cover

దేనికి ఏడుపు? తన్నించుకున్నందుకా? నలుగురు నవ్వినందుకా?

Download PDF EPUB MOBI

ఈ మధ్య కాలం లో నిర్భయ ఘటన మన బ్రిటీష్ వాళ్ళ పుణ్యమా అని తిరిగి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం నిషేధించింది. పార్లమెంటులో రచ్చ జరిగింది. ఈ మధ్యలో ఒక వింత వాదన తెరపైకొచ్చింది ‘దేశ ప్రతిష్ట దెబ్బ తీయడం కోసం’ “ఇండియా’స్ డాటర్”ను నిర్మించారు అని. ఒక క్షణం ‘అవునే! నిజమే కదా!’ అన్న భావన ఈ మధ్య కొందరు పాఠకుల్లోనూ, కొంత పట్టణ మధ్య తరగతి వ్యక్తుల్లోనూ అగుపించింది. ఇందుకు ప్రతి స్పందనగా ఈ ఆర్టికల్ రాద్దామనుకుని ఇదుగో కొన్ని మాటలు మీ ముందు -

‘నిర్భయ’ ఘటన హేయమైనది. ఈ విషయం ప్రతి ఒక్కరూ, బాహ్య ప్రపంచానికి ఎంత హీనాతి హీన దుర్మార్గుడైనా సరే, ఒప్పుకుని తీరే విషయం. మొదటగా డాక్యుమెంటరీ పట్ల వ్యతిరేకంగా సాధారణంగా అగుపించే ఆవేదనలోని కొన్ని యుక్తమైన వాదనలు చూద్దాం.

మొదటిది – పాశ్చాత్య దేశాలు మన దేశప్రతిష్టను కించ పరిచే విధంగా ప్రవర్తించడంలో భాగంగా ఈ డాక్యుమెంటరీ తీయటం జరిగిందీ అనే ఒక వాదన. నాకు తెలిసి ఈ డాక్యుమెంటరీని సమర్ధించిన ప్రగతిశీలవాదులు ఏ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళైనా వాళ్ళకు ఈ విషయం తెలీదు అని నేను అనుకోవడం లేదు. ఇలానే ఇంకా గమనిస్తే మన దేశంలో బాల్య కార్మిక వ్యవస్థ మీద అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఎందుకంత విపరీత స్థాయిలో దాడి చేస్తున్నారో తెలియంది కాదు. మన దేశంలో ఉన్న NGO సంస్థలకు పాశ్చాత్య దేశాల నుంచి ఎందుకంత భారీస్థాయిలో ఫండింగ్ అందుతుందో కూడా తెలియని విషయం కాదు. మన దేశం నుండి ఎగుమతి అయ్యే కొన్ని సరకులు ముఖ్యంగా – కార్పెట్లు, డైమండ్స్, పట్టు తదితర ఉత్పాదకాల విషయం లో – అంతర్జాతీయ పోటీ పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి చెందిన దేశాలు కొంత మొసలి కన్నీరు కార్చుతున్నాయి. మన దేశంలో బాల కార్మిక వ్యవస్థ మీద ఎన్నో పాశ్చాత్య డాక్యుమెంటరీలు వచ్చాయి. ఐతే ‘నిర్భయ’ మాదిరి సంచలనాత్మకత లేకపోవడం వల్ల అవి అలా వచ్చి వెళ్ళిపోయాయి. ఇలానే ఇంకా చెప్పాలంటే – మన లాంటి అభివృద్ధి చెందే దేశాల్లో వాతావరణ కాలుష్యం గురించి పాశ్చాత్య దేశాలు పెట్టే గగ్గోలు.

Conflicting goals ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలపై దుమ్మెత్తి పోయడం చాలా సాధారణ విషయం. ఇది ఈ ప్రపంచం లో ఉండే చాలా సహజ సిద్ధమైన ఆర్థిక వ్యవస్థ స్వభావం. దీని భావం – ఇది కొత్తగా గగ్గోలు పెట్టే విషయం కాదు అని చెప్పడం.

రెండవది – డాక్యుమెంటరీ తీయడంలో బాధితురాలి వివరాల విషయంలో చేసిన కొన్ని టెక్నికల్ తప్పులు. వీటిని ఎత్తి చూపి డాక్యుమెంటరీ మొత్తం శుద్ధ దండుగ అని చెప్పే పద్ధతి. అసలు డాక్యుమెంటరీ తీయడమే తప్పు అని వాదిస్తున్నప్పుడు ఇది అంత ప్రధానం కాదు కాబట్టి దీని విషయం తర్వాత చూద్దాం.

ఇక ఈ రెండు పాయింట్లు వదిలేస్తే అసలు గొల్లపూడి గారి లాంటి విజ్ఞులు కూడా ఈ డాక్యుమెంటరీ విషయం లో ఎందుకు అప్ సెట్ అయ్యారు ? ఆయన ఈ మధ్య తాను వ్రాసిన వ్యాసం లో -

“ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా – పశు ప్రవృత్తికి ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేసి, డబ్బు కోసం దిక్కు మాలిన, దుర్మార్గపు అభిప్రాయాలను చెప్పగా, దాన్ని సొమ్ము చేసుకుని – సమాజ హితమని దొంగ పేరు పెట్టిన ఘనమైన నిర్మాతకి సవినయంగా , స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఒకే ఒక్క మాట చెప్పాలని నరాలు పొంగుతున్నాయ్: ‘షటప్’ ”

అని తెగ ఆవేశంగా ముగిస్తారు ఆయన.

అసలు గొల్లపూడి గారి వ్యాసం మొత్తం చాలా preliminary గా ఉన్నా విశ్లేషణకు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే – ఈ తరహా ఆలోచనలు ఒక పరిణామంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల్లో ప్రబలుతున్న కొన్ని రకాల వాదనలు గమనించండి. అమ్మాయిలు అర్ధరాత్రి బయట తిరిగి రేప్ ప్రేరేపించడం లేదా? గోమాంసం తినడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం కదా? చీర కట్టులో ఉన్న అందమూ గొప్పతనమూ పేంటు, షర్టు వేసుకోవడంలో ఉంటుందా?

దీన్ని Social psychology భాషలో చెప్పాలంటే Negativity bias అంటారు. అంటే విషయం లో ఉన్న ఒక false reason లేదా ఒక petty reason ను ప్రధాన విషయంగా పరిగణిస్తూ విశ్లేషించడం. Negativity bias ధోరణితో ఉన్న సామాజిక గుంపు ప్రవర్తన ఎలా ఉంటుందుంటే – భర్త, భార్యను చితక బాదినప్పుడు భార్య రోడ్డు మీద పడి ఏడుస్తున్నప్పుడు ‘వద్దమ్మా, తప్పు. కుటుంబం లో బండారం వీధిలోకి లాగ రాదు, వెళ్ళు ఇంట్లోకి వెళ్ళు’ అనే తరహా. భార్య బయటకొచ్చి ఏడిస్తే కుటుంబం బండారం బయట పడుతుంది అనేది వాస్తవం. అలాగే భర్త భార్యను కొట్టడం అనేది ఇంకో నష్ట పూరితమైన అంశం. రెంటిలో – కుటుంబం బండారం బయట పడుతుంది అనే విషయాన్ని ఎన్నుకుని విషయంలో negativity ని దుర్భిణితో చూపించి అసలు ప్రధాన సమస్యను ఏదోలా తప్పు దారి పట్టించడం.

కేవలం ఈ  Negativity  ని మాత్రమే project  చేయడం ఎందుకు జరుగుతుందంటే – ఆ గుంపు యొక్క ప్రయోజనాలు ఒకే కోణం వేపు మొగ్గినప్పుడు , అటు వేరే  పార్శ్యానికి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రయోజనం చూడనప్పుడు. ఏ మేధావి అయినా – ఒక విషయం లోని అంశాలు సామాజిక ప్రయోజనాలతో ఎక్కడ ఏకీభవిస్తాయో చూడ్డంలో ఫెయిల్ కావడం ఎక్కడో ఒక చోట సాధారణంగా జరుగుతుంది. కానీ పైన ఉదాహరించిన Negativity bias ను సూక్ష్మంగా చుస్తే తుద విశ్లేషణ లో – ఒకే centric point దగ్గరే మిగులుతుంది. బండారం బయట పడ్డం అనే విషయం. ప్రతిష్ట దెబ్బ తినడం అనే విషయాన్ని ప్రబలంగా ఎందుకు ముందు తీసుకొస్తున్నారు? ఈ మేధావులు ఏ centric point కు కవచంగా నిలువదల్చుకున్నారో అన్న విశ్లేషణ వ్యాసానికున్న పరిమితి వల్ల పాఠకుల అంతిమ వివేచనకు వదిలేస్తున్నా.

డాక్యుమెంటరీ తాలూకు కమర్షియల్ కోణాన్ని వీళ్ళూ బూచిగా చూపారు. అందునా దీని వెనుక ఒక అభివృద్ధి చెందిన దేశం యొక్క ఎత్తుగడ ఉంది అనే ఒక సహజ వ్యతిరేకతను ఊతంగా వాడుకున్నారు. ఇదే డాక్యుమెంటరీని – కమర్షియల్ ఉద్దేశ్యంతో కాక మన దేశంలో వాళ్ళే తీసి ఉన్నారనుకోండి – అప్పుడు డాక్యుమెంటరీ ఆ కారణం చేతనే గొప్పదైపోతుందా? కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా గ్రహించేదేంటంటే – ఈ వ్యతిరేకత డాక్యుమెంటరీలో ఉండే విషయం మీద కాదు అని. డాక్యుమెంటరీ తీస్తే దేశం ప్రతిష్ట దెబ్బ తింటుంది అని చెప్పకనే చెప్తూ ఉంటారు. తీయకపోతే మెరుగు పడుతుందా మరి?

ఎంతో విజ్ఞులై ఉండాల్సిన లాయర్లే ఈ దేశంలో ఒక స్త్రీ పట్ల తప్పుడు అభిప్రాయలతో ఉన్నారు, రేప్ చేసిన దుర్మార్గులు రేప్ కు ఒక లాజిక్ వెతుక్కుంటున్నారు.. వంటి విషయాలను సెల్యులాయిడ్‌లో పట్టడం ఎలా తప్పవుతుంది? రేప్ భారత దేశంలో జరిగింది కాబట్టి కన్సెషన్ ఇవ్వాలా? ఇన్ని రేప్‌లు పబ్లిగ్గా జరిగినప్పుడు తల ఒంచుకోలేని ఈ గొప్ప భారత సమాజానికి – మన దేశంలో నికృష్టమైన పురుష భావజాలం బలంగా ఉంది అనే విషయం పబ్లిగ్గా ఎవరో చెప్తే తల తీసేసినట్టయిందా?

మన దేశ పరువు అనే petty reasonను చూపించి ఇక్కడి నీచమైన పురుష భావజాలం బహిరంగ చర్చకు నిలబెట్ట బడుతోందనే ఒక కారణాన్ని హడావిడిగా కప్పి పెట్టే ఒక దురభిమాన దురభిప్రాయ వ్యాసం గొల్లపూడి గారి లాంటి మేధావులది.

ఒక false collective self-esteem ను సృష్టించి ఆ చట్రం లో స్త్రీలను బంధించి నోరు మెదపకుండా, కేవలం సంఘటన పైనే కాక మొత్తంగా పురుష భావజాలం పైనే ఎక్కడ చర్చ జరుగుతుందో అన్నట్టు కంగారు కంగారుగా కొన్ని సార్వత్రిక ఆమోదం కలిగిన సాంస్కృతిక విషయాలను వాడుకుని తప్పుడు ఆలోచనను రేకేత్తించే విధానం ఈ వాదన లో ఉంది. కొంత జాగ్రత్తగా గమనిస్తే ఈ heuristic process (క్షమించాలి, దీనికి తగిన తెలుగు పదం లేదు. అంతర్భుద్ధి అనే సంస్కృత భాష పదం దగ్గిరగా ఉంటుంది) ఎంతో తప్పుల తడకగా సౌకర్యార్థం రూప రచన చేసినట్టు తెలుసుంది.

ఈ డాక్యుమెంటరీ తీసాక – ఒకవేళ నిర్మాత గాని దివాలా తీస్తే డాక్యుమెంటరీలోని ప్రతిపాదితాంశాలు నిజాలు అయిపోతాయా? అలాగే ఒప్పుకుందాం. ఇంతవరకు ఈ దేశంలో ఈ తరహాలో – మన సమాజంలో పేరుకు పోయిన పురుష భావజాలమూ, మన దేశంలోని పేదరికం మరియు సాంఘిక వెనుకబాటుతనమూ రేప్‌ లను ప్రేరేపించే సాంఘిక వాతావరణాన్ని ఎలా సృష్టిస్తున్నాయో చూపించే ఒక్క సినిమా లేదా ఒక్క డాక్యుమెంటరీ వచ్చిందా? ఇదెలా ఉందంటే మొగుడు కొట్టినందుకు కాక ఆడపడుచు ఏడ్చినందుకు మొహం ముడుచుకున్నట్టు ఉంది (ఒక విషయాన్ని సక్రమంగా వివరించాలంటే కూడా పురుష భావ జాలాన్ని వెతుక్కోవాల్సిన ఖర్మ ఈ దేశం లో !!)

గొల్లపూడి గారి లాంటి అనుభవజ్ఞులు తమ విశ్లేషణకు కొంతైనా మెప్పు పొందాలనుకుంటే – డాక్యుమెంటరీ చిత్రీకరణలో ముఖ్యుడైన అమ్మాయి స్నేహితుడిని ఇంటర్వ్యూ చేయక పోవడం లాంటి విషయాలను విశ్లేషించవలసింది. లేదా, సినిమా నేపథ్యం లో జీవించిన అనుభవజ్ఞుడిగా ఇంతవరకు ఇంతకన్నా మెరుగైన సినిమాలు ఎలా వచ్చాయి, ఎందుకు రాలేదు, వచ్చినా ఎందుకు గుర్తింపుకు నోచుకోలేదు, అలా గుర్తింపుకు నోచుకోని సినిమాలను ప్రభుత్వం ప్రతిగా ఎందుకు ప్రమోట్ చేయడం లేదు లాంటి విషయాలు చర్చించి ఉండవలసింది. ఈ డాక్యుమెంటరీకి ప్రత్యామ్నాయంగా ఇంకా మెరుగ్గా మానభంగ సమస్యను ఎలా చిత్రీకరించి ఉండవచ్చో ప్రభుత్వానికి సూచన చేసినా లేదా మరో డాక్యుమెంటరీలో అభివృద్ధి చెందిన దేశాల ద్వంద్వ ప్రవృత్తిని ఎలా ఎండగట్టాలో తగిన సలహా ఇచ్చినా సంతోషకరంగా ఉండేది.

దాని మాట దేవుడెరుగు. మన అణువణువునా స్త్రీ వ్యతిరేక భావజాలం, women victimisation philosophy ఎంతగా పాతుకుపోయాయో ఒక్కసారన్నా పబ్లిక్‌లో నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆత్మ విమర్శ చేసుకోడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడింది అన్న విషయమైనా వీళ్ళకు స్ఫురించటం లేదు!

ఈ వ్యాస ఇతివృత్తం మొత్తాన్ని చివరిగా ‘షట్ అప్’ అనే పదం తో ముగిస్తారు గొల్లపూడి గారు.

అదే కదా ఈ ఓరిమి లేని దురహంకార పురుషాధిక్య ప్రభుత్వం చేసింది?

ఈ నోరు వేసుకునే కదా ఆ మాటను ప్రభుత్వం నోరారా ఉచ్చరించింది?!

– పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, మార్చి, వ్యాసం and tagged , , , , , , , , , , .

2 Comments

  1. Dear Pravenn garu, a correction . I am not a doctor ( if its ur is not a sarcasm ) . durmargam ante ento chupinchadam durmargaanni protsahinchadam ante , I have not much to say about it. These issues are despising. We shd have courage to agree that we r hopeless when it comes to the point of treating a woman. Just an example, I dont know what Virat Kohli gave to thsi country but , for sure, this country has given ” humiliation” as a gift to him just because there is prominence of woman in his life. Entire world is watching us. We cant deny this fact. manam Kallu moosukunte mana eduru gaa jarige sanghatanalu jaragaka maanavu. Documentary ni ban cheyadam just shutting the eyes but nothings else.

  2. Doctor Victor Vijay garu.. meeru ikkada oka vishayam marchipoyaaru… aa documentary loni vishayam choosthe… Chesina paniki badhyuraali baadha kanna.. chesina vaadi kiraathaka buddi ekkuvagaa kanapadindi.. shutup ani okarini thittalante bachhentha kopam denikante… aa rape chesina vyakthullo kaanee.. aa lawyers lo kaanee ekkada kooda kinchit paschathapam ledu.. alaanti vyakhyala valla orige melu kannaa jarige keede ekkuva.. Manishiki swecha undi.. kaanee adi pakkavallani baadinchanantha varake… ee visham evaru mana bhaavi tharaalaki ivvali..???? maanavathvam anedi evaru nerpinchaali… Rape cheseppudu cooperate cheyyadame margam annattuga saagina aa rapist matalani emani teeskovali??? inkaa uri kambam ekkinchaleni nyayam meeda bhaavi taraalaki emani nammakam chepudaamm??? Naaku telisi.. edi thappu edi oppu ani teliyajeyadam.. daanni paatinchela cheyadaaniki.. em cheyyali.. Oppunu kapadataaniki.. Baadhyatha evaru theeskovali??? Thappu chesthe evaru badhyulu??? evaru dandisthaaru?? Baadhyatha teliyani samaajaniki.. dandana kooda pani cheyyakapothe inkem cheyyali.. chethulu muduchukundamaa.. chethulu kattesi intlone koorchopedadamaa.. ???? Oka manchi samaajam kosam em cheyyagalam.. mana bhaavi tharaalu entha varaki surakshitham…??? em cheyyagalam vallakosam.. ????

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.