cover5

ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ (దళిత్‌కెమెరా వీడియోల సమీక్ష)

Download PDF

“అనాదినుండి ప్రపంచం మరణిస్తూనే వుంది
అయినా ప్రపంచంలో ఎవరికీ
ఎలా మరణించాలో తెలియనే లేదు
మళ్ళీ మళ్ళీ మరణించాల్సిన అవసరం లేని విధంగా
చనిపోవడం నేర్చుకున్నాడు కబీరు”
(కబీరు మాటలకు కలేకూరి అనువాదం)

కలేకూరి దేవ వర ప్రసాద్ 2013 మే 17న ఒంగోలులో అంబేద్కర్‌ భవన్‌లో చనిపోయాడు. కృష్ణాజిల్లా కంచికచెర్ల ఇతని సొంత ఊరు. ఈ ఊరి నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన కుర్రాడు – ఈ ఊరి నుంచి పీపుల్స్‌వార్‌లోకీ, విరసంలోకీ, దళితమహాసభలోకీ, పత్రికా సంపాదకత్వంలోకీ జీవితాన్ని విస్తరించుకున్న కుర్రాడు – చనిపోవటానికి ముందు మళ్ళీ ఈ ఊరికి కుంచించుకుపోయాడు. కుటుంబం బరువుని భుజాల మీంచి దింపేసుకున్నాడు. తిండి తినక, స్నానం చేయక, మందుకీ సిగరెట్లకీ దేహాన్ని ఆరారగా వడ్డించాడు. జీవితపు చివరి రోజుల్లో అతను చావుని సత్వరం చేరుకోవాల్సిన గమ్యంగా ఎంచుకున్నట్టు కనపడతాడు. చనిపోయేదాకా జీవితాన్ని చంపుకుతిని చచ్చిపోయాడు.

అతని చావు వార్తలూ, నివాళి వ్యాసాలూ, కవితలూ అవేవీ నేను అంత శ్రద్ధగా చదవలేదు. కాని కొన్నాళ్ల క్రితం యూట్యూబులో అతని ఇంటర్వ్యూ ఒకటి తగిలింది. దానితో పాటు ఇంకొన్ని వీడియోలూ చూశాను. అవన్నీ నేను ఇప్పటిదాకా పరిచయం చేసుకోని ప్రపంచం వైపుకి నన్ను నెట్టేశాయి. కులం నా జీవితంలో ఎప్పుడూ పెద్దగా కలగజేసుకోలేదు. కలగజేసుకున్న సందర్భాలున్నా, వాటిని ఒకదాన్తో ఒకటి సంబంధం లేని వేర్వేరు సంఘటనలుగానే చూసాను తప్ప ఒకే వాస్తవం తాలూకు సింప్టమ్స్‌గా గుర్తించలేకపోయాను. ఇప్పుడీ కలేకూరి ఆఖరి ఇంటర్వ్యూ నన్ను కదిలించింది. ఆ కదలికని గుర్తుగా ఉంచుకునే ప్రయత్నం ఇది. ఆసక్తి ఉన్న మరికొందర్ని ఈ వీడియో వైపు పంపే ప్రయత్నం కూడా.

* * *

చనిపోక ఏడాది ముందు కలేకూరి ప్రసాద్ యాభయ్యో పుట్టినరోజు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగింది. హైదరాబాద్ నుంచి పాత మిత్రులు వచ్చారు. సన్మానించారు. వెళ్ళిపోయారు. అప్పట్నుంచి చనిపోయేదాకా కలేకూరి అంబేద్కర్ భవన్లోని ఒక గదిలో ఎక్కువకాలం గడిపాడు. అదే గదిలో చనిపోయాడు.

దళిత్ కెమెరా” అనే యూట్యూబు ఎకౌంటువాళ్ళు అతని శవయాత్ర అంతా వీడియో తీసి పెట్టారు. కలేకూరి ఇంటి గుమ్మం ముందు చావుడప్పు కొడుతున్న దృశ్యంతో వీడియో మొదలవుతుంది. ఇంటి అరుగు మీద గాజుపెట్టెలో ఉన్న శవం చుట్టూ జనం మూగి ఉంటారు. గోరటి వెంకన్న పాట అందుకుంటాడు: “కాసుల మూటలను ప్రసాదూ, కాగితాలుగా చూసినావుప్రసాదు/ వెర్రి సెంటిమెంట్లు ప్రసాదూ ఎంటికోలె దీసేశినవ్ ప్రసాదూ/ ఆస్తులన్ని చెరిపి ప్రసాదూ యుద్ధగీతమయ్యినావు ప్రసాదూ/ నీ పెదవి నవ్వులో ప్రసాదూ బుద్ధుని మోము ఉంటాది ప్రసాదూ/ నీ బతుకురూపాన ప్రసాదూ యోగి వేమన తీరుంది ప్రసాదూ” అంటూ బహుశా అప్పటికప్పుడు కల్పించి పాడిన ఈ పాటకి డప్పు సురేషు డప్పు కొడతాడు. ఇంటి నుంచి శవాన్ని చర్చికి తీసుకెళ్తారు. అక్కడ ప్రార్థనలు ఐన తర్వాత శవపేటికను ట్రాలీఆటో వెనకతొట్టిలోకి ఎక్కిస్తారు. బిటెక్ చదువుతున్న కొడుకు సాహు ప్రకృత్ ఆటో తొట్టిలో శవపేటిక పక్కన నిలబడ్డాడు (ఇరవై చిల్లర వయసుంటుంది, రఫ్ గెడ్డంతో, జీన్సు ఫాంటుతో, పొట్టి చేతుల చొక్కాతో ఉంటాడు). కంచికచెర్ల దళితవాడలోంచి శవయాత్ర సాగుతుంది. కుదమట్టంగా ఉన్న ఇళ్ళలోంచి చాలామంది ఆడవాళ్లూ పిల్లలూ వీధిగుమ్మాల్లోకి వచ్చి ఈ సందడి చూస్తుంటారు. మే నెల ఎండలు తల పేలగొడుతుండటంతో ట్రాలీఆటో వెనక నడిచేవాళ్లు చాలామంది నెత్తి మీద జేబురుమాళ్ళో చెంగులో వేసుకు నడుస్తారు. ఈ గుంపుతో నడుస్తున్న డప్పు సురేషు మైకు తీసుకుని “పల్లె పల్లెనా.. దళిత కోయిలా.. బతుకుపాట పాడుచుండగా” అని ఈ చావుసందర్భంలో పాడటం మొదలుపెడతాడు. (కలేకూరి రాసిన ఈ పాట పూర్తివెర్షను) అప్పటిదాకా చావుదరువుగా మాత్రమే వినిపించిన డప్పుమోత ఉన్నట్టుండి పాటకు పక్కదరువౌతుంది. చామంతి రేకలు ఎగురుతాయి. వీళ్ళందరికీ వెనక కొన్ని కార్లు ఇరుకుసందుల్లో పట్టని పిర్రల్తో నెమ్మదిగా కదుల్తుంటాయి. ఒక కారుపై బిఎస్పి పార్టీ జెండా ఎగురుతుంది, కొంతమంది వైకాపా నాయకులు కూడా హాజరయ్యారు. గుంపు నెమ్మదిగా ఊరి చివర క్రైస్తవ స్మశాన వాటికకు చేరుకుంటుంది.

autoశవం స్మశానంలోకి వెళ్లాకా, దళిత్ కెమెరా వీడియోగ్రాఫర్లు కలేకూరి స్నేహితులు కొంతమందిని కదిలించి మాట్లాడించారు. వీడియో తీస్తున్నవాళ్లకి కలేకూరి వ్యక్తిగత జీవితం గురించి రాబట్టాలని ఉంది కానీ మాట్లాడిన ఇద్దరు ముగ్గురు స్నేహితులూ అతని సేవా పోరాట జీవితాల గురించే మాట్లాడతారు. ఒకాయన డర్బన్ అస్పృస్యతా సదస్సులో కలేకూరి మాట్లాడిన సంగతి గుర్తు చేస్తాడు. ఒకాయన క్రైస్తవ దళిత కుటుంబంలో పుట్టిన కలేకూరి క్రీస్తు కష్టాలన్నీ దళితులే పడుతున్నారని గుర్తించి బహుజనుల తరపున పోరాడాడని చెప్తారు. కెమెరా మరో గుంపు దగ్గరకి వెళ్తుంది. అక్కడ రామలింగం అని ‘జనశక్తి’ పార్టీ ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో దళితులకు చోటు లేకపోవటం గురించీ, కమ్మ కులస్తుల ప్రాబల్యం గురించి ఘాటుగా మాట్లాతాడు. “కమ్యూనిస్టు పార్టీలో దళితుల్ని ఎంటర్ కానీలేదు…” అని మొదలుపెడతాడు. ఆయన ఏ సందర్భంలోనో ఎనభై మంది కమ్యూనిస్టు పార్టీ నాయకుల పేర్లు నోట్ చేస్తే అందులో రెండేరెండు పేర్లు మాలోళ్లవి ఉన్నాయట. మళ్ళీ ఆ ఇద్దరిలో కూడా ఒకడు కొండపల్లి సీతారామయ్య (రెడ్డి) ఇంట్లో పని చేసే పాలేరట. కమ్యూనిస్టు పార్టీ మొదట్నుంచి ఇప్పటిదాకా కూడా కమ్మోళ్ళ ఆధ్వర్యంలోనే సాగుతుందని అంటాడాయన. ఆ గుంపులో ఉన్న పైడి తెరేష్ బాబు కూడా సాభిప్రాయంగా తలూపుతాడు. ఆయన తర్వాత గుంపుకి దూరంగా వచ్చి నిలబడి ఉన్నప్పుడు వీడియోగ్రాఫర్ వచ్చి మాట్లాడిస్తాడు. ఆయన ఇంగ్లీషులో మాట్లాడతాడు. చావుడప్పుల నేపథ్యంలో వినిపించే ఆ మాటలు చిన్న బయోగ్రాఫిక్ స్కెచ్చులాగా ఉన్నాయి గానీ, కలేకూరితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని గురించి ఏమీ చెప్పవు. “కలేకూరి ప్రసాద్ మార్క్సిజాన్నీ, అంబేద్కరిజాన్నీ నమ్ముతూ గౌరవిస్తూనే వాటికి బుద్ధిస్ట్ కోణాన్ని జోడించాడు” అని చెప్తారు.

కెమెరా తర్వాత శ్మశానంలో తవ్వి వుంచిన గోతి దగ్గరకు వెళ్తుంది. చుట్టూ చాలామంది జనం గుమికూడి ఉంటారు. ఈ గుంపులోంచి దారి చేసుకుంటూ ఎవరో చలువకళ్ళద్దాలావిడ ముందుకు వస్తుంది. ఈవిడ్ని చూసి గుంపులో ఒకావిడ పక్కావిడకి “వాళ్ళ అక్క” అని చెప్తుంది. (కలేకూరి బావ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్). తెల్లగౌనేసుకున్న ఫాదర్ ప్రార్థన చదువుతాడు. చుట్టూ నినాదాలు. “జోహార్ కలేకూరి ప్రసాదూ”, “దళిత ధిక్కార కవి కలేకూరి ప్రసాదూ”, “వెనకబడ్డ కులాల ఆశాజ్యోతి కలేకూరి ప్రసాద్” అని అరుస్తూ పేటికని గోతిలోకి దించి పైన మట్టిపెళ్ళలు చల్లుతారు. కొందరు సహచరులు పాటలు పాడతారు. కొడుకు సాహుప్రసాద్ ఏడుస్తాడు.

ఇదంతా జరిగిన తర్వాతో, జరగక ముందో తెలియదుగానీ – ఒక టెంటు కింద వేసవి సెగలకి చెమటలు కక్కుతున్న కలేకూరి సన్నిహితులు కొందర్ని “దళిత్ కెమెరా” ఇంటర్వ్యూలు చేసింది. ఇంటెలెక్చువల్ అంబటి సురేంద్రరాజు మాట్లాడుతూ, “కలేకూరి తనకు చాలా లేటుగా తెలిసాడని, తను డిక్టేట్ చేస్తుంటే ఆర్టికల్స్ రాసిపెట్టేవాడనీ” చెప్పారు. కలేకూరి గురించి “వాడు” అంటూ ఈయన చెప్పిన మాటల్ని బట్టి ఇద్దరికీ చాలానే సాన్నిహిత్యం ఉందనిపిస్తుంది. కానీ కలేకూరి ఇద్దరు కొడుకుల్లో చిన్నకొడుకు ఈమధ్య చనిపోయాడనీ, అప్పట్నించీ ఆ బాధ అతణ్ణి మరింత పట్టిపీడించిందనీ ఇంటర్వ్యూ చేస్తున్నతను ప్రస్తావిస్తే, అసలు ఆ సంగతే తనకు తెలియదంటాడు సురేంద్రరాజు. కలేకూరి గురించి వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన చాలామంది మాటల్లో ఈ తీరే ఉంటుంది. ఎంతో దగ్గర మనిషి గురించి మాట్లాడినట్టు మాట్లాడినా ఎవరికీ అతని లోపలి ప్రపంచంతో పరిచయం ఉన్నట్టు అనిపించదు. అతని మరణం తర్వాత ఎంతో ఆత్మీయంగా నివాళులు రాసినవారు కూడా అతన్ని చేరటంలో తమకెదురైన గోడల్నే వర్ణించినట్టు అనిపిస్తుంది.

* * *

3కలేకూరి చనిపోక ముందు దళిత్‌కెమెరా తరపున అతడ్ని ఇంటర్వ్యూ చేసినవారు రవిచంద్రన్ అనే దళిత హక్కుల కార్యకర్త. ఇతనికి కలేకూరి గురించి ఏమీ తెలియదు, ఈ రాష్ట్రంలో కులరాజకీయాల గురించి పరిచయం లేదు, అసలు తెలుగే సరిగ్గా రాదు. కాబట్టి ఇంటర్వ్యూ పైపైనే సాగుతుంది. కలేకూరి గురించి బహుశా అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ వినపడతాయి. వీడియోలో కలేకూరి పరిస్థితి చూసి జాలేస్తుంది. కలేకూరి అందం గురించి, ముఖ్యంగా అతని నవ్వులోని సమ్మోహన శక్తి గురించి కొంతమంది చెప్పారు. ఈ నివాళిలో పెన్నూ సిగరెట్లు పట్టుకున్న ఆయన చేతివేళ్ల గురించి మాటలున్నాయి. ఈ వీడియోలో కవిత చదువుతున్న గొంతులో ఇనుపచువ్వ కాఠిన్యం తలగడదూది మెత్తదనం తోపాటు, కవితలో ఉద్వేగానికి తగ్గట్టు కదులుతున్న చేతుల్లో కొంగ రెక్కల గ్రేస్ చూడొచ్చు. కానీ ఈ ఇంటర్వ్యూలో కనిపించే కలేకూరిలో ఈ అందం తాలూకు అవశేషాలు కూడా లేవు. అసలు ఇద్దరు టీచర్లకు పుట్టిన కొడుకనిపించడు, కవి విమర్శకుడు అనువాదకుడు అనిపించడు, డర్బన్‌ అంతర్జాతీయ అస్పృశ్యతా సదస్సులో పాల్గొన్న భారతీయ డెలిగేట్ అనిపించడు. రాత్రింబవళ్లు కల్లుకంపౌండ్లో తాగుతూ పెంకిగా ఛిద్రమైపోయే రోజుకూలీలా కనిపిస్తాడు. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా కాస్త తాగి ఉన్నాడు. అయితే, ఏం చెప్తున్నాడో తనకే తెలియని స్థితిలో లేడు. ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్రన్‌కు ముందే ఒక ఎజెండా ఉంది. లెఫ్టిస్టు విప్లవోద్యమంలో కులవివక్ష అనే పార్శ్వాన్ని బయటకు లాగాలన్నది అతని ఉద్దేశం. అలాగే కలేకూరి, కె.జి సత్యమూర్తిల జీవితాలు ఇలా ఒకేలా ఒంటరి తీరాల్లో ముగిసిపోవటం వెనుక కులం పాత్ర నిరూపించాలన్నది మరో ఉద్దేశం. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి అతను కలేకూరి నోట్లో తన మాటలు కూరాలనే తొందరపాటు కనపరుస్తాడు. అయితే, కలేకూరి తాగివున్నా కూడా, అన్నింటినీ నలుపు తెలుపుగా విడదీసి చూపించాలనే రవిచంద్రన్ ప్రయత్నాలకి తలవొగ్గలేదు. ఆ వీలు లేని చోట అలా విడదీయటం కుదరదనే చెప్పాడు. అలాగే నిజం ఎత్తి చెప్పాలన్న చోట ఎక్కడా కప్పదాట్లు వేయలేదు.

 “నేను ఎప్పుడు పుట్టానో గానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను” అని మొదలవుతుంది కలేకూరి ప్రసిద్ధ కవిత ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’. ఈ కవితను చెప్తున్నది విశ్వజనీనమైన దళిత స్వరం. కవితలో ఈ స్వరానికి ఒక ప్రతినిధిగా అరికట్ల కోటేసు ప్రస్తావన ఉంటుంది. 1968 ఫిబ్రవరి 24న ఇతడ్ని పెద్దకులంవాళ్లు పందిరిగుంజకు కట్టేసి కిరసనాయిలు పోసి కాల్చేశారు. పైకి దొంగతనం నెపం వేసినా అసలు కారణం మాత్రం వాళ్ళింట్లో ఆడావిడతో అక్రమసంబంధం పెట్టుకోవటం (కలేకూరి దీని ఆధారంగానే ‘అంటరాని ప్రేమ’ కవిత రాశాడు). కాలిన శరీరంతో ఎలాగో ఆసుపత్రికి, అక్కడ్నించి పోలీస్టేషన్‌కీ, మళ్లీ ఆసుపత్రికీ పరిగెత్తి రెండ్రోజులు యాతన పడి చచ్చిపోయాడు కోటేసు. దళితులపై అకృత్యాలు జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకున్న మొదటి సందర్భం ఇది. బాబూ జగజ్జీవనరాం పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడారు. ఒక అంతర్జాతీయ పత్రికలో కూడా వార్త వచ్చింది. మూడు కోర్టుల్లో కేసు నడిచింది. చివరికి సాక్షులందరూ ఎదురుతిరగటంతో సుప్రింకోర్టు ఒకర్ని మాత్రం నిందితునిగా తీర్మానిస్తూ జడ్జిమెంటు ఇచ్చింది. ఈ కోటేసును హత్య చేసిన ఊళ్ళోనే పుట్టాడు కలేకూరి. అది జరిగేటప్పటికి అతనికి ఐదేళ్ళ వయసుంటుంది. ఊరి జనం దీని గురించి కథలు కథలుగా చెప్పుకోవటాన్ని వింటూ పెరిగాడు. కోటేసు హత్య కలేకూరి జీవితం మీద ఒక నీడలా పాకింది. కోటేసు చైతన్యం ఒక డ్రయివింగ్ ఫోర్సులా పన్చేస్తుంది కలేకూరిలో అంటారు కృపాకర్ మాదిగ. కోటేసే పునర్జన్మించి కలేకూరిగా పుట్టాడని అంటారు కవి శిఖామణి. మరణించటంలో కూడా కోటేసునే అనుసరించిన వైనాన్ని చిత్రిస్తారు పైడి తెరేష్ బాబు తన కవిత ‘ప్రస్తుతం ఈ నంబరుతో ఏ చెలి ఫోనూ పనిచేయడం లేదు’ లో.

కలేకూరి పుట్టింది ఒక క్రైస్తవ కుటుంబంలో. అమ్మ లలితా సరోజిని నాన్న శ్రీనివాసరావులు ఇద్దరూ టీచర్లే. మాలవాడలో ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుచెప్పేవారు. జీతాలు ఐదారునెల్లకి వస్తూండటంతో కూలీలుగా కూడా వెళ్లాల్సి వచ్చేది. కలేకూరి మూడు నుంచి ఏడో తరగతి వరకూ ఏలూరులో అలెగ్జాండర్ హైస్కూల్లో చదువుకున్నాడు. తర్వాత పది దాకా సొంతూరు కంచికచెర్లలోనే చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ కోసం గుంటూరు ‘ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి’లో చేరడం తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చిందని చెప్తాడు. ఇక్కడ వేర్వేరు అనుభవాలున్న స్నేహితులు పరిచయమయ్యారు. ఈ పరిచయాల ద్వారానే, ఇంటర్మీడియట్‌తో చదువుకు స్వస్తి చెప్పి, 1980 ప్రాంతంలో రాడికల్ యూత్ లీగ్‌లో చేరాడు. విప్లవ రచయితల సంఘం లోనూ సభ్యుడయ్యాడు. ఆ తొలి రోజుల్లో దళిత్ ఇష్యూ కన్నా, విప్లవమే ముఖ్యమైన విషయంగా కలేకూరి భావించాడు. ఈ విశ్వాసమే 1985లో ఆయన్ని నక్సల్ మూమెంట్లో కూడా చేరేలా చేసింది. సరిగ్గా అప్పుడే దళిత చైతన్యమంతా ఒక చోట ఘనీభవించటానికి కారణమైన సంఘటన జరిగింది.

ప్రకాశం జిల్లా కారంచేడులో 1985 జులై 16న రాయినీడు శ్రీనివాసనే కమ్మ కులస్థుడు దళితులు వాడుకునే మంచినీళ్ళ చెరువు దగ్గర బర్రెలు కడుగుతున్నాడు. అది చూసి కత్తి చంద్రయ్య, మున్నంగి సువార్తమ్మ అనే దళితులు అడ్డువెళ్ళారు. ఒకర్నొకరు కొట్టుకునేదాకా వచ్చింది. అప్పటికెలాగో గొడవ సద్దుమణిగినా, ఆ రాత్రి మళ్ళీ ఓ ఇరవైమంది కమ్మవాళ్లు సువార్తమ్మ ఇంటి మీదకు వచ్చి ఆమెని బయటకు లాగి కొట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా దళిత పెద్దలు సముదాయించి వాళ్ళని వెనక్కి పంపారు. ఆ రాత్రి దళితవాడ మామూలుగానే నిద్రపోయింది. కానీ కమ్మ కులస్తులు మాత్రం నిద్రపోలేదు. గత ఎన్నికల్లో తమ పార్టీయైన తెలుగుదేశానికి ఓట్లేయకుండా దళితులంతా కాంగ్రెసుకు ఓటేయటం మీద అప్పటికే వాళ్లు అక్కసుతో ఉన్నారు. అలా ఒక రాజకీయ నేపథ్యమూ తోడైంది. ఆ మరుసటి రోజు తెల్లారేటప్పటికి చుట్టుపక్క ఊళ్ళ వాళ్ళతో పాటు రెండు వేలమంది దాకా కమ్మవాళ్ళు కలిసి దళిత వాడ మీద బరిసెలు, గండ్రగొడ్డళ్ళూ, సరిగబాదులతో విరుచుకుపడ్డారు. (దాడిలో భర్తను కోల్పోయిన సులోచన.) ఆరుగుర్ని చంపారు, అరవైమందిని కదల్లేనంతగా కొట్టారు, ఆడవాళ్లని రేప్ చేశారు (పౌర హక్కుల కమిటీ రిపోర్టు). దేశమంతా చర్చ జరిగింది. మరో వారం పది రోజుల పాటు తెలుగు దినపత్రికలు ముందు పేజీల్లో ఈ సంఘటన గురించి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాయి. తమకు ఓట్లేసినందుకే దళితులపై తెలుగుదేశం వాళ్లు దాడి చేయించారని కాంగ్రెస్ వాళ్లన్నారు. చెరువు దగ్గర జరిగిన ఒక మామూలు కొట్లాటకి కాంగ్రెసు వాళ్లు రాజకీయ రంగుపులుముతున్నారని తెలుగుదేశం వాళ్లన్నారు. అసలు దళితులదే తప్పనిపించేలా వింత వక్రీకరణలూ జరిగాయి. ఇదిజరిగిన రెండేళ్ళ తర్వాత 1987లో, ఈ దాడికి ప్రధాన కారకుడని అంతా భావించిన కారంచేడు భూస్వామీ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు స్వయానా వియ్యంకుడూ ఐన దగ్గుబాటి చెంచురామయ్యని పీపుల్స్ వార్ నక్సలైట్లు ఇంటి దగ్గర చంపేశారు. ఈ హత్యకి ముందు కొబ్బరిబొండాలు అమ్ముకునేవాడి వేషంలో రెక్కీ నిర్వహించినవారిలో కలేకూరి కూడా ఉన్నాడు.

ఏదేమైనా కారంచేడు సంఘటన ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమం పురుడుపోసుకుంది. దళితుల హక్కుల కోసం కత్తి పద్మారావు నేతృత్వంలో ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ ఏర్పాటైంది. “విరసం సరిగ్గా స్పందించి ఉంటే దళితమహాసభ వచ్చేది కాదు” అంటాడు కలేకూరి. విరసం, ఇతర కమ్యూనిస్టు నాయకులూ కారంచేడు సంఘటనని భిన్న వర్గాల మధ్య ఘర్షణ (class struggle) గానే చూశారు తప్ప, భిన్న వర్ణాల మధ్య ఘర్షణగా (caste struggle) చూడటానికి నిరాకరించారు. మార్క్సిస్ట్ అయినంతనే మతం, కులం పోతాయి/ పోవాలంటూ పిడివాదంతో అరువు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఇక్కడ గుడ్డిగా ఆపాదించారే తప్ప, కట్టెదుటి వాస్తవాలకు తగ్గట్టు దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. కమ్యూనిస్టు పార్టీల్లో కులం గురించి మాట్లాడటం మీద ఉన్న అప్రకటిత నిషేధం గురించి గద్దర్ మాట్లాడతాడు. “యాలరో ఈ మాదిగ బతుకు” అని పాట మొదలుపెట్టినా చివరికి మాత్రం “శ్రమజీవుల విముక్తికై పిడికిలెత్తి బాస చెయ్” అని ముగించాల్సిన ఒత్తిడి గురించి చెప్తాడు. విప్లవోద్యమంలో దళితులు భాగం కావాల్సిందే గానీ, దళితులకో ఉద్యమం ఉండటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఒప్పుకోలేకపోయింది. అందుకే విప్లవోద్యమం కలేకూరిని పోగొట్టుకుంది. “కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత విరసం లీడ్ రోల్ ప్లే చేయాల్సింది. అది చేయలేదు. అది చేసుంటే దళిత మహాసభ పుట్టేది కాదు. బయట ఉండి కామెంట్స్ విసరడం, సలహాలీయటం అంతే జరిగింది. పైపెచ్చు, దళిత మహాసభ మీద విమర్శలు చేయటం…” అంటాడు కలేకూరి.

అయితే విరసం నుంచి కలేకూరి వెంటనే బయటికి రాలేదు. 1991 దాకా క్రియాశీలక సభ్యునిగా పని చేస్తూనే ఉన్నాడు. పార్టీ సలహాపై కారంచేడు సంఘటనపై ఒగ్గు కథ కూడా రాశాడు. విరసం నుంచి బయటికి రావటానికి సైద్ధాంతిక కారణాలతో పాటు, ఒక వ్యక్తిగత కారణం కూడా తోడైంది. కలేకూరి ఇదే ఇంటర్వ్యూలో చెప్పిన ఒక మాట బహుశా అతను కూడా గ్రహించనంత లోతైన నిజం: “పాలిటిక్స్ ఆర్ మై పర్సనల్ లైఫ్, అండ్ మై పెర్సనల్ లైఫ్ ఈజ్ పొలిటికల్”. ఇలా వ్యక్తిగత జీవితం రాజకీయమై రచ్చకెక్కిన ఒక సందర్భం అతను ప్రేమలో పడటం. విరసంలో పని చేస్తూ, విజయవాడ ‘ఆంధ్రభూమి’లో ట్రయినీ సబెడిటర్‌గా చేరిన కలేకూరి అక్కడే పని చేస్తున్న నవత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె విరసం వ్యవస్థాపక సభ్యుడైన చలసాని ప్రసాద్ కుమార్తె. ఈ ప్రేమ విరసం సభ్యుల్లో చాలామందికి నచ్చలేదు. అంత అభ్యుదయ ఆదర్శాలతో ఏర్పడిన ఈ సంఘంలో సభ్యులు కూడా, పైకి ఎన్ని కారణాలు చెప్పినా, ఈ ప్రేమని కులం కారణంగానే వ్యతిరేకించారని కలేకూరి నమ్మకం. చలసాని ప్రసాద్ అంగీకారమైతే ఉంది. అది ఎంత మనస్ఫూర్తిగా అన్నది తెలియదు. వరవరరావు, ఆయన మేనల్లుడు వేణుగోపాల్ వీళ్ల వ్యతిరేకత ఎక్కువ. “మా ఇద్దర్నీ అవాయిడ్ చేశారు. మేం ఎక్కడో చోట రెంట్‌కి తీసుకుని వుండేవాళ్లం. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చేవారు. They didn’t even care to say hello to me. నన్ను వదిలేసి ఇట్లా వెళిపోయి నవతతో మాట్లాడటం, తినడం, టీ త్రాగటం… అట్లాంటివి. అది చెప్పటానికి చిన్నదే కానీ… అప్పుడు బాగా హ్యుమిలియేట్ అయ్యాను. ఒకరోజు కాదు, రెండ్రోజులు కాదు, కంటిన్యువస్‌గా.” కలేకూరిని ఈ అవమానం బాగా దెబ్బతీసింది. ‘అవమానం ఈ దేశంలో విరగ పండే సంపద’గా అతను గుర్తించిన మొదటి సందర్భం ఇది. దీని ప్రభావం మరింత తీవ్రంగా పడటానికి అతని మనస్తత్వం కూడా ఒక కారణం. కలేకూరి తన దళిత ఐడెంటిటీని పూర్తిగా అంగీకరిస్తూనే, ఆ ఐడెంటిటీ వల్ల వచ్చిపడే అవకరాలు లేని ఒక జీవితాన్ని కోరుకున్నాడనిస్తుంది. అది వీలయే ఒక ఎడ్యుకేటెడ్ సమాజం మధ్య మనుగడని కోరుకున్నాడు. అది అమాయకత్వమని తెలిసొచ్చేలోగానే బోలెడు గాయాలయ్యాయి. ఎన్నో అవమానాలూ పడ్డాడు. ఒకమ్మాయి విషయంలో కలేకూరిని గదిలో కట్టేసి కొట్టారన్న ప్రస్తావన ఉంది. అందుకే అంబటి సురేంద్రరాజు అంటారు: “He should have taken more care about his reality in to which he was born. అది పెద్దగా చేయలేదనే నా కంప్లయింటు… రివల్యూషన్ లో elite తో తన ఇంటరాక్షన్ ఏదైతే ఉందో… వాళ్లతో కలవటం వల్ల బాగా నష్టపోయాడనుకుంటాను. తనకి ఆ స్పష్టత ఉండుంటే బాగుండేది. వాళ్లు అందర్నీ ఇలానే చేస్తారు, అదో ట్రాప్, కలేకూరి లాంటి బాక్ గ్రౌండు నుంచి వచ్చిన కుర్రాడు ఆ ట్రాప్ లో పడిపోయాడు. చాలా దెబ్బపడింది వాడి పెర్సనాలిటీ మీద. బాగా గాయపర్చారు వాణ్ణి. ఏ తప్పు లేకుండా చాలా చెడ్డాడని, దుర్మార్గుడనీ, anti woman అనీ, కొడతాడని ఇలా అన్నీ! వాళ్లు చెప్పినట్టు పడి ఉంటాడనుకన్నారు… కానీ వీడలాంటి వాడు కాదు. He failed them that way. But it affected him also, in a deeper level.”

మొత్తానికి త్వరలోనే ఇద్దరు ప్రేమికులూ విడిపోయారు: “నా పొరపాట్లూ ఉన్నాయి. ఆమె పొరపాట్లూ ఉన్నాయి. నేను అడ్జస్ట్ అయి ఒదిగి ఉండగలిగుంటే ఉండేదేమో. లేదూ తను నన్ను అర్థం చేసుకుని ఉన్నా కుదిరేదేమో. రెండూ జరగలేదు.” అప్పట్లో కలేకూరి ‘యువక’ అనే పేరుతో కవిత్వం రాస్తుండేవాడు. ‘నవత’ అన్న పేరు చూసి ‘యువక’ అని పెట్టుకున్నాడో లేదో తెలియదు గానీ, ఈ రెండు పేర్ల కలయిక లాంటి ‘కవన’ అనే పేరును తనకు కూతురు పుడితే పెట్టుకోవాలనుకున్నాడు. (తర్వాత అది ఒక స్నేహితుని కూతురుకి పెట్టాడు.) కుటుంబ జీవితం మీద కలేకూరికి ఎప్పుడైనా ఏవైనా ఆశలుంటే అవి ఈ బంధంతో పాటే చచ్చిపోయాయి. కానీ ఇది కేవలం ప్రేమగాయం మాత్రమే కాదు. అతని దళిత ఐడెంటిటీకి లోతుగా తగిలిన గాయం. తనది మాల కులం అన్న సంగతిని సమాజం ఎప్పటికీ మరిచిపోదన్న సత్యం తెలిసొచ్చిన సమయం. అప్పటిదాకా మార్క్సిస్టు సిద్ధాంతం యొక్క మౌలిక స్వభావం వల్లనే విప్లవ పార్టీలు దళిత ప్రశ్నను నిర్లక్ష్యం చేస్తున్నాయని అనుకునేవాడు. కానీ తన ప్రేమ విషయంలో సోకాల్డ్ అభ్యుదయవాదులే కులం కారణంగా తనను వెలివేసిన తీరు చూశాకా, కులం గోడలు ఎంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయో కలేకూరికి అర్థమైంది.

వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని విరసానికి లేఖ రాసి బయటకు వచ్చేశాడు. ఇటు ఆంధ్రభూమిలో ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి 1991లో తిరిగి కంచికచెర్ల వెళ్ళిపోయాడు. తన దళిత ఐడెంటిటీ ఎక్కడ ఇముడుతుందనుకున్నాడో అక్కడికే తన కార్యక్షేత్రాన్ని మార్చుకున్నాడు. కంచికచెర్లలో అంబేద్కర్ యువజనసంఘం తరపున కొన్నాళ్లు పని చేశాడు. గోకరాజుపల్లి గ్రామంలో కమ్మకులస్తుల చేతిలో చనిపోయిన మాదిగ కుర్రాడి తరపున పోరాడాడు, ధర్నా నిర్వహించాడు. 1991లో చుండూరు సంఘటన జరిగినపుడు దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు కంచికచెర్ల వచ్చాడు. ఇప్పుడే కలేకూరి దళిత మహాసభలో చేరాడు. అతడ్ని కృష్ణాజిల్లాకు ప్రెసిండెంటుగా నియమించారు. ఈ దశలో విస్తృతంగా చదువుకున్నాడు. అంబేద్కర్, ఫూలేలని చదివి జీర్ణించుకోవటంతో పాటు, చేగువేరాను మొదలుకొని లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యం అంతా చదివాడు. తనదైన దృక్పథం బలపర్చుకున్నాడు.

ఈ సమయంలోనే ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చిన కలేకూరికి అక్కడ కె.జి. సత్యమూర్తి (శివసాగర్)తో పరిచయం మొదలైంది. ఈ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్రన్ చివర్లో కలేకూరి, సత్యమూర్తిల జీవితాలకు పోలిక తెచ్చే ప్రయత్నం చేస్తాడు. రెండు జీవితాలూ చివరికొచ్చేసరికి ఏకాకిగా మిగిలిపోయిన తీరును ఎత్తి చూపుతాడు. కలేకూరి ఈ పోలికని పూర్తిగా ఒప్పుకుంటున్నట్టు అనిపించడు. “ఆయన గొప్ప లీడర్, నేను పిల్లవాడ్నే” అంటాడు. ఈ మాటల్లో అణకువ తోపాటు, ఒక అవగాహన కూడా ఉంది. కలేకూరితో పోలిస్తే సత్యమూర్తిది నిజంగానే చాలా కార్యసమృద్ధమైన జీవితం. కలేకూరి విరక్తితో స్వచ్ఛందంగా అస్త్రసన్యాసం చేసినవాడు. సత్యమూర్తి చివరి వరకూ యుద్ధం చేసేందుకే ప్రయత్నం చేశాడు. అయితే తమ ఇద్దరి పతనం వెనుకా కులం పొడిచిన పోటే ఉమ్మడి కారణం అంటాడు కలేకూరి.

k.g.satyamurthy

కె. జి. సత్యమూర్తి

కలేకూరి లాగానే, కె.జి. సత్యమూర్తి కూడా మొదట్లో కులపోరాటం కన్నా వర్గపోరాటమే ముఖ్యమని నమ్మి విప్లవోద్యమంలోకి దిగాడు. కొండపల్లి సీతారామయ్యతో కలిసి పీపుల్స్ వార్ స్థాపించాడు. అటు అడవుల్లోకి చేరి తుపాకి పట్టి ఉద్యమిస్తూ, ఇటు శివసాగర్ పేరిట కవితలు రాశాడు. అయితే ఎనభైల్లో, బహుశా కారంచేడు సంఘటన తర్వాత, సత్యమూర్తికి కులం అనేది పక్కకు పెట్టలేని అంశమని అర్థమై ఉంటుంది. వర్గపోరాటంలోకి కులాన్ని తీసుకురావటానికి ప్రయత్నించాడు. కనీసం దాన్ని గుర్తించమని కోరాడు. ఇది చాలామందికి గిట్టలేదు. దీనికితోడు స్నేహితుడైన కొండపల్లి సీతారామయ్యకూ సత్యమూర్తికీ పర్సనాలిటీ క్లాషెస్ మొదలయ్యాయి. ఈ గొడవ ఖచ్చితంగా ఏమిటన్నది తెలియదు గానీ, దీని గురించే పన్నెండు డాక్యుమెంట్లు ఖర్చయ్యాయి. మొత్తానికి పీపుల్స్‌వార్ సత్యమూర్తిని బయటకు గెంటేసింది. అప్పుడు కనీసం విరసం ఐనా తనకు అండగా నిలుస్తుందనుకున్నాడు. అదీ జరగలేదు. రోషంతో “విరసం చనిపోయింది. నేను దాని శవాన్ని మోస్తూ తిరగలేను” అంటూ ప్రసిద్ధ ప్రకటన చేశాడు. తనదైన కొత్త ఉద్యమం తయారు చేయటానికి ప్రయత్నించాడు. అందులో క్లాస్ అండ్ కాస్ట్ రెండిటినీ మిక్స్ చేయాలనుకున్నాడు. అందుకే కలేకూరిలా దళిత మహాసభ వైపు వెళ్ళలేదు. కత్తి పద్మారావు లాంటి దళితోద్యమ నాయకులు వర్గం అనే అంశాన్ని పట్టించుకోవటంలేదనీ, విప్లవోద్యమ నాయకులు కులం అనే అంశాన్ని పట్టించుకోవటం లేదనీ అన్నాడు. ఈ రెంటినీ కలిపి దళిత్ ఓరియెంటెడ్ లెఫ్టిస్ట్ మూమెంట్‌ని మొదలుపెట్టాలీ అనుకున్నాడు. కానీ ఆయన వెంట ఒక్కరూ చేరలేదు. ఏకాకిగా వదిలేశారు: “ఇద్దరం కులం వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధించబడ్డాం. సత్యమూర్తి దళిత్ ఓరియెంటెడ్ లెఫ్టిస్ట్ మూమెంట్ తయారు చేయటానికి ప్రయత్నించాడు. అతని పక్కన సేనాపతులనుకున్న వాళ్లు కూడా అతడ్ని ఒంటరిగా వదిలేశారు. మేం ఏదన్నా పెద్ద కులంలో పుట్టివుంటే మా రాజకీయ నమ్మకాలేవైనా జనం మమ్మల్ని సపోర్ట్ చేసివుండేవారు మమ్మల్ని నిలబెట్టడానికి. ఈ దళిత కమ్యూనిటీలో ఎవరికి వారే వాళ్ల జీవితంలో స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్లు మమ్మల్ని సపోర్ట్ చేయలేరు” అంటాడు కలేకూరి. విప్లవోద్యమంలో ఉన్న దళితులు కూడా కె. జి. సత్యమూర్తికి అండగా రాలేదు. ఇప్పుడు దళిత్ ఉద్యమం ముమ్మరమైన తర్వాత దాని తరపున మాట్లాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళు అప్పుడు ‘బ్రూటల్ సైలెన్స్’ మెయింటైన్ చేశారంటాడు కలేకూరి.

1993లో కె. జి. సత్యమూర్తి ‘ఏకలవ్య’ అనే పత్రిక ప్రారంభించి దాని ఎడిటింగ్ పనంతా చూసుకునే బాధ్యత కలేకూరికి అప్పజెప్పాడు. నాలుగు సంవత్సరాల పాటు కలేకూరి ఈ పత్రికని చూశాడు. అన్నాళ్ళూ కె. జి. సత్యమూర్తి ఇంట్లోనే ఉండేవాడు. ఆయన కలేకూరిని సిగరెట్లే తప్ప మందు తాగనిచ్చేవాడు కాదు. కానీ నవత వ్యవహారం తర్వాత కలేకూరికి తాగుడు ఎక్కువైంది. అది ఓ పక్క అలా కొనసాగుతూనే ఉంది. మరో పక్క చుండూరు, తిమ్మసముద్రం మొదలైన దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కవిత్వమూ, పాటలతో పాటు, సాహిత్య విమర్శ కూడా రాయటం ప్రారంభించాడు. 1993లో అతను ప్రచురించిన ‘దళిత సాహిత్యం’ అనే పుస్తకం తెలుగు దళిత సాహిత్యంలో మొట్టమొదటి సాహిత్య విమర్శనా గ్రంథంగా పరిగణిస్తారు. ఈ దశలో రాసిన కవిత్వమూ, పాటలూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. చుండూరు సంఘటన జరిగినపుడు ఒక క్రైస్తవ ప్రార్థనాగీతపు బాణీని అనుకరిస్తూ ‘కుమిలిపోయినా, నలిగిపోయినా, చుండూరు గుండెల గాయం’ అంటూ రాసిన పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రోజుల్లో తన రచనా వ్యాసంగం గురించి మాట్లాడుతూ: “విరసం నుంచి వస్తున్న సాహిత్యంలో చేవ తగ్గిపోతున్న తరుణంలోనే పైడి తెరేష్, మద్దూరి నగేష్ లు రాయటం ప్రారంభించారు. వాళ్లు తమ పాత పద్ధతుల్ని వదిలేసి కొత్తగా దళిత భాష వాడటం మొదలుపెట్టారు. అది నన్ను ప్రేరేపించింది. ప్రతి నెలా ఒక కవిత రాశాను” అని గుర్తు తెచ్చుకుంటాడు. బహుశా కవితల్ని సంపుటాలుగా వేసుకునే ఆత్రం ప్రదర్శించకపోవటం వల్లనో, లేక మారుపేర్లతో (యువక, సంఘమిత్ర) రాయటం మూలానో తెలీదుగానీ, కలేకూరి తాగుడుకి బానిసై రాయాల్సినంత రాయలేదన్న అపప్రథ చెలామణీలో ఉంది. కానీ ఒక ఇంటర్వ్యూలో డా. కేశవకుమార్, అలాగే కలేకూరి సంస్మరణ సభలో కృపాకర్ మాదిగ చెప్పిందాన్ని బట్టి చూస్తే కలేకూరి చాలా విస్తృతంగా రాశాడు. చివరిరోజుల్లో ఒకసారి కృపాకర్ మాదిగ కలేకూరిని కూర్చోబెట్టి అతని రచనలన్నీ ఏవేమిటో చెప్పమని, అచ్చు వేద్దామనీ అడిగినప్పుడు, కలేకూరి చెప్పిన టైటిల్స్ అన్నీ లెక్కచూస్తే మొత్తం పద్దెనిమిది పుస్తకాలకు సరిపడా సాహిత్యం ఉందని తేలింది! కలేకూరి శైలి గురించి కూడా కొంతమంది మాట్లాడారు. గోరటి వెంకన్న తెలుగు సాహిత్యంలో పతంజలి తర్వాత అంత పదునైన వచనం ప్రసాద్‌ దే అని అంటారు. సంస్మరణ సభలో ఒమ్మిరమేష్ బాబు మాట్లాడుతూ, “యువక వాక్యాలు చాలా పదునుగా ఉంటాయి. గొలుసుకట్టు వాక్యాలుంటాయి. అస్సలు ఎడిట్ చేయాల్సిన పని ఉండదు” అని చెప్తూ ఏకంగా కలేకూరి రాసిన ఒక వ్యాసాన్ని పూర్తిగా చదివి వినిపిస్తారు. ఇదే సభలో కోయి కోటేశ్వరరావు కూడా కలేకూరి శైలి గురించి మాట్లాడతారు: “వ్యాసంలో తను ప్రతిపాదించబోయే విషయానికి చాలా హైప్ క్రియేట్ చేస్తాడు కలేకూరి” అని చెప్తూ కాన్షీరాం మీద అతను రాసిన ఒక వ్యాసం మొదటి పేరాల్ని చదువుతారు. కాగితం మీద రాసి కూడా తెచ్చుకోకుండా జ్ఞాపకంలోంచి ఉన్నది ఉన్నట్టు ఆయన చదివిన తీరు చూస్తే, కలేకూరిది గుర్తుండిపోయే శైలి అనిపిస్తుంది.

ఈ ప్రసంగంలోనే కోటేశ్వరరావు కలేకూరి మాటలు కొన్ని గుర్తు తెచ్చుకుంటారు: “రచయిత రాజ్యానికి ప్రతిపక్షంగా ఉండాలి. ఆ మాటకొస్తే దళిత రచయిత దళిత నాయకత్వానికి కూడా ప్రతిపక్షంగానే ఉండాలి” అని. అందుకే దళిత మహాసభలో చేరాడే గానీ నాయకత్వంలోని లొసుగుల్ని చూసీ చూడనట్టు ఉపేక్షించలేకపోయాడు. ఫలితంగా దళిత మహాసభతోనూ అతని సాహచర్యం ఎక్కువకాలం సాగలేదు. దాని మీద పెట్టుకున్న ఆశలన్నీ ఉడిగిపోయాయి: “అది కత్తి పద్మారావు వన్‌ మాన్ షో అయిపోయింది. పద్మారావు దానికి నేనే ఏకైక నాయకుడ్ని అని ఎస్టాబ్లిష్ చేశాడు. దానివల్ల కష్టాలు అనుభవించేటప్పుడు మాత్రమే అది సామూహిక ఉద్యమమైంది. దళిత్ మూమెంట్ గ్లామర్ పెరిగింది. ఎన్జీవోస్‌ని అట్రాక్ట్ చేయటం మొదలైంది. డబ్బులు ఇన్ ఫ్లో కావటం మొదలైంది. దాంతో కొంచెం ప్రశ్నించేవాళ్లని బయటకు పంపించటం మొదలైంది. బొజ్జాతారకంలాంటి వాళ్లు అట్లానే బయటికి వచ్చేశారు.” అలాగే దళిత్ మూమెంట్‌లో ఒక క్రమశిక్షణ లోపించటాన్నీ ప్రస్తావిస్తాడు: “నిర్మాణం పట్ల ఎవరికీ ఆసక్తి లేదు. నక్సలైట్ మూమెంట్లో అది ఉంది. అతిగా కూడా ఉంది. ఇక్కడ మాత్రం కనీసం ప్రాథమిక స్థాయిలో కూడా లేదు. నక్సల్ మూమెంట్లోలా ఇక్కడ కూర్చుని చర్చించుకోవడం లాంటివి ఏమీ లేవు. ఇంట్లో కూర్చుని భార్యతో మాట్లాడి ఏదన్నా ఆలోచన వస్తే నిర్ణయం తీసేసుకోవటమే. ఇది పద్మారావు ఫెయిల్యూరే” అంటాడు కలేకూరి. అంతే కాదు, పేర్లు సైతం ప్రస్తావిస్తూ ఇంతకన్నా తీవ్రమైన ఆరోపణలూ చేశాడు. దళిత నాయకులు ఏదన్నా ఇష్యూ వస్తే అందులో నిందితుల దగ్గరకో, వాళ్ల బంధువుల దగ్గరకో మనుషుల్ని పంపి డబ్బులు వసూలు చేస్తున్నారనీ, ఏమన్నా గొడవ జరిగినప్పుడు అక్కడకు మనుషుల్ని తీసుకెళ్ళి నినాదాలు చేసి భూములు రాయించుకుంటున్నారనీ విమర్శిస్తాడు.

దళితమహాసభలో చేరిన నాలుగేళ్లకి 1995లో అక్కడ్నించి బయటకు వచ్చేశాడు కలేకూరి. అంతకుముందే రాజకీయాల్లో కూడా ఒక ప్రయత్నం చేశాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేశాడు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం కంచికచర్లలో కలేకూరి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. కలేకూరి ఓడిపోయాడు. 1999లో హైదరాబాద్‌లో సాక్షి మానవహక్కుల నిఘా అనే ఎన్జీవో సంస్థలో చేరాడు. ఈ సంస్థ తరపున ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా అక్కడకు వెళ్ళి సమస్యను చూసి నివేదికలు తయారు చేసేవాడు. ఈ సంస్థ నడిపిన పక్ష పత్రికకు ఎన్నో వ్యాసాలు కూడా రాశాడు. ఇక్కడ పని చేస్తున్నప్పుడే 2001లో డర్బన్‌లో జాతివివక్షపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నాడు. 2005 దాకా సాక్షిలో పని చేసి, అక్కడ డైరక్టర్‌షిప్ విషయమై తలెత్తిన వివాదంతో బయటకు వచ్చేశాడు. దరిమిలా “ఎన్జీవోలు దళిత ఉద్యమాన్ని ఒక ఎన్జీవోల ఉద్యమంగా మార్చేస్తున్నాయ”ని విమర్శించాడు. తర్వాత ‘బహుజన కెరటాలు’ పత్రికకు గౌరవ సంపాదకునిగా బాధ్యత తీసుకున్నాడు. గత పదేళ్లుగా కలేకూరి అనేక విషయాలపై రాసిన వ్యాసాలన్నీ ఇందులోనే అచ్చయ్యాయి.

కలేకూరికి చివరి రోజుల్లో డబ్బు కోసం అనువాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 70దాకా పుస్తకాలు అనువదించాడు. తెలుగు సాహిత్యంలో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఎక్కువ అనువాదాలు చేసింది కలేకూరే అంటారు. స్వామి ధర్మతీర్థ రాసిన “హిందూ సామ్రాజ్యవాద చరిత్ర” లాంటి ఎన్నో ముఖ్యమైన పుస్తకాలు వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లకి ఈ అనువాదాలు చేసిపెట్టాడు. ఈ పని అతడి శక్తులన్నింటినీ పీల్చిపిప్పి చేసిందని అతని సాహిత్యమిత్రుల అభిప్రాయం. హైదరాబాద్ బుక్ ట్రస్టు యజమాని గీతారామస్వామి గురించి అంబటి సురేంద్రరాజు ఘాటుగా విమర్శిస్తారు. ఆమె వల్ల కలేకూరికి చాలా అన్యాయం జరిగిందంటారు. కలేకూరిని బలవంతంగా డిఎడిక్షన్ హోమ్‌లో చేర్చటంతో అతని స్థైర్యం బాగా దెబ్బతిందని, తర్వాత మరింత తాగటం మొదలుపెట్టాడని చెప్తారు. కలేకూరికి డిఎడిక్షన్ హోమ్ ల పట్ల ఉన్న ఎవర్షన్ మరో చోట కూడా వెల్లడవుతుంది. బత్తుల ప్రకాష్ అనే స్నేహితుడు 2009లో కలేకూరికి ట్రీట్మెంట్ ఇప్పించటానికి వరంగల్ తీసుకెళ్ళారు. అది డిఎడిక్షన్ ట్రీట్మెంట్ కాకపోయినా, ఆ అనుమానంతో అక్కడ్నించి తప్పించుకోవటానికి లాడ్జి టెర్రేస్ మీంచి కిందకు దూకి కాలు విరగ్గొట్టుకున్నాడు. అతడ్ని తిరిగి తమలోకి తెచ్చుకోవాలని సాహితీ మిత్రులూ ప్రయత్నించారు. తెరేష్, శిఖామణి, సురేంద్రరాజు, దెంచనాల శ్రీనివాస్, గోరటివెంకన్నా వీళ్ళంతా ఒకసారి వచ్చి బలవంతంగానే తమతో హైదరాబాదు తీసుకుపోయారు. కానీ వైద్యానికి ససేమిరా అన్నాడు. “నాకు వైద్యం వద్దన్నా ఒక పలకరింత కావాలి, నాకు డబ్బులొద్దన్నా ఆలింగనం కావాలి, నాకింకేవీ వద్దన్నా ఒక కవితా పాదం కావాలి” అన్నాడని చెప్తారు తెరేష్. అలాగే దీనికి ముందో తర్వాతో స్పష్టంగా తెలియదు గానీ, వేముల ఎల్లయ్య మాటల ప్రకారం కలేకూరి ఒకసారి వంటి మీద కిరసనాయిలు పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. చనిపోవటానికి కిరసనాయిల్నే ఎంచుకోవటాన్ని బట్టి అతని మీద కోటేసు ప్రభావం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చేమో.

ఈ దశలో తాగుడు మరీ విపరీతమైంది. యింద్రవెల్లి రమేష్ మాటల్లో: “కంచికచెర్లలో సొంత ఇల్లు ఉంది, భార్య ఉంది, బిటెక్ చదివే బిడ్డ ఉన్నాడు, అక్కచెల్లెళ్ళూ అన్నదమ్ములూ మంచి సంపాదనాపరులు, ఎంతో మంది కవులూ అనుయాయులూ అతను చెప్పిన మాట వినేవాళ్ళూ పాటలు రాసిస్తే పాడి ఒహో అనేవాళ్లూ ఉన్నారు. అయినా అక్కడే అదే అరుగు మీద కూర్చుని, మాసిన బట్టల్తో కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా, అదే దోమల్తో కుట్టించుకుంటూ, ఎవరన్నా దోవన పోతూ పలకరిస్తే ‘నాకు మందు కావాలి’, ‘బిర్యాని కావాలి’ అని అడిగి తెప్పించుకుంటూ ఉండేవాడు.”

Untitled1రవిచంద్రన్ చేసిన వీడియో ఇంటర్వ్యూలో కలేకూరి ఈ స్థితిలోనే కనిపిస్తాడు. దళితోద్యమం మీద పెంచుకున్న ఆశలు గల్లంతైపోవటం వల్లే అతను ఇలా ఐపోయాడూ అంటే ఎవరికైనా అతిశయోక్తిలా కనిపిస్తుందేమో. వ్యక్తిగతమైన ఓటములకి బాధపడేవాళ్ళే తప్ప, ఒక సామాజిక ఆదర్శం ఓడిపోతే అంతగా బాధపడిపోయి జీవితం నాశనం చేసుకునేవాళ్లు ఎవరూ ఉండరూ అన్నది మనలో చాలామంది నమ్మకం. కలేకూరితో పరిచయం ఉన్న బత్తుల కార్తీక్ నవయన్ అనే యువకుడు రాసిన నివాళి వ్యాసంలో అంటాడు: “ఒక నిజాయితి గల వ్యక్తి తనను తాను అంతం చేసుకోవడానికి, ఒక్క నమ్మకం వమ్ము అయితే చాలు, కానీ కలేకూరి ప్రసాద్ కు తను నమ్మిన మూడు నమ్మకాలూ వమ్ము అయినాయి. ఒకటి, విప్లవకారులుగా చెలామణి అవుతున్న నిజాయితీ లేని నకిలీలు. రెండు, రాజకీయాలలో భాగంగా ప్రేమ నటించిన ప్రేమికురాలు. మూడు, నిజాయితిలేని దళిత నాయకత్వం.” కానీ ఈ వీడియో ఇంటర్వ్యూలో తన ప్రేమ వల్ల కలిగిన అవమానాల్నీ, ఇంకా ఎన్నో సంఘర్షణల్నీ తలుచుకున్నప్పుడు కూడా ఏ మాత్రం తొణికినట్టు అనిపించని కలేకూరి, దళిత ఉద్యమ స్థితి గురించి మాట్లాడాల్సి వచ్చి శూన్యంలోకి చూస్తూ దాని గమనాన్ని తల్చుకుంటున్నప్పుడు మాత్రం కళ్ళు తడి చేసుకుంటాడు. కెమెరా రికార్డు చేయటం ఆపమని కూడా అడుగుతాడు: “మేం లెఫ్ట్ మూమెంట్ మీద ఆశ కోల్పోయాం. అలాగని దళిత్ మూమెంట్‌ని క్రియేట్ చేసుకోలేకపోయాం. బాధ కలిగించే విషయం ఏమిటంటే… జనం ఉన్నారు ఫైట్ చేయటానికి సిద్ధంగా. కానీ వాళ్లని సమీకరించి నాయకత్వం వహించగల నాయకుడు లేడు. మళ్ళీ ఈ బాధితులైన ప్రజల నుంచి కొత్త నాయకుడు వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే… to create the leadership… to give support to the emerging leader… that is our responsiblity. To support him. అందుకే బతికి ఉన్నాను. కానీ నేను ఒక్కడ్నే ఉన్నాను. నేను ఏ పెద్ద ఉద్యమంలోనూ భాగాన్ని కాను. [ఈ మాట అన్నప్పుడే కలేకూరి కళ్ళల్లో చిరుతడి వస్తుంది. కెమెరా ఆపమంటాడు.] రవి మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నానేమో తెలియదు. కానీ ఈ క్రైసిస్ నుంచి ఎమర్జ్ అయిన లీడర్‌షిప్పే బలంగా ఉంటుంది. ఖచ్చితంగా! ఎందుకంటే… లీడర్‌షిప్ తాలూకు లగ్జరీస్ అనుభవించేందుకు సమయం కాదిది, లీడర్షిప్ తాలూకు హార్డ్‌షిప్స్ అనుభవించాల్సిన సమయం ఇది. ఇప్పుడు ప్పుట్టిన నాయకత్వమే బలంగా ఉంటుంది. నేను నమ్ముతున్నాను. And I will be part of that process.”

 * * *

కలేకూరి చనిపోయిన పదిహేనో రోజు, 2013 జూన్ 1వ తారీకున బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అతని సంస్మరణ సభ నిర్వహించారు. డప్పు సురేష్ పాటలతో సభ ప్రారంభమవుతుంది. తర్వాత లెల్లె సురేష్ మాట్లాడతారు. తన కొడుకు ‘డాడీ’ అని పిలిచే తీరుని అనుకరిస్తూ కలేకూరి కూడా తనను ‘డాడీ’ అని సాగదీస్తూ పిలిచేవాడనీ, అందుకే తాను కలేకూరి గురించి ‘వాడూ’ ‘వీడు’ అనే మాట్లాడతాననీ, బహుశా ఇక్కడున్నవాళ్లందరూ కూడా అంతేనేమో అనీ అంటారు. నిజంగానే మాట్లాడిన చాలామంది కలేకూరిని అలాగే పిలుస్తారు. కుప్పిలి పద్మ చేసిన ప్రసంగంతో సభలో చిన్న టెన్షన్ మొదలవుతుంది. నివాళి సభ కాస్తా మగ Vs ఆడ ప్రాపంచిక దృక్పథాల మధ్య యుద్ధంలా తయారవుతుంది. కలేకూరి అరాచక జీవితంపై చర్చాకార్యక్రమంలా మారుతుంది. కుప్పిలి పద్మ మాట్లాడుతూ, స్త్రీలుగా తాము ఎన్ని అన్యాయాలకు గురైనా లేచి నిలబడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నామే తప్ప తమను తాము దహించుకోవాలని ప్రయత్నించలేదని, కలేకూరి స్వీయవిధ్వంసాన్ని సభకు వచ్చిన యువతరం ఆదర్శంగా తీసుకోకుండా జాగ్రత్త పడాలని అంటారు. తర్వాత వచ్చిన యింద్రవెల్లి రమేష్ దీనికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తారు. మగవాళ్లుగా తాము అటు శాంతినీ, ఇటు విధ్వంసాన్నీ కూడా ఒప్పుకుంటాం అంటారు. కలేకూరి ఆఖర్రోజులు సాగిన తీరు పట్ల తన వ్యాఖ్యానం చేస్తారు: “అదంతా ఎందుకు చేశాడంటే, ఈ ప్రపంచం మీద ఈ లోకం మీద మౌనంగా నిరసన తెలియజేశాడు. మీరు ఒక అంగుళం ఆధారం దొరికితే చాలు దాన్ని పట్టుకుని ఎక్కడెక్కడకో పోయి కెరీర్లు నిర్మించుకుంటారు. ఆ కెరీరిజం నడుమును విరగ్గొట్టి, నాకు ఇంత ఉన్నా నేను ఇదే అరుగుమీద ఇట్లానే ఉంటాను, ఇట్లానే చనిపోతాను అని మౌనంగా నిరసన తెలిపాడని నమ్ముతాను. అట్లాంటి అరాచకం అవసరమని కూడా నమ్ముతున్నాను” అంటారు. తర్వాత వేదికపైకి వచ్చిన కవయిత్రి మహెజబీన్ కలేకూరి చావుని గ్లామరస్ గా గ్లోరిఫై చేయవద్దంటారు. “నేను కలేకూరి చావు పట్ల కన్నీళ్లు పెట్టుకోదల్చుకోలేదు. ఎందుకంటే కావాలని చావుని ‘రా రా రా’ అని పిలిచి పిలిచి వెళ్ళిపోయిన మనిషి పట్ల కోపం ఉంది. వాడు కనిపిస్తే కొట్టాలన్నంత కోపం ఉంది” అంటూ మొదలుపెట్టి, కలేకూరితో ఒక సంతోష జ్ఞాపకాన్నీ ఒక విషాద జ్ఞాపకాన్నీ పంచుకుంటారు. (అతను సభకి తాగి వచ్చి తన భుజం మీద చేయేసి మాట్లాడిన ఎంబరాసింగ్ అనుభవాన్ని పంచుకుంటారు.) “అసలే మనం దళిత్ మైనారిటీ కమ్యూనిటీ. అలాంటి మనం అరాచకంగా అనార్గనైజ్డ్‌గా బతికితే మరింత మార్జినలైజేషన్ కి గురి అవుతాం” అంటారు. ఒక స్త్రీకి మాత్రమే సాధ్యమయ్యేట్టుగా కలేకూరి పరిస్థితిని సింప్లిఫై చేసి అతడ్ని ఉద్దేశించి మాట్లాడతారు: “అలా ఎందుకు బతకాలి, నువ్వు మేధావివి, చదువుకున్నవాడివి, నీకు టాలెంట్ ఉంది, నీకు క్రియేటివిటీ ఉంది, నీకు నెట్ వర్క్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు… అయినప్పటికీ నువ్వు నీ లైఫ్ ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోలేకపోయావు. అది నిజంగా క్షమించరానిది.” అని ముగిస్తారు. మహెజబీన్ మాటలకు ఒళ్లుమండినవాళ్లలో కృపాకర్ మాదిగ ఒకరు. ఆయన కలేకూరిని యోగులూ, అవధూతలతో పోలుస్తారు. వాళ్ల వ్యక్తిత్వాల చాలా అబ్‌నార్మల్‌గానే ఉంటాయంటారు. అసలు ఈ భారతదేశ కులవ్యవస్థలో పుట్టిన మాగ్గాకపోతే ఈ పర్వర్షన్స్, ఏంగ్జయిటీస్, అరాచకత్వం ఇవన్నీ ఇంకెవరికుండాలి అని ప్రశ్నిస్తారు. శ్రీశ్రీ లాంటి మహాకవి తన అరాచకత్వం గురించి ఆత్మకథలో రాసుకుంటే ఏమీ మాట్లాడని వాళ్లు ఇప్పుడు దళితుడు కాబట్టే కలేకూరి గురించి ఇలా మాట్లాడుతున్నారని అంటారు: “పెద్ద పెద్ద మహాకవులు వాళ్ల ఆత్మకథల్లో రాసుకున్నవేం మనం పట్టించుకోం. … మెడ్రాసులో సెక్సు సినిమా చూసి జేబులో ఉన్న ఐదురూపాయలూ వేశ్య మీద ఖర్చుపెట్టానూ సినిమా ప్రభావం అంత గొప్పదీ అంటే మనమేం మాట్లాడం. కానీ దళితులు, ఆదివాసులు, కింది కులాలూ తెగలవాళ్ళు మా వ్యసనాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మా బలహీనతల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది నేరంగా ఎంచి మమ్మల్ని అలగా జనమూ అలగా సమాహమూ కింద లెక్క కట్టే పరిస్థితులున్నాయి” అంటారు. వేముల ఎల్లయ్య ఇదే ధోరణిలో మాట్లాడతారు. పైగా అసందర్భంగా “ప్రసాదు కావాలీ కావాలీ అని అహోరాత్రులూ కలవరించిన చాలామంది స్త్రీలున్నారు ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర కవయిత్రులున్నారు. మేం అభిమానించే నాయకుణ్ణి అవమానిస్తే మమ్మల్ని అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది” అని కూడా ఎందుకో చెప్తారు. కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ కలేకూరి తాగుడ్ని రొమాంటిసిస్టు దృక్కోణంలోంచి చూసే ప్రయత్నం చేస్తారు, “అతని చేతికి ఒక మధుపాత్ర ఇవ్వండి. అతని నోటి వెంట పూలవానలా జాలువారే మాటలకు దోసిలి పట్టండి” అనే గాలిబ్ మాటల్ని ఊటంకిస్తారు.

ఈ గొడవంతా అయ్యాక, సభ చివర్లో వచ్చిన గద్దర్ వేరే ధోరణిలో మాట్లాడతారు. వెనుక ఉన్న ఉద్దేశాలేవైనా, కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని లేవదీస్తారు. దళిత కవులం అంటూ మనల్ని మనమే ఐసొలేట్ చేసుకోవటం మంచిది కాదంటారు. “ఒక మహాకవిని పెట్టుకుని మనమే ఊరికే ‘దళిత కవీ.. దళిత కవీ’ అని ఎందుకనాలె? మనిషిగా గుర్తించబడని ఒక పరిస్థితి గురించి రాస్తే ఆ కవిత్వాన్ని దళిత కవిత్వం అనెట్లంటరు మీరు?” అంటూ సభలోని తోటి దళిత రచయితల్ని ప్రశ్నిస్తారు. ఇక్కడ గద్దర్ మొదట తన్ను తాను ఒక విప్లవకారునిగా చూసుకుంటూ తోటి దళితులకు ఈ సలహా చెప్తారు. దళిత కవీ, కవిత్వం అంటూ మన పరిధి మనం తగ్గించుకుంటూ పోతే అదే మంచిదని అవతలివాళ్లూ మనల్ని అలా ఓ మూలకి నెట్టేస్తారని అంటారు. ఆ అవతలివాళ్ల దృష్టిలో “భూమికి పచ్చాని రంగేసినట్టూ అని రాసినవాడు విప్లవకవి కాడు, అవసరమైతే రెనెగేడ్ (వెన్నుపోటుదారు) అవుతాడు. మనువు పుస్తకాల్లో మనం మనుషులం కాదు, మనిషి హోదానే లేదు. ఒరేయ్ నీ (విప్లవ పార్టీ) పుస్తకాలల్లో కూడా మేం మనుషులం కాకపోతే ఎట్లా? అవసరమైతే కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు తీసి చూడండి… కలేకూరి పేరు ఎక్కడైనా ఉన్నదేమొ. దేని గురించైనా మాట్లాడు కమ్యూనిస్టు పార్టీ స్పేర్ చేస్తది. ఒక్క కులం గురించి మాత్రం మాట్లాడొద్దు!” అంటారు. దళితులు వర్గపోరాటం నుంచి విడిపోయి కులపోరాటం అంటూ వేరుకుంపటి పెట్టడం వల్ల జరిగే మంచి తక్కువని ఆయన అభిప్రాయం. దళితులు కూడా ముందుకొచ్చి వర్గ పోరాటాన్ని సొంతం చేసుకోవాలని అంటారు. “ఈ కవిత్వం, ఈ పార్టీలు, ఈ తుపాకులూ అన్నీ మావే అని దళితులు డిక్లేర్ చేయాలె. విప్లవంలో ఎనభై శాతం మంది అడవుల్లో తుపాకులు పట్టుకుని పోరాడేవాళ్లు దళితులే ఐనప్పుడు, ఆ పార్టీ వాళ్లది కాక వేరేవాళ్లది ఎట్లయింది?” అని ప్రశ్నిస్తారు.

చివర్లో లెల్లె సురేష్ సభని ముగిస్తూ, వేదికకి వేలాడదీసిన ఫ్లెక్సీ మీద ఉన్న కలేకూరి కవితని చదివి వినిపిస్తారు:

నాకు జాలి మాటలొద్దు – కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు – అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నా కోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను.
* * *

ఏ మనిషి అంతరంగాన్నైనా సాకల్యంగా గ్రహించటం మాట దేవుడెరుగు, దాని గురించి రెండుమూడు ముక్కలైనా ఇతమిత్థంగా తేల్చిచెప్పటమూ కష్టమే. కాని కనీసం ఏదో ఒక ప్రతిపాదనైనా చేయగలను అనుకున్నాను వ్యాసం మొదలుపెట్టినప్పుడు. అదీ కష్టమే అనిపిస్తోంది. ఆయన గుణాల్ని (traits) తెచ్చి ఇక్కడ పరచగలిగాను. ఆ గుణాలకు మూలమైన (వాటిని జస్టిఫై చేసే) ఒక అంతరంగం మాత్రం అంతుచిక్కలేదు. అది ఆయన సన్నిహితులకే చిక్కినట్టనిపించదు. కేవలం వారి మాటల ఆధారంగా రాసిన నేను ఇంతకన్నా ఆశించకూడదు. ఆయన రచనలు నాకు దొరకలేదు. దొరికినా నాక్కావాల్సింది ఆ సాహిత్యంలో కనిపించే కలేకూరి కాదు కాబట్టి పెద్దగా ఉపయోగం లేదు. నాకు దొరికిన ఎవిడెన్సులన్నింటినీ ఇక్కడ సక్రమంగా ఇవ్వగలిగాననే అనుకుంటున్నాను. వీటి నుండి చదువరులు తమదైన అర్థాల్ని గ్రహించుకునే వీలు కల్పించగలిగాననే అనుకుంటున్నాను.

ఈ వ్యాసానికి ‘పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్’ అని పేరుపెట్టడం గురించి కొంత సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. ‘పాషన్’ అనే మాటకి ‘నిభాయించుకోలేని ఉద్వేగం’ అనే అర్థంతో పాటు మరో అర్థమూ ఉంది. శిలువ వేసే పర్యంతం క్రీస్తు పడిన బాధని ‘పాషన్’ అంటారు. ఈ పేరు పెట్టేందుకు నేను తటపటాయించాను, అలాగని ఇది తప్ప వేరేది పెట్టనూ లేకపోయాను. క్రీస్తుకీ కలేకూరికీ పోలిక తేవాలనుకుంటే తేవచ్చు, అది అతి అవుతుందనుకుంటే మానుకోవచ్చు. నిజానికి కలేకూరి క్రిస్టియానిటీ పట్ల ఎప్పుడూ ద్వైదీభావంతోనే ఉన్నాడు. క్రైస్తవం దళితుల్ని ఎలా అక్కున చేర్చుకుందో అతనికి తెలుసు, ఎలా ముందుకెళ్లనీయకుండా పట్టి ఉంచిందో కూడా తెలుసు. అయినా నా మెదడులో తర్కానికి అతీతమైన లంకెలు కొన్ని పడిపోయాయి. వాటిలో ఒకటి మాత్రం చెప్పగలను: మగబిడ్డ పుడితే క్రీస్తుకి బహుమతిగా ఇచ్చేస్తానని మొక్కుకుంది అతని తల్లి. ఆ మాట ప్రకారమే దేవుడికి బహుమతిగా ఇచ్చేసి తిరిగి వేలంపాటలో వెనక్కి కొనుక్కుంది, 1962 అక్టోబరు 25 న కలేకూరి ప్రసాద్ పుట్టినప్పుడు.

– నాగరాజు ఆకుల

Download PDF

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, ఫిబ్రవరి, వ్యాసం and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , .

22 Comments

 1. సులభమైన ఈ వ్యాసాన్నీ, దాని ఉద్దేశాన్నీ ఆకళింపు చేసుకోవటంలో కొందరు చదువరులు తంటాలు పడ్డారు. అప్పటికీ తప్పుడు తీర్మానాలకే రాగలిగేరు. ఇక్కడ కామెంట్ చేసినవాళ్ళే కాదు, ఇంకొందరు ఉన్నారు. వాళ్ళు పడ్డ తంటాలకు కొన్ని ఉదాహరణలు:

  – వ్యాసంలో రచయిత మాటలు కాని వాటిని అతనికి అప్లయి చేయటం

  – తమ అభిప్రాయాలకే వ్యాస రచయితని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయటం

  – తాము నెత్తికెక్కించుకున్న వేరే కాజుల్ని ఇక్కడ తెచ్చి అప్లయి చేయబోవటం

  – వ్యాసంలో ఒక contextలో ఉన్న అంశాల్ని బయటకు పెరుక్కొచ్చి వాటిని పరిశీలించటం

  – అసలు కళ్ళెదుట కనిపిస్తున్న కలేకూరి వీడియోలో వ్యక్తమవుతున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవటం

  రచయితగా నా ఉద్దేశం వ్యాసంలో స్పష్టంగానే చెప్పాను. తర్వాత కామెంట్లలో అది ఇంకా విశదమైంది. అయినా కెకె రామయ్య గారికి చాలా సందేహాలు వచ్చాయి. సరే, మళ్ళీ ప్రయత్నిస్తున్నాను:

  >>> కలేకూరి స్వీయవిధ్వంసాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోకుండా జాగ్రత్త పడాలని, చావుని గ్లామరస్ గా గ్లోరిఫై చేయవద్దంటూ కలేకూరి సంస్మరణ సభలో ప్రసంగించిన కుప్పిలి పద్మ, కవయిత్రి మహెజబీన్ గార్ల పట్ల; దళితులు వర్గపోరాటం నుంచి విడిపోయి కులపోరాటం అంటూ వేరుకుంపటి పెట్టడం వల్ల జరిగే మంచి తక్కువని అబిప్రాయపడిన గద్దర్ ని తక్కువ చేసి చూపించిందీ వ్యాసంలోని tone.

  ఏ చావూ తేలికైనది కాదు. దాని వెనుక ఏ కారణాలు అల్పమైనవి కాదు. స్వీయవిధ్వంసం – యువత – ఆదర్శాలు… ఇలాంటి మాటలు భద్ర జీవితంలో కుదురుకున్నవారి నోళ్ళ నుంచి పెద్ద కష్టం లేకుండానే బయటకు వచ్చేస్తాయి. ఆ పరిస్థితిలో ఉన్నవారికి అవి అంత సులభంగా తేలిపోయేవి కావు. ఇక గద్దర్‌ని తక్కువ చేసి చూపటం గురించి… అతని పట్ల బహుశా మీకున్న అభిప్రాయాలకు తగ్గ స్థాయిలో అతడ్ని నేను చూపలేదేమో, అలాగని దాన్ని తక్కువ చేసి చూపటం అనరు.

  >>> “రాజకీయాలలో భాగంగా ప్రేమ నటించిన ప్రేమికురాలు” వంటి వ్యాఖ్యలు బాధ కలిగించాయి.

  >>> “కలేకూరి, కె.జి. సత్యమూర్తిల ఇద్దరి పతనం వెనుకా కులం పొడిచిన పోటే ఉమ్మడి కారణం” అనటం ఎంతవరకు సమంజసం?

  >>> మహాకవి శ్రీశ్రీ వ్యసనాల, బలహీనతల గురించి ఏమీ మాట్లాడని వాళ్లు దళితుడు కాబట్టే కలేకూరి గురించి ఇలా మాట్లాడుతున్నారని అనటం కూడా సమర్ధనీయంగా లేదు.

  ఈ మూడు ఆరోపణలు నేను పైనే చెప్పిన ఒకే ఇబ్బంది వల్ల వచ్చాయి. అసలు నా మాటలు కాని వాటిని నాకు ఆపాదించటం వల్ల.

  మొదటి కొటేషన్ కలేకూరికి చివరి రోజుల్లో దగ్గరగా ఉన్న బత్తుల కార్తీక్ నవయన్ అనే యువకుడు రాసిన నివాళి వ్యాసంలోనివి. అవి ఇక్కడ ఎందుకు తెచ్చి కోట్ చేశాను? 1) అలాంటి అభిప్రాయం అతని సన్నిహితుడిలో ఉన్నదని చెప్పటానికి 2) దాన్ని మోడిఫై చేయటానికి. అతని మాటలు కోట్ చేసిన వెంటనే అతను చెప్పిన మూడు కారణాల్లో కేవలం ఒకటే సరైనదని నిర్ధారించే ప్రయత్నం చేశాను. ఒక పాఠకునిగా మీకు ఆ మాత్రం అటెన్షన్ స్పాన్ లేకపోతే అది నా తప్పు కాదు.

  రెండోది, “కులం పొడిచిన పోటే కారణం” అన్నది నా మాట కాదు. “కలేకూరి అంటాడు” అని పక్కనే జత చేసిందాన్ని బట్టి కూడా మీకా సంగతి అర్థం కాలేదంటే, కాస్త జాగ్రత్తగా చదవటం నేర్చుకోవాలి.

  మూడోది, శ్రీశ్రీ గురించిన ప్రస్తావన. ఇక్కడ కూడా అవి కృపాకర్ మాదిగ మాటలని వెంటనే చెప్పాను.

  ఇప్పుడు వీటన్నిటినీ ఎంపిక చేసుకోవటమూ, ఈ క్రమంలో ప్రెజెంట్ చేయటమూ.. ఇవి నాకు ఒక అభిప్రాయం ఉందని తెలియజేస్తున్నాయి. వాస్తవం పట్ల నేను కలిగివున్న అభిప్రాయాలకి అభ్యంతరం చెప్పేవాళ్లకి ‘సరే అది మీ అభిప్రాయం ఇది నాదీ’ అనైనా జవాబు చెప్పొచ్చు. అసలు వాస్తవానికే అభ్యంతరం చెప్పేవాళ్లకి? కళ్లజోళ్లు తీసి చూడమని చెప్పాలి.

  ఆ సలహాతో, now I rest my case.

 2. ప్రజాకవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత విప్లవ ఉద్యమకారుడు జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కలేకూరి ప్రసాద్ గుణాల్ని, కె.జి. సత్యమూర్తి(శివసాగర్)ని, వివిధ ఉద్యమ తీరులను యీ సుదీర్ఖ వ్యాసం ద్వారా, సోదాహరణంగా సమర్ధవంతంగా పాఠకుల అవగాహనకు తెచ్చినందుకు ఆకుల నాగరాజు గారికి ధన్యవాదాలు. విషయ పరిధిని అందుకోవటానికి సాయపడిన జి ఎస్ రామ్మోహన్, రమాసుందరి గార్లకు ధన్యవాదాలు.

  “మళ్ళీ ఈ బాధితులైన ప్రజల నుంచి కొత్త నాయకుడు వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే…to create the leadership… to give support to the emerging leader… that is our responsiblity“ అని కలలు కన్న కలేకూరిని; అన్ని అస్తిత్వ ఉద్యమాలను కలుపుకుని బలోపితమైన నూతన విప్లవోద్యమం రావాలని ఆశించిన కలేకూరిని అభిమానించకుండా ఉండలేరెవ్వరూ. కలేకూరి పుట్టినప్పుడు దేవుడికి బహుమతిగా ఇచ్చేసి తిరిగి వేలంపాటలో వెనక్కి కొనుక్కున్నట్లు, మరణించినప్పుటి అతని ఆశయాలను వేలం వెయ్యాలని ఉంది.

  కానీ యీ వ్యాసం లోని కొన్ని వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలూ ఉన్నాయి :

  కలేకూరి స్వీయవిధ్వంసాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోకుండా జాగ్రత్త పడాలని, చావుని గ్లామరస్ గా గ్లోరిఫై చేయవద్దంటూ కలేకూరి సంస్మరణ సభలో ప్రసంగించిన కుప్పిలి పద్మ, కవయిత్రి మహెజబీన్ గార్ల పట్ల; దళితులు వర్గపోరాటం నుంచి విడిపోయి కులపోరాటం అంటూ వేరుకుంపటి పెట్టడం వల్ల జరిగే మంచి తక్కువని అబిప్రాయపడిన గద్దర్ ని తక్కువ చేసి చూపించిందీ వ్యాసంలోని tone.

  “రాజకీయాలలో భాగంగా ప్రేమ నటించిన ప్రేమికురాలు” వంటి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. తన పేరును చర్చలోని అనవసంగా లాగుతున్నారనిపించింది. కలేకూరి స్వీయవిధ్వంసం పట్ల సానుభూతి కలిగించటానికి ఇతరులను దోషులుగా చూపించాల్సిన అవసరం లేదేమో అనిపించింది.

  “కలేకూరి, కె.జి. సత్యమూర్తిల ఇద్దరి పతనం వెనుకా కులం పొడిచిన పోటే ఉమ్మడి కారణం” అనటం ఎంతవరకు సమంజసం? దళిత ఉద్యమంతో సహా ఎందులోనూ స్థిరంగా ఇమడలేకపోయిన కలేకూరిని సమర్దించటానికి ఈ వాదన సరిపోలేదనిపిస్తున్నది. మహాకవి శ్రీశ్రీ వ్యసనాల, బలహీనతల గురించి ఏమీ మాట్లాడని వాళ్లు దళితుడు కాబట్టే కలేకూరి గురించి ఇలా మాట్లాడుతున్నారని అనటం కూడా సమర్ధనీయంగా లేదు.

  Truly, it’s a great article in understanding & appreciating the rare phenomena called Kalekuri Prasad and kudos to Shri Akula Nagaraju garu for this exhaustive article; though with certain unwanted onesided overtones.

 3. రామ్మోహన్ గారు, నేను కూడా వెతగ్గానే దొరికిన మొదటి వాదననే ఖాయం చేసుకుని రాసేయలేదు. ఇంకో వైఖరి పట్ల నాకు స్పృహ ఉంది, రెండిట్లో ఒకదాన్ని ఎంపిక చేసుకున్నాను. మీరన్న వేరే కారణాలుంటాయి నిజమే. అందుకే పర్సనల్ క్లాషెస్ గురించీ ప్రస్తావించాను. ఇంకోటేంటంటే, బయటకు వచ్చేసింతర్వాత ఆయన మాత్రమే ఈగో క్లాషెస్‌కి సైద్ధాంతిక విబేధాల్ని కారణాలుగా ముసుగు వేసే ప్రయత్నం చేస్తే అనుకోవచ్చు, ఆయన్ని బయటకు పంపినవాళ్ళు కూడా వాటిని కారణాలుగా ప్రస్తావించినపుడు కాస్తయినా వాటి పాత్ర ఉండే తీరాలి. నేను మొదటి జవాబులో ఇచ్చిన లింక్ అనుచరుడిది కాదు, ఆయనతో కలిసి పని చేసిన వ్యక్తిది. He has an argument. మీరన్న వేరే వైఖరిని ఆయనా ప్రస్తావించాడు. అంత తేలిగ్గా తీసిపారేయదగ్గ వాదన కాదు. But yes, let us agree to disagree.

 4. మిత్రమా, ఇప్పటికే మనసు చాలా కష్టపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ అక్షరాలు అలా రికార్డ్‌ అవుతాయి కాబట్టి ఇంకో వైఖరి కూడా ఉంటుందని తెలియజేయాలన్న తపన తప్ప మీతో వాదించాలనే ఆసక్తి లేదు. అయినప్పటికి రెండు విషయాలు స్పష్టం చేయాల్సి ఉంది. సత్యమూర్తి బయటకు రావటం వెనుక ఉన్నది దళిత్ క్వశ్చన్ కారణం కాదు అని నేను అనుకుంటున్నట్టు అదే నా అభ్యంతరమైనట్టు రాశారు. అది సరికాదు. అది కారణమే. అదే కారణమని మాత్రం చెప్పలేం. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ చిత్రంగా ఉంటాయి. వన్‌ టు వన్‌ రిలేషన్‌ ఉండదు. భారత దేశ కమ్యూనిస్టు చరిత్ర పొడవునా దాదాపు ప్రతి చీలిక వెనుక ప్రకటిత కారణాలకు అసలు వాస్తవాలకు మధ్య అగాధం ఉంటూనే వస్తున్నది. పర్సనల్‌ ఈగోలు, నాయకత్వగొడవలు చాలా సందర్భాల్లో ఆ రూపాల్లో కాకుండా సైద్ధాంతిక విభేదాల రూపంలో గంభీరంగా మన ముందుకొస్తుంటాయి. ఈ సందర్భంలో వాటి పాత్ర ఎంత అనేది ఆ పార్టీ నిర్మాణరూపం రీత్యా మనకు నిక్కచ్చిగా తెలియడం కష్టం. ఇక అనుభవం అనే బరువును మీ సోర్సులకు పోటీ పెడుతున్నాననేది. అనుభవాన్ని చాటుకోవాలనే తపన ఏమీలేదు. నాది సముద్రంలో ఇసుకరేణువంత అనుభవం. చాలా చాలా అనుభవజ్ఞులున్నారు. అనుభవానికి దానికదిగా లేని పోని విలువను ఆపాదించడం సరికాదని కూడా నేను అనుకుంటాను. కాకపోతే అనుచరుడు చెప్పాడు అని ఇక పరమసత్యం కాకపోతుందా అన్నరీతిలో మీరు రాశారు. ఆ అనుచరుడు ఎవరో ఏమి రాశారో నేను చదవలేదు కానీ అనుచరుడు చెప్పినంత మాత్రాన పరమసత్యం కానక్కర్లేదు అని చెప్పడానికి నా అనుభవాన్ని ఉదహరించాను. చెప్పుకోవాలనే యావతో కాదు. అట్లా బిలోది బెల్ట్‌ ఎత్తుగడ వేసే కుయుక్తి అసలే లేదు.. ఎవరి వాంటేజ్‌ పాయింట్‌ వారికుంటుంది. మీ అభిప్రాయాలు మీవి. నా సందేహాలు నావి. లెటజ్‌ ఎగ్రీ టు డిజగ్రీ. సెలవు.

 5. Rammohan gaaru,

  మీకున్న రెండు ఇబ్బందుల గురించీ మళ్ళీ రాసిందే రాశారు. సత్యమూర్తి బయటకు రావటం వెనుక ఉన్నది దళిత్ క్వశ్చన్ కారణం కాదూ అన్నది ఒకటైతే, రెండోది నవత విషయంలో నేను నింద వేశానన్నది.

  మీ అభ్యంతరాల వెనుక ఉద్దేశం – ఈ వ్యాసాన్ని రాసేటప్పుడు ఈ విషయంపై మీకున్న అనుభవజ్ఞానంతో సరిసమానమైన పరిశోధనాత్మకశ్రమ నేను తీసుకోలేదన్నది తేల్చి చెప్పటమే అయితే, అవును, అలాంటి శ్రమ నా ఉద్దేశమూ కాదు. ఆ వీడియోల వైపు నా దృక్పథంతో పాఠకుల్ని పంపటం మాత్రమే నా ఉద్దేశం. ఒకవేళ నా దృక్పథమే తప్పన్నది మీ ఉద్దేశం ఐతే… కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల, ఇక్కడ దాని అన్వయాల పట్లా నేను పెద్ద గౌరవభావం ఉన్నవాడ్ని కాదు. So it reflects.

  మీరు చాలా బలమైన మీ వ్యక్తిగత అనుభవాన్ని తీసుకొచ్చి, నా బలహీనమైన సెకండరీ సోర్సులకు ఎదురుగా ఎక్కుపెడుతున్నారు. నా సోర్సుల్ని తప్పుబడుతున్నారు. ఆ సోర్సులు ఎన్నుకున్న పాపానికే నాకు నిజాయితీ లేదంటున్నారు. నేనిచ్చిన రెండో లింకులో స్వయంగా సత్యమూర్తి మాటలే ఉన్నా కూడా! ఇంతాజేసి మీకై మీరు ఏదీ ఖచ్చితంగా చెప్పలేకపొతున్నారు. ఒక స్టాండు తీసుకోనీకుండా మీ లోపలి ఏ రెసిస్టెన్సు మిమ్మల్ని అడ్డుకుంటోందో నాకు తెలీదు. But yes, I chose to believe what seemed right to me. అందుబాటులో ఉన్న సమాచారం అంతట్నీ సేకరించి నేనూ అదే స్టాన్సుకి రావాలన్నది మీ ఉద్దేశమైతే, అది కూడా మీరన్న సెకండరీ సమాచారమే అవుతుంది గానీ, ప్రాథమిక సమాచారం ఎలా అవుతుంది? ఈ కమ్యూనిస్టుల పట్ల నాకున్న అభిప్రాయాలతో అది ఇప్పటి అభిప్రాయాన్ని మార్చనూ మార్చదు. నేను ఒక అభిప్రాయాన్ని కలిగి వుండటమూ, ఆ అభిప్రాయానికి వచ్చిన తీరూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది జరుగుతుంటుంది, మీరేం చేయలేరు. ఇప్పుడు ఇలాంటివారైన మీ మాటల్ని సోర్స్‌గా తీసుకుంటే అదే నా దృష్టిలో dubious source అవుతుంది గానీ, ఆయన అనుచరులది కాదు. పైగా నన్ను ఎడ్యుకేట్ చేసేందుకు మీ దగ్గరే ఒక స్టాన్స్ అన్నది లేదు. బహుశా సత్యమూర్తి విషయంలో నా మాటల్లో మీకు ఇబ్బంది అనిపించిన వాక్యాలు ఇవి:

  “అయితే ఎనభైల్లో, బహుశా కారంచేడు సంఘటన తర్వాత, సత్యమూర్తికి కులం అనేది పక్కకు పెట్టలేని అంశమని అర్థమై ఉంటుంది. వర్గపోరాటంలోకి కులాన్ని తీసుకురావటానికి ప్రయత్నించాడు. కనీసం దాన్ని గుర్తించమని కోరాడు. ఇది చాలామందికి గిట్టలేదు. దీనికితోడు స్నేహితుడైన కొండపల్లి సీతారామయ్యకూ సత్యమూర్తికీ పర్సనాలిటీ క్లాషెస్ మొదలయ్యాయి. ఈ గొడవ ఖచ్చితంగా ఏమిటన్నది తెలియదు గానీ, దీని గురించే పన్నెండు డాక్యుమెంట్లు ఖర్చయ్యాయి. మొత్తానికి పీపుల్స్‌వార్ సత్యమూర్తిని బయటకు గెంటేసింది. అప్పుడు కనీసం విరసం ఐనా తనకు అండగా నిలుస్తుందనుకున్నాడు. అదీ జరగలేదు. రోషంతో ‘విరసం చనిపోయింది. నేను దాని శవాన్ని మోస్తూ తిరగలేను’ అంటూ ప్రసిద్ధ ప్రకటన చేశాడు.”

  ఇందులో దేన్ని కాదనగలరు? పైగా ఇందులో కేవలం నా నమ్మకమే అనిపించిన వాటిని స్పెక్యులేటివ్‌ వాక్యాలుగానే రాశానే తప్ప ఘంటాపథంగా ఏమీ నొక్కి చెప్పలేదే? What’s your problem? ఇప్పుడు ఆ పదకొండు డాక్యుమెంట్లూ చదివో, లేక శివసాగర్ సహచరులందరినీ ఇంటర్వ్యూ చేసిం తర్వాతో మాత్రమే ఆ స్పెక్యులేటివ్ వాక్యాలైనా రాసి ఉండాలంటారా? Don’t you think that’s absurd? పైగా శివసాగర్ అసలు నా వ్యాసం సబ్జెక్టే కానపుడు? మీ ప్రాబ్లెమ్ వ్యాసంతో కన్నా, అందులోని వ్యక్తులతో అయితే, it’s not my realm.

  >> ”నవత వ్యవహారం తర్వాత కలేకూరికి తాగుడు ఎక్కువైంది” అన్నది నా వాక్యం కాదనే అంటాను. నేను గత కామెంట్లోనే చెప్పినట్టు అతని మాటలే తప్ప, సొంత వ్యాఖ్యానాలేమీ నేను చేయలేదు. వీడియోని 24:26 దగ్గరనుంచి చూడండి:-

  ఈ కారణం వల్ల అడిక్షన్ పెరగటం సైంటిఫిక్ కాదూ అంటే, దాన్ని అమాయకత్వం అని మాత్రం చెప్పగలను. సైన్సో కాదో తెలీదుగానీ, అది హ్యూమన్ నేచర్. అది కూడా ఇక్కడ ఒక వ్యక్తి వల్ల కాదు, ఒక పరిస్థితి వల్ల, ఆ పరిస్థితి తన ఐడెంటిటీ పట్ల కలగజేసిన స్పృహ వల్ల. It affected him very much అన్నది ఆ ఇంటర్వ్యూ ద్వారా నాకు అర్థమైంది. ఇందులో నింద ఎక్కడ ఉంది? కలేకూరి అన్నప్పుడూ లేదు, దాన్ని తెచ్చి నేను రాసినప్పుడూ లేదు. ప్రేమ వ్యవహారం ఫెయిలై తాగుడు మొదలుపెట్టాడంటే, అది ప్రేయసి తప్పుగా చూడటం మన తెలుగు సినిమా డైరెక్టర్లకు బాగుంటుంది గానీ, మనకు బాగోదు.

  సోర్సులకీ ఫాక్టులకీ అతీతంగా మనుషుల తీరుని బట్టి, వారి చుట్టూ auraని బట్టీ వాళ్ల సారాన్ని గ్రహించే ఇంట్యూషన్ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది చాలా సున్నితమైన స్పందన. దానికి ఫాక్టుల దన్ను అవసరం లేదు. కలేకూరి ఇంటర్వ్యూ చూశాకా అది కలిగింది. దాన్నే వ్యక్తపరిచాను. అది అతని పట్ల చెలామణీలో ఉన్న అభిప్రాయాలతో పోలకపోవచ్చు. దాని పట్ల మీ అభ్యంతరాలు మీకు ఉండొచ్చు. వాటిని పంచుకున్నారు సంతోషం. కానీ మన ఆదర్శవాద చట్రాల్ని జీవితాల మీద తెచ్చి ఇంపోజ్ చేస్తామంటే, అన్నిసార్లూ కుదరదు కదా. అసలు అతనికి ఎదురైనవేవో ఎదురుకావటమూ, అతను వాటిని బయటికి చెప్పుకోవటమూ పైనే మీకు అభ్యంతరం ఉంటే, all I can say is… When life stares you in the face, you don’t bring up a Terms of Conduct. You just have to take it in, as it is.

 6. ఆకుల నాగరాజు గారూ
  మీరు ఆబ్జెక్టివ్‌గా ఉండాలని అనుకోలేదు. you obviously chose to believe something. చాలా చదివి రాశానని అన్నారు. తెలుగునేలతో అంతగా అనుబంధం లేని, సత్యమూర్తితో బంధం లేని సిపిఐఎంఎల్‌ రెడ్‌స్టార్ అనే పార్టీ వెబ్‌సైట్‌నుంచి మీరు ఉపపత్తులు తీసుకోవడంతోనే మీరు ఎలాంటి విషయాల మీద ఆధారపడతారో, మీ చదువులోని నిజాయితీ ఏమిటో అర్థమవుతోంది. ఆయన బయటకు వచ్చిన నిర్మాణానికి ఆయనకు మధ్య డాక్యుమెంట్ల యుద్ధం నడిచింది. బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుగు పత్రికల్లోనే బోలెడంత చర్చ, ఇంటర్య్వూలు నడిచాయి. ఆయన రాతలు మాటలు, ఆయన్నువదిలేసిన వారి రాతలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారికి దొరకబుచ్చుకోవడం కష్టం కాదు. అలాంటి ప్రాధమికమైన సమాచారం ఆధారంగా ఏ అభిప్రాయానికొచ్చినా పర్వాలేదు. అవి కాకుండా సెకండరీ ఒపీనియన్‌మీద ఆధారపడిన ఉత్తరాది వారి అభిప్రాయాలదగ్గరకు పరిగెట్టడంలోనే మీ వైఖరి అర్థమవుతోంది. విషయాల మీద కూడా ఏదో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలని మీరు అనుకోవచ్చు. మీ అభిప్రాయం కంటే కూడా దానికి మీరు తీసుకున్న ఆధారాల మీదే అభ్యంతరం. ఒక అనుచరుడిని కోట్‌చేశారు. మీరన్న సంక్లిష్టతలు ఆయన అనుచరుడిలో లేవు మరి అని గడుసుదనంతో కూడిన అమాయకత్వాన్ని చాటుకున్నారు. అంత సీనియర్‌ నాయకుడి ప్రయాణంలో చాలామంది అనుచరులుంటారు. ఆయన పీపుల్స్‌వార్‌ నుంచి బయటకువచ్చి ఎదురీత గ్రూపులో చేరినప్పటినుంచి దాదాపు రెండేళ్లకు పైబడి ఆయన వెంట నడిచాను. నా వలెనే రకరకాల ఫేజుల్లో నడిచినవారు అనేకులుంటారు. అందరికీ ఒకే రకంగా అర్థం కావాలని లేదు. నాకు అర్థం కాకుండా మిగిలిపోయనవి ఉన్నాయి. యువకతో 20 యేళ్లకు పైబడి అనుబంధమున్నా అంతే. బహాశా అది నా అశక్తత. అశక్తత దొంగవేషం కాదు. మీకు అర్థమైనంత సులభంగా నాకు రాజకీయాలు, మనుషులు అర్థం కాకపోవచ్చు. మీ అంత సులువుగా వైఖరులు ప్రకటించలేకపోవచ్చు. అంతే. సంక్లిష్టత అన్నది దొంగవేషం కాదు. గుణాలకు మూలమైన అంతరంగం చిక్కలేదు అని మీ వ్యాసం చివర్లో అన్నారే -అలాంటిది ఏళ్లూ పూళ్లూ గడిపినవారికి కూడా కొన్ని సందర్భాల్లో చిక్కకపోవచ్చు. దానికి మీరు దొంగవేషం అని వాల్యూ అంటగడితే ఎలా! అన్ని వైపులనుంచి అభిప్రాయాలను సేకరించినా నిర్థరణలకు రావడం కష్టం అంటే ఏ అభిప్రాయమూ చెప్పొద్దు అని కాదు. అది సంక్లిష్టతను తెలియజేయడానికి ఒక ప్లేన్లో అన్నమాట. వ్యక్తిగతమూ రాజకీయమే అన్నదాన్ని ఒక ప్లేన్‌లో ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుందో ఇదీ అంతే. సెకండరీ ఆధారాల మీద నిలబడినా సరే, చనిపోయిన ఒక గొప్ప కవి గురించి మాట్లాడుతున్నపుడు ప్రేమ పూర్వకమైన విషయాలు పంచుకోవడంలో తప్పులేదు. విపరీతంగా ప్రేమను చూపే మనిషి గురించి మాట్లాడుతున్నపుడు చాలా అనుభవాలూ జ్ఞాపకాలూ మెదులుతాయి. కానీ ”నవత వ్యవహారం తర్వాత కలేకూరికి తాగుడు ఎక్కువైంది”లో ఉన్న ధ్వని ఏమిటంటారు-నింద విసిరేయడం కాకపోతే? ఒక వ్యక్తి వల్ల అడిక్షన్‌ పెరగడమేమిటి? ఇదెక్కడి సైన్స్‌! మనిషిలోని గొప్పకు మాత్రం మనం వారసత్వం తీసేసుకుని మరికొన్నింటికి వాల్యూ జడ్జిమెంట్‌ వద్దంటూనే వాటిని ఇంకెవరికో ఆపాదించడం ఒక ధోరణిగా మారుతున్నది. అదిసరికాదు. బాధ్యత ఫలానా వారి తరపునే ఉండాలని నేను అనుకుంటున్నట్టు మీకు అర్థమయ్యింది. you choose to belive that. మీరు దేనిమీదైనా అభిప్రాయానికి రాగలరు. నేను ఆ పరిసర నిర్మాణాలకు కూడా దూరంగా ఉండి చాలా కాలమైంది. నాకూ బోలెడన్ని విమర్శలున్నాయి. కాకపోతే విమర్శ కూడా బాధ్యతతో ఉండాలని నేను అనుకుంటాను.

 7. కలేకూరి జీవితం ..అనుభవాల పా౦ధశాల..మనిషి లో లోపాలు లేకపోతే ..అది మనిషి స్వభావానికి ..విరుద్ధం..క్షీర నీర న్యాయం లా అతడి చైతన్యాన్ని అందుకోవాలి …నన్ను నగరం నడిబొడ్డున ..సమాధి చెయ్య౦డన్న ..దిక్ఖార ..స్వరం తో స్వరం కలపాలి …ఆత్మ నున్యతలేని ..సమాజం వైపు ..అడుగులు వేయాలి ..రేపటి..కొత్త పాటకు ..బ్రతుకు బాణీలు..అల్లాలి .

 8. @ gsrammohan,

  “ఇక్కడ వచ్చే కామెంట్ల ద్వారానే ఈ వ్యాసం అర్థవంతమవుతుంది కాబట్టి, కలేకూరి గురించి తెలిసినవారు తమకు తెలిసిందాన్ని ఇక్కడ పంచుకుంటారని ఆశిస్తున్నాను” – అంటూ ఒక చిన్న ముక్క ఈ వ్యాసానికి కింద బ్రాకెట్లో తగిలించబోయి మానేశాను, అది ఎలాగూ జరిగేదే లెమ్మని. కానీ జరగలేదు. ఇంత righteousness తో కామెంట్ రాసిన మీ దగ్గర్నుంచీ ఏం రాలేదు. ఏంటీ? సంక్లిష్టతా? అది ఈ సందర్భంలో కొన్ని దొంగవేషాల్ని దాయటానికి ఉపకరించే మాట. మరణం ముంగిట ఆ మనిషి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో ఇక అన్నీ తేటగా చూడగలిగే ఒక వాంటేజ్ పాయింట్‌కు చేరుకున్న దశ మీకు కనిపించకపోతే, అక్కడ నేను చూడగలిగింది మీరు చూడలేకపోయారని సరిపుచ్చుకోవాలి.

  ‘ముందస్తు అభిప్రాయా’ల సంగతి మాట్లాడారు. ముందస్తు కాదు గానీ, కలేకూరి ఇంటర్వ్యూ చూసిన తర్వాతి అభిప్రాయంతోనే ఇది రాశాను. నా వెతుకులాటలో దొరికిన facts యేవీ ఆ అభిప్రాయాన్ని ఛాలెంజ్ చేయలేదు. ఇక గుంటూరూ కంచికచెర్లా వెళ్లి కనుక్కుని రాయాలీ అంటే, ఇక నేను కలేకూరి బయోగ్రఫీ రాయాలి, అదీ పాక్షిక సత్యాన్నే ప్రతిపాదిస్తుంది. “అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా నిర్థరించడం కష్టం” అని మీరే చెప్తున్నారు మళ్లా. కనీసం నా వైపు అభిప్రాయాన్ని (నా నిజాన్ని) నేను చెప్పాను. మీ వైపు నిజాన్ని మీ ఉపపత్తులతోనే ప్రెజెంట్ చేస్తే సంతోషిస్తాను. పేలవమైన పాత్రికేయం అంటే నా దృష్టిలో ఏ అభిప్రాయమూ వ్యక్తం చేయలేని పాత్రికేయమే.

  ఇక సత్యమూర్తి ఎందుకు బైటికి వచ్చాడన్నది నా వ్యాసానికి ముఖ్యం కాదు. సత్యమూర్తి గురించి కలేకూరి ఏం చెప్పాడన్నది నాకు ముఖ్యం. ఐనా సులభంగా ఎక్కడా తేల్చేయలేదు: అసలు మీరు ఆ విడియో చూశారా? చూస్తే, అసలు నేను ఏ నిర్ధరణలూ చేయలేదని, ఆ వీడియోని దాదాపు నేరేట్ చేశాననీ, ఆ వీడియోలో ఉన్న విషయాలను రూఢిపరిచే విధంగా నాకు దొరికిన ఫాక్ట్స్ ప్రెజెంట్ చేశాననీ, అందుకే ఈ వ్యాసం పేరుకు బ్రాకెట్లో “దళిత్‌కెమెరా వీడియోల సమీక్ష” అని పెట్టాననీ అర్థమవ్వాలి.

  (ఐనా నేను సత్యమూర్తి బైటకు రావటం విషయంలో కేవలం కలేకూరి మాటల్నే ఆధారంగా తీసుకోలేదు. ఈ లింకులో చూడండి:

  http://www.cpiml.in/home/index.php?view=article&id=220:in-memory-of-comrade-kg-satyamurthy&Itemid=112&option=com_content

  లింకులో విషయం కొంత తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను:

  The main criticism of Sathya Murthy when he went out of Peoples War Group was that, as Varavara Rao himself admits, “the PWG has no political programme and that it is only an economic struggle”. It is as a part of it Sathya Murthy raised his criticism that PWG like other organizations have no clear perspective about the annihilation of the caste system[…] We did not agree with the stand taken by Sathya Murthy on caste question. He went even to the extent of joining BSP for some time, pursuing the line of identity politics, more or less. But, will the criticism of Sathya Murthy for his sins as done by Varavara Rao justify the absurdity of his own approach to caste question as stated below: “When you are a Marxist, you have already given up caste or religion, which was never your choice. I am not saying there is no caste in the party, the party recognized that the essential problems in revolutionary movement in India are two — parliamentary politics and caste. In fact, during the Mandal agitation, the party decided that if there was an opening within the party for a leader and the contenders were a Dalit, woman and an upper-caste, preference would be given to Dalits and women. If all the contenders were equally articulate, with raised revolutionary consciousness, the criterion would be identity-based preference. Rao says the problem of caste-based leadership is raised only by educated Dalits. You don’t find this in the villages where the struggle is being waged”.

  What VV is advocating in line with the Maoist leadership is the path of reductionism, pure and simple, whether inside the party or in the society. He forgets that even after proletarian revolution and decades of socialist transformation in Soviet Union and China, where even Cultural Revolution was waged for a decade, not only the capitalist order came up, but also all the old habits and culture in new forms established their hegemony soon. So how can he claim through his simplistic approach that the centuries old, well entrenched caste system can be abolished even inside the party in the manner he has explained?[…]

  It is the mechanical approach towards the abolition of the caste system along with other ideological political differences which led to Sathya Murthy going out of Peoples War Group. Instead of honestly admitting that, the Peoples War Group leadership was distorting the facts and maligning Sathya Murthy. They even blamed that he had surrendered for financial benefits. Varavara Rao like intellectuals parroted it. The mistake of Sathya Murthy was that instead of waging a determined struggle against the erroneous line of the PWG, he one-sidedly approached the caste question, becoming a victim of the identity politics and other deviations which tarnished his image among the people and the revolutionary left sections.

  ఈ లింకులోనూ సత్యమూర్తి బైటకు వచ్చిన కారణాల పట్ల చర్చ ఉంది:

  http://roundtableindia.co.in/index.php?option=com_content&view=article&id=3458:casting-a-dark-shadow&catid=61&Itemid=56

  బహుశా సత్యమూర్తి గురించీ, కుల పోరాటం పట్ల మార్క్సిస్టుల దృక్పథం గురించీ మిమ్మల్ని బాధిస్తూ నేను చేసిన రెండుమూడు నిర్ధరణలూ ఇవే అయి ఉంటాయి. కానీ మీరన్న సంక్లిష్టతలు పైన ఆయన సహచరుడి మాటల్లోనూ లేవు మరి. సత్యమూర్తి బయటికి రావటానికి దళిత్ క్వశ్చనే కారణమని ఆయన స్పష్టంగానే చెప్తున్నాడు. నేను అనేదేంటంటే, ఆ రెండు మూడు నిర్ధరణలు కూడా నేను ఏం సులభంగా చేసినవి కాదు. ఎంతో చదివి అందులో నేను నమ్మిన వాదనల తరపున చేసిన నిర్ధరణలు. ప్రశంస విషయంలోనే కాదు, నింద విషయంలోనూ నా కారణాల పట్ల నాకు స్పష్టత ఉంది.)

  ఇక మీ మిస్‌ప్లేస్డ్ షివల్రీ గురించి. వైవాహిక జీవితంలో నేను చొరబడి రాసింది ఒక్క ముక్క కూడా లేదు. నిందలసలే లేవు. I merely typed out his words, which I obviously chose to believe. ఆ మాటకొస్తే అసలాయనే ఎక్కడా నిందలు చేయలేదు. తనకు జరిగింది జరిగినట్టు చెప్పుకున్నాడే తప్ప ఎవర్నీ బ్లేమ్ చేయలేదు. ఇది కలేకూరి జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేసిన సందర్భం. చనిపోయే ముందరి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడక్కుండానే ఆయనే ఎత్తి ప్రస్తావించిన విషయం. ఇది వ్యాస పరిధి కాదని మీరనుకుంటే, నా వ్యాస పరిధి సంగతి సహజంగానే మీకన్నా నాకు ఎక్కువ తెలుసంటాను.

  ఇవిగాక ఇంకా నిర్ధరణలు ఏవున్నాయో మీరు ఎత్తి చూపితే ఏ facts ని బట్టి ఆ పర్యవసానానికి రావాల్సి వచ్చిందో చెప్పగలను. “అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా నిర్థరించడం కష్ట”మైనపుడు, ఒక్క ఎసెర్టివ్ వాక్యమూ పుట్టదు. “సూర్యుడు అస్తమించాడు” అన్నది కూడా ఒక నిర్ధరణకు వచ్చేయటమే అవుతుంది. కాబట్టి మన మనస్సాక్షి ఎటువైపు వుందో దాన్ని ఎసెర్ట్ చేయాలి. నేను సంస్మరణ సభని నేరేట్ చేశాను, అంతే! అది కూడా అందులోని ప్రహసనాత్మక అంశాల్ని ఎత్తి చూపించాలని. దాన్ని ఒక ఉపపత్తిగా తీసుకుని నేను నిర్ధరణకు వచ్చిన వాక్యాలేమైనా ఉంటే చూపించండి. అతను ఎక్కువ పుస్తకాలు రాశాడన్న దాని గురించీ, అతని శైలి గురించీ చెప్పటానికి మాత్రమే ఆ సభలోని వాళ్ళ మాటల్ని తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నాకు దొరికితే ఆ రెండు మూడు ముక్కలూ నేనే అంతకన్నా ఎలాక్వెంట్ గా చెప్పగలిగేవాడ్ని.

  మీ కామెంట్ చివర్లో ఒక అంశాన్ని వ్యక్తం చేయటంలో తడబడ్డారు. నాకు బాధ్యత గురించి పట్టింపు ఉండాలని చెప్పటం కాదు మీ ఉద్దేశం, నాకు ఎవరి తరపున బాధ్యత ఉండాలో చెప్పదల్చుకున్నారు మీరు. Sorry to disappoint you, I’m not on that side. But I am on a side for sure, I never tried to hide that. నేను ఆబ్జెక్టివ్‌గా ఉండాలని ఎక్కడా అనుకోలేదు. కలేకూరి పెర్సొనా మీద నాకున్న అభిమానాన్నీ దాయలేదు. అలాగని ఏ ఫాక్ట్స్‌నూ వక్రీకరించనూ లేదు. ఇక నైపుణ్యం గురించి వేరే శ్రద్ధా పట్టింపూ అవసరం లేదు, ఉద్దేశంలో నిజాయితీ ఉన్నప్పుడు మిగతావన్నీ వాటంతటవి వచ్చి చేరేవే.

 9. ఆరంభం ప్రామిసింగ్‌గా ఉంది. వాక్యం శుభ్రంగా ఉండడంతో ఆసక్తి పెరిగింది. ఇంత చక్కని వాక్యం రాసిన ఆ ఆకుల నాగరాజుగారెవరో చూడాలి అనిపించింది కూడా. కానీ వ్యాసం రాను రాను గందరగోళంగా మారింది. కొన్ని ముందస్తు అభిప్రాయాలను పాతేసి దానికి ఉపకరించే ఉపత్తులను చుట్టూ పేర్చుకుంటూ పోయే పేలవపాత్రికేయంలోకి దిగింది. అవి కూడా సంస్మరణ సభ లాంటి సందర్భాలు. ఒక్కో సందర్భానికి ఒక్కో మూడ్‌ ఉంటుంది. సమయం సందర్భం గురించి రచయితకు పట్టింపు ఉన్నట్టు అనిపించలేదు. ఆసక్తి కలిగిన వారిని ఆఖరి ఇంటర్య్వూ వైపు పంపే ప్రయత్నమే అయితే అన్ని నిర్ధరణలు చేయనక్కర్లేదు. ఒక వ్యక్తి ఏ నిర్మాణం నుంచైనా ఎందుకు బయటకొచ్చారు అనేదానికి చాలా కారణాలు ఉంటాయి. అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా నిర్థరించడం కష్టం. సత్యమూర్తి విషయంలోనూ అలాంటి సంక్లిష్టతలున్నాయి. అంత కష్టమైన దాన్ని మీరు సులభంగా తేల్చేశారు. యువకతో పాటు పనిచేసిన వారు ఇప్పటికీ గుంటూరులోఉన్నారు కదా, వారిని అడగొచ్చు కదా అని కూడా అనుకోలేదు. ఆయా నిర్మాణాలనుంచి బయటకి వచ్చి వేర్వేరు రూపాల్లో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నవారు, వేర్వేరు వృత్తుల్లో సెటిల్‌ అయినవారూ ఉన్నారు. వారు నిర్మాణాల వాదనకు కట్టుబడాల్సిన అవసరం లేనివారు. అభిప్రాయాల్లో తేడాలున్నా నిర్మాణ కట్టుబాట్ల నియతి లేనివారు. అయినప్పటికీ రాజకీయ అభిప్రాయాలకు రావడాన్ని వెల్లడించడాన్ని కొంతలో కొంతైనా అర్థం చేసుకోవచ్చు. ఒక రచయితను ఎంతైనా పొగడవచ్చు. యువక ఆ పొగడ్తలకు అర్హుడుకూడా. 90 నుంచి అతనితో నాకూ అంతో ఇంతో సాన్నిహిత్యం ఉన్నది. ప్రశంస పర్వాలేదు కానీ ఇతరులపై నిందలేసే విషయంలో మాత్రం కూసింత ముందూ వెనుకా చూసుకోవాలి. అది బాధ్యత. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలోకి, వైవాహిక జీవితంలోకి జొరబడి నిర్థరణలు చేసేటప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. బయటపడి జవాబు చెప్పుకోలేని వ్యక్తి మీద అలవోగ్గా నిందలు విసిరేయడం సబబనిపించుకోదు. పైగా అది ఈ వ్యాసపరిధిలో చర్చించాల్సిన అంశం కాదు. ఆకుల నాగరాజుగారికి నైపుణ్యం గురించి తప్ప బాధ్యత గురించి పట్టింపు ఉన్నట్టనిపించలేదు.

 10. నాగరాజు గారు ఆ కథ పేరు సూర్యుని నల్లరంగు రెక్కలు. పాలపిట్ట 2014 ఏప్రిల్.జూన్

 11. తను ఏం చేసినప్పటికీ, ఏ ఆశయసాధనల పోరు అసంపూర్ణంగా వదిలిపెట్టినప్పటికీ, మనం కోల్పోయిన ఓ విలువైన, విలక్షణమైన వ్యక్తి కలేకూరి ప్రసాద్ అంటూ తనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు త్రిపుర గారి రమణజీవి.

 12. తన ఊరి నుంచి పీపుల్స్‌వార్‌లోకీ, విరసంలోకీ, దళితమహాసభలోకీ, పత్రికా సంపాదకత్వంలోకీ జీవితాన్ని విస్తరించుకున్న కలేకూరి ప్రసాద్ కి ‘బుడ్డగిత్త రంకి’ కధ పుట్టా పెంచల్దాసు తన సృత్యంజలిని ఇలా సమర్పించారు:

  “ ఏప్రిల్ 15, 2006 న అంబేద్కర్ జయంతి ఉత్సవం నాడు అనంతవరంలో జరిగిన నాటకం నుండి వస్తున్నప్పుడు ప్రసాద్ అన్నకు జాషువ పద్యం (అలోకించిన గుండియల్ కరుగు నాయా పిల్ల గోరీలలో) పాడి వినిపించిస్తే సెభాష్ తమ్ముడూ అని పొగిడాడు. దళితకులం లో పుట్టిన మహాపండితుడు మా ప్రసాద్ అన్న.

  ఫిబ్రవరి 2, 2006 లో ప్రముఖ రంగస్థల నటుడు, హరిశ్చంద్ర పాత్రకు ఘనకీర్తి తెచ్చిన చీమకుర్తి నాగేశ్వరరావు సంస్మరణ సభలో ప్రసాద్ అన్నను కలుసుకున్నాను.

  యీ లోకంలో ఎవురైనా సమయానుకూలంగా పోతారు. కాని ప్రసాదన్న జీవితాంతం రాజీలేని నిబద్దతత చూపించాడు. కలేకూరి ప్రసాదన్న మీద ఇంత గొప్పగా వ్యాసం రాసిన ఆకుల నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను “ ~ పుట్టా పెంచల్దాసు

 13. దలితులు ఇంకా చాలా గుణ పాటాలు నేర్చుకోవాల్సి ఉందని వ్యాసం తెలియజేస్తుంది.

 14. kalekuri ni modata kurnool jilla gudipadu gramamloo oka aathma gourava sabha lo chusaa ananth tho paatu. aa tharvaatha entho charithra. naaku kalekuri oka hero. oka kavi, ee vyasam chaduvuthunte kalekuri meeda chandrasekara rao gaaru raasina katha medilndi.chala vishayaalu kallamundu meduluthunnayi…..nagaraj gaaru thanks.

 15. లెల్లె సురేష్, అనంత్, శ్రీరాం, కలేకూరి వీళ్ళూ వీళ్ళ గొడవ- పాటలు… అదో రకం రొజులు నాకు. నా చావు ఏదో నా బ్రతుకు ఏదో ఈ రోజుకూ నాకు అర్థం కావడం లేదు, వీరిని వీరి జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి, అవగాహన కావాలంటే ఆ తరహా జీవితాలు ఆ నేపధ్యాలు లేకున్నా కనీసం పసిగట్టగల గ్రహింపు కలిగిన ఇంద్రియాలు అవసరం. అది నాకెప్పుడూ లేదు.
  ఆ రోజుల్లో అంటే ఖచ్చితంగా 17 సంవత్సరాల క్రింద వీళ్ళందరినీ వీళ్ళ తాగుడిని , పాటలని, చిందులని…. తాగుడు, పాటలు, చిందులు చేతకాని నేను చిద్విలాసంగా ఎంజాయ్ చేసేవాన్ని, ఇన్నేళ్ళ తరువాత ఈ వ్యాసం నాకు ఒక తెర వెనుక చూపించింది, నేను చూసింది లేదా చూశాననుకుంది నిజమో! భ్రమో! అది నాది దాన్ని ఎవరితో పంచుకొనక్కరలేదు. ఇన్నేళ్ళ తరువా ఈ వ్యాసం నన్ను కొన్ని సంవత్సరాల వెనకటి కలేకూరి అదోలాంటి అద్భుతమైన నవ్వుని, జం జం జమ్మాల పిల్లా పాటని ముందుకి నిలిపింది. చెప్పడానికి థేంక్ యూ అనే నాటు మాటే తప్ప మరో మంచి మాట లేదుగా :(

  • I am so much disturbed by seeing the video of Prasad and the article above of Nagaraju.It is an irony that Dalits are to.suffer even in Revolutionary Maoist organisations.Why?I am unable to forget the face of Kalekuri Prasad depressed disillusioned drinking to forget and the tragic end.It is obvious that Dalit movement should be independent of Maoist or any other political setup.It is a social and cultural issue.And economic equality will slowly integrate them into the society.Not armed revolt not Chrisrtianity not Buddhism .
   I am still upset seeing the visage of Prasad …When will things change?
   Very good essay and review.

Comments are closed.