WoundedHeart

ఆశించిన ప్రయోజనం సిద్ధింపజేసుకున్న పుస్తకం: వూండెడ్ హార్ట్

Download PDF    ePub   MOBI

కవిత్వం ఎన్నో రకాలు. తన మనసులోని భావాలను ఇతరులతో పంచుకోడానికి కవి/కవయిత్రి చేసే ప్రయత్నం కవిత్వం. ఆ భావాలు ఆనందానివి కావచ్చు, దుఃఖానికి కావచ్చు, ఆందోళనవి కావచ్చు, ఉద్వేగానికి కావచ్చు, భయాలవి కావచ్చు, ఉత్సాహానివి కావచ్చు, ఉల్లాసానివి కావచ్చు. ప్రతీ రచనకి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉన్నట్లే ఒక లక్ష్యం కోసం రాసే కవిత్వానికి ఒక ప్రయోజనం ఉంటుంది.

అటువంటి కోవకే చెందినది శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారి “మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్“. పుస్తకం శీర్షిక ఆంగ్లంలో ఉన్నా, కవిత్వం మాత్రం చక్కని తెలుగులో సాగిపోతుంది. ఇతివృత్తం, కవితావస్తువు సార్వజనీనమైనది. శీర్షిక సూచిస్తున్నట్లుగానే, ఈ దీర్ఘకవితకి వస్తువు గాయపడ్డ హృదయం. ఈ గాయపడడం అనేది మాటల వల్ల కాకుండా, కాన్సర్ వల్ల. అంటే బ్రెస్ట్ కాన్సర్ గురించన్న మాట.

ఈమధ్య కాలంలో వచ్చిన వచన కవిత్వంలో అనుభూతి ప్రధానమైనవి కాకుండా, ఓ ఆరోగ్య సమస్యని కవితావస్తువుగా ఎంచుకుని కవి భావాలని పాఠకులకు హృదయాలకు హత్తుకునేలా చెప్పడంలో విజయం సాధించిన కొన్నిపుస్తకాలలో “మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్” కూడా ఒకటి.

సాధారణంగా మహిళా సమస్యలపై వచ్చే కవిత్వం జెండర్‌కీ, గృహ హింసలకీ చెందినదై ఉంటుంది. తమపై జరుగుతున్న అత్యాచారాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తోటి మహిళలను జాగృతం చేయడానికి ఈ కవిత్వం ఉపయోగపడుతోంది. అయితే బ్రెస్ట్ కాన్సర్ సమస్యపై మహిళలను జాగృతం చేసే ఉద్దేశంతో వెలువడిన తొలి తెలుగు దీర్ఘ కవిత “మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్”.

ఇండియన్ జర్నల్ ఆఫ్ కాన్సర్, సంపుటి 46, సంచిక 1 ప్రకారం, గత దశాబ్దంలో భారతదేశంలో మహిళలను సెర్వికల్ కాన్సర్ పట్టి పీడించగా, ఈ దశాబ్దంలో బ్రెస్ట్ కాన్సర్ విజృంభించింది. పారిశ్రామికీకరణ, నగరీకరణ విపరీతంగా జరిగి, పౌరుల జీవనశైలులలో కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి బ్రెస్ట్ కాన్సర్ త్వరితగతిన విస్తరించేందుకు దోహదం చేస్తున్నాయి. అనేక కారణాల వల్ల దేశంలో మామోగ్రఫీ నిర్వహించడం కష్టమని, బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించి, తొలి దశలోనే నివారణా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కల్పించడంలో తన వంతు పాత్రగా, దీర్ఘ కవిత రచించి, ప్రచురించారు అయినంపూడి శ్రీలక్ష్మి. ఈ ప్రయత్నం ఎందుకు చేశారో, ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. “ఎంతోమంది వ్యాధిగ్రస్తుల్ని చూశాను. అనుభవాల్ని విన్నాను. గత 15 సంవత్సరాలుగా నేనూ బ్రెస్ట్‌ ఫైబ్రినాయిడ్స్‌ బాధితురాలనే – నేను హస్పటల్‌కి వెళ్తున్న ప్రతిసారి నా వాళ్ళెంత ఆరాటంగా, భయంగా వుంటారో నాకు బాగా తెల్సు. చివరికి అర్థమయ్యింది ఒక్కటే – మన ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది. మృత్యువుతో పోరాటానికి కావల్సింది మందులు కాదు ముఖ్యంగా కావల్సింది మనోధైర్యమే. జీవితంలో ఏదీ వట్టిగా రాదు, ఒక్క వ్యాధులు తప్ప అనే వారు ఎందరో వున్నారు. కానీ వ్యాధి మాత్రం అవగాహన లేమితోనే ఎక్కువ భయపెడ్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. క్యాన్సర్‌ పట్ల కాస్త అవగాహన పెంచుకుంటే చాలు – మనకిక కలవరాలుండవు – కన్నీళ్ళ కుటుంబాలుండవు – ధైర్యంగా ముందుకు కదలగల్గితే నడవడమేమిటి ఏకంగా పరుగులే పెట్టొచ్చు.”

కాన్సర్‌ని పరిచయం చేస్తూ, “సునామీ తెల్సు/భూకంపం తెల్సు/గ్రహ శకలాలు తెల్సు/అణు విస్ఫోటనం తెల్సు/కానీ-/కణ విస్ఫోటనం మాత్రం/కొత్తదే కదా!” అంటారు. “మహా సంక్షోభానికి/మహా విపత్తే అక్కర్లేదు/ఒక్క కణం కన్నెర్ర చాలు”, “భూగోళమంత ఎగోనీకి/మహాసాగరమే అక్కర్లేదు/రెప్పదాటిన ఒక్క కన్నీటి చుక్కచాలు” – అని చెప్పడంలో కాన్సర్ కణం సృష్టించే కల్లోలాన్ని సముద్రంలో సునామీతో పోల్చారు.

Posted in 2013, డిసెంబరు, పుస్తక సమీక్ష and tagged , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.