palaparthi cover

Up Balloon-Down Balloon

పాపకి బెలూన్లు కొన్నారు.

రంగు రంగులవి.

మిక్కీ మౌస్ బొమ్మలున్నవి.

అయితే అవి

ఇప్పుడు కనిపిచడం లేదు!

గది పైకప్పుకు ఆనుతూ తేలుతూ ఉన్నవే.

అంతలోనే మాయం అయ్యాయి!

అమ్మా పాపా కలిసి ఇల్లంతా వెతికారు.

అవి అలా తేలుతూ ఏ గదిలోకి వెళ్ళాయో అని.

ఏ గదిలోనూ లేవు.

పోనీ

మంచం కింద?

టేబిల్ కింద?

కుర్చీల కింద?

ఊహూ..

లేవు.

మరి ఎక్కడికి పోయాయబ్బా?

ఎవరైనా దొంగ వాడు వచ్చి

కిటికీ లోపలనించి దూరీ

ఎత్తుకుపోయాడేమో?

అన్నది పాప.

అమ్మకి నవ్వొచ్చింది.

నవ్వొచ్చినప్పుడు గుర్తొచ్చింది.

ఇందాకా సాయంత్రం

పాప మూడు చక్రాల సైకిల్ తీసి

బయటకు వెళ్ళి ఆడుకుంది.

అప్పుడు అవి నెమ్మదిగా వాకిలి దాటి బయటకు వెళ్ళిపోయి ఉంటాయి.

ఈ మాటే చెప్పింది అమ్మ పాపతో.

ఓ! అలాగా!

అయితే సైకిల్ మీద వెళ్ళి పట్టుకొచ్చుకుందాం.

పద పద!

అమ్మని తొందర పెట్టింది పాప.

ఇప్పుడు ఇంక దొరకవు రా అవి అని

అమ్మ చెబుతున్న మాటలు పట్టించుకోకుండా

సైకిల్ తీసుకుని

తొక్కుతూ వెళ్ళిపోతోంది పాప.

అమ్మ కూడా వెనకాలే పరుగు తీసింది.

చుట్టు పక్కల నాలుగు వీధులూ తిరిగారు.

చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్నాయోమో అని

వెతికారు.

కరెంటు తీగెలూ,స్తంభాలూ పరిశీలించారు.

ఎక్కడా లేవు.

అలిసిపోయి

మొహం వేలాడేసుకుని

సైకిల్ నడిపించుకుంటూ

ఇంటి దారి పట్టారు

అమ్మా పాప.

అమ్మా! బెలూన్లు Two types ఉంటాయి కదా?

ఒకటేమో Up Balloon

అదైతే పైపైకి ఆకాసంలోకి ఎగిరిపోతుంది.

ఇంకోటైతే Down Balloon

అదైతే నేల మీదే ఉంటుంది.

కదమ్మా అని విచారంగా పాప.

పోతే పోయాయి లేరా!

అలాంటివే మళ్ళీ

బోల్డు బోల్డు బెలూన్లు

కొనుక్కుని

అన్నీ ఇంట్లో పెట్టి

కట్టేద్దాం!

ఎగిరిపోకుండా

అని పాపని నవ్వించింది

అమ్మ.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, మార్చి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.