cover

మునెమ్మ ఓ retrospective

Download PDF EPUB MOBI

 ‘సిటీ బ్యూటిఫుల్’ అన్న చిన్ని నవలతో కేశవరెడ్డిని ఇష్టపడటం మొదలుపెట్టాను.

ఏనాడూ వ్యక్తిగతంగా కలవకుండానే (యిక ముందు కలిసే అవకాశం లేకుండా చేశాడు కేశవరెడ్డి) ఆ ‘సిటీ బ్యూటిఫుల్’ నవల (సెకండ్ ఎడిషన్ అనుకుంటా)కు నా చేత ముందుమాట రాయించుకున్నాడు ఆయన. దాం తర్వాత చిన్నమాట పట్టింపు వచ్చి మాట్లాడుకోడం మానేశాం. అయినా అభిమానాలు చావవు కదా. అట్లా మా స్నేహాన్ని పురస్కరించుకుని ఆయన ‘మునెమ్మ’ నవల గురించి నే చేసిన విశ్లేషణ యిక్కడ ప్రచురించేందుకు ముందుకొచ్చా… దయచేసి అవధరించండి…

మునెమ్మ ఓ retrospective

ఆదర్శాలూ… నీతి నియమాలూ… ఉచ్ఛనీచాలూ… వికృతత్వాలూ.. సౌందర్యాలూ మన మన వైయక్తిక కటకాల్లోంచీ దర్శించాల్సిందే. వేటికవిగా అస్తిత్వరాహిత్యంలో అస్తిత్వం కలిగున్నవి. ఇవి మింగుడుపడని విషయంగా… స్ఫురణకందనిదిగా… లేదా మెదడు పొరల నడుమ ఎక్కడో… సుప్తంగా వుంటూ… వ్యక్తావ్యక్తంగా పొగలోని దృశ్యం లాగున స్పష్టహీనంగా వున్నవని నే ప్రత్యేకం చెప్పనవసరం లేదు… ఉందా?! మునెమ్మలో ఎవరో ఏదో తమ కటకాల్తో చూసేసి అదుగో అదుగదుగో అంటే ఇంకొకరెవరో తాము మరచిపోయిన ఏదో వస్తు నామాన్ని యింకెవరి ఉచ్ఛారణలోనో గుర్తించినట్టు… ఆఁ ఆఁ అదే పేరు… అదే అదే వస్తున్నట్టు… కొన్ని పలవరింపులు వినిపించాయి…

ఇంత రంధి ఎందుకంటారా? కేశవరెడ్డి ‘మునెమ్మ’ అన్న నవల్లో వికృతత్వమో, సౌందర్యమో, magic realism శైలో, లేదూ ఓ objective నవలా ఉత్సుకతో… ఎవరు ఏది చూసినా అది వారు వారు వాడిన, తగిలించుకున్న కటక ప్రభావంగానే చెప్పాలి.

దీర్ఘ విశ్రాంతి తీసుకుని, తల విదుల్చుకుని లేచి, అంతసేపూ తను విశ్రాంతి తీసుకున్న తటాక తీరంలో నాలుగడుగులు వేసి, ఆ తటాకపు నిశ్చల స్తబ్ధతని సహించలేక, నాలుగక్షరాలు గుప్పిళ్ల పట్టుకుని, ఆ స్తబ్ధతటాకంలోకి విసరి ఆ నీటి కలకలానికి తృప్తి పడి అక్కణ్ణించీ నిష్క్రమించిన వ్యక్తిగా కేశవరెడ్డిని అభివర్ణిస్తే తప్పు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ నాలుగక్షరాలూ… ‘మునెమ్మ’.

* * *

ఇక్కడ ఇప్పుడు నేను ‘మునెమ్మ’ నవల్లోని కథనంతా ఏకరువు పెడితే జుగుప్సాకరంగా వుంటుందన్న స్పృహ నాకుంది. అయితే నాకిక్కడ ప్రముఖంగా నవలలో కేవలం వినిపించే… ఆ తర్వాత సాయమ్మ (మునెమ్మ అత్త, జయరాముని తల్లి) కనిపింపజేసే పాత్ర గురించి మాత్రం చెప్పాల్సి వుంది. ఇది దాదాపు విమర్శకులందరూ విస్మరించిన పాత్ర అని నా అభిప్రాయం కూడానూ. అది దొరసామిరెడ్డి పాత్ర.

సదరు దొరసామి పాత్ర కథాకాలానికి పూర్వం అస్తిత్వం గలిగి, కథ మీదా… కథాగమనపు మలుపుల మీదా ప్రభావం కలిగి వుంటూ, అతి బలహీనంగా కనబడే బలమైన పాత్ర (లేకుండా వుంటూ అస్తిత్వం కల్గిన పాత్ర). ఈ వ్యాసం చదివేవాళ్లు ఆల్రెడీ ‘మునెమ్మ’ని చదివి వుంటారు. కాబట్టే, నేరుగా పాత్రల్నే క్రమరాహిత్యంలోనైనా సరే ప్రవేశపెడతాను.

ఈ దొరసామి రెడ్డి జీవితాన్ని స్థూలంగా పరిచయం చేస్తాడు కేశవుడు. ఆ పాత్రలోని ఓ విచిత్రమైన trait ని ఆ పాత్ర భార్య అయిన సాయమ్మ ద్వారా చెప్పిస్తూ బలంగా నిరూపించే ప్రయత్నమూ చేస్తూ… దాదాపు అటువంటి trait నే అతని కొడుకు పాత్ర అయిన జయరామునిలో మరో రూపంలో చూపే యత్నం stealthy గా చేసాడు. (ఇది conscious గా చేసాడా లేదా అన్నది ఆలోచించాలి. ఇది నా oberservation). యాదృచ్ఛికమనుకున్నా ఫర్లేదు దీన్ని. ఆ trait ని మానసిక శాస్త్రంలో fetishism అంటారు. ఆ fetishism అన్నది వికృతత్వం కాదని గమనించాలి. సెక్స్ పరంగా అర్థాన్ని చెప్పే lexicon meaning పరిధులు, Freud తర్వాత చాలా దూరం వెళిపోయిందని గమనించాలి మనం. ఆ fetishism కు idolatry, demolatry తో పాటు zoolatry అన్నవి కూడా అర్థాలుగా వచ్చేశాయి.

దొరసామి పాత్ర విషయంలో, తాను అత్యంత intimate గా పవిత్రంగా చూసుకునే తన భార్య (సాయమ్మ) నగ్నత్వాన్ని స్పృశించిన చీర కూడా భార్య నగ్నత్వంతో సమానమే.. అది తనకు మాత్రమే స్వంతం అన్న possessive nature కలిగివున్నపాత్ర. దొరసామికి తన భార్య చీర ఓ fetish.

అందుకనే ఆ చీరని ఓ నాటకంలో పాత్రధారి అవసరార్థం, అగత్యంగా ధరించినా.. తన భార్య నగ్నత్వాన్నే ధరించేశాడన్న ఆవేశం, అక్కసూ దొరసామికి కలిగి, సదరు నాటకాల వాడి ప్రాణాన్ని సహితం తీయడానికి వెనుకాడడు. ఇది ఏ తర్కానికీ లొంగనిదిగా కనబడుతుంది. ఆవేశం – తర్కం రెండూ ఒకదానికొకటి యోజనాల దూరంలో వుంటాయి.

ఆ హత్యకు ముందు తాను గొప్పగా పవిత్రంగా చూసుకున్న భార్య చీరని సైతం ముక్కల కింద నరికేస్తాడు. ఆ fetish పవిత్రత కోల్పోయిందతనికి.

ఇదే trait అతని కొడుకు జయరామునితోనూ యింకో రూపంలో దర్శనమిచ్చి ‘మునెమ్మ’ కథకు పునాదిగా నిలబడుతుంది. జయరాముని జీవితంలోకి మునెమ్మ భార్యగా ప్రవేశించడం అన్నది వాడికి ఓ మహద్భాగ్యమయిన ఘటన. అదే రోజున జన్మించిన బొల్లిగిత్తకు ఆ రోజు (మునెమ్మవాడి జీవితంలో ప్రవేశించిన రోజు) కన్న పవిత్రత ఉంది వాడికి. దాన్ని ప్రాణంగా చూసుకుంటాడు. మునెమ్మ వెంట్రుకల్తో పేనిన తాడును దానికి పలుపుగా వేస్తాడు. అంతేనా యింకా తన చేతి మీదా.. తన భార్య మునెమ్మ చేతి మీదా దాని బొమ్మను పచ్చగా పొడిపించుకుంటాడు (ఇక్కడే మనం zoolatry అన్న పదాన్ని fetishism కు పర్యాయపదంగా వాడవచ్చు.)

ఎపుడైతే ఆ బొల్లిగిత్త తన పశుధర్మాన్ని ప్రదర్శిస్తూ మునెమ్మను తోటి పశువుగా భావించి ప్రవర్తించిందో అప్పుడు జయరాముడిలో ఆ పశువు పట్ల వున్న ఆరాధనాభావం అంతమై దాన్ని (fetish) నిర్మూలించాలనుకుంటాడు. దగోత్తరంగా దాన్ని చావగొడ్తాడు. కానీ చంపడం చాతకాదు. (మునిసామి తన భార్య చీరను ఛిద్రం చేసినట్టు… బొల్లిగిత్తను ఛిద్రం చేయలేడు). అది చీరలాగ నిర్జీవమైన fetish కాదు చించేసో కాల్చేసో పగులగొట్టో దాన్ని రూపుమాపడానికి (బుచ్చిబాబు నవల ‘చివరకు మిగిలేది’ లో చివర్న నాయకుడి తల్లి విగ్రహాన్ని పగులగొట్టడం ద్వారా నాయకుడి fetish ని ధ్వంసం చేసినట్టు). బొల్లిగిత్త సజీవంగా, నిర్వికారంగా తనెదురుగా కళ్లలోనే మెదుల్తూ తిరుగాడే జీవి. అందుకే దాన్ని అమ్మి పారేయడానికి నిశ్చయించుకుంటాడు. ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు.

ఆ తర్వాత కథలో నాకైతే పెద్ద విశేషం చివరిపేరాల్లో తప్ప యింకెక్కడా కన్పించలేదు. అయితే పాఠకుడిలో ఉత్కంఠ పెంచుతూ పోతుంది రచన. అది కేశవరెడ్డి శైలి.

* * *

ఇక మునెమ్మ బొల్లిగిత్తను ‘పిలగాడు’ అని పిలవడం గురించి. ఆ పిలుపు మునెమ్మకు మాత్రం ప్రత్యేకం… ఓకే.. ఆమె వేపు నించీ ఆలోచిద్దాం…

మునెమ్మకు తనే లేకపోతే బొల్లిగిత్త అలా ప్రవర్తించేది కాదు, భర్త దాన్ని వదుల్చుకోడానికి మద్దిపాలెం వెళ్లేవాడూ కాదు, వెళ్లిన వాడు వెళ్లినట్టు మాయమయ్యేవాడూ కాదు. అందరూ ఎట్లా భావించినా తను మాత్రం ఎక్కడో తన భర్త మరణించినట్టు శంకిస్తూంటుంది.

అది ఆమె కలలో భర్త మెడకు ఉచ్చుగా వున్న తన వెంట్రుకల్తో పేనిన తాడుగా కనిపించడంలో ప్రతిఫలిస్తుంది. అదే చివర్న నిజమవుతుంది. ఆ తాడుతోనే జయరాముడిని మందులోడూ, తరుగులోడూ ఉరివేసి చంపుతారు డబ్బుకోసం.

ఇక్కడ మునెమ్మ కల గురించి కొంత…

ఈ మునెమ్మ కలని ఓ heuristic dream గా అభివర్ణించొచ్చు. బొల్లిగిత్తను అమ్మడానికి మద్దిపాలెం బొల్లిగిత్తతోపాటే వెళ్లిన జయరాముడు అదృశ్యమవుతాడు. అమ్ముడై వుండవల్సిన బొల్లిగిత్త బోసి మెడతో ఒంటరిగా తిరిగొస్తుంది. జయరాముడి అదృశ్యం అందరికీ ప్రశ్నార్థకంగా నిలుస్తుంది. ఒక్క మునెమ్మ మాత్రం కీడు శంకిస్తుంది. ఆ శంకను బలపరుస్తూ కల కంటుంది. ఆ కల heuristic గా వుంటుంది (డిక్షనరీ తిప్పే ఓపిక లేనివాళ్లకు పై పదానికి అర్థం – providing aid or direction in the solution of a problem, but otherwise unjustified or incapable of any justification).

ఇక్కడ ఇంకో విధంగా భర్తకు కీడు జరిగుంటుందని అది హత్యేమోనన్న ఓ అనిశ్చిత భావనకు ఓ అర్థాన్నిస్తుందని కూడా అనుకోవచ్చు. Sigmund Freud దాన్నే wish fulfillment అంటాడు తన Interpretation of Dreams అన్న పుస్తకంలో…

– very different are the dreams in which the dreamer witnesses the death of a loved one and is painfully affected. The meaning of such dreams as their content indicates is a wish that the person in question may die or would’ve been dead…

* * *

ఇక మునెమ్మ బొల్లిగిత్తలో భర్త జయరాముడిని చూట్టం… అది bestial feeling తో చూసింది అంటే అంతకంటే దరిద్రం యింకోటి వుండదు (అటువంటి ప్రకోపాలు మనిషిలో అసహజం కాకపోయినా). బొల్లిగిత్తను ‘పిలగాడా’ అని మునెమ్మ పిలిచే పిలుపుపై ఓ రభస… sheer nonsense. తరుగులోడిని చంపాలనే నిర్ణయంతోనే మునెమ్మ పోటు మిట్ట చేరుతుంది. సిన్నబ్బను ఒంటిమిట్టకు వెళ్లి బొల్లిగిత్తనూ అట్లాగే కత్తినీ తీసుకురమ్మంటుంది (అంటే అవి రెండూ తరుగులోడిని చంపడానికి ఆయుధాలే.)

ఎప్పుడైతే తరుగులోడి కంఠం మీద తన చేతులు జారిపోతున్నాయో అప్పుడు సిన్నబ్బను ‘పిలగాణ్ణిడుసు పిలగాణ్ణిడుసు’ అని అరుస్తుంది… ఆవేశపూరితుడైన భర్తను ఆ పశువులోకి ఆవహింపజేసి… అతని హత్యకు కారకుడైనవాణ్ణి చంపమని భర్తను కోరడమది. Zoomorphism అంటారు దాన్ని. అంతే తప్ప కామాతురతతో బొల్లిగిత్తను కావలించుకుని ‘పిలగాడా!’ అని పిలవదు (ప్రముఖ పాత్రికేయులు శ్రీ అసుర దీన్లో poetic justice చూసారు).

ఇదంతా యిట్లా analytical గా ఆలోచించి ప్లాన్ వేసి కేశవుడు రాశాడా అంటే చెప్పలేను. ఓ వైద్యుడిగా, మనిషిగా రెంటికీ అతీతంగా రచయితగా కేశవుడి subconscious ఎట్లా వుందో నాకు తెలీదు. తన మెదడు పొరల్లో లోపలి విషయాలు, అతనికే స్పష్టం కాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగల్ను. ‘మునెమ్మ’ నవలలోగానీ, రచయిత కేశవరెడ్డి మెదడులోగానీ కొందరన్నట్టు ‘అసహ్యమయిన రొచ్చు’ మాత్రం లేదు. అలా అన్నవారు యీ వ్యాసాన్ని చదివింతర్వాత ‘మునెమ్మ’ను మరోమారు చదవమని కోరడం తప్ప ఇప్పుడు నేన్చేయగల్గిందేమీ లేదు.

* * *

కేశవా, నీ సినిమా చివరికార్డేసేశావా… I thank you for considering me as your friend… good bye.

– కాశీభట్ల వేణుగోపాల్

ఈబుక్ & ప్రింట్ బుక్ కినిగెలో లభ్యం

Munemmacover

 

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఫిబ్రవరి, వ్యాసం and tagged , , , , , , , , , , , .

4 Comments

  1. కాశీభట్లగారు ఇంత చక్కగా విశ్లేషణ కూడా చేయగలరని తెలిసింది. కొంతమంది ఈ నవలలో జూ ఫీలియా చూసామని అనుకోవచ్చు. అది అసహజమని అనుకోవాల్సిన పనిలేదు. కాశీభట్ల గారు చెప్పిన జూమార్ఫియా అనేది నిజంగా కొత్తకోణమే. ఇటువంటి విశ్లేషణ మొదట్లోనే వచ్చి ఉంటే చాలామంది నోళ్ళు మూతపడి ఉండేవి. కేశవరెడ్డిగారికి నొచ్చుకునే పరిస్థితీ వచ్చి ఉండేది కాదు. ఇటువంటి విశ్లేషణలు పాఠకులకే కాదు రచయితలకీ అవసరం.

  2. మంచి విశ్లేషణ. ఈ కోణం నుండి ముణెమ్మను చూసిన వారు తక్కువ. జయరాముని ప్రవర్తనకు నేపధ్యాన్ని ఎవరు పట్టించుకోలేదనిఏది కాదనిలేని వాస్తవవం. నేను ఈ వెషయం ఒక వ్యాఖ్య రూపంలో ‘ పుస్తకం ‘ బ్లాగ్ లో ప్రస్తావించటం జరిగింది.

  3. ” పిలగాడ్నిడుసు ” అంటూ ఎద్దుని వదలమనడం, ఆ ఎద్దులో తన భర్త ఆవహించినట్లు తాననుకోవడమే కాకుండా, ఆ ఎద్దు కూడా అలాగే తన యజమాని తనలో పూని ఉన్నట్లుగా వర్తించి పగ తీర్చుకునే ఆ చివరి సన్నివేశంలో అసహజం పతాకస్థాయిలో చూపినా, అందులో ఏ మాత్రం తర్కాన్ని ఉపయోగించే పరిస్థితుల్లో పాఠకులు ఉండరు. కథలో లీనమైపోయి ఊపిరి బిగించి ఒక్కసారిగా హమ్మయ్య, మునెమ్మ బాధ ( నిజానికి తమ తమ లోలోపలి మనసుపొరల్లో అణచుకున్న బాధ ఒక్కసారిగా ఉత్పన్నమయ్యే పతాక విస్ఫోటనంలో ) ఇప్పుడు తీరిందంటూ సంతృప్తికి లోనయ్యేలా చదువురుల్ని కథలోకి ఈడ్చుకుపోయే శైలి చాలాకొద్దిమందిలో చూసి ఉంటాం. కేశవరెడ్డి గారికి శ్రద్ధాంజలి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.