cover

హెన్నా

మూల రచయిత: సుస్మితా భట్టాచార్య

Download PDF EPUB MOBI

మా ఊర్లో పెళ్ళవుతోంది. నాకెంతో ఇష్టమైన స్నేహితురాలి నాన్న పెళ్ళి!

మేం చంటిపిల్లలుగా ఉన్నప్పటి నుంచీ సలీమా నాకు తెలుసు. ఇంటి పనులు, వంటావార్పూ పూర్తి చేసుకున్నాక, ఉక్కపోతతో ఉండే మధ్యాహ్నం పూట మా అమ్మ, వాళ్ళమ్మా కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. వాళ్ళ మాటల్లో ఊరివాళ్ళ గురించి ఏవేవో పుకార్లు దొర్లేవి. సలీమా ఇంట్లో మూడో సంతానం, కానీ ఒక్కర్తే కూతురు. అందుకని వాళ్ళ నాన్న బాగా గారాబం చేసేవాడు. నేను కూడా మూడో సంతానాన్నే… కాని నేను సలీమా అంత అదృష్టవంతురాలిని కాను. మా ఇంట్లో మగపిల్లలు లేరు. మా నాన్న ఇంట్లో ఉన్నంత సేపూ మమ్మల్ని శాపనార్థాలు పెడుతూనే ఉంటాడు.

కానీ ఈరోజు అందరూ నవ్వుతున్నారు. పెళ్ళి కదా, ఉత్సవం చేసుకునే సమయం మరి. తెల్లారిన దగ్గర నుంచీ ఏవో మిఠాయిలు తయారుచేస్తూనే ఉంది అమ్మ. పాదాల మీద, చేతుల మీద ఉన్న గోరింటాకు డిజైన్లను చూసుకుంటూ మా అక్కలిద్దరు కిలాకిలా నవ్వుతున్నారు. ఎంతో కష్టమైన ఆకృతులను అందంగా మా చేతులమీదా, పాదాల మీదా అలంకరించింది సలీమా. ఇటువంటి పనులలో తనకెంతో నైపుణ్యం ఉంది. వాళ్ళ ఇంటిని ఎంతో శుభ్రంగా, అందంగా ఉంచుతుంది. గుమ్మం దగ్గర, కిటికీల దగ్గర ఇనుప పాత్రలలో కొద్దిగా నీళ్ళుపోసి పూలగుత్తులను పెడుతుంది. దర్జీ చాచాని అడిగి తెచ్చుకున్న గుడ్డ ముక్కలతో బొమ్మలకి మంచి బట్టలు తయారుచేస్తుంది.

పెళ్ళి ప్రస్తావన రాగానే సలీమా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. తేలు కుట్టడంవల్ల ఆమె తల్లి చచ్చిపోయి ఏడాది అవుతోంది. ఆ రోజు బాగా చలిగా ఉందట. పాపం తేలు కూడా వెచ్చదనం కోసం కర్రపుల్లల మధ్య దాక్కుని ఉండి ఉంటుంది. ఆ మధ్యే పుట్టిన తన కొడుకుకి చలి నుండి రక్షణ కల్పించడం కోసం మంట రాజేయడానికి మరికొన్ని కర్రపుల్లలు కావలసి వచ్చి, సలీమా వాళ్ళమ్మ మోపులో చెయ్యిపెట్టింది. తేలు కుట్టగానే, ఆమె ఏడవలేదు, అరిచి కేకలు పెట్టలేదు. గబగబా లోపలికి వెళ్ళి మంటలో మరిన్ని కర్రపుల్లలు వేసి, కొడుకుకి పాలు పట్టింది, ఆ తర్వాతే ఆమె మూర్ఛ పోయిందట. సాయం అడగడానికి కూడా ఓపిక లేదట… ఇవన్నీ నాకు సలీమా తర్వాతెప్పుడో చెప్పింది.. వాళ్ళ నాన్న ఇంటికొచ్చి చూస్తే, సలీమా వాళ్ళమ్మ మూర్ఛపోయి ఉందట, చంటి పిల్లాడు ఆమె పక్కనే దొర్లుతూ ఏడుస్తున్నాడట..

అదో భయంకరమైన రాత్రి. సలీమా వాళ్ళ అమ్మది ఎంతో దురదృష్టం.. డాక్టర్‌ని పిలిచేసరికి బాగా ఆలస్యం అయిపోయింది, ఆయనెక్కడో వేరే పల్లెటూర్లో ఉన్నడట. ఆమె బాధతో గిజగిజలాడుతుంటే, విషం శరీరంలో పైకి ఎక్కకుండా చూడడం కోసం ఆమె కాలిని కోసేసారట గ్రామ పెద్దలు. కానీ ఆమె బతకలేదు. ప్రాణం పోవడం అందరూ చూశారట.

ఆ తేలు అంతు చూస్తానంటూ, కర్రపుల్లల మోపులన్నీ తెగ వెతికాడు సలీమా వాళ్ళ నాన్న. తమ జీవితాలని నాశనం చేసిన ఆ పాపిష్టి తేలుని వదలనంటూ శపథం చేసాడు. కాని ఆ తేలు కనబడనే లేదు.

ఆ చంటిపిల్లాడిని, తన తమ్ముడిని… ఓ తల్లిలా సాకింది సలీమా. ఎవరినీ ఆ పిల్లాడిని ఎత్తుకోనిచ్చేది కాదు. అయితే, ఆ సంవత్సరం సలీమా పెళ్ళి చేయాల్సి ఉంది. అయితే తను ఒప్పుకోలేదు, కాని వాళ్ళ నాన్న పట్టుపట్టాడు. ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి పట్నంలో ఉంటాడు, బాగా చదువుకున్నాడు. అయితే, సలీమా తన తమ్ముడిని కూడా వెంట తీసుకువెడతానని పట్టు పట్టింది. ఆ ఆలోచన ఎవరికీ నచ్చలేదు. చేసేదేం లేక, సలీమా వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని అవసరాలు చూసుకోడానికి, పిల్లాడ్ని గమనించుకోడానికి ఓ ఆడమనిషి లభిస్తుంది, శోకకాలం ముగిసాక, సలీమాకి పెళ్ళి చేసేయచ్చు అనుకున్నాడు.

తగిన కన్య కోసం గ్రామమంతా వెతికారు. అయితే ఎదిగిన కొడుకులిద్దరు, మరో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న ఓ ముసలాడికి కూతుర్ని ఇవ్వడానికి ఎవరూ సిద్ధపడలేదు. సలీమావాళ్ళ నాన్నకి బాగా పాలిచ్చే రెండు ఆవులున్నాయి. పాలల్లో నీళ్ళు కలుపుతాడని కొంతమంది అంటారు గాని, మాకు మాత్రం మంచివే పోసేవాడు. సలీమాతో ఆడుకోడానికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ తినిపించిన వెన్నమీగడలు తిని నేను లావయ్యాను కూడా. భార్యని కొనుక్కునేంత డబ్బు లేదు అతని వద్ద. అందుకని కట్నం వద్దనుకున్నాడు. అంతే సంబంధాలు వెల్లువలా వచ్చాయి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల వాళ్ళకి ఇదో మంచి సంబంధంలా తోచింది.

శుభ సమయం ఆసన్నమైంది. పెళ్ళి హడావుడితో అంతా సందడిగా ఉంది. పెళ్ళికూతురు మగవారి కంట పడకూడదు. అందుకని ఆమె తన ఇంట్లో కూర్చుని ఉంటే, కుటుంబంలోని మగవాళ్ళేమో పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళారు. పెళ్ళికూతురు నాన్న ఇమామ్ దగ్గర ప్రమాణాలు చేస్తున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళు ఉల్లాసంగా తిరుగుతూ, సంతోషంగా ఉన్నారు. మా అక్కలు కూడా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతున్నారు. పెళ్ళి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తున్నారు.

ఈ సంబంధం ఖాయం చేసుకుందామని నిర్ణయించినప్పుడు, మా పెద్దక్క వద్దని వాదించింది. అతను భార్యని పోగొట్టుకున్నవాడు పైగా, పేదవాడు అని అంది. కట్నం వద్దనడం ఓ పథకం అని, ఈ సంబంధం వల్ల అతడికే లాభం అని అంది. కాని మా అక్క మాటల్ని పట్టించుకునేదెవరు? కాళ్ళకి అడ్డం పడే ఇద్దరు ఆడ పిల్లలు, రొమ్ముకొకరు ఉన్న అక్కకి విలువేముంది?

అమ్మ పెద్దక్కని మందలించింది. ‘నువ్వో స్కూలు మాస్టరిని పెళ్ళి చేసుకున్నావ్. నీ బుర్రలో కొత్త ఆలోచనలు ఎక్కించడానికి చదువుకున్న మొగుడున్నాడు. కానీ నీ అభిప్రాయాలని బయటపెట్టే ముందు ఓ కొడుకుని కని చూపించు…’ అంటూ అక్క నోరు మూయించింది.

మా చిన్నక్కకి ఎటువంటి అభిప్రాయమూ లేదు. ఆమె మాట్లాడదు, రోజల్లా ఏదో ఒక మూల కూర్చుని ఉంటుంది. మొదట్నించి అంతే, తను పెద్దగా చుఱుకుతనం లేనిది. దుఃఖం ఆపుకోలేని రాత్రుళ్ళు, చిన్నక్క ఎందుకలా తయారైందో, వెక్కిళ్ళు పెడుతూ చెబుతుంది అమ్మ. చిన్నప్పుడు రొట్టె ముక్క కోసం నాన్నని వేధించిందని, ఓ తాపు తన్నాడట. ‘ఆడ ముం..’ అని బూతులు తిడుతూ విరుచుకు పడ్డాడట. అప్పటినుంచి చిన్నక్క అంతే.. తేడాగా ఉంటుంది. మనిషి మాత్రమే ఇక్కడ… మనసు ఎక్కడో….

కాని, నాట్యం చేయమంటే మాత్రం బాగా ఆడుతుంది. తనని ఆపేవారే లేరన్నట్లుగా గుండ్రంగా తిరుగుతూ… నృత్యం చేస్తుంది. ఇప్పుడు అలాగే ఆడుతోంది. ఎందుకు నాట్యం చేస్తుందో తనకి తెలుసా? ఈ సందడిలో సలీమా చేరలేదు. నన్ను గమనిస్తోంది. తన బాధ నాకు తెలుస్తోంది. వాళ్ళ ఇంట్లో కొత్త అమ్మ వస్తే ఆమె పరిస్థితి ఏమవుతుందో? కొత్త అమ్మ… ఈ పదాలను తలచుకున్నప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది. అసలెవరైనా అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలరా? ఇవే మాటలని సలీమాతో అంటే థూ.. అంటూ నామీద ఉమ్మింది. ‘ఎవరూ మా అమ్మ కాలేరు…’ అంటూ అరిచింది.

ఇంక మేము కలిసి ఆడుకోడం లేదు. ఒకరి జడలు ఒకరు అల్లుకోడం లేదు, మామిడితోటలో తిరిగి పళ్ళు కోసుకోబోడం లేదు.. మొగుళ్ళ గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది. మా చుట్టూ సరిహద్దులు గీసే సమయం వచ్చేసింది.

ఎదుగుతున్న అందరి ఆడపిల్లల్లానే మేమూ మా పెళ్ళిళ్ల గురించి, భవిష్యత్తు గురించి అందమైన కలలు కన్నాం. పెళ్ళికొడుకు గుర్రం మీద వస్తాడు.. మేం కిలకిలా నవ్వుకుంటూ, కలే కదా అని తిరస్కరించినా… చివరికి అది నిజమై తీరుతుందని మాకు తెలుసు. మేం పుట్టినరోజు నుంచే మా అమ్మానాన్నలు మా పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తారనేది నిజం. ఆ శుభదినం యొక్క భారమేమిటో ఓ ఆడపిల్లగా మాకు తెలుసు. ఆడవాళ్ళుగా మేమెన్నో శాపనార్థాలకు గురవుతాం… మగపిల్లాడిని కనేదాకా.

ఊహించండి…. ఊహించండి.. ప్రస్తుతం కూడా మేము కిలకిలానవ్వుతూ తుళ్ళుతూ ఉన్నాం. ఈ ఊహాలోకంలో కూడా అతనెక్కడో ఉన్నాడు. అన్నం తింటూ, బ్రేవ్‌మంటూ త్రేన్పులు తీస్తున్నాడు. డుర్.. డుర్‌మని పిత్తుతున్నాడు.. సలీమా లోపలికి వస్తుంది. కళ్ళవెంట నీళ్ళు తిరిగేదాకా, మేం కింద నేల మీద దొర్లుతూ పడీ పడీ నవ్వుతాం. అతను ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు.. మా కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇవన్నీ మా చిలిపి ఊహాలే, ఆశలే. అందమైన కలల లోకం. నిత్యం ఎదురయ్యే కష్టాలు, బాధల నుంచి కొంచెం సేపయినా ఊరట కల్పించే కల్పనలవి.

సలీమా ఇంటి బయట డోలు మోగుతోంది. నిఖా పూర్తయింది. ఆ జంట.. ఇక దంపతులు. వరుడు మేళం వద్దని కోరడంతో, డోలు వాయిస్తున్న ఏకైక వాద్యగాడు పెళ్ళి పూర్తయిందనే శుభవార్తని ప్రకటించాడు. సలీమా వాళ్ళ నాన్న మొహం చూడాలి, పాపం కలవరానికి లోనవుతున్నాడు, ఈ సందడి సర్దుమణగాలని చూస్తున్నాడు. వధువు ఇంట్లో ప్రవేశించి, బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నాడు.

నా నోట్లో ఓ మిఠాయిని పెట్టింది అమ్మ. సలీమా నాకేసి అమర్యాదగా చూడడం నాకు తెలుస్తోంది. ఈ క్షణంలో మా సంబంధం మారిపోయింది. తను నన్ను గౌరవించాలి. నన్ను అంగీకరించాలి. ఎవరో పెద్దావిడ సలీమాని ముందుకు తోసింది. సలీమా ముందుకొచ్చి నా చేతిలో పసిబిడ్డని ఉంచింది. నా మెడలో ఉన్న పూలదండతో ఆడుతూ, బాబు కిలాకిలా నవ్వాడు. నేను తలెత్తాను, సలీమా గదిలోంచి బయటకి పరిగెత్తింది. నేనూ సలీమా వెనకే వెళ్ళాలనుకున్నాను. కాని కొత్త పెళ్ళికూతురుగా నా నుంచి జనాలు ఏం ఆశిస్తారో నాకు బాగా తెలుసు. పిల్లాడిని ముఖానికి దగ్గరగా ఉంచుకున్నాను. బాబు ఒదిగిపోయాడు, చిన్నగా చొంగ కార్చాడు.

నా పేరు హెన్నా, నా వయసు పదమూడేళ్ళు, నేనే పెళ్ళికూతురుని.

*

Download PDF EPUB MOBI

మూల రచయిత వివరాలు:

సుస్మితా భట్టాచార్య ముంబయికి చెందినవారు. ప్రస్తుత నివాసం ప్లేమౌత్, యుకె. కార్డిఫ్ విశ్వవిద్యాలయం నుంచి క్రియేటివ్ రైటింగ్‌లో ఎం. ఎ. పట్టా పొందారు. సుస్మితా భట్టాచార్య రచనలు –  Wasafiri, Litro, Penguin-India, Planet-the Welsh Internationalist, Commuterlit.com, the BBC వంటి పలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆమె రచనల వివరాలు ఈ బ్లాగులో లభ్యం:

http://susmita-bhattacharya.blogspot.co.uk

మూల కథ ఆంగ్లంలో “Where Do Dreams Disappear?” అనే పేరిట కాలిఫోర్నియా కాలేజి ఆఫ్ ది ఆర్ట్స్ వారి ఎలెవెన్ ఎలెవెన్ జర్నల్, జనవరి 2014 సంచికలో ప్రచురితం. మూలకథని ఈ లింక్ లో చదవచ్చు.

http://elevenelevenjournal.com/issue-16/susmita-bhattacharya/

 

Posted in 2015, అనువాదం, ఫిబ్రవరి and tagged , , , , , , , , , .

4 Comments

 1. యీ ‘హెన్నా’ కధను మున్షీ ప్రేంచంద్ కాని, ఇస్మత్ ఆపా కాని రాసుంటారులే ఇప్పటి సమాజంలో ఇన్ని బాధలు లేవేమోలే అనుకోవాలనుకున్నా, కాని కఠోర వాస్తవాలు అందుకు అడ్డువస్తున్నాయి.

  “భారతదేశంలోని మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా దళితుల కంటే వెనుకబడి ఉన్నారు. వీరి సరాసరి ఆదాయం ఇతర మతస్తుల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. దీనికి స్త్రీలలో నిరక్ష్యరాస్యత, అధిక సంతానం, నిరుద్యోగం, పేదరికం, భూములు లేకపోవడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్య, పరిజ్ఞానాలు లేకపోవడం, విద్యా విజ్ఞానాల పట్ల నిర్లక్ష్యవైఖరి లాంటి అనేక కారణాలున్నాయి . పట్టణ ముస్లింలతో పోల్చుకుంటే గ్రామీణ ముస్లింలలో పేదరికం మరీ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

  ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాల విషయంలో వీరు మరింత వివక్షకు గురవుతున్నారు. వీరు నివసించే ప్రాంతంలో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. రాజకీయ భాగస్వామ్యంలో కూడా వీరు వెనుకబడి ఉన్నారు.

  ముస్లింలు అన్నిరంగాలలోనూ సగటు పౌరుల కంటే వెనుకబడి ఉన్నారని, కొన్ని అంశాలలో దళితుల కన్నా హీనమైన పరిస్థితుల్లో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిషన్ వెల్లడించింది.

  భారతదేశం త్వరిగగతిన అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాలి. సమతౌల్యత లోపిస్తే అభివృద్ధి దేశ మనుగడకే సవాలుగా పరిణమిస్తుంది. ఈ వర్గాన్ని నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం పీడిస్తున్నాయి. వీటి నుంచి విముక్తిలభించాలి ” -ప్రేమ విఘ్నేశ్వర రావు

  ” నా పేరు హెన్నా, నా వయసు పదమూడేళ్ళు, నేనే పెళ్ళికూతురుని. “ వాక్యాలు హృదయాన్ని బరువెక్కించాయి. సరళమైన బాషతో, సహజమైన భావాలతో హృదయానికి హత్తుకునేలా సాగిన సోమశంకర్ గారి శైలి అనువాద కధ అనే భావననే కలిగించలేదు. సామాజిక సృహ, మానవతా దృక్పధంతో రచనలు చేస్తున్న శ్రీ కొల్లూరి సోమశంకర్ గారికి సవినయంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. వారి నుండీ మరిన్ని మంచి రచనలకై ఎదురుచూస్తున్నాం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.