cover

గంధపు దండ

Download PDF EPUB MOBI

“హేయ్ డాడ్!”

ఇంట్లోకి అడుగుపెట్టగానే పలకరించాడు చిన్నోడు. ఓ కంటితో టీవీ చూస్తూనే మరో కంటితో పలకరించడం వాడి ప్రత్యేకత. వాడి కళ్ళలో ఓ క్షణం మెరిసి మాయమయ్యే ఆ మెరుపు ల్యూమినాన్సులో ఈసారి కూడా ఏమాత్రం తేడా లేదు. ప్రేమను కొలవడానికి ఏ పరికరాలు, కొలమానాలు లేవు కానీ సరిగ్గా అలాంటి మెరుపే చిన్నప్పుడు రోజూ పని నుంచి తిరిగొచ్చిన మా నాన్నను చూసినప్పుడల్లా నా కళ్ళలోనూ మెరిసేది. ఆ మెరుపును ఇట్టే పోల్చుకొగలను.

“హేయ్ చిన్నా, వాట్స్ అప్, హౌ వాస్ యువర్ డే ఎట్ స్కూల్?” సోఫాలో కూలబడి షూస్ విప్పుకుంటూ పలకరించాను. వాడినుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి-

“చిన్నా, మన మధ్య ఈ టివీ అడ్డంగా ఉందిరా!” అన్నాను.

నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాకపోయినా టీవి ఆఫ్ చేసి, “లవ్ యూ డాడ్” అంటూ ఓ హగ్ ఇచ్చి నా పక్కన కూర్చున్నాడు.

ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్న. కానీ మా చిన్నోడొచ్చి నాన్నను రెండవ స్థానంలోకి తోసేసాడు. వాడికిప్పుడు పదేళ్ళు. అందమైన కళ్ళు, కళ్లపై వాలిన సిల్క్ లాంటి పొడుగాటి జుట్టు. బొద్దుగా అందంగా ఉంటాడు.

లవ్ యూ అని రోజుకు పదిసార్లు అలా అలవోకగా అనేస్తాడు వాడు. నేనావయసులో మా నాన్నని “లవ్ యూ డాడ్” అని అనే సాహాసం ఎప్పుడూ చేయలేదు. ప్రేమ లేక కాదు. ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయలేని సిగ్గుతో.

“రేయ్ చిన్నా, డూ యు రియల్లీ లవ్ మీ?” వాడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ టీజ్ చేయాలనిపించి అడిగాను.

“ఓ యా, సో మచ్ డాడ్” పెదాలతో పాటు ‘సో…’ని సాగదీస్తూ అన్నాడు.

“అయితే నేను పోయాక నన్ను మిస్ అవుతావా?” చిలిపిగా అనాలనుకున్నా గొంతులో జీర అడ్డు వచ్చింది.

“వా డ్డూ యూ మీన్”

“ఐ మీన్ ఆఫ్టర్ ఐ డై…”

“ఐ మిస్ యు ఫర్ ష్యూర్ డాడ్” ఇలా అడుగుతానని ఊహించలేదనుకుంటా. కాస్త దిగులుగానే అన్నా, మామధ్య ఇలాంటి సీరియస్ సంబాషణలు మామూలే కాబట్టి వెంటనే మళ్ళీ జోవియల్ మూడ్ లోకి వచ్చాడు.

“అయితే రోజూ నన్ను గుర్తుచేసుకుంటావా?”

“అఫ్కోర్స్, నీ నిలువెత్తు ఫోటో ఒకటి నా ఫ్యామిలీ రూమ్ లో పెట్టుకుని రోజూ బోల్డన్ని పూలు కూడా పెడతాను” ఫ్యామిలీ రూమ్ లో ఉన్న ఓ వాల్ పెయింటింగ్ వైపు చూస్తూ కాస్తా సీరియస్ గానే అన్నాడు. పూలంటే వాడికిష్టం.

“థాంక్యూ రా, కానీ నా కోసం అలా ఎన్ని రోజులు పూలు తెచ్చి పెట్టగలవు?”

“ఎన్ని రోజులైనా…” చాలా కాన్ఫిడెన్సు తో అన్నాడు.

“చిన్నా, నీకిప్పుడు అర్థం కాదు కానీ, ప్రేమ అనేది ఐస్ క్రీం లా కాలంతో పాటు కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. నేను పోయాక ఏం జరుగుతుందో సరదాగా ఊహించి చెప్పనా?” అంటూ వాడికెదురుగా ఉన్న సోఫా లోకి మారుతూ అన్నాను.

“డాడ్, నువ్వెప్పుడూ ఇంతే. నీ మాటలు కొన్ని అర్థం కావు. కానీ ఐస్ క్రీం అంటున్నావు కాబట్టి ఈ స్టోరీ ఎదో ఇంటరెస్టింగ్ గానే ఉండేట్టు ఉంది. చెప్పు మరి.” అన్నాడు.

కథలంటే ఇష్టం వాడికి. రోజూ పడుకునేముందు ఏదైనా ఒక కథ చెబితే గాని నిద్రపోడు. ఇద్దరం కలిసి ఒకే బుక్ చదవడం అలవాటు మాకు. మేం చదివే బుక్ లో ఎప్పుడూ రెండు బుక్ మార్క్స్ ఉంటాయి. ఆ బుక్ మార్క్స్ కూడా వాడే తయారుచేసాడు. నా బుక్ మార్కు వాడి బుక్ మార్కు కంటే ఎప్పుడూ ఒకటి రెండు పేజీల వెనకుంటుంది.

“చిన్నా, నేను చనిపోయాక ఒక నెల రోజులు నిజంగానే చాలా మిస్ అవుతావు, వెక్కి వెక్కి ఏడుస్తావు, బాధపడతావు. రోజూ నువు చదివే బుక్ లో నా వంతు కూడా నువ్వే చదివి నా బుక్ మార్క్ కూడా నువ్వే మారుస్తుంటావు. రోజూ పొద్దున్నే మనిద్దరం నాటిన గులాబీ తొట్లోకెళ్ళి ఏడుస్తూ నువ్వు తేగలిగినన్ని గులాబీలు నీ చిట్టి చేతులతో కోసుకొచ్చి ఫ్యామిలీ రూమ్ లో నా ఫోటో కిందున్న టేబుల్ మీద పెట్టి దిగులుగా అక్కడే కూచుంటావు.

“ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి.

“ఆ తర్వాత నీ హై స్కూల్ చదువుల్లో బిజీ అయిపోయి, సమయం లేక హడావిడిగా రోజుకు ఒక్క పువ్వే కోసుకొస్తావు. కొన్నాళ్ళకి నీ చదువులు పూర్తవుతాయి. మంచి ఉద్యోగంలో చేరతావు. నీకు పెళ్లి కూడా అవుతుంది. రోజూ ఇష్టంగా పూలు పెట్టే పని కొన్నాళ్ళకి పనివొత్తిడివల్ల అదో మొక్కుబడిగా మారుతుంది.

“ఓ రోజు నీ వైఫ్ అంటుంది ‘హనీ, ఇలా రోజూ పూలు కోసుకొచ్చి పెట్టేబదులు, సాండిల్ వుడ్ పూలదండ వెయ్యొచ్చు కదా. ఎప్పుడూ వాడిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది.’

“అది కాస్త కన్విన్సింగ్ గా అనిపించి సరే అని తలూపేస్తావు. మరుసటి రోజు గ్రోసరీస్ కి వెళ్ళినపుడు అక్కడో దండ కొనుక్కొస్తావు.

“ఇలా మరి కొన్నాళ్ళు గడుస్తాయి.

“ఓ రోజు, నువ్వూ నీ వైఫ్ మాల్ లో షాపింగ్ చేస్తూ ఓ అందమైన పెయింటింగ్ చూస్తారు. ఇద్దరూ ఇష్టపడి దాన్ని కొనుక్కొస్తారు. ఆ పెయింటింగ్ ని ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని, ఇద్దరూ చాలాసేపు ఆలోచిస్తారు, ఇల్లంతా కలెతిరుగుతారు. చివరికి ఫ్యామిలీ రూమ్ లో ఉన్న నా ఫోటో ముందు నిలబడతారు.

“ ‘హనీ, ఈ పెయింటింగ్ ఇక్కడ పెడితే బాగుంటంది కదూ?!’ ముద్దుగా గారాలు పోతూ అడుగుతుంది నీ వైఫ్.

“ఓ క్షణం ఆలోచించి సరే అంటావు.”

చెబుతూ చెబుతూ వాడి ముఖం చూసాను. సిగ్గూ దిగులూ కలిసిన ముఖం పెట్టి శ్రద్దగా వింటూ అన్నాడు-

“డాడ్, అలా ఎప్పటికీ చేయను. నీ ఫోటో నే నాకు ముఖ్యం. నా వైఫ్ తో గొడవైనా పెట్టుకుంటా కానీ ఆ కొనుక్కొచ్సిన పెయింటింగ్ కోసం నీ ఫోటో తీసేస్తానా!” గొంతులోంచి సిన్సియారిటి తొణికింది.

“లేదురా, అలాగే అవుతుంది.” అంతా జరిగినట్టే, చూసినట్టే చెప్పాన్నేను.

వాడలా సోఫాలో కూచుని నేను చెప్పిందానికి కన్విన్సు అయీ కానట్టు వింటున్నాడు.

“ఆ అందమైన పెయింటింగ్ వాల్ మీద పెట్టాక, నా ఫోటో తీసి రూమ్ లో ఓ మూలన గోడకు నిలబెడతారు.

“మనసుగోడలకు అతుక్కున్న ఫోటోలే స్థలాలు మారిపోతున్నప్పుడు ఇంటి గోడలు ఏ లెక్కల్లోకి రావు. కాలంతో పాటు ఇల్లూ, ఇంటి గోడల రంగులు, వాల్ పెయింటింగ్స్ అన్నీ మారుతుంటాయి. పాత వస్తువులను కొన్నింటిని విడవలేక విడవలేక సాగనంపి కొత్త వస్తువులను ఆహ్వానిస్తుంటాం.

“నేనంటే నీకు ఇష్టం కాబట్టి ఆరోజు రాత్రంతా నా గురించి, నా ఫోటో గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తావు.

“మర్నాడు మూలనున్న నా ఫోటో తీసికెళ్ళి నీ క్లోసెట్ లో వేలాడేసిన బట్టల వెనక ఇష్టంగా దాచుకుంటావు.”

ప్రపంచంలో మనదంటూ స్వంత ప్లేస్ ఏదైనా ఉందా ఉంటే అది మన బట్టల క్లోసెటే అన్నట్టు చెప్పాననిపించింది!

“నో డాడ్, దట్ వోంట్ హాపెన్!” కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ అన్నాడు.

“ఇట్స్ ఒకే రా. ఇట్ వాస్ జస్ట్ ఎ స్టొరీ!” అంటూ వాణ్ణి చీరప్ చేస్తూ, హగ్ ఇచ్చి బట్టలు మార్చుకోడానికి నా బెడ్ రూమ్ లోకి నడిచాను.

నా వాక్ ఇన్ క్లోసెట్ లోకి వెళ్ళగానే ఎంతో పరిచయమున్న సాన్డిల్ వుడ్ దండ సువాసన గుప్పుమంది.

*

(చెన్నమనేని సంజయ్ కి..)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మార్చి and tagged , , , , , .

15 Comments

 1. Dear Ravi,
  మీ చక్కని కథ ‘గంధపుదండ’ చదివాక, 1993 డిసెంబర్ లో మా పెళ్లైయ్యాక, 1994లో మొదటిసారి మా నాన్నగారు మా కొత్తకాపురం చూడ్డానికి వచ్చివెళ్లాక నాన్నగార్ని ఉద్దేశించి నేను రాసిన ‘ఒక మోహాస్పద మోసం’ కవిత గుర్తొచ్చింది.
  అయితే, పెళ్లి తర్వాత మారే prioritiesకి మీ కథలోని ‘ముద్దుగా గారాలు పోయే వైఫ్’ కారణమైనట్టు నా ‘మోహాస్పద మోసా’నికి, ఆయన్ని తన తండ్రి కంటే ఎక్కువగా చూసిన నా భాగస్వామి కారణం కాదు.
  ఒక మోహాస్పద మోసం
  భరించే జేగురు నేలల భూగోళం నీ పెనుభారపు జంట పాదాల అడుగుజాడై
  చీకటి రాపాడిన పొగబండ్లన్నీ నీ ఎదురుచూపుల స్టేషన్ కాంతుల రుణగ్రస్తమై
  అగమ్యాల అమ్ము వింటికి నాటిన గాయ పరంపరల నా దోషమంతా ఇర్వైఏడుమార్లు వెలిగిన పుత్రోత్సాహపు కరిగే కొవ్వొత్తి సహనాల క్షమతో పెరిగి
  వటవృక్షాలు కూలిపోయే నీ గాలుల వెర్రి ప్రేమకి గరిక నిబ్బరాల తేరి
  జీవనదుల నీలి పరుగు రొదలంటని ఉప్పని కెరటపు కడలి కేకనై
  బాటలు పరిచిన ఒంటి అరిచేతి గుండెలనే ముదమార తన్ని క్రూరకర్మాలన్నీ నేరి మరీ చేసి విరూపాలై చుట్టే శోకాల కన్నీటి కాటుకి మబ్బుపొత్తిళ్లగూట్లోంచి జారి నిస్సంఖ్యాక నిర్విముక్త శతకోటి మృతజన్మలెత్తే నా రాతి రెక్క శిలాస్తిత్వాల మొగమాటపు ఆతిధ్యాలివియే నను గన్న నా తండ్రి-
  * * *
  (చుట్టం చూపుల superficial ప్రేమతో నాన్నకి- )

 2. కథ మధ్యలోనే నాకు కథంతా తెలిసిపోయింది. ఎండింగ్ ఏమివ్వబోతున్నారోకూడా exact గా ఊహించేశాను. అయితేనేం? వెరీ టఛింగ్ & పొయటిక్ స్టోరీ కవి గారూ :-)

 3. మీ కవితల్లాగే సున్నితంగా ఉంది.. కొసమెరుపు బాగుంది. కానీ , జ్ఞాపకాల్లో , వస్తువుల్లో మాత్రమే దాగుతారా మనుషులు.. ఏమో .. అలా ఆలోచిస్తే దిగులుగా ఉంటుంది

 4. నిశ్శబ్దమైన లేక్ పక్కనుంచో, ఒక గ్రీన్ వే లోకో.. ఒంటరిగా నడుచుకు పోతుంటె కలిగే ఒకనొక దిగులు – ఈ కథలో గుప్పుమంది.

  తాత్వికతతో కూడిన కొన్ని మాటలు కథకి మంచి పట్టునిచ్చాయి.
  రవి గారు!
  మంచి కథనందించినందుకు నా అభినందనలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.