cover

అనుభూతి మాలలు ‘అమరావతి కథలు’

Download PDF EPUB MOBI

తెలుగు సాహిత్యంలో – ఓ ఊరిని నేపథ్యంగా చేసుకుని కథారచన చేసిన రచయితలలో శ్రీ శంకరమంచి సత్యం గారు ఒకరు. ఆయన వ్రాసిన ‘అమరావతి కథలు’ గురించి తెలియని కథాప్రియులు ఉండరనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒకనాటి అమరావతి ఊరు చుట్టూ, అక్కడి మనుషులపైనా అల్లిన కథలివి. సజీవ గాథలివి. 1970 దశకంలో తొలుతగా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమయిన ఈ కథలను నడిపించడంలో రచయిత గొప్ప చాతుర్యం చూపారు.

అమరావతి పేరుతో వ్రాసినా, ఇవి నిజానికి పూర్తిగా ఊరి కథలు కావు. ఆ ఊరు కుగ్రామం కాదు, అలా అని మరీ పెద్ద నగరమూ కాని ఓ చిన్న పట్టణం! అమరావతిలోని శివాలయం, బౌద్ధారామాలు, కృష్ణానది… ఈ మూడూ చాలా కథలలో తారసిల్లుతాయి. శివుడు, పార్వతి, బుద్ధుడు పాఠకులని పలకరిస్తారు, మౌనబోధ చేస్తారు.

నవ్వులు, కన్నీళ్ళు, పంతాలు, పట్టింపులు, అహాలు, దర్పాలు, పట్టుదలలు, విరహాలు, వియోగాలు, అంతర్మథనం, క్షమ.. అప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు… వెరసి ఇవి మనుషుల కథలు, మమతల కథలు, అనురాగాల కథలు, అనుభూతుల కథలు, మాన్యుల కథలు, సామాన్యుల కథలు.. నీటి కథలు, మట్టి కథలు. నిడివిలో చిన్నదిగా ఉన్నా, ప్రతీ కథా అసాంతం చదివిస్తుంది. తన్మయత్వం కలిగిస్తుంది. కాస్తో కూస్తో కన్నుని చెమరుస్తుంది. వ్యక్తులు తమ కుటుంబాల చుట్టూ, ఊరి చుట్టూ అల్లుకున్న బంధాల గుచ్ఛం ఈ కథా సంపుటం.

ఈ కథల నిండా ప్రస్ఫుటమయ్యేది మనుషుల స్వభావాలు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కోపం, అసూయ, ద్వేషం… మొదలైన వ్యక్తుల సహజ లక్షణాలన్నీ ఈ కథల్లో గోచరిస్తాయి. చాలా కథల్లో మనుషులు తమ తమ తప్పుల్ని దిద్దుకుంటారు, లేకపోతే పశ్చాత్తాపం చెందుతారు.

ఊరు ఆధునికత సంతరించుకోడంవల్ల జట్కాలు, పల్లకీలు కనుమరుగవడం… వాటిపై ఆధారపడినవారు తమ జీవనోపాధి కోల్పోవడం వంటివి – ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న వారి నేటి కథలకి ఏ మాత్రం తీసిపోవు.

ఈ కథలకున్న విశేష గుణం క్లుప్తత! అతి తక్కువ పదాలలో అందమైన భావాలను కూర్చి అల్లిన అనుభూతుల మాలలు ఈ కథలు. ఈ సంపుటంలోని కొన్ని కథల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.

కృష్ణానది చుట్టూ ఉండే పచ్చదనాన్ని, ప్రకృతినీ వర్ణించిన తీరు అబ్బురపరుస్తుంది. అద్భుతమైన భావుకత్వం పొంగిన కథ “రెండు గంగలు”. ఈ కథలో.. ముఖ్యంగా కృష్ణానదిపై వర్షం కురిసే సంఘటన చదివితీరాలి. ఈ కథ చదువుతుంటే.. పాఠకులకి కుందుర్తి వారి “నగరంలో వాన” గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు.

“నాన్న – నది”, “తల్లి కడుపు చల్లగా…”, “అంపకం” కథలు తల్లి ప్రేమని, తండ్రి ఆపేక్షని వ్యక్తం చేస్తాయి.

శ్రద్ధ, భక్తిభావంతో చేసే పనుల వల్ల కలిగే పులకింత, తన్మయత్వం – అభావంగా చేసే చర్యలవల్ల కలగవని తెలిపే కథలు – “మనసు నిండుకుంది”, “సాక్షాత్కారం”. యద్భావం తద్భవతి అని చాటే కథలివి.

ప్రస్తుత కాలంలో – విడిపోయిన కుటుంబాలను కలిపేది, సత్యాన్ని నిలబెట్టేది ఏ రామాయణమో అని వాపోతారు రచయిత – “సీతారామాభ్యం నమః” కథలో.

“ఏడాదికోరోజు పులి”, “పూలసుల్తాన్”, “మట్టి… ఒఠ్ఠి మట్టి కథ” చదివి తీరాల్సిన కథలు.

ఈ కథలన్నీ కాలానుగుణంగా ఉంటాయి. కాలక్రమేణా మనుషులలో వస్తున్న మార్పులకు అద్దం పడతాయి. మనుషులలోని ఔన్నత్యం – ఊరుమ్మడి మేలుకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం నుండి తన స్వీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే స్థాయికి దిగజారడం కళ్ళకు కడుతుంది. “అంతా బాగానే వుంది…” కథ ఈ పరిణామాలపై చక్కని వ్యాఖ్యానం!

కథలన్నీ ఒక ఒడుపుతో నడిపిన తీరు ఒక ఎత్తైతే, – మనుషుల స్వభావాలను, కాలానుగుణంగా వస్తున్న మార్పులను కళ్ళకు కట్టిన కథ “భోజనాంతే..” మరొక ఎత్తు.

ఈ కథలలో దేవుడుంటాడు, రాజులుంటారు, అర్చకులుంటారు, పురోహితులుంటారు. అంతే కాదు, భూస్వాములు, రైతులు, పాలికాపులు, పూలసుల్తాన్, బావగాడు, శంకరయ్య, శంభులింగం, పోస్ట్ మాస్టర్.. ఇలాంటి వారందరూ వ్యక్తులుగా పాఠకుల కళ్ళముందు కదలాడి పాత్రలుగా ఒదిగిపోతారు. ఆహ్లాదం పంచుతారు, ‘ఆహా!’ అనిపించుకుంటారు.

అమరావతి అనే చిన్న ఊరి నేపథ్యంగా చెప్పినా ఈ కథలు విశ్వజనీనమైనవి. సార్వజనికమైనవి. సర్వకాలికమైనవి. మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఉన్న “అమరావతి కథలు” పుస్తకం వెల రూ.175/- నవోదయ పబ్లిషర్స్, విజయవాడ వారు ప్రచురించిన ఈ 399 పేజీల పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.

– కొల్లూరి సోమశంకర్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, పుస్తక సమీక్ష, మార్చి and tagged , , , .

One Comment

  1. Pingback: వీక్షణం-126 | పుస్తకం

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.