cover

మన పర సమూహాలు

Download PDF EPUB MOBI

ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు జారిపోయింది. ముందుగా ‘రియాలిటీ చెక్’ రాస్తున్నప్పటి ఒక సంగతి. పెట్ హాస్పిటల్ వాతావరణం ఎలా ఉంటుందో రాయడం నా ఉద్దేశం కాబట్టి, ఇది అందులో కలిపితే ఆర్టికల్ రంగు మారిపోతుందని అప్పుడు పేర్కొనలేదు. ఆ పెట్ హాస్పిటల్ మేనేజర్ నన్ను అంతా తిప్పి చూపించాక, ఆ ప్రదేశానికి సంబంధించిన టోపోగ్రఫీ నాకు ఓ ఐడియా వచ్చాక, ఇద్దరమూ అలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటుండగా, ఒకామె తన పెంపుడు కుక్కతో వచ్చింది. ఆ కుక్కకు వచ్చిన జబ్బు గురించి ఆ ఇద్దరాడవాళ్లూ కాసేపు ఇంగ్లీషులో మాట్లాడుకున్నారు. మన దగ్గరి ప్రతి ఆంగ్ల సంభాషణా ఏదో ఒక దశలో తెలుగులోకి కూడా మళ్లుతుంది కాబట్టి, కాసేపు తెలుగులోనూ ముచ్చటించారు. ఆమెను సంబంధిత డాక్టర్ దగ్గరికి పంపించేశాక, మళ్లీ నాతో ఆగిపోయిన సంభాషణ కొనను అందుకోవడానికి ప్రారంభంగా ఈ మేనేజర్ – “వీళ్లు ఇంగ్లీష్ మాట్లాడితే బానే వుంటుంది గానీ తెలుగు మాట్లాడితేనే తెలంగాణ బయటపడిపోతుంది,” అంది. ఆ అనడం అయితే అనేసిందిగానీ, ఆ వాక్యానికి పుల్‌స్టాప్ పెట్టేసేలోపే ఆమెకు సందేహం వచ్చినట్టుంది, మరి నేను ఎక్కడివాణ్నని.

ఆ హాస్పిటల్ ఓనర్‌ది మహబూబ్‌నగర్ అని తెలిసివుండీ ఆమెను అలా మాట్లాడించేలా ప్రేరేపించిన సాంస్కృతిక అహంకారానికి ఆమెను ఒక్కదాన్నే బాధ్యురాల్ని చేయడం నాకు ఇష్టం లేదు. పైగా, ‘మనవాడు’ అని నమ్మి చేసిన ఒక యధాలాప వ్యాఖ్యానంలో! అందుకే, ఇప్పుడు నా స్వస్థలం చెబితే ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందేమోనని నేను ఇబ్బందిపడ్డాను. అందుకే ఆ భావం మీద ఆమెను ఎక్కువసేపు ఉండనీయకుండా వేరే టాపిక్‌లోకి దించేశాను.

నిజానికి ‘మన’ అన్నది పెద్ద రూపం ఉన్నదేమీ కాదు. అది రకరకాల కాంబినేషన్లుగా మారిపోతుంది. తెలుగువాళ్లు, బ్రాహ్మణేతరులు, దళితేతరులు, శ్రీవైష్ణవులు, వెలమలు, దక్షిణాదివాళ్లు, పాశ్చాత్యులు… ఇందులో ఎక్కడ మన అవుతాం, ఎక్కడ పర అవుతాం అనేవి ఉట్టి గీతలే. అవి ఏకకాలంలో అర్థంలేనివీ, బలమైనవీ కూడా! మా సెవెన్త్‌ఫ్లోర్ వాళ్లు, మా శారదానగర్ వాళ్లు, మా కరీంనగర్ వాళ్లు, మా వేములవాడవాళ్లు… మా ఊరిలోనే మా పూడూరోళ్లు, కొత్తోళ్లు అనుకుంటాం మేము. ఇంకా సూక్ష్మస్థాయిలో మేము, మా పెద్దబాపువాళ్లు! మేము ఒక యూనిట్ అని గీసుకునే గీతలకూ, ‘మేము’ అని బోరవిరుచుకునే గీతలకూ ఉన్న తేడాను గుర్తిస్తూనే, ఈ మాట చెప్పాలనిపిస్తోంది: స్వాభావికంగా, మనిషికి గీతలు గీసుకోవడంలో ఉన్నంత ఆసక్తి, వాటిని చెరుపుకోవడంలో ఉండదేమో! అందుకే, ఈ సమూహాలకు సంబంధించిన ఘర్షణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందనుకుంటాను. కాకపోతే ఆ ఘర్షణ అన్నిసార్లూ మరీ ఘర్షణ అనే మాటంతటి గంభీరంగా ఉండకపోవచ్చు. నాకు గ్రహాంతరవాసుల ఉనికి మీద పెద్ద కుతూహలమేమీ లేదుగానీ ‘భూమేతరులు’ గనక ఉండింటే, అప్పుడు మనందరం ‘భూమివాళ్లం’ అయిపోతాం.

ఇప్పుడిక అసలు విషయంలోకి వస్తున్నా. సీమాంధ్ర అనడం నాకు ఇష్టం లేదుగానీ, అటువైపుదే ఆంధ్రప్రదేశ్ అనడానికి నేను ఇంకా ట్యూన్ కావలసే ఉంది. మొన్న సీమాంధ్ర ఎన్నికలప్పుడు నా ఇద్దరు సహచరులు అనంతపురంలో ఓటు వేయడానికి వెళ్తున్నారు. “సార్, ఐదుగురం కారులో వెళ్తున్నాం; (రెడ్డి అయిన) జీవన్‌కు మాత్రం ఛార్జ్ చేస్తాను” అన్నాడు (కమ్మ అయిన) ప్రకాష్ నవ్వుతూ. “ఎటూ మాకు వేయడు కదా!”

ఆ మాటకు నాకు ఎంత ముచ్చటేసిందో చెప్పలేను. స్నేహం స్నేహమే. పార్టీ పార్టే. కులం కులమే. ప్రాంతం ప్రాంతమే. మళ్లీ రేపు కలిసి పనిచేస్తామన్న స్పృహ స్పృహే. మనం చాలా రకాలుగా విడిపోతామన్నది నిజమేగానీ కలుపుకొని పోవడానికి కూడా సాకులు వెతుకుతుంటాం! ఇదీ, ఈ ఒక్క వాక్యం కోసమే నేను పైనుంచి కిందిదాకా వచ్చింది! లేదంటే ఇన్ని అస్తిత్వ ఉద్యమాలు విజయవంతం కావూ, ప్రపంచంలో ఈమాత్రం సామరస్యం సాధ్యమూ కాదు.

పూడూరి రాజిరెడ్డి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, మార్చి, మ్యూజింగ్స్ and tagged , , , , , , .

2 Comments

  1. Yes .A logical affiliation is based on common interest and profession or values.The worst form of group formation is by caste without considering the common values or goodness or evil of individuals.Even regionalism religious and language fanaticism is the worst evil in our society.There are only two types of people in this world.Good and badm

  2. చాలా బాగా చెప్పారు రాజిరెడ్డి గారు. Social groups గా form కావడం మనిషి నైజం అంటారు anthropologistలు. కానీ మీరనట్టు ఆ connections చాలా fluidicగా ఉంటాయి. పరాయి దేశంలో కొత్తగా కలిసిన ఇద్దరు మనుషులకు మొదట్లో కేవలం వాళ్ళ మధ్య ఉన్న commonalities మాత్రమే కనిపించినా, అంత కన్నా ఎక్కువ common attributes ఉన్న ఇంకో relationship form చేసుకోగలిగే అవకాశం దొరికినప్పుడు, నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కొత్త సమూహంలో కలిసిపోతారు.

    మీరు కులానుగుణాంగా, ప్రాంతానుగుణంగా ఏర్పర్చుకునే groups గురించి ప్రస్తావించారు కానీ, అభిరుచుల వల్ల కూడా మనుషులు దెగ్గరవుతారు కద సర్. ముళ్ళపూడిగారి రచనల్ని ఇష్టపడేవాళ్ళు, Tarantino aficionados, ఇళయరాజా సంగీత ప్రేమికులు, నరేంద్ర మోది వీరాభిమానులు మొ|| అనమాట. These are sometimes stronger than the others because of a shared empathy.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.