irlachengi kathalu

సీమ్మంత్రం

Download PDF EPUB MOBI

బోడికొండకు పికినిక్కుబోవడానికి అయ్యోరుకియ్యాలని తెచ్చిన రొండురూపాయలనోటు కన్పించకబోయేపాటికి నా మొగంలో యాడుండే దిగులంతా వొచ్చి గూడుగట్టుకొనింది.

ఎంత పార్కులాడితే ఇచ్చినాడు మా నాయిన. ‘ఆడ బాయిలూ కుంటలూ వుండాయిరా కోదండా, ఈ బిడ్డి ముందే తులవ. ఇయ్యొద్దురా’ అని మా యవ్వ ఎంత నెత్తీనోరూ కొట్టుకొనింది. అయినా ఏడ్సి యాకారి రొండురూపాయలు నాసేతిలో బడేదాకా నిద్ర బోలేదే నేను. తల్సుకుంటే నాకు దుక్కం తరుముకోనొస్తావుంది. వొళ్లంతా వొణుకు బుడ్తావుంది.

తెలుగు బుక్కులో మిత్రలాబం పాటం దెగ్గిరే బెట్న్యాను నేను. నాకు బాగా గెవనముంది. తెలుగు బుక్కును తిప్పించి, మల్లించి, బోర్లకేసి, ఇదిలించి ప్రెతి కాయితం దెర్సి సూసినాను. నాతో బాటుగా నీలావతి, అంసవేణి తెలుగు బుక్కే గాకుండా సంచిలో వుండిన మిగిలిన బుక్కులన్నీ తిరగేసి సూసినారు.

మద్ద్యానం బయిటికి బోయి ఇండ్లకాడ, ఇస్కూల్లో సెట్లకింద కూసోని అన్నం దినొచ్చిన మా కలాసు పిలకాయిలంతా కొంప మునిగిపొయినంత దిగులు మొగాలతో నా సుట్టూ సేరినారు. బెంచీలు జరిపి సూసినారు. అండ పిలకాయిలు పావడాలు ఇదిలించి సూపించినారు. మొగపిలకాయిలు జోబీలు తిరగేసి సూపించినారు. పుస్తకాల సంచులు దెచ్చి నాముందర ఇదిలించినారు. ఊహూఁ నా రొండ్రూపాయల నోటు అయిపులేదు. నా కండ్లలో నీళ్లు కాల్వలు గట్టేసినాయి. రొండ్రూపాయలంటే మాటలా. అరబండి బెల్లమమ్మితే వొచ్చిన ముప్పై రూపాయిల్నించి తీసి మా నాయిన శానా కస్టంమింద ఇచ్చిన దుడ్లవి. అదీ అన్నం దిననని మొండి కేసికుంటే.

నా కండ్లలో కారే నీళ్లు జూసి ‘యాడ్వద్దుమే దేవకీ. నీ దుడ్లేడకీ బోవు. మన సెంద్రంగాడు సీమ్మంత్రమేస్తాడంట. ఇంగ నీ రొండ్రూపాయలు నీకు దొరికిపొయినట్లే. ముందు నువ్వు కండ్లు దుడ్సుకోని దైర్నంగా వుండు’ అన్న్యాడు పుర్సోత్తం.

నేను సెంద్రం పక్కజూసినాను. ‘అవును’ అని వాడు కండ్లతోనే సైగ జేసినాడు.

‘నీ బొంద. సీమ్మంత్రమేందిరా’ అనింది అంస. ‘నీకు దెల్దులే. నువ్వు నోరుమూసుకోనుండు’ అని ఆ బిడ్ని కసిరినాడు పాండురంగడు.

‘నీకు పెద్ద దేల్సులే’ అని మూతి మూడు వంకర్లు దిప్పిందాబిడ్డి.

‘నీకు తెలుసుంటే సెప్పరా ఇంటాము. మాకెవురికీ తెల్దు సీమ్మంత్రమెట్లా యాస్తారో!’ అడిగింది పరంజోతి.

‘ఏవిూ లేదు. ముందొక బండి సెక్రమేసేది’ సెప్పబొయినాడు పాండురంగడు.

‘బండి సెక్రం మనమ్యాన్నుంచి దెచ్చి ఎక్కడేసేదిరా’ అడ్డం బడిరది నీల.

‘బండి సెక్రం యాన్నించన్నా దెచ్చి నీనెత్తినేసేది. సెప్పేదాకా వుండవు కదా! బండి సెక్రమంటే ఎద్దులబండికుండే సెక్రం కాదు. దాని మాదిరిగానే కాయితం మిందగాని, నేలమిందగానీ గీసే బొమ్మ’ సెప్పినాడు పుర్సోత్తం.

సెంద్రం గాడు మాత్రం అది తనకు మాత్రమే వొచ్చినందుకు మలయాళ మాంత్రికుని మాదిరిగా పోజుబెట్టినిల్సుకోనుండాడు.

‘ఊఁ సెక్రమేసి. బిన్నిగా సెప్పరా’ నీలావతి తొందర జేసింది.

‘నేజెప్తానుండు. సెక్రమేసినాక ఎవురిమిందైతే అనుమానముండాదో వాళ్లపేర్లు సుట్టూ రాయల్ల. సెక్రంలోని ఒకోగీత దెగ్గిర ఒకోరి పేరు. పేరంటే పేరు మొత్తం గాదులే. ముందచ్చర మొగటి రాస్తే సాలు. ఒగ సీమను బట్టుకోనొచ్చి నడీమిద్దిన ఇడవాల. అప్పుడా సీమ ఎవురు దొంగో వాళ్లమిందికి బోతాది’ అన్న్యాడు పాండురంగడు.

‘వాళ్లమిందికి బొయ్యి వాళ్లను కుడ్తాదా’ అడిగింది అంస.

‘నీ మూతిమిందికెక్కి కుడ్తాది సెక్రం మింద ఇడిస్తే మనుసుల మిందికెందుకు బోతాది మే? ఆడ పేర్లు రాసుండే దెందుకింక. వాటి మిందికి బోతాది’ విసుక్కున్న్యాడు పురుసోత్తం.

‘సీమకు దొంగలెవురో ఎట్లా తెలస్తాదిరా. నాకు తెలీకుండా అడగతా వుండా’ అనింది పరంజోతి.

‘ఎట్లా దెలస్తాదంటే నాకు మాత్రమేం దెల్సు. అదేమన్నా నాకు సెవులో సెప్పిందా. సెంద్రానికి మంత్రమొస్తాది. వాడు దేమునికి దండం బెట్టుకోని మంత్రమేస్తే సీమకా శక్తొస్తాది’.

‘మనింట్లో బెల్లమ్యాడుండాదో సీమకు మంత్రమెయ్యకనే తెలిసిపోతాది కదా! కానీ దొంగల్ని కనిపెట్టాలంటే మాత్రం మంత్రమెయ్యాల్సిందే!’ అన్న్యాడు అన్నీ తెలిసినట్లు పాండురంగడు.

‘అయివోరేమో రాలేదే?’ అనింది నీల.

‘నీకు తెల్వదా. అయివోరీపూట రాడంట. మళ్లీ పి.టి. కలాసుండాది కదా! ఈ పొద్దు ఆడుకొనేదే పని’ అంస అనింది.

వాళ్లట్లా మాట్లాడుకుంటావుంటే సీమ్మంత్రం ఎట్లాయాస్తారో నా రొండ్రుపాయిలు దొరకతాదో లేదో! అని ఎవురు మాట్లాడ్తే వాళ్లపక్క జూస్తా ఇంటా వుండాను. ఇంగో పక్క సీమ్మంత్రం వల్ల నా దుడ్లు దొరికితే ఆంజినేయ సామి గుళ్లో టెంకాయిగొడ్తానని మొక్కుకున్న్యాను. మళ్లీ తిరపతికి నడ్సొస్తాను సావిూ, అనుకున్న్యాను. ఇరపాచ్చమ్మకు పొంగిళ్లు బెట్టేటప్పుడు మాయమ్మనొప్పించి సలిబిండి దీపాలను నెత్తిన బెట్టుకొని గుడిసుట్టూ ఏడు సుట్లు తిరగాలనుకొంట్ని. ఇంగా ఏవేవో మొక్కులు మొక్కుకుంటానే వుండాను. రొండ్రూపాయిల కోసం నూరు మొక్కులు దీర్సాలేమో! దుడ్లంటే మాటలా. సేద్దిం జేసుకొనే వాళ్లకు దుడ్లేన్నించొస్తాయి. నేనేడవడమేగాక ఇంట్లో వాళ్లను ఏడిపించి తీసుకున్ని దుడ్లు. మాయవ్వకు దెలిస్తే సెమ్డాతోలు దీసేస్తాది. ఆలోసిస్తానే వుండా. ఒకపక్క సెంద్రం సీమ్మంత్రమేసి దుడ్లు పట్టిస్తాడని సెప్పినప్పుట్నుంచి కొంచిం బాద తగ్గినట్లే వుండాది.

‘ఏంరా. మంత్ర మేసేదేమన్నా వుండాదా. మాటలొకటేనా?’ అంతొరకు ఒగమాట కూడా మాట్లాడకుండావున్ని సుబ్బారెడ్డి సెంద్రాన్ని గెద్దించినాడు. వాడే మాకలాసుకు లీడరు. ఐదో తరగతిలో సదివే పిలకాయిలమంతా స్నేయితంగా వుంటాము. రంగనాయికులు ఈపొద్దు ఇస్కూలుకే రాలేదు. మొదటి గెంటయినాక బెల్లుగొట్న్యారు. పొలోమని ఇస్సూలెనక సూట్టూ వుండే సెట్లకాడ ఒక పెద్ద కానగ సెట్టుకింద సేరినాము.

సెంద్రం ‘తూరుపు ఈ పక్కే గదరా’ అని అడిగినాడు. పుర్సోత్తం అవుననంగానే ఆ పక్కకుదిరిగి సక్కాముక్కాలేసుకోని కూసున్న్యాడు. ముందరున్ని మంటిని సమంగా సేత్తో అలికి ఏలితో గుండ్రని సెక్రం గీసినాడు. కొంచేపు కండ్లుమూసుకోని దెర్సి మొగం పైకెత్తుకోని మేయ్‌ నీకెవురి ముందన్నా గుమానుండాదా?’ అని అడిగినాడు నన్ను.

‘అంటే’ అడిగినాను.

‘నీ దుడ్లు పలానోళ్లు తీసుకోనుండొచ్చని ఎవురినన్నా అనుకొంటావుండావా?’

లేదని తలూపినాను. అక్కడున్నోళ్లను ఒగొగరి మొగమే సూసి సెక్రం మద్దిలో గీసిన గీతలదెగ్గిర బయిటి పక్క ఒగో గీత దెగ్గిర ఒగో అచ్చిరం రాసినాడు. పాండురంగడు, పుర్సోత్తం, సుబ్బారెడ్డి, పరంజోతి, నీలావతి, అంసవేణి, దేవకి సివర వాని పేరుతో కలుపుకోని మా అందురి పేర్లలోని ముందచ్చరాల్ని రాసినాడు.

‘రేయ్‌ దేవకి పేరెందుకురా? ఆ బిడ్డి దుడ్లు ఆ బిడ్డే దొంగిలించుకోనుంటాదా యాడన్నా?’ అన్న్యాడు పాండురంగడు.

‘నీకు తెలీదూరుకోరా. నా కడ్డం మాట్లాడ్తే సిర్రెత్తుకోనొస్తాది. నేను మంత్రమెయ్యను జూడు’ అని బెదిరించినాడు.

‘రేయ్‌ ఊరుకోండ్రబ్బా. విూకు పున్నిముంటాది’ తెలీని దిగులుతో అన్న్యాను. సెంద్రం నాపేరు తుడ్సేసి రంగనాయికులు పేరు రాసినాడు.

వాడీపొద్దు ఇస్కూలుకే రాలేదని అందురికీ తెలుసు. అయినా ఎవురూ నోరు మెదిపే దైర్నం సెయ్‌లేదు.

పేర్లు రాసినాక ‘రేయ్‌ ఒక సీమను పట్రాండ్రా’ అన్న్యాడు సెంద్రం. పాండురంగడు, సుబ్బారెడ్డి సీమకోసం వురికెత్తినారు. ‘ఏ సీమరా, గండుసీమా? సిన్న ఎర్రసీమా?’ కేకేసినాడు సుబ్బారెడ్డి.

‘ఏదో ఒగిటి పుట్టుకోని రాండ్రా’ అని కండ్లు మూసుకోనే విసుక్కొన్న్యాడు సెంద్రం. ఈ లోపల పక్కనుండే యాప్మాను మింద పోతావున్ని ఒక గండుసీమ పాండురంగని కంటబడిరది. వాడా సీమని పట్టుకోను అది జారిపోను. సివరికి దాన్ని రెండేళ్ల మద్దిన గెట్టింగా పట్టుకోని తెచ్చినాడు. తీరా సూస్తే అది ఊపిరాడకేమో సగంసచ్చిపోయింది. అట్లాకాదని ఒక కాయితాన్ని తీసుకోని దాన్ని మిక్చరు పొట్లం మాదిరిగా ముడ్సుకోని దాంట్లో ఒక సీమనేసుకోని తెచ్చి సెంద్రాని కిచ్చినాడు. వాడా కాయితాన్నిప్పి సీమను పట్టుకొనేలోపల అదే కాయితం మింది నించి సెక్రం బొమ్మ మిందికి దూకేసింది.

‘సూస్తిరా. నా మంత్ర శక్తి. నేను ముట్టుకోంగానే అది సెంక్రం మిందికి దూకింది’. అన్న్యాడు సెంద్రం. నా మనసు బక్తితో నిండిపోయింది. కండ్లు మూసుకోని ఎంకటేస్పర సామిని తల్సుకోని సెంపలేసు కున్న్యాను. సెంద్రం దొంగను కనిపెట్టి నా రొండ్రుపాయిలు నాకు దొరికిస్తాడన్పించింది.

అందురి సూపులూ సీమ్మిందే వుండాయి. పైనుంచి కింద పడిందానివల్ల దానికి కండ్లు తిరిగిందేమో! అది కొంచేపు కదలకుండావుండి మల్లి అది పడినసోటే గిరగిరా రొండుమూడు రౌండ్లు కొట్టింది.

దాన్నే ప్రేమగా సూస్తావుండాడు సెంద్రం. ‘అది దొంగ పేరెక్కడుందా? అని ఎతకతా వుంది’ అన్న్యాడు. అందురూ వూపిరి బిగబట్టుకోని సూస్తా వుండాము. అంతే గబగబా అది ‘చం’ అని రాసిన గీత పక్కకి అడ్డంబడి పోబట్టింది.

‘రేయ్‌ నేనే మంత్రమేస్తా నా పేరు రాయకూడదురా. మర్సేపొయినాను’ అని సెంద్రంగాడు ఆ అచ్చరాన్ని గబగబా తుడ్సేసినాడు.

‘ఒకేళ నువ్వే దొంగిలించుంటివనుకో! ఎట్లా తెలిసేది’ అని అడగబోయి నాకెందుకొచ్చిందిలే అని నోరు మూసుకొనింది అంస.

సీమ సెక్రం లోపలే అట్లా ఇట్లా తిరగతా వుండాది. ‘ఏ పేరు ఎక్కడుండాదో సూసుకుంటా వుండాదేమో!’ అన్న్యాడు పాండురంగడు.

‘సీమకు సదవడం వచ్చా?’ అంసవేణి తన మనసులో మెదిలిన మాటను బయటపెట్టింది’ ‘నేనేసిన మంత్రం వల్ల దానికి తెలస్తాది’ సెంద్రం పెదాల మింద సిర్నవ్వు కొట్టొచ్చినట్లు కన్పిస్తావుండాది. అంతే ఆ సీమ ‘ప’ – ‘అ’ అనే అచ్చరాల మద్దిలో నుంచి సెంక్రం బయిటికి పూడ్సింది. పరంజోతికి, అంసవేణికి గుండికాయిలు లబ్‌డబ్‌మని కొట్టుకోవడం మొదులు పెట్టింది.

‘అది ఎవురి పేరు మింద పోలేదు గదరా!’ సెంద్రం పక్క సూసినాడు పుర్సోత్తం.

‘రొండుపేర్ల మద్దిలో నుంచి పొయ్యింది గదరా’ అన్న్యాడు సుబ్బారెడ్డి. ఎంటనే ‘దేవుని సాచ్చిగా నేను దీసుకోలేదు’ అనింది పరంజోతి నెత్తిన సెయిబెట్టుకోని.

‘మాయమ్మతోడు. నేనూ దీసుకోలేదు’ అని కండ్లలో నీళ్లు బెట్టుకొనింది అంసవేణి. నేను వాల్లిద్దురి పక్క అదోమాదిరిగా సూసినాను.

రేయ్‌. ముందుగా రొండుసార్లది యాడబొయినా లెక్కలేదురా. ముచ్చటగా మూడోసారి అది ఎవురిమింద బోతాదో వాళ్లేరా దొంగ’ సెప్పినాడు సెంద్రం.

లేచిపోయి యమ ఇస్పీడుగా పోతావున్ని ఆ గండ సీమను పట్టుకోబయినాడు పాండుగాడు. అది వానేలు మిందికెక్కి కర్సేసింది. వాడు గెట్టింగా సెయ్యి ఇదిల్చినాడు. సీమ కిందబడిపోయింది. ‘నాయాలీ సీమా, నన్నేకుడ్తావా? ఉండు నీ పని జెప్తా’ అని పక్కన దొరికిన బొంగరమంత రాయిదీసుకోని దాన్ని నజ్జి బిజ్జిగా కొట్టి సంపేసినాడు వాడు.

‘రేయ్‌. వాడా సీమను సంపేసినాడ్రా. ఇంగెట్లా’ అంగలార్సినాడు పుర్సోత్తం.

‘సీమలకు గొడ్డుకరువొచ్చిందిరా?’ అని సీదరగా సూసింది వాన్ని అంస.

‘రేయ్‌, ఇంగోసీమను పట్రాపోండ్రా’ ఆడ్రేసినాడు సెంద్రం. పాండురంగడు ఇంగో సీమ కోసం పరిగెత్తినాడు. ఈసారి పెద్దతలకాయున్న గండుసీమ కాదు కాని అంతే పొడుగున్న నలుపు, ఎరుపు కలిసినట్లుండే సీమ సర్కారు సెట్టుమిందికెక్కతా కన్పించింది. దాన్ని శత్ర శెమ పడి కాయితం మిందికెక్కించుకోని పొట్లం కట్టుకోనొచ్చి సెంద్రానికిచ్చినాడు పాండురంగడు. వాడా పొట్లాన్ని నెత్తికి తాకించి ‘ఓం మంత్రకాళి, సీంమంత్రకాళి’ అని మంత్రించి సెక్రం మద్దిలో వొదిలినాడు. అది ఒక వూరుపేరూ లేకుండా మేతకోసం ఎతికే దాని మాదిరిగా వొదిలిన చోటనే తిరగతా వుండాది.

అందురూ గుడ్లు మిటకరించుకోని ఒకరిమిందొకరు వొరిగిపోయి సూస్తా వుండారు.

‘సెక్రంలో ఎవురెవురి పేర్లుండాయో సూసుకుంటావుండాదిరా’ అన్న్యాడు సుబ్బారెడ్డి. అది ఎవురిపేరు దెగ్గిరి కొస్తే వాళ్ల ప్రాణాలు అప్పుడే పోతాయేమో అనేట్లుండాది.

సెక్రం లోపల్నుంచి అది ‘చం’ అని రాసి తుడిసేసిన గీతమిందుగా బయటికి పూడ్సింది.

‘ఆడే వుండాడ్రా దొంగ ఎవురోగాని. మరి ఆడ ఎవురిపేరు రాయాలో తెలీడం లేదురా’ అన్న్యాడు సెంద్రం.

‘సిన్నయివోరు పేరు రాస్తే’ సుబ్బారెడ్డి.

‘రేయ్‌ ఎవురూ లేరని ఒకేసారి అయివోరి పేరే రాసేస్తే ఎట్లరా?’ అనింది అంస.

ఒకరోజు సుబ్బారెడ్డిని బోర్డుమింద లెక్కసెయ్యమన్న్యాడు సిన్నయివోరు. వానికి లెక్కలు బొత్తిగా రావు. అసలు అయిదో తరగతి కొచ్చినా రొండో ఎక్కం కూడా సుద్దంగా సెప్పలేడు వాడు. నోటు బుక్కుసూసి లెక్కను బోర్డుమింద కెక్కిస్తా వుంటే ‘ఎదవా పొట్టలో ఒకచ్చరం ముక్క ల్యాకున్నా పెత్తనాలు మాత్రం బాగా సేస్తావు గదరా!’ అని వాడి తలను బొటీమని బోర్డుకేసి తాటించినాడు. అప్పిట్నించి వాడికా అయివోరంటే కసి.

రేయ్‌ సూడండ్రా. సీమ పేరు లేని గీతమింద పోతావుందంటే ఈడున్నోలెవురూ దొంగల్గానట్లే లెక్క గదరా!’ అన్న్యాడు పాండురంగడు.

మా క్లాసులో వుండేదింతమందే. రంగనాయికులు ఇస్కూలుకే రాలేదు. ఎవురిపేరు రాయాలో దిక్కుతోచలేదు సెంద్రానికి. నాల్గో తరగతిలోని నాదముని గుర్తుకొచ్చినాడు వాడికి.

‘నా’ అని రాయంగానే ‘అదెవురిపేరురా?’ అని అడిగినాను.

‘నాల్గో తరగతిలో వుండాడే నాదమునిగాడు’ సెప్పినాడు సెంద్రం.

‘రేయ్‌ వాడి పేరెందుకురా నీ బుద్దికి సెదులుపట్టకపోతే, అసలు వాడు మన క్లాసులోకి ఎప్పుడొచ్చినాడురా పాపం’ అనింది పరంజోతి.

‘నీకు తెల్దూరుకో, వాడు పరమదొంగ ఎవురికీ తెలీకుండా కంట్లో పాపను కత్తిరించే రకం. ఏం వొంటికి బెల్లు గొట్టినప్పుడొచ్చి ఎత్తుకోని పొయ్యుండొచ్చు’ కసిగా అన్న్యాడు సెంద్రం.

ఆ ముందురోజు సాయంత్రం సెంద్రం సెరువుకట్టమింద పోతావుండాడు. సెరుకు దినుకుంటా నాదముని ఎదురైనాడు. ‘రేయ్‌ నాకో పిచ్చియిరా’ అడిగినాడు సెంద్రం. అంతే. నాదముని న్యాలికతో సెరుకు పొడుగునా నాకేసి ‘ఎంగిలైపొయిందిరా’ అన్న్యాడు. దీనంగా మొగం బెట్టి అప్పటికప్పుడు కిందదోసుకోని వాని ముక్కు పచ్చడయ్యేట్లు కొట్టాలన్పించింది సెంద్రానికి అందుకే వాడిపేరు రాసేసినాడు.

‘ఇది పైనల్‌రా. ఈసారి సీమ కచ్చితంగా దొంగను పట్టేస్తాది. పొయి పట్రాండా’ అన్న్యాడు.

పురుసోత్తం కాయితంలో ఒక పెద్ద గండుసీమనే పట్టుకోనొచ్చినాడు. ఆ కాయితాన్ని గెట్టిగా పొట్లం గట్టినాడు సెంద్రం. ఈసారి నిజంగానే సీమ దొంగను పట్టిచ్చేస్తాదని కండ్లు మిటకరించుకోని సూస్తా వుండారంతా. దానికి తగినట్లుగానే సెంద్రం శానాసేపు కండ్లుమూసుకోని పొట్లం సేత్తో బట్టుకోని మంత్రమేసినాడు. ష్పూ… ష్చూ… అని సెక్రం మింద ఎంగిలూంచినాడు. దానివల్ల కొంచెం మన్నెగిరి ‘అ’ – ‘పు’ అనే అచ్చరాలు సెదిరిపొయినాయి. కండ్లు మూసుకున్ని సెంద్రానికి ఆ ఇసయాన్ని సెప్ప బొయినాడు పాండురంగడు. వాడు ‘రేయ్‌ సెంద్రం’ అంటావుండంగానే ‘ష్‌’ మాట్లాడకండని కండ్లు మూసుకొనే ఎడమసేత్తో సైగ జేసినాడు సెంద్రం.

సెంద్రం కండ్లు తెరవకనే పొట్లాన్ని నెత్తికి తాకించినాడు. కండ్లకద్దుకున్న్యాడు. ముక్కు దెగ్గిర బెట్టుకోని వాసన పీల్చినాడు. నోటితో ముద్దుబెట్టుకున్న్యాడు. ఏసు ప్రెబువుకు మొక్కినట్లు రొండు బుజాలకు, నెత్తికి తాకించినాడు. మళ్లీ నోటితో మంత్రాలేవో సదివినాడు. పొట్లాన్ని సెక్రం ముందు బెట్టిసాగిలబడి మొక్కినాడు. మళ్లీ దాన్ని రొండు సేతుల మద్దిలో బెట్టుకొని గుండు మల్లి మొగ్గమాదిరిగా సేతులు ముడ్సుకోని నాలుగు దిక్కులకు తిరిగి దండం బెట్టుకొనినాడు. సక్కాముక్కాలేసుకొని బక్తితో ఇస్కూల్లో దినాము పాడే ప్రార్తనాగీతాన్ని పాడినాడు. తల్లీ నిన్ను దలంచి సెప్పినాడు. సకల సెరాసెర మోదదాయకా నమో వాకముల ఇశ్వనాయకా అని సిన్నయివోరు నేర్పించిందాన్ని వొచ్చినంతొరకు పాడినాడు. తొండము నేక దంతమును పాడబొయినాడుగాని అదీ వాడికి రాక మద్దిలోనే ఆపేసినాడు. సుమతి శతకం, వేమన శతకాల్లోని పద్యాలను వాడికొచ్చినవన్నీ సెప్పినాడు. అందురూ తిక్కోళ్లమాదిరిగా బిక్క మొగాలేసుకోని, వూపిరి బిగబట్టుకోని సూస్తావుండాము. కొంచేపు కండ్లు మూసుకొని గొమ్ముగా వున్ని సెంద్రం ఒక్కసారిగా గెట్టింగా ‘ఓం సుమంత్రకాళీ, బీం సుమంత్రాకళీ, కిరీం సుమంత్రకాలీ….’ అని అర్సి మళ్లీ ఎవురికీ ఇన్పించకుండా నోటితోనే మంత్రం గొణుక్కోని కండ్లు మూసుకోనే పొట్లాన్నిప్పి సీమను సెక్రం మిందికిడ్సినాడు.

‘రేయ్‌, సీమ కింద పల్లేదురా. కాయితానికే అంటుకోనుండాదిరా’ ఎచ్చరించినాడు పురుసోత్తం.

‘నాకు దెల్సులేవాయ్‌’ అని కండ్లు మూసుకోనే కాయితాన్ని గెట్టింగా సెక్రం మింద ఇదిలించినాడు. ఈసారది ఏకంగా సుబ్బారెడ్డి వొళ్లోబొయి పడిరది. వాడు బిత్తరపొయి అర్సినాడు. పాపం. సీమ ఎప్పుడు సచ్చిపోయిందో! ‘అది సచ్చిపోయిందిరా’ అన్న్యాడు గెట్టింగా పాండుగాడు.

సెంద్రం సుబ్బారెడ్డి అరుపుకు కండ్లు దెర్సినాడు. పుర్సోత్తం పక్కకు దిరిగి ‘జరమొచ్చిన సీమను బట్టకోనొచ్చినావేందిరా. అది ఎప్పుడో సచ్చిపోయిందని నాకు దెల్సు. అది సొర్గానికి బోవాలనే అన్ని మంత్రాలు సదివింది’ అని సుబ్బారెడ్డి పక్కకు దిరిగి ‘రేయ్‌ దుడ్లు దీసింది నువ్వే అని తెలిసిపోయిందిరా. సచ్చిన సీమ సెక్రం మింద నుంచి నీ పేరు పక్కకు నడవలేందు గదరా. అందుకే అది ఒకేసారిగా నీ వొళ్లోనే వొచ్చిపడింది. మర్యాదగా ఆ బిడ్డి దుడ్లు ఆ బిడ్డికిచ్చేయ్‌రా’ అని గెద్దించినాడు. ‘పాణం లేని సచ్చిన సీమకు మంత్రం దెలస్తాదారా’ అని వాడు సెంద్రం సొక్కాయి బట్టుకున్న్యాడు. మిగిలినోళ్లు గూడా సుబ్బారెడ్డి పక్కే మాట్లాడినారు. కొంచేపిటికి గొడవ సద్దుమనిగింది.

ఈలోపల పాండురంగడు మళ్లీ ఒక సీమను బట్టుకోనొచ్చి వాడే సెక్రం మద్దిన వొదిలినాడు. ‘రేయ్‌ దానికి జరమొచ్చిందేమో సూసి తెస్తివా లేదా’ అడిగింది నీల.

‘నువ్వు దాక్టరమ్మవు గదా! సూసిసెప్పు’ అని పరాసికాలాడినాడు వాడు. సీమ అట్లా ఇట్లా కొంచేపు తిరిగి ‘నా’ అనే అచ్చరం పక్కకు నడ్సి ఆడే తిస్టేసింది.

వాడే దొంగని తేల్చినాడు సెంద్రం. అది ఆడబొయి కూసోలేదు. పండుకోలేదు. నిద్రబోనూ లేదు. అది ఒక కొండ మింద కెక్కినట్ల సీమతలకాయంత మంటి గుండును అట్లా ఇట్లా దొర్లిస్తా వుండాది. మద్ద్యాన్నం సెట్లకిందకూసోని అన్నం దింటారు పిలకాయిలు.

‘వాన్నెట్లా అడిగేదిరాబ్బా. వాళ్లమ్మ ముందే గెయ్యాల్ది. నీ కొడుకు నా దుడ్లు దొంగలించినాడంటే వొప్పుకోదు. నోరు బెట్టుకోని వూరూ నాడూ ఒగటి జేసేస్తాది. ఎట్లరా దేముడా’ అనుకుంటా దిగులుగా ఇంట్లో అడుగుబెట్టినాను. ఎదురొచ్చిన మాయవ్వ ఇస్కూలిడ్సిపెట్టి ఎంతసేపయింది. ఇంత సేపూ యాడ గాడ్దిలు గాస్తావుంటివి? అయినా పికినిక్కు బోవాల ఈ పొద్దే దుడ్లియ్యాల అని సతాయించి రొండ్రూపాయిలు వాని దెగ్గిర తీసుకున్ని దానివి ఇచ్చినాక దాన్నాడేబెట్టి పోతావా? ఈ వొయిసికే ఇంత మతిమరుపైతే ఎట్ల’ అని తిట్టింది.

న్యాలిక్కర్సుకోని సంతోసం పట్టలేక దుడ్లు ఇసయం నాదమునికేడ సేరిపోతాదోనని ‘ఇప్పుడో వొస్తానుండు వా’ అని ఈదిలోకి పరిగెత్తినాను.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఇర్లచెంగి కథలు, ఫిబ్రవరి, సీరియల్ and tagged , , , , , , .

6 Comments

  1. Raayalaseema mukhyanga chitooru jillaa praantabhaasha, yaasa (maandalikaanni)upayOginchi vraayadamu chaalabaagundi.Yaasa ku taggattu aksharaalanu malachadamulO rachanaku ompulu, sompulu samakuraayi. Chinnanaati aa chitravichitramaina mantratantraala maatalu ento aanadaannichchaayi.Dhanyavaadaalandi!.IlaantivE “naamini subrahmanyam naayudu gaari – mittoorOdi kathalu pracharistE chadavaalanudi. Naamanavini mannistaarani Sasha…Shu Ham.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.