cover

పండుజుట్టు గాడిల్లు

Download PDF EPUB MOBI

పప్పులవీధింట్లో ఇద్దరే ఉంటునారు. శరమ్మేషారూ కళ్ళజోడత్తానూ. నట్టిల్లు కప్పు పడిపోయింది దూలం పుచ్చిపోయి. పెరటిల్లూ పడే పడిపోయింది, పిచ్చిమొక్కలు పెట్టీసి పెరటికంటే ముందర చిన్న పాఁవుల పుట్టా అదీను ఇదే ఓ పెరళ్ళాగ. నట్టిల్లు కారిపోతునాది. గుడ్డలన్నీ చాకలి బుట్టలో కుక్కీసి, పరుపు చుట్త చుట్టీసి మంచం ఎత్తికట్టీసి ఇటువైపు సుబ్బరంగా కారకుండా ఉన్న మూల పెట్టీసి మాఁవగారిది పాత జంబుఖానా ఉంటే కప్పీసి పెట్టింది.

ఇటు వైపు కారకుండా ఉన్న మూల్న. ఈయన కుర్చీ ముందర వరండాలో వేసుకున్నారు. పెరట్లోంచి వంటింటి తలుపు గాలికి ధడీల్ ధడీలుమని చప్పుడూ, ఓ…మని నక్కలరుస్తునట్టుగ చప్పుడూను. “నక్కలే! నల్లావాళ్ళ కళ్ళాలంట కోళ్ళని తిండానికనొచ్చేయి…నక్కలూ!” అనీసి ఊరికే కుర్చీలోంచి లేచిపోతునారు శరమ్మేషారు. “నక్కలేఁవిటండీ అయ్యొ నక్కలు కాదు ఈయనికి ముసిలిపిచ్చొచ్చీసిందిరా. నక్కలు కాదు గాలి! గాలీ వానానూ…” అనీసి కళ్ళజోడత్త. లేచిపోతున్నతన్ని భుజాల్నొక్కి మళ్ళీ కూచోబెట్టి.

మళ్ళీ కుర్చీలోంచి నిలబడిపోయి నావైపే మరిచిపోయి ఏదో వెతుకుతున్నట్టుగ చూసి “నువ్వు పండుజుట్టు గాడి కొడుకువి కావుట్రా?” అంటునారు – అదే ప్రశ్న ఇప్పటికి ఆరో మాటు.

“కానండీ…”

“ఆఁ… పండుజుట్టు గాడి రెండో పిల్లడివి కావూ?”

“కానండీ మాఁయ్య్ గారూ!” అన్నాను తప్పు చేసిన వాళ్ళాగ. కర్రాలు గురువు గారి మనవణ్ణి, దొంగ రాఁవన్న గారి రెండోవాణ్ణి అమిరికాలో ఉంటునాఁవనీసి మూడూ మాట్లు చెప్పిందిప్పటికి. మళ్ళీ నా ప్రవరంతా చెప్పుకోవాలనిపించలేదు.

“కాఫీ తాగీరా నానా చల్లారేపోయిందీ!” అన్నాది. అడుక్కి ఇసకలాగ తగుల్తునాది కాఫీలో బెల్లం.

“ఇక్కడికెందుకు తెచ్చేవే పండుజుట్టు గాడింటికీ? ఇక్కడ జీబు జీబుమని నక్కల ఊళలూ ఇవీనూ? ఎలక చచ్చిన కంపూ ఇక్కడా! గెడ్డ పొంగితే ఇంట్లోకొచ్చెస్తుంది కాదుటే? మనింటికి పదా, ఇక్కడేఁవిటి?” అని లేచి నా పక్కనే నిలబడి తనూ చెప్పులు తొడిగీసుకుంటునారు శరమ్మేషారు. “అయ్యొ వల్లకాడు కూచోండి మీరలాక్కూచోండి ముందు! ఇది మనిల్లేనూ! పాత గుడ్డల మీద వాన్నీరు పడిపోయి ఇలాగ చి…న్న్న పిసరు వాసనొచ్చిందంతేనూ!” అని నాకు గొడుగు సాయం చేస్తునట్టు వీధిలోకొచ్చీసింది. “పితక్కా తడిసిపోయేవు ఇంట్లోకి వెళిపోవే పెద్దత్తా!” అంటే నవ్వుతునాది. “అక్ఖల్లేదిక్కడే బావున్నాదిరా నానా!” అని.

అర్జంటు పన్లున్నట్టు గబ గబా అంగలు వేసుకుని కరంటు స్తంభాన్నీ దూరంగా దాటిపోయి చీకట్లోకెళ్ళి పడిపోయేను. నక్కలు కావు, గాలేను. నడిచి నెమ్మదిగా వీధి కొసాకెళ్ళి అక్కడ కరంటు స్తంభం దెగ్గిరాగి వెనక్కి చూస్తునా ఇంకా అక్కడే నడ్రోడ్డు మీద నిలబడి చెయ్యూపుతునాది కళ్ళజోడత్త.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కథ, ఫిబ్రవరి and tagged , , , , , .

4 Comments

  1. “The Hands Together symbol _/|\_ ( formed with Underscore, Slash, Pipe, Backslash, Underscore ) represents the communication of a number of strong yet calm emotions or states of being like : Gratitude, Mindfulness, Strength, Kindness, Wisdom, Compassion, Calm, Connection, Respect” అని గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగించిన, ఓ బిందువులో సింధువంత భావాలను ఇమిడ్చిన ‘కల్హార’ ( meaning తెల్ల కలువ ? ) గారికి ఎర్రెరని వొందనాలు.
    “నువ్వు త్రిపుర గారి స్వాతి కుమారివి కావూ?” – ఇదే ప్రశ్న, నా మదిలో ఇప్పటికి ఆరో మాటు.

  2. బావున్నాదిరా నానా!”

    దూలం పుచ్చిపోయి నట్టిల్లు కప్పు పడిపోయి, పెరటిల్లు పిచ్చిమొక్కలు పెట్టీసి జీబు జీబంటున్న పప్పులవీధింట్లో ముసలిపిచ్చొచ్చిన శరమ్మేషారూకి గొడుగు సాయంగా ఉంటున్న కళ్ళజోడత్త; వీధి కొసాకెళ్ళిన దాకా నడ్రోడ్డు మీద నిలబడి చెయ్యూపే కళ్ళజోడత్త కాళ్లకు దండంపెట్టటానికి అనుమతివవ్వా త్రిపుర గారి కనకా.

    ఎందుకో తెలీదు త్రిపుర గారి కునీల్ అక్కయ్య, త్రిపుర గారి లక్ష్మి అమ్మగారు, దుగ్గిరాలలోని మా చిన్నత్త ఇంకా ఎందరెందరో అమ్మతల్లుల వాత్సల్యం నన్ను కమ్ముకునీసింది కుహనా దుఃఖాలకు ఉపశమనం కలిగిస్తూ.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.