్‌ అని దూకేశారు. నన్ను గిరగిరా తిప్పి రంగుల్లోకి గిరాటేశారు’’ అంటూ ఆమెను కొంచెం ఎత్తుకుని గిరాగిరా తిప్పాను. “ఓయ్‌ దింపరా బాబు దింపు నమ్ముతున్నాన్లే… అబ్బా నమ్మేశాన్లే దింపూ…” అంటూ కిలకిలా నవ్వింది. బెట్టు గెలిచాక దింపాను. తను నమ్మలేక కాదు.. జలసీ… నా కల్లోకొచ్చారని ఎంతో కుంచెం అసూయ… అంతే. “పదండి దంతధావనం కావించు, కాఫీ తీసుకొస్తా సేవించు…” అంది సినిమాటిగ్గా. “నువ్వు నన్ను సేవించుకుంటుంటే అలాగే సుమీ” అని నవ్వుతూ బయటపడ్డాను… ఉహూ నేను పడకముందే తను బయటకుతోసింది.

ప్రక్షాళన అయ్యాక సోఫాలో కూర్చొని వుంటే తను కాఫీ తీసుకొచ్చింది. అందుకున్నాను. తనూ కూర్చొంది. రెండో కప్పుతో… “నాణ్ణ ఈ సబ్‌ట్రాషన్‌ చెయ్యి నాణ్ణా” అంటూ వాడు బుడగోతముడు వచ్చాడు. నా గ్లాసులోకి తొంగి చూసి “ఎంట్నాణ్ణా కాఫీకి మసి అయ్యింది” అన్నాడు. నేను అవాక్కయ్యా. తనేమో పగలపడి నవ్వి కుదురుకొని ఈ ప్రక్క నుంచి ఇంకో చెంప పగులకొట్టింది. ‘‘ఈ మసి ఉమా అంకులు మన కాఫీకి పూసిన మసి. మీనాయనకు ఈ మసి లేనిదే కాఫీ దిగదు నాయనా’’ అంటూ కులికి రాగాలు తీసింది. “వొరే కాఫీ నురగపైన చిలకరించిన కాఫీ పొడిరా అది. మీ అయ్యిస్‌క్రీములపైన వేస్తే అవి స్టయిలు. టేస్టూనూ. మా కాఫీ మీద అయితే మసి అంటిందంటారా, లెక్క చెప్పను పోరా బడవకానా” అంటూ దగ్గరకు తీసుకున్నాను. “వీడికి ఈ మధ్య సెటైర్లు ఎక్కువైనట్లున్నాయి కదవే” అని అడిగింది మా ఆవిడ. ఆ…ఆ… ముళ్లపూడి వారసత్వం కదా అన్నా కాలరెగరేస్తూ. “వోయ్‌ ఆ పెద్దాయన ఝడుసుకుంటాడు ఇట్లాంటి మనవళ్లను చూసి. పోనిద్దురు ఆ లెక్క చెప్పి స్కూలు టైమైపోతోంది’’. అంటూ కాఫీలో పడిపోయింది. నేలెక్కల్ని నంజుకుంటూ కాఫీని త్రాగేశాను. నురగపైన అలంకరించిన ఉమా సార్‌ మార్కు కాఫీ పొడిని అప్పుడప్పుడూ నాలిక్కి తగిలించుకుంటూ. నే లెక్కని విప్పుతుంటే వాడు వేళ్లను ముడుచుకుంటూ తెరచుకుంటూ మీనవేషాల్ని లెక్కించే అపరపండితుడిలాగా ఫోజు కొడుతున్నాడు. “వొరేయ్‌ ఇక్కడ కాదురా తలలో ముడుచుకుని తీయాల్రా” అన్నానా వాడికి భలే కోపం వచ్చింది. “తలలో వేళ్లుఎక్కడ ఉంటాయి. ఆ మాత్రం తెలియదూ” అన్నాడు. ‘‘అది కూడా తెలియని వాడి దగ్గర నువ్వు లెక్కల్ని ఏమి నేర్చుకుంటావు కాని ఇలా రా కన్నా నే జెబుతా’’ అన్నది యశోదమ్మ. అంతే చిన్ని క్రిష్ణుడు ఒక్కసారి నా చేతిలో పలకను లాక్కొని నన్ను విసిరి అవతల పారేసి అమ్మ ఒడిలో చేరి గారాలుపోయాడు. “ఔరా ఇంత కుట్ర పన్నుతారా నన్ను ఇన్సల్ట్‌ చేస్తారా ఛట్‌” అంటూ సోఫాలో ముడుచుకు కూర్చున్నాను. ‘‘చాల్లెండి మీ అవతారం పిల్లాడు ఝడుసుకుంటాడు’’ అనేసి వాడి వేళ్లను ఆమె వేళ్లను కలిపి ఇరవైగా చూపి ఇవీ అవీ మడిచి అందులోంచి దీన్ని తీసివేసి లెక్క గబగబా చెప్పేసింది. “నాణ్ణా అమ్మ దగ్గర లెక్కల్ని నేర్చుకోండి మరి” అంటూ రివ్వున వెళ్లిపోయాడు. గట్టిగా తగిలిన టెంక జెల్లని గుండెలో దాచుకుని “చూసావటే వీడికి ఎంత టెక్కు అంతా మేనమామ పోలికే కదూ” అన్నాను. గుర్రు గుర్రుగా చూస్తూ ‘‘మీ నాటకాలు వెటకారాలు ఇంకాపండి. కలేదో వచ్చిందన్నారుగా చెప్పండి ఏమొచ్చిందో’’ ఆమె అడిగింది. అంతే కల మళ్లీ కళ్ల ముందు కదలాడిరది. నే చెపుతుంటే నా ముఖంలోని వెలుగు ఆమె కళ్లల్లో కనపడింది. ‘‘కల ఇంకొంచెం పెద్దగా వచ్చి వుంటే బాగుండేది కదా’’ ‘‘ఊ… నాకూ అదే అనిపించింది. గోరంత దీపం కొండంత వెలుగంట కదా! అలాగే కల కనేస్తూ పోయి ఉంటే కోరిక తీరిపోయేదేమోనని బాపూగారే కత్తిరించేసుంటారు’’. ‘‘ఆ… ఆ… ఉండొచ్చు ఈయన గారి ఒక్క ప్రశ్నకే అంత గాబరా పడిపోయి బొమ్మల్ని వెతికారంటే ఇంకాసేపు ఉండి ఉంటే ఇంకెన్ని ప్రశ్నలేసి హింసించే వారో కదా’’ ‘‘పిచ్చి మొద్దు ఆయన అలా అనుకోరు. ఆ బొమ్మలు, ఆ రంగులూ ఏ జన్మల పుణ్యమో మనకు ఏడు జన్మలకూ సరిపడా తత్వాన్ని బొమ్మల ప్రసాదంగా పంచిచ్చాడు. ఇక సినిమాలకొచ్చామా సన్నివేశాల్ని, పాత్రల్ని స్టూడియోల నుండి బయటకు తీసుకొచ్చేశాడు. ఇక ఆయన పాటల్లోని సంగీతం, ఆయన రాయించిపెట్టిన పాటల సాహిత్యం, ఎంత చెప్పుకున్నా తక్కువే కదే’’ అన్నాను. ‘‘ఎంత చెబుతావో చెప్పు చూద్దాం’’ అంది శ్రీమతి నా తన్మయాన్ని ఆస్వాదిస్తూ… నవ్వాన్నేను. “తెలుగింటి ముంగిలిని తెలుగింటి లోగిలిని తెలుగింటి పెరడును ఆయన చిత్రాలు, ఆయన భావాలు లేకుండా ఊహించగలవేమో నువ్వు చెప్పు’’ అన్నాను. ‘‘తెలుసులేవోయ్‌ నువ్వు చెబితే విందామని ఆశపడ్డాన్లే’’ “అమ్మా! నే చెబితే ఆ తరువాత ఆ డైలాగుల్ని పట్టుకుని తరతరాలు యుగాలు వాటిని రిపీట్‌ చేస్తూ నన్ను రాపాడించేదానికి కదూ?’’ అన్నా ‘‘మడిసన్నాక కూసింత కళాపోషణుండాలంట మొన్న వాట్సప్‌లో మా సునీత అనిందిలే’’. ‘‘అవరా… అవరా… ఇది మా బాపూ గారి రమణగారి, రావూ గోపాల్‌రావూ గారి డవలాగు ఇది మీ సునీతదా? హవ్వ హవ్వ’’ నేను ఆశ్చర్యాన్ని అభినయించే లోపు ‘‘తెలుసులేవోయ్‌ మాకూ ఆ సంగతి, వేడయ్యే కొద్దీ మీ బుర్ర కుక్కర్‌కంటే ఎక్కువ విసిల్స్‌ వేస్తుంది కదా, అవి విందామని’’ సెటైర్‌ వేసింది. ఈలోపు నిజంగానే విజిల్‌ వేస్తూ పాప హాల్‌లోకి వచ్చింది. రెడీ అయ్యాను… టిఫిన్‌ పెట్టమని ఆర్డర్‌ ఆ విజిల్‌. పాట విజిలింగ్‌లో పాడుకుంటే వచ్చింది. “హమ్‌ తేరే బిన్‌ కహీ రహే నహీ సక్తే… తేరే బినా…” అంటూ. “చూడీపిల్ల గిటార్‌ క్లాసులకు వెళ్లి హిందీ రొమాన్స్‌ను మోసుకొచ్చేసింది” అంటూ దుఃఖం నటించేసింది శ్రీమతి. “పర్లేదు లేవే ముందు పాటని ప్రేమించనీ, ఆ తర్వాత భావం వెతుక్కుంటారు. ఆ తర్వాతర్వాత భావ గాఢత కోసం తెలుగు సాహిత్యంలోకి నెమ్మది నమ్మెదిగా వచ్చేస్తారు. ముంగిట వేసిన ముగ్గులుచూడు ఓలచ్చా గుమ్మాడి అంటూ వచ్చే సంక్రాంతికే ఇంట్లో పాటలు మొదలవుతాయి చూడు. పద టిఫిన్‌ పెట్టి సాగనంపుదాం. రామ్మా సిగాన సాహితీ పెసూనాంబా రా” అంటూ లేచా. “డాడ్‌ హు ఈజ్‌ద సిగానా..” అనడిగింది మా షార్పీ. రామ్మా చెపుతానంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు తీసుకెళ్లా ఆరవ తరగతి పాపకు ఒకటొకటి అర్థమయేలా చెప్పుకుంటూ… సాహితి వింటూ వచ్చింది. ఈలోపు గౌతముడు కూడా టిఫిన్‌ కోసం టేబుల్‌ దగ్గరకు వచ్చాడు. నా ప్రవాహం పొంగింది. “అనగనగా ఓ ఊళ్లో ఓ బొమ్మ పుట్టింది రా. ఆ బొమ్మ ఎన్నెన్నో రంగుల్ని తీసుకొచ్చింది. ఎన్నెన్నో పండుగల్ని మోసుకొచ్చింది. ఆ బొమ్మకు ఎన్నో విద్యలు తెలుసు. మురిపెంగా జడలు వేసుకొచ్చేది, వడివడిగా అడుగులేసేది. అన్ని పాటలు పాడేది. అన్ని రకాల నాట్యాలు చేసేది. ఒకరా ఇద్దరా ముక్కోటి దేవుళ్ల కథలు వివరించి చెప్పింది. నవ్వించేది, కవ్వించేది. వ్యంగ్యమైన బాణాల్ని వేసేది” “అన్ని పనులు చేసేదా నాన్న” అన్నారు ఇద్దరూ. “అవున్రా” నా గొంతులో వడి నాకందకుండా సాగిపోయింది. “ఆ బొమ్మ రమ్యంగా కుటీరాన రంగువల్లులల్లింది… దీనురాలి ఇంటిలోన దీపంలాగా వెలిగింది… శూన్యమైన వేణువులో ఒక స్వరంలా నిలిచింది. ఆకురాలే అడవికి ఒక ఆమనిని తెచ్చిచ్చింది. నిదురించే తోటలోకి పాటలాగా వచ్చింది. కళ్లల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది…’’ ‘‘ఓయ్‌.. ఓయ్‌ రాముడూ ఏంటి అంత ఎమోషనల్‌గా ‘శేషేంద్రగారి’ పొయిట్రీ పిల్లలు కంగారు పడతార్రా బడుద్దాయ్‌… ఎప్పుడొచ్చిందో నా వాలుజడ నా కళ్లలోని తడిని, గుండెల్లో పొంగే సంతోషాన్ని పంచుకుంటూ … ‘‘ఏవండి మనమొకసారి చెన్నయ్‌ వెళ్లి బాపుగారిని చూసొద్దామండి’’ అంది గరిట పట్టుకుని ఆశీర్వదిస్తూ. ఆ సోయగాల విందులకు వేయి కనులు కావాలి… వేయి వన్నెలు చిత్రించేందుకు మాత్రం ఒక్క కుంచె వుంటే చాలు. అవును బాపుగారి కుంచె కావాలి… జారు ముడిని జడకేసి… జానకిలా అడుగేసి.. తన అందియ నా గుండియ ఘల్లు రaల్లు మంటుంటే నా సతిలా ఆరతిలా కళ్యాణపు హారతిలా శుక్రవారపు సంధ్యవేళ సుదతి అలా నిలుచుంటే ఆ సొగసు చూడతరమా…ఆ బాపు కుంచె చూడతరమే. ‘‘వెళ్దాము డియర్‌ బాపు గారిని చూడాల్సిందే. తప్పక వెళ్దాము’’. ‘‘ఎవరు నాన్నా ఆ బాపు… ఇందాకా నువు చెబుతున్న బొమ్మేనా ఆ బాపు’’ అన్నారు పిల్లలు. నా సిగాన సాహితిని, బుడుగోతముని పట్టుకుని అవున్రా నాన్నలూ ఆ బొమ్మే బాపూబొమ్మ… అన్నాను.

2

అందమైన ఉదయం సముద్రపు తీరపు సరుగుడు తోపుల గాలి ఆహ్లాదంగా వీస్తోంది.

‘‘ఇదేనంటోయ్‌ పాండవుల గుహ… బాగుంది కదే..’’

“ఒరేయ్‌ పిచ్చోడా ఇండియాలో సీతమ్మ స్నానం చేయని వాగులూ, పాండవులు నివసించని గుహలూ ఉన్నాయంటావా?”

నా అర్ధాంగి తర్కించింది. ‘‘ఒసేయ్‌… అందులో భారతీయ తత్వం మాత్రమే చూడాలే నీవు’’

“అబ్బో అయ్యగారికి ఫిలాసఫీ ఫీట్లు కూడా తెలుసేం… ఒరేయ్‌ గోతముడూ పడతావ్‌రా జారి… ఇలారా నాన్న..”

ఓ పక్క నా దుంపను తెంచుతూ… అదిలిస్తూ, మరో పక్క వాణ్ని గోము చేసి లాలించుతూ.. ఇలా ప్రతి ఇల్లాలూ శతావధాని కంటే ఓ రెండు పద్యాలు ఎక్కువే చదివేసి ఉంటుందేమో…?

‘‘అదికాదురా రామున్ని, కృష్ణున్ని ఇంతలా గుండెకెత్తుకున్నారు కాబట్టే.. ఇన్నేసి పేర్లు ఇన్నేసి గుడులూ… అన్నింటా అంటున్న’’ అన్నాన్నేను. ఓ క్షణం ఓరకంట చూసి “భళిరా బడుద్దాయి అదా నీ ఫీల్‌… నచ్చినావ్‌ ఫో…’’ అంటూ నన్ను మెచ్చుకుని బాబు దగ్గరికి పరుగెత్తింది.

ఉదయం కారు దిగుతూనే … “మహాబలిపురం… మహాబలిపురం… మహాబలిపురం… కట్టించారు దీనిని పల్లవరాజు… ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు…” అని పాడుకుంటూ ఓ పిల్లావాడు ఎదురొస్తాడేమోనని అనిపించింది. ఊపురు బుడ్డలూ… చిన్ని చిన్న పిల్లన గ్రోవులు.. బుల్లి బుల్లి ఢమరుకాలూ… రంగురంగుల కాగితాలతో గిర్రున తిరిగే గాలిమరలూ.. అన్నీ మాయమైపోయి, చైనా బొమ్మలూ, ప్లాస్టిక్‌ బంతులూ వచ్చేశాయి.. ‘మనగలిగినది మనకాలానికి నిలబడగలిగినదీ… ఎంత పొమ్మన్నా పోదు… మరణించిన అవ్వ నగలు మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు’ అన్న బాలగంగాధరుడు వీటినెట్లా సమర్థిస్తాడో కనపడితే అడగాలి.

తోడల్లుడు సీతారాం దూరంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్కాచెల్లెల్లిద్దరూ పిల్లల్ని హుషారు చేస్తూ… ఆడించుకుంటూ ఉన్నారు. నా చేతికేమో వీడియో కెమెరా వచ్చి చేరింది. చుట్టూ ఉన్న దృశ్యాలను ఒక్కొక్కటిగా నిక్షిప్తీకరిస్తున్నా… బాపుగారు కూడా దాదాపు నా వయస్సులోనే ఇక్కడ తిరుగుతూ సిగార్‌ నోటిలో పెట్టుకుని ఇవే దృశ్యాలను ఆయన పాత్రలతో ఆలోచనలను కలిపి కావ్యాలుగా నిక్షిప్తం చేశారు. ఇలా అనుకోగానే… నా ఛాతీ కొంచెం పెరిగింది. ఎట్లా తెలిసిపోతాయో… ఈ ఆడాళ్లకు… మనలోని చిన్ని చిన్ని మార్పుల్ని కూడా ఇట్లే ఒడిసిపట్టుకుని వడిసెలతో గురి చూసి కొట్టేస్తారు..

“ఓయ్‌.. ఏంటీ సంగతీ… మరీ అంతలా ఉబ్బుతున్నావేంట్రా… పక్కటెముకలు విరిగిపోగలవు. జాగ్రత్త స్మీ…” అంటూ దగ్గరికొచ్చేసింది లక్ష్మీ. చెప్పేందుకు కుంచెం సిగ్గుపడి ‘‘మరేంలేదురా.. కెమెరా ఎక్కుపెట్టానా… బాపూగారు గుర్తుకొచ్చేశారు… అంతే. నువ్విలా వచ్చి గాల్తీశావు…’’

“అబ్బో! వచ్చాడండీ భక్త శబరుడు… సాయంత్రందాకా ఆగలేవూ… ఎలాగూ ఎళ్తున్నాంగదా బాపూ దగ్గరికి… అస్తమానమూ ఆయన జపమేనా, రంభ ఊర్వశులొచ్చి తపస్సు భంగం చేయగల్రు… జాగర్తరోయ్‌’’.

‘‘ఛ్ఛా… పోరా వాళ్లన్జూసి చలించేదానికి వాళ్లేమైనా బాపూ బొమ్మలట్రా… వెధవకానా.. అయినా అయ్యోరికోసం తపస్సు ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు ఏ అప్సరాంగనలు ఆపలేరు. నువ్వుకూడానూ…’’ అంటూ కెమెరా ఆమెకు గురిపెట్టాను. పెద్దకళ్ల లక్ష్మి వాటిని మరింత పెద్దగా చేసి కెమెరాకు ఓలుక్కిచ్చి కులికింది.

“ఇంకోటి తీసుకోరా… వెనుకవున్న శిల్పాల్లో కల్సిపోతాను…’’ అంటూ.. చేత్తో చీరంచు పట్టుకుని పైట చూపుతూ ఇంకో కులుకు కులికింది. శిల్పాల్లో కలసిపోలేదు కానీ వాటికంటే అందంగానే మెరిసింది. భంగిమలయ్యాక బాణంలాంటి మాట ఒక్కటేసింది. “ఎందుకురా మీ ఇంట్లో అందరూ ఆయనకు వీరాభిమానులుగా నటించేస్తుంటారు.”

‘‘ఒసేయ్‌ కళ్లుపోతాయే… భక్తుల్ని అభిమానులన్నందుకు, ఇది మరచెంబుల కాలమైంటే బాగుండేదే… మాడు పగులగొట్టేవాణ్ణి…” అంటూ వాటర్‌ బాటిల్ని ఆమె పైకి విసిరాను అందుకునేంత తక్కువ వేగంతో. సముద్రం పక్కనే కాబట్టి చమటలు కారుతూ, ఆరుతూ ఉన్నాయి. ఆమె అందుకుని “థ్యాంక్స్‌రా” అంటూ గుటా గుటా నీరు తాగేసింది.

‘‘ఆ… ఇపుడు చెప్పు మీ వీరనాగన్న కుమార బాపూ బాలభక్త సంఘం గురించి’’ అని అడిగింది.

నేనూ నాటకీయంగా .. గొంతు సవరించుకుంటూంటే ఆమె ఇంకా నాటకీయంగా అదిరిపడి

“నాయనా వ్యాసం మొదలు పెట్టేస్తావా ఏంటి” అంది. నేను బుంగమూతి పెట్టాను. మరదలు తోడల్లుడూ దూరంగా ఉండటంతో, కొత్త ప్రదేశం ఇచ్చిన కొత్త ఉత్సాహం మా ఇద్దరిలోనూ ఈ వెధవ్వేషాలు వేయిస్తా ఉంది. ‘‘చెప్పు చెప్పురా ప్లీజ్‌’’ అంది నిజంగానే అడుక్కుంటూ. దాంతో నా బెట్టు కొంచెం తగ్గించి నిఝంగానే వ్యాసం మొదలెట్టాను.

‘‘ఏం లేదురా ఆ కాలంలో నాన్నగారు దినపత్రికలు, వారపత్రికలు ఇంటికి కచ్చితంగా తెప్పించేవారు. వాటిలో పరిచయమైన బాపు మమ్మల్ని ఇంట్లో నుంచి గ్రంథాలయందాకా తీసుకెళ్లారు. అక్కడే బుడుగును పరిచయం చేశారు. ఇక అంతే… అన్నదమ్ములమందరం బడి వదిలితే చాలు… అక్కడే మకాం వేసేసేవాళ్లం. డెబ్బై దశకంలోనే నేను బాపూ గారి ఎగ్జిబిషన్ను చూసే వరాన్ని ఆ లైబ్రరీలోనే పొందాను. ఎన్నో రకాల కార్టూన్లు… ‘రాజూ పేద’, ‘గోరంత దీపం’ లాంటి బొమ్మల కథలు… అబ్బో… ఆయన చిత్రాలకు మా ఊరు పటం కట్టేసింది.. నాడాల నిక్కర్లు.. వెనక చినిగి ఉంటే… వాటిని కప్పుకుంటూ… ఒకరి వెనకాల ఒకరు నిలబడి సిగ్గుపడుతూ ఆ ప్రదర్శన చూసిన రోజులు కళ్ల ముందు ఇప్పటికీ కదులుతూనే ఉన్నాయి. మురళన్న మా జట్టునాయకుడు, వేణన్న, నేనూ, జన, మధుగాడూ… అందరం ఆ బొమ్మల్లో అప్పట్నుంచే పడిపోయాము. ఐదు పైసలు, ఐదు పైసలు కూడబెట్టుకుని వాటర్‌ కలర్‌ బాక్సు కొన్నాం. ఒకరి మీద ఒకరు పోటీలతో బొమ్మలు వేసేవాళ్లం. నీళ్లల్లో తామరపువ్వు, కొండల్లో సూర్యోదయం… వెన్నదొంగ కృష్ణుడి బొమ్మలు మేం వేసుకుంటుంటే… మురళన్నేమో టార్జాన్‌బొమ్మలు, బుద్ధుడి తల, మొహంజదారో ఎద్దు బొమ్మలతో మొదలెట్టి రాకాసి బల్లుల బొమ్మలన్నింటినీ వేసి ఓ పెద్ద ఆల్బమ్‌ చేశాడు. అక్కడితో ఆగకుండా బాపూస్ఫూర్తితో ఇంటర్‌లోనే కార్టూన్లు కూడా వేసేవాడు. మొన్నటికి మొన్న భాషా బ్రహ్మోత్సవాల్లో మురళన్న టీం అందరమూ బాపూ బొమ్మల కొలువును మళ్లీ చూస్తుంటే.. కాలచక్రం బాపూ ఇరుసు మీద గిర్రున తిరిగినట్లనిపించిందిరా…’’ అంటూ ముగించాను. తనేమో రెప్పవేయకుండా అలాగే వింది.

వెంటనే ఈ లోకంలోకొచ్చి ‘‘మీరందరూ డాక్టర్లమయ్యింది కూడా ఆయన పుణ్యమే అనేస్తావా… ఏంటి.’’ అని అల్లరిగా అడిగింది.

‘‘ఔన్రోయ్‌ నిజమే… బాపూ బొమ్మల్ని ప్రేమించాక సైన్స్‌ పాఠంలో వచ్చే బొమ్మలన్నింటిని అచ్చు గుద్దినట్లు వేసేవాళ్లమా… అట్లా బాటనీ, జువాలజీ బొమ్మల్ని అలవోకగా వేసుకుంటూ ఇష్టంగా అనాటమీలోకి వచ్చేశామంటే… ఆయన చలవే..” నా కళ్లు విప్పారినట్లున్నాయి. వాటిన్జూసి ఆమె రెప్పల్ని టపటపా కొట్టి, వెక్కిరించి “ఒరే బంగారూ.. ఈ మాట మీ అమ్మక్కూడ చెప్పు. నా కడుపు పంట అట్లాంటిదీ ఇట్లాంటిదీ అని ఒక్కటే గొప్పలుబోవడం ఆపుతుంది” అక్కసు నటిస్తూ అంది.

‘‘మాయమ్మ ఈ మాట నీతో కూడా అనేసిందా…’’ హాశ్చర్యపోయాను.. “కష్టాలలో నలిగిన మట్టిమనుషులు మా అమ్మతరం వారు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ వుంటారు, అంతేకానీ గొప్పలు చెప్పుకోవడం కాదురా. నాయన పుణ్యమాని టౌనులోకొచ్చినా… పండుగలకు పబ్బాలకు పల్లెకెళ్తే ఒక్క క్షణం కూడా తీరికలేకుండా అన్ని పనులూ చేసేది. చుట్టిళ్లు మొదలు ముంగిలి, నడవ, ఎదుటకొట్టం, జాలాడీ అన్నింటినీ ఆమె స్వయంగా పేడతో అలికేది. అన్ని అరుగులకూ పేడ అలికాక, ఎర్రమన్ను పూసేది. మాయమ్మ ఆ పనులన్నీ చేస్తుంటే… మాకెంతో కులాసాగా ఉండేది. ‘ఆరనైదోతనము ఏ చేతనుండు… అరుగులలికేవారు అరచేతనుండు’ అంటూ పనయ్యేంత వరకు పాడుకుంటూ ఆమెచుట్టూ తిరిగేవాళ్లం.”

‘‘బాబోయ్‌… నీ పాటలపిచ్చి పెళ్లైన మొదటిరాత్రి తెలిసిందిలే… ఆ ముత్యాలముగ్గు పాటపాడుతూ ఉంటే సిగ్గుతో చచ్చిపోయాన్రా బాబూ… మీ ఇంట్లో అన్నదమ్ములందరూ పెళ్లికూతుళ్లను ఈ పాటుచ్చుకుని అదరగొట్టినట్లున్నారు. ఝడిపించి ఉంటారుగదరా అందర్నీ’’. ‘‘నిజమే మరి తెలుగోళ్ల జాతీయ తొలిరేయి గీతమది. కళ్లముందు గోదాట్లో నవదంపతులున్న, తెరచాపెత్తిన పడవ ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు’ అన్న పాటలా కదిలిపోయింది.

‘లాహిరి… లాహిరి… లాహిరిలో.. పాటలో లాగా… మేమందరమూ మా శ్రీమతులతో గోదారిలో బాపూ పాటతో ప్రయాణం చేసిన వాళ్లమే.

‘‘ఔనే మరి తడివాసన లేని స్వర్ణముఖి తీరపుటమ్మాయిని రాత్రికి రాత్రే గోదావరి అలలపై పడవ ప్రయాణం చేయించానంటే… ఆ పాట గొప్పతనమే కదా. నాడేమో ఆస్వాదించిన ఆ కల కూజితం… ఈనాడు ఈ మమ్మల్లాపురపు శిలాబాలికయైపోయినదా.. ఆకటా!’’ అన్నాను దుఃఖ భంగిమతో.

‘‘ఒరేయ్‌ మళ్లీ హీటైపోయి నీ కపాల కుక్కర్‌ విజిలేయడం.. బాగుందిరోయ్‌…’’ అంటూ ఠపీమని తలపైన కుక్కర్‌ విజిల్‌ను అణుస్తున్నట్లుగా జల్లొకటిచ్చింది.

“భయ్యా… ఫైటింగులాపి ఆ వెన్నముద్దగుండు దగ్గరకెళ్దాం పదండీ” అంటూ సీతారాం దగ్గర కొచ్చేశాడు. పిల్లలు ఆయన వెనుకనే గుండువైపుగా పరుగులు తీసేశారు. ఆగండ్రా అంటూ ఆ వెనకే మా ఉరుకుల నడక.

“ఏం భయ్యా… ఛానలేమైనా దొరికిందా…” అన్నాననతనితో.. “చూస్తున్నా భయ్యా! లంకేషనే ఫ్రెండుకు తెలుగు సినిమా వాళ్లతో బాగా పరిచయాలు, ఆయన కూడా డాక్టరే. డ్రమ్మర్‌ కూడా… కొంచెం ఈ టింజ్‌ ఉన్నోడేలే.. ఎలాగోలా క్యాచ్‌ చేస్తాడు.. వర్కప్‌ చేస్తున్నాడు. డోంట్‌వర్రీ…’’ అంటూ నవ్వుతూ గుండు దగ్గరికి వెళ్లిపోయాడు.

అంతే ఆ మాటకు అక్కడున్న పంచరథాలు నన్నెక్కించుకుని ఊరేగించేశాయి.

“ఒరే భడవకానా! బాపూగారిని చూపించినందుకు ఈయనకు మనం పార్టీ ఇవ్వాల్రోయ్‌” అంది లక్ష్మి నన్ను రథాల నుంచి దించుతూ.

“ఓ యస్‌… సాయంత్రం బాపూగారిని దర్శించుకుంటామా! అయనేమో ఓ గంటో… రెండు గంటలో… ముప్ఫై గంటలో మనల్ని ఉండనిస్తాడా అట్నుంచి హోటేలుకెళ్లి పార్టీ చేసేసుకుందాం” అన్నాన్నేను ఉత్సాహపడుతూ. ఆ సంబరంలోనే మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోకి వెళ్లిపోయాము. ఏడు పగడాల్లో మిగిలున్న షోర్‌ టెంపుల్‌ అనే పగడాన్ని చూసుకుంటూ ఆ అబ్బురంతో సముద్రతీరం చేరుకున్నాం.

సాయంత్రపు ఘడియలు గడుస్తుండే కొద్ది నాలోని ఉత్సాహం కాస్తా ఆదుర్దాగా మారిపోయింది, అదీ గమనించేసింది లక్ష్మి. ‘‘కుంచెం ఓర్చుకోవోయ్‌. తప్పక లింకు దొరుకుతుంది. నీ తపస్సు ఫలిస్తుంది’’ అంది అలలతో పిల్లలతో ఆడుకుంటూ. ‘‘ఆఁ.. ఆఁ… దొరుకుతుంది. దొరికి తీరాలి…’’ అంటూ పిల్లల్ని నీటిలో ఆడిస్తూ ఆడుకుంటూ ఉన్నా మనసులో ఏదో కొరత పెరుగుతూ ఉంది. కాలం కరుగుతూ ఉంది. వెలుగు తరుగుతూ ఉంది. అప్పుడప్పుడూ ఒడ్డుపైకెళ్లి గట్టున ఉన్న బట్టలోంచి ఫోన్‌ తీసి సీతారాముడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఐదూ… పది నిమిషాలకోసారి ఆయన అలా వెళ్లొస్తూనే ఉన్నారు. అలా వెళ్లొచ్చిన ప్రతిసారీ అలా ఎగుస్తూ ఉంది. ఆకాశం, అందలేదని తెలిసి నిరాశగా విరుచుకు పడుతూనే ఉంది. కాలం అలలతో పోటీ పడలేక సెలవని వెళ్లిపోతూ ఉంది. నాలో నిరాశ చీకటి కొండలా పెరుగుతా ఉంది. ఈసారి మొహం వేలాడేసుకుంటూ సీతారాముడు నా దగ్గరకొచ్చి గుండెల్లో గునపాల్ని దింపేశాడు.

“సారీభయ్యా! ఈసారికి.. మాఫ్రెండుకు లింకు దొరకటం లేదు. వెరీ వెరీ సారీ! త్వరలోనే మళ్లీ ఆరేంజ్‌ చేయిస్తాను. ఇంకోసారి వద్దురుగానీ,” అంటూ ముభావంగా వెళ్లిపోయారు. సముద్రం ఈ సారి కళ్లల్లో పొంగింది. నురగంచు పంచతో సముద్రుడు నా కళ్లు తుడవాలనుకున్నాడేమో… ఊఁ..హూఁ సముద్ర నీటి ఉప్పుకంటే, కంటనీరే ఉప్పగా తగులుతా ఉంది. ఘాడత పెరిగి లోపల సంద్రాలు ఉప్పొంగుతున్నాయి.

లక్ష్మి నా దగ్గరకు ఆత్రంగా వచ్చి “ఏరా! ఏమన్నాడు. కాయా! పండా!” నా కళ్లల్లో ఆరిన వెలుగును చూసి విషయం అర్థమై మళ్లీ మళ్లీ అడిగింది. సమాధానం చెప్పలేక పిల్లలతో పాటు ఒడ్డుకు నడిచాను. “ఒరే! దిగాలు పడకురా! ఇంకోసారి నువ్వొక్కడివే వచ్చి చూద్దువులే గానీ” నాతోనే నడుస్తూ అనింది లక్ష్మి. కన్నీటి తెరలో షోర్‌ టెంపుల్‌ కనబడట్లేదు. చివరి పగడం కూడా నీటిలో కరిగిపోయినట్లైంది.

‘‘ఎంత తెమిలించుకుని, ఎంత ఆశగా వచ్చామే, చూడు.. ఇపుడెట్లా అయిందో…’’ అన్నా. అంతకంటే మాటలు పెగలటం లేదు. పిల్లల ఒళ్లు తుడుస్తూ, బట్టలు వేస్తూ మౌనంగా ఉండిపోయింది ఆమె. నా గుండెల్లో ఏదో చేరి, నన్ను, నన్నుగాకుండా చేస్తా ఉంది. గబగబా బట్టలు వేసుకుని విసురుగా కారువద్దకు బయలుదేరి వెళ్లాను. పరుగు పరుగున వచ్చింది లక్ష్మి, ఆయాసపడుతూ “ఒరే ఆగరా” అంటూ. తను నన్ను చేసేసరికి మమ్మల్ని దాటి పిల్లలు ఇసుకలో పరుగులపోటీ పెట్టుకున్నట్లు దూసుకుపోయారు. వెనుక సముద్రుడి ఘోష నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. స్మృతి కిణాంకాలను జ్ఞాపకాల అలలు తాకివాటిని మించిన శబ్దాన్ని చేస్తున్నాయి. “ఒరేయ్‌! పెద్దగా ఫీలై పోతున్నావా పిచ్చోడా” ఇపుడేం మించిపోయిందని? నా చేయి పట్టుకుని అడుగుతా ఉంది. నా దుఃఖం మౌనమై భావాలను మింగేస్తూ. మనసుని మూగను చేసేసింది. మాట మనసుని దాటలేకున్నా… స్పర్శ గాఢంగా సంభాషిస్తావుంది.

3

మిట్టమధ్యాహ్నం… నేను ముర్లెన్నా జనా ముగ్గురం ఓ పెద్ద కాంప్లెక్సులో ఉన్నాం. లోపలెక్కడా సూర్య కిరణాల జాడ లేకుండా చీకటి చేసేసి ఆ తర్వాత కళ్లను మాయ చేసేలా ఎక్కడికక్కడ రంగురంగుల దీపాలను వెలించారు. ఆ వెలుగులో ఒక్కో అడుగు వేసుకుంటూ ఆ మాయాబజార్లను చూసుకుంటూ… ఇంకో కాంప్లెక్సులోకి వచ్చాం. లోపలి నుంచి తెల్లటి వెలుగు వస్తా ఉంది. పెద్ద నడవ వెంబడి గోడకు దారికి మధ్యలో స్టీల్‌ రైలింగ్‌ ఉందక్కడ. గోడ వైపు చూస్తే… ఓహ్ బాపుగారి బొమ్మలు… మొట్టమొదటే శ్రీరామ పట్టాభిషేకం… ముర్లెన్నా కనిపెట్టేశాడు, చూడురా ఈ వెలుగంతా ఈ బాపు బొమ్మ నుంచే వస్తా ఉంది, చూడు చూడు అన్నాడు. అవునన్నా అన్నాను. అన్న చెబితే అంతే. మంచి పరిశీలకుడు. గుడ్డిగా ఫాలోఅయిపోవడమే మాకు తెలిసింది. అడుగు ముందుకు వస్తే మరో బొమ్మ, శ్రీనివాసుడు దశావతరాలను కలుపుకుని ఒక విరాట్‌ రూపంలో. ఇంకో బొమ్మ గంగావతరణం. మురళన్న మమ్మల్ని ఆపేశాడు ‘‘ఒరే మణి ఈ బొమ్మ గొప్పగా వేయడమే కాదు, ఈ గ్రాఫిక్సే లేనపుడు దృశ్యంగా కూడా బాపూగారు గొప్పగా తీశాడురా. అవున్నా. నిజిమే. మాక్కూడా గుర్తుకొచ్చింది. ప్రక్కన ఆశ్చర్యం ముత్యాల ముగ్గు వాల్‌పోస్టర్‌… ముగ్గేస్తున్న సంగీతా వెనక్కి తిరిగి పలకరింపుగా నవ్వుతున్న శ్రీధర్‌, ప్రక్కన ఆంజనేయుడు ఆర్జా జనార్ధన్‌రావు సిగాన పెసువునాంబని పట్టుకోని ఉన్నాడు. ఆ ప్రక్కనే కోతిపిల్లను ఎత్తుకుని ఓ బుడుగోడు. అడుగులు కదలనంటున్నా ముందుకు విందుకు మనస్సు ఉవ్విళ్లూరుతోంది. ప్రక్కనే రాజు-పేద కార్టూన్‌ సీరియల్‌… వెలుగు విలువను తెలపుతూ గోరింత దీపం బొమ్మల కథ. “న్నో! ఇవన్నీ మనం చిన్నపుడు లైబ్రరీలో చూసిన బాపు ఎగ్జిబిషన్‌ లోటివి కదన్నా” అన్నాడు జన. “అవున్నా ఇదిగో ఈ బుడుగు బొమ్మ.. బడుగును అక్కడే కదా మనం చదివింది” అన్న తలూపాడు. ఆ బొమ్మను చూస్తూ అన్న కళ్లల్లో మెరుపులు. అలా అలా చూస్తుండగానే ఒక్కసారిగా గోడకున్న బాపు బొమ్మలు ఊడి వచ్చేస్తూ ఉన్నాయి. వాటిని పడి పోకుండా మేమందరం పరుగెత్తి పరుగెత్తి పట్టుకుంటూ ఉన్నాము. ఒకదాని కోసం వెళుతూ ఉంటే ఇంకోటి చేతికి అంది వస్తాఉంది. బామ్మ చేతి అప్పడాల కర్ర, గరిటా, తాతయ్య పడుకున్న వాలుకుర్చీ, కృష్ణుడూదే పిల్లన గ్రోవి, గోపెమ్మ ఎదురు చూస్తున్న పారిజాతం పొద, రిబ్బన్లు, చేతి గరిట, మరచెంబు, హోల్డాలు, ఉగ్గుగిన్నె, పాలపీక, బొట్టుపెట్టుకునే అద్దం ముక్క, కాలిమువ్వలు, తిరునామాలు… అన్నీ దొరికాయి. అన్నకు ఇంకో అద్భుతం దొరికింది. ఓ చిన్న గిన్నె దొరికింది. దాని నిండా రంగులున్నాయి. “ఓరే మణి ఇదే కదూ బాపు రంగులు దిద్దిన గిన్నె… ఇదే ఇదేన్రోయ్‌” అన్నాడు. “అన్నకు దొరికిందేదో నాకర్థమైంది.” అన్నాడు జన. ఏంట్రా అన్నాం మేమిద్దం. “శ్రీరాముడు సీతమ్మకు పాదాల పారాణి రంగులు అద్దుతుంటే అపర రాంబంటు బాపుగారూ ఆయనకు కుంచె సాయం చేస్తూపట్టుకున్న రంగుల గిన్నె ఇది’’ అని తీర్మానించాడు. ఔనౌను బాపు మాస్టారూ తన కుంచెకు ఆదిగురువు రాముడనే ప్రకటించిన బొమ్మ అది. మా కళ్ల ముందు కదిలింది. గుండెను చీల్చి రాముడ్ని చూపిస్తున్న ఆంజనేయుడి బొమ్మకన్నా నాకెందుకో ఈ బొమ్మలోనే నిజమైన రాంబంటు కనపడ్డారు. బొమ్మల గురించి మాట్లాడుకుంటూ అన్ని బొమ్మలను ఒడిసి పట్టుకుని సంతోషంగా ముందుకు సాగిపోయాము. పెరటిమొక్కల పూలవాసన, ముంగిట చల్లిన కళ్లాపి వాసన, పొత్తిళ్లలోని పాల వాసన మమ్మల్ని చుట్టుకుని ఉన్నాయిపుడు. సంతోషంతో గుండె గంతులేస్తా ఉంది. కారిడార్‌ చివరికి వచ్చాం. అట్లే లోపలికి వెళ్లాం. లోపల ధగధగా మని వెలుగుతూ బాపు గారికి అభినందన సన్మానమని పెద్ద బ్యానర్‌ కట్టి ఉంది. “ఓయ్‌ ఏం లక్‌రా మనది… బాపు గారి సభకు వచ్చేసాం… అవున్నోయ్‌” అంటూ ఆయనతో పాటు మేము లోపలికి ఉరికాం. అందరూ బ్యానర్లు కడుతూ రిబ్బన్లు, బెలూన్లు, రంగు పేపర్లు గోడలకు అలంకరిస్తూ పూలగుచ్ఛాలను బల్లల మీద సర్దుతూ ఒకటే హడావుడి పడుతూ ఉన్నారు. మేం కూడా వేదికపైకి ఎక్కేశాం బాపు గారూ ఉన్నారేమో చూద్దామని. ఎవ్వరూ మమ్మల్ని గమనించలేదు. అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటూ హడావుడిగా తిరుగుతున్నారు. వేదికనంతా వెతికేశాం. బాపూ గారూ ఎక్కడా లేరు. నిశ్శబ్దంగా వేదిక ముందుకు చూస్తూ నిలబడ్డాము. జనా మాత్రం గబాగబా వేదికదిగి జనంలోకి వెళ్లిపోయాడు. “ఓరే ఉండ్రా మేమే వస్తున్నాం” అంటూ దిగేశాం. బాపుగారి కోసం వెదుకుతూ ఉంటే కళ్లు వెయ్యి అయ్యాయి. ఉహూ అంతా మరబొమ్మల్లా ఉన్నారు. కిచకిచ మంటూ అరుస్తూ ఉన్నారు. “ముర్లెన్నా! మనన్నా” అని జన గట్టిగా కేక పెట్టాడు. ఉలిక్కిపడి ఆవైపు చూశాం. వేదిక ముందు చెల్లా చెదరుగా ఉన్న కుర్చీల మధ్య ఒక గాడ్రేజీ ఐరన్‌ ఛైర్‌ మీద బాపూ కూర్చొని ఉన్నారు. పక్కన రమణగారు లేరు. పది అడుగులూ ఒక్క పరుగైంది. అప్పటికే జన నమస్కారం చేస్తున్నాడు. మేము చేతుల నిండా బాపూ బొమ్మలతో ఉన్నామా… తలను, నడుమును ఉంచి ఒక్కసారి ఆయనకు సమస్కరించుకున్నాం. ఆయన చిరునవ్వు నవ్వాడు. అందరూ మా చుట్టూ తిరుగుతున్నా బాపూ గారిని, మమ్మల్నీ ఎవరూ గమనించడం లేదు. బాపు గారూ బాగా మెత్తబడి ఉన్నారు. కాళ్లువాపులుగా ఉన్నాయి. అయినా అవేవి ఆయన ముఖం మీద చిరునవ్వును చెదిరించలేక పోతున్నాయి. ‘‘అయినా ఇదేంటి సార్‌! మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మీ పేరుకేమో బ్యానర్లు కడుతున్నారు’’ అంటూ దుఃఖపడ్డాను. “మనం వెళ్దాం పదండి సార్‌” అని ముర్లెన్నా ఒక్క ఉదుటున ఆయన్ను భుజం మీదకు ఎత్తుకున్నాడు. రాంబంటుకే రాంబంటులైపోయి ఒక్కసారిగా బయటికి పరుగెత్తుకు వచ్చాం.

చాలా విచిత్రంగా ఫంక్షన్‌ హాల్‌ తలుపు దాటగానే ఓ పల్లె అంచున నిలబడి ఉన్నాం… చుట్టూ చెట్లు, మట్టిదిబ్బలు, ఓ కొబ్బరి చెట్టు… నగళ్లు నేలకు దించిన ఓ ఎద్దుల బండి స్వామి రాగానే తలవంచి నమస్కరిస్తున్న భక్తురాలిగా ఉంది. ఆ ప్రక్కన పొలంలో ఎవరో కపిల తోలుతా ఉన్నట్లున్నారు. కాలువ వెంబడి నీళ్లు పరుగు పరుగునా వస్తా ఉన్నాయి, స్వామి పాదాన్ని కడిగేందుకు. గాలి పచ్చిక వాసనతో స్వామిని అభిషేకం చేస్తా ఉంది. రాముణ్ణి మోస్తున్న హనుమంతుడిలా మా అన్న ఆ చెట్టు నీడకు తీసుకెళ్లాడు. నేనో సుగ్రీవుణ్ణి… మా జన అంగదుడు… అక్కడికి వెళుతూనే బాపుగారు ‘‘ఇక దించవయ్య చాలు’’ అన్నారు. మా అన్న వింటే కదా, అలాగే రాముణ్ణి ఎత్తుకొని ఉన్నాడు. “స్వామి! ఇదిగో మనముందు ఉండే ఈ చెట్టు, పుట్ట, పచ్చిక, చేలు ఈ ప్రకృతినంతటిని ఏ యాంగిల్‌లో చూస్తే, ఎట్లా మొదలు పెడితే బాగుంటుందో చెప్పండి స్వామీ!” అన్నాన్నేను. ఇంత పెద్ద మనిషిని పట్టుకుని ఇట్టాంటివా అడగడం అన్నట్లు జనా నన్ను ఓ గిల్లుగిల్లాడు. ఏమి చేయను, ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోకుండా ఆయన పేరుకు మాత్రమే భజన జరుపుతూ వుంటే మనసు కష్టంగా ఉంది. మనకే ఇట్లా ఉంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో అనిపించి ఆయన్ను అవి ఇవి అడిగి చెప్పించుకుని, అవి ఇవి ఆయనతో నేర్పించుకుని ఆయన్ను సంతోషపెట్టాలని అనిపించింది. వాడు గిల్లుతుంటే గుండె కళుక్కుమంది. ఉండ్రా అని విదిలించాను. నా చేతిని వాడు గట్టిగా పట్టుకున్నాడు. దుఃఖం వేసింది… నన్నాపుతున్నాడని.. ఇంకా విదిలించి కొట్టాను… “అబ్బా” అని గట్టిగా అరిచింది లక్ష్మి. ఉలిక్కిపడ్డాను. బాగా తగిలినట్లుంది.. స్పృహ తెలిసింది. బాపు గారూ వెళ్లిపోయారు మనుసు లోపలి పొరల్లోకి… గుండె బరువుగా ఉంది. గుండెనిండా దుఃఖంగా ఉంది. ఏమండీ.. ఏమైంది అనింది లక్ష్మి. చల్లని చీకటి… నిశబ్దంగా ఏసీ పనిచేస్తావుంది. ఆ ప్రక్కన బుడుగోడు, సిగానమ్మ అలసిపోయి గాఢంగా నిద్దరోతున్నారు. ‘‘ఏమండీ! ఏదైనా కలొచ్చిందా… బాపు గారొచ్చారా’’! అడిగింది. గుండెలోని ఆతృతను తెలుపుతున్న కంఠంలోని వణుకు… ప్రేమానురాగాల అనుకంపనం.. వాటిని అర్థం చేసుకునేటంత స్పృహలోకి వచ్చాను. కాని ఆస్వాదించే స్థితిలో లేను. “నీళ్లు తాగుతావా” అడిగింది. వద్దన్నాను. బయటికి వెళ్లి అలా కూర్చొద్దామా… మళ్లీ వద్దన్నాను. రేపు ఉదయం మా తిరుగు ప్రయాణం. మనస్సును బాధిస్తా ఉంది. మేంతోడల్లుడు సీతారామయ్య ఇంట్లో ఉన్నాము. పుస్తకాల అరలో ఎప్పుడో రెండేళ్ల క్రితం నేను కొనిచ్చిన అమరావతి కథలు… ఆహా!… రమణ గారి వ్యాఖ్యానం మరోసారి చదివి, బాపుగారి బొమ్మల్ని చూస్తూ చూస్తూ మురిసిపోతూ ఆయన్ను చూడనందుకు లోపల్లోపల మరిగిపోతూ నిద్రలోకి జారుకుంటే ఇప్పడీ కల… కళ్లల్లో నీరు తుడవని కల.. స్మృతి కిణాంకాల తనివిని తీర్చని కల. జ్ఞాపకాల సునామి అల.. “ఓయ్‌” పెద్దగా ఫీలైపోతున్నావా! ఏమొచ్చిందిరా కలలో చెప్పు. మళ్లీ అవి ఇవి అడిగేసి కలలో ఆయన్ను బెదరగొట్టేశావేంటి..” ఆమె అర్థం చేసుకుని ఓదార్చింది. కాసేపటి తర్వాత లక్ష్మి నెమ్మదిగా ముత్యాలజల్లు కురిపిస్తూ… ‘‘ఉరేయ్‌… గోపాళం మమ్మల్ని రేపు కారులో తీసుకెళ్లి కడపలో వదిలేసి, ఆ మరునాడే జట్కా ఎక్కేసి బాపుగారి దగ్గరకు వచ్చి ప్రైవేటు చెప్పుకో.. ఒకేనా.. పడుకోరా’’ అంది నెమ్మదిగా. ఆమె స్పందన మనస్సుకేదో భరోసా ఇస్తావుంది. కరిగిన కలకు లక్ష్మి కళ్ల వెలుగు కొత్తరూపాన్ని ఇస్తావుంది. నెమ్మదిగా నిద్ర తన కలను వెదుక్కుంటూ స్వప్నలోకాలలో తన ప్రయాణం సాగించింది.

4

గోధూలివేళయ్యింది. ‘‘అయన మధ్యాహ్నపు కునుకుకు భంగం కలగకుండా సాయంత్రం నాలుగుపైనే వెళ్దాం’’ అన్నారు దుర్గాప్రసాదుగారూ. అలాగేననుకుని అందరం కూడబలుక్కున్నాం. నేను, ఉమసార్‌ నామిని గారు చెన్నయ్‌లోకి వస్తున్నామని నా తోడల్లుడికి ఉదయమే ఫోన్‌ చేసి ఉంచాను. మాతోపాటు తనూ వస్తానన్నాడు, కన్నడ ప్రాంతపు తెలుగు వాడతను. బాపు గారి సినిమాలు తెగ చూసినవాడు… తెలుగులో ఎంఏ చేసిన భార్య దొరకడంతో ముళ్లపూడి కూడా ఆమె అభిలాష ద్వారా ఆయనకు పరిచయమయ్యారు. నేను మీతో తప్పకుండా జాయినవుతా భయ్యా! అన్నాడతను. సరే అన్నాను. పోయినసారి బాపూ గారిని కలవడం తన వల్లనే కుదరనందుకు బాధపడుతూ కలిసిన సంతోషాన్ని మాతో కలిసి పంచుకోవాలనుకున్నాడేమో! ఈసారి మాత్రం కచ్చితంగా బాపుగారిని కలవాల్సిందే అన్నాడతను. అందరం రివ్వున ఆ ముంగిట వాలిపోయాం. “అదిగో ఆ పై ఫ్లోర్‌లోనే రమణగారు ఉండేవారు. బాపూగారేమో కిందింట్లో ఉంటారు’’ అన్నారు దుర్గాప్రసాద్‌గారూ. ‘‘అయితే బ్రహ్మను తలపై మోసాడన్నమాట’’ సీతారాం నాతో అన్నాడు. ‘‘లేదు లేదు వారు ఒకరినొకరు మోసుకున్నారు. రెండుగుండెల ఒంటిప్రాణంలా ఉండిపోయారు. ‘నీకంటే వేరే కనులెందుకు? నీకంటే వేరే బ్రతుకెందుకు’ అనుకునేంతగా ‘స్నేహం’ సాగింది వారిలో’’ ఆర్‌ఎం ఉమాసార్‌ అన్నారు. ప్రహారీ గోడకు కుడిప్రక్కగా ఉన్న ఫలకం పైన ‘బాపు’ అని రాసి ఉంది. ఎడమ ప్రక్కన ‘సూర్యకాంతం’ అనే ఫలకం ఉంది. ‘ఆర్టిస్టు కదా.. అన్నింటా అందాలు, వెలుగులు చూపించే సూర్యకాంతి పేరు ఇంటి పేరుగా భలే పెట్టేసుకున్నారే అనుకున్నాను… పైకీ అనేశాను… ‘‘లేదుసార్‌… అది వాళ్లమ్మగారి పేరు’’ అన్నాడు నామిని నవ్వుతా. అందరం లోపలికి నడిచాం. పెద్ద పార్కింగ్‌ ప్లేస్‌… ఇంకా పేద్ద నడవ… కలలో చూసిన రంగుల కుటీరం కళ్లముందు ఉంది. వాకిలి ముందరికెళ్లాం… గోడపైన ఓ అపురూపం. ఓహ్.. అమ్మగారూ.. ఎంఎస్ సుబ్బలక్ష్మిగారి ఫొటో… నలుపు తెలుపుల ఛాయాచిత్రం… లోపల్నుంచి ఏదో రాగం వస్తూ ఉన్నట్లుంది. దుర్గాప్రసాద్‌ గారూ ఎవరితోనో మాట్లాడుతూ లోపలికి వెళుతూ ఉన్నారు. ఆయనే బాపూగారి అబ్బాయి అని చెప్పారు ఉమ సార్‌. హాలు లోపలికి వెళ్లాను. ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచింది. బాపుగారు ఇక్కడ తిరుగుతూ, మాట్లాడుతూ ఆలోచిస్తు ఉంటారు. ఆయన నడుస్తున్న నేల ఇది. ఒక్కసారి వంగి నేలను తాకి కళ్లకు అద్దుకున్నాను. చేతికి ఏదో రంగు అంటినట్లు హాయిగా అన్పించింది. హాలు గోడల నిండా బాపు బొమ్మలు. బాపు తెలుగోడు గుండెపై ఎగురేసిన విజయపతాకాలు… బాపు రెండు చేతులతో కెమెరా యాంగిల్‌ చూస్తూ ఉంటే రమణగారూ చిరునవ్వులు చిందిస్తున్న అపురూపమైన పెయింటింగ్‌ ఆ గోడపైన ఉంది. నటసార్వభౌముడిని కవి సార్వభౌముడిగా తీర్చిదిద్దున చిత్రం ఓ మెరుపులా కనిపించింది. ఆయనకొచ్చిన అవార్డులు ఆయన్ను వరించి గొప్పైపోయినవి. గోడలనిండా తలెత్తుకొని వున్నాయి. అందరమూ హాలులో కలియ దిరిగాము. నేను, సీతారాం అక్కడి సోఫాలో కూర్చుని ఉమ సార్‌తో ఓ ఫోటో తీయించుకున్నాం. ఎన్నెన్ని ఉదయాలు ఇక్కడ కాఫీ సేవనంలో మేథోమథనంలో వెలిగి ఉంటాయో? ఎన్ని ఆలోచనలు ఇక్కడ ఆయనలో చెలరేగి రూపుదిద్దుకుని ఉంటాయో అనుకుంటూ ఆ సోఫాను తడిమి తడిమి మురిశాను.

ఇంతలో పైనుండి పిలుపు వచ్చింది. గుండె అదరడం మొదలైంది. రంగుల రాట్నం పైకి వెళుతూ ఉంటే బరువుగా మారిపోయినట్లు మెట్లపైన నా అడుగులు చాలా బరువుగా పడుతున్నాయి. అందరికన్నా వెనుక నేనున్నాను. గబగబా అందరినీ దాటుకుంటూ… నెట్టుకుంటూ ముందుకెళ్లి ఆయన్ని చూడాలని ఉంది. ఆయన నన్ను చూడగానే లక్ష మందితో ఆయన విన్న మాటలు ‘‘సార్‌… నేను మీ అభిమాని”నని చెప్పాల్నా… లేక ఇంకేం చెప్పాలి… “సార్‌.. మీరు మా అయ్యోరు… మా జీవితంలో ఉన్న అన్ని ముఖ్యమైన మలుపుల్లో మీరు తోడున్నారు… మీరు లేకుండా ఉంటే మా బ్రతుకులు ఇట్లా ఉండేటివి కాడు… చిన్నపుడు లైబ్రరీలో మీ కార్టూన్లు చూసి పెద్దపెద్దగా నవ్వేసి ఆనక బోల్డు సిగ్గుపడి పోయేవాళ్లం. మేం ఆడుకునేపుడు, అల్లరి చేసేటపుడు బుడుగుతో సరిపోల్చుకునే వాళ్లం.. యవ్వనపు తొలిరోజుల్లో మీ బొమ్మలు, ఆ సినిమా పాటలు, చుట్టు చెంగావి చీర కట్టిన మీ చిలకమ్మల హోయళ్లు, సరసాల సంపెగలు ఎన్నెన్ని జ్ఞాపకాలు. మీ బొమ్మలో కళ్లు ఓ ప్రత్యేకత కద్సార్‌. తెలుపు, నలుపుల బొమ్మలో కూడా కళ్ల కాటుక తెలిసేలా కింది రెప్పను కొంచెం చిక్కగా వేస్తారు మీరు. మునివేళ్ల మీద నడక, చివాలునా తిరిగితే వచ్చే నడువంపు, వాలు జడల కోలాటాలు మా గుండెల్ని ఊర్రూతలూపాయి. పెళ్లికి ముందే కళ్యాణ రాముడ్ని చూసొద్దామని భద్రాద్రికి లక్ష్మితో వెళితే… ఆశ్చర్యం… స్వామికి దండం కూడా పెట్టుకోకుండా పీకల్లోతు సంభ్రమంలో మునిగిపోయాను. అక్కడి ఆ మూర్తులు ముమ్మూర్తులా మీ బొమ్మలే. రామదాసు ప్రతిష్టించిన ఆ రాముడ్ని మా గుండెల్లో మాత్రం మీరే నిలిపారు… ప్రతి గుండెరాముడి కోవెల కావడమంటేఇదేనా…”

రంగుల రాట్నం పైకి చేరాను. నా ముందు వెళ్లిన అందరూ కుర్చీల్లో కూర్చొంటూ ఉన్నారు. వారి మధ్యలో… విరాట్‌ రూపం… అతి సామాన్యమైన అసామన్య రూపం. బాపూ గారున్నారు. అవును నిజ్జంగా బాపుగారే… ముమ్మూర్తులా బాపుగారే. తిరుమలగుడిలోని కృష్ణదేవరాయల్లాగా రెండు కాళ్లు దగ్గర పెట్టుకుని రెండు మోచేతులు శరీరానికి ఆనించి రెండు చేతుల్ని గుండెకు తాకించి నమస్కారం చేసుకున్నాను. దుర్గాప్రసాద్‌ గారూ అయ్యవారి ప్రక్కన కూర్చొని ఉన్నారు. ఇంకో ప్రక్కన ఆశ్చర్యంగా సీతారం… ఆయన ప్రక్కనే కూర్చొనే అవకాశం కొట్టేశారు. నేనూ ఉమా సార్‌ ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొన్నాము. మా పక్కన నేలపైన చక్కలుముక్కలేసుకుని నామినిగారూ కూర్చొని ఉన్నారు. ఓ ప్రక్కన ఆయన సహాయకుడిగా ఎవరో ఓ అదృష్టవంతుడు ఉన్నారు. రాముల వారి సభలో ఉన్నట్లుంది నాకు. దురాప్రసాద్‌ గారు అందర్నీ పరిచయం చేయబోయారు. ఈలోపు ఉమ సార్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. నేనూ చొక్కా సవరించుకుంటూ కాలర్‌ను సర్దుకుంటూ పరిచయం చేసుకోవాలని కుర్చీ నుంచి లేవబోయాను. ఇంతలో ఆయన పిడుగులాంటి మాట అన్నారు… ‘‘రేపు ఉంటున్నారా? రేపు కలుద్దాం…’’ అన్నారు. నాకు మాట పెగల్లేదు. ఆయన కష్టంగా శ్వాస కూడగట్టుకుని మళ్లీ ఆన్నారు. ‘‘రేపుంటాన్నారా? రేపు కలుద్దాం…’’ దుర్గాప్రసాద్‌గారూ దగ్గరగా తలవంచి చేతులు కట్టుకుని అలాగేనని తలూపేశారు. బాపుగారూ అందరివైపు ఓసారి చూసి ‘‘రేపు కలుద్దాం… రేపు కలుద్దాం..’’ అని మళ్లీ మళ్లీ అన్నారు. అలిసిన ఆయన శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. అందరం లేచి నిలబడ్డాం. ఏం మాట్లాడాలో. ఎలా మొదలెట్లాలో అర్థం కాకుండానే ఈ హఠాత్‌ పరిణామం. ఎన్నో రంగుల్ని ఎన్నో లక్షల గీతల్ని అపురూపాలు చేసిన తాపసి విశ్రాంతి కోరుకుంటున్నారు. ‘ఆకురాలు అడవికి ఆమనిని దయచేయించిన చేయి… అది సెలవని పలుకుతోంది. విఫలమైన నా కోర్కెను ఆ గుమ్మంలో వేలాడదీసి లేచాను. అందరూ నన్ను దాటకుంటూ భారంగా నెమ్మదిగా ఆ గదిలో నుంచి సెలవు తీసుకుంటూ దిగేశారు. నేనూ ఉమా సార్‌ మాత్రమే మిగిలి ఉన్నాం. ఉమా సార్‌ చాలా చురుగ్గా సహాయకుడితో ‘ఒక్క ఫోటో తీసుకుంటాం’ అంటూ కెమెరాను నాచేతికిచ్చి మెరుపులా ఆయన ప్రక్కకెళ్లారు. కళ్లల్లోని తేమ చూపును మసక చేస్తూ ఉంటే ఉమ సార్‌ చేసిన ఈ పని నాకెంతో ఓదార్పయింది. ఫొటో తీశాక నాకూ అవకాశం వచ్చింది. ఆయన మౌనంగా అలా… కూర్చొని ఉన్నారు. దగ్గరగా వెళ్లి ఆయన పాదాలను తాకి కాళ్ల దగ్గర కూర్చొన్నా… ఉమా సార్‌ ఫొటో తీశాడు. లేచి ఆయనకు నమస్కారం చేశాను. ఆయన నిశ్చలుడై ఉన్నారు. ‘‘సార్‌ మీరంటే చాలా ఇష్టం… సార్‌…’’ గొంతులో నుంచి మాటసరిగా రాలేదు. ఆయనలో స్పందన లేదు. కళ్లు మసకలై పోయాయి. నమస్కరిస్తూ అలాగే వెనక్కు వెనక్కు ఆయన్ను చూసుకుంటూ వచ్చాను. మెట్ల దగ్గరికి వచ్చి దిగుతూ దిగుతూ తల వెనక్కు తిప్పి తిప్పి చూశాను. మెట్ల మీద జారి పడకుండా ఉమ సార్‌ నన్ను పట్టుకుని నడిపిస్తున్నాడు. వచ్చేశాను… కిందికి వచ్చేశాను. ఆకాశం అంత ఎత్తుకు ఎగిసిన అలలా విరుచుకుపడ్డాను. రంగుల రాట్నం జర్రున కిందికి జారింది. గుండె గొంతులో కొట్టుకుంటోంది. ఆయన పాదాన్ని ఒళ్లో పెట్టుకుని పాడే అవకాశాన్ని అందుకోవాలని వచ్చాను. ఎక్కడికో జారి అధఃపాతాళానికి పోతూ ఉన్నట్లుంది.

కింద ముళ్లపూడి గారి శ్రీమతితో అందరూ మాట్లాడూతూ కొంచెం కొంచెం సాంత్వన పొందుతున్నట్లున్నారు. తలా ఒక మాట అంటూ ఉన్నారు. ‘‘మనుషుల్ని కూడా గుర్తు పట్టలేకుండా ఉన్నాడు’’ అంటున్నారు నామినిగారు. ‘‘ఆయనకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మూలింటామె పైన బాపు రాసిన ఉత్తరం నామిని గారి జీవితంలో పొందిన గొప్ప అవార్డు ఏమో… బాపు గారూ ఇప్పటికీ ఆఖరుగా చదివిన పుస్తకం కూడా అదేనేమో..’’ ఉమాసారు అంటూవున్నారు. “రేపు కలుద్దాం… రేపు కలుద్దాం…” ఆయన మాటల్ని మరీ మరీ అనుకుంటూ బయటికొచ్చాను. ‘‘రేపు ఉండండి సార్‌… రేపు వస్తాం…’’ అని గట్టిగా అరవాలనిపించింది. గుండె ఝల్లుమంది ఆ ఆలోచన వచ్చేసరికి. ‘ఛ’ పాడు ఆలోచనలు, ఆయన ఛాతి మీద కమిలిన చర్మం ఒక వైద్యుడిగా ఆయన పరిస్థితిని నాకు చెబుతా ఉంది. బుద్ధికి తెలిసింది కానీ మనసుకే తెలియడం లేదు. కళ్లల్లో నీళ్లుచిప్పిళ్లుతున్నాయి. ఉమసార్‌ “ఏంటిది ఊరుకోండి” అని అంటున్నారు. చూస్తుండగానే ఆయన మసకైపోయారు. ‘‘ఏంటండీ ఏమిటిది మిమ్మల్నే’’ అంటూ లక్ష్మి వచ్చేసింది నా ముందుకు. మసక మసకగా లక్ష్మిరూపం. “ఏంటి నువ్విక్కడ? రీ యూనియన్‌ అని హార్స్‌లీ హిల్స్‌కు వెళ్లారు కదా… ఇక్కడ ఏంటే నువ్వు’’ అన్నాను. ‘‘అయినా నువ్వు రావడం బాగుందే’’ మళ్లీ అన్నాను. ‘‘ఏమండీ! చూసినావా బాపుగారినీ, మాట్లాడినావా ఆయనతో… ఏమన్నారాయన’’ అడుగుతా ఉంది లక్ష్మి. ‘‘ఏం చెప్పాలబ్బ నీకు. ఇక్కడికి ఎట్లా వచ్చావు’’ తల తిరుగుతోంది. ఒళ్లు తూలినట్లైంది. ఉమాసార్‌ గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ లక్ష్మిదిలాగ తోస్తావుంది. గట్టిగా తల విదిలించుకున్నాను. లక్ష్మి కలలాగా వచ్చిందా? నేనూ ఉమాసారూ కలలో ఉన్నామా? నిజము కలా? కల నిజమా?… వాస్తవమూ…. ఊహా కలిసిపోతున్నాయేంటి? రంగులు నీళ్లలో కలిసిసోయినట్లుగా… బాపు తెలుగులో కలిసిపోయినట్లుగా… తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు బాపు బొమ్మను పెనవేసుకున్నట్టుగా… ఇంటిముందరి చెట్టుకింద పాకుతున్న వెలుగూనీడల్లా.. నిజమూనీడా నాతో దోబూచులాడుతున్నాయి. ఇదేంటి ఇలా ఓపక్క లక్ష్మి ఓ పక్క ఉమాసార్‌ ఇద్దరూ నన్ను పడిపోకుండా పట్టుకునివున్నారు. తల గిర్రునా తిరుగుతాంది. పర్లేదు ఇది నిజమైనా, కలైనా నేను సిద్ధపడాలి. “ఏమైందిరా మాట్లాడవు” లక్ష్మి నా భుజం పట్టుకుని ఊపుతూ అడుగుతోంది ఏమైందిరా చెప్పు అంటూ… చెప్పాను… మొత్తం చెప్పాను. కొంచెం బిగ్గరగా, కొంచెం బిత్తరగా, బొంగురు బొంగురుగా.. ‘‘రేపు ఉంటున్నారా? రేపు కలుద్దాం అన్నాడే… రేపుంటాడా. చెప్పవా… ఆయన మనల్ని మోసం చేశారే. రేపు ఉంటాడా? చెప్పు…’’ మాటా, ఏడుపూ కలిసి ఏదో జీరగా ఒక శబ్దంలాగా వస్తా ఉంది. నది తోసుకుపోతున్న నావను ఆపమని ఎవరు చెప్పాలి… రేవు బావురుమంటోందని ఆయనకు ఎవరు చెప్పాలి. ‘‘నువ్వు వెళ్లి చెప్పి రాపో లక్ష్మి. పో! నీతో అయితే మాట్లాడతాడేమో.. వెళ్లరా వెళ్లు ప్లీజ్‌…’’ ఆమెను ఆవేశంగా ముందుకు నడిపించుకెళ్లా… ఆమె గట్టిగా పట్టుకుని ఆపి “ఒరే మొద్దు అటుచూడు, అటుచూడ”ని ఆ వీధి చివరకు చూపించింది. నా బుడుగోడు… నా సిగానమ్మ… నా బుజ్జి పిల్లలు చేతులనిండా రంగుపూసుకొని బొమ్మలు, కాగితాలు పట్టుకొని నాన్నా అంటూ పరుగెత్తుతా వస్తున్నారు. ‘‘చూడరా… వాళ్లను చూడు… మనవాళ్లలో మన బాపును చూడు’’ ఆమె కొంచెం బిగ్గరగానే అంది. గట్టిగా పట్టుకున్నా లక్ష్మిని. ‘‘అవును… అవునే అర్థమైంది నాకు…’’ నా కన్నీ ళ్లు ఆగడం లేదు. లక్ష్మి కళ్లు ఎప్పుడో ధారలు కట్టేశాయి.

ఆ కళ్లలోకి చూస్తూ అన్నా నేను. “అవును… ఆయన రేపుంటాడు… ఆయన రేపటిలోనే ఉంటాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. రేపు మనం కలవాలంటే రేపట్లో మనముండాలి. అప్పుడే కలవగలం. రేపుండాలంటే మనం మన పిల్లల్లో ఉండాలి. అట్లా తరతరాలూ ఉండాలి” చూపులో స్పష్టత, మనసులో గాఢత పెరుగుతా ఉంది. బుడుగోతముడిని లక్ష్మి ఎత్తుకుంది. సిగాన సాహితిని నేనెత్తుకుని ముద్దుపెట్టుకున్నా…. శ్వాస తీసుకోవడం కష్టమైపోయిన ఆయన రూపు చెరిగిపోయింది. తెల్లని జుబ్బాలో ప్రక్కనే రమణ గారితో “ఆయన తొంబైతొమ్మిదికి నా ఒకటికలిస్తే వంద” అంటూ బాపు గారు నవ్వుతూ సస్నేహితంగా దర్శనమిచ్చాడు. సూర్యుడు వెళ్లిపోతూ ఉన్నాడు. రేపుండండి… రేపు కలుద్దాం అంటూ… చిత్రం ప్రవహించే జీవం అయ్యింది. వర్ణం దానికి అనునాదం అయ్యింది. బాపు బొమ్మకు ఆ సాయంత్రం పొగడ పూలదండ వేసింది. ఎక్కడునుంచో అనంతాల నుంచి వచ్చిన ఓ రంగుల హరివిల్లు ఆయన ఇంటి చుట్టు ఆవరించింది. అందరం ఆశ్చర్యంగా తల ఎత్తి ఆ చిత్రాన్ని చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఇంటి లోపలి నుంచి ఓ పాట వినపడిరది. సుబ్బలక్ష్మిగారి పాటా?… కాదు కాదు ఈ స్వరం ఆమెది కాదు… ‘‘అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగా.. బ్రతకరా.. బ్రతకరా.. పచ్చగా…’’ అమ్మపాట… అవును… అమ్మపాటే… సూర్యకాంతమ్మ పాట మమ్మల్ని ఆవరించి… అనంతంగా సాగిపోతూ ఉంది… తెలుగిళ్ల లోగిళ్లను కొన్ని తరములసేపు గుండె ఊయలలూపేందుకు…

– డా. మనోహర్ కోటకొండ

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఫిబ్రవరి, మ్యూజింగ్స్ and tagged , , , , , , , , , .

4 Comments

  1. డా. మనోహర్ గారూ! “అవును… ఆయన (బాపు) రేపుంటాడు… ఆయన రేపటిలోనే ఉంటాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు “ కదిలే చిత్రాలు కదిలించి, ఎప్పుడైనా కన్నుల తడి పెట్టించాయేమో గాని అక్షర చిత్రాలు ఇలా కన్నుల తడి పెట్టించటం… నా అనుభవంలొ ఎప్పుడూ లేదు. ~ అనంటపూర్ లో చదువుకున్న బాపూ భక్తులం ( రాజనాల వెంకట రమణ )

  2. Pingback: వీక్షణం-123 | పుస్తకం

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.